Wednesday 24 August 2022

T-138 పెక్కు లంపటాల మనసు పేదవైతివి

 

తాళ్లపాక అన్నమాచార్యులు

138 పెక్కు లంపటాల మనసు పేదవైతివి

 కనిపించని బంధాలు


Those interested in English Version may press this link

 

ఉపోద్ఘాతము: అంతగా ప్రాచుర్యము పొందని, దిగ్భ్రాంతి, ఆశ్చర్యమూ కలిగించు ఈ కీర్తనలో, అన్నమాచార్యులు మనిషిని ప్రభావితముచేసి బుద్ధిని మళ్ళించు అనేక స్థాయి లను కళ్ళకు కట్టినట్లు వర్ణించారు.   మనము చచ్చైనా సాధిస్తాను అంటుంటాం కదా! అన్నమాచార్యులు మరణం దేనికీ కూడా ప్రత్యామ్నాయం కాదని ప్రకటించారు.

 

ప్రతీ గాలి అలకు తడబడు మనిషి అంతరంగమును, బేల తనమును ప్రశ్నించారు అన్నమాచార్యులు. ఆత్మ నిశ్చయము లేకనే ఊగిసలాడు వృత్తిని ఎత్తి చూపిరి. తన నెదుట వేరు సాధనములు లేవని తెలిసీ మానవుడు వాటిని వెదకబోతాడు.  మానవుడు అడపాదడపా చేయు దైవ స్మరణను వ్యర్థమైన అభ్యాసంగా ఆయన మందలించారు.  పెక్కు లంపటాల మనసు పేదవైతివి / నీకు నెక్కడా నెవ్వరు లేరు యేమి సేతువయ్యా.

 

కీర్తన:

రాగిరేకు:  21-1  సంపుటము: 1-125

 

పెక్కు లంపటాల మనసు పేదవైతివి నీకు
నెక్కడా నెవ్వరు లేరు యేమి సేతువయ్యా పెక్కు॥
 
కన్నుమూయఁ బొద్దులేదుకాలు చాఁచ నిమ్ములేదు,
మన్ను దవ్వి కిందనైన మనికి లేదు,
మున్నిటివలెనే గోరు మోపనైనఁ జోటు లేదు,
యిన్నిటా నిట్లానైతి వేమి సేతువయ్యా పెక్కు॥
 
అడుగిడఁగ నవ్వల లేదుఅండనైన నుండలేదు,
పుడమిఁ గూడు గుడువనైనఁ బొద్దులేదు,
వెడఁగుఁదనము విడువలేదువేదమైనఁ జదువలేదు,
యెడపఁ దడప నిట్ల నీకు నేమి సేతువయ్యాపెక్కు॥
 
వుప్పరములు మానియైన నుండలేదు లోకమందు,
నిప్పుడైన నీ విహార మిట్లనాయను
చెప్పనరుదు నీ గుణాలు శ్రీవేంకటేశ యిట్ల-
నెప్పుడును ఘనుఁడ వరయ నేమి సేతువయ్యాపెక్కు॥

 

 Details and Explanations: 

పెక్కు లంపటాల మనసు పేదవైతివి నీకు
నెక్కడా నెవ్వరు లేరు యేమి సేతువయ్యా      పెక్కు॥

 

ముఖ్య పదాలకు అర్ధాలు: లంపటాలు = దొంగగొడ్డు పఱుగెత్తి పోకుండ మోకాళ్లకు కొట్టుకొనునట్లు మెడకు వ్రేలాడఁగట్టిన రెండు కొయ్యలు, ప్రతిబంధకము, అడ్డు

భావము: పెక్కు లంపటాల (మనసులొని ప్రతిబంధకములతో) పేదవైతివి. నీకు నెక్కడా నెవ్వరు లేరు యేమి సేతువయ్యా.

 

వివరణము: భ్రమాత్మక బంధాలు-అర్థమయ్యీ కానట్టుగా ఉంటవి. మనసులొని ప్రతిబంధకములు క్రింది కథలో బాగా తెలుస్తాయి. 

రైతు తన మూడు గాడిదలను అమ్మేయడానికి అంగడికి తీసుకెళ్తున్నాడు... మార్గమధ్యంలో నది కనిపించింది... అసలే నడిచీ నడిచీ ఒళ్లంతా చెమట చిటచిట... స్నానం చేస్తే పుణ్యం, శుభ్రత రెండూ దక్కుతాయని అనుకున్నాడు... 

గాడిదల్ని కట్టేయడానికి తన దగ్గర రెండే తాళ్లున్నాయి... మరి మూడో గాడిదను కట్టేయడం ఎలా..? 

సన్యాసి అలా నడిచిపోతున్నాడు... తనను పిలిచాడు... స్వామీ, నీ దగ్గర తాడు ఉంటే ఇవ్వవా...? కాసేపు నా గాడిదను కట్టేస్తా, నా స్నానం కాగానే నీ తాడు నీకు తిరిగి ఇచ్చేస్తా... 

నా దగ్గర తాడు లేదు కానీ ఉపాయం చెబుతాను అన్నాడు సాధువు... 

నీ దగ్గర ఉన్న తాళ్లతో రెండు గాడిదలను కట్టెయ్... మూడోది చూస్తూనే ఉంటుంది... తరువాత దీని వెనక్కి వెళ్లి తాడుతో చెట్టుకు కట్టేస్తున్నట్టు నటించు... 

సాధువు చెప్పినట్టే చేశాడు... నదీస్నానం పూర్తిచేశాడు... వెనక్కి వచ్చి రెండు గాడిదల కట్లు విప్పేశాడు... అదిలించాడు, తను ముందు నడుస్తున్నాడు... కాసేపయ్యాక చూస్తే రెండు తనతో వస్తున్నాయి కానీ మూడో గాడిద మాత్రం చెట్టు దగ్గర నుంచి అస్సలు కదలడం లేదు...  అక్కడే ఉండిపోయింది... 

తట్టాడు, కొట్టాడు, తిట్టాడు... ఊహూఁ... ఫలితం లేదు... అటూఇటూ చూస్తుంటే అదే సాధువు కనిపించాడు... స్వామీ, స్వామీ, ఇది మొరాయిస్తోంది, కదలనంటోంది... 

అసలు నువ్వు కట్లు విప్పితే కదా, అది కదిలేది... అన్నాడు సాధువు.. 

అసలు నేను కట్టేస్తే కదా విప్పేది... అంటాడు రైతు... 

అవునోయీ, అది నీకు తెలుసు, నాకు తెలుసు, గాడిదకు తెలియదు కదా... తను ఇంకా కట్టేసి ఉన్నట్టే భావిస్తోంది... 

అయ్యో, మరేం చేయాలిప్పుడు..? 

కట్లు విప్పితే సరి... కదులుతుంది... 

అసలు కట్టేస్తే కదా... విప్పేది... 

పిచ్చోడా... కట్టేసినట్టు ఎలా నటించావో, విప్పేసినట్టు కూడా నటించవోయ్... 

రైతు అలాగే చేశాడు... గాడిద ముందుకు కదిలింది, మిగతా రెండింటితో కలిసింది... రైతు సాధువు వైపు అయోమయంగా చూశాడు... 

‘‘మనుషులు కూడా అంతేనోయ్... కనిపించని బంధాలేవో మనల్ని ఇక్కడే కట్టేసినట్టు వ్యవహరిస్తాం... కదలం, ఉన్నచోటు వదలం... నిజానికి అవన్నీ భ్రమాత్మక బంధాలు... అవేమీ లేవనే నిజం తెలిస్తే చాలు... ప్రపంచమంతా నీదే... 

అర్థమయ్యీ కానట్టుగా ఉంది... అవును, మరి తత్వం, సత్యం ఎప్పుడూ సంపూర్ణంగా అర్థం కావుగా... రైతు కాసేపు బుర్ర గోక్కున్నాడు... సాధువుకు ఓ దండం పెట్టి తన గాడిదల వైపు కదిలాడు...

పాఠకులారా, విధంగా లంపటాలు అనే పదం ఇక్కడ భౌతిక బంధాల కంటే ఎక్కువ మానసికంగా బంధాలను నొక్కి చూపుతోంది. నెక్కడా నెవ్వరు లేరు ఎవరూ ఎవరికీ కూడా అంతర్గతంగా  సహాయం చేయలేరని ప్రముఖంగా వక్కాణించారు. రకంగా చూస్తే, లంపటాలు మనిషి తనకు తాను తెచ్చుకున్నవని తిరిగిచెప్పినట్లే భావించవచ్చు

అన్వయార్ధము: ఓ మనుష్యుడా, నిన్ను స్వేచ్చగా ఉండనివ్వనిది ఏది?

 

కన్నుమూయఁ బొద్దులేదు, కాలు చాఁచ నిమ్ములేదు,
మన్ను దవ్వి కిందనైన మనికి లేదు,
మున్నిటివలెనే గోరు మోపనైనఁ జోటు లేదు,
యిన్నిటా నిట్లానైతి వేమి సేతువయ్యా పెక్కు॥

 

ముఖ్య పదాలకు అర్ధాలు:  కన్నుమూయఁ బొద్దులేదు = కన్ను మూసే ముందర ఆట్టె సమయము లేదు, (లేదా మనిషి చాలా పనులలో నిమగ్నమై ఉంటాడని, అతనికి నిద్రపోవడానికి సమయం దొరకదని భావించవచ్చు); ఇమ్ములేదు = అనుకూలము లేదు (అలా కూర్చుని ఉండటనికి వీలుండదు); మనికి లేదు = జీవించడము లేదు, జీవనము లేదు; మున్నిటివలెనే = పూర్వములాగే, ఇంతకు ముందులాగే.

భావము: మానవుడా నీకు ఆట్టె సమయము లేదు. కాళ్ళుచాచుకొని తీరికగా కూర్చొనడం కూడా అనుకూలమైనదే కాదు. మన్ను దవ్వి కిందనైన మనుగడ లేదు. (మరణము కూడా నీకు ఆశ్రయము కాదు). ఎప్పటిలాగే గోరు మోపుటకైనా చోటు లేదు. ఇన్నిటా నిట్లానైతివి ఏమి సేతువయ్యా?

వివరణము: మన్ను దవ్వి కిందనైన మనికి లేదు మనము చచ్చైనా సాధిస్తాను అంటుంటాం కదా! అన్నమాచార్యులు మరణం దేనికీ కూడా ప్రత్యామ్నాయం కాదని ప్రకటించారు. క్రింది చిత్రాన్ని చూడండి.


వివిధ అంతర్జాల (ఇంటర్నెట్) వనరుల ద్వారా ఎడమ వైపున చిత్రాన్ని అతికి అమర్చాను. ఐనా ఇది వాస్త వికతను చూపిస్తోందా లేదా అనే అనుమానము వదల్లేదు. అప్పుడు, అదృష్టవశాత్తు విన్సెంట్ వాన్ గో యొక్క పెయింటింగును (కుడిచేతి వైపుది) చూడడమైంది. ఇప్పుడు పై చిత్రం రెండవ పంక్తి యొక్క ఖచ్చితమైన అర్థాన్ని అందిస్తుందని రూఢీగా చెప్పవచ్చు. ​ 

సత్యం కానిదేదైనా అజ్ఞానంలో భాగమే, మరణంతో సహా.  కోరికలు మనల్ని అదృశ్యాగ్నితో కాలుస్తాయి. మనలను చివరికి వాటికి శరణార్థిగా మారుస్తాయి. అదేవిధంగా, మరణంలోనూ ఆశ్రయం పొందే వ్యక్తులు కూడా ఉంటారు. అది తప్పు అన్నారు.  అన్నమాచార్యులు కేవలం శాస్త్రీయ గ్రంథాలను పునరుత్పత్తి చేయలేదు. మనం అసలంటూ వింటే, జీవితానికి ఉన్న గొప్ప అర్థాన్ని అన్నమాచార్యులు తన స్వంత అనుభవాలను భారతీయ  విజ్ఞానముతో మిళితం చేసి చెప్పారు. 

గోరు మోపనైనఁ జోటు లేదు అనేది విన్యాసములకు, వ్యూహములు పన్నుటకు తావు లేదని సూచిస్తుంది. నిజానికి, మనిషికి ఒక సత్యం తప్ప మరో మార్గం లేదని తెలుపుతుంది. యిన్నిటా నిట్లానైతి వేమి: మనిషి సత్యం తప్ప మిగిలినఅన్ని ప్రత్యామ్నాయాలు వెదుక బోతాడు అని అర్ధము. 

అన్వయార్ధము: ఓ మానవుడా! నీకు కాలము కానీ, భూమ్యాకాశములు కానీ మరియు మరణము కానీ ఆశ్రయములు కానేరవు. నీకు దారేది? 

అడుగిడఁగ నవ్వల లేదు, అండనైన నుండలేదు,
పుడమిఁ గూడు గుడువనైనఁ బొద్దులేదు,
వెడఁగుఁదనము విడువలేదు, వేదమైనఁ జదువలేదు,
యెడపఁ దడప నిట్ల నీకు నేమి సేతువయ్యాపెక్కు॥

 

ముఖ్య పదాలకు అర్ధాలు: అండనైన నుండలేదు = వెనకైనా నుండలేదు, గమ్మున నుండలేదు, కిమ్మనకుండా నుండలేదు; పుడమిఁ  = భూమ్మీద; వెడఁగుఁదనము = వికారము, అవివేకము; యెడపఁ దడప = అడప​-దడప, 

భావము: అడుగు ముందుకు వేయడానికి, అది నీ వెలుపల లేదు. (అంటే దానిని చూడలేవు; అందుకే, అనివార్యంగా నీ చేష్టలు  దారి తప్పుతాయి). గమ్మున నుండలేవు, కిమ్మనకుండా నుండలేవు. కావున కనికర౦ చూపుటకు అర్హతను పోగొట్టుకుంటావే. ఆహారము ఆస్వాదించడానికి  సమయమే లేదే. వెర్రితనము విడువలేదు, వేదమైనఁ జదువలేదు. అడప దడప దైవ స్మరణ చేతువు. నేమి సేతువయ్యా? 

వివరణము: అడుగిడఁగ నవ్వల లేదు: నీవు కాలుముందు కెయ్యడానికి బయటకు కనపడితే కదా. అగపడని దానికి నేమి సేతువయ్యా? మార్గమేదయ్యా?

 

వేదమైనఁ జదువలేదు: వేదాధ్యయనం కఠినమైన క్రమశిక్షణ మరియు అధిక ఏకాగ్రతతో కూడినది. ఇంజనీరింగ్ లో పిహెచ్ డి పట్టా పొందడం కష్టమని మనం భావించవచ్చు. కానీ, వేదాధ్యయనం అంత కంటే చాలా కష్టం. కాబట్టి అన్నమాచార్యులు " మూర్ఖుడా, నీకు క్రమశిక్షణ లేదు" అంటున్నాడనుకోవచ్చు. ఏమి సేతువయ్యా = ఏమీ చేయలేవా?


అండనైన నుండలేదు: వెనకైనా గమ్ముననుండలేదు. కిమ్మనకుండా నుండలేదు. జైళ్లలో కూడా మౌనము మరియు క్రమశిక్షణ కలిగిన అపరాధికి క్షమాభిక్ష ఇవ్వడం సాధారణం. పశ్చాత్తాపపడేవారిని, నోరెత్తక, మెదలక తనకిచ్చిన దానిని స్వీకరించు వారిని కూడా దేవుడు మన్నించవచ్చు. మానవుడు ఊగులాటలతోనూ, క్రమశిక్షణలేమి తోనూ బాధ పడూతున్నాడని అన్నమాచార్యులు నొక్కి వక్కాణిస్తున్నాడు. ఏమి సేతువయ్యా =  వీటికి మారుగా ఏమి చేయవచ్చయ్యా?

వెడఁగుఁదనము విడువలేదు#1: నీ స్వంత అపోహలనే కనుగొనలేకపోతున్నావే? కనుగొన్నా, విడువ లేవే? ఏమి సేతువయ్యా = భగవంతుని ఎటుల తెలిసికొందువయ్యా?

పుడమిఁ గూడు గుడువనైనఁ బొద్దులేదు#2: భూమ్మిద పడితినుటయే గురిగా గల మానవుడా! నీ లక్ష్యము ఏమిటో? జీవితంలో నీ ప్రాధాన్యతలేమిటి? బొద్దులేదు: మనిషికి సమయం -పరివర్తనకు ఎక్కువ సమయం లేదని  సూచిస్తుంది. ఇప్పుడు దానిని యెడపఁ దడప (= అడప​-దడప) అనే పదాలతో కలిపి చూడండి. మన ప్రార్థనలు తాత్కాలికమైనవి. గమనించి చూస్తే, మన అంతర్లీన భావములు ‘నేను శాశ్వతము. ఇప్పటికి భగవంతుని ప్రార్ధించి ఈ పరిస్థితి నుంచి తప్పుకుంటాను’ అనే ఛాయలే ఎక్కువ కనపడతవి.  ఏమి సేతువయ్యా  = ఏమి చేయాలో మీకు పాలు పోక ఉన్నదా?

పై వివరణ నేపధ్యంలో పుడమిఁ గూడు గుడువనైనఁ బొద్దులేదును తిరిగి పరిశీలిద్దాం "మీరు జీవిత౦ పట్ల ఉపేక్షింపరానంత గంభీరముగా ఉన్నారా?" లేదా “మనస్సుచే సృష్టించబడిన వెడఁగుఁదనమున చేత ఖర్చు చేయబడాలని కోరుకుంటారా?” నరుడా, నీవు కూడబెట్టిన అసమానతలను గమనించావా?   వాటిని తొలగించడానికి ఎంత సమయం పడుతుంది? ఇది దశలవారీ రేఖీయ ప్రక్రియ (step by step linear process) అని మీరు భావిస్తున్నావా? కొద్దికొద్దిగా ముందుకు సాగడం వల్ల యుగయుగాలు పడుతుంది. తిరిగి మన్ను దవ్వి కిందనైన మనికి లేదుతో కలిపి చూడండి. మరణము తరువాత మార్గమే లేదని తెలియండి. కాబట్టి, బతికుండగానే దానిని తెలియవలెను. ఏమి సేతువయ్యా  = మార్గము లేదనికాదు మార్గమును చూడమని అన్నమాచార్యులు చెబుతున్నారు. గమనించితే, కేవలం రెండు స్థాయిలు మాత్రమే ఉన్నాయి? ఒకటి భక్తి కలిగిన స్థితి. మరొకటి అది లేనిది.

 

అన్వయార్ధము: ఓ మానవుడా! నీ మనస్సు యొక్క కదలికలను గమనించితివా?. ఆ ఉద్యోగము యొక్క అపసవ్యతలే నీ ప్రస్తుత చర్యలు. మార్గం ఎక్కడ ఉంది? ఊగిసలాటలకు, కోరికలకు, మూర్ఖపు చర్యలకు అతీతంగా భక్తి ఉంది. నీవు భక్తి యందు వున్నదీ లేనిదీ తెలియుము. 

వుప్పరములు మానియైన నుండలేదు లోకమందు,
నిప్పుడైన నీ విహార మిట్లనాయను
చెప్పనరుదు నీ గుణాలు శ్రీవేంకటేశ యిట్ల-
నెప్పుడును ఘనుఁడ వరయ నేమి సేతువయ్యా పెక్కు॥ 

ముఖ్య పదాలకు అర్ధాలు: వుప్పరములు = ఆకాశము, మీఁదు, పై భాగములు, వుప్పరములు మానియైన నుండలేదు లోకమందు = పైకి పైకి, మిడిసిపడి ఉండుట​ మానలేదు.

భావము: అహంకారపు తెరలనుండీ లోకాన్ని గమనించు మానవుడా! నీ జీవిత ప్రయాణాన్ని (ఈ దశకు) నడిపించినదేమిటో తెలిసితివా? ఓ వేంకటేశ్వరా, ఓ సర్వేశ్వరా! అరసిచూడ నీ గుణాలు వర్ణనాతీతమే! ఓ నరుడా! మీ వ్యూహం ఏమిటో?

వివరణము: వుప్పరములు మానియైన నుండలేదు: మానవుడా కనపడిన ప్రతీదానిమీద​ తీర్పు ఇవ్వడానికి నీకున్న అర్హత ఏమి?   అది అహంభావం కాదా? అని అన్నమాచార్యులు విమర్శించిరి.

అన్వయార్ధము: మానవుడా గర్వముతో ప్రపంచాన్ని నీకన్నా తక్కువగా చూచునంత కాలము అధో ప్రయాణాన్ని కొనసాగిస్తావు. ప్రాపంచిక వ్యూహాలతో ప్రయోజనమేమి?

 

 

References and Recommendations for further reading:

#1 1. అమ్మేదొకటియు ammE dokaTiyu)

#2 124. ఏమి గల దిందు నెంత గాలంబైన (Emi gala diMdu neMta gAlaMbaina)

 

 

కీర్తన సంగ్రహ సారం:

పల్లవి: పెక్కు లంపటాల (మనసులొని ప్రతిబంధకములతో) పేదవైతివి. నీకు నెక్కడా నెవ్వరు లేరు యేమి సేతువయ్యా. అన్వయార్ధము: ఓ మనుష్యుడా, నిన్ను స్వేచ్చగా ఉండనివ్వనిది ఏది?

చరణం 1: మానవుడా నీకు ఆట్టె సమయము లేదు. కాళ్ళుచాచుకొని తీరికగా కూర్చొనడం కూడా అనుకూలమైనదే కాదు. మన్ను దవ్వి కిందనైన మనుగడ లేదు. (మరణము కూడా నీకు ఆశ్రయము కాదు). ఎప్పటిలాగే గోరు మోపుటకైనా చోటు లేదు. ఇన్నిటా నిట్లానైతివి ఏమి సేతువయ్యా? అన్వయార్ధము: ఓ మానవుడా! నీకు కాలము కానీ, భూమ్యాకాశములు కానీ మరియు మరణము కానీ ఆశ్రయములు కానేరవు. నీకు దారేది?

 

చరణం 2: అడుగు ముందుకు వేయడానికి, అది నీ వెలుపల లేదు. (అంటే దానిని చూడలేవు; అందుకే, అనివార్యంగా నీ చేష్టలు  దారి తప్పుతాయి). గమ్మున నుండలేవు, కిమ్మనకుండా నుండలేవు. కావున కనికర౦ చూపుటకు అర్హతను పోగొట్టుకుంటావే. ఆహారము ఆస్వాదించడానికి  సమయమే లేదే. వెర్రితనము విడువలేదు, వేదమైనఁ జదువలేదు. అడప దడప దైవ స్మరణ చేతువు. నేమి సేతువయ్యా?  అన్వయార్ధము: ఓ మానవుడా! నీ మనస్సు యొక్క కదలికలను గమనించితివా?. ఆ ఉద్యోగము యొక్క అపసవ్యతలే నీ ప్రస్తుత చర్యలు. మార్గం ఎక్కడ ఉంది? ఊగిసలాటలకు, కోరికలకు, మూర్ఖపు చర్యలకు అతీతంగా భక్తి ఉంది. నీవు భక్తి యందు వున్నదీ లేనిదీ తెలియుము. 

 

 

చరణం 3: అహంకారపు తెరలనుండీ లోకాన్ని గమనించు మానవుడా! నీ జీవిత ప్రయాణాన్ని (ఈ దశకు) నడిపించినదేమిటో తెలిసితివా? ఓ వేంకటేశ్వరా, ఓ సర్వేశ్వరా! అరసిచూడ నీ గుణాలు వర్ణనాతీతమే! ఓ నరుడా! మీ వ్యూహం ఏమిటో? అన్వయార్ధము: మానవుడా గర్వముతో ప్రపంచాన్ని నీకన్నా తక్కువగా చూచునంత కాలము అధో ప్రయాణాన్ని కొనసాగిస్తావు. ప్రాపంచిక వ్యూహాలతో ప్రయోజనమేమి?


 

1 comment:

  1. దృశ్య ప్రపంచం అంతా భ్రమాత్మకమే. సత్యం, అవ్యయమైనది కాదు. ఇట్టి భ్రమాత్మకమైన ప్రపంచంతో సంబంధమే సత్యదర్శనానికి ప్రతిబంధకములై మనిషి ఊర్థ్వగతులు పొందకుండా అడ్డుకట్ట వేస్తున్నాయి.అంటే మనిషి తన స్వస్వరూపాన్ని దర్శించలేక, అనుభవంలోనికి తెచ్చుకొనలేకున్నాడు. భ్రమాత్మకమైన ఈ ప్రతిబంధకాలే మనిషికి గుదిబండగా వ్యవహరించి, స్వేచ్ఛకు ఆటంకాలు అవుతున్నాయి.

    ఇంద్రియప్రభావం వల్ల అంతరింద్రియమైన మనస్సు రాగద్వేషములు, మమతానురాగాలకు లోనై తన సహజస్థితియైన స్వేచ్ఛ, స్థిరత్వాలను కోల్పోయి అజ్ఞానజనితము, జ్ఞానావరోధకము లైన బంధాల నేర్పరుచు
    కుంటున్నది.స్వస్వరూపాన్ని గ్రహింపకున్నది.మరణమైనా నీకు వీటినుంచి ముక్తి నొసగదు. అంటే శరీరం పడిపోయినా వాటి వాసనలు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. అనేక జన్మలకు కారకములౌతున్నాయి.
    నీ వెలుపల లేనిదాన్ని నీవెట్లు గ్రహించగలవు? అజ్ఞానంచేత జీవితగమ్యమును తప్పి వ్యవహరిస్తున్నావు.నీలోనే ప్రకాశించుచున్న అంతర్యామిని చూడటానికి అర్హతను కోల్పోతున్నావు. పరమశాంతినిచ్చే జ్ఞానమార్గమును వదలి ఆశాంతిపాలైపోవు చున్నావు.
    అహంకారమనే అంధకారాన్ని వీడుము.అంతర్యామిని శరణు జొచ్చుము. భక్తి, ఏకాగ్రతల చేత ఆయన కరుణకు పాత్రతను సంపాదించి, ఉద్ధరణను పొందుమని అన్నమయ్య ఆత్మానాత్మ వివేకం, అజ్ఞానం - జ్ఞానముల మధ్య గల అంతరాన్ని ప్రబోధించుచున్నాడు లోకులకు ఈ కీర్తన ద్వారా.
    ఓం తత్ సత్ 🙏
    కృష్ణ మోహన్

    ReplyDelete

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...