తాళ్లపాక అన్నమాచార్యులు
141 నానాఁటి
బదుకు నాఁటకము
for EnglishVersion press this link
ఉపోద్ఘాతము: ఆత్మతృప్తిని,
ఆహ్లాదభావమును నింపు ఈ కీర్తనలో, అన్నమాచార్యులు చర్య యందు నిమగ్నమగుటకు, చర్యను చేయుటకు
ప్రయత్నించుటకు గల అంతరమును నాటకమనిరి.
ఈ సుప్రసిద్ధ కీర్తనకు
వ్యాఖ్యానము వ్రాయడము సాహసమే. ఎంతో సులభముగానూ వినగానే అర్ధమైపోవుననిపించు ఈ కీర్తనకు
వివరణ అనవసరము అనుకోవచ్చు. ఇక్కడ అన్నమాచార్యులు మనము చూచుదానికి, మనమూహించుదానికి
గల వ్యత్యాసమును గర్హించుటకు ‘నాటకమ’నిరి. "కానక కన్నది"
అని పల్లవిలోనే మెలిక పెట్టిరి. 'కైవల్యము' అను పదము అర్ధమును క్రమక్రమముగా మార్చుతూ
అది మానవుడు ఎంచుకోగల గమ్యముకాదని చెప్పక చెప్పిరి.
కీర్తన: రాగిరేకు: 299-5 సంపుటము: 3-576 |
నానాఁటి బదుకు నాఁటకము
కానక కన్నది కైవల్యము ॥పల్లవి॥ పుట్టుటయు నిజము పోవుటయు నిజము
నట్టనడిమి పని నాఁటకము
యెట్టనెదుటఁ గలదీ ప్రపంచమును
కట్టఁగడపటిది కైవల్యము ॥నానాఁ॥ కుడిచే దన్నము కోక చుట్టెడిది
నడుమంత్రపు పని నాఁటకము
వొడిఁ గట్టుకొనిన వుభయకర్మములు
గడి దాఁటినపుడే కైవల్యము ॥నానాఁ॥ తెగదు పాపమును తీరదు పుణ్యము
నగినగి కాలము నాఁటకము
యెగువనె శ్రీవేంకటేశ్వరుఁ డేలిక
గగనము మీఁదిది కైవల్యము ॥నానాఁ॥
|
ముఖ్య పదాలకు
అర్ధాలు: కానక కన్నది =
అతి కష్టముమీద కని
అనుభవించినదైననూ కలిగెనని తెలుపలేనిది,
భావము: నరుడా! నానాఁటి బదుకు
నాఁటకము. గొప్ప ఏకాగ్రతతో కని అనుభవించినదైననూ కలిగెనని తెలుపలేనిది
కైవల్యము. (అందువల్ల, దీనిని కూడా ప్రజలు నాటకం అని పిలవవచ్చును.)
వివరణము: ఈ పల్లవిలోని కానక కన్నది అన్నపదములు ఎమ్ సి ఎస్చెర్ గారు గీసిన ఘనము (క్యూబ్) అను పేరుగల చిత్రమును (దిగువ ఇవ్వబడింది) గుర్తుకు తెస్తుంది. ఇది చాలా సాధ్యమే అనిపిస్తుంది. దగ్గరగా చూస్తే అది అసాధ్యం. అది సాధ్యాసాధ్యముల ఆకర్షణ శక్తితో తిరిగి తిరిగి వెనక్కి లాగుతుంది.
ఒక వ్యక్తి ప్రజల కోసమో, కుటుంబం కోసమో లేదా సంప్రదాయం కోసమో సత్యాన్ని అనుసరించిన, అది ఒక విధిగా, ఒక నాటకంగా మిగిలిపోతుంది. అందువలన అన్నమాచార్యుడు ముందుగానే హెచ్చరిక జారీ చేసాడు. ఈ ఒక్క పల్లవితో అన్నమాచార్యులు ఎంత తీక్షణముగా, నిశితముగా కవిత్వము చెప్పినది తెలియవచ్చు.
ఒక నాటకమునకు నటుడు(లు), మౌఖిక లేదా రాత ప్రతి మరియు ప్రేక్షకులను తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఈ జీవితంనాటకంలో మానవుడే తన స్వంత రాత ప్రతితో నటిస్తాడు మరియు విధివశాత్తు, తన జీవితానికి తానే ప్రధాన ప్రేక్షకుడు. అటువంటప్పుడు, ఈ నాటకము ఏ దిశలో పయనించునది ఎవ్వరైనా ఊహించగలరు. అందుకనే, మానవజాతి చాలా కాలంగా స్తబ్ధుగా ఉండిపోయినది.
ఒక నాటకం నుండి, మనకు కొంత సంతృప్తి, కొంత వినోదం లభిస్తాయి. కానీ, మన బదుకులా౦టి నిస్సారమైన, నిస్తేజమైన నాటకాన్ని చూడడానికి ఎవరు మూల్య౦ చెల్లిస్తారు? సినీ ప్రమాణాల ప్రకారం, అట్టర్ ఫ్లాప్. అయినప్పటికీ ఆ మానవుడు తను గొప్పగా నటిన్నానని భావిస్తాడు!! ఎంత
నిర్లజ్జ! ఏంత అవివేకము?
ఇక్కడ వానమామలై వరదాచార్యులు గారు వ్రాసిన పోతన చరిత్రము (1-115) నుండి క్రింది
పద్యమును ఉదాహరించుట సముచితమని అనుకొంటాను.
ఇంకా, అన్నమాచార్యులు ఈ జీవితమను నాటకములో మన పాత్ర నిర్వహించడానికి మనము సిద్ధంగా లేమని స్పష్టంగా సూచిస్తున్నారు. ఈ సందర్భముగా యీ ఐరిష్ సామెతను చూడండి. “ప్రపంచమొక నాటకరంగం; మనమంతా అశిక్షిత నర్తక సంఘం.” (Translated by Dr.
M. Ramaprasad).
అన్వయార్ధము: అత్యావశ్యకరమైన జీవితమును గడుపుటకు ఇప్పటి
నాటకాలకు ముగింపు పలుకుము.
భావము: ఈ జనన మరణాలను#1
వాస్తవాల మధ్య (నీవే రచించిన కధతో) నాటకం ఆడతావు. (నీ) ముందున్న ప్రపంచములోని చిట్టచివరిది, శాశ్వతమైనది సత్యము (లేదా కైవల్యము)
మాత్రమే.
వివరణము: ‘ప్రపంచమును కట్టఁగడపటిది” అని అన్నమాచార్యుడు ఈ లోకంలో చివరిది మరియు శాశ్వతమైనది సత్యము అని చెప్పిరి. రెండు వేరు వేరు ప్రపంచాలు లేవు అని వెల్లడించిరి.
మానవుడు తన ఊహల్లో రెండు లోకాలను నిర్మించుకుంటాడు. ఆ దుఃఖమంటని ఊహాజనితమైన మరొక ప్రపంచాన్ని కోరుకుంటాడు. అన్నమాచార్యులు, జిడ్డు కృష్ణమూర్తి వంటి ఆధునిక తత్వవేత్తలు ఈ భావనతో ఏకీభవించరు. భగవద్గీత శ్లోకం 6-29 యొక్క పరోక్ష అర్థం కూడా అదే.
అందువలన, సమస్యల్లేని ప్రపంచం మనిషి కల్పన. ఒక భ్రమ. అందువలన అన్నమాచార్యుడు దీనిని నాటకము అని పిలిచాడు.
అన్వయార్ధము: తారతమ్యాలు లేకుండా ప్రపంచాన్ని చూస్తే, సత్యము#2 ఇక్కడే
నీ ముందే ఉంది.
భావము: కుడచు
అన్నము చుట్టు
కోకలు అవసరమే.
కానీ ఈ
చిన్న విరామంలో
(జనన మరణాల
మధ్య కాలములో) వాటిపైననే
దృష్టి వుంచుటే
నాటకము. మానవుడు
వొడిఁ గట్టుకొనిన
వుభయకర్మముల ద్వారా
సృష్టించబడిన సరిహద్దులను దాటినప్పుడు, అనగా ఇకపై
వాటితో ఎటువంటి
సంబంధము లేనప్పుడు,
మోక్షానికి అవకాశం
ఉంటుంది.
వివరణము: మానవుని మదిలో ఆహారమునకు గల ప్రాథమిక స్వభావాన్ని నొక్కిచెప్పడానికి తరచుగా దానిని పునరావృతం చేస్తారు అన్నమాచార్యుల వారు. ఈ లోకంలో మనిషి ఏమి చేసినా అది అతని మనస్సు పొరల అడుగు భాగంలో దాగి ఆహారము ఉంటుంది. ‘చిత్తరువు’ శీర్షికతో దిగువ ఇచ్చిన రెనే మాగ్రిట్టే పెయింటింగ్'ను పరిశీలనము చేయమని పాఠకులకు అభ్యర్థన. యూరోపియన్ సాంస్కృతిక యాసతో ఉన్నప్పటికీ ఈ చిత్రలేఖనమును పాఠకులు ఉపేక్షింపరని ఆశిస్తాను.
ప్లేటు మీద ఉన్న కన్ను నేరుగా చూపరుని వైపు చూస్తుంది. ఇది బహుశా ఆహారముతో మానవులు పారవశ్యము చెందడాన్ని ప్రశ్నిస్తుంది. ఎదుటి ప్రపంచమును ఆహారము నందించు మార్గముగా చూచుచున్నారని కొందరి అభిప్రాయము. మాగ్రిట్టే చిహ్నాలను ఇష్టపడనప్పటికీ అతను కన్నును మనస్సాక్షికి చిహ్నంగా చిత్రించాడని చైమ్ కొప్పెల్మన్ అభిప్రాయపడ్డాడు. ఏదియేమైనా, 'ది పోర్ట్రెయిట్'లోని కన్ను తనను ఉపేక్షింపరాని దానిగా తీసుకొని గౌరవించాలని అంటోందని భావించవచ్చు.
మాగ్రిట్టే బహు సొబగైన శీర్షిక ‘చిత్తరువు’ అని పెట్టి చిన్న మార్పుతో చూపరులను ఆశ్చర్యములోను, సందిగ్ధములోను తోసివేసిరి. మనిషి హృదయమను చిత్తరువును చూపిరి. అన్నమాచార్యుల వారు, మాగ్రిట్టే గారు మనలను సహజముగానూ నైతికముగానూ ఆలోచించమని పదేపదే చెప్పిరి. కడుపు నింపుకొని పుణ్యము సంపాదించుదును అనుకోవడమే మనిషి ఆడు వింత నాటకము#3.
వొడిఁ గట్టుకొనిన వుభయకర్మములు
/ గడి దాఁటినపుడే కైవల్యము: మనిషి పుణ్యములలో నిమగ్నం కావడానికి ప్రయత్నిస్తాడు. కానీ పాపపుణ్యములు మానవుడు తీర్మానించినవే. అందుకే అన్నమాచార్యులు వాటి హద్దులు దాటితేనే అనగా, మానవునికి, అతని చేష్టలకు ఆసాంతముగా అతీతముగా నుండుటను కైవల్యమునరి. ఇటువంటి అర్ధమునే యిచ్చు భగవద్గీత శ్లోకమును కూడా మననము చేసుకొందము బుద్ధియుక్తో జహాతీహ
ఉభే సుకృతదుష్కృతే (2-50) భావము: వివేకముతో ఈ కర్మ శాస్త్రమును
ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మ లోనే పుణ్య పాపములను రెంటినీ త్యజించును.
అన్వయార్ధము: నరుడా! నీ దృష్టిని మరలించు విషయములే నీ చేత నాటకమాడించునవి.
అవి పాపపుణ్యములను ఎరలనుచూపి చేజేతులా నీవే స్వేచ్ఛకు దూరమగునట్లు క్రీడించు చున్నవి.
ముఖ్య పదాలకు
అర్ధాలు: గగనము = దుర్లభము.
భావము: ఈ పాపము తెగదు. ఆ పుణ్యము ఎంతైనా తీరదు. వీటి నాటకం కొనసాగుతుండగా, వెకిరించుతూ సమయం ఎగిరిపోతుంది. పైవాడు వేంకటేశ్వరుడు మన యేలిక. సత్యము అసాధ్యానికి
ఆవలిది.
వివరణము: ఈ చరణము యొక్క
ఉద్దేశ్యం పుణ్యము చేయబోవునప్పుడు మరియు పాపము నివారించబోవునప్పుడు మానవునికి అంతర్గత ప్రతిఘటన ఎదురౌతుంది. దీనిని స్పష్టంగా
ఆర్ ఎల్ స్టీవెన్సన్ గారి ప్రసిద్ధ నవల, డాక్టర్ జెకిల్ మరియు మిస్టర్ హైడ్ యొక్క
వింత ఉదంతం (The Strange Case of Dr Jekyll and Mr
Hyde by R L Stevenson) నందు గమనించవచ్చు. అన్నీ
మంచి లక్షణాలున్నప్పటికీ డాక్టర్ జెకిల్ చివరికి మిస్టర్ హైడ్ (దుర్మార్గుడు)గా
ఉండటానికి మొగ్గు చూపుతాడు. మనందరి పరిస్థితి కూడా దాదాపు అలాంటిదే అని
అన్నమాచార్యుల భావము.
“గగనము మీఁదిది కైవల్యము”: మానవుడు తరచుగా
అసాధ్యమైన వాటికి భయపడుతాడనీ ఐతే వాస్తవానికి ఏది సాధ్యమో కనుగొనడానికి అతడు
దానిని పరిశీలించడనీ సూచిస్తుంది. అసాధ్యమును వాడుకగా కొట్టివేయుట విచారణ కాదు,
అది వ్యవస్థీకృత ప్రతిక్రియ మాత్రమే.
అన్వయార్ధము: పాపపుణ్యముల ఊసెత్తక సమయమే లేనట్లు అసాధ్యమని వదలక పైవాడు వేంకటేశ్వరుని చేరుటకు చేయు సాధనయే యత్నము. తక్కినవన్నీ నాటకములే.
కీర్తన సంగ్రహ సారం:
పల్లవి: నరుడా! నానాఁటి బదుకు నాఁటకము. గొప్ప ఏకాగ్రతతో కని అనుభవించినదైననూ కలిగెనని తెలుపలేనిది
కైవల్యము. (అందువల్ల, దీనిని కూడా ప్రజలు నాటకం అని పిలవవచ్చును.) అన్వయార్ధము: అత్యావశ్యకరమైన జీవితమును గడుపుటకు ఇప్పటి నాటకాలకు ముగింపు
పలుకుము.
చరణం 1: ఈ జనన మరణాలను వాస్తవాల మధ్య (నీవే రచించిన కధతో) నాటకం ఆడతావు.
(నీ) ముందున్న ప్రపంచములోని చిట్టచివరిది, శాశ్వతమైనది సత్యము (లేదా కైవల్యము) మాత్రమే. అన్వయార్ధము: తారతమ్యాలు లేకుండా ప్రపంచాన్ని చూస్తే, సత్యము ఇక్కడే నీ ముందే
ఉంది.
చరణం 2: కుడచు అన్నము చుట్టు కోకలు
అవసరమే. కానీ ఈ చిన్న విరామంలో (జనన మరణాల మధ్య కాలములో) వాటిపైననే దృష్టి వుంచుటే
నాటకము. మానవుడు వొడిఁ గట్టుకొనిన వుభయకర్మముల ద్వారా సృష్టించబడిన సరిహద్దులను దాటినప్పుడు,
అనగా ఇకపై వాటితో ఎటువంటి సంబంధము లేనప్పుడు, మోక్షానికి అవకాశం ఉంటుంది. అన్వయార్ధము: నరుడా! నీ దృష్టిని మరలించు విషయములే నీ చేత నాటకమాడించునవి.
అవి పాపపుణ్యములను ఎరలనుచూపి చేజేతులా నీవే స్వేచ్ఛకు దూరమగునట్లు క్రీడించు చున్నవి.
చరణం 3: ఈ పాపము తెగదు. ఆ పుణ్యము ఎంతైనా తీరదు. వీటి నాటకం కొనసాగుతుండగా,
వెకిరించుతూ సమయం ఎగిరిపోతుంది. పైవాడు వేంకటేశ్వరుడు
మన యేలిక. సత్యము అసాధ్యానికి ఆవలిది. అన్వయార్ధము: పాపపుణ్యముల ఊసెత్తక సమయమే లేనట్లు అసాధ్యమని వదలక పైవాడు
వేంకటేశ్వరుని చేరుటకు చేయు సాధనయే యత్నము. తక్కినవన్నీ నాటకములే.
References
and Recommendations for further reading:
#1 4. ఇన్ని చదవనేల (inni chaduvanEla)
#2 96. ఎదుట నెవ్వరు లేరు యింతా విష్ణుమయమే (eduTa nevvaru lEru yiMtA vishNumayamE)
#3 కడలుడిపి నీరాడఁగాఁ దలఁచువారలకు (kaDaluDipi nIrADagA dalachuvAralaku)
Explained very well about what Sri Annamacharya intends to convey!
ReplyDeleteWell said. ముఖ్యంగా పాప పుణ్యాల గురించి అన్నమాచార్య ఎంత practical గా ఆలోచించారో మీరూ అంతే practical గా చెప్పారు. అలాగే తన సంప్రదాయం లో కైవల్యం అంటే negative meaning ఉంది. దానిని చాలా positive గా అందరూ అనుకునే దానికి వ్యతిరేక అర్థంలో వీరు ఉపయోగించారు.
ReplyDeleteజననమరణముల నడుమ నడిచే ఈ జీవితం ఒక నిస్సారమైన నాటకం.లౌకికమైన విషయాలలో మునిగి తేలుతూ,అనిత్యమైన సుఖభోగాలే శాశ్వతమనే భ్రమలో పడి, మానవజన్మ పరమార్థమెఱుగక జీవితాన్ని దుఃఖమయం, నాశనం చేసుకొంటున్నాడు మానవుడు.
ReplyDeleteఅసలైన జీవితమిది కాదని, జీవితలక్ష్యమిది కాదని, నాటకమనే ఈ జీవితానికి స్వస్తి చెబుతూ తెగని పాపపుణ్యకర్మల కతీతంగా(ఇవి బంధకారకములు, నాటకములే కనుక) భక్తి, జ్ఞాన, వైరాగ్యములచే సమదృష్టిని కలిగియుండి శాశ్వతము,సత్యము, బ్రహ్మానందదాయకము అయిన కైవల్యమును (మోక్షము) పొందుమని అదియే జీవిత పరమావధి, పరమలక్ష్యమని అన్నమయ్య సరళమని అనిపించినను గహనమైన ఈ కీర్తనలో సమాజానికి మార్గనిర్దేశము చేస్తున్నాడు.
Contd....
ReplyDeleteMC Escher gari cube ను పరికిస్తే ఒకపరి సాధ్యమని,మరొక పరి అసాధ్యమని భ్రమ(illusion) కలిపిస్తుంది. అలాగే కైవల్యం సాధ్యమని జ్ఞానులకు, అసాధ్యమని అవివేకులకు నిశ్చయమేర్పరుస్తుంది.
అలాగే *కుడిచే దన్నము కోక చుట్టెడిది* అనే చరణంలో మనిషి కడుపుకు పట్టెడన్నం కోసమే ఉభయకర్మలను చేస్తూ, దానిమీదనే దృష్టి పెట్టి, జీవితాన్ని వృధా చేస్తున్నాడు. దీనిని రెనె మాగ్రిట్టే పెయింటింగ్ లో dining plate లో కన్నుగా చిత్రీకరించాడు.
కీర్తనను సులభంగా వివరించటానికి శ్రీనివాస్ గారు చేసిన ప్రయత్నం అద్భుతం.
ఓం తత్ సత్🙏
కృష్ణ మోహన్