Thursday, 29 September 2022

T-143 ఏమి చెప్పెడి దిందు నేమి గలదు

 తాళ్లపాక అన్నమాచార్యులు

143 ఏమి చెప్పెడి దిందు నేమి గలదు

 

for EnglishVersion press here

 

ఉపోద్ఘాతము: అన్నమాచార్యులు సహజమగు, ప్రకృతి కనుగుణమగు జీవనమునకు మన ఇప్పటి భ్రాంతికరము, కల్పితమగు ఉనికికి గల వ్యత్యాసములను ఆశ్చర్యము గొల్పునట్లు వర్ణించిరి.  అనంతమగు జీవనమును మనిషి తనకుతానే నియంత్రించబోయి పరిమితమగు ఇరుకు సందులలో జీవిస్తున్నాడని చెప్పిరి. మానవుని పరీక్షించు పరిస్థితుల వర్ణనలోని ఆయన కచ్చితత్త్వం ఎప్పటికీ, ఎవరూ సమానం చేయలేకపోవచ్చు.  

అన్నమాచార్యులు అనుభూతిని నేరుగా హృదయాంలోకి చొప్పిస్తాడు. ఆయన చేయు ఉపమానములు పర్యాలోచననకు దారితీయును.  అందరాని ద్రాక్షలలాగ మురిపించును. అనుసరించటకుకు ఉసి కొల్పును. ఆయన కల్పన​ అద్వితీయము.  ఆయన సంక్షిప్తత తిరుగులేనిది.  ఇక "ఏమి చెప్పెడి దిందు నేమి గలదు" చూద్దాం. 

 

కీర్తన:

శ్రీరంగం రేకు:  8-4  సంపుటము: 15-459

 

ఏమి చెప్పెడి దిందు నేమి గలదు
సామజముతోఁ బెనఁగ సమకొనెడు మనికి ॥పల్లవి॥
 
బొంతవలపులతోడఁ బొరలాడు మనికి
దొంతి యాపదలె తనతొడవైన మనికి
ముంతలోపలినీట మునిఁగేటి మనికి
సంతలో కూటములె చవియైన మనికి ॥ఏమి॥
 
కొనకొన్న దురితములె కూడైన మనికి
కను మాయ సంపదలఁ గాఁగేటి మనికి
పనిలేని విషయముల బంటైన మనికి
వెనక ముందర చూడ వెఱపైన మనికి ॥ఏమి॥
 
యేవగింతల యాట నెదురీఁదు మనికి
చావుతో సరియైన జగడంపు మనికి
శ్రీవేంకటేశునిఁ జింతసేయని మనికి
యీవలావలఁ దిరిగి యిట్లైన మనికి ॥ఏమి॥

 

Details and Explanations: 

ఏమి చెప్పెడి దిందు నేమి గలదు
సామజముతోఁ బెనఁగ సమకొనెడు మనికి ॥పల్లవి॥ 

ముఖ్య పదములకు అర్ధములు: సామజము = ఏనుగు; మనికి = బ్రదుకు, జీవితం. 

భావము: ఏమి చెప్పగలను. ఈ బ్రదుకులో ఏముంది? ఏనుగును ఎదిరించ బోవు వృథా యత్నమా? 

వివరణము: జీవితంలోని సవాలు అది ప్రత్యక్షంగా కనబడక​పోవడమే. లేని సవాలును ఊహించబోదుము. పుట్టినప్పటి నుంచి చివరి వరకు ఏదో ఒక సమస్యపై పోరాడుతూనే ఉంటాం. శిశువుగా మాట్లాడలేకపోతున్నానని, పిల్లవానిగా నడవలేకపోతున్నానని, పరిగెత్తలేకపోతున్నానని లాంటివి కావచ్చు. పెరుగుతున్న కొద్దీ జాబితా పెద్దదౌతుంది. గందరగోళాన్ని జోడిస్తుంది. పోరాటము అనూహ్యముగా పెరుగుతూనే ఉంటుంది. ఈ నిరంతరమగు పెనుగులాట​ ఏనుగుతో యుద్ధం కాదా? 

ఇప్పుడు రెనే మాగ్రిట్టే గీసిన లాస్ట్ జాకీ (దారితప్పిన రౌతు) అనే చిత్రాన్ని చూడమని పాఠకులకు అభ్యర్థన​. పసుపురంగు వాతావరణం ఉత్సాహమునుగానీ, పుష్టినిగానీ కలిగించదు. ఆకులు లేని చెట్ల వరుసల, వాటి మార్పులేని సౌష్ఠవం మనిషిలో విసుగును మరియు వెగటును కలిగిస్తాయి. ప్రత్యామ్నాయముగా మానవుడు కొత్తదనము కోరుకుంటాడు. కానీ కోరుకున్న కొత్తదనములోని పాత ఛాయలు నిరుత్సాహ పర్తుస్తాయి. ముందేమి జరగబోతున్నది తెలిసి కూడా ఊహించలేనిది కోరుకోబోతాం. ఇప్పుడు కోరికలను చెట్ల పరిమాణము జాకీ ఎత్తుతొ పోల్చండి.  



ఎన్నో చెట్ల వరుసలు దాటుకొని వస్తున్న జాకీ అడవిని దాటడానికి తొందరపడుతున్నట్లు కనిపిస్తుంది. మొత్తంమీద ఆ వాతావరణం అతన్ని నిరుత్సాహపరుస్తుంది. క్రమ అంతరముతో ఎటు చూసినా చెట్లు ఒకేలా కనిపిస్తూ జాకీకి అతను వాస్తవానికి ఎక్కడ ఉన్నాడో తెలియనివ్వవు. అతను ఏ దిశలో పయనిస్తున్నాడో? ఎవరైనా ఊహించగలరు…ఔను….మనమే తప్పిపోయిన రౌతులం. 

దారితప్పిన జాకీ తను గుర్తించలేని గమ్యాన్ని వెతుకుతున్నాడు. జాకీ గుర్రాన్ని ఎంత దూరం పరిగెత్తించగలడు? మనమూ అంతే. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. 

అన్వయార్ధము: దేనికొరకు జీవితం. జీవితంలో దేనికొరకు. ఏనుగుతో పోరాటమా? పోరాటమే ఏనుగా?

బొంతవలపులతోడఁ బొరలాడు మనికి
దొంతి యాపదలె తనతొడవైన మనికి
ముంతలోపలినీట మునిఁగేటి మనికి
సంతలో కూటములె చవియైన మనికి ॥ఏమి॥ 

ముఖ్య పదములకు అర్ధములు: బొంత = పెద్ద​, లావుపాటి; దొంతి = వరుసగానున్న; తొడవైన = భూషణమైన; సంతలో = బజారులో (ఇక్కడ అశాశ్వతమైన అను అర్ధములో వాడారు.); కూటములె = సమూహములే;  చవియైన = ఇష్టమైన; 

భావము: కోరికల బురదలో కూరుకుపోవడమే జీవితం (మనకు). కష్టాల పరంపర ఈ ఉనికికి ఆభరణాలు. చిన్న ముంతలోపలినీట మునుగు సంకుచితమైన బ్రదుకు#1.  అశాశ్వతమైన జీవన బంధాలను ఎప్పటికీ నిలుచుకోజూపు జీవితం. 

వివరణము: ఇప్పుడు లాస్ట్ జాకీ ఇంకో వెర్షన్ చూడండి. ఇక్కడ చెట్లబదులు, బిల్బోక్వెట్ ఉపయోగించారు. బిల్బోక్వెట్'కి మ్యూజికల్ నోట్స్ (మీటలు) వేసి కృత్రిమ జీవితంలో లలితకళలలో కొంత​ సేద దీరు అంతరంగమును చూపిరి. బిల్బోక్వెట్ లకు వేళ్ళు మొలచినట్లు చూపి కృత్రిమమునకు కృత్రిమమును అమర్చు వెర్రితనమును ప్రకటించిరి. ఇటువంటి అతి నాగరీకపు పనులు మనకు విదితమే. 



ఇక్కడ లాస్ట్ జాకీ డ్రామా హాల్లో చెక్క వేదికపై కప్పిన గుడ్డ మీద గుఱ్ఱాన్ని నడుపుతున్నాడు. అది గొడుగులను కుట్టేందుకు ఉపయోగించు గుడ్డలను పోలి ఉంది.  ఇంకో రకంగా అది సాలెగూడును మురిపిస్తుంది. కృత్రిమ రంగము మీద యాత్రకుబోవు పట్టువదలని విక్రమార్కుడా! నీ పరువెందాకా? ‘ముంతలోపలి నీట మునిఁగేటి మనికి’కి తెరువెక్కడ​? 

కొనకొన్న దురితములె కూడైన మనికి
కను మాయ సంపదలఁ గాఁగేటి మనికి
పనిలేని విషయముల బంటైన మనికి
వెనక ముందర చూడ వెఱపైన మనికి 

ముఖ్య పదములకు అర్ధములు: కొనకొను = ప్రయత్నించు; దురితములె = పాపములె దుష్కృతములె,  కను మాయ = ఇంద్రజాల విద్య; వెఱపు = భయము, వింత; ​​ 

భావము: ప్రయత్నించి పాపములనే భుజించు బ్రదుకు. ఇంద్రజాలము వంటి సంపదలఁకై తపించు బ్రదుకు.  పనిలేని విషయములకు బంటైన వ్యర్థపు బ్రదుకు. వెనక ముందులు చూడ భయముగొలుపు  బ్రదుకు. 

వివరణము: కొనకొన్న దురితములె కూడైన మనికి’ తో భగవద్గీతలోని (3-13)ను చెప్పదలిచారు "భుంజతే తే త్వఘం పాపా యే పచంత్యాత్మకారణాత్". (= తమ భోగమునకే అన్నం వండుకునే వారు పాపమునే భుజింతురు). 

‘వెనక ముందర చూడ వెఱపైన మనికి’: మనిషి తాను జీవించు సరళిపై ఒక అవగాహనకు వచ్చి తన జీవితాన్నే  సమీక్షించుటకు, పునఃపరిశీలించుటకు జంకుతాడన్నారు. ఈ పునాదులులేని అవగాహనకు అర్ధములేదన్నారు అన్నమాచార్యులు. ఇదియే కృత్రిమ వృత్తి. 

యేవగింతల యాట నెదురీఁదు మనికి
చావుతో సరియైన జగడంపు మనికి
శ్రీవేంకటేశునిఁ జింతసేయని మనికి
యీవలావలఁ దిరిగి యిట్లైన మనికి ॥ఏమి॥ 

ముఖ్య పదములకు అర్ధములు: ఏవగింత = నింద, అపవాదు. 

భావము: నిందలు, అపవాదులు, ఆపోహలను నిరంతరము ఎదుర్కొని అలసిపోవు జీవితమూ  జీవితమేనా?#2 నీవాడు సిగపట్లు మరణముతో సమానము కావా? యీవలావలఁ (ఇదిచావు ఇది పుట్టుక) అను ఊహాగానములతో ఒక పరిథిని ఏర్పరచుకొని ఉండు ఉనికి 'మనికి' కాదు.  శ్రీవేంకటేశునిఁ చింతజేయని బ్రదుకు బ్రదుకేనా? 

వివరణము: ఒక గిరిగీసుకొని అందులో కాలము వెళ్ళబుచ్చు మన ధోరణిని విమర్శిస్తున్నారు. గీసుకొన్న అవధి చాలా పెద్దదని మనమనుకోవచ్చు. అది గిరిశిఖరమును దాటవచ్చు. కానీ దానికొక  పొలిమేరను ఏర్పరచుకున్నాముకదా? అక్షరమగు దానిని క్షరమగు దానితో తూచుటెట్లు? 


కీర్తన సంగ్రహ సారం:

పల్లవి: ఏమి చెప్పగలను. ఈ బ్రదుకులో ఏముంది? ఏనుగును ఎదిరించ బోవు వృథా యత్నమా? అన్వయార్ధము: దేనికొరకు జీవితం. జీవితంలో దేనికొరకు. ఏనుగుతో పోరాటమా? పోరాటమే ఏనుగా?

 

చరణం 1: కోరికల బురదలో కూరుకుపోవడమే జీవితం (మనకు). కష్టాల పరంపర ఈ ఉనికికి ఆభరణాలు. చిన్న ముంతలోపలినీట మునుగు సంకుచితమైన బ్రదుకు.  అశాశ్వతమైన జీవన బంధాలను ఎప్పటికీ నిలుచుకోజూపు జీవితం.

 

చరణం 2: ప్రయత్నించి పాపములనే భుజించు బ్రదుకు. ఇంద్రజాలము వంటి సంపదలఁకై తపించు బ్రదుకు.  పనిలేని విషయములకు బంటైన వ్యర్థపు బ్రదుకు. వెనక ముందులు చూడ భయముగొలుపు  బ్రదుకు. 

 

చరణం 3: నిందలు, అపవాదులు, ఆపోహలను నిరంతరము ఎదుర్కొని అలసిపోవు జీవితమూ  జీవితమేనా? నీవాడు సిగపట్లు మరణముతో సమానము కావా? యీవలావలఁ (ఇదిచావు ఇది పుట్టుక) అను ఊహాగానములతో ఒక పరిథిని ఏర్పరచుకొని ఉండు ఉనికి 'మనికి' కాదు.  ​ శ్రీవేంకటేశునిఁ చింతజేయని బ్రదుకు బ్రదుకేనా?


References and Recommendations for further reading:

#1 46. చెంత నిండుచెరువుండ చెలమలేలా (cheMta niMDucheruvuMDa chelamalElA)

#2 31. చాల నొవ్వి సేయునట్టి జన్మమేమి మరణమేమి (chAla novvi sEyunaTTi janmamEmi maraNamEmi)

3 comments:

  1. మానవజీవనవిధానంయెడల అన్నమయ్య చూపిన నిస్పృహను చాలా బాగా చిత్రాలతో వివరించావు. అభినందనలు....👍😊👍

    ReplyDelete
  2. Came well. This is what is called సత్తా or meaningful existence. The life engrossed in the Lord's thoughts is believed to be a saattvika life.

    ReplyDelete
  3. దుర్లభమైన మానవజన్మ గమ్యం మోక్షప్రాప్తి. ఈ గమ్యాన్ని విస్మరించి మానవుడు పెనుసవాళ్ళతో కూడిన జీవితాన్ని అగమ్యంగా గడిపేస్తూ, వృథాప్రయాసతో తన బ్రదుకును నిరర్థకం చేసుకుంటున్నాడు.
    సంసారమనే సముద్రాన్ని తరించలేకున్నాడు.

    మాగ్రిట్టే గీచిన చిత్రంలో జాకీ అలాగే అంతంలేని,అనల్పమైన కోరికలనే పెనువృక్షములను గమ్యమనేది లేకుండా దాటుకుంటూ గుర్రాన్ని నడుపుతున్నాడు.జాకీ సుదూర ప్రయాణం చేసినా అవే కోరికలు, అదే నిరుత్సాహం అతడిని వెంటాడుతునే ఉన్నాయి. ఆశాశ్వతములైన కోరికలే కష్టాలకు, దుఃఖానికి మూలం. కోరికలనే పంకిలములో కూరుకుపోయి అగమ్యగోచరంగా, కృత్రిమంగా యున్నది యతని ప్రయాణం. మనిషి యొక్క యిటువంటి నిరర్థకము, గమ్యంలేని బ్రదుకు ఒక బ్రదుకా యని అన్నమయ్య ప్రశ్నిస్తున్నాడు.

    మోక్షసాధనకు ప్రయత్నించే బదులుగా, పాపకర్మలు చేయటానికి, మనస్సుని కల్మషం చేయటానికి, అనిత్యములైన భోగభాగ్యములు, సంపదల కొఱకు
    ప్రయత్నశీలురగుచున్నారు.
    జీవితగమనాన్ని సమీక్ష చేయటానికి కూడా సమయం వెచ్చించక కాలాన్ని వృథాగా గడిపి
    బ్రదుకును వెళ్ళదీస్తున్నారు.ఇదీ ఒక బ్రదుకేనా అని అన్నమయ్య ప్రశ్నిస్తూ, ఆ వెంకటేశ్వరుని చింత చేయుచూ బ్రదుకుని సార్థకం చేసుకునే మార్గాన్ని, తరుణోపాయాన్ని మానవాళికి బోదిస్తున్నాడు అన్నమయ్య ఈ కీర్తన ద్వారా.
    ఓమ్ తత్ సత్ 🙏🙏🙏
    కృష్ణ మోహన్

    ReplyDelete

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...