Wednesday 23 November 2022

T-149 అట్టివేళఁ గలఁగనీ దదివో వివేకము

 తాళ్లపాక అన్నమాచార్యులు

149 అట్టివేళఁ గలఁగనీ దదివో వివేకము

  

for EnglishVersion press here

 

కీర్తన:

రాగిరేకు:  98-1  సంపుటము: 1-489 


అట్టివేళఁ గలఁగనీ దదివో వివేకము
మట్టుపడితే శాంతము మఱి యేలా అట్టి॥
 
జడధులు వొంగినట్టు సందడించు నింద్రియములు
వొడలిలో జీవునికి నొక్కొక్కవేళ
బడబాగ్ని రేఁగినట్టు పైకొనీ ముంగోపము
వుడికించు మనసెల్ల నొక్కొక్కవేళా అట్టి॥
 
ఆరయఁ గొండయెత్తినట్టు వేఁగౌ సంసారము
వూరక కలిమిలేము లొక్కొక్కవేళ
మేరలేని చీఁకటియై మించును దుఃఖములెల్లా
వూరటలేని కర్మికి నొక్కొక్కవేళా అట్టి॥
 
పెనుగాలి వీచినట్టు పెక్కుకోరికెలు ముంచు
వొనర నజ్ఞానికి నొక్కొక్కవేళ
యెనయఁగ శ్రీవేంకటేశు దాసుడైనదాఁకా
వునికిఁ బాయ విన్నియు నొక్కొక్కవేళా అట్టి॥

 

 

క్లుప్తముగా: ప్రతి ఆలోచన ఒక అల లాంటిది. అది మనస్సులోని మాలిన్యాలను కదిలించి వీక్షణకు లేని రంగులు వేస్తుంది. కావున అలలను సృష్టించే ఆలోచనలు సత్యాన్ని చూడకుండా మనల్ని నిరోధిస్తాయి. 

పల్లవి: ఆ క్షణాల్లో వివేకము పనిచేయదు. ఓరిమి మాతమే ప్రశాంతతనిచ్చి మనస్సును తేట పరుస్తుంది. మానవుడా! ఇంకా ఏమి కావాలి? అన్వయార్ధము: మానవుడా! శాంతము లేక వివేకము కలగదు. సహజ క్రమము నెఱుగలేవు.  

చరణం 1: ఒక్కొక్కవేళ సముద్రములన్నింటి ఉప్పెనలు ఒక్కసారి తాకినట్లు ఇంద్రియములు తత్తఱపెట్టును. ఇంకో సమయంలో బడబాగ్ని రేఁచినట్లు మనస్సును ఓర్పు లేక తటాలున వచ్చు కోపముతో ఉడికించును.

చరణం 2: ఒక్కొక్కవేళ కలిమిలేములు ఈ జీవితమును కొండను ఎత్తినట్లు అనిపింపచేస్తాయి. వేగించుతాయి. ఒక్కొక్కవేళ ఎల్లలే లేని చీకటిలా దుఃఖములు వూరట నివ్వక కమ్ముకొంటాయి.

చరణం 3: పెనుగాలి వీచినట్టు పెక్కుకోరికెలు ముంచెత్తి తన గమ్యమునుండి తొలగజేయును. శ్రీవేంకటేశు దాసుడవ్వనంత కాలము ఇవియన్నియును తమతమ అస్తిత్వమును కోలుపోక బాధిస్తునే వుంటాయి.

 

 

విపులాత్మక వివరణ

 

ఉపోద్ఘాతము: అన్నమాచార్యులు సామాన్యుడు యెదుర్కొను సవాళ్ళను, అతడి ఉనికికి గల సారమును వర్ణిస్తూ ఒక సరికొత్త పంథాని యెంచుకున్నాడు. ఆయన కవిత్వం మనసుకు ఉపశమనం కలిగించేదైనప్పటికీ, తరచుగా ప్రశ్నించి ఆలోచింప చేసేదే యెక్కువ. 5౦౦ ఏళ్ళు పైబడినప్పటికీ ఆయన ఆధునికంగానే కనిపిస్తాడు. 

ఛందస్సు లేకుండా కవిత్వం ఎలా రాయాలో, దైనందిక దుఃఖాన్ని వర్ణిస్తూనే, ఆశావహ దృక్పధాన్ని వీడక​, కాంతి వైపు నడిపించ వచ్చనడానికి కీర్తన ఒక ఉదాహరణ.

 

Details and Explanations: 

అట్టివేళఁ గలఁగనీ దదివో వివేకము
మట్టుపడితే శాంతము మఱి యేలా ॥అట్టి॥ 

ముఖ్య పదములకు అర్ధములు: మట్టుపడితే = కుదురుకొంటే, తేటపడితే. 

భావము: క్షణాల్లో వివేకము పనిచేయదు. ఓరిమి మాతమే ప్రశాంతతనిచ్చి మనస్సును తేట పరుస్తుంది. మానవుడా! ఇంకా ఏమి కావాలి? 

వివరణముప్రశాంతతకు ఓర్పుతో సంబంధమేమి? మనమందరం మనకున్న​ వివిధ కార్యములతో ముందుకు సాగడానికి తొందరపడుతుంటాము. విచక్షణ మరియు తెలివితేటల నుపయోగించి ఆయా పనులకు ప్రాధాన్యతలనిస్తాం. 

దైవము లేదా సత్య౦ ఆ పనులలో ఒకటైతే, వాటికిచ్చే ప్రాధాన్యత యేమిటి? సత్యానికి లేదా ప్రకృతికి తమదైన క్రమం ఉంటుంది. వాటిని మన ఇష్టానుసారంగా క్రమములో ఉంచలేము.

ఇప్పుడు రెనే మాగ్రిట్టే వేసిన 'విందు' ("ది బాంక్వెట్") అనే చిత్రాన్ని చూడండి. ఈ చిత్రంలో, సాధారణంగా చెట్లకు అవతల వుండాల్సిన సాయంత్రం సూర్యుడిని  చెట్లకు చూపరులకు మధ్య చిత్రించిరి.  ఇది పూర్తిగా కృత్రిమము. 



ఆ చిత్రానికి 'విందు' అని పేరు పెట్టి ద్వారా, మన ముందు అనేక విషయములు మెరుపులు మెరుస్తూ అలరిస్తుంటాయని; మనకు ఆసక్తి ఉన్నవాటిని ఎ౦పిక చేసుకుంటామనీ మాగ్రిట్టే తెలియజేశాడు. మన ప్రాధాన్యతలు పై చిత్రంలో లాగా అసహజముగా ఉంటాయి. 

దీనినుంచి, మనం దేనిపై దృష్టి కేంద్రీకరించినా, మనస్సు దానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ, సహజ  క్రమాన్ని అణచివేస్తూ నిండిపోతుందని చిత్రం మనకు చెబుతోంది. అందువలన, "మనం చూడాలనుకుంటున్నదే మనం చూస్తాము, సత్యాన్ని కాదు" అని పెయింటింగ్ యొక్క అర్థంమనము సహజ క్రమాన్ని అర్థం చేసుకోలేము. స్థితివ్యాజం (స్థితి కల్పించు భ్రమ) నుండి ఒక క్రమాన్ని నిర్మించబోతాము అని తాత్పర్యము. 'వెనకేదో ముందరేదో – వెర్రి నేను'#1 అనడంలోని అంతరార్ధమూ అదే.

ప్రతి ఆలోచన ఒక అల లాంటిది. అది మనస్సులోని మాలిన్యాలను కదిలించి వీక్షణకు లేని రంగులు వేస్తుంది. కావున అలలను సృష్టించే ఆలోచనలు సత్యాన్ని చూడకుండా మనల్ని నిరోధిస్తాయి. ఎత్తుగడలు, ఉపాయాలలో చిక్కుకున్న మనస్సును సూచిస్తూఅట్టివేళఁ గలఁగనీ దదివో వివేకము అన్నారు అన్నమయ్య​. 

పై చిత్రంలోలా కాకుండా, అడవుల వెనుక వుండు సూర్యుని వంటి సత్యాన్ని చూడలేము, కానీ అనుభూతి చెంద గలము. అందువల్ల, వివేకము అనేది ఆలోచనల ద్వారా సృష్టించబడిన అల్లకల్లోలము కాదు. వివిధ కోణాలనుండి వచ్చు ఉద్దీపనలు కలిగించు బురద జలాల నుండి మనస్సును తేటపరచుటకు సమయాన్ని అనుమతించడమే ధ్యానము. అందుకే ‘మట్టుపడితే శాంతము’ అని అన్నారు అన్నమాచార్యులు. మనస్సులోని ప్రశాంతతకాక మరేమియు దానికి సాటిరావని తెలుపుతూమఱి యేలా” అన్నారు. 

పై ఉదాహరణలో క్రమం ఉందో గుర్తించడం సులభం. ఏదేమైనా, నిజ జీవితంలోని సహజ క్రమము మనలోని ఆలోచనల పరంపరతో ప్రభావితమై గుర్తించడం అసాధ్యమౌతుంది. ఇది ఆన్ లైన్ మోసగాళ్ళ ఉపాయాల వంటిది. వారు మోసము చేయు పద్ధతి వినివుప్పటికీ, చాలా మంది ప్రజలు వారికి బలైపోతారు. 

అన్వయార్ధము: మానవుడా! శాంతము లేక వివేకము కలగదు. సహజ క్రమము నెఱుగలేవు.  

 

జడధులు వొంగినట్టు సందడించు నింద్రియములు
వొడలిలో జీవునికి నొక్కొక్కవేళ
బడబాగ్ని రేఁగినట్టు పైకొనీ ముంగోపము
వుడికించు మనసెల్ల నొక్కొక్కవేళా అట్టి॥ 

ముఖ్య పదములకు అర్ధములు:  జడధులు = సముద్రములు

భావము: ఒక్కొక్కవేళ సముద్రములన్నింటి ఉప్పెనలు ఒక్కసారి తాకినట్లు ఇంద్రియములు తత్తఱపెట్టును. ఇంకో సమయంలో బడబాగ్ని రేఁచినట్లు మనస్సును ఓర్పు లేక తటాలున వచ్చు కోపముతో ఉడికించును.

వివరణము: సమయస్పూర్తి” “సమయానికి తగు మాటలాడు” (లా ప్రెసెన్స్ డి'ఎస్ప్రిట్, the presence of spirit) అనే శీర్షికతో ఉన్న పెయింటింగ్'ను చూడమని పాఠకులను అభ్యర్థన​. ఇక్కడ ఒక చేప, ఒక పక్షి ఒక మనిషికి  ఇరువైపులా పెట్టివుండడం చూస్తాము.




ఆహారం, కోరికలు, ఆనందం వంటి వాటికి చేపని సింబల్'గా చూపారు. స్వేచ్ఛ, ఎగరడం, ప్రపంచం నుండి దూరంగా వెళుతున్న భావనలకు సూచనగా పక్షిని పెట్టారు. పరిశీలించి చూస్తే రెక్కలు లేని పక్షి కాంక్రీటు లేదా చెక్క ముక్క అని తెలుస్తుంది. విధంగా, స్వేచ్ఛగా ఉండాలనే కోరిక వున్నప్పటికీ, వాస్తవానికి మానవుడు స్వేచ్ఛను సాధించడానికి అవసరమైన శక్తులను ఉపయోగించడు అని అర్ధము. మధ్యలో ఉన్న వ్యక్తిని ఇవి రెండు వైపులా లాగుతాయి. మానవుడు అర్ధవంతమైన జీవితాన్ని గడపడానికి ఒక సన్నని త్రాటిపై తడబడకుండా నడవాలని సూచిస్తుంది. చరణం యొక్క అర్థం కూడా ఇదే. అదియే వివేకము.

ఆరయఁ గొండయెత్తినట్టు వేఁగౌ సంసారము
వూరక కలిమిలేము లొక్కొక్కవేళ
మేరలేని చీఁకటియై మించును దుఃఖములెల్లా
వూరటలేని కర్మికి నొక్కొక్కవేళా అట్టి॥

 

ముఖ్య పదములకు అర్ధములు: ఆరయఁ = ఆలోచించి చూడగా; వేఁగౌ= వేగి+అవు = వేగి నట్టు అగు;

భావము: ఒక్కొక్కవేళ కలిమిలేములు జీవితమును కొండను ఎత్తినట్లు అనిపింపచేస్తాయి. వేగించుతాయి. ఒక్కొక్కవేళ ఎల్లలే లేని చీకటిలా దుఃఖములు వూరట నివ్వక కమ్ముకొంటాయి.

వివరణము: ఇంతకంటే గొప్పగా మనిషిని ఊపివేయు పరిస్థితులను వర్ణించలేమేమో. అమాంతముగా మీదపడు యీ విపత్తులు తప్పవు. కానీ, "విపత్తులే జీవితమని భావించుట కూడా సరి కాదు" అని అన్నమయ్య భావము.  

పెనుగాలి వీచినట్టు పెక్కుకోరికెలు ముంచు
వొనర నజ్ఞానికి నొక్కొక్కవేళ
యెనయఁగ శ్రీవేంకటేశు దాసుడైనదాఁకా
వునికిఁ బాయ విన్నియు నొక్కొక్కవేళా అట్టి॥

 

ముఖ్య పదములకు అర్ధములు: ఒనర = ఒప్పుగా, తగినట్లుగా; ఎనయగ = కలిపితే; వునికిఁ బాయవు = తమ అస్తిత్వమును కోలుపోవు = they continue to exist and haunt.  

భావము: పెనుగాలి వీచినట్టు పెక్కుకోరికెలు ముంచెత్తి తన గమ్యమునుండి తొలగజేయును. శ్రీవేంకటేశు దాసుడవ్వనంత కాలము ఇవియన్నియును తమతమ అస్తిత్వమును కోలుపోక బాధిస్తునే వుంటాయి. 

వివరణముఈ భగవగీత శ్లోకాన్ని చూడండి. ఇంద్రియాణాం హి చరతాం యన్మనోఽనువిధీయతే / తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి (2-67) భావం: ఇంద్రియములను స్వాధీనం చేసుకుందామని, వాటి ఆలోచనలనే మనసులో నింపితే, ఆ మనసులోని ఆత్మధ్యానము పోతుంది. గాలివాటుకు నావ  గమ్యము తప్పినట్లే, స్వాధీనంలేని మనస్సు విషయములందే నిన్ను ముంచివుంచును. గమ్యమునుండి భ్రష్టమైన ఆ సాధకుణ్ణి, సంసారమను ఐహిక విషయాలలో ముంచును. 

మనిషి దైవమును తప్పించి వేరు యే మార్గమునేంచుకున్నా బాధలు తప్పవని అన్నమాచార్యుల భావన​. పై భగవగీత శ్లోకము యొక్క అర్ధమునదియే.

 

-the end-

3 comments:

  1. ఓంశ్రీసాయానాధాయనమః

    Fabulous meaning behind this song.

    Maaya is the one that is disturbing Sarvasya Saranagati and only with Sraddha and Saburi can over come the worldly illusions. As Budha said,

    "ధర్మంశరణం గఛ్ఛామి దానంశరణంగఛ్ఛామి "

    అందరు సద్గురువులు భిక్షమార్గమును పాటించుటకు కారణములు. 1 భిక్షలో పదార్ధమెటువంటి దో తెలియకపోవుట ద్వారా రుచి యను కోరికలకు మూలకారణమును అధిగమించెను.

    That we eat to live and there by no special worldly intentions.

    2. షిరిడీకి విచ్చేసిన ప్రతి జీవికి బాబా నేర్పిన సమాధానం అల్లాహ్ మాలిక్ అని అంతాదేవుడి కరుణాకటాక్షమే అని సర్వకాలసర్వావ్యస్థలయందు గుర్తెరుగుట.

    ReplyDelete
  2. మనిషి దైవమును తప్పించి వేరు యే మార్గమునేంచుకున్నా బాధలు తప్పవని అన్నమాచార్యుల భావన​. పై భగవగీత శ్లోకము యొక్క అర్ధమునదియే. - Well said. In Annamacharya philosophy, even becoming subservient to Him is not a means to realize Him, but He Himself is the path. Gita 2.67 is also aptly quoted.

    ReplyDelete
  3. ప్రాపంచిక విషయములతో ఇంద్రియసంపర్కము జరిగినపుడు మనస్సు వికారములకు లోనై ఆలోచనల అలలు సుడులు తిరిగి అనిత్యము, క్షణికమయిన ఆనందం కోసం శరీరేంద్రియములచే వివిధ కర్మలను చేయిస్తుంది.
    ఆ సమయంలో జీవి యొక్క వివేకము (wisdom) (ఆత్మానాత్మ వివేచనము) పని చేయదు.అంటే శ్రేయోదాయక మేది,కానిదేది?అనేది గ్రహించే సామర్ధ్యం కోల్పోతున్నది.

    స్వతస్సిద్ధంగా నిర్మలంగా,శుద్ధంగా ఉండే మనస్సు ఇట్టి వికారములకు లోనై మలినమైపోతుంది.

    వివేక చూడామణి లో శంకరులు ఉపదేశించిన సాధన చతుష్టయము చేత శమదమాదులను అలవరచుకొని జితేంద్రియుడు అయినప్పుడు మనస్సులోని మాలిన్యములన్నీ నశించి, పరిశుద్ధం అవుతుంది.

    చిత్తశుద్ధి కలిగినపుడు ముముక్షుత్వం ప్రాప్తిస్తుంది. అజ్ఞానం నశిస్తుంది. సత్యం గోచరిస్తుంది.పరమానందం, పరమశాంతి లభిస్తాయి.

    దీనినే అన్నమయ్య *మట్టుబడితే శాంతము* అన్నాడు. *మఱియేలా*
    అని కూడా అన్నాడు. అంటే మఱింక యేమి కోరేది? ఏమి కావాలి? ప్రజ్ఞాన సచ్చిదానంద పరబ్రహ్మ సాక్షాత్కరించినపుడు కోరికలనేవి ఉండవు. అదే అన్నమయ్య చెబుతున్న విషయం.

    ఇంద్రియముల చేష్టలు,వాటియొక్క శక్తి,అవి కలుగజేసే మనోవికారములు, మనిషిపై వాటి ప్రభావములు తక్కిన చరణములలో అన్నమయ్య అద్భుతంగా ఆవిష్కరించాడు.
    వీటినుండి రక్షణకు పరమాత్మునికి శరణు జొచ్చి అర్పణబుద్ధితో శ్రవణ, మనన, నిధి, ధ్యాసనల వలన పరంధామమును చేరవచ్చునని ఉద్బోధించుచున్నాడు అన్నమయ్య.

    మాగ్రిట్టి పెయింటింగ్ Banquet లో మనిషి యొక్క సహజప్రవృత్తి స్పష్టంగా చెప్పడం జరిగింది. మన దృష్టి (భౌతిక చక్షువులతో చూచే దృష్టి) ప్రాపంచికవిషయవస్తువుల పైనే ఉంటుంది. అసహజమైనా, ఏది మనస్సును అమితంగా ఆకర్షిస్తుందో దానిపైన ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తాము.అదంతా మిథ్యయే అన్న సత్యమును తెలియకున్నాము.
    సాయంసంధ్యలో సూర్యుడు కృత్రిమంగా ఉన్నా అదే నిజమని భ్రమలో జీవితాన్ని గడుపుతున్నాము.

    స్వేచ్ఛ గురించిన రెండవ చిత్రం లో మనిషి ముక్తికి మార్గము లనేకములున్నప్పటికీ ప్రయత్నశీలుడు కాకపోతున్నాడు. సంసారచట్రం లో చిక్కుకొని పోతున్నాడు అనే విషయాన్ని ఈ చిత్రం చెప్పకనే చెబుతోంది.
    ఓం తత్ సత్
    కృష్ణ మోహన్

    ReplyDelete

201. ఆతఁడే బ్రహ్మణ్యదైవ మాదిమూలమైనవాఁడు. (AtaMDE brahmaNyadaiva mAdimUlamainavADu)

  ANNAMACHARYULU 201. ఆతఁడే బ్రహ్మణ్యదైవ మాదిమూలమైనవాఁడు (AtaMDE brahmaNyadaiva mAdimUlamainavADu) Introduction : A nnamacharya is t...