తాళ్లపాక అన్నమాచార్యులు
148 అది
నేనెఱఁగనా అంతలో భ్రమతుఁ గాక
for English
Version press here
కీర్తన: రాగిరేకు: 142-3 సంపుటము: 2-185 |
అది నేనెఱఁగనా అంతలో భ్రమతుఁ గాక
మదనజనక నాకు మంచి బుద్ధియియ్యవే ॥పల్లవి॥ యెంత లోకానుభవము అంతయు వ్రిథా నష్టి
కొంతైనా బ్రహ్మచింత కోటిలాభము
వింతైన జనులతోడి వినోదము నిష్ఫలము
చెంత సజ్జనసంగతి చేరిన యాదాయము ॥అది॥ నానాదేశవార్తలు నడుమఁ జింతామూలము
పూనిన పురాణగోష్ఠి పుణ్యమూలము
ఆనిన కృషివాణిజ్యాలన్నియుఁ దీరనివెట్టి
మానని యాచారమాత్మకుఁ బడ్డపాటు ॥అది॥ పలు చుట్టరికములు బట్టబయలు తగుళ్ళు
చెలఁగు నాచార్యసేవ జీవన్ముక్తి
బలిమి శ్రీవేంకటేశ పరగ రెండువిధాలు
నిలుకడయిన వాఁడవు నీవే యిన్నిటికి ॥అది॥
|
క్లుప్తముగా: నానాదేశవార్తలు మానవుని
మనోవ్యధకు మూలము- అన్నమాచార్యులు
కీర్తన సంగ్రహ సారం:
పల్లవి: అది నేనెఱఁగనా? ఐనా ఆంతలోనే
భ్రమపడిపోతాను. మదనుని జన్మకారకుడా! నాకు మంచి బుద్ధియియ్యవే. అన్వయార్ధము: ఓ దేవా! నాకు తగిన బుద్ధి లేదు. నేను తెలివితక్కువ సన్నాహాలతో నిన్ను మెప్పించజూస్తాను
చరణం 1: ప్రాపంచిక అనుభవం ఎంతైనా వ్యర్థమే. బ్రహ్మము గురించి కొంచెమైనా
ఆలోచించడం గొప్ప లాభము. వింతైన, విచిత్రమైన వ్యక్తులతో వినోదము నిష్ఫలము. సజ్జనుుల
చెంత చేరిన యాదాయము.
చరణం 2: పుట్టుకనుండి మరణము వరకు
నానాదేశవార్తలు మానవుల చింతలకు మూలము. హృదయపూర్వకముగా చేపట్టిన పురాణగోష్ఠి పుణ్యమూలము.
ఆశ్రయించు కృషివాణిజ్యాలన్నియుఁ దీరనివెట్టిగా మారును. చేదస్తముగా పాటించు ఆచారములు
వట్టి శ్రమయే.
చరణం 3: పలు చుట్టరికములు సత్య మార్గంలో అడ్డంకులను ఆహ్వానమే. ఆత్మను అర్థం
చేసుకోవడంలో సంపూర్ణమైన, అచంచలమైన నిమజ్జనమే
దైవసేవ. అదే జీవన్ముక్తి. ఓ వేంకటేశ్వరా! అభేద్యంగా నీవు ద్వంద్వ రూపంలో అగపడతావు.
సముచితంగా ఈ తాత్కాలిక రూపాలన్నింటిలో నీవు మాత్రమే స్థిరమైన అస్థిత్వం.
.
విపులాత్మక వివరణ
ఉపోద్ఘాతము: సూటిగా, ఘాటుగా, విమర్శనాత్మకంగా అనిపించు యీ కీర్తనలో అంతర్లీనంగా దాని సందేశాన్ని దాచి వుంచారు అన్నమాచార్యులు. మానవుడు అంతర్ముఖుడు కావలెనని సోదాహరణముగా నిరూపించిరి. మనిషి తన స్వంత ప్రజ్ఞను ఉపయోగించి దైవమును, సత్యమును సాధించ జూస్తాడు. కానీ అవి ప్రయత్నములుగానే మిగిలిపోతాయి.
అన్నమాచార్యులు కవిత్వం చెప్పలేదు, అయితే సాధ్యాసాధ్యాల మధ్య వ్యత్యాసమును తెలియచెప్పుటకు తన హృదయాన్ని కుమ్మరించారు. మానవీయంగా సాధించగలిగినది, ఇంద్రియలకు అతీతంగా, దృశ్య ప్రపంచం తాకలేని స్థితిని వర్ణించుటకు అనేక విధములుగా ప్రయత్నించిరి. వారు ఎంచుకున్న నిష్పాక్షిక, వాస్తవిక కవిత్వము భావి తరాలకు గీటురాయి.
అధివాస్తవిక మేధావి రెనే మాగ్రిట్
పెయింటింగ్స్‌తో
అన్నమాచార్యుల
కీర్తనలను
వివరించటనికి
ప్రయత్నించాను.
దృశ్య
మాధ్యమము ద్వారా అన్నమాచార్యులు ప్రతిపాదించిన సంక్లిష్టమైన ఆలోచనలు కొంత వరకు
సులభతరం
చేయబడతాయని భావిస్తాను.
Details and Explanations:
భావము: అది నేనెఱఁగనా? ఐనా ఆంతలోనే భ్రమపడిపోతాను. మదనుని జన్మకారకుడా! నాకు మంచి బుద్ధియియ్యవే.
వివరణము: అన్నమాచార్యులు మనల్ని అయోమయానికి గురిచేసే విషయాలను సూటిగా చెబుతున్నారు. తెలియుట లేదా ఎఱుక అనేవి మన అవగాహనకు లేని రంగులు కల్పించి నిజానికి అవరోధములౌతాయన్నారు. సత్యాన్ని కనుగొనడానికి యే సాధనాలు అవసరం? సత్యాన్ని జ్ఞానముతో పొరపడుతున్నామా? సత్యము సొరుగులలోను, కర్టన్ల వెనుక, కొండలమాటున దాగి ఉన్న విషయమా?
ఇప్పుడు
రెనే మాగ్రిట్టే గీసిన రాత్రి చివరి అంచుల్లో వేటగాళ్ళు (Les
chasseurs au bord de la nuit (ది హంటర్స్ ఎట్ ది ఎడ్జ్ ఆఫ్ నైట్, 1928)
అనే పెయింటింగ్’ను చూడండి.
పై
చిత్రంలో, తెల్లవారుజాము వేటగాళ్ళకు అకస్మాత్తుగా ఎదుపడ్డ భావనను రేకెత్తిస్తుంది. వాళ్ళు కాంతిని చూడలేక తత్తఱపాటుతో తమ కళ్ళను కప్పుకోవడాన్ని
చూస్తాము.
రాత్రి చివరి అంచుల్లో
వేటగాళ్ళు (ది హంటర్స్ ఎట్ ది ఎడ్జ్ ఆఫ్ నైట్)లో రాత్రి = అంధకారమును (అజ్ఞానమును), 'అంచుల్లో' = జీవితం చివరిదాకాను; 'చివరి అంచుల్లో' = చాలా కాలం నుండి వేటాడుతున్నారని; వేటగాళ్ళు = సత్యాన్వేషకులమని చెప్పుకునేవారు; అని సులభంగా గుర్తించవచ్చు.
ఆ వేటగాళ్ల మాదిరిగానే, మనము దేవుణ్ణి జ్ఞానము, ప్రార్థనలు, ఆహార త్యాగము, కోరికల నిరాకరణ మొదలైన ఆయుధాలతో కనుగొనబోతాము.#1కానీ, దేవుడు ఇవన్నీ మన నుండి ఆశిస్తాడా?
నిజంగా దేవుడు (లేదా సత్యము) ఎదురైనప్పుడు, చీకటిని చూచుటకే
అలవాటు పడిన కళ్ళతో, ఆ వేటగాళ్ళవలె ఉక్కిరిబిక్కిరై తలతిప్పుకుందుమని రెనే మాగ్రిట్టే
మరియు ఆన్నమయ్యల భావము
సత్య శోధనకు సమాయత్తమగు మానవులారా “వేసరకుమీ జీవుఁడా వెదకివెదకి దైవమును”#2= దేవుని వెదకుటలో అలసిపోకు అని అన్నమాచార్యులు చెప్పుచున్నారు. అనగా దేవుని వెదకుట మార్గమే కాదని, బదులుగా లోని నిర్మాల్యములను తోసివేయుటయే ఏకైక ప్రత్యామ్నాయమని తెలియజేస్తున్నారు. అన్నమాచార్యులు భక్తిని బోధిస్తున్నారా? మనలో అనుమానములను రేకెక్తిస్తున్నారా? ఈ రెనే మాగ్రిట్టే ఎలాంటి తత్వవేత్తంటారు?
అన్వయార్ధము: ఓ దేవా! నాకు తగిన బుద్ధి లేదు. నేను తెలివితక్కువ సన్నాహాలతో నిన్ను మెప్పించజూస్తాను.
Literal
meaning: ప్రాపంచిక అనుభవం ఎంతైనా వ్యర్థమే. బ్రహ్మము గురించి కొంచెమైనా ఆలోచించడం గొప్ప లాభము. వింతైన, విచిత్రమైన వ్యక్తులతో వినోదము నిష్ఫలము. సజ్జనుుల చెంత చేరిన యాదాయము.
Explanation: పై పెయింటింగ్’ని తిరిగి చూడండి. అనుభవాల నుండి పుట్టిన మన సన్నాహాలు సత్యానికి అవరోధాలని చెబుతోంది. చిత్రంలోని ఎక్కువభాగాన్ని ఖాళీగా వదలి హృదయంలో అన్వేషించబడని భాగాన్ని సూచించారు. శుభ్రమైన అంతఃకరణ లేకుండా, భగవంతునికి స్వచ్ఛమైన హృదయాన్ని ఎలా సమర్పిస్తాము? భక్తి అంటే ఏమిటో ప్రతీ ఒక్కరు పునరాలోచించ వలసి వుంటుంది.
వింతైన జనులతోడి వినోదము నిష్ఫలము:
అయ్యలారా అమ్మలారా! అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మన దేవుళ్ళ బొమ్మలు ఒక చేత్తో
రక్షణను, కరుణను పంచుతూనే మరొక చేత్తో ఆయుధం పట్టి వుంటాయి. నిజానికివి మన అంతర్గత
గందరగోళానికి ప్రతిబింబాలు. వీటికి దేవునితో కానీ లేదా భక్తితో కానీ సంబంధం లేదు. అ౦దుకే,
వింతైన జనులతోడి వినోదము నిష్ఫలము అన్నాడు అన్నమాచార్యుడు. మనలోని ప్రపంచాన్ని ప్రతిబింబించేలా
తన కీర్తనలలో ప్రతి పదాన్ని ఉపయోగించాడు.
మనకు సజ్జనసంగతిని కనుగొని, నిర్వహించగల సామర్థ్యం ఉందని అనుకుంటున్నారా? వివేకవంతులందరూ సమాజముచేత పిచ్చివారుగా, పనికిమాలినవారుగా దూషించబడ్డారని చరిత్ర నిరూపిస్తుంది. యేసుక్రీస్తు శిక్షి౦చబడ్డాడు. మన విచక్షణ గురించి ఎంత తక్కువ మాట్లాడితేనే మంచిది. భగవద్గీత శ్లోకము “కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేఽన్యదేవతాః
(7-20) భౌతిక ప్రాపంచిక కోరికలతో జ్ఞానం కోల్పోయి అన్య దేవతలకు (ఇతరములకు) శరణాగతి చేయుదురు. దైవమును మరచుదురు” అనిచెప్పుట గమనార్హము.
ముఖ్య
పదములకు అర్ధములు: నడుమఁ = పుట్టుకనుండి మరణము వరకు; ఆనిన = ఆశ్రయించు; ఆచారము = చేదస్తముగా
పాటించు ఆచారము;
భావము: పుట్టుకనుండి మరణము వరకు నానాదేశవార్తలు మానవుల చింతలకు మూలము. హృదయపూర్వకముగా చేపట్టిన పురాణగోష్ఠి పుణ్యమూలము. ఆశ్రయించు కృషివాణిజ్యాలన్నియుఁ దీరనివెట్టిగా మారును. చేదస్తముగా పాటించు ఆచారములు వట్టి శ్రమయే.
వివరణము: నానాదేశవార్తలు నడుమఁ జింతామూలము: వివిధ దేశాల నుండి వచ్చిన వార్తలు కేవలం మనోవ్యధకు, దిగులుకు కారణములు. మానవజాతి చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా వార్తలు మనుషుల జీవితాలను ఆదుర్దాలోకి నెట్టుచున్నాయి. ఈ నాటి స్థితికి అద్దం పడుతుంది. ఐదు శతాబ్దాల క్రితం, ఒక మూలన కూర్చుని కళ్ళుమూసుకుని తపస్సు చేసిన అన్నమాచార్యుడు మన దుస్థితి గురించి ఇంత ఖచ్చితంగా ఎలా రాయగలిగాడు? సన్మార్గము ప్రపంచము నుండి పారిపోవుట కాదు. ప్రపంచమును తెలియుట.
రెనే
మాగ్రిట్టే వేసిన "వార్తలు చదువుతున్న వ్యక్తి" {“Man reading News Paper”} అనే
శీర్షికతో ఉన్న ఈ క్రింది పెయింటింగ్’ను రిఫర్ చేయమని పాఠకులను కోరుతున్నాను.
ఈ నాలుగు-ప్యానెల్ పెయింటింగ్’లో, ఒక వ్యక్తి మొదటి ఫ్రేమ్’లో
వార్తాపత్రికను చదవడం మనం చూస్తాము. ఐతే అకస్మాత్తుగా మిగిలిన మూడు ఫ్రేమ్’లలో ఆవ్యక్తి ఆచూకీ తెలియకుండా పోయాడు. అతను ఎందుకు అదృశ్యమయ్యాడు? అని ప్రేక్షకుడు ఆశ్చర్యపోవలసి
వస్తుంది.
అయ్యా, మనిషి ఆ మూడు పలకల నుండి అదృశ్యం కాలేదు. వాస్తవానికి ఆ వార్తలే సగటు మనిషిని ప్రతిబింబిస్తున్నాయి (ఆంటే వార్తలు చదువుతున్న వ్యక్తి అంతఃకరణమునే ప్రతిబింబించుచున్నవని అర్ధము) అని తెలియజెప్పుటకు రెనే మాగ్రిట్టే ఆ వ్యక్తిని ఆ పేనల్స్ నుంచి తప్పించాడు. ఇంకో విషయమేమిటంటే, వార్తలు గత చరిత్రను తెలుపుతవి. గతం నుండి మానవుడు పాఠాలు నేర్వని సంగతి విదితమే. ఇవి తెలుపుతూ అన్నమాచార్యుడు నానాదేశవార్తలు నడుమఁ జింతామూలము అన్నాడు.
మానని యాచారమాత్మకుఁ బడ్డపాటు: అలవాట్లను, వ్యసనాలను విడిచిపెట్టడానికి మనిషిలోని బలహీనతను, మానసిక జడత్వాన్ని సూచిస్తుంది. జడత్వం అనేది స్వేచ్ఛకు విరుద్ధము.
ముఖ్య పదములకు అర్ధములు: చెలఁగు = ఆత్మను అర్థం చేసుకోవడంలో సంపూర్ణమైన, అచంచలమైన నిమజ్జనం అనే అర్థంలో ఉపయోగించబడింది. నాచార్యసేవ = ఇక్కడ దైవసేవ అనే అర్థంలో ఉపయోగించబడింది; పరగ = ఆమోదయోగ్యంగా, సముచితంగా.
భావము: పలు చుట్టరికములు సత్య మార్గంలో అడ్డంకులను ఆహ్వానమే. ఆత్మను అర్థం చేసుకోవడంలో సంపూర్ణమైన, అచంచలమైన నిమజ్జనమే దైవసేవ. అదే జీవన్ముక్తి. ఓ వేంకటేశ్వరా! అభేద్యంగా నీవు ద్వంద్వ రూపంలో అగపడతావు. సముచితంగా ఈ తాత్కాలిక రూపాలన్నింటిలో నీవు మాత్రమే స్థిరమైన అస్థిత్వం.
వివరణము: బలిమి శ్రీవేంకటేశ పరగ రెండువిధాలు / నిలుకడయిన వాఁడవు నీవే యిన్నిటికి: మనకు మనమే ఏర్పరచుకున్న అడ్డంకులకు అతీతంగా, సత్యమును దాని ప్రతిబింబమును తేటపరచు కఠినమైన పరీక్షను సూచిస్తోంది.
‘రెండువిధాలు’ అనే పదం సత్యాన్ని ఇదమిత్థంగా ధృవీకరించలేమని చెబుతోంది. కొన్ని పజిల్స్'లో మనం అవాస్తవాన్ని/కానిదాన్ని తొలగించడం ద్వారా సమాధానాన్ని చేరుకున్నట్లు, దైవమును తెలియుటకు, వాస్తవం కాని దాన్ని జల్లెడపట్టి తొలగించాలి. అందుకే అన్నమాచార్యులు "ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము ప్రకటించి వొకటి చేపట్టరో వివేకులు"#3 అనే సవాలును విసిరారు. 'నాలోని అజ్ఞానము కనిపెడతాను' అని ప్రకటించే ధైర్యము కొద్దిమందికే ఉంటుంది.
Quo Vadis? నీ పయనమేటోయి?
చివరిగా, “ఊరికిఁ బోయెడి వోతఁడ కడు-చేరువ తెరు వేఁగి చెలఁగుమీ#4”
References
and Recommendations for further reading:
దేవుని వెదుకనవసరం లేదు.భ్రమలో పడి, బయట వెదకి ప్రయోజనం లేదు.నిర్మలమైన చిత్తముంటే దేవుడు మన చెంతే ఉన్నాడని తెలికొనగలమని అన్నమయ్య అంటున్నాడు.రెనే మాగ్రిట్టే గీచిన చిత్రం దీనికి దర్పణం పడుతోంది. అజ్ఞానతిమిరపు టంచుల్లో ఉన్న వేటగాళ్లు జ్ఞానప్రకాశాన్ని భౌతిక చక్షువులతో చూడలేక పోతున్నారు.
ReplyDeleteలౌకికమైన విషయజ్ఞానం పారమార్థిక జ్ఞానము నీయలేవు.సత్సాంగత్యం,
బ్రహ్మజ్ఞాన జిజ్ఞాస పరమార్థసాధనకు మార్గములు. మాగ్రిట్టే చిత్రం లో అధికభాగం ఖాళీగా వెలుతురుతో నిండియుంది.ఆ భాగము జ్ఞానప్రకాశాన్ని చూపిస్తోంది. చిత్తమాలిన్యంతో అజ్ఞానపు చీకటిలో చిక్కుకొని జ్ఞానము,సత్యస్వరూపము అయిన భగవంతుడి ప్రకాశాన్ని చూడలేకపోతున్నాము. ఇదే విషయాన్ని మాగ్రిట్టే తన చిత్రంలో అద్భుతంగా, సూక్ష్మంగా చిత్రీకరించాడు.
ప్రాపంచికవిషయ పరిజ్ఞానం కోసం చేసే ప్రయత్నమంతా వృథాయే. మనోవికారములకు, చింతలకు అదే మూలం.భక్తి, శ్రవణ, మనన, నిధి, ధ్యాసనలతో దైవాన్ని ఆశ్రయించు. మొక్షాన్ని సాధించుమని అన్నమయ్య గొప్ప ఆధ్యాత్మికోపదేశము నిస్తున్నాడు
ఈ అద్భుతమైన కీర్తనలో.
రెనే మాగ్రిట్టే "వార్తలు చదువుతున్న వ్యక్తి" చిత్రంలోని వ్యక్తి చుట్టూ జరిగే వార్తలను ప్రతిబింబిస్తున్నాడు కాని నిజమునకు వ్యక్తి గోచరము కాదు
ఓం తత్ సత్ 🙏🏻
కృష్ణ మోహన్ .