అన్నమాచార్యులు
168 సన్నపు నవ్వుఁజూపుల చల్లులాడి
for English
Version press here
Synopsis: మార్గము ఆకాశంలో కాదు, హృదయంలో ఉంది. –బుద్ధుడు
Summary of this Poem:
పల్లవి: సంజ్ఞలతో సున్నితమైన కదలికలతో
ప్రారంభమై, నవ్వుల
జూపులు చల్లి నన్ను తనలోనికి లాగుకొని నా అంచనాల ఆవలికి కొనిపోయినదీ తపము.
చరణము 1: ఏడు నిలువుల బంగారు మేడమీఁద నుండి నిన్నుఁ జూడ వేడుకై వీటిని
అతిశయించు చూపులతో, నీకు ఎదురుపడుటకు
వడిఁవడిఁగా బిత్తర చూపులు చూస్తున్న కన్య, అంతలో ఏ
రహస్యపు లోతుల నుండో వచ్చి ఆక్రమించితివిగా నా మనసంతా.
చరణము 2: కనీవినీ యెరుగని మాణిక్యాలు పొదిగిన ఆభరణాలతో అలంకరించబడిన ఒక
ప్రకాశవంతమైన ఆస్థానంలో, ముత్యాలతో
అలంకరించిన దుస్తులు ధరించి, నీ
రాక కోసం ఆత్రుతగా ఎదురుచూస్తూ, తన
కోరికలు నెరవేరాలని ఆమె హృదయం ఉప్పొంగిపోతూండగా, అప్పటికే ఈ తపము నా ఆలోచనలను ఎలా క్రమ్ముకున్నది నేను
గమనించలేకపోయాను.
చరణము 3: పుప్పొడితావులు చల్లు పూపొదరిళ్ళలో ఒక గుబ్బలాఁడి కొప్పు నన్నుఁ
బెట్టుమన్నది. నాకు తెలియకుండానే వెంకటేశ్వరా, నీవు నా లోకి ప్రవేశించి ఊహించని ఆనందాన్ని ఎడతెగకుండా
కలిగించావు.
Detailed Presentation
Introduction: అన్నమాచార్యుని చిత్తశుద్ధితో కూడిన చిత్రణలు సంక్లిష్టము మరియు అయోమయముగా అగుపించు ధ్యాన స్థితిని గురించి విలువైన అంతర్దృష్టులను అందిస్తాయి. అది కృషి ద్వారా సాధించలేనిదని, చెప్పాపెట్టకుండా తనంతట తానుగా, అనుకోకుండా మనలను ఆక్రమించుతుందని వెల్లడించారు. ధ్యాన మార్గమునకు మెట్లువేయు అద్భుతమైన ఉదాహరణగా ఈ కీర్తన చరిత్రలో నిలిచిపోతుంది.
ఈ వ్యాఖ్యానాల లక్ష్యం అన్నమాచార్యులు గ్రహించిన జీవిత పరమార్థాన్ని
అర్థం చేసుకోవడంలో, వారు నిర్దేశించిన వాటిని వున్నవివున్నట్లు వివరించడమే అని పాఠకులు గ్రహించి ఉండవచ్చు.
ఉద్వేగభరితమైన వర్ణనలు, ధ్యానముల మేళవింపుతో కూడిన ఈ కీర్తన సూటిగా వివరణకు తావు ఇవ్వకుండా సాంప్రదాయిక
అవగాహనను సవాలు చేస్తున్నట్లనిపిస్తుంది.
ధ్యానము ప్రక్షాళన అని మహానుభావులు తరచూ చెప్తారు, కాని దాని చర్యను పూర్తిగా అర్థం చేసుకున్నట్లు అనిపించదు. అన్నమాచార్యులు, జిడ్డు కృష్ణమూర్తిగారి ప్రకటనలలోని దగ్గరి పోలికలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఈ కవితలోని విషయాలు చూడగానే నాకు జిడ్డు గారు అన్న ఈ మాట గుర్తుకు వచ్చింది "ఇదే నా రహస్యం: నాకు ఏం జరిగినా నిరోధించను".
దీనికి పూర్తిగా వ్యతిరేకముగా ఏం జరిగినా నియంత్రించమని (కంట్రోల్ చేయమని) చిన్నప్పటి నుంచే మనకు నూరి పోస్తారు. రహస్యాలను దాచేందుకు నాలుకను అదుపులో పెట్టుకుంటాం. మన భావోద్వేగాలను నియంత్రించి విజయాన్ని అందుకోబోతాం. ప్రణాళిక వేసుకోవడం ద్వారా మన భవిష్యత్తును నియంత్రిస్తాం. అయినప్పటికీ, మన హృదయాలలో నిగూఢముగా, ప్రేమగా దాచుకున్న సిగ్గుమాలిన, అసభ్యకరమైన ఆలోచనలను ప్రపంచాన్నుంచి మరుగున వుంచ చూస్తాము. అయినా, ధ్యానము గురించి చర్చించాలనుకుంటాము!
'తెలిసిన దాని' నుండి 'అది యేమిటో తెలియని దాని' వైపు జరుపు ఊహాజనిత ప్రయాణమే ధ్యానము. కలుషిత హృదయాలతో ఇలాంటి అసంబద్ధమైన ప్రయాణాల వల్ల కలుగు ప్రయోజనము ఎవరైనా వూహించగలరు. ఈ ప్రయత్నాలు సంతృప్తినిస్తాయే కాని అవి సత్యము వైపు అడుగులు కావు. సాటిలేని హృదయ స్వచ్ఛతకు బదులేది?
ఇది అన్నమాచార్యుల అతి విశిష్టమైన కీర్తన. వారు మానవులంతా నమ్మి, వూహించు సుఖము స్వర్గము కేవలము భ్రాంతియేననిరి. మానవుడు మాయను దాటినప్పుడు తపస్సులో ప్రవేశించునని తెలిపిరను కోవచ్చు. ఈ విషయమునే ఈ కీర్తనలో సోదాహరణంగా తెలిపిరి.
ఈ కీర్తనలో, ముఖ్యంగా చివరి పంక్తులలో పదములు అతికినట్లు కనపడవు. కానీ అన్నమాచార్యులు అతి క్లిష్టమైన భావములను కలుపుచూ వ్రాసినదని తెలిసిన వెంటనే అందలి మాధుర్యము గోచరించును. అన్నమాచార్యుల సాటిలేని ప్రజ్ఞకు ఈ కీర్తనలు తార్కాణం కాజాలవు. మనము తృప్తి కొద్ది అలా అనుకొని సంతోష పడతాము.
కీర్తన:
రాగిరేకు: 11-2 సంపుటము: 5-63
|
సన్నపు నవ్వుఁజూపుల చల్లులాఁడి యిప్పు- డిన్నివిధముల మించె నిదివో తపము ॥పల్లవి॥ ఏడునిలువుల పైఁడిమేడమీఁద నుండి నిన్నుఁ జూడ వేడుకైన మించుఁజూపు లాడి వాడుచు నీకునెదురు వడిఁజూడ నంతలో నీ- వేడనుండో విచ్చేసితివిదివో తపము ॥సన్న॥ కొత్తలయిన మాణికపు కొలువుటోవరిలోన ముత్తేల చెఱఁగుదూలు మురువులాఁడి తత్తరానఁ దమకించి తరుణికోరికలెల్ల- నిత్తునని విచ్చేసితివిదివో తపము ॥సన్న॥ పుప్పొడితావులు చల్లు పువ్వులచప్పరములో కొప్పు నన్నుఁ బెట్టుమన్న గుబ్బలాఁడి తెప్పలుగ నినుఁగూడి తిరువేంకటేశ నిన్ను- నెప్పుడుఁ బాయకున్నదిదివో తపము ॥సన్న॥
|
Details and Explanations:
ముఖ్య పదములకు అర్ధములు: సన్నపు = సంజ్ఞలతో.
భావము: సంజ్ఞలతో
సున్నితమైన కదలికలతో ప్రారంభమై, నవ్వుల జూపులు చల్లి నన్ను తనలోనికి
లాగుకొని నా అంచనాల ఆవలికి కొనిపోయినదీ తపము.
వివరణము: తపస్సుపై సంక్లిష్టమైన ఆలోచనలను పరిచయం చేయడానికి ఎంత అందమైన, సొగసైన మార్గము ఎంచుకున్నారో. అన్నమాచార్యులు నిజంగా విప్లవాత్మకతను మేని నిండా కప్పుకున్న కవి.
తపస్సు ఒక భంగిమ కాదు, ఒక ప్రక్రియ కాదు, స్పృహతో చేరుకోగల విషయమూ కాదు. అన్నమాచార్యులు ఏ సంప్రదాయ భారతీయ దృక్పథాన్ని ప్రతిపాదించడం లేదు. సరికొత్త ప్రపంచాన్ని శిధిలావస్థలోనున్న ఈ ప్రపంచంతో సంబంధము పెట్టుకుని చేరగలమా? బహుశా తన కాలపు సమాజం నుండి, ముఖ్యంగా సాంప్రదాయకుల నుండి ప్రతిఘటనను నివారించడానికి తన పరిశీలనలను సంప్రదాయము అనే ముసుగులో దాచాడు అన్నమాచార్యుడు.
ఇప్పుడు చారిత్రక సంఘటనలను పరిశీలిస్తే, ఆయన కీర్తనలు "భారతదేశపు గొప్ప సంప్రదాయాన్ని అనుసరించడం
లేదు" అని ఉన్నత వర్గాలు, మేధావులు భావించి వాటిని పాడడాన్ని నిరుత్సాహపరిచి ఉండవచ్చని నేను
భావిస్తున్నాను. అత్యంత ప్రసిద్ధి చెందిన తిరుమల ఆలయ సముదాయంలోనే రాగిరేకులు దాచి వుంచినప్పటికీ ఈ కీర్తనలు చాలా కాలము అదృశ్య శక్తి చేత సంరక్షించబడటం కూడా గమనించదగినది.
భావము: ఏడు
నిలువుల బంగారు మేడమీఁద నుండి నిన్నుఁ జూడ వేడుకై వీటిని అతిశయించు చూపులతో, నీకు ఎదురుపడుటకు వడిఁవడిఁగా
బిత్తర చూపులు చూస్తున్న కన్య, అంతలో ఏ రహస్యపు లోతుల
నుండో వచ్చి ఆక్రమించితివిగా నా మనసంతా.
వివరణము: ఇతర వర్ణనలను ప్రక్కకుపెట్టి, ‘తపము’ యొక్క భాగంపై దృష్టి పెడదాం. ఇది ఎక్కడి నుంచో, అంటే అన్నమార్యులకు తెలియని చోటు నుంచి రావడం గమనించాల్సిన విషయం.
ఈ సందర్భముగా అన్నమాచార్యుల కీర్తన ‘అదిగాక నిజమతం బదిగాక యాజకం-బదిగాక హృదయసుఖ మదిగాక పరము’ (=పరము లేదా అన్యము అనునది మన అభిప్రాయాలు లేదా ఊహల కంటే వేరుగా, యజ్ఞము లేదా త్యాగముల మీద ఆధారపడక, మానవుని యే చేష్టలను ఆశ్రయించక ఉండి, ఊరట కూడా కలిగించక పోవచ్చు) మననము చేసుకోతగ్గది.
జిడ్డు కృష్ణమూర్తి జీవిత కథ చదివితే ఇలాంటి అవగాహనయే కలుగుతుంది. వారిని ఎల్లప్పుడూ 1923 ప్రాంతాల నుంచి "ప్రక్రియ" వెంటాడేది, ఇది అత్యంత బాధాకరముగాను, అనూహ్యముగాను, తరచుగా అతన్ని పూర్తిగా అలసిపోయేలా, నిస్సత్తువును చేసి వదలి వెళ్ళేది. తర్వాతి కాలంలో ఆయనకు కొంతమేర అలవాటైపోయింది. ఇప్పుడు ఈ కీర్తనలో “ధ్యానము ఒక ఊహించలేని చర్య” అనడంలోని సారూప్యతలను దయచేసి గమనించండి.
అందువలన జిడ్డు వారు, అన్నమాచార్యులు ఇద్దరూ తమ సంకల్పాన్ని ప్రకృతి శక్తులకు వదిలేశారని చెప్పవచ్చు. అయితే, మనము అందుకు భిన్నంగా మనస్సును నియంత్రించడం ద్వారా జీవిస్తాము.
భగవద్గీత కూడా నియంత్రణను సూచించలేదు. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ॥ 3-33 ॥ భావము: వివేకవంతులు (లోక జ్ఞానము కలిగినవారు) కూడా తమ ప్రకృతి స్వభావము ననుసరించి ప్రవర్తించుచున్నారు. అన్ని ప్రాణులు తమ తమ సహజ ప్రవృత్తికి అనుగుణంగానే నడుచుకుంటాయి. కావున నిగ్రహమేమి చేయగలదు?
అందువలన, నియంత్రణ కాదు, హృదయ స్వచ్ఛత అత్యంత ముఖ్యం. అన్నమాచార్యుడు, బుద్ధుడు జిడ్డు కృష్ణమూర్తి, ఏసుక్రీస్తు సూచించిన మార్గము కూడా ఇదే.
ముఖ్య పదములకు అర్ధములు: కొలువుటోవరి = కొలువుండు ప్రదేశము; ముత్తేల చెఱఁగుదూలు = ముత్యములతో ఒప్పారు వస్త్రపుటంచులు; మురువులాఁడి = సౌందర్యము తొలుకుచుండగా; దమకించి = తమకము చిందులేయగా.
భావము: కనీవినీ యెరుగని మాణిక్యాలు
పొదిగిన ఆభరణాలతో అలంకరించబడిన ఒక ప్రకాశవంతమైన ఆస్థానంలో, ముత్యాలతో అలంకరించిన దుస్తులు ధరించి, నీ రాక కోసం ఆత్రుతగా ఎదురుచూస్తూ, తన కోరికలు నెరవేరాలని ఆమె హృదయం ఉప్పొంగిపోతూండగా, అప్పటికే ఈ తపము నా ఆలోచనలను ఎలా క్రమ్ముకున్నది నేను
గమనించలేకపోయాను.
వివరణము: "కొత్తలయిన మాణికపు కొలువుటోవరిలోన ముత్తేల చెఱఁగుదూలు మురువులాఁడి తత్తరానఁ దమకించి తరుణికోరికలెల్ల-నిత్తునని" అనునది మానవులుగా మనము నిర్మించుకొన్న వూహా జనిత సౌధము అని అచార్యుల వుద్దేశ్యమై వుండవచ్చు.
అన్నమాచార్యులు ప్రకృతి తనలో కలుగజేస్తున్న చర్యలను గమనించలేకపోతిననిరి. జిడ్డు, అన్నమాచార్యులు ఇద్దరూ శ్రోతలకు ఆలోచనలు రేకేక్తించు బీజములను తెలియమని, ఆలోచనల నియంత్రణకు వుసిగొల్పు దానిని కనుక్కోమని సవాలు విసిరారు. మనము నిస్సారమైన జీవితాన్ని గడుపుతున్నామని వారెప్పుడూ ఉద్ఘాటించారు. ఇంద్రియముల గ్రహణకు ఆవల, పాపపుణ్యాల మీమాంసకు మించిన జీవనమొకటుందని వారు నిర్ధారించారు.
సాల్వడార్ డాలీ రచించిన 'ది ఎలిఫెంట్స్
- ఏనుగులు' అనే ఆకర్షణీయమైన కళాఖండాన్ని మీకు పరిచయము చేయనివ్వండి. ఈ అచ్చెరువుగొలుపు చిత్రములో, డాలీ భారమును మరియు దాని నిర్మాణాన్ని నైపుణ్యంగా జత చేశాడు, సున్నితమైన, పొడవైన కాళ్ళపై, కొంతవరకు
సాలీడు అనిపించునట్లు, విపరీతమైన భారాలను మోస్తున్న ఏనుగులను
చిత్రీకరించాడు. ఉద్దేశపూర్వకంగా వాటి రూపును వక్రీకరించడం ద్వారా, అతను చిత్రలేఖనంలోని ప్రతీకాత్మకతను పెంచుతాడు. రోమ్ లోని శాంటా మారియా చర్చి
సమీపంలో ఉన్న మినర్వా పుల్సినో విగ్రహాన్ని 'ఒబెలిస్కులు (= నాలుగుప్రక్కలు
గలిగిఉన్నతమై పైభాగము మొనతేలి యుండు స్తంభము)' నేరుగా సూచిస్తాయి.
ఈ ఒబెలిస్కులు జ్ఞానాన్ని సూచిస్తాయి మరియు లేజర్ లాంటి తీక్షణమైన దృష్టిని కలిగి ఉంటాయి.
ఇంకా, ప్రకాశవంతమైన నేపథ్యం కాటలోనియా (డాలీ గారి స్వస్థలం) యొక్క
సుందరమైన ప్రకృతి దృశ్యాల నుండి ప్రేరణ అని విశ్లేషకుల అభిప్రాయము.
ఈ కళాఖండం అద్భుతమైన ఏనుగులపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించడం ద్వారా డాలీ గారి ఇతర చిత్రముల నుండి భిన్నంగా ఉంటుంది. మిగిలిన చిత్రము దాదాపు బంజరుగా ఉండి ఉద్దేశపూర్వకంగా ఏనుగుల వైపు దృష్టిని మరలిస్తుంది.
పై చిత్రరాజములో, మరొక గమనింపదగిన అంశం ఒబెలిస్కులను చేర్చడం. తొలిచూపులో ఏనుగులు ఈ స్తంభాలను మోసుకెళ్తున్నట్లు అనిపించినా నిశితంగా పరిశీలిస్తే అవి గాల్లో వేలాడుతున్నట్లు స్పష్టమవుతోంది. వాటిని మొయ్యాల్సిన బాధ్యత ఏనుగులపై ఉండదని చిత్రకారుడు స్పష్టం చేశాడు.
భద్రత కోసం అన్వేషణలో, మానవులు మానసిక నిర్మాణాలను నిర్మిస్తారు, స్థిరత్వం అను దృఢమైన భూమి నుండి క్రమంగా తమను తాము దూరం చేసుకుంటారు. పెయింటింగ్’లో చిత్రించినట్లుగా, ఈ అంచలంచెల రక్షణ అను ఆరోహణ పైచిత్రములోని ఏనుగులను పోలిన స్థితికి దారితీస్తుంది- ప్రమాదకరంగా అస్థిరమైన స్థితిని చేరుకుని అక్కడనుండి బేలన్స్ చేయబోతాడు. తంటాలు పడతాడు.
ఈ విధంగా అస్థిరత నిత్యము వేధిసుండగా మనసున సౌఖ్యము గానక, స్థిరత్వాన్ని సాధించుటకు పడరాని పాట్లు పడతాడు, కానీ తానెక్కిన ఆశల సౌధమును దిగిరాడు మానవుడు. ఈ నేపథ్యంలో, జీవించుటను మరచి, సర్దుబాటు చర్యలలో కాలము వ్యర్థము చేస్తాడు. అద్భుత అవకాశం జారవిడుస్తాడు.
పై చిత్రములో ఒబెలిస్క్'తో ( ధర్మమును, సత్యమును) అవి తమను తాము రక్షించుకో గలవని, మనిషి మోయు భారము కాదని బొమ్మలో తెలిపిరి. అనగా అనేక వ్యయప్రయాసలకోర్చి ధర్మ మార్గమున నిలువ పనిలేదనిరి. మనిషి చేయవలసినదంతా ధర్మము వైపు హృదయముంచిన చాలు.
ఆ చిత్రములోని ఏనుగుల మాదిరిగా అర్థంలేని రక్షణ కవచములకు వూతమునిస్తూ సహజసిద్ధమైన స్థితినుండి దూరముగా జరిగి పోతాము. ఇక ప్రకృతి మనపై జరుపు చర్యలు అసంగతము లనిపిస్తాయి. ఇట్టి మనము సాధించునదేమి?
పదములకు అర్ధములు: పువ్వులచప్పరములో= పూపొదరిళ్ళలో; గుబ్బలాఁడి
= యవ్వనవతి;
భావము: పుప్పొడితావులు చల్లు పూపొదరిళ్ళలో ఒక గుబ్బలాఁడి కొప్పు నన్నుఁ బెట్టుమన్నది. నాకు తెలియకుండానే వెంకటేశ్వరా, నీవు నా లోకి ప్రవేశించి ఊహించని ఆనందాన్ని ఎడతెగకుండా కలిగించావు.
వివరణము: "పుప్పొడితావులు చల్లు పువ్వులచప్పరములో"తో భూమి యంతయు సారవంతముగా, వెదజల్లిన విత్తులు యే విధమైన సహాయము లేకయే మొలచినట్లు, అనేకానేక జీవుల మందలతో ఒప్పుచున్నదని నా అభిప్రాయము. "కొప్పు నన్నుఁ బెట్టుమన్న గుబ్బలాఁడి"తో సృష్టియంతయు అనుభవించు అని పిలుచుచున్నట్ల నిపించునని తెలిపిరి. 'నినుఁగూడి తిరువేంకటేశ'ను వేంకటేశ్వరునిలో కలసిపోయిన అను అర్ధములో వాడారు.
అన్నమాచార్యులు ఈ కీర్తనలను మనం
విని ప్రక్కన పడవేయటానికి వ్రాయలేదు. వారు, మన ప్రస్తుత జీవనవిధానాన్ని కూలంకషంగా
పునఃపరిశీలించాలని విఙ్ఞప్తి చేశారు. సత్యమును యిదమిద్ధముగా నిర్ధారించలేమని వివరించే
విశ్వప్రయత్నం చేశారు.
మానవుడు తాను ఊహించుకొన్న సుఖము కేవలం మాయ లేక అవిద్యయేనని, ఆ మాయను తపస్సు లేదా ధ్యానము ద్వారా తరించి ఆవలివైపుకు ప్రవేశిస్తాడని అన్నమయ్య యొక్క ఈ విశిష్టమైన కీర్తనలో స్పష్టంగా తెలియజేస్తున్నారు.
ReplyDeleteఇట్టి ధ్యానస్థితి యేవిధమైన సాధన చేయకుండా, తనంతట తానుగా మన చిత్తమును ఆక్రమిస్తుందని అన్నమయ్య తెలుపుతున్నారు.మలినచిత్తముతో ధ్యానమనే ప్రయాణ ప్రయత్నము చేస్తున్న మానవులకు తాత్కాలికమైన సంతృప్తి లభిస్తుందే కాని అట్టి ప్రయత్నము నిత్యము, సత్యము అయిన పరమోత్కృష్టమైన ఆనందము నిచ్చునది కానేకాదని అంటున్నారు అన్నమయ్య. అంటే స్వచ్ఛత లేని హృదయంతో చేసే సాధనలు గమ్యస్థానమును చేర్చలేవని
హృదయస్వచ్ఛతకు సాటి యేదీ లేదని, పరమానందము నిచ్చునదదియేనని భావం.
భగవద్గీతలో పరమాత్మ అనుగ్రహించిన శ్లోకం ఇక్కడ స్మరణీయము.
*సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి|*
*ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి||*
(గీత 3-33)
"వివేకవంతులు కూడా తమ ప్రకృతి స్వభావము ననుసరించి పనులు చేస్తారు.సకల ప్రాణులు తమ తమ సహజ ప్రవృత్తికి అనుగుణంగా నడుచుకుంటాయి. దీనిని నిగ్రహించటం వల్ల ఏమి ప్రయోజనం?"
అన్నమయ్య తెలియజెప్పే తపస్సు సాధారణంగా సాధనతో, వేర్వేరు భంగిమలతో చేసే తపస్సు కాదు.ధ్యాన స్థితిని కృషితో సాధించలేనిదని,తనకు తానుగా మనయొక్క నిమిత్తము లేకుండా మనల నాక్రమించేదని అన్నమాచార్యులు స్పష్టం చేస్తున్నారు.
అందువలన నియంత్రణ ప్రధానం కాదు. నిర్మలచిత్తము పరమాత్మ సన్నిధిని చేరుకొనుటకుఅత్యంత ప్రధానము
అన్నమయ్య విశిష్టమైన అట్టి తపస్సును ఒక కన్యగా personify చేసి ఆ కన్య సున్నితమైన కదలికలతో,నవ్వులు కురిసే చూపులతో తనకు తెలియకుండానే తనలోకి లాగుకొని మాయ యొక్క ఆవరణమును దాటి ఆవలికి మాయాతీత స్థితికి గొనిపోయిందని,తనకు తెలియకుండానే సప్తగిరివాసుడు,మణిమాణిక్యఖచిత ఆభరణములు కలవాడు,చీనిచీనాంబరధారి యైన శ్రీనివాసుడు తనలోకి ప్రవేశించి ఎన్నడూ ఊహించని పరమానందమును ఎడతెగకుండా కలిగించిందని అంటున్నారు. ఇది అనుభవైకవేద్యమే.
ఓమ్ తత్ సత్ 🙏🏻🙏🏻🙏🏻
కృష్ణ మోహన్