Saturday, 24 June 2023

T-169 ఆపదల సంపదల నలయు టేమిట మాను

 అన్నమాచార్యులు

169 ఆపదల సంపదల నలయు టేమిట మాను

for English Version press here 

 

సంగ్రహంగా: మానవా, నీ అనవసరపు అటమటలేమిటికి? అన్నమాచార్యులు

 

కీర్తన సారాంశం:

పల్లవి: ఆపదలతో కూడినదైననూ సంపద మరియు ద్రవ్య లాభములపై మాత్రమే దృష్టి సారించిన జీవితముకై అలసిపోని అన్వేషణను మానవుడు ఎటులమానును? అది అన్నివిధములుగానూ రోత పుట్టించు సంగతి తనకుతాను ఋజువుచేసుకున్నప్పుడు గానీ. అన్వయార్ధమునరుడా! కాలములు మారుతున్నా మారని దానిని గుర్తించగలవా?

చరణము 1: రోగానికి మూల కారణాన్ని పరిష్కరించడానికి మందులు సేవించక పోతే ఎవరైనా ఎలా కోలుకోగలరు? తన దేహ గుణములను తెలిసి మానుపింపక​, కృశింపక యున్న అడియాసలు తనను బాధించక​, ఇబ్బందిపెట్టక వూరుకుంటాయా?

చరణము 2: సాటిలేని మేటి సౌఖ్యమును ఆస్వాదించకపోతే, వారు నిజంగా పాపములను పోగుచేయడమను దుఃఖం నుండి విడివడలేరు. కాంతి ప్రకాశించే మార్గాన్ని గ్రహించడానికి వారు తమ కళ్ళకు అలవాటు చేయకపోతే, వారు కరుకైన మోహంధకారముల  వల్ల కలిగే వేదనను భరిస్తారు.

చరణము 3: భూమ్మీది జీవితం, అటు పైలోకంలోని జీవితం అనే ద్వంద్వములను పెంచు ఆలోచనల నుంచి బయటపడకపోతే మనిషి మరణంతో పెనవేసుకుపోయిన తన జీవితాన్ని కొనసాగిస్తాడే! మనస్పూర్తిగా వేంకటేశ్వరుని సేవలో నిమగ్నమైతే తప్ప, తనకు సంకెలలు వేయుచున్న అరుదైన బంధాలను ఎలా తెంచుకుంటాడు

 

 

విపులాత్మక వివరణ

ఉపోద్ఘాతము: అన్నమాచార్యుల ఆధునిక దృక్పథమును ఉటంకించుటకు ఈ ఒక్క కీర్తన సరిపోతుంది. ఇక్కడ వారు ఒక  శాస్త్రవేత్త వలె మూలకారణాన్ని కనుగోమంటారు. కవిత్వ చరిత్రలో హేతుబద్ధతకు స్థానముంటే, "తపము నాచరించుటకు ఎటువంటి తపన అవసరమో" ఒక క్రమ పద్ధతిలో వివరించువాటిలో ఈ కీర్తన  ప్రత్యేకమైనదిగా, ఆ మార్గమున శిఖరాగ్రమునకు చెందినదిగా భావించవచ్చును.

 

కీర్తన:
రాగిరేకు:  24-1 సంపుటము: 1-143
ఆపదల సంపదల నలయు టేమిట మాను
రూపింప నిన్నిటను రోసిననుఁ గాక॥పల్లవి
 
కడలేని దేహరోగంబు లేమిట మాను
జడను విడిపించు నౌషధసేవఁ గాక
విడవ కడియాస తను వేఁచు టేమిట మాను
వొడలి కల గుణమెల్ల నుడిగిననుఁ గాక ॥ఆపదల॥
 
దురితసంగ్రహమైన దుఃఖ మేమిట మాను
సరిలేని సౌఖ్యంబు చవిగొన్నఁ గాక
కరుకైన మోహంధకార మేమిట మాను
అరిది తేజోమార్గ మలవడినఁ గాక ॥ఆపదల॥
 
చావుతో బెనగొన్న జన్మ మేమిట మాను
యీవలావలి కర్మ మెడసినఁ గాక
భావింప నరుదైన బంధ మేమిట మాను
శ్రీవేంకటేశ్వరుని సేవచేఁ గాక ॥ఆపదల॥ 

 

Details and Explanations:

ఆపదల సంపదల నలయు టేమిట మాను
రూపింప నిన్నిటను రోసిననుఁ గాకపల్లవి

ముఖ్య పదములకు అర్ధములు: రూపింప = నిరూపించు, రూఢిచేయు; రోసినను = రోత కలిగిన.

భావము: ఆపదలతో కూడినదైననూ సంపద మరియు ద్రవ్య లాభములపై మాత్రమే దృష్టి సారించిన జీవితముకై అలసిపోని అన్వేషణను మానవుడు ఎటులమానును? అది అన్నివిధములుగానూ రోత పుట్టించు సంగతి తనకుతాను ఋజువుచేసుకున్నప్పుడు గానీ.

వివరణము: కొంత క్లిష్టముగా వున్న యీ పల్లవిని సులభముగా అర్ధము చేసుకొనుటకు, ఇక్కడ ప్రస్తావించిన విషయాలు స్పష్టం చేయడానికి, హెన్రీ రూసో వేసిన 'ది డ్రీమ్ (కల)' పేరుతో వున్న ఒక అందమైన పెయింటింగ్‌ ఆధారముగా వివరించబోతాను. ఈ పెయింటింగ్ తయారు చేసిన సమయంలో అధివాస్తవికత (surrealism) ఇంకా ఉద్భవించలేదు మరియు క్యూబిజం బాల్య దశలో ఉంది. క్యూబిజం, సర్రియలిజంల ఆనవాళ్ళు కలిగిన ఈ అసాధారణమైన ఆధునిక పెయింటింగ్ చిత్రకళలో కొద్దిగానే ప్రవేశమున్న హెన్రీ రూసో వేశారంటే నమ్మబుద్ధికాదు. ఆ నాటి చిత్ర జగత్తు ముందు విస్మరించినా యీ కళాఖండములోని స్వతస్సిద్ధ సౌందర్యము మొదట్లో వచ్చిన​ ఆటుపోటులను అధిగమించి సర్వత్రా కొనియాడబడింది.  చిస్మరణీయమైన చిత్రరాజమైంది.



ది డ్రీమ్ (కల)లో యాద్విఘా (లేదా జడ్విగా, రూసో యొక్క కలల సుందరి), పెయింటింగ్‌కు ఎడమవైపు సోఫాలో నగ్నంగా వాలివుండి అప్పుడే కల నుండి కన్నులు తెరచి, తామర పువ్వులతో సహా పచ్చని ఆకులతో నిండి వున్న ప్రకృతి దృశ్యాన్ని అస్వాదించుచున్న దనిపిస్తుంది. పక్షులు, కోతులు, ఏనుగు, సింహం, సివంగి మరియు పాముతో సహా అనేక జంతువులు దర్శనమిస్తాయి.

రూసో గారి వివరముల పట్ల ఖచ్చితమైన  శ్రద్ధ, వాడిన ప్రకాశవంతమైన రంగులు, అనేక  ఛాయలలోని పచ్చని ఆకుల గుబురులు మనసును కట్టిపడవేస్తాయి. ఆ స్త్రీ యొక్క ఆకృతిని  జాగ్రత్తగా రెండరింగ్ చేయడం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె చుట్టూ ఉన్న విలక్షణమైన మొక్కలు మరియు పువ్వులలో ఆమెను, ఆమె కూర్చున్న సోఫాను ఆ వాతావరణంలో  గొప్పగా లీనమయ్యేటట్లు  చూపారు. మనకు కపడుతున్న దృశ్యమునకు నేపథ్యములో చంద్రకాంతి కనపడి కనబడని అస్పష్టతని కనబరుస్తూ చిత్రము యొక్క కూర్పుకు ఒక అతీంద్రియ స్పర్శను జోడిస్తుంది.

ఆ నగ్న యువతి ఎడమ చేయి సింహాల వైపుకో   లేదా ముదురు రంగు చర్మంతో వేణువు వాయిస్తున్న అటవీకుని వైపుకో చాచినట్లనిపిస్తుంది. అటవీకుడు చిత్రము మధ్యలోనే వున్నా చంద్రుని మసక వెలుతురులో, అడవిలో పేరుకున్న చీకటిలో ఆతడి రంగు నేపథ్యములో కలిసిపోయి కేవలము కేవలము రూపును మాత్రము పోల్చుకోగలుగుతాము. అతడు ధరించిన రంగురంగుల దుస్తులు మాతము కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. క్రింది భాగము గులాబీ రంగు గల నల్లని పాము ఆకుల గుబుర్ల గుండా జారిపోతోందా అనిపిస్తుంది. దాని శరీరపు వంకీలు ఆ స్త్రీ వంపులను ఒకే విధముగా చూపారు.

యాద్విఘా మనలోని కట్టలు తెంచుకోబోతున్న కోరికలను సూచిస్తుంది, ప్రత్యేకించి మనము అడవిలో కూడా  అందమైన​, విలాసవంతమైన సోఫాలో కూర్చుని, చుట్టూవున్న వాతావరణముతో సంబంధము లేకుండా ఆస్వాదించాలని చూచు ప్రవృత్తిని చూపుతుంది. తనకు సేవ చేయడానికి అందరూ ఉన్నారని మనిషి భావిస్తాడు. ఇతర మనుషులు మనకు సేవ చేయాలనే మన చీకటి కోరికలను ది డ్రీమ్ (కల) చెబుతుంది.

అందువల్ల, "ది డ్రీం" పెయింటింగ్ సౌకర్యం మరియు భద్రతలకు ప్రాధాన్యతనిస్తూ సహజత్వాన్ని నేపధ్యంలోకి నెడుతున్న మన కృత్రిమ జీవితాన్ని సూచిస్తుంది. అన్నీ సొంతం చేసుకోవాలనే కోరిక మనల్ని ఊహలకు మించి ముందుకు నడిపిస్తుంది. పర్వతాలు, సముద్రాలు మనల్ని ఆపలేవు. యద్విఘా లాగానే ఈ ప్రపంచంలోని సహజ నేపధ్యంలో మనం అసహజంగా జీవిస్తాము.

"ది డ్రీం"లో బట్టలు లేని స్త్రీ మరియు మచ్చిక చేసుకోలేని అరణ్యం యొక్క సమ్మేళనం పలాయనవాదం యొక్క ఆకర్షణను మరియు గాఢమైన ఊహలు మనిషి మనసును వంచింప చేసే విధమును నొక్కి చెబుతాయి. హెన్రీ రూసో నైపుణ్యంగా వీక్షకులను వాస్తవికత మరియు ఫాంటసీల మధ్య అతుకుల్లేని లోకంలోకి తీసుకువెళతాడు. ధ్యానము మరియు ఆత్మపరిశీలనలకు కొంత సమయాన్ని కేటాయించమని ఎత్తి చెబుతాడు.

అన్వయార్ధము:  నరుడా! కాలములు మారుతున్నా మారని దానిని గుర్తించగలవా?

 

కడలేని దేహరోగంబు లేమిట మాను
జడను విడిపించు నౌషధసేవఁ గాక
విడవ కడియాస తను వేఁచు టేమిట మాను
వొడలి కల గుణమెల్ల నుడిగిననుఁ గాక ॥ఆపదల॥ 

ముఖ్య పదములకు అర్ధములు: కడలేని = అంతులేని; జడను = మూలమును; వేఁచు = బాధించు, ఇబ్బందిపెట్టు; ఉడిగి = అడుగంటి

భావము: రోగానికి మూల కారణాన్ని పరిష్కరించడానికి మందులు సేవించక పోతే ఎవరైనా ఎలా కోలుకోగలరు? తన దేహ గుణములను తెలిసి మానుపింపక​, కృశింపక యున్న అడియాసలు తనను బాధించక​, ఇబ్బందిపెట్టక వూరుకుంటాయా?

వివరణము: 'రోగంబు'తో మానవునివేధించు మాయరోగమును సూచించారు ఆచార్యుల వారు.

దురితసంగ్రహమైన దుఃఖ మేమిట మాను
సరిలేని సౌఖ్యంబు చవిగొన్నఁ గాక
కరుకైన మోహంధకార మేమిట మాను
అరిది తేజోమార్గ మలవడినఁ గాక ॥ఆపదల॥ 

ముఖ్య పదములకు అర్ధములు: దురితసంగ్రహమైన = పాపములను పోగుచేయడమను; కరుకైన = పదునైన నొప్పి కలిగించునట్టి; అరిది = దుర్లభము, అపురూపము  

భావము: సాటిలేని మేటి సౌఖ్యమును ఆస్వాదించకపోతే, వారు నిజంగా పాపములను పోగుచేయడమను దుఃఖం నుండి విడివడలేరు. కాంతి ప్రకాశించే మార్గాన్ని గ్రహించడానికి వారు తమ కళ్ళకు అలవాటు చేయకపోతే, వారు కరుకైన మోహంధకారముల  వల్ల కలిగే వేదనను భరిస్తారు.

చావుతో బెనగొన్న జన్మ మేమిట మాను
యీవలావలి కర్మ మెడసినఁ గాక
భావింప నరుదైన బంధ మేమిట మాను
శ్రీవేంకటేశ్వరుని సేవచేఁ గాక ॥ఆపదల॥

భావము: భూమ్మీది జీవితం, అటు పైలోకంలోని జీవితం అనే ద్వంద్వములను పెంచు ఆలోచనల నుంచి బయటపడకపోతే మనిషి మరణంతో పెనవేసుకుపోయిన తన జీవితాన్ని కొనసాగిస్తాడే! మనస్పూర్తిగా వేంకటేశ్వరుని సేవలో నిమగ్నమైతే తప్ప, తనకు సంకెలలు వేయుచున్న అరుదైన బంధాలను ఎలా తెంచుకుంటాడు?

వివరణము: మనలో చాలా మందికి   కచ్చితంగా 'ఎక్కడికో వెళ్లాలి' అనే భావన ఉంటుంది. కానీ మనం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదనేది పచ్చి నిజం. "అయ్యా, మీరు వెతుక్కునే మార్గం, మీ గమ్యానికి దారితీసే మార్గం ఇప్పటికే మీలో ఉంది" అంటూ అన్నమాచార్యులు ఊరికిఁ బోయెడి వోతఁడ కడు / చేరువ తెరు వేఁగి చెలఁగుమీఅని చెప్పిరి.

హిల్మా ఆఫ్ క్లింట్ రచించిన “Swan No 17 లేదా 17వ హంస​” అనే సింబాలిక్ పెయింటింగ్ ద్వారా ఈ చరణం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. మొదటి చూపులో, ఇది పిల్లల  పుస్తకాల్లో స్కెచ్'లలో రంగులు  పూరించినట్లు కనిపించవచ్చు. అయితే, ఇది 1.5 మీ ‍x 1.5 మీ పరిమాణము గల​ భారీ పెయింటింగ్ అని మీరు గమనించవచ్చు.



అర్థం చేసుకోవడానికి కష్టమైనది మరియు మౌఖికంగా చెప్పడానికి అనుకూలించని విషయాన్ని వ్యక్తీకరించడానికి ఆమె ఈ రేఖాచిత్రాలను కష్టపడి వేసింది. పైపైన విడిపోయినట్లు కనబడినప్పటికీ ఆ చిత్రము జీవితం యొక్క సంపూర్ణతను సూచిస్తుంది. క్రింది భగవద్గీత శ్లోకానికి అర్థం కూడా ఇదే: భగవద్గీత శ్లోకం అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితమ్ । భూతభర్తృ చ తద్ జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ 13-17 భావము: ఆయన విభజించుటకు వీలులేని వాడు, అయినా సర్వప్రాణులలో వేర్వేరుగా కనిపిస్తూ ఉంటాడు. ఆ పరమేశ్వరుడే, సమస్త భూతములకు (ప్రాణులకు) సంరక్షకుడు-పోషకుడు, లయకారకుడు మరియు సృష్టికర్త అని తెలుసుకొనుము.

గొప్ప ప్రఖ్యాతి గడించిన భౌతిక శాస్త్రవేత్తలు డోనాల్డ్ హాఫ్మన్, క్వాంటమ్ భౌతిక శాస్త్రవేత్త ఎర్విన్ ష్రోడింగర్ "విశ్వంలోని మొత్తం మనస్సుల సంఖ్య ఒక్కటే" అని విశ్వసించారు. అంటే ఆ విశ్వజనీనమైన మనస్సు సమస్తమునకు కారణమవుతుంది.

మన అంతరంగంలో లోతుగా, మనకు కంటికి కనిపించే దానికంటే మనమే ఎక్కువ లేదా అధికులమనే అహంభావమును కలిగి ఉంటాము. ఈ స్వాభావిక భావము మానవజాతిని తరచుగా సమగ్రమైన చర్యను అర్థం చేసుకోకుండానే మార్పు కోసం ప్రయత్నించె దిశగా నడిపిస్తుంది. ఇటువంటి తప్పుదారి పట్టించే ప్రయత్నాల పర్యవసానాలు ప్రపంచవ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తాయి, అందరికీ కనిపిస్తాయి.



ఈ పెయింటింగ్'లో హిల్మా అఫ్ క్లింట్ యొక్క ఉద్దేశ్యం చిత్రము మధ్యలో ఒక చిన్న త్రిభుజాన్ని ఉంచడం ద్వారా స్పష్టమవుతుంది, ఇది నిలువు అక్షం రెండు వైపులా సమనముగా వుంచబడింది. (పై బొమ్మని చూడండి). ఈ త్రిభుజంలోని రంగులు పెద్ద పటంలో కనిపించే రంగులకు విరుద్ధంగా ఉండటం గమనించవచ్చు. ఈ త్రిభుజం మానవాళి యొక్క వంగని, చెప్పినట్లు వినని మానసిక భంగిమను సూచిస్తుంది. ఇది హంస యొక్క అందమైన అద్భుతమైన  వంపుసొంపులకు ఆకర్షణియమైన రంగులకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. దీన్నిబట్టి, ప్రకృతితో సామరస్యంగా మమేకమై "ఒకే మనస్సు"తో ఐక్యతా స్థితిని సాధించడానికి మానవుడు మరింత సరళమైన, మృదువైన దృక్పథాన్ని పెంపొందించుకోవడం కీలకమని క్లింట్ సూచిస్తున్నారని మనం ఊహించవచ్చు.

"ఇదే నా కిటుకు: నాకు ఏం జరిగినా  అడ్డుపెట్టను" అన్న జిడ్డు కృష్ణమూర్తి మాటలతో దీన్ని పోల్చి చూద్దాం. దీనికి విరుద్ధంగా, మన మనస్సు తరచుగా ఏమి జరుగుతుందో ఆలోచిస్తుంది. ఆదుర్దా పడుతుంది. లేనిపోని చింతలకు గురియౌతుంది. ఈ రకంగా "ఏమి జరిగినా పట్టించుకోని మనస్సును" పె౦పొ౦ది౦చుకోవడ౦ ఎ౦త ముఖ్యమో అర్థ౦ చేసుకోవచ్చును. ఇది వ్యక్తిగత దృక్పథానికి సంబంధించిన విషయం అయినప్పటికీ,ఏది” “దేనిలోమార్పు తేవలెననునది అతి పెద్ద సమస్య​. ఇదే భావన భగవద్గీతలోని ఒక శ్లోకంలో కూడా వ్యక్తమవుతుంది. న హ్యసంన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన (6-2) భావము కేవలం దృఢ సంకల్పం మీద ఆధారపడటం ద్వారా ఒక వ్యక్తి నిజంగా యోగి కాలేడు అనేది శ్లోకం యొక్క తాత్పర్యము. 

ఉపరితల స్థాయి మార్పులకు అతీతంగా నిజమైన పరివర్తన లోతైన స్థాయిలో జరగాలని సూచిస్తూ, త్రిభుజాన్ని కేంద్రంలో ఉంచడం ద్వారా ఆఫ్ క్లింట్ మరొక ముఖ్యమైన ప్రతిపాదన చేసింది. ఇదే భావన అన్నమాచార్యుని 'భావింప నరుదైన బంధ మేమిట మాను' అను మాటల్లో ప్రతిధ్వనిస్తుంది. ఐతే రూపాంతరం అనేది ఒక వివిక్త (ఏకాంత) ప్రక్రియ కాదని, విశ్వజనీన మేధస్సుతో విలీనం కావడానికి వ్యక్తిగత ఆత్మ  అనే భావన అడ్డుపడుతుందని ఇద్దరు కళాకారులు వ్యక్తపరుస్తారు. విచిత్రమేమో కానీ తరతరాలుగా ఈ లోతైన భావన మానవాళిలో ఆసక్తిని రేకెత్తిస్తూనే వుంది. బహు కొద్దిమంది మాత్రమే ఇందలి సవాళ్ళను పూర్తిగా స్వీకరించి తేజోమార్గమున పయనించ గలిగారు.

 

 

-x-x-x-

1 comment:

  1. మనిషి భోగేచ్ఛతో ఇడుములు, ఇక్కట్లున్నా సంపాదనపైనే దృష్టిని పెట్టి
    వాటికై వెదుకులాట జీవితమంటే రోతయని స్వానుభవమున గ్రహించే వరకు మానుకోడని, అనుభవిస్తే గాని తత్త్వం అనుభవం కాదని అన్నమయ్య
    పల్లవిలో స్పష్టంగా తెలియజేస్తున్నాడు.

    హెన్రీ రూసో చిత్రంలో సోఫాలో నున్న నగ్నయువతి పచ్చని వృక్షజాలము, జంతువులు, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఉండటం సహజత్వాన్ని వెనుకకు నెడుతున్న మానవుని కృత్రిమజీవితాన్ని సూచిస్తున్నది.కీర్తనలోని పల్లవి భావాన్ని రమ్యమైన ఈ చిత్రం బహిర్గతం చేస్తోంది.

    మోహమనే ఈ గుణాన్ని కృశింపజేయకుండా ఉంటే మానవుని వేధించే ఈ "మాయరోగము"ను నివారించుట అనేది రోగకారణాన్ని తెలిసికోకుండా మందు వేస్తే రోగం ఉపశమిస్తుందా? అట్లే అనుపమా నమైన బ్రహ్మజ్ఞానసుఖాన్ని ఆస్వాదించకపోతే దురితజనిత దుఃఖము నుండి విడివడలేరని, ఇహపర సుఖముల కోసం చేసే కర్మలు అనివార్యమైన మరణం తప్పదని, త్రికరణ శుద్ధిగా శ్రీవెంకటేశ్వరుని సేవించి, సంసారబంధము నుండి విముక్తి పొందమని మూడు చరణములలో అన్నమాచార్యులవారు
    మానవాళికి ముక్తిమార్గము నుపడేసిస్తున్నాడు.

    శ్రీ చామర్తి శ్రీనివాస్ గారి వ్యాఖ్యానం, pictorial explanation అద్భుతంగా ఉన్నాయి.

    ఓం తత్ సత్ 🙏🏻🙏🏻🙏🏻
    కృష్ణ మోహన్

    ReplyDelete

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...