అన్నమాచార్యులు
173 లెండో లెండో మాటాలించరో మీరు
Press here for Commentary in English
Synopsis: విషయాలను యథాతథంగా తీసుకున్నప్పుడే వివేకం మొదలవుతుంది. కాబట్టి
వాస్తవాలను ఉన్నవి ఉన్నట్లుగా అంగీకరించగలిగినట్లు చేసే దృక్పథమే స్వస్థపఱచెడు వైద్యము. అప్పుడే మనం ఎదగగలం. విశ్వవిఖ్యాత మనస్తత్వవేత్త కార్ల్ జంగ్
Summary of this Poem:
పల్లవి: లెండి (నిద్దుర) లెండి. మీరు
నా మాట ఆలకించండి. కొండలరాయని మీచే స్తుతింపచేయుచున్నది ఈ క్లేశములు, ఖేదములే. అన్వయార్ధము: మానవులారా నా మాట ఆలకించండి. మీరు భయము దుఃఖములచేత నడుపబడుతున్నారు.
వీని కారణము వలన మీరు కొండలరాయని ఆశ్రయించుచున్నారు.
చరణము 1: సూర్యచంద్రులను గ్రహముల మార్పులతో గడచిపోవును దినములు. రక్షక
భటులాను పదుగురు ఝాము ఝాముకు కాపలాగా అంతస్తాపమును, చింతను బయటకు పోనీయరు. మానవులారా నేర్పున కాగడాలు చేఁబట్టి
ఏమాత్రము ఏమరపాటు లేకుండా మీలోనున్న ఉమ్మలికమును, విచారమును బయటకు తీయరో.
చరణము 2: మానవులారా! సత్వ రజస్తమోగుణాలలో వ్యవవహరించుట వలన జీకట్లు మితిమీరినవి.
కావున ఈ జాలి పట్ల సావధానము వహించండి. హితులారా
దైవముకొరకు మీరు హెచ్చుగా వాయించే వాద్యాలకంటె- అతి బిగ్గరగా ప్రకటించి మీలోని వ్యాకులమును కార్పణ్యములను వెదకండి.
చరణము 3: కారుమబ్బులు కమ్మినవి. సగము జీవితము గడచినది. హెచ్చరికలు ఆలకించి సావధానమున
మాటిమాటికి గట్టిగా ధ్వని చేయుడీ (నీవు చేయగలిగినదంతా చెయ్యి).
శోకమును తరుముడీ. ఈ రకంగా చేస్తే శ్రీవేంకటేశుఁ డిట్టె మేలుకొన్నాఁడు.
గర్వంగా దుఃఖమును వదలిపెట్టండి.
విపులాత్మక వివరణము
ఉపోద్ఘాతము: పరిణామ దశలలో మానవుడు తరచుగా సహజ శక్తుల శక్తిని చూసి ఆశ్చర్యపోతాడు. ఏనుగులు పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, తోడేళ్ళ బలానికి ముగ్ధుడయ్యాడు. వాటికి మనుష్యరూపము అపాదించి ఆరాధించాడు. వాటి శక్తిని, తన అశక్తతను బేరీజు వేసుకుని ఆధిపత్యము సంపాదించుటకు మార్గములు వెతికి అధిగమించాడు.
ఈ విధంగా తన అశక్తత అను దుఃఖమును శక్తిగా మార్చు క్రమమును కొంత అటవీకమైననూ అది ఇచ్చిన విజయములు మురిపించగా ఆత్మన్యూనతా భావమునకు కార్యరూపము కల్పించి, అదియే మార్గముగా చేపట్టినాడు. అనుసరిస్తూనే వున్నాడు. కానీ, ప్రకృతి తనకన్నా వివిధ రకములుగా మిన్నయైనదని ఆ సత్యమును జీర్ణించుకోలేక ఈనాటికి కూడా ప్రకృతిపై దొరతనము చెలాయించుటకు, అణచివేయుటను మార్గముగా ఎంచుకొన్నాడు. తన చుట్టూవున్న సమాజముపైననూ ఈ విధమైన గుణమునే చేపట్టి మనుగడ సాగించుచున్నాడు. అదే జోరును కొనసాగిస్తున్నాడు. ఈ ప్రవృత్తిని తప్పుపట్టినారు ఆచార్యులు.
అన్నమాచార్యులు భక్తి అంటే ఏమిటో అత్యంత ఆధునిక దృక్పథంతో నిర్భయంగా చిత్రించార నడానికి ఈ ఒక్క కీర్తన చాలు. భయముతో ఆశ్రయమును గానీ, మోక్షమును గానీ ఇంకేదైనా ఆశించిగానీ చేయు భగవన్నామస్మరణ భక్తి యనిపించుకోదని, యెటువంటి ఆపేక్షలు లేక మానవుడు తనలోని తలపైగల జాలిని (క్లేశము, ఖేదము లను) తరిమి వేయాలని ఆచార్యులు పేర్కొనిరి. వారు పదిహేనవ శతాబ్ధికి కాక ఇరవైవొకటో శతాబ్ధివారిలా ఆలోచించడం అబ్బుర పరుస్తుంది.
కీర్తన:
రాగిరేకు: 329-1 సంపుటము: 4-166
|
లెండో లెండో మాటాలించరో
మీరు
కొండలరాయనినే పేర్కొన్నదిదె
జాలి ॥పల్లవి॥ మితిమీరెఁ జీకట్లు
మేటితలవరులాల
జతనము జతనము జాలో జాలి
యితవరులాల వాయించే
వాద్యాలకంటె-
నతిఘోషములతోడ ననరో జాలి ॥లెండో॥ గాములువారెడిపొద్దు
కావలికాండ్లాల
జాము జాము దిరుగరో జాలో
జాలి
దీమనపు పారివార దీవెపంజులు
చేఁబట్టి
యేమరక వమీలో మీరు యియ్యరో జాలి ॥లెండో॥ కారుకమ్మె నడురేయి గడచెఁ
గట్టికవార
సారెసారెఁ బలుకరో జాలో జాలి
యీరీతి శ్రీవేంకటేశుఁ
డిట్టె మేలుకొన్నాఁడు
గారవాన నిఁక మానఁ గదరో జాలి ॥లెండో॥
|
Details and
Explanations:
ముఖ్య పదములకు అర్ధములు: ఆలించు = శ్రద్ధతోవిను, ఆలకించు; పేర్కొన్నది = స్తుతించునది; జాలి = క్లేశము, ఖేదము, శోకము, ఆత్మన్యూనత అను అర్ధములోవాడారు.
భావము: లెండి
(నిద్దుర) లెండి. మీరు నా మాట ఆలకించండి. కొండలరాయని మీచే స్తుతింపచేయుచున్నది ఈ క్లేశములు, ఖేదములే.
వివరణము: మనమెవ్వరమో తెలుసుకునేందుకు ఎడతెగకుండా ప్రయత్నిస్తాం. నిజానిజాలను వెలికితీసేందుకు అన్ని రకాల ఎత్తుగడలను వేయబోతాం. కానీ సంపూర్ణ సత్యాన్ని కనుగొనలేం కాబట్టి, మనము రూపాంతరము చెందిన స్వంత ప్రతిబింబాలతో కుస్తీపడతాం.
క్రింద ఇచ్చిన "లెస్ వెకాన్స్ డి హెగెల్"(హెగెల్ సెలవుదినములు) లో, మాగ్రిట్ ఒక అధివాస్తవిక మరియు దృశ్యపరంగా ఆసక్తికరమైన సన్నివేశాన్ని అందించారు. ఈ పెయింటింగ్ లో ఒక సాధారణ నల్ల గొడుగు పైన సగం కంటే పైవరకు నీటితో నిండి వున్న ఒక గ్లాసును వుంచారు. మొత్తం మీద ఈ చిత్రపటము చుస్తూనే నీరు అటుయిటూ చిమ్మకుండా సమతుల్యంగా ఎలావున్నది, ఇది అస్థిరత మరియు కుతూహలముల దృశ్యభ్రమను సృష్టిస్తుంది. అయస్కాంతములా మిమ్మల్ని తనవైపు లాగివేస్తుంది. భౌతిక శాస్త్ర నియమాలను సవాలు చేస్తున్నట్లు, వాస్తవికత మరియు గొడుగు, గ్లాసుల దేనికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయనే ఆలోచనలను రేకెత్తించును.
"హెగెల్ సెలవుదినములు" అని పేరుపెట్టి బాబులారా నిజమునకు సెలవుదినములలోనూ నీ ఆలోచనలకు విరామము లేదు అని చెప్పిరేమో! మాగ్రిట్ చిత్రపటములు తరచుగా దైనందిక జీవనములోని వస్తువులను ఆశ్చర్యముకొలుపునట్లు ఒకదానికొకటి జతపరచి ప్రేక్షకుడి సామన్య అవగాహనకు సవాలు విసురుతాయి. ఆలోచనలను రేపుతాయి. ధ్యాసను లాగిపట్టి తాము దాచిన రహస్యాన్ని వెలితీయమంటాయి.
ఈ చిత్రమునకు నిర్దుష్టమైన అర్థముగానీ, వివరణముగానీ వుండవచ్చు లేదా లేకపోవచ్చు. దాని సమాధానము మనము కనుగొన్నా, లేకున్నా పట్టించుకోనవసరంలేదు. ఈ చిత్రములో చూపిన విధముగానే మనను వదలక పట్టి యుంచినవి మన ఎరుకలోని విషయములే. పోతే, అవి వూహకు అందని రీతిలో రూపాంతరము చెంది భ్రమను కల్పించుచున్నవి.
అందువలననే అన్నమాచార్యులు "నా మాట ఆలకించండి. కొండలరాయని మీచే స్తుతింపచేయుచున్నది ఈ క్లేశములు, ఖేదములే” అన్నప్పుడు ఆ మాహాత్ముని బోధలను కొట్టిపారవేయరాదు. లోతుగా యోచించవలసిన విషయము. మనము వెళ్లవలసినంత లోతుగా సమస్యలలోనికి చొచ్చుకొని పోవుటలేదని ఆచార్యుల భావన. మొదటి చరణములో “యేమరక వమీలో మీరు యియ్యరో జాలి” (= ఏమాత్రము ఏమరపాటు లేకుండా మీలోనున్న జాలిని బయటకు తీయరో) అన్నదానిని క్రియాశీల అన్వేషణముగా పరిగణించండి.
మనము ఆనందాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు ఆ అనుభవపు జాడలను విడిచిపెట్టకుండా పూర్తి స్థాయిలో దానిలో మునిగిపోము. అలాగే పునాదులను కుదిపేస్తున్న దుఃఖంలోనూ ఆసాంతమూ తడిసిపోము. మనలో ఏదో ఒక విషయం ఆ నాగరికత నియమాలను దాటకుండా నియంత్రిస్తుంది. అందువలన, మనము ఎంతో విప్లవకారులమని భావించినప్పటికీ ఎక్కువగానో తక్కువగానో సాంప్రదాయికులమే. సత్యాన్ని అనుభవించడానికి మనం "కనిపించని ఆ ఎల్లల" నుండి బయటకు రావాలి. ఆ సరిహద్దుల గోడలు కుటుంబ/సామాజిక సంప్రదాయాలతో, వూహలతో నిర్మించుకున్న పరిమితులతో, భయాలతో సృష్టించుకుంటాము.
అన్వయార్ధము: మానవులారా నా మాట ఆలకించండి. మీరు భయము దుఃఖములచేత నడుపబడుతున్నారు.
వీని కారణము వలన మీరు కొండలరాయని ఆశ్రయించుచున్నారు.
ముఖ్య పదములకు అర్ధములు: తలవరులాల = తలారులు(ఉరితీసేవారు) = సత్వ రజస్తమోగుణాలు = మానవుని ఉద్దేశము లతో నిమిత్తము లేకుండాఆయా గుణముల ప్రకారము నిర్వికారముగా నడుచుకొను వారు; ౙతనము = మెలకువ, సావధానము; యితవరులాల = హితులారా.
భావము: మానవులారా! సత్వ రజస్తమోగుణాలలో వ్యవవహరించుట వలన జీకట్లు మితిమీరినవి. కావున ఈ జాలి పట్ల సావధానము వహించండి. హితులారా దైవముకొరకు మీరు హెచ్చుగా వాయించే వాద్యాలకంటె- అతి బిగ్గరగా ప్రకటించి మీలోని వ్యాకులమును కార్పణ్యములను వెదకండి.
ముఖ్య పదములకు అర్ధములు: గాములువారెడిపొద్దు = సూర్యచంద్రులను గ్రహముల నిరంతర మార్పులతో గడచిపోవు దినములు; కావలికాండ్లాల = = రక్షక భటులారా = పదుగురు రక్షక భటులు (5 జ్ఞానేంద్రియములు 1. శ్రోత్రము, 2.. చర్మము, 3. చక్షుస్సు, 4. జిహ్వ, 5. నాసిక. 5 కర్మేంద్రియములు 1. వాక్కు, 2. హస్తములు, 3. పాదములు, 4. పాయువు, 5. ఉపస్థ.); జాము జాము దిరుగరో = ఝాము ఝాముకు కాపలాగా తిరగండి; దీమనపు = ధీమసమున, నేర్పున (my guess); పారివార = సేవకులు; దీవెపంజులు = కాగడాలు; యేమరక వమీలో మీరు యియ్యరో జాలి = ఏమాత్రము ఏమరపాటు లేకుండా మీలోనున్న జాలిని బయటకు తీయరో.
భావము: సూర్యచంద్రులను గ్రహముల మార్పులతో గడచిపోవును దినములు. రక్షక భటులాను పదుగురు ఝాము ఝాముకు కాపలాగా అంతస్తాపమును, చింతను బయటకు పోనీయరు. మానవులారా నేర్పున కాగడాలు చేఁబట్టి ఏమాత్రము ఏమరపాటు లేకుండా మీలోనున్న ఉమ్మలికమును విచారమును బయటకు తీయరో.
వివరణము: ఈ కీర్తనకు "హరిహరియని వెరగందుటఁ గాక" అను కీర్తనకు
దగ్గర సంబంధంవుంది. ఆ కీర్తనలో వాడిన "కాపులకు పదుగురు కర్త లందుకు" ఇక్కడ
కావలికాండ్లాల అని పేర్కొన్నారు.. "తలవరులు ముగురు" లతో సత్వ రజస్తమోగుణాలు లను తిరిగి 'తలవరులు'గా ఇక్కడ చూపారు.
"దీమనపు పారివార దీవెపంజులు చేఁబట్టి"తో
నీ వద్దనున్న సర్వ శక్తులు ఒడ్డి దిగులును, విషాదమును పారద్రోలు
ప్రయత్నము చేయమనిరి.
ముఖ్య పదములకు అర్ధములు: కారుకమ్మె = కారుమబ్బులు కమ్మినవి;
నడురేయి గడచెఁ = సగము జీవితము గడచినది;
గట్టికవార = కటికవారు = రాజుముందఱ నిలిచి పరాకు-అవధారు
అని హెచ్చరించెడివారు, చోపుదారులు (This is my guess); సారెసారెఁ బలుకరో జాలో జాలి
= మాటిమాటికి గట్టిగా ధ్వని చేయుడీ. జాలిని తరుముడీ; గారవాన = గర్వంగా.
భావము: కారుమబ్బులు కమ్మినవి. సగము జీవితము గడచినది. హెచ్చరికలు ఆలకించి సావధానమున మాటిమాటికి గట్టిగా ధ్వని చేయుడీ (నీవు చేయగలిగినదంతా చెయ్యి). శోకమును తరుముడీ. ఈ రకంగా
చేస్తే శ్రీవేంకటేశుఁ డిట్టె మేలుకొన్నాఁడు. గర్వంగా దుఃఖమును
వదలిపెట్టండి.
వివరణము: అన్నమాచార్యులు పరంపరాగతముగా వచ్చుచున్న భారతీయ తాత్విక సంప్రదాయములను ప్రక్కనపెట్టి తనదైన శైలిలో మానవుని వేధించుచున్న సమస్యలను స్వేచ్ఛగాను ధైర్యముగాను ప్రకటించిరని నిర్ద్వందముగా చెప్పవచ్చును.
సమస్యలను సమూలముగా పెలికించవలెనని వారి వాదము అద్వితీయము. మానవునిలో దుఃఖము అనేక విధములుగా, అనేక రూపములతో వ్యాపించి అతని నైజమునే మార్చి వేసినదనే ప్రతిపాదన అత్యంత ఆధునికమే కాక స్వచ్ఛందమూనూ.
మానవుడు దుఃఖమను అధిగమించినప్పుడు సర్వ
స్వతంత్రుడగునని మతములు చెప్పినప్పటికీ, ఆ విషయమును భక్తితో
ముడి పెట్టక, దానిని వెతికి
వెళ్ళగొట్టమని చెప్పుట అతి రమణీయము.
స్థిరతా నహినహిరే మానస
ReplyDeleteస్థిరతా నహినహిరే
తాపత్రయసాగరమగ్నానాం
దర్పాహంకారవిలగ్నానాం| స్థిరతా
విషయపాశవేష్టిత చిత్తానాం
విపరీతజ్ఞాన విమత్తానాం | స్థిరతా
పరమహంసయోగ విరుద్ధానాం
బహుచంచలతర
సుఖసిద్ధానాం| స్థిరతా నహినహిరే
నేను, నాది అనే అహంకారం, బాహ్య, అంతః కరణములతో గూడిన ఈ దేహం ప్రపంచమే నిజమని,చంచలమైన విషయసుఖములే శాశ్వతమైన ఆనందము నిచ్చునవని భ్రమించి, తాపత్రయము లనబడే ఆధిభౌతిక, ఆధ్యాత్మిక, ఆధిదైవిక తాపములే క్లేశశోకఖేదములని,అవే మిమ్మల్ని కొండలరాయుడిని స్తుతింపజేస్తున్నాయని,వీటినే *జాలి*
ReplyDeleteయన్న పదంతో అన్నమయ్య పల్లవిలో
పేర్కొన్నారు.
ఈ క్లేశశోకఖేదములకు మూలకారణం త్రిగుణాత్మకమైన యీ శరీరం అనగా సత్త్వరజస్తమోగుణములేయని, వాటియెడల జాగరూకత కలిగి
సావధానము వహించి,దైవం కొరకై వాద్యములచే చేయు స్తుతుల కంటే యెక్కువ బిగ్గరగా ఈ త్రిగుణాల వల్ల కలిగే తిమిరాలను యేమాత్రం యేమరుపాటు లేకుండా వెదకి వదలిపెట్టండి.
ప్రాపంచికమైన విషయాలలో మునిగి జీవితకాలం వ్యర్థంగా గడచిపోతున్నది. ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములనబడే దశేంద్రియములు నిరంతరం కాపలా కాస్తూ మోహజనితమైన ఈ తాపత్రయములనబడే అంతస్తాపమును విడువనీయకుంటున్నవి.వీటిని యేమరుపాటు లేకుండా బయటకు తీయరో జాలో జాలి అంటున్నారు ఆచార్యులవారు.
కారుచీకట్లలో జీవితంలో అర్థభాగం గడచిపోయింది. శమదమాదుల శక్తిచే ఇంద్రియమనములను నిగ్రహింపజేసి విషయాల వలన కలిగే దుఃఖమును, క్లేశమును పారద్రోలుటకు చేయగలిగిన దంతా చేయండి.ఆశాంతిని దూరం చేయండి. అప్పుడే మీలో ఉన్న అంతరాత్మ చైతన్యవంతమై పరమాత్మకు చేరువై, శాశ్వతమైన దివ్యానుభూతిని అనుభవించండి అంటున్నారు అన్నమయ్య అద్భుతమైన ఈ కీర్తనలో.
ఈ సందర్బంగా శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి కీర్తనను ప్రస్తావించటం సముచితం.
స్థిరతా నహి నహి రే, మానస
స్థిరతా నహి నహి రే॥
తాపత్రయ సాగర మగ్నానాం
దర్పాహంకార విలగ్నానామ్॥
విషయపాశ వేష్టిత చిత్తానాం
విపరీతజ్ఞాన విమత్తానామ్॥
పరమహంసయోగ విరుద్ధానాం
బహు చంచలతర సుఖబద్ధానామ్॥
భావం ——ఈ కీర్తన లో మనసుకు స్థిరత్వం అనేది లేదు అని రూధిగా తెలియ జేశారు .ఎవరికి లేదు ?అని విచారించారు .”మనసా !తాపత్ర్యాలలో మునిగిన వారికి ,అహంకార దర్పాన్ని పట్టుకొని వ్రేలాడే వారికి ,విషయ వాంచలు అనే తాళ్ళతో బద్ధులైన మనసు కల వారికి ,చంచల మైన సుఖాల కోసం అర్రులు చాచే వారికి ఎన్నడు మనశ్శాంతి లభించదు ”అని నిర్ద్వందంగా చెప్పారు .
విశేషం —-తాపత్రయాలు మూడు .ఆది దైవిక ,ఆది భౌతిక ,ఆధ్యాత్మిక బాధలు .ఇతరుల పట్ల ప్రదర్శించేది దర్పం .తనలో వుండేది అహంకారం .
ప్రపంచమే నిజం,దేవుడు అబద్ధమనుకునే జ్ఞానమే విపరీత జ్ఞానం .దర్పము ,అహంకారము పరమాత్మకుదూరం చేస్తాయి .విషయ వ్యామోహం కూడా పరమాత్మను చేర నివ్వదు .స్థిరత అంటే శాశ్వత మైన దానిలో స్థానం .చలించే విషయాలపై వచ్చే జ్ఞానం కూడా చంచలమైనదే .
దాని వల్ల శాంతి ,స్థైర్యం లభించవు .
కనుక స్థిరమై ,శాశ్వతమై ,అఖండమై ,
అక్షరమైన పరబ్రహ్మం లోనే స్థిరత్వం ,శాంతి లభిస్తాయని సందేశం .
ఓం తత్ సత్ 🙏🏻🙏🏻🙏🏻
కృష్ణ మోహన్
Srinivas, thanks for sharing and writing about this beautiful keerthana of Annamayya. And writing about it in your inimitable style. Your Synopsis, Summary are great. Introduction and Detailed explanation are good thorough. Using "les vacans di Hegel" painting, exhorting us to read deeper meaning of this keerthana is attractive and inspiring. It shows your appreciation of multiple arts and connecting them.
ReplyDeleteThere are multiple layers to this Keerthana. I like the simple words that anybody can appreciate, Telugu alankaram idiom of repetiton of words to convey deeper meaning. Kudos.