Saturday 29 July 2023

T-174 కూడితి మిందరము గుంపులాయ నీ మోహము

 అన్నమాచార్యులు

174 కూడితి మిందరము గుంపులాయ నీ మోహము

for EnglishVersion press here


Synopsis:   అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే” భగవద్గీత​

                                            (“సత్యమును నిర్ధారించలేము”)

Summary of this Poem:

పల్లవి: స్వామీ! ఈ భూతలముపై గుమికూడితిమి కానీ, నీవే కల్పించు మోహములో చిక్కుకున్న మందబుద్ధులము. మనసు విప్పి వేడుకలలో లీనమైపోకుండా మమ్ము పట్టివుంచుతున్నదేమీ?  అన్వయార్ధము: సత్యంతో మమేకమయ్యే అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికే మనమందరం జీవనమను ఊతముతో ఈ స్థలమునకు వచ్చాము. దీనికేమీ వెచ్చించనవసరము లేదు. దాని నుంచి వెనక్కు నెట్టేది అజ్ఞానము కాక మరేమి​?

చరణము 1: సత్యము, శాశ్వతమైన కార్యములలో పాల్గొనుటకు సంకోచమెందుకు? మనసులో పొరపొచ్చెములనుంచి నిర్మలమౌట ఉత్తమమైన విషయం కాదా? నీలో వున్నది కానీ నీకు తెలియనిది ఆ పూరకము (complimentary). ఆ తెలియనిదానికి నీవు పూరకము. ఆధారము. అనగా ఒకదానికొకటి పరస్పరము ఆధారమైనప్పుడే నీవు (consciousness) కలవు. ఒకరుంటే మరొకరున్నట్లే కదా! ఇది గ్రహించిన వారెందరికో శోకము తీరినది. నీ కడ్డు పడుతున్నదేమీ? అన్వయార్ధము: అజ్ఞానమను భారమును తొలగించుకొనుటకు తీసికొను నిర్ణయాత్మక చర్యలు మాత్రమే జ్ఞానము అనబడును.  ఈ పరివర్తనమను ప్రయాణమొక్కటే (నిరాధారమైన) ఆందోళనల నుండి ముక్తినిస్తుంది. బిగుసుకుని కూర్చోకు. మార్పును  మనస్పూర్తిగా స్వీకరించు!  వెలుగులోనికి నడువుము! 

చరణము 2: జరిగిపోయిన దానిని మరిమరి గుర్తుకు తెచ్చుకుని చింతించవలదు. కాలముతో పాటు వాటి ఫలములను అనుభవించుట  యోగ్యము. యుక్తము. వీనికి విత్తులు మనమే నాటితిమి.  పైగా చేతులు దైవముపై మోచుదుము. ఇప్పుడు అలపు, అలసట తీరిపోయినవి. ఇక భయమేలా? 

చరణము 3: ప్రకృతి ప్రసాదించిన​ దానిలో లోపాలను నిరంతరం వెతుకుతుంటామే! పైగా నా కులము, నా వంశము, మా పూర్వీకుల వైభవములని గర్వంతో మదిని నింపుకుంటామే! శ్రీ వేంకటేశ్వరుడు అనుగ్రహించి మన హృదయాలను పాలిస్తున్నాడు. చెప్పలేని వైభవములు గొప్పతనములు వెలయును మన ముందర. మానవుడా! ఇంక నీకు వెరుపేల? 

విపులాత్మక వివరణము 

ఉపోద్ఘాతము: ఈ అన్నమాచార్యుల కీర్తన సరళంగానూ, స్పష్టంగానూ, సులభంగానూ జాలు వారుతున్న ప్రవాహములా అనిపిస్తుంది. అదొక అపూర్వ కళాకృతి. మండుటెండలో మంచుతెర లాంటి  సృష్టి. స్పృశించబోతే తాకినచోటెల్లా కరగిపోతూ పట్టుబడని సున్నితమైన శిల్పము. వీటికి ఒక అర్థాన్ని ఏర్పరచడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ అందమైన పదాలు వూహల కందని భావాలు స్ఫురింపచేస్తుంటే, కొంత అలపు తెప్పించి, సందేశం మాట దేవుడెరుగు అసలు ఈ పదబంధాలకు అర్థం ఉందా అని సందేహిస్తాం. 

నిజమే. ఈ కీర్తనలోని పదములు, అవి సూచించు ప్రత్యర్ధములు ఒకింత చీకాకు పరచు మాట వాస్తవమే.  కానీవాటి వెనుక అన్నమాచార్యులు మనసును అలౌకిక తలములోనికి కొనిపోవు శిల్పమును దాచివుంచిరి. ఆ అత్యద్భుతమును మనము మనముగా దర్శించగలిగితే కలుగు భావనతో పోల్చితే ఈ ఒకింత శ్రమ అణుమాత్రమే. 

శబ్దాలంకారాలకు, ​ఆకృతుల అందాలకు, భావనా దర్శనములకు ఆకర్షితులవుతాం. అవగతమగు పదముల కూర్పుతో సమకూరు తలపులు, ఆ తలపులకు మూలమగు జ్ఞప్తులు ఒకదానికొకటి పరిపూరకములని అర్థం చేసుకోవడం ద్వారా సత్యంతో మమేకం కావాలని ఈ కీర్తన పదేపదే సందేశమిస్తుంది. 

కీర్తన:
రాగిరేకు:  186-2 సంపుటము: 7-508
కూడితి మిందరము గుంపులాయ నీ మోహము
వేడుకకు వెలలేదు వెరపేల నీకు ॥పల్లవి॥
 
సతమైన పనులకు చంచలము మరియాల
మతిలో నిర్మలమౌటే మంచిదౌఁగాక
గతి నీకునాపె నీవుగలిగితివాపెకును
వెతదీరెనందరికి వెరుపేల నీకు ॥కూడి॥
 
చేసిన చేఁతలకును చింతించ మరియాల
ఆల భోగించుటే అందమౌఁగాక
సేస నీవు చల్లితివి చేతులు నీపైమోచె
వేసటెల్లాఁ బాసెనిఁక వెరుపేల నీకు ॥కూడి॥
 
కలిగిన పనులకు కడమలు మరియాల
కొలముగా నిల్లునించుకొందువుగాక
యెలమి శ్రీ వెంకటేశ యిట్టె నన్నునేలితివి
వెలసె నీసుద్దులెల్లా వెరుపేల నీకు ॥కూడి॥

Details and Explanations:

కూడితి మిందరము గుంపులాయ నీ మోహము
వేడుకకు వెలలేదు వెరపేల నీకు ॥పల్లవి॥ 

భావము: స్వామీ! ఈ భూతలముపై గుమికూడితిమి కానీ, నీవే కల్పించు మోహములో చిక్కుకున్న మందబుద్ధులము. మనసు విప్పి వేడుకలలో లీనమైపోకుండా మమ్ము పట్టివుంచుతున్నదేమీ?  

వివరణము: అన్నమాచార్యులు మనము జీవితాశయమును అర్థం చేసుకోలేమని స్పష్టం చేశారు. ఊహాజనిత అనుబంధాల ద్వారా తప్పుదారి పడతామన్నారు.  “గుంపులాయ నీ మోహము అంటూ విశ్వమును అనుసంధానించు చైతన్యం యేవొక్కరి సొంతమూ కాదన్నారు.

కూడితి మిందరము గుంపులాయ నీ మోహముఅని మనం గుమికూడి వున్నా ఐక్యంగా లేమని; బదులుగా, మోహావేశములు, మఱపు మార్గనిర్దేశం చేస్తుంటే మనము ఒకరిపై ఒకరు కత్తులు దూయడానికి సిద్ధంగా ఉంటామన్నారు. సామూహికముగా మోహము మనలను ముంచెత్తుతున్నదని చెప్పుటకు దేవాలయాలలోని బూతుబొమ్మలు, లెక్కకు మించి వున్న పోర్న్ సైటులే నిదర్శనము.

'వేడుకకు వెలలేదు వెరపేల నీకు' అను పదములు నీకు నిజంగా అడ్డుతగులునవి లేకున్నా, నిన్ను సుఖములలో తేలిపోకుండా నిరోధించు నదేమని ప్రశ్నిస్తున్నారు ఆచార్యులు. మానవుని తనను తానుగా వుండ నివ్వని దేమిటో తెలియమంటున్నారు. ఈ 'వెరపేల నీకు' పదబంధమును అనేక పర్యాయములు  వాడి దాని ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు.

అన్వయార్ధము: సత్యంతో మమేకమయ్యే అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికే మనమందరం జీవనమను ఊతముతో ఈ స్థలమునకు వచ్చాము. దీనికేమీ వెచ్చించనవసరము లేదు. దాని నుంచి వెనక్కు నెట్టేది అజ్ఞానము కాక మరేమి​?

సతమైన పనులకు చంచలము మరియాల
మతిలో నిర్మలమౌటే మంచిదౌఁగాక
గతి నీకునాపె నీవుగలిగితివాపెకును
వెతదీరెనందరికి వెరుపేల నీకు ॥కూడి॥ 

ముఖ్య పదములకు అర్ధములు: సతమైన పనులకు = సత్యము, శాశ్వతమైన చర్యలకు; మరియాల= మరెందుకు?  గతి = పోక, విధము, త్రోవ, స్థానము, ప్రమాణము, ఆధారము, ఉపాయము; నీకునాపె = నీకున్+ఆపె = నీకు ఆమె  (ఇక్కడ ఆమె = అనగా ఏమో తెలియని భాగము అను అర్ధములో వాడారు); నీవుగలిగితివాపెకును = నీవుగలిగితివాపెకును = నువ్వామెకు కలవు = నువ్వుంటేనే ఆమె కలదు = నువ్వులేకుంటే ఆమె లేదు; {గతి నీకునాపె నీవుగలిగితివాపెకును = స్త్రీపురుషులు ఒకరికొకరు కాంప్లిమెంటరీ అనే కంటే మానవునికి, అతని తెలియని భాగము ఒండొరులకు పూరకములనే భావనలో వాడారు} వెతదీరెనందరికి = వ్యథ, శోకము తీరినదందరికి. 

భావము: సత్యము, శాశ్వతమైన కార్యములలో పాల్గొనుటకు సంకోచమెందుకు? మనసులో పొరపొచ్చెములనుంచి నిర్మలమౌట ఉత్తమమైన విషయం కాదా? నీలో వున్నది కానీ నీకు తెలియనిది ఆ పూరకము (complimentary). ఆ తెలియనిదానికి నీవు పూరకము. ఆధారము. అనగా ఒకదానికొకటి పరస్పరము ఆధారమైనప్పుడే నీవు (consciousness) కలవు. ఒకరుంటే మరొకరున్నట్లే కదా! ఇది గ్రహించిన వారెందరికో శోకము తీరినది. నీ కడ్డు పడుతున్నదేమీ? 

వివరణము: అన్నమాచార్యుల వింత పదముల కూర్పు కూడ గట్టుకొని అర్ధము చేసికొనుటకును కష్టమే. "గతి నీకునాపె నీవుగలిగితివాపెకును" = నీవు నీ ప్రతిరూపానికి, దానికి నీవు, ప్రేరణ అవుతారు అని దీని సారాంశం. 

'మనలో ఏదో లోపించిందని' మనలో ప్రతి ఒక్కరూ అనుభవించే సహజమైన భావనను అన్నమాచార్యులు ప్రస్తావిస్తున్నారు. అది మనల్ని మనలా ఉండకుండా అడ్డుకుంటుంది. ఈ వాస్తవమును మనిషి నిజ జీవితములో కనుగొన లేక వృథాప్రయాసగా దైవముపై, కర్మముపై నిందలు వేయును.

ఎం.సి.ఎస్చెర్ గీసిన 'ది లిజార్డ్స్ (బల్లులు)' అనే సీదాసాదా పెయింటింగ్ చూద్దాం. ప్రపంచ ప్రఖ్యాత గ్రాఫిక్ కళాకారుడు ఎస్చెర్'కు టెస్సెలేషన్స్ (క్రమ పద్ధతిలో, వేర్వేరు కోణములలో అమర్చ బడిన అచ్చులు, నకళ్ళు) అంటే చాలా ఇష్టము. ఈ బుల్లి ఆకర్షణీయమైన కళాకృతిలో, ఒక బల్లికి మరొక బల్లికి మధ్య వున్న ఖాళీలలో ఇంకో బల్లి ఒదిగి వుండడం గమనించవచ్చును. ఏ బల్లులు వాస్తవముగా వేసిరో, ఏవి ఖాళీల వల్ల ఏర్పడినవో గుర్తించడం  ఇబ్బందికరమే.



మనము ఈ ప్రపంచంలో చూసేవన్నీ ఆ పూరకములతో (complimentaryగా)  ఏర్పడినవే. (బొమ్మలోని బల్లుల మధ్య​ బల్లుల వలె నింపి పరిపూర్ణము చేయునవే).  అనగా 'చూచువాడు' మరియు 'చూచినది' ఒకదానికొకటి కాంప్లిమెంటరీ అనే భావములో "గతి నీకునాపె నీవుగలిగితివాపెకును" అని వ్యక్తపరిచిరి. పైగా 'చూచువాడు' మరియు 'చూచినది' అనునవి బయలుపడినది స్మృతి, జ్ఞాపకములమీద ఆధారితమైన ఎఱుక (సచేతనత్వం) వలన. 

కాబట్టి 'చూచువాడు' మరియు 'చూచినది' అనునవి మనలోనే రూపుదిద్దుకున్న వ్యక్తములు. అలాగుననే, మనలోనే వుండి మనకు తెలియని ఆ అవ్యక్తమునకు మనలోని చైతన్యము పూరకము.  కనుక జీవనమని పిలువబడే ఈ అనంతమైన నిరంతర ఉద్యమంలో నూటికి నూరు పాళ్ళు పాల్గొనక కేవలము బంతి ఆట చూస్తున్న ప్రేక్షకులవలె చేతులు చరుస్తున్న మనలను కవ్విస్తూ "వెరుపేల నీకు" అని ప్రశ్నిస్తున్నారు ఆచార్యులు. 

మనమెంత పనికిరానివారమైనప్పటికి అనంతమగు జీవవాహినిలో ప్రవేశించవచ్చని అన్ని మతములు చెప్పినవి. కానీ ప్రతీయొక్క జీవికిని వాని వాని యందు మేల్కొన్న చైతన్యమును బట్టి పూరకములు ఏర్పడును. కాన ఆ పూరకమును, ఆ చైతన్యమును ఆ జీవియే యత్నముతో తెలియవలె.  ఆ యత్నమే తపస్సు. 

మొదటి రెండు పంక్తులను పైన వివరించిన భావముతో కలిపితే క్రింది భావార్ధము ప్రకటమగును.

అన్వయార్ధము: అజ్ఞానమను భారమును తొలగించుకొనుటకు తీసికొను నిర్ణయాత్మక చర్యలు మాత్రమే జ్ఞానము అనబడును.  ఈ పరివర్తనమను ప్రయాణమొక్కటే (నిరాధారమైన) ఆందోళనల నుండి ముక్తినిస్తుంది. బిగుసుకుని కూర్చోకు. మార్పును  మనస్పూర్తిగా స్వీకరించు!  వెలుగులోనికి నడువుము!

చేసిన చేఁతలకును చింతించ మరియాల
ఆల భోగించుటే అందమౌఁగాక
సేస నీవు చల్లితివి చేతులు నీపైమోచె
వేసటెల్లాఁ బాసెనిఁక వెరుపేల నీకు ॥కూడి॥ 

ముఖ్య పదములకు అర్ధములు:  ఆల = వేళ, కాలము; సేస = అక్షతలు, మంగళకరమైన బియ్యము; సేస నీవు చల్లితివి = విత్తులు నీవే విత్తితివి; వేసట = అలపు, అలసట.   

భావము: జరిగిపోయిన దానిని మరిమరి గుర్తుకు తెచ్చుకుని చింతించవలదు. కాలముతో పాటు వాటి ఫలములను అనుభవించుట  యోగ్యము. యుక్తము. వీనికి విత్తులు మనమే నాటితిమి.  పైగా చేతులు దైవముపై మోచుదుము. ఇప్పుడు అలపు, అలసట తీరిపోయినవి. ఇక భయమేలా? 

వివరణము: 'చేసిన చేఁతలకును చింతించ మరియాల / ఆల భోగించుటే అందమౌఁగాక' జీవన ప్రయాణంలో బాధలు దుఃఖములు అనేవి అనివార్యం. బాధలను ఎదుర్కొన్నప్పుడు, వాటి నుండి పారిపోకూడదని లేదా అవి కలిగించు భావోద్వేగాలను అణచివేయకూడదని విశ్వవిఖ్యాత మనస్తత్వవేత్త కార్ల్ జంగ్ గట్టిగా నమ్మాడు. బదులుగా, మనము బాధలను పూర్తిగా చవిగొనుట ద్వారానే మనం అంతిమంగా దానిని అధిగమించుటకు అవకాశం కలదని ఆయన నొక్కిచెప్పారు.

దీనికి జిడ్డు కృష్ణమూర్తి జీవితం నుంచి ఒక ఉదాహరణను పరిశీలిద్దాం. ఆయన సోదరుడు నిత్య 1925లో మరణించాడు. ఈ విషాద వార్త విన్న సమయంలో కృష్ణమూర్తి ఓడలో భారతదేశానికి తిరుగు ప్రయాణంలో ఉన్నాడు. ఈ సందేశాన్ని అందుకున్న తరుణంలో శివరావు, కృష్ణమూర్తి ఓడలోని  ఒకే క్యాబిన్'లో  వున్నారు. నిజ జీవితంలో నిత్య, కృష్ణమూర్తులది విడదీయరాని గాఢానుబంధము. శివరావు ఆనాటి సన్నివేశాన్ని మననము చేసుకుంటూ ఇలా అన్నారు. 

"రాత్రిపూట నిత్య కోసం వెక్కి వెక్కి ఏడ్చేవాడు. తనలో తాను మధన పడేవాడు. ఆ  ఏడుపు మైకములో, కొన్నిసార్లు తెలుగులో ఏవేవో పలవరించేవాడు (ఈ ఘటన సమయానికి, మేల్కొన్న సమయాల్లొ కృష్ణమూర్తి తెలుగులో మాట్లాడలేకపోయేవాడు). ప్రతిరోజూ గుండె పగిలి, నిరాశా నిస్పృహలతో ఆయనను చూస్తూనే ఉన్నాం. నిత్య లేని జీవితాన్ని ఎదుర్కొనే ప్రయత్నంలో తనని తాను పట్టుకొని రోజురోజుకూ మారుతున్నట్లు కనిపించాడు. అతను ఒక అంతర్గత విప్లవం ద్వారా వెళుతున్నాడు, కొత్త బలాన్ని కనుగొంటున్నాడు ".

సుమారు పది రోజుల తరువాత వారు కొలంబో చేరుకునే సమయానికి కృష్ణమూర్తి తన దుఃఖాన్ని దాదాపు అధిగమించాడు. మునుపటి శోకపు ఛాయలు ముఖమునుండి వైదొలగాయి. ఆయన ఇలా అన్నాడు.

"... భౌతిక స్థాయిలో మేము విడిపోయి వుండవచ్చు, కానీ ఇప్పుడు మేం విడదీయరాని స్థితిలో ఉన్నాం. …. ఇప్పటికీ ఎలా ఏడవాలో నాకు తెలుసు, కానీ అది మానవ సహజం. జీవించుటలో నిజమైన అందం వుందని, ఏ ఘటనలూ ఛిన్నాభిన్నం చేయలేని వాస్తవమైన ఆనందము, కాలగమనముతో బలహీనపడని గొప్ప శక్తి వున్నాయని గ్రహించాను. వీటిని మించి శాశ్వతమైన, నిత్యనూతనమైన, అపరిమితమైన ప్రేమ ఒకటి ఉందని ఇప్పుడు మరింత నిశ్చయంగా తెలుసుకున్నాను". 

'కనబడినది' 'కనిపింప చేయునది' ఒకే తట్టున వున్న చర్యలని "గతి నీకునాపె నీవుగలిగితివాపెకును" అని మొదటి చరణములో వ్యక్తపరిచిరి. అలాగుననే 'సేస నీవు చల్లితివి చేతులు నీపైమోచె' అని మానవునికి జీవితములో లభించు సుఖదుఃఖములను తన హృదయములో పండించు వాడు మానవుడేనని కానీ భారము దేవునిపై మోపుతాడని అన్నారు.  అన్నమాచార్యులు మనుషులను విమర్శించినంతగా తెలుగులో ఏ కవీ కూడా చీల్చి చెండాడి వుండడు.

కలిగిన పనులకు కడమలు మరియాల
కొలముగా నిల్లునించుకొందువుగాక
యెలమి శ్రీ వెంకటేశ యిట్టె నన్నునేలితివి
వెలసె నీసుద్దులెల్లా వెరుపేల నీకు ॥కూడి॥ 

ముఖ్య పదములకు అర్ధములు: కలిగిన పనులకు = మానవుని వాటాకు (ప్రకృతి) అప్పగించిన పని; కడమలు = కొరత, శేషము; కొలముగా నిల్లునించుకొందువుగాక = మీరు మీ కులము, వంశము, మీ పూర్వీకుల వైభవములతోను గర్వంతో మదిని నింపుకుంటారు {కొలముగాన్ = కులము, వంశము; ఇల్లునించుకొందువుగాక =ఇంటిని నింపుకుంటావు}; యెలమి = అనుగ్రహం, దయ.  

భావము: ప్రకృతి ప్రసాదించిన​ దానిలో లోపాలను నిరంతరం వెతుకుతుంటామే! పైగా నా కులము, నా వంశము, మా పూర్వీకుల వైభవములని గర్వంతో మదిని నింపుకుంటామే! శ్రీ వేంకటేశ్వరుడు అనుగ్రహించి మన హృదయాలను పాలిస్తున్నాడు. చెప్పలేని వైభవములు గొప్పతనములు వెలయును మన ముందర. మానవుడా! ఇంక నీకు వెరుపేల? 

వివరణము: కలిగిన పనులకు కడమలు మరియాల / కొలముగా నిల్లునించుకొందువుగాక”: విజ్ఞాన శాస్త్రమిచ్చిన నాలుగుముక్కల చదువులతో, ఆంగ్లము నందు గల పట్టుతో, గణక యంత్రమిచ్చు విస్తారమైన భౌతిక నీయమముల ప్రజ్ఞ ఆధారముగా, తర్కమిచ్చిన నిర్ద్వంద్య సామర్థ్యముతో గర్వమెక్కి నేనెవరినో, దేవుడెవరో తెలుసుకో గలననుకుంటాడు ఆధునిక మానవుడు. 

ఈ నేర్పులకు మించిన మహామునులెందరో ఆ జ్ఞానమార్గమును కానలేక తడబడిరి. తగు మునులు‌ ఋషులు తపములు సేయఁగ గగనము మోచియుఁ గర్మము దెగదా అని అన్నమాచార్యులు హెచ్చరించిరి. నిద్రాణములో నున్న మానవ జాతిని తట్టిలేపే ప్రయత్నము చేసిరి ఆచార్యులు. జ్ఞానమార్గము ప్రత్యక్షంగా కనిపించేది కాదు. విషయలోలత్వమున, అహంకారమున మునిగిన వారికి అగుపడునది కాదు. సాధనమున ఛేదించ గలిగినదీ కాదు. లేని భక్తిని ప్రదర్శించినా కానరాదు. 

దీనిని ప్రసిద్ధిగాంచిన అధివాస్తవిక శాస్త్రవేత్త రెనె మాగ్రిట్టే రచించిన "లెస్ మెర్విల్లెస్ డి లా నేచర్" (ది వండర్స్ ఆఫ్ నేచర్, ప్రశంసనీయులు) పేరిటవున్న ఒక అందమైన పెయింటింగ్ ను పరిశీలిద్దాం. చిత్రం ముందు భాగంలో, మీరు రెండు మత్స్యకన్య వంటి ఆకారములు కనిపిస్తుంటాయి. నేపథ్యములో నీలి సముద్రం ఉంది.

"లెస్ మెర్విల్లెస్ డి లా నేచర్"లో, సాంప్రదాయ మత్స్యకన్య చితపటమును తారుమారు చేసి ఊహా జీవిని మరింత అధివాస్తవికంగా లేదా అవాస్తవంగా చూపించారు. రాతిలో బంధించబడినప్పటికీ, ఈ ఆకారములు ఒక విలక్షణమైన మానవ లక్షణాన్ని కలిగి, స్పష్టమైన జీవన భావాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఈ జీవులు ఒక పాటలోనో లేదా ప్రార్థనలోనో నిమగ్నమై, ఆకాశం వైపు చూస్తూ తన్మయత్వములో మునిగిపోయి, బహుశా పై లోకముల నుండి కృపను లేదా కరుణను కోరుకుంటున్నట్లు అనిపిస్తుంది. 

నీలి సముద్రము విశ్వ చైతన్యమునకు సంకేతము అనుకోవచ్చు. ఈ జీవుల వెనుక నీలి సముద్రంలో ఒక నౌక కనిపిస్తుంది. ఈ నౌక వాస్తవానికి నీటితో తయారు చేయబడిందని గమనించవచ్చు. బహుశా మన ఆలోచనలు, భావనలు ఆ ఓడలాగానే మనమెటువంటి ద్రవ్యముతో చేయబడితిమో దాని ద్వారానే ఏర్పడతాయని మాగ్రిట్ చెబుతున్నాడనుకోవచ్చును. 

మాగ్రిట్  "ఈ ప్రజలు (ఆ తెలివితక్కువ జీవుల మాదిరిగా) ప్రార్థనలలో ఎందుకు నిమగ్నమయ్యారు. వాటికి కాళ్లు ఉన్నాయి కదా. ఈ విశ్వాన్ని ఏకం చేసే చైతన్యములో కలిసిపోయేందుకు అడుగు వేయరేం?” అని ఆశ్చర్యపోతున్నట్లుంది.

-x-x-x-

 

1 comment:

  1. "దుర్లభో మానుషోదేహః" అంటే జన్మలన్నిటిలో మానవజన్మ దుర్లభమైనది. సర్వోత్కృష్టమైనది.
    "శరీర మాద్యం ఖలు ధర్మ సాధనం"
    శరీరమే ముఖ్యమైన ధర్మసాధనం అన్నారు. మానవజన్మకు
    పరమోద్దేశ్యము మోక్షం. మానవుడి కొక్కడికే అట్టి యవకాశమున్నది. అనంతబ్రహ్మముతో ఐక్యమయ్యే అవకాశం ఉన్నా కాని జన్మాంతర కర్మానుసారం ఈ భూమి మీద జన్మ నెత్తిన మానవుడు పరమాత్మచే సృష్టించబడిన మాయామోహములో చిక్కుకొని యిట్టి సదవకాశమును దుర్వినియోగం చేసికొని పునరపి జననం.. పునరపి మరణం అనే చక్రంలో తనకు తానుగా బందీ అవుతున్నాడని అన్నమయ్య పల్లవిలో
    అంటున్నారు.

    సహజంగా మనస్సు నిర్మలమైనది. పరిశుద్ధమైనది. కాని జన్మనెత్తిన మరుక్షణం అసత్యమైన మాయలో పడి, రాగద్వేషములు,
    విషయవాసనలు, అరిషడ్వర్గమునకు లోనై సహజస్థితిలో నున్న నిర్మలమైన మనస్సు మలినపూర్వక మవుతున్నది.
    మనస్సుకు పంకిలము
    అంటుకొనకుండా దేహేంద్రియములను
    వశపరచుకొని సత్యము, శాశ్వతము, శుద్ధము,పరమానందదాయకము అయిన అంతరాత్మను అన్వేషించి,
    ఆపరోక్ష జ్ఞానాన్ని తద్వారా మోక్షమును పొందుటకు చంచలమైన మనస్సును అదుపులో పెట్టుకొన సంకోచిస్తున్నా
    వెందుకు మానవా?

    ప్రతి ప్రాణిలో జీవాత్మ అనేది ఉంటుంది.దీనినే వ్యక్తిగత ఆత్మగా వ్యవహరిస్తారు. విశ్వంలో ఉండే
    సకల ప్రాణులలో వ్యాప్తమై ఉండేది పరమాత్మ. దీనిని సమిష్టి ఆత్మ అంటారు. పరమాత్మ యొక్క అంశమే జీవులలో స్థితమై యుండి జీవచైతన్యకారక మవుతున్నది. జీవాత్మ బింబమైతే, పరమాత్మ దానికి ప్రతిబింబం.ఈ రెండూ పరస్పరం పరిపూరకములే (complementary). జీవాత్మ - పరమాత్మ ఒక్కటే అని గ్రహించిన వారెందరికో శోకనివృత్తి జరిగింది. వారికి పరిపూర్ణమైన పరమానందం అనుభవంలోనికి వచ్చింది.మరి నీకు అడ్డు పడుతున్నదెవరో గ్రహించుమని
    ఆచ్చార్యులవారు తత్త్వబోధ చేయచున్నారు.
    Escher గీచిన చిత్రంలో బల్లులు రెండూ బింబప్రతిబింబముల వలె, ఆత్మ -పరమాత్మల వలె ఉండటం గమనించగలరు.

    చేసిన కర్మలు స్వయంకృతములు. అవి ఫలితము లివ్వక మానవు. కర్మఫలమును అనుభవించటాన్ని తప్పించలేము.దాని గురించి చింతించక ఫలాన్ని అనుభవించటమే సమీచీనమైనది.శేషం మిగల్చకుండా
    కర్మఫలాన్ని అనుభవించుటయే ఉత్తమం.ఇంక భయమేల? అంటున్నారు అన్నమయ్య.

    ప్రకృతి ఒసగిన వైభవమును,
    వంశవైభవమును గురించి చెప్పుకొని ముదము, గర్వము పొందు మానవుడు సర్వజగములను, సకల ప్రాణులను పాలించే శ్రీనివాసుడు
    దయతో అనుగ్రహించిన వర్ణనాతీతమైన వైభవం కళ్ల యెదుటే, మన సమీపంలోనే ఉన్నది. పరికించిన నీకిక వెరుపేల? అని ప్రశ్నిస్తున్నారు ఆచార్యులవారు. దానిని గ్రహించకే శోకమోహాలనే అజ్ఞానతిమిరాలలో బందీలైనారు మానవులని విమర్శస్తున్నారు అన్నమయ్య.

    మాగ్రిట్టే చిత్రం ఈ చరణం లోని భావానికి అద్దం పడుతున్నాయి.ఇవి జీవాత్మ లనుకొంటే విశ్వవ్యాప్తమైన పరమాత్మ చైతన్యంతో ఐక్యమవ్వాలని
    పైకి ఆకాశంలో చూస్తున్నాయి
    ఓం తత్ సత్ 🙏🏻🙏🏻🙏🏻
    కృష్ణ మోహన్

    ReplyDelete

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...