Tuesday, 27 October 2026

T-262R ఇప్పుడే తెలుసుకో నీకెఱఁగ విన్నవించితి

 262R ఇప్పుడే తెలుసుకో నీకెఱఁగ విన్నవించితి

ఉపోద్ఘాతము 
అన్నమాచార్యులు మన మనస్సులలో ఆ మాయ తెలియకుండ ఎలా చొచ్చుకొని పోతుందో అద్భుతంగా వివరించారు. ఆ ప్రయోజన సిద్ధికే శృంగార కీర్తనగా మలిచారు. 
శృంగార కీర్తన
రేకు: 542-2 సంపుటము: 13-186
ఇప్పుడే తెలుసుకో నీకెఱఁగ విన్నవించితి
కొప్పువ ట్టీకె దీసితే గుంపించఁ గలవా        ॥పల్లవి॥

పుత్తడిబొమ్మవలె పూచిన లతికవలె
చిత్తరుపతిమెవలెఁ జెలి యున్నది
మత్తిల్లి యప్పటి నేఁడు మాతో నేమినవ్వేవు
వొత్తుకాపె విలిచితేఁ బోకుండఁగలవా        ॥ఇప్పు॥

కొసరుఁగోయిలవలె కొలనితుమ్మిదవలె
పసని చిలుకవలెఁ బలికీనాపె
నసలు సేయుచు నిట్టే నాతో మాటలాడేవు
వొసగితే విడెమాకె వొల్లననఁగలవా  ॥ఇప్పు॥

మెత్తినగందమువలె మెడకంటసరివలె
ముత్తెమువలెనే వురమున నుందాకె
హత్తి శ్రీవేంకటేశుఁడ అట్టె నన్నుఁగూడితివి
బత్తి సేసితివాపెతోఁ బంతమాడఁగలవా     ॥ఇప్పు॥
Details and Explanations:
ఇప్పుడే తెలుసుకో నీకెఱఁగ విన్నవించితి
కొప్పువ ట్టీకె దీసితే గుంపించఁ గలవా    ॥పల్లవి॥ 
Telugu Phrase
Meaning
ఇప్పుడే తెలుసుకో
వెంటనే గ్రహించు, (ఇప్పుడు లేదా ఎప్పటికీ కాదు అన్న అత్యవసర భావము)
నీకెఱఁగ విన్నవించితి
నేను ముందే నీకు స్పష్టముగా వివరించితిని
కొప్పువ ట్టీకె దీసితే
(కొప్పు = జుట్టు పట్టి; ఈకె = ఆ స్త్రీ, మాయ) మాయ స్త్రీ నిన్ను జుట్టు పట్టి లాగుతూ ఉంటే
గుంపించఁ గలవా
(గుంపించు = అతిక్రమించు) నువ్వు తట్టుకోగలవా? ఆ కఠిన పరీక్ష మీర గలవా?
సూటి భావము:
ఎవరో తెలియని ఒక స్త్రీ స్వరం అన్నమాచార్యులతో ఇలా అంటుంది. పాట సందర్భాన్ని బట్టి దేవతా స్వరం అనుకోవచ్చు. ఆమె 'ఆపే' అని సంబోధిస్తున్నది  'మాయ' గురించి: “ఇప్పుడే గ్రహించు, ఆలస్యం చేయకు. నేను నీకు ముందే అన్నీ వివరించాను. ఆమె నిన్ను జుట్టు పట్టి లాగుతూ ఉంటే నువ్వు తట్టుకోగలవా? ఆ కఠిన పరీక్ష మీర గలవా?

గూఢార్థవివరణము:

ఇప్పుడే తెలుసుకో: అన్నమాచార్యులు నొక్కి చెబుతున్నారు — "ఇప్పుడే తెలుసుకో" మంటున్నారు. తక్షణం చేయకపోతే, కొంచెం ఆగినా మనస్సు ఆకళింపు చేసుకొని తన ఆత్మ రక్షణ వ్యూహంతో సిద్ధంగా ఉంటుంది. ​"రేపు చేస్తాను" “భవిష్యత్తులో చేస్తాను" అన్న భద్రత కల్పిస్తుంది. ఆ రక్షణ వలయం నుంచి బయటకు రాలేక గింజుకుంటాం. (జిడ్డు కృష్ణమూర్తి కూడా ఇలానే చెప్పేవారు)

కొప్పువ ట్టీకె దీసితే: జుట్టు పట్టి బలంగా లాగుతుంటే, మూలమూలల్లో  నెప్పెడుతుంటే తట్టుకోలేం? ఈ స్వీయ అవగాహన ప్రయాణంలో బాధ అనేది ఆటంకహేతువు. ఇక్కడే మనసు పని మొదలు. "ఇంత కష్టం కాకుండ కొంత సులుభంగా పొందు మార్గములుండవచ్చు" అన్న భద్రత కల్పిస్తుంది. మనసు ఎలా మాయ చేస్తోందో చరణాలలో తెలిపారు.

వైతరణి దాటుట: చీము, నెత్తురు, ఎముకలు, మాలిన్యాలతో పారుచుండు జుగుప్సాకరమైన నది వైతరణి. వైతరణి నది దాటుట ఒక మానసిక ఏకమార్గ (one way journey) ప్రయాణం అనుకోవాలి.  ఈవలి ఒడ్డు = పాత మనస్సు, ఆలోచనలు, వ్యక్తిత్వం - మన ఇప్పటి మనఃస్థితి. ఆవలి ఒడ్డు = మనకు తెలియదు. ఈవలి ఒడ్డు వదిలితేనే ఆవలి ఒడ్డుకు చేరగలం. ఈవలి ఒడ్డు వదలకుండా ఎక్కడికీ చేరము. ఇక్కడే ఉంటాము. దీనినే ఆచార్యులు "కొప్పువ ట్టీకె దీసితే" తో చూపారు

సంకల్పం —అడ్డంకి:
ఈ యజ్ఞంలో బలి కావలసింది మన సంకల్పమే.
“అమలమగు విజ్ఞానమను మహాధ్వరమునకు–
నమరినది సంకల్పమను మహాపశువు…” (Ref Poem 39)
మనిషి తాను సిద్ధమౌతాను, తాను సిద్ధం చేసుకొంటాను అని చెప్పుకుంటే అదే అడ్డంకి. (గీతా 6-2 చూడండి)

ఈ వైతరణి నది దాటడం మన ప్రయత్నం ద్వారా నెరవేరదు. అది పూర్తి శరణాగతి ద్వారానే సాధ్యం.

ఈ సందర్భంగా అన్నమాచార్యులు శరణాగతిలోని బాధ గురించి ఎక్కువ ఆలోచించ వద్దంటూ ఇలా చెప్పారు.

వెరవకువే యింత వెరగేలా నీకు
నెఱిఁ గురిసీఁ గొప్పున నీలాలు        ॥పల్లవి॥
ఇంతగా భయపడవద్దు. ఆ వక్రతలోనే (ఆ మార్పులోనే, ఆ రూపాంతరములోనే) నీలాలు నీ కొప్పులో కురుస్తాయి అని సముదాయిస్తున్నారు

అలమేలుమంగ —సమర్పణ:

ఈ శరణాగతి దశలో వ్యక్తిగత భావాలు పూర్తిగా కరిగిపోతాయి. ఈ శరీరం, ఈ మనసు “నాది” అన్న భావన తొలగిపోతుంది. అది ధర్మమునకు, సత్యమునకు చెందినది — ఆయన సేవకు మాత్రమే అన్నది వేళ్ళూనుకొంటుంది.

ఈ స్థితినే అన్నమాచార్యులు “అలమేలుమంగా” భావముతో వ్యక్తీకరించారు. “అలమేల్మంగ పురుషాకారమున ఆచార్యుననుమతి మెలఁగును.” ​అన్నారు పెదతిరుమలాచార్యులు అంటే, ఆచార్యుని (దైవము) అనుగ్రహముతో, ఆత్మ దైవానికి సేవికగా మారుతుంది.

ఆ శరణాగతి దశలో వారు తామున్న స్థితిని నిర్ధారణ చేయలేక పోతారు. వారి మనస్సు దైవము మనస్సుతో ఒకటై వుంటుంది. తమను తాము గుర్తించ లేరు. “అన్నమాచార్యుల భాషలో అది అలమేలుమంగ రూపంలో వెలిసింది; జిడ్డు కృష్ణమూర్తి దాన్ని ‘the other’ అని పిలిచాడు. భిన్న భాషలు, ఒకే అనుభవ సత్యం.”

అన్నమాచార్యుల వ్యూహం: 

ఈ లోతైన సత్యం భయంకరముగా, అసౌకర్యంగా అనిపించవచ్చు. ఆ అనిర్వచనీయమైన మార్పు లోక సంక్షేమమునకు, అసాధ్యమైన దానిని సులభముగా ప్రజల ముందుంచారు. దానికి ఆయన శృంగారము అద్ది — ప్రేమ, కలహం, మాధుర్యముల ద్వారా అందరిని ఆకర్షించారు.

సారాంశం
  • ఇప్పుడే చూడు. ఆలస్యం చేయకు.
  • పాత conditioning నుండి లాగిపడవేయబడటం బాధాకరం.
  • దాన్ని మానవ సంకల్పం ఆపలేదు; సమర్పణ మాత్రమే రక్షణ.
  • ఆ సమర్పణలోనే వ్యక్తిత్వం కరుగుతుంది.
  • ఆ తరువాతి వెలుగు — “అలమేలుమంగా” అనుభవం: శరీరం, మనస్సు, జీవితం ప్రభువుకు చెందింది.

 


మొదటి చరణం:

పుత్తడిబొమ్మవలె పూచిన లతికవలె
చిత్తరుపతిమెవలెఁ జెలి యున్నది
మత్తిల్లి యప్పటి నేఁడు మాతో నేమినవ్వేవు
వొత్తుకాపె విలిచితేఁ బోకుండఁగలవా ॥ఇప్పు॥


Telugu Phrase
Meaning
పుత్తడిబొమ్మవలె
పుత్తడిబొమ్మవలె
పూచిన లతికవలె
పూచిన లతికవలె
చిత్తరుపతిమెవలెఁ జెలి యున్నది
చిత్రపటమువలె అందముగా కనబడుతుంది
మత్తిల్లి యప్పటి నేఁడు మాతో నేమినవ్వేవు
నిన్నటి మత్తులో నుండి నేడు మాతో నవ్వబోతావు
వొత్తుకాపె విలిచితేఁ బోకుండఁగలవా
(తిరిగి) పొత్తులకు ఆమె పిలిచితే పోకుండా నిలువ  గలవా? (లేవు)
సూటి భావము:
(దేవతాస్త్రీ  అంటున్నది) ఆమె పుత్తడిబొమ్మవలె మెరుస్తూ, కొత్తగా పూసిన లతికవలె సొగసుగా, చిత్రపటమువలె మైమరచిపోయే అంత అందముగా కనబడుతుంది. ఆకర్షణ, ఆప్యాయత, సులభముగా అందినదని అనిపించే మత్తు నవ్వులతో మనసును బంధిస్తుంది. కానీ నిన్నటి మత్తులో నుండి నేడు మాతో నవ్వబోతావు (దైవమును నిన్న అను మత్తుతో — అంటే మనిషి నిద్రలోనే ఉన్నాడన్నమాట—నేడు — ఈ క్షణములో కలియబోతావు — అది సాధ్యము కాదని తెలిసి ఈ పనిలేని పనులేలా?) ఆమె (తిరిగి) పొత్తులకు పిలిచితే పోకుండా నిలువ  గలవా? (లేవు)

గూఢార్థవివరణము:

మనిషి అందుకోగలిగిన, ఆస్వాదించగలిగిన, రుచి చూడగలిగిన, కొలవగలిగిన, అంతస్తులున్న, ఏదోవొక రీతిలో నిరూపించగలిగిన వాటిపట్లే ఆకర్షితుడవుతాడు. ప్రపంచమున అందరి జీవనానుభవాలు కలిపితే దాదాపు అపరిమితం.  కాబట్టి వాటిని ఆయా ప్రత్యేక కోణాల్లో చూచినప్పుడు క్రొత్తగా అగుపడతాయి. సమాజం సహజంగానే వీటినే ప్రోత్సహిస్తుంది, ఆరాధిస్తుంది. 

కానీ క్రూరమైన వాస్తవం ఏమిటంటే —మనిషికి కావలసింది సత్యం కాదు. సత్యం గురించి మాట్లాడటమే కావలసింది. అందుకే వేలాది సంవత్సరాలుగా ఒక “ఆధ్యాత్మిక​ వినోదం” అనే పరిశ్రమ ఏర్పడింది: గ్రంథాలు, వాటిపై వ్యాఖ్యానాలు, ప్రబంధములు, నాటకాలు, యాగాలు, వేదికలు, వేడుకలు, బుర్రకధలు, స్థానిక/భాషా రూపాంతరాలు, సినిమాలు, టీవీ సీరియల్స్, మహత్తరమైన ఊరేగింపులు. ఇవన్నీ ప్రజలను మరింత “ఆధ్యాత్మికంగా” భావింపజేస్తాయి. ఇంకా రసవత్తరమైన ప్యాకేజీ కోసం వీటిలొ శృంగారాన్ని చొప్పిస్తారు కూడా. ఈ ఆకర్షణను ఎవ్వరూ కాదనలేరు.

ఇలాంటి నేపథ్యములో అన్నమాచార్యులు ఒక్కసారిగా సూదికొన నిశితత్వముతో అడుగుతున్నారు: “ఆమె పొత్తులకు పిలిచితే పోకుండా నిలువ  గలవా? 

జవాబు: నిర్దాక్షిణ్యంగా లేదు.

ఎందుకంటే మాయ బిచ్చ మెత్తుకుంటూ రాదు. ఆమె బంగారు బొమ్మలా, వికసించిన లతలా, వెలిగే చిత్రపటంలా వస్తుంది. ఆహ్లాదకరంగా, మనోహరంగా, మత్తెక్కించేలా ఆకర్షిస్తుంది. ఒక క్షణం నీతోనే నవ్వుతుంది కూడా — పరిచయమై, హాని లేనట్టుగా. ఇలాంటి రూపాన్ని వదిలి, లంగోటీ బట్టల సాములతో ఎవరు వెళతారు చెప్పండి? ఆమె పిలుపు రాగానే స్వాములవెంట పరుగెత్తే కొద్ది మంది కూడా రెక్కలొచ్చి ఎగిరిపోతారు. పాపం ఆ స్వామికి కూడా సందేహం పుట్టుకొచ్చేలా!


రెండవ​ చరణం:
కొసరుఁగోయిలవలె కొలనితుమ్మిదవలె
పసని చిలుకవలెఁ బలికీనాపె
నసలు సేయుచు నిట్టే నాతో మాటలాడేవు
వొసగితే విడెమాకె వొల్లననఁగలవా       ॥ఇప్పు॥ 
Telugu phrase
Meaning
కొసరుఁగోయిలవలె
కోయిల వలె తీయగా అనురాగముతో పిలుస్తే
కొలనితుమ్మిదవలె
నిండు కొలనులోని  పద్మముల చుట్టూ తుమ్మెదలలాగ కవి కమలముల (మదిలో భావము, కొత్తదనము, చిలిపితనము కవ్వించుచుండగా)
పసని చిలుకవలెఁ బలికీనాపె
లేతపచ్చని చిలుకలాగా ఆమె వేళాకోళం ఆడుతుంటే, కొత్త రంగులకళ నాట్యమాడుతుంటే
నసలు సేయుచు నిట్టే నాతో మాటలాడేవు
(నసలు = పొద్దుపుచ్చు)
ఏదో పొద్దుపుచ్చు కలాపములుగా నాతో ఇలా మాట్లాడుతున్నవు కానీ
వొసగితే విడెమాకె వొల్లననఁగలవా
ఆమె తాంబూలమంటు ఇస్తే కాదనగలవా?
సూటి భావము:
(దేవతాస్త్రీ  అంటున్నది) ఆమె కొయిల వలె కూస్తుంది, కొలనులో తుమ్మెద వలె వికసిస్తుంది, పచ్చని చిలుక వలె చలాకీగా కనబడుతుంది. చిరునవ్వులు చిందిస్తూ ముచ్చట్లు చెబుతుంది.  దేవతాస్త్రీ స్వరంలో హేళన హెచ్చింది - ఈ శరణాగతి, దైవము నీకు పొద్దుపుచ్చుటకు మార్గములు. నిజంగా ఆమె ప్రేమకు గుర్తుగా విడెము చేతిలో పెడితే — దానిని తిరస్కరించగలవా?

గూఢార్థవివరణము: 
మాయ మనల్ని ఆకర్షించేది కేవలం రూప సౌందర్యంతోనే కాదు. ఆమె మనల్ని లోతైన సంబంధం ద్వారా, ఆత్మీయత ద్వారా బంధిస్తుంది. మాటలతో, నవ్వులతో, ప్రేమ సూచనలతో — “ఇదిగో విడెము” అని మనసును తాకుతుంది.

ఇదే అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే ఇలాంటి ప్రేమసూచనను, ఆత్మీయతను, సాన్నిహిత్యాన్ని నిరాకరించడం చాలా కష్టం. ఇది మన బుద్ధికి మాత్రమే కాదు — మన హృదయపు ఆత్రుతకు కూడా తోడౌతుంది.

మూడవ​ ​ చరణం:

మెత్తినగందమువలె మెడకంటసరివలె
ముత్తెమువలెనే వురమున నుందాకె
హత్తి శ్రీవేంకటేశుఁడ అట్టె నన్నుఁగూడితివి
బత్తి సేసితివాపెతోఁ బంతమాడఁగలవా ॥ఇప్పు॥

Telugu Phrase
Meaning
మెత్తిన గందమువలె మెడకంటసరివలె
మెత్తని గంధంలాగా, మెడలో ధరించే హారం వలె — దగ్గరగా, శరీరానికి అంటుకునేలా, మనసును కట్టిపడేసేలా.
ముత్తెమువలెనే వురమున నుందాకె
ముత్యమువలె నేరుగా గుండెను తాకినది — అత్యంత లోతైన ప్రీతితో, లోనికి చొచ్చుకుపోయిన ఆకర్షణ.
హత్తి శ్రీవేంకటేశుఁడ అట్టె నన్నుఁగూడితివి
నన్ను ఎత్తి, శ్రీవేంకటేశుడు తనలోకి చేర్చుకున్నాడు — ఆత్మను స్వీకరించిన దైవానుభవం.
బత్తి సేసితివాపెతోఁ బంతమాడఁగలవా
కానీ, ఆ స్త్రీ (మాయ) ఆమె బాణసంచా వత్తి లాంటిది. అంటిన తక్షణమే పేలుతుంది. ఆమెతో పంతములాడగలవా? (అంటే, నిజంగా ఆ ఆటను తట్టుకోగలవా?)
 సూటి భావము:
(దేవతాస్త్రీ  అంటున్నది) ఆమె (మాయ) మెత్తని గంధంలాగా, మెడలో ధరించే హారం వలె శరీరానికి అంటుకొని ఉంది. స్వచ్ఛమైన ముత్యమువలె గుండెను తాకుతుంది. (అన్నమాచార్యుల అంటున్నారు) కానీ శ్రీవేంకటేశుడు నన్ను ఈ అంధకారం నుంచి ఎత్తి  నాతో కూడివున్నాడు. దేవా, ఆ స్త్రీ బాణసంచా వత్తి లాంటిది. అంటిన తక్షణమే పేలుతుంది. ఆమెతో పంతములాడగలవా? (అంటే, నిజంగా ఆ ఆటను అంటే నిప్పుతో చెలగాటాన్ని నువ్వైనా తట్టుకోగలవా?)

గూఢార్థవివరణము:
అన్నమాచార్యుల భాషా వ్యూహం ఇక్కడ చాలా చమత్కారమైంది:
  • మొదటి చరణం → మాయ యొక్క వెలుపలి ఆకర్షణ (బంగారు బొమ్మ, చిత్రపటం).
  • రెండో చరణం → సన్నిహితత, అనుబంధం (చిలుక, కోయిల).
  • మూడో చరణం → లోతైన బంధం, గుండెను తాకే ఆకర్షణ. ఇప్పుడు స్పర్శ, లోనికి చేరే తాకిడి. 
కానీ ఇక్కడ అన్నమయ్య కొంత వ్యంగ్యంగా అ దైవంతో సహా అందరికీ సవాలు విసురుతున్నట్లుంది. "ఎత్తి నన్ను నీలో చేర్చుకున్నావు కదా? అది సరే కానీ, బాణసంచా లాంటి ఆ స్త్రీ అంటిన (ముట్టుకున్న​) వెనువెంటనే నీలో మంటలు రేపుతుంది. ఆ అగ్గితో చెలగాటం ఆడగలవా”?

ఈ కీర్తన ముఖ్య సందేశం

అన్నమాచార్యులు ఆ మాయ పట్ల ఎంత జాగరూకతతో వుండాలో చెప్పారు.


X-X-The END-X-X

No comments:

Post a Comment

T-262R ఇప్పుడే తెలుసుకో నీకెఱఁగ విన్నవించితి

  262R  ఇప్పుడే తెలుసుకో నీకెఱఁగ విన్నవించితి ఉపోద్ఘాతము   అన్నమాచార్యులు మన మనస్సులలో ఆ మాయ తెలియకుండ ఎలా చొచ్చుకొని పోతుందో అద్భుతంగా వి...