|
అధ్యాత్మ కీర్తన
|
|
రేకు: 88-6 సంపుటము: 1-434
|
|
ఇందిరాధిపుని
సేవ యేమరకుండుట గాక బొందితోడి
జీవులకు బుద్ధు లేఁటిబుద్ధులు ॥పల్లవి॥ రేయెల్లా
మింగిమింగి రేపే వెళ్లనుమియు బాయట
నిద్రాదేవి పలుమారును చాయలకు
నిచ్చనిచ్చా జచ్చిచచ్చి పొడమేటి మాయజీవులకు
నెల్లా మని కేఁటిమనిక ॥ఇందిరా॥ కనురెప్ప
మూసితేనే కడు సిష్టే చీఁకటౌను కనురెప్ప
దెరచితే క్రమ్మరఁ బుట్టు ఘనమై
నిమిషమందే కలిమి లేమియుఁ దోఁచె యెనయు
జీవుల కింక యెఱు కేఁటియెఱుక॥ఇందిరా॥ వొప్పగుఁ
బ్రాణము లవి వూరుపుగాలివెంట యెప్పుడు లోనివెలికి నెడతాఁకును అప్పఁడు
శ్రీవేంకటేశుఁ డంతరాత్ముఁ డందరికి తప్పక యాతఁడే కాచు తలఁపేఁటి తలఁపు॥ఇందిరా॥
|
|
తెలుగు పదము
|
భావము
|
లోతైన భావము
|
|
ఇందిరాధిపుని సేవ యేమరకుండుట గాక
|
ఇందిరాధిపుని సేవలో ఏమరుపాటు లేకుండా నిలిచి ఉండటమే
బుద్ధి.
|
అగ్ని కాలుస్తుందన్న విషయం మరువలేనట్లుగా, ఇందిరాధిపుని సేవలో ఏమరుపాటు లేకుండా ఉండటమే బుద్ధి.
|
|
బొందితోడి జీవులకు బుద్ధు లేఁటిబుద్ధులు
|
ఈ శరీరమే అధారంగా జీవించే జీవుల బుద్ధి ఏమి బుద్ధి?
|
ఈ శరీర ఉనికిని కొనసాగించుట కోసం సత్యంతో రాజీపడే బుద్ధి
ఎటువంటిది?
|
|
తెలుగు పదము |
భావము |
లోతైన భావము |
|
రేయెల్లా మింగిమింగి రేపే వెళ్లనుమియు |
నిద్రాదేవి రాత్రంతా జీవులను మింగి, మరుసటి రోజు బయటకు ఉమ్మివేస్తుంది. |
మనిషి పగలును కూడా రాత్రిలాగే వ్యర్థంగా గడుపుతూ, అదే జీవనచక్రంలో తిరుగుతుంటాడు. |
|
బాయట నిద్రాదేవి పలుమారును |
నిద్రాదేవి జీవులను పలుమార్లు మింగి, బయటకు ఉమ్మివేస్తుంది. |
అజ్ఞానమనే నిద్ర మనిషిని పదేపదే ఆవరిస్తూ, తెలిసినదాని ఆధారంగా సాగే లౌకిక కార్యకలాపాలలోకి
నెడుతుంది. |
|
చాయలకు నిచ్చనిచ్చా జచ్చిచచ్చి పొడమేటి |
మాయలో ఉన్న జీవులు ఏదో ఒకదానిని ఎంతో ఆశతో, చచ్చేంత కష్టపడి ప్రయత్నిస్తూ మళ్లీ మళ్లీ పుడుతుంటారు. |
మనిషి తనకు తెలిసినదానిని ఆధారంగా చేసుకొని, ఏదో సాధించాలనే తపనతో నిరంతరం ప్రయత్నిస్తుంటాడు. ఆ
ప్రయత్నం అతడిని అదే పునరావృత జీవనచక్రంలో ఉంచుతుంది. |
|
మాయజీవులకు నెల్లా మని కేఁటిమనిక |
మాయలో జీవించే ఈ జీవుల ఉనికికి, వారి జన్మలకు ఏమి ప్రయోజనం? |
అదే అజ్ఞానంలో, అదే
ప్రయత్నాల పునరావృతిలో కొనసాగుతున్న జీవితానికి అసలు ప్రయోజనం ఏమిటి? |
భావము
పలుమారులు అనగా పదేపదే నిద్రాదేవి (మోహము) రాత్రంతా జీవులను
మింగిమింగి, మరుసటి రోజు బయటకు ఉమ్మివేస్తుంది. మాయలో
చిక్కుకున్న జీవులు ఏదో ఒకదానిని సాధించాలనే ఆశతో, ఎంతో
కష్టపడి ప్రయత్నిస్తూ, మళ్లీ మళ్లీ జన్మిస్తుంటారు. అలా
మాయలో జీవించే ఈ జీవుల జన్మలకు అసలు ప్రయోజనం ఏమిటి?
అన్వయార్థము
అజ్ఞానమనే నిద్ర జీవులను పదేపదే ఆవరిస్తుంది. మోహము
జీవులందరినీ కప్పివేయగా, మనిషి మేల్కొని ఉన్నప్పటికీ పగటి సమయాన్ని
కూడా రాత్రిలాగే — గాఢాంధకారంలో సత్యాన్ని గ్రహించకుండానే — గడుపుతుంటాడు. అది
ఇప్పటికే వ్యక్తమైన దాని (తెలిసినదాని) ఆధారంగా సాగే లౌకిక కార్యకలాపాలలోకి
మనిషిని నెడుతుంది. అయినప్పటికీ, ఏదో సాధించాలనే తపనతో అతడు
నిరంతరం ప్రయత్నిస్తుంటాడు.
సూదంటురాయి ఏ దిశ నుంచి వచ్చినా ఇనుమును ఆకర్షించినట్లుగా, సాధించుట మరియు సాధించలేకపోవుట అనే రెండు స్థితులూ మనిషిని అదే వర్తుల
జీవనచక్రంలో బంధించి ఉంచుతాయి. ఈ విధంగా ప్రయత్నించడం, ప్రయత్నించకపోవడం
అనే రెండు వ్యతిరేక ధోరణులూ మనిషిని ఒకే పరిమిత వలయంలో అదిమిపెట్టి
పరీక్షిస్తుంటాయి. అసలు ఈ జీవితానికి ప్రయోజనం ఏమిటి?
భావము
కనురెప్పలు మూసినప్పుడు (మరణంలో) ఈ తెలిసిన ప్రపంచం చీకటిగా
మారుతుంది. కనురెప్పలు తెరిచినప్పుడు (పుట్టినప్పుడు) సృష్టి మళ్లీ గోచరించి, పాత పద్ధతిలోనే కొనసాగుతుంది. ఆ కొద్ది క్షణాలలోనే కలిమి (బ్రతికి ఉన్న
భావము), లేమి (మరణించిన భావము) రెండూ శాశ్వతమైనవిగా
తోస్తాయి. అటువంటి భావాలను శాశ్వతమైనవిగా అనుభవించే జీవులకు ఉన్న ఎరుక ఎటువంటిది?
వారి తెలివి ఎటువంటిది?
అన్వయార్థము
మనిషి తనకు తెలిసిన ప్రపంచంతో ఉన్న సంబంధం తెగిపోయినప్పుడు, ఆ ప్రపంచం అతనికి అంధకారమనిపిస్తుంది. తిరిగి ఆ ప్రపంచంతో సంబంధం
ఏర్పడినప్పుడు, సృష్టి మళ్లీ గోచరించి, తెలిసిన పాత ధోరణులలోనే జీవితం కొనసాగుతుంది. అజ్ఞానమనే నిద్ర నుంచి
మేల్కొన్నట్లు కనిపించినా, మనిషి మళ్లీ తనకు తెలిసిన
ప్రపంచంలోకే ప్రవేశిస్తాడు. కలిమి (బ్రతికి ఉన్న భావము), లేమి
(మరణించిన భావము) అనే అనుభూతులకు వాస్తవికతతో సంబంధం ఉండదు. అయినప్పటికీ, ఈ అనుభూతులనే మనిషి ఘనమైనవిగా, నిజమైనవిగా, శాశ్వతమైనవిగా భావిస్తాడు. ఈ విధంగా ఘనమైనదిగా, వాస్తవమైనదిగా
తోచే ప్రపంచం అసలు స్వరూపం మిథ్య. ప్రపంచ స్వరూపం మిథ్య అని గ్రహించలేని జీవుల
అవగాహనను ఎటువంటి ఎరుకగా పరిగణించాలి? వారి ఉనికికి అసలు
అర్థమేమిటి?
గూఢార్థవివరణము:
ఇది నిరాశావాద దృక్పథం కాదు. కవి మనకు అద్దం పడుతున్నారు; మన స్వంత చర్యలను మనమే గమనించుకునేలా చేస్తున్నారు. స్మృతులు, జ్ఞాపకాలు, చరిత్రల మీద ఆధారపడిన తెలివితో మనం
వివేకవంతులమని చెప్పుకోబోతాం. అయితే, ఈ రకమైన సంప్రదాయ
జ్ఞానమే సత్యంతో మమేకమవడానికి అడ్డుపడవచ్చు. ఈ విషయాన్ని రెమెడియోస్ వారో
చిత్రించిన అధివాస్తవిక చిత్రం రహస్యోద్ఘాటన (Revelation – The
Clockmaker) ను పరిశీలించడం ద్వారా మరింత స్పష్టంగా చూడవచ్చు.
ఈ చిత్రంలో ఒక గుడారంలాంటి నిర్మాణం కనిపిస్తుంది. దాని
పైకప్పు కిందికి ఒరిగిపోకుండా గడియారపు స్తంభాలు దానిని నిలబెడుతున్నట్లు ఉన్నాయి.
ఆ స్తంభాలలో ఆయా కాలాలకు చెందిన ప్రతిమలు కనిపిస్తాయి. చరిత్రలో కాలాలు మారినా, మానవుని
ప్రయత్నాలు మాత్రం గుడారం కప్పు
పడిపోకుండా, అంటే ఒకే విధంగా, కొనసాగుతున్నాయనే భావనను ఈ
ప్రతిమలు సూచిస్తున్నాయి.
క్రింద ఉన్న గళ్ళు వేసిన నేల సహజమైనది కాదు. అది మనిషి
నిర్మించుకున్న క్రమబద్ధమైన ప్రపంచాన్ని సూచిస్తున్నట్లుంది. కిందకు ఒరిగిపోతున్న
పైకప్పు మన మనస్సు. మన జ్ఞాపకాలలో నమోదైన చరిత్ర అనే స్తంభాలు ఆ పైకప్పు
కూలిపోకుండా నిలబెడుతున్నాయి. ఈ మొత్తం నిర్మాణం కాలగమనాన్ని, కాలంతో పాటు కొనసాగుతున్న మానవ ప్రయత్నాలను సూచిస్తున్నట్లుగా
కనిపిస్తుంది. మనిషి యొక్క ఎఱుక (awareness) కూడా ఆ
గుడారంలాంటిదే.
ఆ గదికి ఒక కిటికీ ఉన్నప్పటికీ, అది నల్లని
రంగుతో మూసివేయబడినట్లుగా చూపబడింది. గదిలోని ప్రకాశమంతా అక్కడ ఉన్న వస్తువుల
నుంచే వస్తున్నట్లు కనిపిస్తుంది. మన ఎఱుక కూడా తన గ్రహింపుకు వచ్చిన వాటి నుంచే
వెలుగును పొందుతున్నదనే భావన ఇక్కడ కలుగుతుంది. ఆ గదిలో ఒక
యువతి కూర్చొని, అది తన పని
అన్నట్లుగా గడియారపు స్తంభాలకు అవసరమైన విడిభాగాలను — పళ్ళ చక్రాలను — తయారు
చేస్తున్నది. అదే సమయంలో, తనకు ఆ పనితో, ఆ పరిసరాలతో, ఆ వాతావరణంతో
సంబంధమే లేనట్లుగా కూడా ఆమె భంగిమ కనిపిస్తుంది. అక్కడ కూర్చున్న పిల్లి మాత్రం ఆ
మొత్తం ఉదంతాన్ని, తనకు ఏ
సంబంధమూ లేనట్లుగా గమనిస్తున్నది. (ఇష్టమున్నా
లేకపోయినా మనం ఈ ప్రపంచం నడిచే దిశకు చేయూతని ఇస్తున్నాం.)
ఆ పక్కనే ఒక విచిత్రమైన తిరుగుతున్న చక్రం కనిపిస్తుంది.
దానిలో సగభాగం గుడారంలోనూ, మిగిలిన
సగభాగం బయటా ఉన్నట్లు చిత్రించారు. బయట నుంచి వచ్చే అసలు కాంతి గదిలోకి
పాక్షికంగానే ప్రవేశిస్తున్నదనే భావన దీనిలో కనిపిస్తుంది. గదిలోని ప్రకాశంతో
పోలిస్తే ఆ చక్రం నుంచి వచ్చే కాంతి చాలా తక్కువగా ఉంది. మన మనస్సు నిర్దిష్టమైన
దానినే అంగీకరించును. అస్పష్టతను స్వీకరించలేదు.
మనిషి ఈ గుడారం కూలిపోకుండా కాపాడటానికి చేసే ప్రయత్నాలన్నీ
ఆ స్తంభాల వంటివే. అతని ఆందోళన అంతా ఆ స్తంభాలు పడిపోతే ఏమవుతుందనే దాని గురించే.
చరిత్రను, సంస్కృతిని, నాగరికతను
నిలబెట్టడం, తాను నమ్మిన దైవానికి సంబంధించిన ప్రతీకలను
ప్రాణాలొడ్డి రక్షించడం, పాత జ్ఞాపకాలను భద్రపరచుకోవడం —
మనిషి చేపట్టే పనులన్నీ ఈ కోవలోనివే.
"జ్ఞాపకాలతో నిర్మించుకున్న ప్రపంచాన్ని
కాపాడుకోవడంలోనే మనిషి తన బుద్ధిని వినియోగిస్తున్నప్పుడు, ఆ
ప్రపంచాన్ని దాటి ఉన్నదాన్ని చూడగలడా? తనకు తెలిసినదానిని
నిలబెట్టుకోవడమే నిరంతర ప్రయత్నంగా మారినప్పుడు, సత్యం
ప్రత్యక్షమయ్యే అవకాశం ఎక్కడ ఉంటుంది? అటువంటి జీవుల ఎరుక
ఎటువంటిదని అన్నమాచార్యులు ప్రశ్నిస్తున్నారు — మాయజీవులకు నెల్లా మని కేఁటిమనికి."
రెండవ చరణం:
కనురెప్ప మూసితేనే కడు [1]సిష్టే చీఁకటౌను
కనురెప్ప దెరచితే క్రమ్మరఁ బుట్టు
ఘనమై నిమిషమందే కలిమి లేమియుఁ దోఁచె
యెనయు జీవుల కింక యెఱు కేఁటియెఱుక ॥ఇందిరా॥
|
తెలుగు పదము |
భావము |
అన్వయార్థము |
|
కనురెప్ప మూసితేనే కడు సిష్టే చీఁకటౌను |
సిష్టే = సృష్టే; కనురెప్పలు మూసినప్పుడు (మరణంలో) ఈ తెలిసిన ప్రపంచం
చీకటిగా మారుతుంది. |
మనిషి తనకు తెలిసిన ప్రపంచంతో ఉన్న సంబంధం
తెగిపోయినప్పుడు,
అది అతనికి అంధకారమనిపించును |
|
కనురెప్ప దెరచితే క్రమ్మరఁ బుట్టు |
కనురెప్పలు తెరిచినప్పుడు (పుట్టినప్పుడు) సృష్టి మళ్లీ
గోచరించి,
పాత పద్ధతిలోనే కొనసాగుతుంది. |
అజ్ఞానమనే నిద్ర నుంచి మేల్కొన్నట్లు కనిపించినా, మనిషి మళ్లీ తెలిసిన ప్రపంచంలోకే ప్రవేశించి, పాత ధోరణులనే కొనసాగిస్తాడు. |
|
ఘనమై నిమిషమందే కలిమి లేమియుఁ దోఁచె |
ఆ కొద్ది క్షణాలలోనే కలిమి (బ్రతికి వున్న భావము), లేమి (మరణించిన భావము) అనేవి శాశ్వతమైనవిగా తోస్తాయి. |
కలిమి (బ్రతికి వున్న భావము), లేమి (మరణించిన భావము) అను అనుభూతులకు వాస్తవికతతో సంబంధం
ఉండదు. (ఈ ఘనము,
నిజమైనది, వాస్తవము అని త్రోచు
ప్రపంచము అసలు రూపము మిథ్య) |
|
యెనయు జీవుల కింక యెఱు కేఁటియెఱుక |
యెనయు = పోలు, సరిపోలు; ఆయా భావములు శాశ్వతముగా అనిపించు జీవులకు ఉన్న ఎరుక
ఎటువంటి?
వారి తెలివి ఎటువంటిది? |
ప్రపంచ స్వరూపము మిథ్య అని గ్రహించలేని జీవుల అవగాహనను
ఎటువంటి ఎరుకగా పరిగణించాలి? వారి ఉనికికి అసలు
అర్థమేమిటి? |
భావము: కనురెప్పలు
మూసినప్పుడు (మరణంలో) ఈ తెలిసిన ప్రపంచం చీకటిగా మారుతుంది. కనురెప్పలు
తెరిచినప్పుడు (పుట్టినప్పుడు) సృష్టి మళ్లీ గోచరించి, పాత పద్ధతిలోనే కొనసాగుతుంది. ఆ కొద్ది క్షణాలలోనే కలిమి (బ్రతికి ఉన్న
భావము), లేమి (మరణించిన భావము) రెండూ శాశ్వతమైనవిగా
తోస్తాయి. అటువంటి భావాలను శాశ్వతమైనవిగా అనుభవించే జీవులకు ఉన్న ఎరుక ఎటువంటిది?
వారి తెలివి ఎటువంటిది?
అన్వయార్థము: మనిషి తనకు
తెలిసిన ప్రపంచంతో ఉన్న సంబంధం తెగిపోయినప్పుడు, ఆ ప్రపంచం
అతనికి అంధకారమనిపిస్తుంది. తిరిగి ఆ ప్రపంచంతో సంబంధం ఏర్పడినప్పుడు, సృష్టి మళ్లీ గోచరించి, తెలిసిన పాత ధోరణులలోనే
జీవితం కొనసాగుతుంది. అజ్ఞానమనే నిద్ర నుంచి మేల్కొన్నట్లు కనిపించినా, మనిషి మళ్లీ తనకు తెలిసిన ప్రపంచంలోకే ప్రవేశిస్తాడు. కలిమి (బ్రతికి ఉన్న
భావము), లేమి (మరణించిన భావము) అనే అనుభూతులకు వాస్తవికతతో
సంబంధం ఉండదు. అయినప్పటికీ, ఈ అనుభూతులనే మనిషి ఘనమైనవిగా,
నిజమైనవిగా, శాశ్వతమైనవిగా భావిస్తాడు. ఈ
విధంగా ఘనమైనదిగా, వాస్తవమైనదిగా తోచే ప్రపంచం అసలు స్వరూపం
మిథ్య. ప్రపంచ స్వరూపం మిథ్య అని గ్రహించలేని జీవుల అవగాహనను ఎటువంటి ఎరుకగా
పరిగణించాలి? వారి ఉనికికి అసలు అర్థమేమిటి?
గూఢార్థవివరణము:
మన కన్నుల ఎదుట కనబడుతున్నది వ్యక్త ప్రపంచములోని భాగము.
అది జరిగిపోయిన క్షణములోనిది. కానీ కన్నుల
ఎదుట కనబడుతున్న వాస్తవ ప్రపంచమును మరువలేము. ఎదుటి ఘన ప్రపంచమును ఇంకా పుట్టని
క్షణములోకి పొడిగించలేదు. ఇంకా పుట్టని క్షణం అవ్యక్తము. వ్యక్తమొక దానిని మాత్రమే
గణనలోకి తీసుకొను మన అవగాహన పరిమితము అని ఆచార్యులు చెబుతున్నారు.
మూడవ చరణం:
వొప్పగుఁ బ్రాణము లవి వూరుపుగాలివెంట
యెప్పుడు [2]లోనివెలికి నెడతాఁకును
అప్పఁడు శ్రీవేంకటేశుఁ డంతరాత్ముఁ డందరికి
తప్పక యాతఁడే కాచు తలఁపేఁటి తలఁపు ॥ఇందిరా॥
|
తెలుగు పదము |
భావము |
లోతైన భావము |
|
వొప్పగుఁ బ్రాణము లవి వూరుపుగాలివెంట |
ప్రాణములు ఊపిరి గాలితో పాటు సాగుతుంటాయి. |
వాస్తవానికి జీవితం శ్వాస అనే సున్నితమైన, తాత్కాలికమైన
ఆధారంతో కొనసాగుతుంది. |
|
యెప్పుడు లోనివెలికి నెడతాఁకును |
ఊపిరి ఎప్పుడూ లోపలి తాకి, బయటికి వస్తూ
పోతూ ఉన్నంతవరకు జీవితం కొనసాగుతుంది. |
శ్వాస ఆడుతున్నంతవరకే మనిషి జీవితం. దాని కొనసాగింపుపై
మనిషికి నియంత్రణ లేదు. |
|
అప్పఁడు శ్రీవేంకటేశుఁ డంతరాత్ముఁ డందరికి |
అప్పడు (తండ్రి, స్వామి) అయిన
శ్రీవేంకటేశ్వరుడే అందరిలో అంతరాత్మగా ఉంటాడు. |
అందరి అంతరాత్మయైన శ్రీవేంకటేశ్వరుడే జీవులకు ఆధారం. మనమందరం ఆయనతో - అంతరాత్మ అనగా లోపలి నుండి
కలపబడి ఉన్నాము. మనము ఒకరికొకరు కనబడినా తాకగలిగినా కూడా అంతరాత్మ ద్వారానే కలపబడి ఉన్నాము. |
|
తప్పక యాతఁడే కాచు తలఁపేఁటి తలఁపు |
తప్పక ఆయనే అందరినీ కాపాడుతాడు. మరి మన ఆలోచనలు, ఊహాగానాల వల్ల ప్రయోజనమేమిటి? |
మనిషి తన ఉనికిని, భవిష్యత్తును గురించి ఎన్ని
ఆలోచనలు చేసినా, వాటిని నియంత్రించలేడు. అటువంటప్పుడు సంకుచితమైన ఆలోచనలు, అభిప్రాయాలు
ఏమి చేకూర్చగలవు, వృథా ప్రయాసము తప్పించి. |
భావము: ప్రాణములు ఊపిరి గాలితో పాటు లోపలికి,
బయటికి వస్తూ పోతుంటాయి. శ్వాస కొనసాగినంతవరకే మనిషి జీవితం
ఉంటుంది. మనిషి జీవితము సున్నితమైనది, తాత్కాలికమైనది,
స్వల్పకాలికమైనది. అందరిలో అంతరాత్మగా ఉన్న శ్రీవేంకటేశ్వరుడే
అందరినీ తప్పక కాపాడుతాడు. అటువంటప్పుడు మన ఆలోచనలు, ఊహాగానాల
వల్ల ప్రయోజనమేమిటి?
అన్వయార్థము: మానవులుగా
మనమందరమూ దైవంతో అనుసంధానమై ఉన్నవారమే. మన ఉనికి శ్వాసపై ఆధారపడి ఉన్నప్పటికీ, ఆ శ్వాస కొనసాగింపుపై మనకు నియంత్రణ లేదు. అందరిలో అంతరాత్మగా ఉన్న
శ్రీవేంకటేశ్వరుడే జీవులందరికీ ఆధారం. మనము ఒకరికొకరు వేరుగా కనిపించినా, అంతరాత్మ ద్వారా అందరమూ అనుసంధానమై ఉన్నాము. మనము ఏ విధంగా ఆ దైవంతో
అనుసంధానమై ఉన్నామో తెలుసుకోవడమే జీవిత ధ్యేయము. ఆ అనుసంధానమే తెలియనప్పుడు,
మన ఉనికిని, భవిష్యత్తును గురించి మనం చేసే
ఆలోచనలు, ఏర్పరచుకునే అభిప్రాయాలు, మన
పురోగతి అనే భావనలు ఏమి సాధించగలవు? అవి వృథా ప్రయాసలు తప్ప.
గూఢార్థవివరణము:
మానవులుగా మనమందరము దైవముతో కలపబడి ఉన్నవారము. మనము ఏ లాగున కలపబడి ఉన్నామో తెలియడమే జీవిత
ధ్యేయము. భగవద్గీత 15వ అధ్యాయంలో పేర్కొన్న సంసారవృక్షంలోని ఒక
ఆకు వంటి వారము. ఈ ఆకు ఆ మూలము ((ఆ పరబ్రహ్మతో) ఏ రకముగా కలపబడి ఉన్నది మూడవ పంక్తి తెలియజేస్తున్నది. కానీ ఆ
సంసారవృక్షం ఈ జగత్తులో కానరాదని 15-3వ శ్లోకంలో
చెప్పబడినది. అది స్వయంగా తెలియని నాడు మన అభిప్రాయాలు మన పురోగతి దేనికి పనికి
వచ్చును.
|
కీర్తన భావప్రవాహం |
||
|
భాగము |
ప్రధాన పరిశీలన |
అంతర్లీన ప్రశ్న |
|
పల్లవి |
శరీరాన్ని ఆధారంగా చేసుకుని జీవించే మనిషి బుద్ధి ఎటువంటిది? |
ఇందిరాధిపుని సేవలో ఏమరుపాటు లేని ఎరుకే నిజమైన బుద్ధి
కాదా? |
|
మొదటి చరణం |
అజ్ఞానం ఆవరించగా మనిషి నిరంతరం ఏదో సాధించాలనే
ప్రయత్నంలో పునరావృత జీవనచక్రంలో చిక్కుకుంటాడు. |
దేని మీద ఆధారపడిన తెలివితో మనం వివేకవంతులమని అనుకుంటామో
అదే సత్యముతో మమేకమవడానికి అడ్డుపడవచ్చు. |
|
రెండవ చరణం |
మనిషి ఘనమైనదిగా, శాశ్వతమైనదిగా భావించే ఈ
ప్రపంచంలో జీవనము మరణము అను అనుభూతులు నిజంగా అంతిమ వాస్తవాలేనా? |
కేవలం ఎదుట కనిపిస్తున్న వ్యక్త ప్రపంచాన్నే గణనలోకి
తీసుకునే మన అవగాహన పరిమితమైనది కాదా? |
|
మూడవ చరణం |
తృణప్రాయమగు శ్వాసపై ఆధారపడిన మనిషి తన ఉనికిని
నియంత్రించలేడు. అందరికీ అంతరాత్మయైన దైవంతో అంతర్గత అనుసంధానమే అసలు ఆధారమని
గుర్తింట ఎట్లు? |
ఆ అనుసంధానమే తెలియనప్పుడు, మనిషి
ఆలోచనలు, అభిప్రాయాలు, పురోగతి అనే
భావనలకు ప్రయోజనమేమిటి? |
|
ముగింపు — పల్లవికి తిరిగి |
మూడు చరణాల పరిశీలనలూ మనిషి తన బుద్ధి గురించి
ఏర్పరచుకున్న భావనను ప్రశ్నిస్తున్నాయి. |
బొందితోడి జీవులకు బుద్ధు లేఁటిబుద్ధులు? |
భావప్రవాహం ఒక్క వాక్యంలో
ప్రయత్నాల వెనుక ఉన్న అజ్ఞానం → వాస్తవమని భావించేదానిలోని
అనిశ్చితి → మన ఉనికికి ఆధారమైన అంతరాత్మతో అనుసంధానం → మానవ బుద్ధి
పరిమితిపై ప్రశ్న.
ఇక్కడ ఒక విషయం గమనించాలి: కీర్తన మనిషికి మరొక
సిద్ధాంతాన్ని బోధించదు. మనిషి తన గురించి, తన బుద్ధి
గురించి ఏర్పరచుకున్న అవగాహననే మూడు కోణాల నుంచి పరిశీలిస్తుంది. పల్లవిలోని
ప్రశ్న ఈ మొత్తం పరిశీలనకు కేంద్రబిందువు.

No comments:
Post a Comment