Friday, 11 July 2025

T-239 ఇసుకపాతర యిందుకేది కడగురుతు

 తాళ్లపాక అన్నమాచార్యులు

239 ఇసుకపాతర యిందుకేది కడగురుతు

 For English versionpress here

ఉపోద్ఘాతము

ఈ "ఇసుకపాతర" కీర్తన —
ఆసాంతం విలక్షణమైన అనుభవానికి అద్దం.
ఇది జీవితంపై తర్కభరిత వ్యాఖ్య కాదు —
ఒక యోగి వివరించలేని ఆవేదన.

జీవితం అనే అంతులేని గుంతలోకి జారిపోతూ,
తానే ముక్కలైపోయిన స్థితిని చూస్తున్న
ఒక యోగి అంతరాంతర అనుభూతి.

 

ప్రతి పాదం — అంతర్ముఖ ఆవాహనం.
ప్రతి భాగం — తడబడిన మనస్సు చేసే విలాపము.
లోలోనికి మడుచుకున్న మనిషి మాత్రమే
ఆ లోపలి లోతులోని వెలుగును చూడగలడు. ​

 

ఇది జిడ్డు కృష్ణమూర్తి అనుభూతిని తలపిస్తుంది —
1925లో సోదరుడు నిత్య
మరణంతో ఆయన తబ్బిబ్బయ్యారు.
ఆ కన్నీటి సముద్రములోనే సత్యం ఆయనకు గోచరమయ్యింది.
ఇలాంటి అనుభవాలు విశ్లేషించలేం —
వాటిలోకి అంతర్లీనమవ్వాలి.
అలా ముడిపడి చూసిన వారికే —
వెలుగు లోలోపలే కనిపిస్తుంది.
అన్నమయ్యకు, కృష్ణమూర్తికి

తమ శోకంలో “చూసే శక్తి” కలిగింది.

 

అధ్యాత్మ​  కీర్తన

రేకు: 137-6 సంపుటము: 7-222

ఇసుకపాతర యిందుకేది కడగురుతు
రసికుఁడ నన్నునింత రవ్వశాయ నేఁటికి ॥పల్లవి॥

 

బయలు వలెనుండును పట్టరాదు వలపు
మొయిలువలెనుండును ముద్దశాయరాదు
నియతములేదించుకు నేరిచినవారిసొమ్ము
క్రియ యెరుంగుతా నన్నుఁ గెరలించనేఁటికి ॥ఇసుక॥

 

గాలివలెఁ బారుచుండు కానరాదు మనసు
పాలవలెఁ బొంగుచుండు పక్కననణఁగదు
యేలీలా గెలువరాదు యెక్కితే యేనుగగుజ్జు
లోలోనె మమ్మునింత లోఁచి చూడనేఁటికి  ॥ఇసుక॥

 

వెన్నెలే కాయుచునుండు వింతగాదు వయసు
అన్నిటా వసంతరుతువై యుండుఁ బోదు
వున్నతి శ్రీ వేంకటేశుఁడుండనుండఁ జవి వుట్టు
మన్నించె యింక మారుమాటలాడనేఁటికి ॥ఇసుక॥

Details and Explanations:

పల్లవి:

ఇసుకపాతర యిందుకేది కడగురుతు
రసికుఁడ నన్నునింత రవ్వశాయ నేఁటికి ॥పల్లవి॥ 

పదబంధం

అర్థం

ఇసుకపాతర

(పాతర =ధాన్యముంచెడి గొయ్యి,  నేలలో త్రవ్విన గొయ్యి) ఇసుక గొయ్యి

(ఆ గోతిలో పడితే అలా క్రిందకి వెళుతూనే వుంటామన్న అర్ధంలో)

యిందుకేది కడగురుతు

దీనికేది ఇంత లోతని చెప్పు సూచి. (లేదని భావము)

రసికుఁడ

ఓ రసజ్ఞుడా (దైవమా)

నన్నునింత రవ్వశాయ నేఁటికి

తునకలు తునకలుగా చేయడమెందుకు

 

 

ప్రత్యక్ష భావము

 

ఈ నా లోని ప్రపంచమొక నేలలో త్రవ్విన గొయ్యి (ఇసుకపాతర).
దీనికింత లోతని చెప్పలేమే!
(ఆ గోతిలో పడితే అలా క్రిందకి వెళుతూనే వుంటామన్న అర్ధంలో).

ఓ రసజ్ఞుడా (దైవమా)
నన్ను ఇన్ని తునకలు తునకలుగా చేయడమెందుకు.

వ్యాఖ్యానం:

Part A

ఇసుకపాతర యిందుకేది కడగురుతు

దీని లోతెంత? ఈ గోతిలోకి ఎందుకు పడిపోయాను?”
(తానెటుపోవుతున్నది తెలియటంలేదని అన్నమయ్య ఆవేదన​)
దీనిని
M C యెస్చెర్ గారు సృష్టించిన
మరో లోకం (Another World 2)
అర్ధము చేసుకుంటూ తెలుసుకుందాము.

 



మొదటగా బొమ్మ క్రింది లోకాన్ని చూపిస్తోందా లేక పై లోకాన్నా?
నిర్ణయించలేము!
ఏ తలమునకు ఆ తలము పై పాకుతూ వెళితే
వేరే లోకాలను చేరవచ్చు అనిపిస్తుంది.
ఏ గోడకాగోడ తమ తమ తలములనుండి
క్రొంగొత్త లోకాల​ విహారము
చేయ వచ్చనిపించేటట్లు వుంటాయి.
 
ప్రతి దృక్కోణంలో మనం
మానవ ముఖం కలిగిన పక్షి వంటి జీవిని
లేదా గొలుసుల నుండి వేలాడుతున్న కొమ్ములను చూస్తాము.
కానీ ఏది అడుగు భాగమో, ఏది పైభాగమో,
ఏది నేలయో, ఏది గోడయో చెప్పలేక పోతాము.
 
మన జీవితము అంతే. ఎటుపోతున్నామో తెలియదు.
ఎటు వైపు కదిలితే దైవమును చేరవచ్చో చెప్పలేము.
కాని ఆగకుండా కదులుతుంటాము.
పనిలేని పిల్లిలా.

 


Part B

రసికుఁడ నన్నునింత రవ్వశాయ నేఁటికి
(ఓ రసికుడా
నాకు నేనే ముక్కలు ముక్కలు అయినట్లు కనబడుతున్నా?)
దీనిని
డాలి గారు సృష్టించిన
పోరాట యోధుని భ్రాంతిని (The Hallucinogenic Toreador)
తెలుసుకుంటూ. అర్ధము చేసుకుందాము


 


 

పోరాట యోధుని భ్రాంతి
డాలి ఈ చిత్రంలో వీనస్ బొమ్మల నేపథ్యంలో
బుల్ పోరాట యోధుని చిత్రిస్తాడు.
ఇది మరింత స్పష్టం కావడం కోసంక్రింది బొమ్మను కూడా చూడవచ్చును.



జీవరాశుల సంకలిత మార్పులను, జెనెటిక్స్ నుండి చైతన్యం వరకు,
ఒకే చరిత్ర పాఠంలా చిత్రిస్తాడు —
గోరంత నుంచి గొర్రెల వరకూ, పూల నుండి పశువుల వరకూ
మానవ ఆకారాలుగా విడదీసి,
వాటి నేపథ్యంలో ఇంకో మానవుడు
మళ్లీ ఆన్నీ కలిపేస్తాడు ఒకే దృశ్యంగా.
ఈ మానసిక విజ్ఞానం —
ఒక్కొక్క విభిన్న రూపం లోపల ఒకే “పరమాత్మ​” ఉందని
సూక్ష్మంగా అర్థమయ్యే పటము —
దీన్నే అన్నమయ్య “రవ్వశాయ” పదంతో తెలిపాడు.
"నా ప్రతి ముక్కలో నేనే ఉన్నాను... "
పై చిత్రంలోని మార్పు, భ్రమ, ఏకత్వం —
అన్నీ అన్నమయ్య “రవ్వశాయ” భావానికి చెప్పలేని దృశ్యరూపమే.

Part C

. పల్లవిని
బాగుగా గ్రహించుటకు భగవద్గీతలోని
"యదా భూతపృథగ్భావమేకస్థమనుపశ్యతి" (13-31)
విభిన్న వైవిధ్యములతో కూడిన జీవరాశులు అన్నీ
ఒకే ప్రకృతిలో స్థితమై ఉన్నట్టు చూచువాడు

 

"సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం" (13-16)
ఆ ధర్మము అతి సూక్ష్మమైనదని

 

"సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని" (6-29)
యోగులు, సర్వ భూతములను భగవంతుని యందు మరియు
భగవంతుడిని సర్వ భూతములయందు దర్శిస్తారు.

 

కానీ ఇవి అన్నియు
"తథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి" (2-13)
ధీరులై మరియొక దేహప్రాప్తి కలుగుటను
భ్రమకు లోనవ్వక గమనించువారికే సంభవము అని తెలియవచ్చును.

చివరిగా:

ఈ రెండు పంక్తులు ఒక సంక్లిష్ట
భౌతిక/మానసిక/ఆధ్యాత్మిక నిశ్చల స్థితిని
ప్రతిబింబిస్తున్నాయి.
యెస్చెర్ మనకు వెలుపలకు దారి తెలీదన్న స్థితిని చూపిస్తే, 
డాలి మనలోనే నక్కిన అస్తిత్వ విభజనను చిత్రీకరిస్తాడు.

అన్నమయ్య పల్లవిలో —

అందమును, ప్రేమను ఆస్వాదించు రసికుఁడా

ప్రపంచమను భ్రమ,

మనో విభజన,

సూక్ష్మమైన ఏకత్వం

తెలిస్తే

ఇంక అడిగేదేముందో?



మొదటి చరణం: 

బయలు వలెనుండును పట్టరాదు వలపు
మొయిలువలెనుండును ముద్దశాయరాదు
నియతములేదించుకు నేరిచినవారిసొమ్ము
క్రియ యెరుంగుతా నన్నుఁ గెరలించనేఁటికి ॥ఇసుక॥ 

పదబంధం

అర్థం

బయలు వలెనుండును పట్టరాదు వలపు

ప్రేమ అనేది ఒక మైదానం వంటిది. దానిని పట్టుకోలేము

మొయిలువలెనుండును ముద్దశాయరాదు

ఇది మేఘముల వలె అందంగా, మృదువుగా ఉంటుంది — కానీ ఎంత తడిసినా (అనుభవించినా) తనివి తీరదు

నియతములేదించుకు నేరిచినవారిసొమ్ము

ఇది నియమాలకు లోబడదు. ఇది గ్రహించినవారికి మాత్రమే దాని పట్టు దొరకవచ్చు — ఆ నేర్పు విద్య కాదు, అనుగ్రహంతో లబించవచ్చు.

క్రియ యెరుంగుతా నన్నుఁ గెరలించనేఁటికి

ఓ ప్రభూ? అలాంటి ప్రేమను, నా వంటి పామరుణ్ణి, అర్థం చేసుకోలేని వాడిని  ఎందుకు ఇంత ఉడికింపచేస్తావు?

 


 

ప్రత్యక్ష భావము

ప్రేమ ఓ పరిధిలేని మైదానం —
దాన్ని పట్టలేం,
ఏవిధంగాను నిర్వచించలేం.
 
మేఘంలా, దూదిపింజల్లా మెత్తగా అణుగుతూ —
గుండెతడి నివ్వదు,
చుట్టూ ఉండినా కూడా తాకనివ్వదు.
 
దానిలో నియమాలంటూ ఏవీ లేవు.
దాన్ని పొందినవారికే దాని స్వరూపం తెలుస్తుంది —
గ్రహించటం ఆచరణతో కాదు,
అది కరుణతో లభించేది.
 
ప్రభూ!
ఈ ప్రేమ నీవే అయితే —
పామరుణ్ణి, అవివేకిని
నన్ను ఇన్ని తునకలుగా చేసి
ఇలాగే పరీక్షించడం ఎందుకు

వ్యాఖ్యానం:

మనము అనుభవించు వలపు (ప్రేమ) అన్నది

కేవలము మమకారము, ఆప్యాయము, అభిమానము,

ప్రణయము, మోహము, పాశము, ఇచ్చకముల వంటిది.

దానిలోని మాధుర్యాన్ని ఎంతకాలము అనుభవించినా తడిసిముద్ద అవ్వం.

ఇంకా కావలనే భావన నిలుస్తుంది.


కానీ అన్నమాచార్యులు చెబుతున్న ప్రేమకు 

ఎటువంటి నియమాలు లేవు.

ఎల్లలు లేవు.

కాలచట్రమునకు లోబడి లేదు.

దేహాభిమానమును దాటుకొని వున్నది.

సర్వమునకు మూలమై

సర్వమును చుట్టుకొని వున్నది.

ప్రపంచమును నడుపుచున్న వంచన మార్గములు తాకలేనిది

అవిద్యలు ఆదరించనిది.

అంచనాలకు అందనిది.

అది మనస్సుపెట్టి నేర్పు విద్య కాదు.

అందరాని పొందు కాదు. అందరికి మందు.

దానిపై పట్టు దొరకదు

అడిగితే రాదు

వద్దంటే పోదు


ఓ ప్రభూ

అదికాదిదికాదంటావు.

అలాంటి ప్రేమను ఎలా తెలియను?

పామరుణ్ణి. అవివేకిని. అంతా అయోమయం.

మమ్మల్నిఎందుకిలా పరీక్షిస్తున్ణావు?


రెండవ​ చరణం: 

గాలివలెఁ బారుచుండు కానరాదు మనసు
పాలవలెఁ బొంగుచుండు పక్కననణఁగదు
యేలీలా గెలువరాదు యెక్కితే యేనుగగుజ్జు
లోలోనె మమ్మునింత లోఁచి చూడనేఁటికి       ॥ఇసుక॥ 

పాఠ్యం (Line)

పదార్థం (Meaning in Telugu)

గాలివలెఁ బారుచుండు కానరాదు మనసు

మనసు గాలిలా పారుతూ తిరుగుతుంది — కానీ కదలిక కనిపించదు

పాలవలెఁ బొంగుచుండు పక్కననణఁగదు

అది పాలలా మరిగిపోతూ పొర్లుతుంది — పక్కన నిలవడం దానికి అలవాటు కాదు

యేలీలా గెలువరాదు యెక్కితే యేనుగగుజ్జు

దాన్ని ఏరకంగాను ఓడించడం సాధ్యం కాదు — అది మూర్ఖమైన ఏనుగు పిల్లలా మూర్ఖంగా మొండిగా ఉంటుంది

లోలోనె మమ్మునింత లోఁచి చూడనేఁటికి

అలాంటి మమ్మల్ని నీవు లోలోపలే అణచి, లోతుగా గమనించడం ఎందుకో, ఓ దైవమా? ​

 ప్రత్యక్ష భావము 

మనసు గాలిలా పరుగిడుతూ  పోతుంటుంది —
దాని చలనం ఎక్కడా కనబడదు.
 
పాలు మరిగి పొర్లినట్లు ఎప్పుడూ ఉప్పొంగుతుంది —
సాంత్వనగా, శాంతంగా పక్కన నిలబడటం దానికి తెలియదు.
 
దాన్ని సాధించటం సులభం కాదు —
ఏనుగు పిల్లలా దురుసుగా, మొండిగా ప్రవర్తిస్తుంది. 

ఓ ప్రభూ!

ఇలాంటి మనల్ని ఎందుకు లోపలికి నొక్కి,
లోతుగా చూస్తావు?
అక్కడ నిజంగా ఏం ఉందో చూడాలనుకుంటావా?

వ్యాఖ్యానం:

 

అన్నమయ్య ఇంకో కీర్తనలో ఇలా  అన్నారు
 
కంచూఁ గాదు పెంచూఁ గాదు కడుఁబెలుచు మనసు
యెంచరాదు పంచరాదు యెట్టిదో యీమనసు పల్లవి ||
 
మనిషి మనస్సు కంచూ కాదు,
పెంపుడు జంతువులా పెంచడానికీ రాదు,
చాలా కఠినమైనది,
అది యేమో కూడా తెలియదు,
ఇతరులతో పంచడానికీ వీలులేదు

లోలోనె మమ్మునింత లోఁచి చూడనేఁటికి

దేహమనే పాత్రలో

పాల వంటి మనస్సు పొంగుతూ

కక్కిరిబిక్కిరి చేస్తుంది మనిషిని.

అణుకువగా వొదిగి వుండదు.

మనిషి ఎంత ఒదగడానికి పోతే అంత పరీక్షలు తప్పవు –

"నేను" అనే దాని అంతు చూసే వరకు.


మూడవ​ ​ చరణం: 

వెన్నెలే కాయుచునుండు వింతగాదు వయసు
అన్నిటా వసంతరుతువై యుండుఁ బోదు
వున్నతి శ్రీ వేంకటేశుఁడుండనుండఁ జవి వుట్టు
మన్నించె యింక మారుమాటలాడనేఁటికి      ॥ఇసుక॥ 

పాఠ్యం (Line)

పదార్థం (Meaning in Telugu)

వెన్నెలే కాయుచునుండు వింతగాదు వయసు

యవ్వనమంటే వింతేమీ కాదు — అది వెన్నెలలా మెరుస్తూన్నా మామూలులే. సాధారణమే.

అన్నిటా వసంతరుతువై యుండుఁ బోదు

కానీ జీవితం అంతా వసంతకాలంలా మధురంగా ఉండదు

వున్నతి శ్రీ వేంకటేశుఁడుండనుండఁ జవి వుట్టు

ఎలాగో తెలియదు కానీ ​— ఆ పైనున్న వేంకటేశుని కృపల రుచి నాకు కలిగింది

మన్నించె యింక మారుమాటలాడనేఁటికి

ఆయన నన్ను మన్నించాడు — ఇక నేను మారు మాట్లాడాల్సిందేముంది?

 

 

 


 

ప్రత్యక్ష భావము 

వయసులో నున్నప్పుడు జీవితం వెన్నెలలా అనిపించును.

కానీ, వసంత ఋతువు అలాగే నిలిచిపోదే?

పైని లోకాలలో వున్న శ్రీ వేంకటేశుఁనిపై నాకు రుచి కలిగెను.

ఈ రకముగా నన్ను మన్నించెను.  యింక మారుమాటలాడనేఁటికి?

వ్యాఖ్యానం:

 

వెన్నెలే కాయుచునుండు వింతగాదు వయసు
అన్నిటా వసంతరుతువై యుండుఁ బోదు

ఈ రెండు పంక్తులు మన జీవితం తాత్కాలికమని
చివరికి యోగ్యత తనంతట తానే రాదని
చెబుతున్నాయి. 

ఇప్పుడే స్పందించాలి అని అన్నమయ్య అంటున్నారు —

ఇంకెప్పుడో చూద్దాం అనుకోవడమే భ్రమ.



 

T-253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో

  తాళ్ళపాక అన్నమాచార్యులు 253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో For English version press here   ఉపోద్ఘాతము   ఈ అటవీక ప్రపంచములోని అరుద...