Monday, 24 October 2022

T-146. ఇట్టి నా వెఱ్ఱితనము లేమని చెప్పుకొందును

 తాళ్లపాక అన్నమాచార్యులు

146. ఇట్టి నా వెఱ్ఱితనము లేమని చెప్పుకొందును

 

 

for EnglishVersion press here

 

క్లుప్తముగా:  సమత్వము అనగానేమి? కర్తృత్వమేమిటి? ఇవి స్పష్టం కావడమే ధ్యానము.  బహుళస్థాయి ప్రతిబింబాలు మనల్ని కలవరపరుస్తాయి.

కీర్తన సంగ్రహ సారం:

పల్లవి: ఓ దేవా! నా వెర్రితనాన్ని ఏమని చెప్పుకోను. నువ్వు నన్ను చూసి నవ్వవచ్చు. కానీ నీవే తప్పక దయ జూడవలె. అన్వయార్ధము:  నాకు వెర్రి. కానీ, నిజంగా నేను ఇంకా ఏమి కాగలనో తెలియదు. నీవు దయ చూపకపోతే, నేను వెర్రివాడిగానే ఉండిపోతాను.

చరణం 1: నన్నాదరించి నా లోపలే ఉండి పలికింతువు. మాట్లాడుట నేర్చితినని గర్వపడుదును. మనోహరంగాను సమర్ధవంతముగాను నీవు ప్రపంచాన్ని పరిపాలిస్తుండగా, నేనే నియంత్రికగా పైచేయి ప్రదర్శించ ప్రయత్నించి అహంకరింతును..

చరణం 2: సృష్టికర్తవు నీవుండగా, నా పిల్లలకు తండ్రినని సంతోషపడే మూర్ఖుడిని. నీ ఆమోదంతో సర్వసంపదలకు నిలయమగు ఈ జీవితాన్ని ప్రసాదంగా పొందాను. తగిన శ్రమతో దీనిని గడించుకొంటినని యెంచుకొను అల్పుడను. అన్వయార్ధము: నా కర్తృత్వము నిరాధారమైనది. చర్యను, చేయువానిని విడదీయరానివిగా గుర్తించాను. చర్యకు తదుపరి కార్యకలాపాలలో 'అహం' అను  నిరర్ధకమైనఉనికి ఉంది.

చరణం 3: ఇహపరాలు అను ద్వంద్వములపై యెరుక నా తపోమహిమ అనునెంచు నా అజ్ఞానమును విస్మరించుము. ! ఉన్నత ప్రభువా! శ్రీవేంకటేశా! అన్నిటా నా చేత చేయించువాడు పరమాత్మతో నా ఏకత్వమును పరిగణించి  నా స్వార్థపూరిత ప్రేరణలను మఱువుము.

 

విపులాత్మక వివరణ

 

ఉపోద్ఘాతము: అన్నమాచార్యులు ఒక్క కీర్తనను కూడా ఉద్యమించి వ్రాయలేదు. మనము కీర్తనలుగా భావించే పదాలు ధ్యానమందు పారవశ్యము చెందిన క్షణాలలో  సహజంగా వారి నోటి నుండి వెలువడినవే.

 

యోగులు పేర్కొనే సమత్వ  బుద్ధి అనేది సర్కస్ ఫీట్ల సాధన వంటిది కాదు. అది జీవితంపై అసాధారణమైన అవగాహన. ఈ వొక్క  కీర్తనయే జీవించుటలో సమత్వమునకు లోతైన అర్థాన్ని అందిస్తుంది. ఈ కీర్తనలోని పదములు పైకి సాధారణముగా కనపడినా, వాటి అన్వయార్ధములు ఆశ్చర్యపరుస్తాయి.

 

చివరకు చేయువాఁడు ఎవరు? కర్తృత్వమేమిటి అనేవి విషయాలు స్పష్టం కావడమే ధ్యానము.  మనల్ని కలవరపరిచే బహుళస్థాయి ప్రతిబింబాలను సహనంతో క్రమబద్ధీకరించాలి. నా వ్యాఖ్యానం ఈ కీర్తనలోతులను స్పృశించుటలేదని తెలిసీ  మీ ముందుకు తెచ్చే సాహసం చెస్తున్నాను.

 

కీర్తన:

రాగిరేకు:  163-5  సంపుటము: 2-304


ఇట్టి నా వెఱ్ఱితనము లేమని చెప్పుకొందును
నెట్టన నిందుకు నగి నీవే దయఁ జూడవే    ॥పల్లవి॥
 
పాటించి నాలో నుండి పలికింతువు నీవు
మాటలాడ నేరుతునంటా మరి నే నహంకరింతును
నీటున లోకములెల్లా నీవే యేలుచుండఁగాను
గాఁటాన దొరనంటా గర్వింతు నేను ॥ఇట్టి॥
 
నెమ్మదిఁ బ్రజలనెల్లా నీవే పుట్టించఁగాను
కమ్మి నేనే బిడ్డలఁ గంటినంటా సంతసింతును
సమ్మతి నీవే సర్వసంపదలు నొసఁగఁగాను
యిమ్ముల గడించుకొంటి నివి నేనంటా నెంతు     ॥ఇట్టి॥
 
మన్నించి యిహపరాలు మరి నీవే యియ్యఁగాను
యెన్నుకొందు నాతపోమహిమ యిది యనుచును
వున్నతి శ్రీవేంకటేశ నన్ను నేమి చూచేవు
అన్నిటా నాయాచార్యు విన్నపమే వినవే    ॥ఇట్టి॥​

 

 

 

Details and Explanations:

ఇట్టి నా వెఱ్ఱితనము లేమని చెప్పుకొందును
నెట్టన నిందుకు నగి నీవే దయఁ జూడవే          ॥పల్లవి॥ 

ముఖ్య పదములకు అర్ధములు: నెట్టన = అనివార్యముగ, తక్షణమే. 

భావము: దేవా! నా వెర్రితనాన్ని ఏమని చెప్పుకోను. నువ్వు నన్ను చూసి నవ్వవచ్చు. కానీ నీవే తప్పక దయ జూడవలె.

వివరణము: మొదటిసారిగా పల్లవి చూసినప్పుడు అతి సామాన్యముగా కనిపించవచ్చు. కానీ అన్నమయ్య గారు 'నెట్టన నిందుకు నగి నీవే దయఁ జూడవే" (వెంటనే నువ్వు దయఁ జూడకపోతే నేనేమౌతానో)  అని అంటూ దాని రూపురేఖలనే మర్చివేసారు.  దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా {=ఏలయనగా, దైవసంబంధమైనదియు(అలౌకిక సామర్థ్యముకలదియు), త్రిగుణాత్మకమైనదియునగు నాయొక్క మాయ (ప్రకృతి) దాటుటకు కష్టసాధ్యమైనది.(7-14)} అన్న​   భగవద్గీత  ప్రకటన నుండి ప్రారంభిద్దాం.

మనము ఇప్పటికే సాధించిన విజయాల నేపధ్యముతోను మరియు ఈనాడు అందుబాటులో గల అనేక సాధనముల సహాయముతోను భ్రమల తప్పించుకోగలమని ఊహించుకుని గర్విస్తాము. మనము మహాత్ముల సూచనలను తక్కువగా అంచనా వేస్తాము. ‘ ప్రపంచమొక దర్పణము, మీ స్వంత ప్రతిబింబమే’ అని వారు చెప్పినప్పుడు వారు వారి అంతర్గతముగా ప్రపంచము యొక్క ప్రతిబింబం దర్శించి మరీ లోతైన ప్రకటన చేస్తున్నారని గ్రహించలేము. క్రింద ఇవ్వబడినపునరుత్పత్తి కూడదు (Not to Be Reproduced, లా రీప్రొడక్షన్ ఇంటర్‌డైట్ (ఫ్రెంచి), 1937) అనే శీర్షికతో ఉన్న రెనే మాగ్రిట్టే యొక్క చిత్రం ద్వారా  ఇది మరింత  స్పష్టం అవుతుంది.

 

పై చిత్రములో మీరు "అద్దం ముందు నిలబడి ఉన్న వ్యక్తిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్న" పరిశీలకులు.  అయితే, పై అద్దంలో కనబడు ప్రతిబింబం మనము ఇప్పటికే చూస్తున్న చిత్రమే తప్ప మరొకటి కాదు. లోతైన అవగాహన లేకుండా, ప్రపంచం స్వీయ ప్రతిబింబం అని మనం చెప్పినప్పుడు కేవలం వాక్చాతుర్యమే తప్ప సత్యము కాదు. 

సత్యానికి మార్గం చిత్రం వంటిది, మీరు గమనించడానికి ప్రయత్నించినప్పుడు, మీకు ఇప్పటికే తెలిసిన వాటిని మాత్రమే మీరు కనుగొంటారు. ఇప్పుడు రూమి రచించినశూన్యముఅనే క్రింది కవితను పరిశీలించండి. 

We look back and analyse the events
of our lives, but there is another way
of seeing, a backward-and-forward-at-once
vision, that is not rationally understandable.
జరిగిన సన్నివేశములను వెనుతిరిగి పరిశీలిస్తాము
జీవితాన్ని క్షుణ్ణంగా చూడబోతాము, కానీ మరొక మార్గం ఉంది
వెనుకకు-ముందుకు-ఒకేసారి చూడటం
దృష్టి హేతుబద్ధంగా అర్థం కాదు.

మరొక వైపు ఏముందో తెలియదు. అయితే, మనం ఏదో ఒకవిధంగా మరొక వైపుకు ఎక్క గలమని భావిస్తాము. ఇది వెర్రి కాదా? అన్నమాచార్యులు 'తాను వెర్రివాడు' అని చెప్పుకున్నప్పుడు నిజాయితీ గల ప్రకటనను సూచితమౌతుంది. సార్/మేడమ్, సొంత మూర్ఖత్వాన్ని గుర్తించడం మరియు తెలుసుకోవడం గొప్ప విజయం. లోని మూర్ఖత్వాన్ని లేదనడం సత్యాన్ని తిరస్కరించడమే. అదే అపోహ. అదే వెర్రి. 

అన్వయార్ధము:  నాకు వెర్రి. కానీ, నిజంగా నేను ఇంకా ఏమి కాగలనో తెలియదు. నీవు దయ చూపకపోతే, నేను వెర్రివాడిగానే ఉండిపోతాను.

 

పాటించి నాలో నుండి పలికింతువు నీవు
మాటలాడ నేరుతునంటా మరి నే నహంకరింతును
నీటున లోకములెల్లా నీవే యేలుచుండఁగాను
గాఁటాన దొరనంటా గర్వింతు నేను        ॥ఇట్టి॥ 

ముఖ్య పదములకు అర్ధములు: పాటించి = ఆదరించు, చక్కబెట్టు, కలిగించు; గాఁటాన = అధికముగా, గాఢముగా, ఎక్కువగా.

భావము: నన్నాదరించి నా లోపలే ఉండి  పలికింతువు. మాట్లాడుట నేర్చితినని గర్వపడుదును. మనోహరంగాను సమర్ధవంతముగాను నీవు ప్రపంచాన్ని పరిపాలిస్తుండగా, నేనే నియంత్రికగా పైచేయి ప్రదర్శించ ప్రయత్నించి అహంకరింతును.

వివరణము: అన్నమాచార్యులు పరంపరగా వస్తున్న 'పాత చింతకాయ పచ్చడిని' వ్యక్తపరచుట లేదు. లోతైన అవగాహనను గ్రహించక పుక్కిటి పురాణమని తోసిపుచ్చుతాము. ఇప్పుడు చరణాన్ని జలాలుద్దీన్ రూమీ గారి అనే రెండు వేర్వేరు కవితలతో పోల్చండి. 

నా నోటితో మాటలు పలికించేదెవరు? (1)

కానీ, నా చెవిలో వుండి నా స్వరం వినేదెవరు?
నా నోటితో మాటలు చెప్పించేదెవరు?
నా కళ్ళతో చూచేదెవరు? ఆత్మ అంటే ఏమిటి?
నేను అడక్కుండా వుండలేను.

 

దాహం తీరని చేప (2)

నాలో దాహం తీరని చేప ఉంది
దాని దాహం దేనికో తెలియదు!

నాలో చింతలరాయుళ్ళు సమావేశమౌతుంటారు,
కానీ నేను వారితో కలిసి వెళ్ళడం లేదు.

 

ఇది ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుంది
నేను ఒక కవిత పూర్తి చేసినప్పుడు.

 

ఒక గొప్ప నిశ్శబ్దం నన్ను అధిగమిస్తుంది.
మరి, అలాంటప్పుడు భాష దేనికో! మాటలు దేనికో!

 

దురభిమానం, అహంకారం, గర్వము గొప్పతనం నుండి పుట్టవు. వ్యర్థపుటాలోచనల నుండి, తప్పుడు అవగాహనల నుండి ఇవి పుడతాయి. రూమీ సూచించిన చింతలరాయుళ్ళు (దుఃఖ సేనలు) ఈ అజ్ఞానంలోని భాగమే. అజ్ఞానాన్ని అనుసరించకపోవడమే మేధస్సు. ఆలోచనల అంకురార్పణలో గర్వకారణాన్ని గుర్తించగలిగితే, జీవితములో అతి పెద్ద సమస్యను పరిష్కరించుకున్నట్లే. దురదృష్టవశాత్తూ, తరచుగా, మనం తాత్కాలికంగా కొన్ని సెకన్లపాటో, కొన్ని సంవత్సరాలపాటో గర్వపడిన తర్వాతే ఆ గర్వకారణాన్ని గ్రహిస్తాము. ఆలోచనలే మనసులోని రణగొణ ధ్వనులు; రొదపెట్టు కోరికల మూలపెట్టు; మౌనమే మేధస్సు. 

అన్నమాచార్యులు, రూమీల లోతును వివరించగల సామర్ధ్యము నాకు లేదు

 

నెమ్మదిఁ బ్రజలనెల్లా నీవే పుట్టించఁగాను
కమ్మి నేనే బిడ్డలఁ గంటినంటా సంతసింతును
సమ్మతి నీవే సర్వసంపదలు నొసఁగఁగాను
యిమ్ముల గడించుకొంటి నివి నేనంటా నెంతు           ॥ఇట్టి॥

 

ముఖ్య పదములకు అర్ధములు: నెమ్మదిఁ = సరిగాను మరియు సముచితంగాను; కమ్మి = పైబడి; సర్వసంపదలు = ఇక్కడ తాను ఆయా సంపదలు (జీవము) ఉన్నట్లు గుర్తించగల సామర్థ్యం అనే అర్థంలో ఉపయోగించబడింది; యిమ్ముల = పరిమాణము, సంఖ్య​;

 

భావము: సృష్టికర్తవు నీవుండగా, నా పిల్లలకు తండ్రినని సంతోషపడే మూర్ఖుడిని. నీ ఆమోదంతో సర్వసంపదలకు నిలయమగు ఈ జీవితాన్ని ప్రసాదంగా పొందాను. తగిన శ్రమతో దీనిని గడించుకొంటినని యెంచుకొను అల్పుడను.

 

వివరణము: శృతివిప్రతి పన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిస్తదా యోగామవాప్స్యసి’ 2-53 {భావము: నానా విధములగు శ్రవణాదులచే కలతచెంది యున్న నీ బుద్ధి, ఎప్పుడు చలింపని పరమాత్మ యందు స్థిరముగా నిలిచియుండునో, అప్పుడు ఆత్మ సాక్షాత్కారమును పొందగలవు.}  అను భగవద్గీత శ్లోకంయొక్క​ అంతరార్థంపై పాఠకులు తీక్షణంగా ఆలోచించాలని కోరుకుంటాను. ఇక్కడ శబ్దం అనేది చెదరగొట్టు, చిందరవందరచేయు శక్తి అనే అర్థంలో ఉపయోగించబడింది. జ్ఞానేంద్రియాల ద్వారా అందిన సమాచారం అంతా ప్రశాంతతను భంగపరచునదే, ఎందుకంటే అవి ప్రసారము చేయునది పాక్షికమైన నిజాన్ని మాత్రమే.

 

పాక్షిక సత్యాల ఆధారంగా ఏర్పడిన ఆలోచనలు మరింత హానికరమే. అందువల్ల, వాటిని కాలుష్యం అనవచ్చు. కాబట్టి, సత్య దర్శనమునకు, ఈ నిరాధారమైన ఆలోచనలు అంతమవ్వాలి. కోణములో చరణాన్ని సమీక్షించవలసిందిగా పాఠకులను అభ్యర్థన​.

అన్వయార్ధము: నా కర్తృత్వము నిరాధారమైనది. చర్యను, చేయువానిని విడదీయరానివిగా గుర్తించాను. చర్యకు తదుపరి కార్యకలాపాలలో 'అహం' అను  నిరర్ధకమైనఉనికి ఉంది.

 

మన్నించి యిహపరాలు మరి నీవే యియ్యఁగాను
యెన్నుకొందు నాతపోమహిమ యిది యనుచును
వున్నతి శ్రీవేంకటేశ నన్ను నేమి చూచేవు
అన్నిటా నాయాచార్యు విన్నపమే వినవే          ॥ఇట్టి॥

 

ముఖ్య పదములకు అర్ధములు: నేమి చూచేవు = "దయతో వదలివేయుము" అని సూచిస్తుంది; నాయాచార్యు = నా గురువు (ఐతే ఇక్కడ "నా చేత చేయించువాడు" అనే అర్థంలో ప్రయోగించారు); వినవే = అనుగుణముగా వినుము ("పరిశీలించు" అనే అర్థంలో ఉపయోగించబడింది)

భావము: ఇహపరాలు అను ద్వంద్వములపై యెరుక నా తపోమహిమ అనునెంచు నా అజ్ఞానమును విస్మరించుము. ! ఉన్నత ప్రభువా! శ్రీవేంకటేశా! అన్నిటా నా చేత చేయించువాడు పరమాత్మతో నా ఏకత్వమును పరిగణించి  నా స్వార్థపూరిత ప్రేరణలను మఱువుము.

వివరణము: కర్తృత్వాన్ని వదలిపెట్టడమొక గొప్ప కళ​. అటువంటప్పుడు కర్తృత్వము పరిశీలన మరియు అవగాహనగా రూపాంతరము చెందుతుంది. మనం తరచుగా ఉపయోగించే అవగాహన ఒక నెపము. ఒక అసత్యము.

 

మీరు రెనే మాగ్రిట్టే చిత్రాన్ని తిరిగి చూడండి.


References and Recommendations for further reading:

#1 96. ఎదుట నెవ్వరు లేరు యింతా విష్ణుమయమే (eduTanevvaru lEru yiMtA vishNumayamE)

 

#2 128 ఇన్నిచేఁతలును దేవుఁడిచ్చినవే (innichEtalunu dEvuDichchinavE)

2 comments:

  1. అన్నమాచార్యుల వారి సంకీర్తనా భావామృతాన్ని మీరు ఆస్వాదించి , నలుగురికీ ఆ ఆనుభూతిని అందించాలన్న మీ నిర్విరామ కృషి బహు ప్రశంసనీయము !

    మీ , వివరణలో ఒక విశిష్ట శైలి యున్నది ! మీరు ఎంచుకొనే బొమ్మలు వాటినుంచీ చెప్పే వేదాంత గుళికలు , అబ్బురపరుస్తున్నవి ! ముందు తరాల వారికి మీ కీర్తనా సారాంశ రచనలు ఎంతో ఉపయోగపడతాయి !

    వినమ్ర నమస్సులు !! మీ సాధన కొనసాగించి మరిన్ని అందించాలి మీరు ! బహు అభినందనలు !

    ReplyDelete
  2. Interesting picture....👍😊....... AVB

    ReplyDelete

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...