తాళ్లపాక అన్నమాచార్యులు
147 అదివో
కనుఁగొను మది యొకతె
అజ్ఞానమే తప్ప అంధకారము లేదు
" విలియం షేక్స్పియర్ ".
for English
Version press here
కీర్తన: రాగిరేకు: 1412-2 సంపుటము: 24-68 |
అదివో కనుఁగొను మది యొకతె యెదుటనే నెలకొనె నిది యొకతె ॥పల్లవి॥ తేటలమాటలఁ దెర లదె కట్టీఁ గాటుకకన్నులకలి కొకతె జూటరిచూపులఁ జొక్కులు చల్లీ నీటుగర్వములనెలఁ తొకతె ॥అది॥ ముసిముసినవ్వులు మోపులుగట్టీ రసికుఁడ నీపై రమణొకతె కొసరులఁ గుచములఁ గోటలు వెట్టీ మిసమిసమెఱుఁగుల మెలుఁతొకతె ॥అది॥ కాయజకేలికిఁ గందువ చెప్పీ చాయలసన్నల సతి యొకతె యీయెడ శ్రీవేంకటేశ కూడి నిను వోయని మెచ్చీ నొకతొకతె ॥అది॥
|
క్లుప్తముగా: మానవునిలో మనస్సులో కలుగు మనోవికారములను, పోకడలను స్త్రీ శబ్దములతో సెలవిచ్చిరి.
కీర్తన సంగ్రహ సారం:
పల్లవి: అదిగో కనుఁగొనుము అది ఒక
ఆలోచన. యెదుటనే పుట్టినది ఇది ఒక ఆలోచన.
అన్వయార్ధము: కుతూహలము
ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రలోభపెడుతూనే ఉంటుంది.
చరణం 1: మనసు తేటతేట మాటలఁ తెరలు కట్టు గాటుకకన్నుల చెలిలా మురిపించునొక
ఆలోచన. ఆనవాలు పట్టలేని మోసపు చూపులఁతో మయికము, మత్తులలో పడవేయునొక ఊహ. అన్వయార్ధము:
నరుడా! నీ కన్నుల ముందే తేట మాటలఁ తెరలు కట్టు ఆలోచనల
కదలికను ఆదిలోనే కనుగొన్నావా? నిన్ను మత్తులలో పడవేయుచునున్న నొక ఊహ పూనికను గుర్తించితివా?
చరణం 2: అధికముగా చిఱునగవులు దొరలించుచూ
నీలో శృంగారమను ఆలోచనలను ఉసికొలిపి, ఆ మిసమిసమెఱుఁగులే లోకమనిపించు నదొక మనోవికారము.
చరణం 3: మన్మథకేళికి దారులు చూపే చీకటి సంజ్ఞల మాయొకటి. ఈ వైపు శ్రీవేంకటేశ
సత్యముగా నిను మెచ్చి నీలో కలసిపోయినదొక భావము.
విపులాత్మక వివరణ
ఉపోద్ఘాతము: అన్నమాచార్యుల కీర్తన “అదివో కనుఁగొను మది యొకతె” ఒక స్కెచ్ లాంటిది. ఈ బహు చక్కని, కీర్తనలో ‘ఒకతె, యొకతె’ అని పలు మార్లు ప్రస్తావించడంతో దీనిని పొరపాటుగా శృంగార కీర్తన అని వర్గీకరించారనుకొంటాను.
వాస్తవానికి 'ఒకతె, యొకతె' వంటి స్త్రీ శబ్దములతో మానవునిలో మనస్సులో రేపు భావములను సూచించిరి. యథార్థముగా 'ఒకతె'తో ఒక ఆలోచనను, ఒక భావమును, ఒక మనోవికారమును, ఒక పోకడను సెలవిచ్చిరి. ఏదియేమయినప్పటికీ, ఈ కీర్తనలో అన్నమాచార్యులు మనిషిని విదిలించి కదిలించు భ్రమను సూచిస్తున్నారు.
క్రింద ఇచ్చిన రెనే మాగ్రిట్టే గీసిన "ది గ్రేడేషన్ ఆఫ్ ఫైర్" అనే పెయింటింగ్ ద్వారా ఈ కీర్తనను వివరిస్తాను. పెయింటింగ్’లో చెక్క బల్లపై మూడు వస్తువులు కాగితం ముక్క, గుడ్డు మరియు ఒక తాళం చెవులను చూపారు. అవన్నీ మండుతున్నాయి. ఇక్కడ చెక్క బల్ల ఆ మూడింటికి ఆధారమైన భూమికి (ప్రకృతికి) చిహ్నము. మానవుని పుట్టుకకు ఆస్థిత్వానికి మూలాధారమైన భూమి నుండే ఆ మూడు వస్తువులు తయారైనవి.
‘పేపర్’ జ్ఞానం, సాహిత్యం, కవిత్వం మొదలైన వాటిని సూచిస్తుంది. ‘గుడ్డు’ ఒక ఆలోచన, ఒక సమస్య, ఒక భావన వంటివాట్లకు గుర్తు. మరియు ‘కీ’ అనేది సాధ్యమయ్యే పరిష్కారాన్ని, వ్యవస్థను, ఒక పద్ధతిని చూపుతుంది. అవన్నీ కాలుతూవుండడం ప్రపంచంలోని ఏ సమస్యలకూ శాశ్వత పరిష్కారం కనుగొనబడలేదని సూచిస్తుంది.
‘ఆకలి’ (implying egg) అనే సమస్యతో పెయింటింగ్‌ని తేటపఱచు కుందాం. జీవుల పుట్టుక నుంచి ఇప్పటి దాకా, వేలాది సంవత్సరాలుగా వివిధ రాజకీయ, సామాజిక, స్వచ్ఛంద సేవా వ్యవస్థలు, వ్యక్తుల ద్వారా అనేక పరిష్కారాలు (indicated by key) ప్రతిపాదించబడినప్పటికీ; దానిపై యెంతో సాహిత్యం వెలువడినప్పటికీ (implied by paper); ఇప్పటికీ, కాదనలేని వాస్తవం, 'ఆకలి' ఇంకా ప్రపంచాన్ని మండిస్తూనే వుంది.
పెయింటింగ్‌లో ఆకలికి బదులు జ్ఞానమును (wisdom) కాని, భద్రతను (security) కానీ, పెట్టి చూచిననూ ఆ ప్రయత్నములన్నీ శుష్కములేనని, కేవలము భ్రమగా మంటలు రేచినట్లు చూపినట్లుగా, మనలను ఉత్తేజితులను చేసి కాలాయాపన చేసెదవని గ్రహించుట పెద్ద పనికాదు.
ఈ కీర్తనలోని మూడు చరణాలు ఆ పెయింటింగ్‌లో మండుతున్న వస్తువులకు చిహ్నాలు. మంటలు రేపునది ఆలోచనలే. గతస్మృతులను భస్మముల నుండి పుట్టునవి ఆలోచనలు. అందుకే అన్నమాచార్యుల వాటిని 'ఒకతె, యొకతె' అని వ్యవహరించి తృణీకార భావములో వాడివుందురని నా అభిప్రాయము.
ఈ పెయింటింగ్ నుండి, 'ముక్తి'ని గుర్తించడానికి, మార్గము ప్రతిపాదించడానికి లేదా సిద్ధాంతీకరించడానికి చేసే ప్రయత్నమే దానిని వమ్ముచేసి, దృష్టిని మరలిస్తుందని తెలియవచ్చు. కావున ఈ విషయంలో ప్రపంచము, అది కల్పించు భ్రమల నిర్మాణములను పూర్తిగా గమనించి, వదలిపెట్టి దూరంగా బయటవానిగా ఉండటమే ముఖ్యము.
“మానవుడా పురికొల్పునవన్నీ నిన్ను సత్యానికి దూరంగా లాక్కెళుతున్నాయి. ప్రతిచర్యలకు మూలము పదార్థసమ్మిళితమగు దేహమని గుర్తించి నీ చర్యలు సవరించుకో” అని సందేశము.
Details and Explanations:
ముఖ్య పదములకు అర్ధములు: ఒకతె= ఒక ఆలోచన; నెలకొనె = నిలుచుండు, పుట్టు, కలుగు,
భావము: అదిగో కనుఁగొనుము అది ఒక ఆలోచన. యెదుటనే పుట్టినది ఇది ఒక ఆలోచన.
వివరణము: మానవుణ్ణి ఆలోచనల పరంపరలు చుట్టి ఉక్కిబిక్కిరి చేస్తాయి.
అన్వయార్ధము: కుతూహలము ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రలోభపెడుతూనే ఉంటుంది.
ముఖ్య
పదములకు అర్ధములు: కలి కొకతె = చక్కని
ఆడుది (ఇక్కడ మురిపించు ఆలోచన); జూటరిచూపులఁ = ఆనవాలు పట్టలేని మోసపు చూపులఁ;
జొక్కులు = చొక్కులు = మయికము, మత్తు. పరవశత; నెలఁ తొకతె = ఆఁడుది ఒకతె, వనిత ఒకతె
(ఇక్కడ ఆలోచన, ఊహ)
భావము: తేటతేట మాటలఁ తెరలు కట్టు గాటుకకన్నుల చెలిలా మురిపించునొక
ఆలోచన. ఆనవాలు పట్టలేని మోసపు చూపులఁతో మయికము, మత్తులలో పడవేయునొక ఊహ.
వివరణము: ఈ చరణంలో భగవద్గీతలోని 14-6వ శ్లోకాన్ని యధాతంగా చెప్పిరి. శ్లో|| తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయమ్ । సుఖ-సంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ ।। భావము: పాపరహితుడైన అర్జునా! గుణములలో సత్త్వగుణం నిర్మలమైనది. కనుక ప్రకాశవంతమైనది మరియు ఉపద్రవము లేనిది. అయినప్పటికీ అది సుఖ సాంగత్యము వలన, జ్ఞానాభిమానము వలన మానవుని బంధిస్తుంది.
దీపమునకు నిర్మలమైన చిమ్మీ కూడా ఒకానొక ఆవరణయే యగును. అటులనే, గుణములు చిమ్మీ మాదిరిగా చైతన్యమునకు ఆవరణ ఏర్పరచి పరిమితము చేయుటకు ప్రయత్నించును.
జ్ఞానాభిలాష, సంపద లాగే మనిషి సంపాదింౘుకొనునదే. జాగ్రత్తగా గమనిస్తే, చదువుకున్న వారు చదువులేనివారి కన్నా (ఆధారం లేకపోయినా) అధికులమని భావించడం సాధారణంగా చూస్తుంటాం. ఇది పూర్తిగా నిరాధారం. ఈ రకంగా జ్ఞానాభిలాష కూడా గర్వకారణ మౌతుంది.
తాను ఇతరుల కన్నా సమాజానికో, వూరుకో ఎక్కువ సేవ చేసాననో లేక ఎక్కువ శ్రమించాననో నెపం మీద తనని తాను ఉన్నత స్థాయిలో వూహించుకొని సుఖము పొందుటకు యోగ్యత కలదనుకొంటాడు మానవుడు. ఈ రకంగా సుఖాభిలాష కూడా మనిషిలో అహమును పెంచుతుంది.
అన్వయార్ధము: నరుడా! నీ
కన్నుల ముందే తేట మాటలఁ తెరలు కట్టు ఆలోచనల కదలికను ఆదిలోనే కనుగొన్నావా? నిన్ను మత్తులలో
పడవేయుచునున్న నొక ఊహ పూనికను గుర్తించితివా?
ముఖ్య
పదములకు అర్ధములు: ముసిముసినవ్వులు =
చిఱునగవు, దరహాసము; మోపులు = అధికము; కొసరులఁ = విజృంభణల;
భావము: అధికముగా చిఱునగవులు దొరలించుచూ నీలో శృంగారమను ఆలోచనలను ఉసికొలిపి,
ఆ మిసమిసమెఱుఁగులే లోకమనిపించు నదొక మనోవికారము.
వివరణము: ఇక్కడ రజో గుణమును భగవద్గీతలోని 14-7వ శ్లోకాన్నుంచి ఉటంకించారు. శ్లో|| రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవమ్ । తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినమ్ ।।(14-7)।।భావము: ఓ అర్జునా, రజో గుణము దృశ్యవిషయముల పట్ల ప్రీతిని, ఆసక్తిని కలుగజేయునని తెలుసుకొనుము. అది ఆత్మను (చైతన్యమును) చర్యల/కర్మల పట్ల ఆసక్తిని కలిగించి బంధించివేస్తుంది.
ఈ రజో గుణము ఎంత అనుభవించినప్పటికిని తృప్తిని బొందనిదై, కర్మకేంద్రిత చర్యల పద్మవ్యూహమునకు కారణభూతమై యున్నది. కావున దీనిని ఈ మోక్షమార్గమున శత్రువుగా నెఱుఁగుము_. అందుకే రజో గుణమును మానవునికి పరమ శత్రువని హెచ్చరించారు.
మన దుఃఖానికి అనాలోచిత చర్యలే చాలా వరకు కారణము. దాని మూలంగా కలిగే మంచి లేక చెడుల విచక్షణ లేకుండా, యేదో వొక చర్యకు, వుసి గొల్పునదే రజోగుణము. రజోగుణము కేవలం చర్య కేంద్రితం.
ముఖ్య పదములకు అర్ధములు: కాయజకేలి =మన్మథకేళి; కందువ = దారి, జాడ; చాయల = నీడల, చీకట్ల, అంధకారముల, సన్నల = సంజ్ఞల; వోయని = సత్యముగా, నిజంగా;
భావము: మన్మథకేళికి దారులు చూపే చీకటి సంజ్ఞల మాయొకటి. ఈ వైపు శ్రీవేంకటేశ
సత్యముగా నిను మెచ్చి నీలో కలసిపోయినదొక భావము.
వివరణము: చాయలసన్నల సతి యొకతె = చీకటి సంజ్ఞల మాయొకటి భగవద్గీతలోని 14-8వ శ్లోకాన్ని తెలుపుతోంది. శ్లో|| తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ । ప్రమాదాలస్యనిద్రాభిః తన్నిబధ్నాతి భారత ।।(14-8)।। భావము: ఓ అర్జునా, అజ్ఞానముచే జనించిన తమో గుణము, సమస్త జీవరాశుల మోహభ్రాంతికి కారణము. అది నిర్లక్ష్యము, సోమరితనము మరియు నిద్రలచే భ్రమకు గురిచేసి బంధించివేస్తుంది.
*the end*
ఇంద్రియములు విషయములతో సంబంధమేర్పరచుకొని,తన్మాత్రల ద్వారా విషయజ్ఞానాన్ని మనస్సుకు చేరవేస్తాయి.సహజసిద్ధంగా నిర్మలమైన
ReplyDeleteమనస్సు దానివలన తీవ్రమైన వికారములకు లోనవుతుంది.
మనోవికారముల గతి యేరీతిగా ఉంటుందో అన్నమయ్య ఈ కీర్తనలో అద్భుతంగా వివరించారు.
విషయములు మోహమును కలిగిస్తాయి. మోహభ్రమలే
అంతులేని కోరికలకు కారణం.కోరికల పరంపర నిరంతరం కొనసాగుతూ మనసులో అనేకమైన ఆలోచనలకు, భావనలకు నాంది అవుతుంది.ఇవియే మనోవికారములుగా మరి మనస్సును కల్మషం చేసి, సత్యానికి, జ్ఞానానికి దూరం చేస్తాయి.మనోవికారములకు హేతువైన ఈ ఆలోచనలను, భావములను ఈ కీర్తనలో అన్నమయ్య తృణీకరణ భావముతో సంభోదిస్తున్నాడు."అది యొకతె,ఇది యొకతె అన్న ప్రయోగములు నిరంతరము మనస్సును ప్రభావితం చేసే ఆలోచనల పరంపరను సూచిస్తున్నాయి యీ కీర్తనలో.
రెనె మాగ్రిట్టే చిత్రంలోని బల్ల పృథివినీ,దానిపైనున్న మూడు వస్తువులు పుడమి నుంచి ఉద్భవించినవనీ భావిస్తే, మానవ శరీరం పంచభూతాత్మకము, త్రిగుణాత్మకము అంటే సత్వరజస్తమో గుణముల మిశ్రమం. కోరికలు అనేవి రజోగుణజన్యములు.బల్ల మీద ఉన్న కాగితము, గ్రుడ్డు,తాళం చెవి మూడూ కూడా మండుతూ ఉన్నాయి.
కాగితం పుస్తకపఠనమును, గ్రుడ్డు ఆకలిని సూచిస్తూ, అవి మండుతూ ఉండటం మానవుని నిరంతర విషయానురక్తిని, కోరికలను సూచిస్తున్నాయి. అజ్ఞానానికి మూలమైన విషయానురక్తి యందు నిమగ్నమై అంటే కాంతాకనకములపై వ్యామోహముతో, ప్రాపంచిక సుఖభోగముల యందు రమిస్తూ మనిషి తన జీవితాన్ని వృథాగా గడిపి సత్యానికి దూరంగా జీవనయానమును దేహం పడిపోవు వరకు సాగిస్తున్నాడు. అంతేకాని శ్రేయోమార్గం అంటే జ్ఞానమార్గము వైపు దృష్టి సారించటం లేదు. అంతర్ముఖుడగుట లేదు. ఈ చిత్రంలో చూపబడిన తాళం చెవి అంటే జ్ఞానమార్గము తెలుసుకొనుటకు కీ తనవద్దనే ఉన్నా, దానిని నిర్లక్ష్యం చేస్తున్నాడు మనిషి. అందుకే చిత్రంలో తాళం చెవి కూడా మండిపోతూ ఉన్నది.ఇంక శాశ్వతమైన ఆనందము, మోక్షము సాధించుట అసాధ్యము అని చిత్రం ద్వారా ద్యోతకమగుచున్నది.
సత్యస్వరూపమైన శ్రీనివాసునిలో ఐక్యమై శాశ్వతమైన ఆనందాన్ని పొందటమే సమస్యలకు ఏకైక పరిష్కారమని అన్నమయ్య అంటున్నాడు.
గీతాశ్లోకముల నుటంకించటం సందర్భోచితముగా ఉన్నది.
ఓం తత్ సత్🙏🏻
కృష్ణమోహన్
This one is completely symbolic and sattvik. From Charanam 1, all ladies are pointing out to the Hero the Supreme Being only! All jeevas are feminine and the Lord along is masculine is the simile used in the Vedanta. I will write separately on it sometime.
ReplyDelete