తాళ్లపాక అన్నమాచార్యులు
144 వెన్న
చేతబట్టి నేయి వెదకనేలా
for English Version press here
ఉపోద్ఘాతము: అన్నమాచార్యులు దార్శనికుడని నిరూపించడానికి ఈ ఒక్క కీర్తన సరిపోతుంది. గీసుకున్న గిరికి బయట వెదుకవలెనని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
పోది నిన్ను మదిఁ దలపోయనేలా (ఓ హీరో! మది లోపల నీ గురించే ఎందుకు మరీ మరీ తలుస్తావు?) అనేది ప్రస్తావించదగిన విషయం. ఇది కేవలం ఆలోచన, ధ్యానము, చింతనల ద్వారా నువ్వు నీపై నీకు గల అంచనాలను మాత్రమే తెలుసుకుంటావు. ఇది పల్లవిలో చెప్పినదానికి వ్యతిరేకము. అన్నమాచార్యులు యీ సరళిలో ఇంకొంచెం ముందుకెళ్ళి మొత్తానికే తనకే తాను పరాయి వ్యక్తి అవ్వాలని సూచించారు.
అన్నమాచార్యుల సాహసోపేతమైన ప్రకటనలు పరంపరగా వస్తున్న పద్ధతులకు వ్యతిరేకం కాదు, కానీ అవి మోక్షానికి మార్గం కావని అతని వాదన. ఈ కీర్తన ద్వారా మానవులంతా "చర్య అంటే ఏమిటి" అని ఆలోచించాలన్నారు. మొత్తం భగవద్గీత ఉపదేశం కూడా అదే.
ఈ ప్రపంచంతో ఎటువంటి ప్రతిఘటనలేని ఐక్య భావముతో కలసిపోవడం ఒక్కటే ధ్యానమని, ప్రపంచం నుండి దూరంగా జరిగిపోవడం కాదు అని నొక్కి చెప్పారు.
"నారదశుకాదులును / యీవిధముననే ఆనతిచ్చినారు" అని ధ్యానమయ జీవితము స్వచ్ఛమైన చర్య యని సూచించారు. అది కానివన్నీ అనగా మనం చేసేవన్నీ ధ్యానము లోనికి రావు.
సాటిలేని ఈ కూర్పు అన్నమాచార్యుల మహోన్నత వ్యక్తిత్వానికి గీటురాయి. అన్నమాచార్యులు బోధించట లేదు, అన్వేషించమని ప్రజలను అడుగుతున్నాడు.
కీర్తన: రాగిరేకు: 64-1 సంపుటము: 1-328 |
వెన్న చేతఁబట్టి నేయి వెదకనేలా యిన్నిటా నెంచి చూచితే నిదియే వివేకము ॥పల్లవి॥ నీ దాసులున్నచోట నిత్యవైకుంఠ మిదె వేదతో వేరొక చోట వెదకనేలా ఆదిగొని వారిరూపు లవియే నీరూపులు పోది నిన్ను మదిఁ దలపోయనేలా ॥వెన్న॥ వారలతోడి మాటలు వడి వేదాంతపఠన సారె వట్టిచదువులు చదువనేల చేరి వారికరుణే నీ చేపట్టిన మన్ననలు కోరి యింతకంటే మిమ్ముఁ గొసరనేలా ॥వెన్న॥ నావిన్నపము నిదె నారదశుకాదులును యీవిధముననే ఆనతిచ్చినారు శ్రీవేంకటేశ నీవు చేపట్టిన దాసులకు కైవశమౌ యీబుద్ధి కడమేలా ॥వెన్న॥
|
Details and Explanations:
భావము: వెన్న చేతబట్టి నేయి వెదకుటెట్లు వ్యర్థమో, తనకు కలది కనుగొనుట వివేకమా? .
వివరణము: “All men are mortal” / “Socrates is a man” వంటి భ్రాంతవాదము కాదు. ఈ పల్లవి కేవలం "మీ వద్ద ఇప్పటికే ఉన్నదాన్ని కనుగొనడం జ్ఞానమని పించుకోదు" అని పేర్కొంది.
నీ చేతిలో ఏమి ఉంది? ఈ జీవితాన్ని సరిగ్గా జీవించే అవకాశం. నీవు "సజీవంగా ఉన్నావని" తెలుసుకోనునది ఏమీ? అని పల్లవి ప్రశ్నించుచున్నది.
మనిషి
ఏం చేస్తాడు? అతడు "నేను ఏమిటి", "రేపు నేనేమౌతాను" "నన్ను
ఎవరు సృష్టించారు" అని వెతుకుతాడు. సంస్కృతులతోను, దేశాలతోను సంబంధం లేకుండా,
ప్రపంచ వ్యాప్తంగా ఇదే ప్రజల ధోరణి. ఈ ప్రవృత్తి ముఖ్యంగా "రేపు నేనేమౌతాను"
ను పట్టి చూపిస్తున్న రెనే మాగ్రిట్ గారి "లా క్లైర్‌వాయెన్స్" (భవిష్యవాణి)
పేరుతో ఉన్న చిత్రాన్ని దిగువన చూడండి. చిత్రంలో
ఉన్న కళాకారుడు రెనే మాగ్రిట్టే.
చిత్రకారుడు ఏమి చూస్తున్నాడు. ఒక గుడ్డు. కానీ అతను ఏమి చిత్రిస్తున్నాడు. ఒక పక్షిని. అదేవిధంగా, మనం, ఒక విషయాన్ని చూస్తాము కానీ చూసినదానిని చూసినట్లుగా గ్రహించకుండా తర్వాత ఏమౌతుందో అన్న ఆతృతో మరొకటిగా భావింపజూస్తాము. ఊహింపజూస్తాము. "జీవించి ఉన్నాము" అని తెలుసుకోవడంలో మనకు తృప్తి లేదు, కానీ "నేను ఇంత పెద్దవాడిని", "నేనే గొప్పవాడిని" "నేను హీనుడిని" "నేను చాలా శక్తివంతుడిని" అని నిరూపించి, ధృవీకరించాలనుకుంటాము. మన అభిరుచులు మరియు వీలైన ప్రకారం మనము జీవనశైలిని సృష్టిస్తాము. ఈ రకంగా జీవితంలో నిమగ్నమై ఈ పల్లవి చెబుతున్న సత్యాన్ని అనుకోకుండా తిరస్కరిస్తాము.
ఇది భగవద్గీతలో “కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః” (=ఎవరైతే అకర్మ యందు కర్మను మరియు కర్మ యందు అకర్మను దర్శించుదురో వారు మానవులలో నిజమైన బుద్ధిశాలురు, 4-18) అని చెప్పినట్లుంది. మనం ఏదైనా సంకల్పించి చేస్తే, అది ఖచ్చితంగా మన అవగాహనలోనిదే. ఇది పల్లవి మరియు భగవద్గీతల ప్రకారం చర్య కానే కాదు. అన్నమాచార్యుల మాటల్లోని ద్వ్యర్థత (double meaning) లోతైనదే కాదు, మనసు పెట్టి చదవకుంటే తప్పుద్రోవకూడా పట్టించవచ్చు.
అన్వయార్ధము: మానవుడా! (శుద్ధమైన, కలుషితంకాని) చర్య అంటే ఏమిటో తెలుసుకో!
ముఖ్య పదములకు అర్ధములు: వేదతో = వేదములు మొదలుగాగల గ్రంథముల నుండి సంపాదించిన జ్ఞానముతో { ఇక్కడ, వేదతో అన్న దానిని సహజంగా పొందిన విద్యకు వ్యతిరేకార్ధములో ప్రయత్నం ద్వారా నేర్చుకున్నది అనే అర్థంలో ఉపయోగించాడని నేను భావిస్తున్నాను}; ఆదిగొని = ఎదురుపడు, కన్ను వేయు, పోది
= {this word is a short version of word పోదికాఁడు = పోటుకాఁడు = meaning a
capable person for combat; here and in some other verses also Annamacharya had
used shorter word పోది}, = వీరుడు.
భావము: నీ దాసులున్న యీ ప్రపంచమే నిత్యవైకుంఠము. గ్రంథముల నుండి సంపాదించిన మిడి మిడి జ్ఞానముతో వేరొక చోట వెదకనేలా? ఈ భూమ్మీద ఎదురయ్యేవారంతా నీ ఆకారాలే కాదా? ఓ హీరో! ఎల్లప్పుడూ నీ తలపులలో నీవేనే?
వివరణము: “నీ దాసులు” అంటే ఈ ప్రపంచంలోని ప్రజలందరూ (మినహాయింపులు లేకుండా) ప్రభువు సేవకులనే అర్ధములో వాడారు. “నీ దాసులున్నచోట నిత్యవైకుంఠ మిదె” {=ఈ ప్రపంచమే నిత్యవైకుంఠము} ఇది స్వర్గ తుల్యము. ఈ సందర్భముగా "ఆకాశ పాకాశ మరుదైన కూటంబు”#1 అన్న అన్నమార్యుని మాటలు గమనార్హము.
“వేదతో వేరొక చోట వెదకనేలా” అనేది మనం కృషి చేసి మరీ “కల్పితమైన జ్ఞానం”తో పని చేస్తామని సూచిస్తుంది. అందువలన, సత్యమును కాక 'రంగుల' చిత్రాన్ని చూస్తాము.
ఆదిగొని వారిరూపు లవియే నీరూపులు అనేది మనం చూసే యీ ప్రపంచం మన మనస్సు యొక్క ప్రొజెక్షన్ అని నిర్ధారిస్తుంది. భగవద్గీతలోని "అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం" (= విభజించబడనప్పటికీ, విభజింపబడినట్లు కనిపిస్తుంది, 13-17) అన్నది కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తుంది.
“పోది నిన్ను మదిఁ దలపోయనేలా” = ఓ హీరో! పోటుగాడా! ఎప్పుడూ అన్నీ నీ వైపు నుంచే ఎందుకు
ఆలోచించుకోవాలి? ఈ ప్రపంచానికి నీవేనా కేంద్రము? ఇప్పుడు రెనే మాగ్రిట్టే వేసిన “గోల్కొండ” అనే పెయింటింగ్ చూడండి.
మీరు చిన్న చిత్రములో అనేక రెనే మాగ్రిట్ బొమ్మలు చూపారు. నిశితంగా గమనిస్తే, ఈ పెయింటింగ్ మనం చూసేది మన గురించిన అంచనాలే తప్ప సత్యం కాదని సూచిస్తోంది.
అన్వయార్ధము: ఈ కనపడుతున్న ప్రపంచం మీ స్వంత ప్రొజెక్షన్ అని మీరు కనుగొన్నప్పుడు, మీరు ఇందులో నిమగ్నమౌతారా? అలాంటి దృక్పథం మీకు మీరే అపరిచితుడిగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యము.
ముఖ్య పదములకు అర్ధములు: వట్టిచదువులు = మిథ్యా జ్ఞానము, చేపట్టిన = స్వీకరించు, పుచ్చుకొను; గొసరనేలా = ప్రార్థించనేలా? కోరనేలా?
భావము: భగవంతుని సేవకులతో చర్చ కంటే త్వరగా వేదాలను అర్థం చేసుకోగల విధానమే లేదు. నిరాధారమైన జ్ఞానాన్ని శ్రమపడి నేర్చుకోవడం వల్ల ఏ ప్రయోజనం చేకూరుతుందో? వారి కరుణను అంగీకరించడమే దేవదేవుని ఆశీర్వాదం. ఇంతకు మించి కోరుకునేది ఏముంటుంది?
వివరణము: ఈ చరణం చాలా సాధారణముగా కనిపించినప్పటికీ ధ్యానము (లేదా తపస్సు) ఎక్కడొ మూల కూర్చుని చేసేది కాదని తెలియజేస్తున్నారు. అన్నమాచార్యులు ప్రజల మధ్య నివసించారు. అలాగే బుద్ధుడు మరియు జిడ్డు కృష్ణమూర్తి కూడా.
ఈ మహానుభావులు తాము నేర్చిన, తెలుసుకున్న జాగృతమైన వివేకము, నిస్సంశయమై అవబోధముల వితరణమునకు ఎంతో ఆసక్తిగా సాధారణ ప్రజలతో కలిసిమెలిసి మెలగారనేది వాస్తవం. ఇక్కడ పేర్కొన్న ముగ్గురూ తమ జీవితాన్ని కేవలం ఆ కార్యాచరణలోనే గడిపారు. జిడ్డు కృష్ణమూర్తి తన శిష్యులుగా ఎవరినీ అంగికరించకపోయినా వారు గత శతాబ్దంలో ఇతర మత పెద్దల కంటే ఎక్కువ మంది వ్యక్తులను కలిసి చర్చలు, గోష్టులు, సభలు నిర్విరామంగా 56 సంవత్సరాలపాటు జరిపిరి.
అన్వయార్ధము: ఈ ప్రపంచం కంటే గొప్ప సత్యం లేదు. మీ తోటివారి కంటే గొప్ప ఉపాధ్యాయుడు లేడు. అంతరంగ సామరస్యముతోడి జీవనము కంటే ఏ జ్ఞానమూ ఉన్నతమైనది కాదు.
ముఖ్య పదములకు అర్ధములు: కైవశమౌ = స్వాధీనమగు, లోకువగు.
భావము: మహర్షులు నారదుడు మరియు శుకుడు అదే తెలియజేసారు. మీకు నా విన్నపము కూడా అదే. శ్రీ వేంకటేశ్వరుని సేవకులకు ఈ మనస్సు లొంగును. వారి అర్హతలకు హద్దుందా?
వివరణము: అన్నమాచార్యులు అందరూ సమానమేనని, ప్రతి మనిషి మోక్షము పొందగలరని స్పష్టం చేశారు. కానీ మనిషి దాని వైపు అడుగులు వెయ్యాలి.
ధ్యానము అనేది దీర్ఘాలోచనా కాదు, చర్చా కాదు. ధ్యానము అనేది స్వచ్ఛమైన చర్య. మనిషి తనను తాను అనంతంలోకి అర్పించుకునే చర్య. నారదుడు, శుకుడు వంటి మహానుభావుల సందేశం ఇదేనన్నారు.
అన్వయార్ధము: ఓ మానవుడా! హృదయ ఘోష విను. ఋషిపుంగవుల ఆనతిపై, దైవమునకు నిజమైన బంటుగా మారి జీవన యానమున ముందుకు సాగుము#2.
కీర్తన సంగ్రహ సారం:
పల్లవి: వెన్న చేతబట్టి నేయి వెదకుటెట్లు
వ్యర్థమో, తనకు కలది కనుగొనుట వివేకమా?అన్వయార్ధము: మానవుడా! (శుద్ధమైన, కలుషితంకాని) చర్య అంటే ఏమిటో తెలుసుకో!
చరణం 1: నీ దాసులున్న యీ ప్రపంచమే నిత్యవైకుంఠము. గ్రంథముల నుండి సంపాదించిన
మిడి మిడి జ్ఞానముతో వేరొక చోట వెదకనేలా? ఈ భూమ్మీద ఎదురయ్యేవారంతా నీ ఆకారాలే కాదా?
ఓ హీరో! ఎల్లప్పుడూ నీ తలపులలో నీవేనే?
అన్వయార్ధము: ఈ కనపడుతున్న ప్రపంచం మీ స్వంత ప్రొజెక్షన్ అని మీరు కనుగొన్నప్పుడు, మీరు ఇందులో నిమగ్నమౌతారా? అలాంటి దృక్పథం మీకు మీరే అపరిచితుడిగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యము.
చరణం 2: భగవంతుని సేవకులతో చర్చ
కంటే త్వరగా వేదాలను అర్థం చేసుకోగల విధానమే లేదు. నిరాధారమైన జ్ఞానాన్ని శ్రమపడి నేర్చుకోవడం వల్ల
ఏ ప్రయోజనం చేకూరుతుందో? వారి కరుణను అంగీకరించడమే దేవదేవుని ఆశీర్వాదం. ఇంతకు మించి
కోరుకునేది ఏముంటుంది? అన్వయార్ధము: ఈ ప్రపంచం కంటే గొప్ప సత్యం లేదు. మీ తోటివారి కంటే గొప్ప ఉపాధ్యాయుడు లేడు. అంతరంగ సామరస్యముతోడి జీవనము కంటే ఏ జ్ఞానమూ ఉన్నతమైనది కాదు.
చరణం 3: మహర్షులు నారదుడు మరియు శుకుడు అదే తెలియజేసారు. మీకు నా విన్నపము
కూడా అదే. శ్రీ వేంకటేశ్వరుని సేవకులకు ఈ మనస్సు లొంగును. వారి అర్హతలకు హద్దుందా? అన్వయార్ధము: ఓ మానవుడా! హృదయ ఘోష విను. ఋషిపుంగవుల ఆనతిపై, దైవమునకు నిజమైన బంటుగా మారి జీవన యానమున ముందుకు సాగుము#2.
భౌతిక జ్ఞానంతో చూచినప్పుడు చరాచర జగత్తులో ఉన్న సమస్తమునామరూపగుణాలతో
ReplyDeleteనున్న వేర్వేరు రూపములుగా గోచరిస్తాయి.అంటే నాకు కనిపించేది, నేను చూచేది యన్న కర్తృత్వభావంతో ఉన్నవానికి జగత్తు విభిన్నమైనదిగా, విభక్తమైనదిగా కన్పట్టును. కాని, కర్తృత్వ, భోక్తృత్వభావము లేక జ్ఞానదృష్టితో చూచిన వానికి సమస్త చరాచర జగత్తులోని స్థావరజంగమములు అభిన్నములుగా, అవిభక్తములుగా కన్పిస్తాయి. అన్నిటినీ భగవదంశలైన ఆత్మలుగా
చూస్తాడు.అట్టి జ్ఞాని అన్నిటినీ నిత్యసత్యములైన ఆత్మలుగా, సమదృష్టితో దర్శిస్తాడు.
*విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని|*
*శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః||*
(గీత 5-18)
దీనినే అన్నమయ్య ఈ కీర్తనలో
"వెన్న చేత బట్టి నేయి వెదకనేలా
యిన్నిటా నెంచి చూచితే నిదియే వివేకము"
అంటే ఈ ప్రపంచమే నిత్య వైకుంఠమని,దృశ్యమాన జగత్తంతా నీయొక్క స్వరూపమేనని,జగత్తు, నీవు అభిన్నములేయని,అన్నిటా ప్రకాశించేది పరమాత్మ యొక్క అంశయేనని,ఇక్కడే పరమాత్మను దర్శించవచ్చునని, ఆత్మ- పరమాత్మ అభిన్నములు, అవిభక్తములే యని, అవి వేర్వేరు కావని జగత్తును సమదృష్టితో కాంచుమని అదియే వివేకమని, పరిశుధ్ధ జ్ఞానమని, నిష్కల్మషమైన చిత్తముతో కూడిన చర్య ఇదేనని, మిగిలిన అన్ని చర్యలు కూడా అజ్ఞానంతో కూడినవియే నని,వాటివలన జనించునవి దుఃఖములేయని కనుక అంతరంగ సామరస్యముతోడి జీవనము కంటే ఉత్కృష్టమైన జ్ఞానమేదియును లేదని,హరిభక్తుల సాంగత్యంలో హరిభక్తి కలిగి జీవితగమ్యమైన కైవల్యాన్ని ఆర్జించుకొమ్మని సర్వులకు జ్ఞానబోధను చేస్తున్నాడు.
రెనె మాగ్రెట్ చిత్రములు నిశితంగా గమనిస్తే గ్రుడ్డును చూచి పక్షిగా దానిని కల్పించుకొని, కల్పనాప్రపంచం లోనికి మన ఆలోచనలు,ఊహలు పయనిస్తాయని అదే సత్యమన్న భ్రమలో చిక్కుకొంటున్నాము.
అలాగే,మరొక చిత్రంలో కనిపించే ప్రపంచమంతా స్వస్వరూపమే నని, అన్నిటా సమదృష్టిని కలిగి, అందరిలోనూ పరమాత్మదర్శనం చేసుకొనినచో ఏకీకృతదృష్టితో అహం బ్రహ్మాస్మి అనే సర్వోన్నత స్థితిని అనుభవించవచ్చనే విషయాన్ని తెలియజేస్తున్నాయి.
ఓం తత్ సత్ 🙏🙏🙏
కృష్ణ మోహన్