Monday, 3 October 2022

T-142® ఏమి గలదిందు నెంత పెనగినఁ వృథా

 తాళ్లపాక అన్నమాచార్యులు

142® ఏమి గలదిందు నెంత పెనగినఁ వృథా 

for English Version press here

 

ఉపోద్ఘాతము: అన్నమాచార్యులు ఎన్నడూ తన స్వస్థలాలను విడిచి బయటకు వెళ్లలేదు. ఐనా వారు ప్రపంచములో అంతర్లీనముగా దాగియున్న స్వాభావికమైన క్రమమును  (న్యాచురల్ ఆర్డర్ ఆఫ్ ది యూనివర్స్, Natural Order of the universe) ప్రస్తావించిరి. ఇదియే ఆలోచించవలసిన విషయం. ప్రపంచమునంతా ఏకత్రాటిపై సమన్వయముచేయు వ్యూహము యొక్క ప్రసక్తి విస్మయము కలిగించునదే కాక అసాధారణమనీ భావించవచ్చు. 

అన్నమాచార్యులు తత్వవేత్త కాదు. కానీ అద్భుతమైన పరిశీలకుడు. అతడు భగవంతునిపై తదేక ధ్యానంలో పారవశ్యాన్ని అనుభవించాడు. అతను ఆ వర్ణించలేని  అనుభవాలను కవితల రూపంలో అందించాడు. అందువల్ల, వాటిలో కొన్ని కొన్ని వర్ణనలు అస్పష్టంగా కనిపిస్తాయి. నేను జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాల నుండి ఇలాంటి పరిశీలనలు మరియు భగవద్గీత ఆధారంగా ఈ సమీక్షలో గమనికలు చేసాను. ఈ కీర్తనలోనూ సులభముగా పైకి కనిపించని అటువంటి కల్పన ఉంది.

అన్నమాచార్యులు మనము సాధారణంగా అర్థం చేసుకునే తలములలో లేని సత్యాన్ని అనుభవించాడని గుర్తుంచుకోవాలని పాఠకులను అభ్యర్థిస్తున్నాను. ఈ ప్రాపంచిక వ్యవహారాలలో నిమగ్నమైన మనస్సుకు సత్యము అగోచరము. ‘పాసిపోవుట యేమి’ అని ప్రశ్నించి ఆలోచింపచేస్తారు. 

అన్నమాచార్యులు ఎప్పుడూ జీవనము గురించి మాట్లాడుతారు, జీవితం గురించి కాదు. ఇక్కడ జీవించడం అంటే ప్రవహించే నది లాంటిదన్నారు. ఈ అద్భుతమైన కీర్తనలోని పరమాశ్చర్యము గొలుపు విషయాలు తెలుసుకుందాం

 

కీర్తన:

రాగిరేకు:  64-1  సంపుటము: 1-328

 

ఏమి గలదిందు నెంత పెనగినఁ వృథా
కాముకపు మనసునకు కడ మొదలు లేదు॥ఏమి॥ 

వత్తిలోపలి నూనె వంటిది జీవనము
విత్తుమీదటి పొల్లు విధము దేహంబు
బత్తిసేయుట యేమి పాసిపోవుట యేమి
పొత్తుల సుఖంబులకు పొరలుటలుగాక॥ఏమి॥ 

ఆకాశ పాకాశ మరుదైన కూటంబు
లోకరంజకము తమలోనిసమ్మతము
చాకిమణుఁగుల జాడ చంచలపు సంపదలు
చేకొనిన నేమి యివి చెదిరినను నేమి॥ఏమి॥ 

గాదెఁబోసిన కొలుచు కర్మి సంసారంబు
వేదు విడువని కూడు వెడమాయ బదుకు
వేదనల నెడతెగుట వేంకటేశ్వరు కృపా-
మోదంబు వడసినను మోక్షంబు గనుట॥ఏమి॥

 

Details and Explanations:

ఏమి గలదిందు నెంత పెనగినఁ వృథా
కాముకపు మనసునకు కడ మొదలు లేదు
॥ఏమి॥ 

భావము: మొదలు, చివర లేని కోరికలతో కూడిన మనస్సును నమ్మి ఎందుకు వృథాగా ఈ లోకమున​ ఏముందని పెనుగులాడతావు? 

వివరణము: మానవుని ఆలోచనలు జ్ఞాపకములను పొరలనుండి ఉద్భవించును. అనగా కోరికలకు మూలము స్మృతులే. గతస్మృతులను గోరీలపై నాట్యమాడు ఆలోచనలు మానవునికి విముక్తిని ప్రసాదించలేవు. క్రింద యిచ్చిన లా బెల్లె లూరెట్ (అందమైన లూరెట్)లో, అధివాస్తవిక కళాకారుడు రీని మాగ్రిట్టే ఒక విచిత్రాన్ని సృష్టిస్తాడు. 1965లో గీసిన ఆ చిత్రలేఖనము నాటినుండి అర్ధము చేసుకొనుటకు సవాలుగాను, చూపరుల ​మనస్సులలో గందరగోళమును కలగజేస్తూనే వుంది. 



మాగ్రిట్టేకు, బిల్బోక్వెట్ పరిపూర్ణ అధివాస్తవిక వస్తువు. దాని రూపం ఒక చదరంగం లోని సేనాపతిని (బిషప్’ని)భ్రమింపజేసే విధంగాను మరియు ఉద్వేగభరితంగానూ ఉంటుంది. అధివాస్తవికవాదులకు గణనీయమైన ఆసక్తిగల ఆట చదరంగం; దాని గుర్తింపు చాంచల్యములోను, అస్థిరతలోను ఉంటుంది. దాని తలపై ఒక కన్ను చిత్రించడం ద్వారా దానిని మానవరూపంగా మార్చి, మానవ రూపానికి దాని సమానత్వాన్ని నొక్కిచెప్పాడు. ధనము, పేరు, ప్రతిష్ట, అహంభావములను పదార్ధములను  పేర్చికట్టుకున్న  పూర్తి కృత్రిమ రూపమగు మానవుల అంతఃకరణమును బిల్బోక్వెట్'తో పోల్చుట సముచితము. 

దానిపై కప్పిన వస్త్రములు  చూసిన మరియు కనపడని వాటి మధ్య ద్వంద్వత్వాన్ని మరింతగా పెంచుతుంది.  చాలా ముఖ్యమైన భావనలను బహిర్గతం చేసేందుకు లేదా దాచిపెట్టేందుకు వస్త్రములు, తెరలు, ముసుగులు కళాకారునికి సామర్థ్యాన్ని కల్పిస్తాయి. 

మానవుడు ఆ బిల్బోక్వెట్'ను కప్పుకున్న శాలువా వలె అనేక ఆచ్ఛాదనముల వెనుక నక్కి దాక్కోబోతాడు. ఆ ఆచ్ఛాదనములను అసలు తానేమిటో తెలియనీయ కుండా ఊండుటకు ఉపయోగించి తననుతాను వున్నది వున్నట్లుగా అంగీకరించలేకపోతాడు.  ఇంతకంటే ఆత్మద్రోహము ఉంటుందా? ఇక్కడ సినిమాపాట "పుట్టినప్పుడు బట్ట కట్టలేదు...పోయేటప్పుడు అది వెంట రాదు..నడుమ బట్ట కడితే నగుబాటు ..నడుమ బట్ట కడితే నగుబాటు...నాగరీకం ముదిరితే పొరబాటు" స్మరణీయం. 

పెయింటింగ్'లో వేళ్ళూనుకుని పాతుకుపోయిన శిధిలావస్థలో వున్న బురుజు (లాంటి కట్టడం) గతించిన కాలాన్ని ప్రేరేపిస్తుంది. మున్నిటి జ్ఞాపకములకు చిహ్నం. అయితే బురుజుకు వేళ్ళున్నట్లు చూపి అది జీవునందలి అంర్భాగమని చెప్పిరి. వేళ్ళు ప్రకృతి కల్పించిన రూపాంతరమునకు గల అవకాశాలను సూచిస్తాయి. 

బిల్బోక్వెట్ (సేనాపతి) బురుజు వైపు చూడ్దం గతస్మృతులపై ఆధారము పడడమును సూచించును. ‘గతము త్రవ్వి ఏమి బావుకుంటావని?’ మాగ్రిట్టేగారు మనని అడుగుతున్నారు. మనిషి వెనుకకు చూచి ముందుకు నడవగలననుకోవడం విచిత్రమే. అందుకే అన్నమాచార్యులు అట్టి ప్రయత్నములలో పెనగుట వృథా అనిరి. 

వత్తిలోపలి నూనె వంటిది జీవనము
విత్తుమీదటి పొల్లు విధము దేహంబు
బత్తిసేయుట యేమి పాసిపోవుట యేమి
పొత్తుల సుఖంబులకు పొరలుటలుగాక
॥ఏమి॥ 

ముఖ్య పదములకు అర్ధములు: బత్తిసేయుట = భక్తిసేయుట, పొత్తు = స్నేహము, అవిభక్తత, ఏకమతత్త్వము. 

భావము: జీవనము అనేది వత్తిని ప్రకాశింపజేయు నూనె వంటిది. విత్తుమీదటి పొల్లులా విలువలేనిది దేహంబు.   భక్తిసేయుట యేమి? పాసిపోవుట యేమి? శరీరాలు పెనవేసుకొని పొరలుటకా సాంగత్యము? 

వివరణము: జీవనము ఒక స్రవంతి అని సూచించుచూ అది వత్తిలో ప్రవహించు నూనె వంటిదన్నారు. నూనె జ్వాల వరకు ఎగబ్రాకుటకు వత్తి ఎట్లు సహాయపడునో అటులనే కానీ దేహమునకు జీవనమందు ముఖ్య భూమికలేదని చెప్పిరి. వత్తిని ప్రకాశింపజేయక నూనె పాతగిలి మగ్గిపోవును. అటులనే జనులు జీవ వాహినిని గుర్తించలేక అత్యద్భుతమగు జీవితము నందు ఊక వంటి దేహమును గుర్తించుటలో మునిగి ఉన్నారనిరి. 

'బత్తిసేయుట యేమి' (భక్తిసేయుట) = బాహ్యస్పృహలేక సహజ స్థితిని నిమగ్నమగుటను తెలుపదలచిరి. 

పాసిపోవుట యేమి’తో సహజ కార్యమందు ఏకము కాలేని మనస్సు క్షీణతకు గురియై  శరీరముతో పాటు మనస్సు కూడా నాశము దిశగా పయనించునని తెల్పిరి. 

సహజ కార్యమందుండు మనస్సు శిథిలము కాదని కూడా తెలియవచ్చు. అదియే అనంతమును దర్శించు అవకాశమును కల్పించును అనిరి. 

{‘పొత్తుల సుఖంబుల పొరలుటలుగాక’తో సమాజములోని ప్రతీ మనిషి సమిష్టి కృషి చేసినప్పుడే కదా అది సమర్ధవంతముగా నడయాడేది. ​ ప్రతీ మనిషి సమిష్టి బాధ్యత పేరుతో తనవంతు కర్తవ్యమును నిర్వహించకపోవుటనూ విమర్శించిరని భావించవచ్చు.} 

అన్వయార్ధము: శరీరమున నూనెలా ప్రవహించు జీవనమును తెలియుటకు కోరికలలో పొర్లాడు సమయం లేదని గ్రహించుము. ప్రకృతితో అంతరంగ సామరస్యము లేక లోకము సహానుభూతి, ఆదరణ, కారుణ్యముల లేమితో పులిసిపోతున్నది. 

ఆకాశ పాకాశ మరుదైన కూటంబు
లోకరంజకము తమలోనిసమ్మతము
చాకిమణుఁగుల జాడ చంచలపు సంపదలు
చేకొనిన నేమి యివి చెదిరినను నేమి
॥ఏమి॥ 

ముఖ్య పదములకు అర్ధములు: ఆకాశ పాకాశము = అల్లకల్లొలము, చాకిమణుఁగులు = స్థిరత్వము లేనివి, 

భావము: ఈ అల్లకల్లొల ప్రపంచము అపురూపము అశక్యము, దివ్యము అగు  సమ్మేళనము. అందులోని భాగమైన నిన్ను నీవు గుర్తించి సమ్మతించిన లోకరంజకము.  చాకిమణుఁగులగు (స్థిరత్వము లేని) సంపదలు చేకొనిన నేమి? చెదిరినను నేమి? 

వివరణము: ఆకాశ పాకాశ మరుదైన కూటంబు: ఈ అసహ్యమైన, అస్తవ్యస్త ప్రపంచమొక అసాధారణమైన సమూహము. ఈ లోకంలో ఎన్నో సమస్యలు కనబడుతవి. దోపిడీలు, అసమానతలు, దౌర్జన్యములు, అల్లకల్లోలములు, బాధలు​. అకటవికటముల వెనుక దాగి ఒక అరుదైన క్రమం ఉంది#1,#2,#3. అది ఎంత తీక్షణమైన ఆలోచనలతోనూ చేరగలిగినది కానీ, ఊహింపదగినది కానీ కాదు. 



ఫిబ్రవరి 1950లో M C ఎస్చెర్ ORDER and CHAOS ను (‘క్రమాక్రమములులేదావ్యవస్థావ్యవస్థలు’  లేదాక్రమము మరియు గందరగోళం’)​ నిర్మించాడు. శీర్షిక స్వీయ-వివరణాత్మకమైనది.   ముద్రణలో ఒక సంపూర్ణ సౌష్టవ ప్రాదేశిక దాదాపు పారదర్శక స్టెల్లెటెడ్ డోడెకాహెడ్రాన్ గాజు గోళంతో విలీనం చేయబడినట్లు  కేంద్రములో చూపిరి. దాని చుట్టూ విరిగిన మరియు ఇతరత్రా అస్తవ్యస్తంగా ఉన్న వస్తువులను కలగూరగంపలా అమర్చిరి. ఆకాశ పాకాశ మరుదైన కూటంబుతో ఇది సరిపోలును.   అనగా ఎంతో నిశితము, తదేక దీక్షగల ఎశ్చర్ వంటి మహానుభావులు కూడా అన్నమాచార్యులు చెప్పినదే వ్యక్త పరచుట ఆశ్చర్యము గొలుపును. 

ఇప్పుడు రెనే మాగ్రిట్‌చే దిగువన ఉన్న key to the fields (క్షేత్రమునకు మార్గము, LA CLEF DES CHAMPS, year 1936) పేరుతో ఉన్న పెయింటింగ్‌ను శ్రద్ధగా చూడమని పాఠకులకు అభ్యర్థన​. మనిషిని మరియు బయలు ప్రదేశమును వేరుచేసే గాజు విరిగిపోయిందని గమనించండి. విరిగిన ముక్కలను గమనించిన, గాజు పగలగొట్టే ముందు, మనం క్షేత్రము యొక్క పెయింట్ చేసిన చిత్రాన్ని మాత్రమే గమనిస్తున్నాము, నిజమైనక్షేత్రము'ను కాదు అని యిట్టే తెలియును.

 


ప్రతీ అనుభవము మన మనస్సులో ఏదోవొక జాడను వదులుతుంది. ఇటువంటివి అనేకము కలసి బుద్ధిలోనికి వచ్చు సమాచారమునువాతావరణములోని ధూళికణములు సూర్యుకాంతిని చెదిరి పోయేటట్లు చేయునట్లు’ సవరించును. మనకు అనుభవములోనికి వచ్చు దర్శనము (picture) సత్యమునకు దూరముగా ఉండును. దీనినే పెయింట్ చేసిన చిత్రాన్ని మాత్రమే చూచుదుమని మాగ్రిట్టె గారు తెలిపిరి. 

గాజును పగలగొట్టినవాడు చేస్తున్న పనిలో లీనమై గాజు ఎలా పగిలిదీ​ గమనించలేదని తెలుస్తోంది.  లేదా త్వరిత గతిని ఛేదించుకు పోవాలన్న తపన ప్రస్ఫుటం. సత్యానికి క్రమబద్ధమైన మార్గం లేదు. అనియమిత మరియు ప్రమాదయుక్తమైన మార్గం చిందరవందర ప్రపంచంయొక్క నైజమును చూపుతోంది. గాయాలకు భయపడి మనం గాజు గోడను దాటకపోతే అంతకంటే పిరికితనముండదు. 

చూపరునకు, క్షేత్రమునకు మధ్యగల గాజు తెర తొలగిపోయినది. ఇప్పుడు అతనికి అగపడునది నిజమగు క్షేత్రమే కానీ, దాని ప్రతిబింబము కాదు. 

కాబట్టి, భగవంతుడిని చేరుకోవడానికి సుగంధము పూసి అలంకరించిన పూలబాటల కోసం ఎదురు చూడవద్దు అని చరణం యొక్క అర్థం. బదులుగా మీరు సమీకరించగలిగిన అన్ని శక్తులతో ఆ అడ్డువలను ఛేదించుకుని వెళ్ళు సాహసం చేయండి. 

తమలోనిసమ్మతము = ధూళికణముల వంటి గత అనుభవపు జాడలు మనము చూచుదానిని చెదిరింపజేసి సరిగా గమనించ నివ్వవని 'ఆకాశ పాకాశము' తో సూచించిరి. తాను చూచునది సరికానిదన్న స్పృహ మనకుండదు. అనేక కోణములలో చీలియున్న సత్యము గ్రహింపునకు రాదు. తాను చూచునది సరికానిదన్న విషయమును అంగీకరించుటయే ఇక్కడ తెలిపిన లోనిసమ్మతము. దీనినే భగవంతుని (ప్రకృతి) సంకల్పాన్ని బేషరతుగా అంగీకరించడమని అన్నమాచార్యులు చెప్పిరి. ఇది ఇక్కడ వివరించినంత సులభము కాదు. 

తమలోనిసమ్మతము మనిషి తనతో తాను అంతర్గతముగా సహవాసము చేయలేక పోవుటయే అసౌకర్యమునకు కారణము. అందుకు ఉన్నదానిని ఉన్నట్లుగా సమ్మతించక సర్దిచెప్పుకుపోవు ప్రయత్నములు చేసెదము. ఇది కొనుగోలు చేసిన సంధి​. దీనికి మూల్యము చెల్లించక తప్పదు. 

తమలోనిసమ్మతము అంతరంగ సామరస్యమునకు దారి. అంతరంగములో లేని సామరస్యము బాహ్యముగా ఎంత ప్రయత్నించినా సమకూరదు. ఆ సామరస్యము పరిశుద్ధమైన అంతఃకరణములేక సాధించుటెట్లు?  కనపడునది కనపడినట్లుగా అంగీకరించుటకు, మౌనము, ప్రశాంతత లేక సాధ్యమా? దానిని ప్రభావితము చేయు  మలినములను పూర్వానుభవముల జాడలు ప్రక్కకు త్రోచివైచుటెట్లు?  ఈ మార్గమున క్షణికమైన సంపదలు ఎటువంటి ప్రయోజనమూ కల్పించవు. 

తమలోనిసమ్మతము: అనగా  నిర్మలమైన అంతరంగముతో, స్థిరుడై (అటునిటు చూడక), సమస్త కార్య కలాపములు నిగ్రహించువాడై, మౌనియై నిర్వర్తించువానికి మాత్రమే సాధ్యము. భగవద్గీతలో “అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః । సర్వారంభపరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః ।। 12-16 ।।“ అని పేర్కొన్నది యిదియే. 

లోకరంజకము: అటు వంటి సూక్ష్మబుద్ధిగల ద్రష్టలు లోకరంజకము కాక మరేమి? 

అన్వయార్ధము: అలజడి, కలవరము, తాఱుమాఱులకు మారుపేరగు ఈ ప్రపంచమొక అపూర్వము, అరుదైన క్రమము ననుసరించును. బాహ్యస్పృహలోనే కాక అంతర్గతముగానూ మనసును దేహమును ఒక త్రాటిపై తెచ్చి సహజ నైజమున నుండుము. 

గాదెఁబోసిన కొలుచు కర్మి సంసారంబు
వేదు విడువని కూడు వెడమాయ బదుకు
వేదనల నెడతెగుట వేంకటేశ్వరు కృపా-
మోదంబు వడసినను మోక్షంబు
గనుట ॥ఏమి॥ 

ముఖ్య పదములకు అర్ధములు: గాదెఁబోసిన =  కూడబెట్టిన, కొలుచు = ధాన్యము, వేదు విడువని కూడు = కంపు కొట్టు భోజనము, వెడమాయ బదుకు = అల్పము, తుచ్ఛము, వ్యర్ధము అగు బతుకు. 

భావము: కూడబెట్టిన ధాన్యము లంటిది కర్మలతో గూడిన సంసారము.  కంపు కొట్టు భోజనము వంటిది అల్పము, తుచ్ఛము, వ్యర్ధము అగు బతుకు. వేంకటేశ్వరు కృపా-మోదంబు వడసిన కదా వేదనల నుండి ముక్తి పొందుట​ మరియు  మోక్షంబు గనుట. 

వివరణము: గాదెఁబోసిన కొలుచు కర్మి సంసారంబు: కూడబెట్టిన ధాన్యము లాంటిది కర్మలతో గూడిన సంసారము అనగా కర్మలతో జీవితమును నింపు తున్నకొద్దీ, నిలువ వుంచిన ధాన్యము వలె పురుగు పట్టి పాడగును. నీచుకంపు వచ్చును​.  వేదు విడువని కూడు#4: గబ్బు కొట్టు భోజనము వంటిది అల్పము, తుచ్ఛము, వ్యర్ధము అగు బతుకు. ఇక్కడ అన్నమాచార్యులు ఒకే అర్ధము వచ్చు రెండు పంక్తుల్నెందుకు వ్రాశారో ఆలోచింతము. 

పూటపూటకు పాసిపోవు భోజనములతో పోషించబడు దేహము మాత్రము పాసిపోదా?...అందుకే "యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనమ్ (4-31)" = యజ్ఞము యొక్క రహస్యము తెలిసినవారు, దానిని ఆచరించి, అమృతతుల్యమైన దాని శేషము స్వీకరించి, పరమ సత్యం దిశగా పురొగమిస్తారు. అని భగవద్గీతలో చెప్పిరి. 

దీనిని విస్తరించి చూచిన దేహము క్షణక్షణమునకు క్షరమగుచున్నదని తెలియవచ్చు. అనగా ఎప్పటికప్పుడు జీవన ప్రవాహమును నిలుపుకొనుటకు మించి తీసికొను ఆహారము యొక్క దుష్ప్రభావము క్రింది బైబెలు (ముత్తయి 15)  వాక్యమునుండి బాగుగా తెలియును. 

“మీరు ఇంకా అవివేకంగా ఉన్నారా? 17నోటిలోకి పోయేదంతా కడుపులో పడి బయటకు విసర్జన అయిపోతుంది. 18కాని నోటి నుండి బయటికి వచ్చేవి హృదయంలో నుండి వస్తాయి. అవే మనుషులను అపవిత్రపరుస్తాయి. ఇది కూడా మీకు తెలియలేదా? 19హృదయంలో నుండే చెడు ఆలోచనలు, హత్యలు, వ్యభిచారాలు, లైంగిక దుర్నీతి, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దైవదూషణలు వస్తాయి. 20మనిషిని అపవిత్రపరచేవి ఇవే గానీ చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం కాదు” 

భౌతిక దేహమే సెకను సెకనుకు మారుతుండగా, ఇక చంచలమగు మనస్సు సంగతి ప్రస్తావించుట అనవసరము. ఈ రకముగా మనస్సు, బుద్ధి, దేహమలను ఒకే క్రమములో, ఒక శ్రేణిలో నిరంతరము ఉంచుటయే అట్టి వానికి దైవమిచ్చిన వ్యాపారము. “చవి నోరి కేడఁ దెత్తు సంపదేడఁ దెత్తు / వీని సవరించుటే నా సంపదిది గాదా#5 అంటూ వీనిని సమర్ధవంతంగా నిర్వహించాలని అన్నమాచార్యులు ముందే చెప్పిరి. 

ఈ జీవితము నిలువవుంచు పదార్ధముగాదని, జీవనమొక ప్రవాహమని, అది ఎడతెరిపిలేనిదని సూచించిరి. ప్రవాహమునున్న నీరు తన వెంట ఏమీ తీసుకెళ్ళదు. అటులనే జీవన ప్రవాహమూను. కానీ మనము ఏదో కూడబెట్టాలని చూస్తాము. 

అన్వయార్ధము: ఈ ప్రపంచము ఒక ధాన్యాగారము వంటిది కాదు. నిలువవుండని ఆహారముతో తయారైన దేహము కూడా పాసిపోకుండా చూచుకొనవలె. కలిగిన యీ అల్ప కాలమందు దుఃఖమునుండి ఉపశమనమునకు వేంకటేశ్వరు కృపా-మోదంబు పడయు యత్నము సేయుము.

 

కీర్తన సంగ్రహ సారం:

పల్లవి: మొదలు, చివర లేని కోరికలతో కూడిన మనస్సును నమ్మి ఎందుకు వృథాగా ఈ లోకమున​ ఏముందని పెనుగులాడతావు?

చరణం 1: జీవనము అనేది వత్తిని ప్రకాశింపజేయు నూనె వంటిది. విత్తుమీదటి పొల్లులా విలువలేనిది దేహంబు.   భక్తిసేయుట యేమి? పాసిపోవుట యేమి? శరీరాలు పెనవేసుకొని పొరలుటకా సాంగత్యము? అన్వయార్ధము: శరీరమున నూనెలా ప్రవహించు జీవనమును తెలియుటకు కోరికలలో పొర్లాడు సమయం లేదని గ్రహించుము. ప్రకృతితో అంతరంగ సామరస్యము లేక లోకము సహానుభూతి, ఆదరణ, కారుణ్యముల లేమితో పులిసిపోతున్నది. 

 

చరణం 2: ఈ అల్లకల్లొల ప్రపంచము అపురూపము అశక్యము, దివ్యము అగు  సమ్మేళనము. అందులోని భాగమైన నిన్ను నీవు గుర్తించి సమ్మతించిన లోకరంజకము.  చాకిమణుఁగులగు (స్థిరత్వము లేని) సంపదలు చేకొనిన నేమి? చెదిరినను నేమి? అన్వయార్ధము: అలజడి, కలవరము, తాఱుమాఱులకు మారుపేరగు ఈ ప్రపంచమొక అపూర్వము, అరుదైన క్రమము ననుసరించును. బాహ్యస్పృహలోనే కాక అంతర్గతముగానూ మనసును దేహమును ఒక త్రాటిపై తెచ్చి సహజ నైజమున నుండుము

 

చరణం 3: కూడబెట్టిన ధాన్యము లంటిది కర్మలతో గూడిన సంసారము.  కంపు కొట్టు భోజనము వంటిది అల్పము, తుచ్ఛము, వ్యర్ధము అగు బతుకు. వేంకటేశ్వరు కృపా-మోదంబు వడసిన కదా వేదనల నుండి ముక్తి పొందుట​ మరియు  మోక్షంబు గనుట.  అన్వయార్ధము: ఈ ప్రపంచము ఒక ధాన్యాగారము వంటిది కాదు. నిలువవుండని ఆహారముతో తయారైన దేహము కూడా పాసిపోకుండా చూచుకొనవలె. కలిగిన యీ అల్ప కాలమందు దుఃఖమునుండి ఉపశమనమునకు వేంకటేశ్వరు కృపా-మోదంబు పడయు యత్నము సేయుము.

 

References and Recommendations for further reading:

#1 105. కనినవాఁడాఁ గాను కాననివాఁడాఁ గాను (kaninavADA gAnu kAnanivADA gAnu)

#2 89. తలఁపులోననే దైవము వీఁడిగో (talapulOnanE daivamu vIDigO)

#3 137 ఆతనినే నే కొలిచి నే నందితిఁ బో నిజసుఖము (AtaninE nE kolichi nE naMditi bO nijasukhamu)

#4 36. ఏది జూచినఁ దమకు (Edi jUchina damaku)

#5 116. చవి నోరి కేడఁ దెత్తు సంపదేడఁ దెత్తు (chavi nOri kEDa dettu saMpadEDadettu)

 

1 comment:

  1. వేదనల నెడతెగుట వేంకటేశ్వరు కృపా-
    మోదంబు వడసినను మోక్షంబు గనుట - దీనికి యత్నం చెయ్యడం అని కాకుండా, భగవంతుడి నిర్హేతుక కృప గురించే అన్నమాచార్యుల వారు చెపుతూ ఉంటారు.

    ReplyDelete

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...