Sunday, 4 December 2022

T-151 ఇదివో మా యజ్ఞాన మెప్పుడును సహజమే

 

తాళ్లపాక అన్నమాచార్యులు

151 ఇదివో మా యజ్ఞాన మెప్పుడును సహజమే

 

for EnglishVersion press here

 

కీర్తన:

రాగిరేకు:  6-4  సంపుటము: 13-35

ఇదివో మా యజ్ఞాన మెప్పుడును సహజమే
కదివి నీవే నన్నుఁ గరుణించవయ్యా పల్లవి॥
 
తల్లి చంకనున్న బిడ్డ తమతోఁ జన్ను దాగుతా
వొల్లఁడు తండ్రి యెత్తుకో నొగిఁబోతేను
మల్లడ నీ మాయలో మరిగిన జీవముల
మెల్లనే మీ సేవసేసి మిమ్ముఁ జేరఁ జాలముఇది॥
 
రెక్కల మరుఁగుపక్షి రెక్కల కిందనే కాని
యెక్కదు వద్దనే మేడ యెంత వున్నాను
పక్కన జన్మమెత్తిన ప్రపంచపు జీవులము
యెక్కుడైన వైకుంఠ మిది గోరఁ జాలమూ  ఇది॥
 
నీరులో నుండేటి కప్పనీటిలోనే వుండుఁగాని
వూరకే పరపుమీద నుండ దెంతైనాను
ఆరయ సంసారములో అజ్ఞానపు జీవులము
బోరన శ్రీ వేంకటేశ బుద్ధి చెప్పి కావవే         ఇది॥ 

 

 

క్లుప్తముగా: భగవంతుడనే, గొప్ప కళాకారుడు, ప్రతి క్షణమూ భ్రమలనే సవాళ్లను మన ముందుంచి పరీక్షిస్తున్నాడు. మనం సత్యానికి బదులుగా మనస్సు వెదజల్లు ప్రతిబింబాలను అనుసరించ బోతాము.


పల్లవి: మా అజ్ఞాన మెప్పుడును సహజమేనయ్యా. నీవే మమ్ము చేరదీసి కరుణించవయ్యా! అన్వయార్ధము:  దేవా, మేము మా అవివేకమును కొనసాగిస్తూనే వుంటాము. దయచేసి, చేరదీసి మమ్మల్ని నీవే రక్షించాలి.

చరణం 1: తల్లి చంకనున్న బిడ్డడు తమకముతోఁ జన్ను దాగుతా తండ్రి యెత్తుకో బోతే కూడా పోడు. అలాగుననే ఓ హీరో (ఓ దేవా) నీ మాయకు మరిగిన జీవములము. నీకు సేవజేసి నిన్ను చేరగలిగినవారము కాము.

చరణం 2: పక్షిపిల్ల దాని తల్లి రెక్కల పరిధిలోనే ఉండబోతుంది. అందుబాటులో ఉన్నప్పటికీ, ఎగరగలిగినప్పటికీ పై మేడలెక్కడానికి సాహసించదు. సంసారమను అజ్ఞానంలో కొట్టుకుపోతున్న ఈలోకపు జీవులం. ప్రక్కదారులలోనే వుండటానికి ఇష్టపడతాము. ఏమికావాలో కోరుకునే విజ్ఞతలేని వారము. 

చరణం 3: కప్ప నీటిలోనే ఉండటానికి ఇష్టపడుతుంది. ఎంత ప్రయత్నించినా, దానిని పరుపు మీద (ఉన్నత స్థానంలో) వుంచలేము. అయ్యా, అదేవిధంగా, మేము ఈ ప్రపంచమను మాయలో ఇరుక్కున్న అజ్ఞానులం. ఓ వెంకటేశ్వరా! త్వరగా వచ్చి బుద్ధి చెప్పి  రక్షించవయ్యా.

 

 

విపులాత్మక వివరణ

 

ఉపోద్ఘాతము: ఇది అతి మధురమైన కీర్తనలలో ఒకటి. అదృష్టవశాత్తూ, పాట కూడా అంతే శ్రావ్యముగా పాడారు. లోతైన అంతర్దృష్టి గల కీర్తనలో, అన్నమాచార్యుడు మానవుని యథేచ్ఛా విహారము చేయు స్వభావాన్ని హృదయాన్ని ఉత్తేజపరిచే ఉదాహరణలతో వర్ణించాడు. సామాన్యుని దైనందిక జీవితములో జరుగు సంఘటనలనే వర్ణించి, వారు వాటిని తమ జీవితములో అన్వయించుకొను విధముగా వ్రాసిన ఘనత ఆయనకే దక్కుతుంది. 

అన్నమాచార్యులు మనం సహజసిద్ధంగా భావించే వింత వింత పోకడలను విమర్శించి మనకు మార్గనిర్దేశం చేస్తాడు.

 

Details and Explanations: 

ఇదివో మా యజ్ఞాన మెప్పుడును సహజమే
కదివి నీవే నన్నుఁ గరుణించవయ్యా పల్లవి॥

 

భావము: మా అజ్ఞాన మెప్పుడును సహజమేనయ్యా. నీవే మమ్ము చేరదీసి కరుణించవయ్యా!

వివరణము: "మనం ఎవరనేది మనకు తెలుసునని ఊహించి తేలిగ్గా తీసుకుంటాం" అంటున్నారు అన్నమాచార్యులు. ఇంకా మాటలురాని పసిబిడ్డడైనా లేదా కాటికికాళ్ళుచాచిన ముసలివాడైనా  సరిగ్గా ఇలాగే భావ ప్రకటన చేస్తారు.  "నేనెవరో నాకు తెలుసు" అన్న ఊహే ప్రధాన వినాశనకారి. సత్యమార్గం నుండి మనం తీసుకునే ప్రధాన విచలనము. అందుకే, అన్నమాచార్యులు మన జీవనమునకు ఆధారమెరుగక కేవలం ఉనికి మాత్రమేగల అనాథలమని, జంతువుల వలె జీవితాన్ని గడుపుతున్నామని విమర్శించుతూ “శ్రీపతియె రక్షించుఁ గాక మరి / యేపున జంతువుల మే మెఱుఁగుదుము అని అన్నారు.



పైన పెట్టిన రెనె మాగ్రిట్టే వేసిన "అనువైన సత్యము" “the endearing truth” or L'aimable véritéఅనే బొమ్మను పరీక్షగా చూడమని పాఠకులకు అభ్యర్థన​. ఇటుక గోడపై పెయింట్ చేయబడిన డైనింగ్ టేబుల్'ను చూస్తాము. కళాకారుడు తెలివిగా గోడను బ్యాక్ గ్రౌండ్ లోకి నెట్టి డైనింగ్ టేబుల్ ను పైకి లేపాడు. ఆర్టిస్ట్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మనం ఆహారానికి ఇచ్చే ప్రాముఖ్యతను నొక్కిచెప్పాడు. అయితే, వాస్తవం ఏమిటంటే, మనకెదురుగా ఉన్న గోడకు బదులు మన మనస్సు డైనింగ్ టేబుల్'ని కళ్ళ ముందట నిలుపుతుంది.

భగవంతుడనే, గొప్ప కళాకారుడు, ప్రతి క్షణమూ భ్రమలనే సవాళ్లను మన ముందుంచి పరీక్షిస్తున్నాడు. పై చిత్రలేఖనంలో మాదిరిగానే, మనం సత్యానికి బదులుగా మనస్సు వెదజల్లు ప్రతిబింబాలను అనుసరించ బోతాము. సత్యమునుండి విడిపోతాము.

క్రింది భగవద్గీత శ్లోకం యొక్క అర్థమూ ఇదే. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే । యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః ॥ 7-౩ । భావము: వేల మందిలో ఏ ఒక్కరో పరిపూర్ణ సిద్ది కోసం ప్రయత్నిస్తారు; మరియు పరిపూర్ణ సిద్ది సాధించిన వారిలో ఎవరో ఒకరు మాత్రమే నన్ను యదార్థముగా తెలుసుకుంటారు.

అందువల్ల, పల్లవి యొక్క అన్వయార్థం క్రింది విధంగా ఉంటుంది.

అన్వయార్ధము:  దేవా, మేము మా అవివేకమును కొనసాగిస్తూనే వుంటాము. దయచేసి, చేరదీసి మమ్మల్ని నీవే రక్షించాలి.

తల్లి చంకనున్న బిడ్డ తమతోఁ జన్ను దాగుతా
వొల్లఁడు తండ్రి యెత్తుకో నొగిఁబోతేను
మల్లడ నీ మాయలో మరిగిన జీవముల
మెల్లనే మీ సేవసేసి మిమ్ముఁ జేరఁ జాలము    ఇది॥ 

ముఖ్య పదములకు అర్ధములు: మల్లడ = హీరో!  {దైవముతో సాన్నిహిత్యాన్ని సూచిస్తూ, ఒక తల్లి పిల్లవాడిని మందలించినట్లుగా, కొంచెం చిరాకు, కొంచెం కోపం, కొంత అభినయము మేళవిస్తూ అన్నారు} 

భావము: తల్లి చంకనున్న బిడ్డడు తమకముతోఁ జన్ను దాగుతా తండ్రి యెత్తుకో బోతే కూడా పోడు. అలాగుననే హీరో ( దేవా) నీ మాయకు మరిగిన జీవములము. నీకు సేవజేసి నిన్ను చేరగలిగినవారము కాము. 

వివరణము: పోలిక గురించి కొంత చెప్పుకోవాలి.  పాలపై ఆకర్షణతో పసిబిడ్డ, తనను వేధిస్తున్న అంతుచిక్కని సమస్యకు పరిష్కారం పొందాలనే కోరికతో మనిషి ప్రపంచమనే అయస్కాంతమునకు  అతుక్కుపోతారు. 

అన్నమాచార్యుడు దేవుడిని తన మిత్రుడన్నట్టుగా (సాన్నిహిత్యాన్ని సూచించడానికి, ఒక తల్లి పిల్లవాడిని కసురుకున్నట్లుగా, కొంచెం చిరాకు, కొంచెం కోపం మేళవిస్తూ) "మల్లాడ" అని సంబోధించే స్వేచ్ఛను తీసుకుంటున్నాడు. 

కార్యము  చేయడంలోనూ, అది ముగించే తొందరలోనూ చిక్కుకున్న మనస్సు సత్యాన్ని అనుభూతి చెందదని సూచించడానికి "మెల్లనే" (= నెమ్మదిగా / జాగ్రత్తగా)  అనే మరొక ముఖ్యమైన పదాన్ని ఉపయోగించారు. అందుకే, జిడ్డు కృష్ణమూర్తి తరచూ ఇలా అంటుంటారు: "సమాధానమను కోరిక నుండి స్వేచ్ఛ లేకుండా, ఏదైనా సమస్యను పూర్తిగా అర్థం చేసుకోలేము." 

మీ సేవసేసి మిమ్ముఁ జేరఁ జాలము {= నీకు తగిన సేవనైనా నిర్వర్తించలేని  అసమర్థులము} చేతన చర్యల ద్వారా మానవుడు భగవంతుణ్ణి  తిరిగి పొందలేడని  సూచిస్తుంది. పాపమునకు దూరంగా ఉండటం, తనకు రేపు లేనట్లు దానిని కొనసాగించడం; మరియు ప్రపంచం తనను గురించి చిత్రీకరిస్తున్న దానిపై  శ్రద్ధ వహించక పోవడం వంటివి కూడా క్లిష్టమైన పనులే. అందుకే,కదివి నీవే నన్నుఁ గరుణించవయ్యా” అని అన్నమాచార్యులు వేడుకొన్నారు.  

 

రెక్కల మరుఁగుపక్షి రెక్కల కిందనే కాని
యెక్కదు వద్దనే మేడ యెంత వున్నాను
పక్కన జన్మమెత్తిన ప్రపంచపు జీవులము
యెక్కుడైన వైకుంఠ మిది గోరఁ జాలమూ         ఇది॥ 

ముఖ్య పదములకు అర్ధములు: పక్కన = పక్క దార్లలో

భావము: పక్షిపిల్ల దాని తల్లి రెక్కల పరిధిలోనే ఉండబోతుంది. అందుబాటులో ఉన్నప్పటికీ, ఎగరగలిగినప్పటికీ పై మేడలెక్కడానికి సాహసించదు. సంసారమను అజ్ఞానంలో కొట్టుకుపోతున్న ఈలోకపు జీవులం. ప్రక్కదారులలోనే వుండటానికి ఇష్టపడతాము. ఏమికావాలో కోరుకునే విజ్ఞతలేని వారము. 

వివరణము: అన్నమాచార్యులు చరణంలో చెప్పిన మాటలు విడ్డూరంగా అనిపిస్తాయి. "ఏమి కోరుకోవాలో మనకు తెలియదు" అంటే నమ్మబుద్ధి కాదు. కానీ అది  వివరించే ముందు 'నకిలి వైద్యుడు'  "థెరపిస్ట్" అనే శీర్షికతో క్రింద ఉన్న పెయింటింగ్ చూడండి. 



నకిలి వైద్యుడు The Therapist (La Thérapeute) టోపీ మరియు పోంచో (దక్షిణ అమెరికాలో ధరించే ఒక రకమైన వస్త్రం, తలకు మధ్యలో చీలికతో మందపాటి ఉన్ని గుడ్డతో తయారు చేస్తారు) ధరించిన ముఖం లేని వ్యక్తి కనబడుతుంటాడు. రెక్కగూడు బదులు ఒక తెరిచి ఉన్న పంజరాన్ని, అందులో రెండు పక్షులను చూడవచ్చు.  పక్షులలో - ఒకటి వెలుపల మరియు మరొకటి లోపల ఉన్నాయు. తెరచి వుంచిన వస్త్రము వీక్షకుడికి చిత్రం యొక్క హృదయాన్ని చూడటానికి అనువుగా వుంది. గూడులో ఉన్న రెండు పక్షులు పారిపోవడానికి అవకాశం వున్నా తమ స్వేచ్ఛను వదులుకుని, అవి ఉన్న చోటే ఉండటానికి సంతోషంగా వున్నట్లు కనిపిస్తాయి.

అందువలన, అన్నమాచార్యలు మరియు రెనె మాగ్రిట్టే, ఇద్దరూ మనషులు స్వేచ్ఛగా ఉండటానికి తగిన అవకాశాలు ఉన్నా, స్థితి కల్పించు భ్రమకొద్దీ  బంధించబడి పోతామని అన్నారు. అందుకే, "ఏమి కోరుకోవాలో మనకు తెలియదు" అని అన్నమాచార్యులు చెప్పినది వాస్తవము.

మనిషి ప్రధాన మార్గాన్ని చేపట్టడానికి ఇష్టపడకుండా పక్క దారులలో వుండటానికి  ఇష్టపడతాడు అని సూచిస్తూ “పక్కన జన్మమెత్తిన ప్రపంచపు జీవులము” అని అన్నమాచార్యులు మరొక ముఖ్యమైన పరిశీలన చేసిరి. రాజవిద్యా రాజగుహ్య యోగమని భగవద్గీతలో తొమ్మిదవ అధ్యాయమనకు నామకరణం చేయడంలోని ఆంతర్యమూ నిదే.

నీరులో నుండేటి కప్పనీటిలోనే వుండుఁగాని
వూరకే పరపుమీద నుండ దెంతైనాను
ఆరయ సంసారములో అజ్ఞానపు జీవులము
బోరన శ్రీ వేంకటేశ బుద్ధి చెప్పి కావవే   ఇది॥

ముఖ్య పదములకు అర్ధములు:  ఆరయ = పరిశీలించగా; బోరన = శీఘ్రముగా

భావము: కప్ప నీటిలోనే ఉండటానికి ఇష్టపడుతుంది. ఎంత ప్రయత్నించినా, దానిని పరుపు మీద (ఉన్నత స్థానంలో) వుంచలేము. అయ్యా, అదేవిధంగా, మేము ప్రపంచమను మాయలో ఇరుక్కున్న అజ్ఞానులం. వెంకటేశ్వరా! త్వరగా వచ్చి బుద్ధి చెప్పి  రక్షించవయ్యా.

వివరణము: అన్నమాచార్యులు భగవంతుడిని కేవలం  రక్షించమనడంలేదు.  బుద్ధి చెప్పి రక్షించమని వేడుకుంటున్నాడు. 

 

-X-The End-X-

2 comments:

  1. ఈ సంకీర్తనలో చూపించిన చిత్రాలు చాలా బాగా అర్థమయ్యాయి. వాటికి అన్నమయ్య సంకీర్తనతో అన్వయం అద్భుతంగా ఉంది....
    ఆలమూరు విజయభాస్కర్....

    ReplyDelete
  2. అజ్ఞానంలో ఉన్న అవివేకులం మేము.ప్రాపంచికమైన విషయాలలో మరిగి యున్నాము. స్వేచ్ఛ తల్లి చాటున బిడ్డ వలె,పక్షిచాటున కూన వలె, బావిలోని కప్ప వలె అజ్ఞానపు కూపంలో మునిగి, అవకాశ మెంతయున్నను, ఈ సంసారపు మాయలో పడి జ్ఞానమనే ప్రకాశాన్ని
    అనుభూతి చెందుటకు యెట్టి ప్రయత్నమూ చేయుట లేదు.

    ఈ మాయాజగత్తును సృష్టించిన నీవే
    మాపై కరుణ చూపి, భ్రమయనే సుడిగుండం నుంచి బయట పడవేసి మమ్ములను రక్షించి జ్ఞానమార్గమున మమ్ము నడిపించవయ్యా! మోక్షమార్గమును చూపించవయ్యా! అని సామాన్యుని గొంతై అన్నమయ్య
    భగవంతుడిని ప్రార్థించుచున్నాడీ యద్భుతమైన కీర్తనలో.

    రినే మాగ్రిట్టి గీచిన చిత్రం పరికిస్తే ఎదురుగా సహజంగా నున్న గోడకు బదులు దానిపై కృత్రిమంగా ఉన్న టేబుల్ వైపే మన దృష్టి ప్రధానముగా కేంద్రీకృతమై ఉంటుంది. సంసారంలో దృశ్యమానమైన జగత్తు కృత్రిమమని, మిథ్యయని తెలియక అజ్ఞానం వలన, భ్రమ వలన దానియందే నిరంతరం రమించి, సత్యము, నిత్యము, సహజము అయిన ఆత్మస్వరూపాన్ని
    కనుగొనలేకున్నామనే సత్యాన్ని ఈ చిత్రం రూఢి చేస్తున్నది.

    ఓమ్ తత్ సత్ 🙏🏻🙏🏻🙏🏻
    కృష్ణ మోహన్

    ReplyDelete

212. ETi pariNAmamu mammEla yaDigErayya (ఏఁటి పరిణామము మమ్మేల యడిగేరయ్య)

  ANNAMACHARYA 212. ఏఁటి పరిణామము మమ్మేల యడిగేరయ్య ETi pariNAmamu mammEla yaDigErayya Introduction: In this seemingly unassuming comp...