Sunday 25 December 2022

T-154 కన్నదేఁటిదో విన్నదేఁటిదో కాఁగలదిఁక నేదో

 అన్నమాచార్యులు

154 కన్నదేఁటిదో విన్నదేఁటిదో కాఁగలదిఁక నేదో

for English Version press here

 

సారాంశం: "నేను అను స్థితి నుండి నీతో (దేవునితో) కలియుటకు చేయు నా ప్రయాస వ్యర్థమైన ప్రయాణం"

Summary of this Poem:

పల్లవి:  కనపడుచున్నదేమిటో? వినపడుచున్నదేమిటో? తరువాత  జరుగునదేమో? నన్నూ తెలియను. నిన్నూ తెలియను. వీని మధ్యలో గొడ్డుపోయిన జీవితమును మాత్రము తెలియుచున్నాను. అన్వయార్ధము:  నరుడా, "నీవు చూసేది మరియు వి౦టున్నది నీలోని ప్రతిధ్వనులనే". అగపడు ప్రపంచం యొక్క నగ్నత్వాన్ని, అది నీలో కలిగించు అసత్యాన్ని అర్థం చేసుకుని, విస్మరించినప్పుడు, నీవు సత్యంలోకి ప్రవేశించవచ్చు.    

 

చరణము 1: నా ముందటి జన్మ యేమిటో, తరువాయి యేమిటో, ఇంకా యేమి కాగలనో అని సతమతమగుచూ సూర్యచంద్రుల వుదయాస్తమయంబులు చూచుచూ కాలము వెళ్లబుచ్చుచున్నాడనే కానీ బహుశా నీమాయల మహిమో, నాకు తెలియని ఏ మూలనో, నీవు భూమిలోన ఉన్నాఁడవు అనితెలిసినా నిన్ను తెలియలేకున్నాను ప్రభూ.  అన్వయార్ధము:  మానవా! తెలిసిన స్థితి నుండి తెలిసినదాని కెళ్ళుటకు ఉవ్విళ్ళూరుతావే. స్వర్గము లేదా నరకమను వేరు జగములు లేవు.   అటువంటి కదలికలన్నీ గతంలో పాతుకుపోయిన భావనలే. అలాంటి నీ ఉనికి జీవితమనిపించుకోదు.

చరణము 2: దేవా! నీవు జ్ఞానముకు ప్రతిరూపం కావచ్చు. అయితే, నా అజ్ఞానం మరింత బలమైనదేమో. నిలుకడగాఁ చూసిన నీనామంబులు అనంతకోట్లు. కనిపించే ప్రపంచం కలయా?  వాస్తవమా? నా ముక్కు ఉచ్ఛ్వాస నిశ్శ్వాసములను లెక్కించే కొలత జాడీనా? (నా వయస్సును తెలపడానికి).​ అన్వయార్ధము:   ఓ దేవా! నేనేమి చేయాలో నిర్ణయించే శక్తి నాకు లేదు. నీ అసంఖ్యాకమైన రూపాలతో నన్ను అయోమయానికి గురిచేస్తావు​. నేను సత్యాన్ని భ్రమ నుండి వేరు చేయలేకపోతున్నాను. నాకు కాలము మరియు అనంతము అర్థం కాదు.

చరణము 3: నీకు నీవే నాపై దయ దలఁచితివో  లేక ఆచార్యుని కృపయో తెలియదు. చేపట్టి నా అంతర్యామివి నీవని ఇపుడే గంటిని నేను. నీవు శ్రీకాంతుఁడవో శ్రీవేంకటేశ్వరుడవో తెలియలేను. కానీ శ్రీవైకుంఠమే యీజగమని గుర్తించితిని. ఎటు చూచిన నీ దాసులు నాయెదుటనే వున్నారు. 

 

 

విపులాత్మక వివరణ

 

ఉపోద్ఘాతము: లోతైన చిక్కని చిక్కులు పెట్టు కీర్తన ఎదురులేని అన్నమాచార్యుల ప్రఙ్ఞకు సాక్ష్యం అనువచ్చును. అత్యంత కఠినమైన తత్వబోధను సరళమనిపించు సందిగ్ధతల మాటున ఆకర్షణ అను వలను పన్ని మభ్యపెడతాడు.  

జీవితంపై వారి పరిశీలనలు, వారి నిష్క్రమణానంతరము శతాబ్దాల తరువాత పాశ్చాత్యుల కళలలో ప్రతిబింబించడం అన్నమాచార్యుల గొప్పతనానికి గీటురాయి.   ప్రశ్నలు వ్యక్తులకు నేరుగా సంబోధించి ఆలోచించింప చేస్తారు. వారు మాటలతో చమత్కారం చేయరు, కనిపించని కొక్కెములతొ సతమతమౌతున్న మనకు జీవితమనే బాటను సుగమము చేస్తారు. 

 

కీర్తన:

రాగిరేకు:  255-5  సంపుటము: 3-318

కన్నదేఁటిదో విన్నదేఁటిదో కాఁగలదిఁక నేదో
నన్నుం గానను నిన్నుం గానను నడుము బట్టబయలు ॥పల్లవి॥
 
నీమాయమహిమో నే నేరని కడమో
భూమిలోన నీవున్నాఁడవు నా పుట్టుగులుఁ గలవు
యేమి గాఁగలనో యింకా మీఁదట నిటకతొల్లి యేమైతినో
సోమార్కుల వుదయాస్తమయంబులు చూచుచునున్నాఁడను నేను ॥కన్న॥
 
జ్ఞానము నీవో అజ్ఞానంబే బలువో
నీనామంబులు అనంతకోట్లు నిలుకడగాఁ గాను
కానఁగల యీ ప్రపంచమెల్లా కలయో యిది నిజమో
కానరాని యీ ముక్కున నూర్పులు కాలముఁ గొలచేటి కుంచములు ॥కన్న॥
 
నీకు నీవే నను దయ దలఁచితివో నేనాచార్యుని నమ్మితినో
కైకొని నాయంతర్యామివి నినుఁ గంటినిపుడే నేను
శ్రీకాంతుఁడవో శ్రీవేంకటేశ్వర శ్రీవైకుంఠమే యీజగము
యేకడ చూచిన నీదాసులు నాయెదుటనే వున్నారు ॥కన్న॥ 

Details and Explanations: 

కన్నదేఁటిదో విన్నదేఁటిదో కాఁగలదిఁక నేదో
నన్నుం గానను నిన్నుం గానను నడుము బట్టబయలు ॥పల్లవి॥ 

ముఖ్య పదములకు అర్ధములు: కన్నదేఁటిదో = What do I see?  బట్టబయలు = బీఱువడు, వృథపోవు అను అర్ధములో వాడిరి. 

భావము: కనపడుచున్నదేమిటో? వినపడుచున్నదేమిటో? తరువాత  జరుగునదేమో? నన్నూ తెలియను. నిన్నూ తెలియను. వీని మధ్యలో గొడ్డుపోయిన జీవితమును మాత్రము తెలియుచున్నాను.

వివరణము: నేనెవరో నాకు తెలియదు కాబట్టి, నేను చూసినది, విన్నది, ఆశించేదంతా వ్యర్థమైన దేవులాట​. అందువల్ల నువ్వు (దైవము) నాకు తెలుసుననుట అబద్ధము. అందువలన పుట్టినప్పటి నుండి మరణం వరకు జీవితం పూర్తిగా వెల్లిబోయినదని అన్నమాచార్యులు చాలా స్పష్టంగా చెప్పారు.

కావున​, "నేను అను స్థితి నుండి నీతో (దేవునితో) కలియుటకు చేయు నా ప్రయాస వ్యర్థమైన ప్రయాణం" అని తెలియవలె.  క్రింది భగవద్గీత శ్లోకం యొక్క అర్థం కూడా ఇదే:

శ్లో ॥ అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత ।
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా ॥ 2-28 ॥

భావము: అర్జునా! ప్రాణులన్నియు పుట్టుకకు ముందు ఇంద్రియ గోచరములు కావు (అవ్యక్తములు). మరణానంతరం కూడా అవ్యక్తములే. జనన మరణాల మధ్య మాత్రమే అవి ప్రకటితములు (ఇంద్రియ గోచరములు) అగుచున్నవి. ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము.

మనకు తెలిసినది మొత్తం కధలో చిన్న భాగం మాత్రమే. మనమెక్కడ నుంచి వచ్చామో, ఎక్కడకు పోయెదమో కూడా తెలియదు అని ఈ శ్లోకం యొక్క భావము. ఈ జీవితం ఒక  మజిలీ మాత్రమే. మొత్తం తెలియకుండా, తెలిసిన చిన్ని భాగము  గురించి విచారించుట అవివేకమని సూచించారు. విజ్ఞులు మొదలు నుంచి తుది వరకు ఎఱుగుటచేత దుఃఖం పొందరు అని అంతర్లీన భావము.

ఇప్పుడు రెనే మాగ్రిట్టే వేసిన సముదాయ భూమి ("ది కామన్ ప్లేస్" లె లియు కమ్యూన్, ఫ్రెంచి) అనే పెయింటింగ్’ను పరిశీలిద్దాం. చిత్రంలో మనకు ఎడమ వైపున నుండి ఒక వ్యక్తి నిర్వికారంగా ఏదో  తెలియని నేపథ్యం  తెర మీదకు రావడం చూస్తాము. కుడివైపున అతను కనిపించే క్షేత్రాన్ని వదిలి, మళ్ళీ తెలియని నిర్మాణంలోకి వెళుతున్నట్లు అనిపిస్తుంది. పాత్రల మధ్య ఒక అడవిని చూస్తాము. ఇక్కడ అడవితో ఎడారి, రిక్తము చిత్రకారుడు చెప్ప దలిచాడు. మన ముందు భౌతికంగా అడవి వున్నప్పటికీ అందు దాగి ఉన్న ప్రకృతిని తెలియలేమని  సూచిస్తుంది. అందువలన, మాగ్రిట్ జీవితం అంతుచిక్కనిదని చెబుతున్నాడు. చిత్రం పల్లవిని ప్రతిబింబిస్తుంది కదా?



ఇంద్రియములు, బుద్ధి, మనస్సు, దేహము ఒకే త్రాటిపై తెచ్చునది చూపు కానీ కేవలము జ్ఞానేంద్రియాలతో చూచునది అన్నమయ్య పేర్కొన్న చూపుకాదు. కావున మనమందరము సత్యము నెరుగని గుడ్డివాళ్ళం. 

అన్వయార్ధము:  నరుడా, "నీవు చూసేది మరియు వి౦టున్నది నీలోని ప్రతిధ్వనులనే". అగపడు ప్రపంచం యొక్క నగ్నత్వాన్ని, అది నీలో కలిగించు అసత్యాన్ని అర్థం చేసుకుని విస్మరించినప్పుడు, నీవు సత్యంలోకి ప్రవేశించవచ్చు.    

నీమాయమహిమో నే నేరని కడమో
భూమిలోన నీవున్నాఁడవు నా పుట్టుగులుఁ గలవు
యేమి గాఁగలనో యింకా మీఁదట నిటకతొల్లి యేమైతినో
సోమార్కుల వుదయాస్తమయంబులు చూచుచునున్నాఁడను నేను ॥కన్న॥ 

ముఖ్య పదములకు అర్ధములు: నే నేరని కడమో = నాకు తెలియని ఏదో చివర;  సోమార్కుల = సూర్యచంద్రుల;

భావము: నా ముందటి జన్మ యేమిటో, తరువాయి యేమిటో, ఇంకా యేమి కాగలనో అని సతమతమగుచూ సూర్యచంద్రుల వుదయాస్తమయంబులు చూచుచూ కాలము వెళ్లబుచ్చుచున్నాడనే కానీ బహుశా నీమాయల మహిమో, నాకు తెలియని మూలనో, నీవు భూమిలోన ఉన్నాఁడవు అనితెలిసినా నిన్ను తెలియలేకున్నాను ప్రభూ.  

 

వివరణము:సోమార్కుల వుదయాస్తమయంబులు చూచుచునున్నాడను’  అంటూ మనిషి ఊరకనే సమయం గడిపేస్తాడని అన్నమాచార్యు లన్నారు. భూమిలోన నీవున్నాఁడవు’ అని ప్రకటించి భగవంతుడు వేరెక్కడో లేడనినొక్కి చెబుతున్నాడు. తద్వారా, ఇప్పుడున్నట్లే వుంటే జీవిత ప్రయాణాన్ని నిరంతరముగానూ మరియు అసమర్థంగా కొనసాగిస్తాము అని చెబుతున్నారు.

‘యేమి గాఁగలనో యింకా మీఁదటన్’ = ముందు రాబోయ్యే దాన్ని గురించి మోద ఖేదములను చెందడమనునది మానసిక కదలికలని, వాటిని అన్నమాచార్యులు  ఖండిస్తున్నారు.

మొదటి రెండు చరణాలు ఒకేలా ఉంటాయి. నేను తదుపరిదానిలో మరింత వివరణ ఇవ్వబడింది.

అన్వయార్ధము:  మానవా! తెలిసిన స్థితి నుండి తెలిసినదాని కెళ్ళుటకు ఉవ్విళ్ళూరుతావే. స్వర్గము లేదా నరకమను వేరు జగములు లేవు.  అటువంటి కదలికలన్నీ గతంలో పాతుకుపోయిన భావనలే. అలాంటి నీ ఉనికి జీవితమ నిపించుకోదు. 

 

జ్ఞానము నీవో అజ్ఞానంబే బలువో
నీనామంబులు అనంతకోట్లు నిలుకడగాఁ గాను
కానఁగల యీ ప్రపంచమెల్లా కలయో యిది నిజమో
కానరాని యీ ముక్కున నూర్పులు కాలముఁ గొలచేటి కుంచములు ॥కన్న॥

ముఖ్య పదములకు అర్ధములు: బలువో = శక్తివంతమైనదో, బలమైనదో; నూర్పులు = ఉచ్ఛ్వాస నిశ్శ్వాసములు; 

భావము: దేవా! నీవు జ్ఞానముకు ప్రతిరూపం కావచ్చు. అయితే, నా అజ్ఞానం మరింత బలమైనదేమో. నిలుకడగాఁ చూసిన నీనామంబులు అనంతకోట్లు. కనిపించే ప్రపంచం కలయా?  వాస్తవమా? నా ముక్కు ఉచ్ఛ్వాస నిశ్శ్వాసములను లెక్కించే కొలత జాడీనా? (నా వయస్సును తెలపడానికి).​

వివరణము: అజ్ఞానం నుంచి జనియించు మొండితనము సత్యము కంటే బలమైనదని అన్నమాచార్యుడు స్పష్టం చేశాడు. సామాన్యుడు తనకు దైవము తెలుసు అని నమ్ముతాడు. అన్నమాచార్యులు, జిడ్డు కృష్ణమూర్తి వంటి మహానుభావులు సందేహాలలో మునిగి ఉండగా, మూర్ఖులు తమకు సత్యము తెలుసునని భావిస్తారు. ఇంతకంటే హాస్యాస్పదం ఇంకేముంటుంది?

1915లో హిల్మా ఆఫ్ క్లింట్ వేసిన స్వాన్ నెం.10 పెయింటింగ్ గురించి ఇక్కడ చర్చించుకుందాము. ఆమె చిత్రించిన ఈ హంసలు#1 మనిషిలోని చైతన్యము, విమోచనముల సంబంధమును సూచిస్తాయి. ఇప్పుడు ఈ పెయింటింగ్'లో క్రింది భాగము యొక్క విలోమ పరావర్తనమును పై భాగములో చూస్తారు. క్రింది కుడి భాగము మధ్యలో చిన్న రంగురంగుల షడ్భుజాకారం, విశ్వ చైతన్యమను సముద్రములో మానవుని ప్రస్తుత స్థానాన్ని సూచిస్తుంది.



సత్యమును చిత్రము మధ్యలో రంగురంగులలో మరియు ఆకర్షణీయంగా ప్రకాశిస్తున్నట్లు చూపారు. మానవుడు సత్యము చేత ఆకర్షించబడతాడు. మనము మన ప్రస్తుత అస్తిత్వం (షడ్భుజి) చైతన్య సముద్రంతో ఒద్దికగా కలిసిపోదని గ్రహించము. షడ్భుజి "నేను" అను ఇప్పటి జీవితపు ఊహలచేత మన చేతలతోనే నిర్మించబడింది. "సత్యంతో ఏకత్వము మన స్థితి నుంచి కేంద్రానికి ప్రయాణం కాదు, కానీ మనమే సృష్టించిన కృత్రిమ సరిహద్దులను చెరిపివేసి అనంతమగు చైతన్యము నందు మిళితమగుటయే" అనేది చిత్రలేఖనం యొక్క గూఢార్థం.

మళ్ళీ, పెయింటింగ్ లో మీరు అసంఖ్యాకమైన అస్పష్టమగు వృత్తాలు కనపడతాయి. ఇది విశ్వ చైతన్యమను  సముద్రంలో మనము ఒక చుక్క మాత్రమే అని సూచిస్తుంది. అందువల్ల, అనంతమైన మహాసముద్రంలో కరిగి చేరినప్పుడు, మరణానికి మరియు జీవనమునకు మధ్య వ్యత్యాసము సమసిపోవును. చైతన్యమను మహాశక్తిలో అంత్ర్భాగమైనప్పుడు మానవునిలో జ్ఞానము సూర్యునిలా ప్రకాశించును.​

పై వివరణలో 'నీనామంబులు అనంతకోట్లు' అనేది ఋజువౌతుంది. 'నిలుకడగాఁ గాను' అనునది సంపూర్ణ నిశ్శబ్దం ఆవరించిన మనస్సును సూచించును. అటువంటి అవగాహన కాలపరిధిలో లేదని తెలియవలె.   క్రింది భగవద్గీత శ్లోకం యొక్క అర్థం కూడా అదే:  

తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్ ।
దదామి బుద్ధియోగం తం యేన మాముపయాంతి తే ॥ 10-10 ॥

భావము: మనస్సు సదా ప్రేమ పూర్వక భక్తి తో నాతో ఏకమై ఉన్న వారికి, నేను దివ్య జ్ఞానమును ప్రసాదిస్తాను దానిచే వారు నన్ను పొందవచ్చు.

జిడ్డు కృష్ణమూర్తి గారి క్రింది ప్రకటనను కూడా పరిశీలించండి. "మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే, ఏ విషయాన్ని ఆశించడమో, గ్రహించడమో లేదా ప్రతిఘటించడమో లేనప్పుడే, ఏది నిజమో చూడడం సాధ్యమవుతుంది. విముక్తి కలిగించేది సత్యమేగాని, స్వేచ్ఛగా ఉండటానికి మీ ప్రయత్నం కాదు."

కాబట్టి, అన్నమాచార్యుల కీర్తనలు భగవంతుణ్ణి స్తుతించే అందమైన రచనలు మాత్రమే కాదు, ఒక యోగి యొక్క లోతైన ఆవిష్కరణలని పాఠకులు గమనించగలరు.

 

అన్వయార్ధము:   ఓ దేవా! నేనేమి చేయాలో నిర్ణయించే శక్తి నాకు లేదు. నీ అసంఖ్యాకమైన రూపాలతో నన్ను అయోమయానికి గురిచేస్తావు​. నేను సత్యాన్ని భ్రమ నుండి వేరు చేయలేకపోతున్నాను. నాకు కాలము మరియు అనంతము అర్థం కాదు. 

నీకు నీవే నను దయ దలఁచితివో నేనాచార్యుని నమ్మితినో
కైకొని నాయంతర్యామివి నినుఁ గంటినిపుడే నేను
శ్రీకాంతుఁడవో శ్రీవేంకటేశ్వర శ్రీవైకుంఠమే యీజగము
యేకడ చూచిన నీదాసులు నాయెదుటనే వున్నారు ॥కన్న॥ 

భావము: నీకు నీవే నాపై దయ దలఁచితివో  లేక ఆచార్యుని కృపయో తెలియదు. చేపట్టి నా అంతర్యామివి నీవని ఇపుడే గంటిని నేను. నీవు శ్రీకాంతుఁడవో శ్రీవేంకటేశ్వరుడవో తెలియలేను. కానీ శ్రీవైకుంఠమే యీజగమని గుర్తించితిని. ఎటు చూచిన నీ దాసులు నాయెదుటనే వున్నారు.

వివరణము:శ్రీవైకుంఠమే యీజగము' = సత్యంతో పాటు మనిషి ప్రపంచంలోనే ఉంటాడు. స్వర్గ సుఖాలను కామించే వారు, నరకానికి భయపడే వారు చాలా మంది ఉన్నారు. అటువంటి వారికితలదాచుకోవడనికి (ప్రయాణించడానికి) మరే లోకము లేదు” అని అన్నమాచార్యుడు చెప్పాడు.

ఇక్కడ అన్నమయ్య చెప్పిన “ఆకాశ పాకాశ మరుదైన కూటంబు”#2 అన్నది గుర్తుకు తెచ్చుకుందాం. అసహ్యమైన, అస్తవ్యస్త ప్రపంచమొక అసాధారణమైన సమూహము. ఈ లోకంలో ఎన్నో సమస్యలు కనబడుతవి. దోపిడీలు, అసమానతలు, దౌర్జన్యములు, అల్లకల్లోలములు, బాధలు​. అకటవికటముల వెనుక దాగి ఒక అరుదైన క్రమం ఉంది. అది ఎంత తీక్షణమైన ఆలోచనలతోనూ చేరగలిగినది కానీ, ఊహింపదగినది కానీ కాదు. 

మనిషి అటువంటి స్థితికి చేరుకున్నప్పుడు, అతను ఈ జీవితం యొక్క అందాన్ని కనుగొని తన తోటి మానవులపై కురిపించడా?

 

References and Recommendations for further reading:

#114. దిబ్బలు వెట్టుచు దేలిన దిదివో (dibbalu veTTuchu dElina didivO) 

#2 142 ఏమి గలదిందు నెంత పెనగినఁ వృథా(Emi galadiMdu neMta penagina vRthA)

 

-X-The End-X-

1 comment:

  1. కీర్తన యొక్క సారాంశం సరళంగా, సూక్ష్మంగా "నేను అను స్థితి నుండి నీతో (దేవునితో) కలియుటకు చేయు నా ప్రయాస వ్యర్థమైన ప్రయాణం" బహులెస్సగా యున్నది.వ్యాఖ్యాన మద్భుతం. భగవద్గీత శ్లోకాలను, రెనే మాగ్రిట్టే చిత్రాలను ఉటంకించటం శ్రీనివాస్ గారి ప్రతిభకు నిదర్శనం. అభినందనలు వారికి

    కృష్ణ మోహన్

    ReplyDelete

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...