తాళ్లపాక అన్నమాచార్యులు
152 ఏణనయనల
చూపులెంత సొబగైయుండు
క్లుప్తముగా: మన్మథుని బాణాలకు గురియయిన చిత్తము ఏదో వినగూడని రహస్యము వినపడినట్లు చెవులు నిక్కబెట్టుకొని ఆ దారిలో సాగిపోతుంది.
Summary of this Poem:
పల్లవి: సొగసుతో మంత్రముగ్ధులను చేసే అందమైన జింక (అమ్మాయిల) కళ్ళ వలె ప్రాణసంకటములగు పనులు వాటి వైపు లాగుతాయి.
చరణం 1: కోరికలు అడియాసలను రేపుతూ జీవితములో విరామం లేకుండా ఉక్కపోతను, వేడిమిని నింపినట్లనిపింప చేస్తాయి. అంతులేని దుఃఖాన్ని దాచుతూ ప్రపంచం మెరుస్తూ అలరిస్తుంది.
చరణం 2: అంతులేని ఆలోచనలతో మనస్సు నుండి చిరాకు, చింత,
విచారములు వైదొలగవు. ఏదో రహస్యము చెబుతున్నప్పుడు చెవులు నిక్కబెట్టుకొని విన్నట్లు
చిత్తము మన్మథుని బాణాల దారిలో నిమగ్నమైపోతుంది.
చరణం 3: దేవుఁడొక్కఁడె యనెడి వివేకము వెంకటేశ్వరుని కృపతో
సమానము. భావోద్వేగాలను అర్థం చేసుకునే పరిపక్వత
స్వేచ్ఛా సౌఖ్యమునకు సంకేతము. అన్వయార్ధము: అనుకంపము, దయ, అనుగ్రహము గల మనస్సుకు హద్దులుండవు. వాటి అవగాహనయే స్వేచ్ఛ (కైవల్యము).
విపులాత్మక వివరణ
Introduction: అత్యంత గాఢమైన కీర్తనలో అన్నమాచార్యులు పాఠకుణ్ణి "స్వేచ్ఛలో వున్న మానసిక స్థితి ఏమిటో కనుగొనమని ప్రశ్నిస్తారు"? మనమందరం ఆ స్థితిని చేరుకొనుటకు భగవంతుని ఆశీస్సుల కోసం ఎదురుచూపులు చూస్తుంటాము. "ఈశ్వరుని అనుగ్రహము లేకుండా, మనం ఒక్క క్షణమైనా మనగలమా?" అని అర్థం చేసుకోము. బదులుగా, మనకు అది లేదు, ఇది లేదని ఫిర్యాదులు చేస్తూనే ఉంటాము.
భావము: ఒక చిన్న బావి ద్వారా ఏ ప్రయోజనం నెరవేరుతుందో అది సహజంగా పెద్ద సరస్సు ద్వారాను సమకూరును.
అదేవిధంగా,
వేదాలను అనుసరించిన యే శాంతి ఆనందములను పొందుదుమో, వానినే, యోగి తనను తాను తెలియుట ద్వారా పొందుతాడు.
కీర్తన: రాగిరేకు: 16-5 సంపుటము: 1-99 |
ఏణనయనల చూపులెంత సొబగైయుండు ప్రాణసంకటములగు పనులు నట్లుండు ॥ఏణ॥ ఎడలేని పరితాప మేరీతిఁ దానుండు అడియాస కోరికలు నటువలెనె యుండు కడలేని దుఃఖసంగతి యెట్లుఁ దానుండు అడరు సంసారంబు నట్లనే వుండు ॥ఏణ॥ చింతాపరంపరలఁ జిత్తమిది యెట్లుండు వంతఁ దొలఁగని మోహవశము నట్లుండు మంతనపుఁ బనులపయి మనసు మరి యెట్లుండు కంతుశరమార్గముల గతి యట్లనుండు ॥ఏణ॥ దేవుఁడొక్కఁడె యనెడి తెలివి దనకెట్లుండు శ్రీవేంకటేశు కృపచేత లట్లుండు భావగోచరమైన పరిణతది యెట్లుండు కైవల్యసౌఖ్యసంగతులు నట్లుండు ॥ఏణ॥
|
Details and Explanations:
ముఖ్య పదములకు అర్ధములు: ఏణ = పెద్దకన్నులు గల నల్లయిఱ్ఱి (కృష్ణవర్ణ జింక).
భావము: సొగసుతో మంత్రముగ్ధులను చేసే అందమైన జింక (అమ్మాయిల) కళ్ళ వలె ప్రాణసంకటములగు పనులు వాటి వైపు లాగుతాయి.
వివరణము: ఇక్కడ ‘ఏణ నయనల చూపులేంత సొబగైయుండు’ అన్నది మనలోని ఊహాత్మక ఆలోచనలను సూచిస్తుందే తప్ప వాస్తవమును కాదు.
సినిమాల్లో మనం విలన్'ని సులభంగా గుర్తిస్తాం. అయితే నిజజీవితంలో ఒక సమస్య నుండి ఇంకో సమస్య; దాని నుంచి మరొకటి అలా అలా అగాథములో ఇరుక్కుపోతాము. సినిమాలు, నాటకలు చూస్తున్నప్పుడు వున్న లక్ష్య దృష్టిని (objective outlook), నిజ జీవితంలో ఉపయోగించక నిర్ణయములు మనసుతో చూసి నిర్ధారిస్తాము.
ముఖ్య పదములకు అర్ధములు: అడరు = వర్థిల్లు, ప్రకాశించు.
భావము: కోరికలు అడియాసలను రేపుతూ జీవితములో విరామం లేకుండా ఉక్కపోతను, వేడిమిని నింపినట్లనిపింప చేస్తాయి. అంతులేని దుఃఖాన్ని దాచుతూ ప్రపంచం మెరుస్తూ అలరిస్తుంది.
వివరణము: పల్లవిని విడమరుస్తూ అన్నమాచార్యులు మనము వ్యర్థమైన ఆశలతో లాగబడతామన్నారు. తళుకుబేళుకుల బయటి ప్రప౦చ౦ ఆశల సౌధాన్ని నిర్మింప చేస్తుంది. దానితో మానవుడు ప్రాపంచిక వ్యవహారాలలో మునిగిపోతాడు.
ముఖ్య పదములకు అర్ధములు: చింతాపరంపరలఁ = అంతరాయం లేని ఆలోచనల; వంతఁ = చిరాకు/విచారం; మంతనపుఁ = రహస్యాలోచన; కంతుశరమార్గముల = మన్మథుని బాణాల దారిలో.
భావము: అంతులేని ఆలోచనలతో మనస్సు నుండి చిరాకు, చింత, విచారములు వైదొలగవు. ఏదో రహస్యము చెబుతున్నప్పుడు చెవులు నిక్కబెట్టుకొని విన్నట్లు చిత్తము మన్మథుని బాణాల దారిలో నిమగ్నమైపోతుంది.
వివరణము: రెనె మాగ్రిట్టే వేసిన "చూచు ఆలోచన రూపము" (“the thought
which sees”) అనే శీర్షికతో ఉన్న పెయింటింగ్'ను చూడమని పాఠకులకు అభ్యర్థన. ఈ చిత్రంలో మనం ఒక వ్యక్తిని వెనుక నుండి చూస్తాము. దానితోపాటు ఆ వ్యక్తి యొక్క నీడ కూడా మనకు కనబడుతుంది. ఇది దృశ్య క్షేత్రంలో కొంత భాగాన్ని కప్పివేస్తుంది.
రెనే మాగ్రిట్టే ఇలా అంటాడు "మనం చూసే ప్రతిదీ మరొక విషయాన్ని దాచిపెడుతుంది; మనం చూసేదాని ద్వారా దాచినదాన్ని చూడాలని మనం ఎల్లప్పుడూ కోరుకుంటాము. ఏది దాగి ఉందో, ఏది మనకు కనిపించదో దానిపై ఆసక్తి ఉంటుంది. ఈ ఆసక్తి చాలా తీవ్రమైన భావన, ఒక రకమైన సంఘర్షణ రూపంలో ఉంటుంది, ఇది దాగి ఉన్న దృశ్యానికి మరియు కనిపించేదానికి మధ్య ఒక రకమైన సంఘర్షణగా చెప్పవచ్చు."
మాగ్రిట్ తత్వవేత్త కాదని గుర్తుంచుకోండి, కానీ అతను తన పరిశీలనలను పంచుకుంటున్నాడంతే. "ఆలోచన అనేది జ్ఞాపకశక్తి యొక్క ప్రతిస్పందన, అందువల్ల అది మనిషికి విముక్తి కలిగించదని" జిడ్డు కృష్ణమూర్తి తరచుగా చెప్తుండేవారు. ఈ విధంగా అన్నమాచార్యులు, ఆధునిక తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి, చిత్రకారుడు మాగ్రిట్టేలు ముగ్గురూ "ఆలోచన మనిషిని విముక్తం చేయజాలదని" చెబుతున్నారు. పైగా ఆలోచన అడ్డంకులను సృష్టిస్తుందని వారు నొక్కి చెప్పారు.
భావము: దేవుఁడొక్కఁడె యనెడి వివేకము వెంకటేశ్వరుని కృపతో సమానము. భావోద్వేగాలను అర్థం చేసుకునే పరిపక్వత స్వేచ్ఛా సౌఖ్యమునకు సంకేతము.
వివరణము: అన్నమాచార్యులు ఈ చిన్న చరణంలో అనేక విషయాలను ప్రస్తావించారు. దైవానుగ్రహము లేక మన జీవనముండదని గ్రహించము. ఆ కృపను గుర్తించ లేమంతే. అందువల్ల, మనల్ని మనం కాపాడుకునే చర్యలను అవలంభిస్తాం. ఇవియే అజ్ఞానపుటడుగులు.
అందువలన, "దేవుఁడొక్కఁడె యనెడి తెలివి దనకెట్లుండు" అంటే మనం భగవంతుని ఉనికిని పగటి వెలుగులో నీడను చూసినంత కరాఖండిగా తెలుసుకోలేము అని అర్ధము. ఈ విధంగా మొదటి రెండు పంక్తుల సారాంశము భగవంతుని దయ ప్రత్యక్ష అనుభవమున తెలియలేమని సూచిస్తున్నాయి.
భావోద్వేగాలపై మన ప్రస్తుత అవగాహన ఉపరితల స్థాయిలో ఉంటుంది. మొదట భావోత్పన్నము. తర్వాత ఆ కదలికను గుర్తించడం ద్వారా అవగాహన పొందుతాము. అందువల్ల, ఏళ్ళు పైబడి కూడా మనం అపరిపక్వంగానే ఉంటామని విమర్శిస్తూ “పెఱుగఁగఁ బెఱుగఁగఁ బెద్దలమైతిమి నేము”#1 అని అన్నమాచార్యులు అన్నారు. అటువంటి అపరిపక్వమైన మనస్సుతో మనం స్వేచ్ఛ అంటే ఏమిటో తెలియబోతాము. ఫలితాలు అందుకు తగ్గట్టుగానే ఉంటాయి.
ఇప్పుడు రెనే మాగ్రిట్టే వేసిన ది ల్యాండ్ స్కేప్ ఆఫ్ బౌసిస్ (Le
Paysage De Baucis) అనే చిత్రాన్ని చూడమని పాఠకులను విన్నపము. ఓవిడ్ రచించిన మెటామార్ఫోసెస్ (Ovid's Metamorphoses) నుండి ఒక పౌరాణిక వ్యక్తి బౌసిస్. ఒక విధ౦గా, బౌసీస్, ఆయన భార్య ఫిలేమోను అదృశ్య౦గా ఉ౦డడ౦ ద్వారా దేవుళ్ళను తమలో నివసి౦చడానికి అనుమతి౦చారు. తమ హృదయపు వాకిళ్ళను మూసివేసిన ఇతరులు నాశనమయ్యారు.
పెయింటింగ్ శీర్షికలో పేర్కొన్న ప్రకృతి దృశ్యం (landscape) వీక్షకుడితో సహా కనుపాఱునంత క్షేత్రము. పై చిత్రంలో మనం బౌసిస్ యొక్క కళ్ళు, ముక్కు మరియు పెదవులను మాత్రమే చూస్తాము. మిగిలిన చిత్రం బట్టలు, టై మరియు టోపీ వంటి బాహ్య అచ్ఛాదనలు అతనికి (బౌసిసె'కి) రూపాన్ని కల్పిస్తున్నాయి. అతడి కళ్ళు, ముక్కు, పెదవులు మరియు టోపిల మధ్య ఖాళీ చూపి అతని జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని అందించడానికి మాత్రమే పనిచేస్తున్నాయి, అతడి మనస్సు ఖాళీగా చూపటంతో అందుకున్న సమాచారము పరావర్తనము, వక్రీకరణము చెందక ఋజు మార్గమును అనుసరించును అని తెలిపిరి. అటువంటి ఋజువర్తనముగల బౌసిస్ హృదయంలో దేవతలు (సత్యము) వసించారంటే ఆశ్చర్యమేమీ? మన మనస్సులు అనుభవం మరియు ఇష్టాయిష్టాలు అనే పదార్థాలతో నిండినప్పుడు, అవి అందుకున్న సమాచారమును ఋజు మార్గము నుండి మరలించును. ఈ రకంగా మనము సత్యమును పక్కకు మళ్ళిస్తున్నాము. మనవ౦టి వారికి విమోచన ఎక్కడు౦టుంది?
మనము ప్రకృతిని సమర్ధవంతముగా పనిచేయనివ్వక జోక్యము చేసుకుంటాము. మనము
"నేను" అను అభేద్యమైన కోటను నిర్మించబోతాము.
భగవద్గీతలో పేర్కొన్న సమత్వము ఈ "నేను"
మరియు 'ప్రకృతి'ల మధ్య సమతుల్యత. ఈ సమతుల్యత పుస్తకాలు చదివియో, అభ్యాసము చేసియో సాధించునది కాదు.
అందువల్ల, చివరి రెండు పంక్తులు ఆలోచన ద్వారా కల్పించని, ఇష్టాయిష్టాలతో సంబంధము లేని మరియు తానున్న స్థితిని కూడా గుర్తించలేని మనస్సుకు మాత్రమే స్వేచ్ఛ అను స్పృహ కలుగును. మనము ఉవ్విళ్ళూరి సంపాదించు జ్ఞానం ఒక శాపమే కానీ ఆనందం కాదు. అందుకే అన్నమాచార్యులు "ఎఱుఁగుటకంటే నెఱఁగమే మేలు / మఱి తెలివికంటే మఱుపే శుభము" అన్నారు.
ఈ చరణం ఆ దివ్య స్థితి యొక్క అత్యద్భుత వ్యక్తీకరణ, ఆ స్థితికి చేరిన వ్యక్తి ఈ క్రింది భగవద్గీతలో చెప్పినట్లుగా ఇది వెలుపల, ఇది లోపల అను వ్యత్యాసాన్ని మరచును: ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోఽర్జున । సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః ।। 6-32 ।। భావము: ఓ అర్జునా! సర్వ ప్రాణులను సమానముగా దర్శిస్తూ (తన ఆత్మవంటిదే తక్కినవారి ఆత్మయనెడు భావముతో), ఇతరుల సుఖమునుగాని, దుఃఖమునుగాని తనకే చెందినట్టు స్పందించేవారిని, పరిపూర్ణ యోగులుగా పరిగణిస్తాను.
కాబట్టి తత్వవేత్తలు ఏ కోవకు (ప్రాగ్-పశ్చిమాల) చెందినవారైనా, వారు ప్రకటించిన సత్యమొక్కటే (దేవుఁడొక్కఁడె). అన్నమాచార్యులు ఇంత ప్రగాఢమైన ప్రకటన చేయుటకు మానవులకు సాధ్యమగు అన్ని హద్దులను దాటి వుంటారు. ఆత్మను సత్యంతో నిజంగా ఏకము చేయకుండా అటువంటి భాష సాధ్యం కాదని నేను నమ్ముతున్నాను. సత్యమును వాస్తవముగా స్పృశించిన అన్నమాచార్యులను మహర్షి మన మధ్య నివసించారని రాబోయే తరాలు గుర్తుంచుకుంటారని నేను ఖచ్చితంగా భావిస్తాను.
అన్వయార్ధము: అనుకంపము, దయ, అనుగ్రహము గల మనస్సుకు హద్దులుండవు. వాటి అవగాహనయే స్వేచ్ఛ
(కైవల్యము).
References and Recommendations for further reading:
#1 35. పెఱుగఁగఁ బెఱుగఁగఁ బెద్దలమైతిమి నేము (pe~rugaga be~rugaga
beddalamaitimi nEmu)
-X-The End-X-
కోరికలే అంతులేని దుఃఖమునకు కారణం.అంతులేని ఆలోచనలే శోకానికి తొలిమెట్టు.ఇవన్నియు
ReplyDeleteఅజ్ఞానవశమున జనించునవియే.
అపరిపక్వ, అపరిణత చిత్తం వీటికి మూలకారణం.విషయవస్తువులతో బంధమేర్పరచుకొన్న కారణాన మనస్సు యొక్క సహజమైన, స్వేచ్ఛాయుతమైన స్థితిని చేరలేకున్నామని, దైవకృప వలన పరమాత్మ యొక్కడే పరమానందము నిచ్చెడు వాడని, భావగోచరమైన పరిపక్వతయే స్వేచ్ఛాసౌఖ్యమునకు
సంకేతమని అన్నమయ్య ఈ కీర్తనలో అజ్ఞానము, జ్ఞానముల మధ్య గల అంతరాన్ని తెలియజేస్తున్నాడు.
రెనే మాగ్రిట్టే "చూచు ఆలోచన రూపము" చిత్రంలో మనిషిలో అంతులేని ఆలోచనల పరంపరకు కారణం చక్కగా చిత్రీకరించాడు. ఈ సంఘర్షణలోనే జీవితమంతా వృధా చేసి సత్యాన్ని కనుగొనలేక పోవుచున్నాడు.
రెనే మాగ్రిట్టీ గీచిన్ మరొక చిత్రం మనస్సే సత్యాన్ని ప్రక్కత్రోవ పట్టించి,
విమోచనము లేదా మోక్షమునకు ప్రతిబంధకమగుచున్నదని తెలియుచున్నది.
రినే మాగ్రిట్టీ చిత్రాల ద్వారా కీర్తన సారంశాన్ని సులభంగా అవగతం చేసే
కృషి చేశారు శ్రీనివాస్ గారు.
ఓం తత్ సత్ 🙏🏻🙏🏻🙏🏻
కృష్ణ మోహన్