Thursday, 7 September 2023

T-181 తమ యెఱుక తమకుఁ దగినంతే

 అన్నమాచార్యులు

181 తమ యెఱుక తమకుఁ దగినంతే


క్లుప్తంగా: "బాధలు, నొప్పులు లేకుండా చైతన్య వంతులు కాలేరు. ప్రజలు తమ ఆత్మను (తమను తాము) ఎదుర్కోకుండా ఉండటానికి, ఎంత అసంబద్ధమైనా దానికైనా ఒప్పుతారు. కాంతి వంతమైన  బొమ్మలను ఊహించుకోవడం ద్వారా జ్ఞానోదయం కాదు, కానీ లోని చీకటిని చైతన్య వంతం చేయడం ద్వారా కాగలరు". కార్ల్ జంగ్  

 

కీర్తన సారాంశం:

మానవులారా మీరెంతగా దైవమును వెదకబోయినా మీకు తగినంతయే అవగతమౌను. దైవమా నిను అన్వేషించు మాకు నీ కృపయు అంతే. అన్వయార్ధము: దైవమా!  పరిమిత అవగాహనతో నిను వెదకబోవు మా అజ్ఞానమును క్షమించుము.

చరణం 1: ఏమాత్రమూ పుట్టుటకు అనుకూలింౘని బొడ్డున పుట్టిన బ్రహ్మలు సైతము నీ పూర్వ పరములను ఎరుగుదురా? నీ నోటి నుండి వెలువడిన వేదము కూడా అచ్చముగా నీ మహిమను చెప్పగలదా?

చరణం 2: మానవుని తమ లోతును కనుగొనమని అపహసించుచున్నవా అనిపించుచు జగములు తమ సొగసును మాయతో కప్పి నడచుచుండును.  తాను సంపాదించిన జ్ఞానముల జ్ఞప్తితోనూ, వంకరటింకర చదువులతోనూ,  ధనముతోనూ, తాను ఏదైనా సాదించగలనను  గర్వముతో మానవుడు భగవానునిను కొరకు తపించు మునుల బోధనలను వంటబట్టించుకొనలేడు.

చరణం 3: ఎంతో మహానుభావులకే ఈ భగవంతుడను విషయము అస్పష్టముగానూ, ఒడిసిపట్టుటకు వీలుకానిదిగానూ వుంటే చోద్యముగొల్పు జీవులకు, ప్రశ్నార్ధకమగు నడవడికల జీవులకు వివేకము కలుగుననుట ఎట్లో?  ఇటువంటి మమ్ము శ్రీవేంకటేశ్వరా! నీవే మా చెంత చేరి దయచేయరాదా? 

విపులాత్మక వివరణము 

ఉపోద్ఘాతము: మానవులను వేధించు అనేక సమస్యలను అన్నమాచార్యులు ప్రస్తావించిరి. ఎప్పటిలాగుననే నిశితము, సమీచీనము, సమర్థవంతమైన నిదర్శనములతో మనస్సును వేరులోకాలకు తీసుకొని పోతారు.

కీర్తన:

రాగిరేకు:  258-5 సంపుటము: 3-335

తమ యెఱుక తమకుఁ దగినంతే
నెమకిన మాకును నీ కృప యింతే ॥పల్లవి॥
 
పొసఁగ* నీ నాభినిఁ బుట్టిన బ్రహ్మలు
యెసఁగిన నీ పూర్వ మెఱిఁగేరా
వెస నీ ముఖమున వెడలిన వేదము
దెల నీమహిమ తెలియఁగఁగలదా ॥తమ॥
 
నగుచు నీమాయల నడచే జగములు
సొగసి నీ మూరితి చూపెడినా
తగ నినుఁ గానఁగ తపించు మునులును
పొగరుల మము నిఁక బోధించేరా ॥తమ॥
 
అంతేసివారల కటువలె నుండఁగ
వింతజీవులకు వివేక మెట్లొకో
యింతట శ్రీవేంకటేశ నీవే మము
చెంతఁజేరి దయసేయఁగదే          ॥తమ॥

*మూలములోనున్న 'పొఁగ'ను  'పొసఁగ' అని మార్చితిని. పాట పాడినవారు కూడా అట్లే చేసిరి. 

Details and Explanations: 

తమ యెఱుక తమకుఁ దగినంతే
నెమకిన మాకును నీ కృప యింతే ॥పల్లవి॥ 

ముఖ్య పదములకు అర్ధములు: నెమకిన = వెదకు, అన్వేషించు.

భావము: మానవులారా మీరెంతగా దైవమును వెదకబోయినా మీకు తగినంతయే అవగతమౌను. దైవమా నిను అన్వేషించు మాకు నీ కృపయు అంతే.

వివరణము: మనమందరము సహజముగానే జ్ఞానమును (బుద్ధి చతురతను) జ్ఞాపక శక్తితో (మెమొరితో) ముడి పెడతాము. సమయమునకు స్పురణకు వచ్చుట తెలివి ఐనప్పటికీ జ్ఞానము అనిపించుకోదు. ఎన్నో విషయములను క్షణములలో తర్కించి తెలియజేయు కంప్యూటర్'లను డేటా అందించు సహాయకారిగానే చూచినట్లు,  జ్ఞాపక శక్తిని  జ్ఞానముతో సమానము చేయరాదు.

తమ యెఱుక తమకుఁ దగినంతే అని దైవమును గురించిన జ్ఞానమును సంపాదించు ప్రయత్నములను పరిమితమైనవి వానిగాను, నియంత్రణకు లోబడిన వానిగాను  అభివర్ణించిరి. అనగా అట్టి యత్నములను వీడమనిరి. ఎందువలనంటే, మన ప్రస్తుత మానసిక స్థితి మాగ్రిట్ రచించిన క్రింద ఇచ్చిన 'దిఙ్మండల మర్మము' (The mysteries of Horizon) అను పేరుగల చిత్రములోని వ్యక్తులను పోలి వుండును.

ఆ చిత్రములో ముగ్గురు మనుషులు వేర్వేరు దిక్కులలో తిరిగి దిఙ్మండలమును (horizon) చూచుచున్నట్లు అనిపిస్తుంది. వారిని పరీక్షగా చూస్తే ముగ్గురూ ప్రక్కప్రక్కనే వున్నా ఒకరినొకరు చూచినట్లు కనబడదు. మువ్వురిపైనా ఒక్కో చందమామను చూపి ఎవరి లోకంలో వారున్నారనీప్రక్క వారున్నా ఆ సహచర్యమే లేనట్లున్న వారి ఆంతర్యము ప్రస్పుటము చేసిరి.   ఒక్కొక్కరి పైనా ఒక్కో చందమామతో (ప్రతివారు) తమలోకములో తామే ముఖ్యులమని భావిస్తున్నారని సులభముగా అంచనా వెయ్య వచ్చును. 

మనమూ అంతే. భగవానుడు మనకు దగ్గరగా వున్నాడని, చిటిక అన్వేషణలో పట్టి వేయ గలమని భావించుదుము. అన్నమాచార్యులు ఇట్టి వెర్రితనమును విమర్శించుచున్నారు. అన్నమాచార్యులు ఎన్నోసార్లు "వేసరకుమీ జీవుఁడా వెదకివెదకి దైవమును"అను అర్ధము వచ్చు మాటలను వాడిరి. అంటే వారు మనిషి దేవుణ్ణి వెతకడానికి బదులు, సందేహాలను వదిలి, ధ్యానంపైనా, తనలోని అహమును కరిగించివేయుట పైనా దృష్టి పెట్టాలి అన్నరని భావించవచ్చును. 

అన్నమాచార్యులు భగవానుని కృప అపరిమితమైనదని అనేకమార్లు వచించియున్నారు. "నీ కృప యింతే"తో పరిమితము, అణుమాత్రమును సూచించిరనుకోవలెను. పైన యిచ్చిన తర్కము నుపయోగించిన క్రింది అన్వయార్ధము సులభముగా బోధపడును.

అన్వయార్ధము: దైవమా!  పరిమిత అవగాహనతో నిను వెదకబోవు మా అజ్ఞానమును క్షమించుము.

పొసఁగ నీ నాభినిఁ బుట్టిన బ్రహ్మలు
యెసఁగిన నీ పూర్వ మెఱిఁగేరా
వెస నీ ముఖమున వెడలిన వేదము
దెల నీమహిమ తెలియఁగఁగలదా ॥తమ॥ 

ముఖ్య పదములకు అర్ధములు: పొఁసగని = అనుకూలింౘని; ఎసఁగు = అతిశయించు, విజృంభించు; వెస = శీఘ్రముగ, వేగముగా; తెల = అచ్చము.

భావము: ఏమాత్రమూ పుట్టుటకు అనుకూలింౘని బొడ్డున పుట్టిన బ్రహ్మలు సైతము నీ పూర్వ పరములను ఎరుగుదురా? నీ నోటి నుండి వెలువడిన వేదము కూడా అచ్చముగా నీ మహిమను చెప్పగలదా? 

వివరణము: బ్రహ్మ బొడ్డున పుట్టడమేమిటి? నోటి నుండి వేదములు రావటమేమిటి? అంతా వట్టి చెత్త అనుకోవచ్చును. కానీ ఈ ప్రపంచమున ప్రాణులు పుట్టు విధము గానీ, మరణ రహస్యమును ఛేదించలేని మనకు బ్రహ్మలు బొడ్డున పుట్టడమూ అర్ధమవ్వదు. తిరిగి పల్లవి అన్వయార్ధము చూడ ప్రార్థన​.

పై బొమ్మలో చూపినట్లు ప్రక్కన వున్నవారి పట్ల కూడా స్పృహ లేనట్లు వ్యవహరించు మనము   దైవమును కూడా 'ఇంత' లేకపోతే 'ఇంత' అని ఒక కొలబద్ద పెట్టుకొని నిర్ణయించువారము. అన్నమాచార్యులు చెబుతున్న ముఖ్యమైన దేమంటే బ్రహ్మలు వేదములు కూడా దైవమును పూర్తిగా గ్రహించలేరని. 

నగుచు నీమాయల నడచే జగములు
సొగసి నీ మూరితి చూపెడినా
తగ నినుఁ గానఁగ తపించు మునులును
పొగరుల మము నిఁక బోధించేరా ॥తమ॥

ముఖ్య పదములకు అర్ధములు: నగుచు = అపహసించుచు.

భావము:  మానవుని తమ లోతును కనుగొనమని అపహసించుచున్నవా అనిపించుచు జగములు తమ సొగసును మాయతో కప్పి నడచుచుండును.  తాను సంపాదించిన జ్ఞానముల జ్ఞప్తితోనూ, వంకరటింకర చదువులతోనూ,  ధనముతోనూ, తాను ఏదైనా సాదించగలనను  గర్వముతో మానవుడు భగవానునిను కొరకు తపించు మునుల బోధనలను వంటబట్టించుకొనలేడు.

వివరణము: ఆ ముక్కు మూసుకుని మూలన కూర్చున్న ముసలాయనకేం తెలుస్తుంది సార్? అణువణువులోని 'బోసాన్' కణములనుంచి వేలాది కాంతి సంవత్సరాల దూరములోనున్న గ్రహవలయముల వరకు తెలిసిన మాకు వీరు నేర్పేదేంది సార్? 'మహారాజు, మనిపర్సు'లను మాయంటారా సార్? అని ప్రశ్నించగలము.

కానీ మానవుని వేధించు అనేకానేక సమస్యలకు విజ్ఞాన శాస్త్రము కానీ, వైద్య శాస్త్రము కానీ తృప్తికరమైన జవాబులు అందించలేక పోయాయనేది వాస్తవము. మానవుని అసలు సమస్య ఆకలి కానీ, ధనముగానీ,  సంపదలుగానీ, విజ్ఞానముగానీ కానేకావు. తోటీవారితో సహజీవనము చేయుటలోనే అతడు తడబడునది. బయట పులి, ఇంట్లో పిల్లి అన్నట్లు వాడు తాఱుమాఱు పడునది తనతోనే. తన మనస్సుతోనే. క్రింది 'మానవరూపములోని బొక్కసము​' (Anthropomorphic Cabinet, 1936) అను పేరు గల సాల్వడార్ డాలి వేసిన అద్భుత చిత్రమును చూడండి.

ఈ చిత్రములో నేలపై ఒక చేతిని ఆన్చి కూర్చునివున్న స్త్రీ బొమ్మను చూడవచ్చును. ఆమె శరీరం నుండి పొడుచుకు వచ్చిన వివిధ సొరుగులు (డ్రాయర్లు)  సులభంగా గుర్తించదగిన అంశాలు . ఆ సొరుగులలో ఒకదాని నుండి ఒక వస్త్రం బయటకు వేలాడుతూ ఉంది. శరీరం కొద్దిగా వికృతంగా మరియు ముడతలు పడినట్లు కనిపిస్తుంది, మరియు భంగిమ నిరాశతో కూడినది.

ఆమె తల వంచుకొని పొడవాటి వెంట్రుకలు ముఖమును దాస్తున్నట్లు వేశారు. ఆమె వెనుక భాగములో సాధారణ వీధిలా కనిపించేదాన్ని చూస్తాము. డాలీ ఉపయోగించినది (దాదాపు) ఏకవర్ణ రంగు పథకమైనా, డాలీ నీడలను ఉపయోగించిన విధానంతో జీవము వుట్టిపడుతూ వుంటుంది. 

ఆ వేలాడుతున్న వస్త్రం పూర్వజన్మలకు గుర్తు. సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క సిద్ధాంతాల ద్వారా డాలీ విపరీతంగా ప్రభావితమయ్యాడు. దాని తాలూకు జాడలు డాలీ వేసిన  అన్ని చిత్రములలోనూ ప్రస్పుటముగా కనబడుతుంది. 'మానవరూపములోని బొక్కసముఅనేది ఫ్రాయిడ్ ప్రతిపాదించినట్లుగా అపస్మారక మనస్సునకు కళాత్మక దృశ్య వర్ణన అనుకోవలెను.

ఈవిధముగా మానవుడు జన్మతో వచ్చిన  అనేకానేక స్మృతులతో, అవి మనసున రేపు వికృతములతో సతమతమౌతూ కాలము వెళ్ళబుచ్చుతుంటాడు. సమస్యకు మూలము కనుగొనకయే వైద్యము చేయుట అవివేకము. మనలో అనేకులకు ఈ సమస్య వున్న స్పృహ కూడా వుండదు.

మానవుని అస్పష్ట ఆలోచనలకు, అనాలోచిత చర్యలకు, వుద్వేగముతో కార్యములు చేయ ఉసికొల్పు సంకేతములకు, అర్ధములేని విశ్వాసములకు, ముంకు పట్టులకు, ఆధారములేని భయములకు ఈ అపస్మారక (లేదా నిద్రాణమై వున్న) మనస్సు కారణము. దీనిని వెలితీయుట అంత సులభము కాదు. అన్నమాచార్యులు “కాయజకేలికిఁ గందువ చెప్పీ । చాయలసన్నల సతి యొకతె” (మన్మథకేళికి దారులు చూపే చీకటి సంజ్ఞల మాయొకటి.) అని ఉటంకించిరి. అది నిర్లక్ష్యము, సోమరితనము మరియు నిద్రలచే భ్రమకు గురిచేసి బంధించివేస్తుంది.

అంతేసివారల కటువలె నుండఁగ
వింతజీవులకు వివేక మెట్లొకో
యింతట శ్రీవేంకటేశ నీవే మము
చెంతఁజేరి దయసేయఁగదే          ॥తమ॥

ముఖ్య పదములకు అర్ధములు: అంతేసివారలు = ఎంతో మహానుభావులు; వింతజీవులకు = చోద్యముగొల్పు జీవులు, ప్రశ్నార్ధకమగు నడవడికల జీవులు.

భావము: ఎంతో మహానుభావులకే ఈ భగవంతుడను విషయము అస్పష్టముగానూ, ఒడిసిపట్టుటకు వీలుకానిదిగానూ వుంటే చోద్యముగొల్పు జీవులకు, ప్రశ్నార్ధకమగు నడవడికల జీవులకు వివేకము కలుగుననుట ఎట్లో?  ఇటువంటి మమ్ము శ్రీవేంకటేశ్వరా! నీవే మా చెంత చేరి దయచేయరాదా? 

వివరణము: పైన వివరించినట్లు మనమేదో ప్రపంచములో కొట్టుకొనిపోతుంటాము. మనము సమస్యలో వున్నామని కూడా స్పృహ లేనివారము. అందుకే మనలను "వింతజీవులు" అని పిలిచారు ఆచార్యులు.

తగు మునులు‌ ఋషులు తపములు సేయఁగ / గగనము మోచియుఁ గర్మము దెగదా” (మాహామహులైన మౌనులు, యోగులు, ఋషులు బహు కాలము తపమాచరించియు, గగనమునే కదల్చిననూ ఫలించలేదు) అని అన్నమాచార్యులు ముందుగానే హెచ్చరించిరి.

ఈ బాటకు శ్రీవేంకటేశుని శరణాగతియే వుపాయము అని పలుమార్లు సెలవిచ్చిరి. మానవుడు "తమ యెఱుక తమకుఁ దగినంతే" అని గ్రహించి, అన్నిటినీ వదలి ముఖ్యముగా అహంకారమును విడిచి శరణాగతి చేయవలెను. 

-x-x-x-

3 comments:

  1. సోదాహరణంగా, చక్కటి వివరణ ఇచ్చారు, విజయభాస్కర్ గారు. 👏

    ReplyDelete
  2. ఎంతమాత్రమున... ఈ కీర్తనలో కూడా ఇటువంటి భావం ప్రజ్వలితమౌతుంది. త్యాగరాజునే బ్రహ్మ విద్యా రసిక సార్వభౌముడైతే అన్నమయ్య ఆయనకు గురువే! ఉపనిషద్వాక్యాలు ఉటంకించక్కర లేదు, చిన్న చిన్న పదాలలో లోతైన భావం దాగి ఉంటుంది. శ్రీనివాస గారు ఇంజనీరు వచ్చు, కానీ నిజానికి బహూచీనమైన జ్ణానాభిరుచి గల ఫిలాసఫర్!

    ReplyDelete
  3. "తమ యెఱుక తమకు దగినంతే"
    గ్రంథపఠనం వలన, ఇతరత్రా సాధనముల వలన దైవాన్ని గురించి తెలుసుకొనే ప్రయత్నములన్నీ పరిమితమైన అవగాహనతో కూడినవియే. ఇట్టి జ్ఞానం విజ్ఞానం మాత్రమే.అంటే విజ్ఞానము మనకున్న భౌతికమైన పరిధులకు లోబడి నేర్చుకున్నది మాత్రమే.ఆ జ్ఞానం అంతంత మాత్రమే.

    "నెమకిన మాకును నీ కృప యింతే"
    దైవాన్ని నిర్మలమైన చిత్తముతో, సమర్పణ భావముతో, సర్వస్య శరణాగతి యన్న భావనతో వెదకినచో సిద్ధించే దైవానుగ్రహము
    అపరిమితము, అనంతము.అట్టి జ్ఞానం ప్రజ్ఞానం. అంటే దానికి మించిన జ్ఞానం ఉండబోదు.*ప్రజ్ఞానం బ్రహ్మ*

    ఈ సందర్బంగా ఈ అన్నమయ్య కీర్తన
    స్ఫురణకు వస్తుంది ::
    "ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు
    అంతరాంతరములెంచి చూడ, పిండంతేనిప్పటి అన్నట్లు"
    భావము:
    ఓ శ్రీ వేంకటేశ్వరా! పరికించి చూడగా పిండి కొద్ది రొట్టి అన్నట్టు, నిన్ను ఎవ్వరు ఎంత తలిస్తే లేదా భావిస్తే వారికి అలా కనపడతావు .
    అల్పబుద్ది వారికి అల్పంగాను,ఘన బుద్ది కలవారికి ఘనము గాను కనపడుతున్నావు.
    ఎంత నీరు ఉంటే అంతగా తామరాలు పూస్తాయి కదా!

    బ్రహ్మాదులకు, వేదాలకు కూడా నిన్ను వర్ణించటం, నీ మహిమను సంపూర్ణముగా పొగడటం అశక్యమని అన్నమయ్య అంటున్నారు.

    మాండూక్యోపనిషత్తులో వర్ణింపబడినట్లు పరమాత్మ తత్త్వం
    ఆగ్రాహ్యం, అవాచ్యం,అచింత్యం,
    ఆమేయమైనది.

    రినే మాగ్రిట్టే గీచిన చిత్రంలో కీర్తనలోని పల్లవి యొక్క భావాన్ని అద్భుతంగా తెలియజేసారు శ్రీనివాస్ గారు.

    ఓమ్ తత్ సత్ 🙏🏻🙏🏻🙏🏻
    కృష్ణ మోహన్

    ReplyDelete

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...