అన్నమాచార్యులు
184 అపు డేమనె నేమను మనెను
For English version press here
క్లుప్తముగా: “జీవితంలో విచిత్రమైన
విషయం ఏమంటే మీరు కృతజ్ఞత చూపవలసిన విషయాలను గమనించడం ప్రారంభించిన తర్వాత, కొరవడినవి మరుగున పడిపోతాయి.” - జర్మనీ కెంట్
కీర్తన సారాంశం:
పల్లవి: రాములవారు “ఓ హనుమా! అప్పుడేమన్నది? ఏమనుమన్నది?” హనుమంతులవారు “ప్రభూ!
విరహముతో కూడిన తపమే తాపమని అన్నది”.
చరణం 1: రాములవారు “ఓ హనుమా! నువ్వేమన్నావు? పడతి సీత ఏమన్నది? అవనిజ నిను ఏమని అనమంది?” హనుమంతులవారు “ప్రభూ! శుష్కించిన
శరీరముతో వున్న సీతామాత తనకు మిగిలిన ప్రాణములు కూడా భారమైయ్యెనని రోదించినది. రవికులేంద్రా
నీవు లేని అటువైపు తనువును ధరించి ఎట్లుందునని
అడిగిందయ్యా?
చరణం 2: రాములవారు “ఓ హనుమా! ఇంకా
ఏమంది? ? యింతి సీత మఱేమనె? సందేహించక యేమని కొసరు
గా చెప్పింది కూడా చెప్పు?” హనుమంతులవారు “ప్రభూ! బూటకపు
ఈ దేహము తొందరగా పోదు. ఆ మూగజీవి జింకను కోరుట అనే అపకారము తలపెట్టిన తనకు తగిన శాస్తి జరిగినదన్నదయ్యా!"
చరణం 3: రాములవారు “ఓ హనుమా! నన్నింకా ఏమంది?" హనుమంతులవారు “ప్రభూ! తనువులు వేరైనా మీ జంటకు ప్రాణం ఒకటేనంది. తనకూ నీ వలెనే ఈ వియోగము తాపమన్నదయ్యా! ఆఖరి మాటగా ఓ మనుకులేశా! ప్రేమతోడి నీ కలయికకై ఎదురు చూస్తున్నానని అన్నదయ్యా! ఆ కూటమి ఘన వేంకట గిరిపై ఈనాటికీ కనబడుతున్నదయ్యా!“ “ఆ కూటమి ఘన వేంకట గిరిపై ఈనాటికీ కనబడుతున్నదయ్యా!” అన్నారు అన్నమాచార్యుల వారు.
విపులాత్మక వివరణము
ఉపోద్ఘాతము: ఈ మధుర కీర్తన రామాంజనేయుల మధ్య జరిగిన సంభాషణ. సీతాదేవిని దర్శించిన హనుమను రాములవారు ప్రశ్నలడగడంలోనే వారి మనస్సులోని ఆత్రుతను సూచించారు. ఆర్ద్రతతో సీతామాత కష్టములను కనుల ముందు చూపుతారు ఆచార్యులవారు.
మనుషులకు తాము మౌలికముగా మారాలి అన్న వివేకము తరచుగా విపత్కర
పరిస్థితులేర్పడినప్పుడు, అధికమైన దుఃఖములో మునుగుటచేతను వచ్చుననునది విదితమే.
అటువంటి స్థితిలో వున్న సీతామాత నోటి నుండి విషాదముతో కూడుకున్న మాటలలోనూ అన్నమయ్య
అధ్యాత్మికతను పలికించారు.
శృంగార కీర్తన: రాగిరేకు: 58-1 సంపుటము: 6-97 |
అపు డేమనె నేమను మనెను
తపమే విరహపుఁ దాపమనె ॥పల్లవి॥ పవనజ యేమనె పడఁతి మఱేమనె
అవనిజ నిను నేమను మనెను
రవికులేంద్ర భారము ప్రాణంబనై
ఇవల నెట్ల దరియించే ననె ॥అపు॥ యింకా నేమనె యింతి మఱేమనె
కొంకక యేమని కొసరుమనె
బొంకులదేహము పోదిది వేగనె
చింకవేఁట యిటు చేసె ననె ॥అపు॥ నను నేమనె ప్రాణము మన కొకటనె
తనకు నీవలెనె తాపమనె
మనుకులేశ ప్రేమపుమనకూటమి
ఘనవేంకటగిరిఁ గంటి ననె ॥అపు॥
|
భావము: రాములవారు “ఓ హనుమా! అప్పుడేమన్నది? ఏమనుమన్నది?” హనుమంతులవారు “ప్రభూ!
విరహముతో కూడిన తపమే తాపమని అన్నది”.
వివరణము: ఇక్కడ అన్నమార్యులు
‘సీత మనస్సులో రాముణ్ణి కలవాలి’ అన్న సంకల్పమును
విరహముతో కూడిన తపము అని, అది తాపము వంటిదేనని
సెలవిచ్చారు. మరింత వివరణ కొరకు చివరి చరణము చూడ ప్రార్థన.
ముఖ్య
పదములకు అర్ధములు:
భావము: రాములవారు “ఓ హనుమా! నువ్వేమన్నావు? పడతి సీత ఏమన్నది? అవనిజ నిను ఏమని అనమంది?” హనుమంతులవారు “ప్రభూ! శుష్కించిన
శరీరముతో వున్న సీతామాత తనకు మిగిలిన ప్రాణములు కూడా భారమైయ్యెనని రోదించినది. రవికులేంద్రా
నీవు లేని అటువైపు తనువును ధరించి ఎట్లుందునని
అడిగిందయ్యా?
వివరణము: అన్నమాచార్యులు “భారము ప్రాణంబనై / ఇవల నెట్ల దరియించే ననె” తో సామాన్యముగా కనబడని అత్యద్భుతమైన సత్యమును వెల్లడించారు. ఆ స్థితికి చేరుకున్న యోగులకు సీతామాతవలె ఆ భగవానుని దర్శనము తప్ప మరి యేదియు కోరుకొనరు. ఇక్కడ దర్శనము అనగా సదరు వ్యక్తి మనసు భగవానుని మనస్సులో లీనమవ్వడము.
అటువంటి మహానుభావులు "వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః ।।7-19।। = జ్ఞాన సంపన్నుడైన వ్యక్తి, ఉన్నదంతా నేనే అని తెలుసుకొని, నాకు శరణాగతి చేస్తాడు. అటువంటి మహాత్ములు నిజముగా చాలా అరుదు" అని భగవద్గీతలో చెప్పనే చెప్పారు. ఆ కోవకు చెందిన అన్నమాచార్యులు వ్రాసినదంతా అనేక కోణములలో చెప్పలేని సూచించలేని మనకు అనుభవములోలేని వానిని వ్యక్త పరచుటకే.
దీనిని ఎస్చెర్ గారు వేసిన “మూడు లోకములు”
అను పేరుగల ప్రసిద్ధ లిథోగ్రాఫ్ ద్వారా మరింత వివరముగా తెలుసుకొందాము. ఇది వుడ్‌కట్
టెక్నిక్. ఒక పరిశీలకుడు శరదృతువులో సరస్సుగా భావించేదాన్ని చూస్తున్నట్లు కబబడే ఈ
చిత్రములో సరస్సు ఒడ్డున వున్న ఆకులులేని చెట్ల కొమ్మల ప్రతిబింబాలు నీళ్ళలో కనబడుతుంటాయి.
నీటిపై తేలియాడుతున్న ఆకులు వాటి అడుగున దాగి కళ్ళతోనే జీవము వుట్టిపడుతున్న మత్స్యమును
చూడవచ్చును.
సాధారణ పరిశీలన నుండి దాని సంక్లిష్ట నిర్మాణం యొక్క సాక్షాత్కారానికి దారితీసే ఈ కళాకృతిని ప్రజలు క్రమంగా చూడాలని రచయిత కోరుకుంటాడు. కళాకారుడు మూడు ప్రధాన వస్తువులను (చెట్లు, ఆకులు, చేప) ఒకే చోట త్రిమితీయ (3D) కోణములో చూపి పరిశీలకుడి దృష్టిని వేగవంతము చేస్తాడు. ఒక్కసారిగా జీవితములోని మూడు దశలను ప్రస్పుటము చేయును.
మన ఇప్పటి జీవితమును ఒంటరి చేపతోనూ, గతించిపోయిన కాలమును ఉపరితలముపై తేలుతున్న ఆకులతోనూ మరియు మరణమును ఆకుల్లేని మోడువారిన చెట్ళతోనూ చూపించారు. ఇక్కడ “ఉన్నచోటనే మూఁడులోకా లూహించి చూచితే నీవే” అను కీర్తన స్మరణీయం. సరస్సులో నీరును మనస్సుతో పోల్చారు.
ఇక్కడ సరస్సులో నీరు నిశ్చలముగా వుండి పైన చూపిన చిత్రము సాధ్యమైంది. కాని మన మనస్సులు క్షణక్షణము కదులుటతో మనకు ఈ కళాఖండములోచూపినట్లు జీవితము అగపడదు.
భావము: రాములవారు “ఓ హనుమా! ఇంకా
ఏమంది? ? యింతి సీత మఱేమనె? సందేహించక యేమని కొసరు
గా చెప్పింది కూడా చెప్పు?” హనుమంతులవారు “ప్రభూ! బూటకపు
ఈ దేహము తొందరగా పోదు. ఆ మూగజీవి జింకను కోరుట అనే అపకారము తలపెట్టిన తనకు తగిన శాస్తి జరిగినదన్నదయ్యా!"
వివరణము: అన్నమాచార్యులు “బొంకులదేహము పోదిది వేగనె / చింకవేఁట యిటు చేసె ననె”తో అతి కష్టమైన అతి గుహ్యమైన బోధను చేశారు. ‘బొంకులదేహము’ అనగా అసత్యములతో నిర్మింపబడినదని అర్ధము. చిన్ననాట నుండి 'ఇది నేను' 'ఇది నాదికాదు' అను భావనలతో పెంచుకుంటూ వస్తున్న దానిని కాదని త్రోసిపుచ్చుట సులభముకాదు.
“చింకవేఁట యిటు చేసె”తో మనస్సులో రేగు కోరికల పరిణామమును సూచించిరి. పైనున్న ఎస్చెర్ గారి పటము ఊహలు అను అలల అలజడితో వున్న యెడల గోచరము కాదు. అటులనే సత్యము కూడాను.
భావము: రాములవారు
“ఓ హనుమా! నన్నింకా ఏమంది?" హనుమంతులవారు
“ప్రభూ! తనువులు వేరైనా మీ జంటకు ప్రాణం ఒకటేనంది. తనకూ నీ వలెనే
ఈ వియోగము తాపమన్నదయ్యా! ఆఖరి మాటగా ఓ మనుకులేశా!
ప్రేమతోడి నీ కలయికకై ఎదురు చూస్తున్నానని అన్నదయ్యా!” “ఆ కూటమి ఘన వేంకట గిరిపై ఈనాటికీ కనబడుతున్నదయ్యా!” అన్నారు
అన్నమాచార్యుల వారు
వివరణము: అన్నమాచార్యులు మనుకులేశ ప్రేమపుమనకూటమి / ఘనవేంకటగిరిఁ గంటి ననె”తో ఈ జ్ఞానము అనునది సాధింపతగునది కాదని జీవము సత్యము మరియు కరుణ/ప్రేమలతోడి విడదీయరాని మిశ్రమమే కానీ ప్రత్యేకముగా ఇది జ్ఞానము అని చెప్పుటకు వీలుకానిదని సెలవిచ్చిరి.
‘తపమే విరహపుఁ
దాపమనె” అని సంకల్పముతో కూడిన వన్నీ కోరికల కోవలోనికి వచ్చునని తెలిపిరి. కావున అది
తాపమునకు దారితీయునని విజ్ఞుల అభిప్రాయము.
జ్ఞానము అనగా ప్రాణము, దైవము, ప్రేమలను
వానివాని మూల రూపములలో విడి విడిగా దర్శించుటకు కానరానివని తెలుపు చర్య. కావున భగవద్గీతలో
పేర్కొన్న జ్ఞానము కూడానిదియే. పుస్తకములలో ప్రచురించి తెలుపుటకు వీలుకానిది.
-x-x-x-
*రవికులేంద్ర భారము ప్రాణంబవై*
ReplyDeleteఅన్న మొదటి చరణంలోని పాదంలో సీతాదేవి రాముని దర్శనం లేక శుష్కశరీరంతో ప్రాణాలు కూడా భారమైనవని రోదించిన విషయాన్ని హనుమ శ్రీరాముడికి తెలియజేసే ఘట్టంలో సీతాదేవి ఎంత ఏకాగ్రచిత్తముతో శ్రీరాముడిని సమర్పణభావంతోధ్యానించుచున్నదో
తెలియుచున్నది. శరణాగతి అయిన భక్తుని పరమాత్మ తప్పకుండా అనుగ్రహిస్తాడు.
ఈవిషయాన్ని భగవద్గీతలో కృష్ణపరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన ఈ శ్లోకాన్ని ఉటంకిస్తూ శ్రీనివాస్ గారు చెప్పటం సందర్భోచితం.
*బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే ।*
*వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః||*
(7-19)
ఎన్నో జన్మల ఆధ్యాత్మిక సాధన తరువాత, జ్ఞాన సంపన్నుడైన వ్యక్తి, ఉన్నదంతా నేనే అని తెలుసుకొని, నాకు శరణాగతి చేస్తాడు. అటువంటి మహాత్ముడు నిజముగా చాలా అరుదు.
అలాగే మరొక శ్లోకంలో భగవానుడు
ఇలా అన్నాడు :
*సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ।*
*అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ||*
అన్ని విధములైన ధర్మములనూ విడిచిపెట్టి, కేవలం నాకే శరణాగతి చేయుము. నేను నిన్ను అన్ని పాపములనుండి విముక్తి చేసెదను; భయపడకుము.
యెస్చర్ గారు గీచిన చిత్రం *మూడు లోకములు* ద్వారా ఈ విషయాన్ని విపులంగా తెలియజేయటానికి ప్రయత్నించారు శ్రీనివాస్ గారు.
వివరణాత్మకంగా ఉంది వ్యాఖ్యానం.
ఓమ్ తత్ సత్ 🙏🏻🙏🏻🙏🏻
కృష్ణ మోహన్