Tuesday 12 September 2023

T-182 ఎందును బోరా దీసంసారము

 అన్నమాచార్యులు

182 ఎందును బోరా దీసంసారము

for English version press here

కీర్తన సారాంశం:

పల్లవి: మానవులారా! ఈ సంసారమున ఈది ఈది ఎక్కడకు పోలేము. దైవమా! సామర్థ్యముతో నీవు అల్లిన మాయను దాటగలమా?

చరణం 1: మానవుడా! దేనితో సంపదలను చిత్త వికారములు కలుగునో, ఏది లెకున్న దైన్యమునకు హేతువగునో, యెద్ది లంపటములలో చిక్కుకుని ఈ శరీర పోషణము కాకున్న ప్రాణముండ దనిపింప చేయునో దానిని తెలియుము.

చరణం 2: మానవుడా! యౌవనము కలిగించు చేవతో కలుగు వికారములు శాశ్వతమని వాటిలో సంచరించుచూ, తుదకు వార్ధక్యముతో నిస్సహాయుడివిగా ప్రేక్షకపాత్రగా మిగులుదువు. జీవము వచ్చుచు పోవుచున్నసంపదలు, సిరులకై వెంపర్లాడుటకాదు. వీనిని కాదన్ననూ ఆకలిని జయించుట అసాధ్యము.

చరణం 3: మానవుడా ఎన్నిటిని (డబ్బు, సంపదలు, పేరు) గడించబోతావు? ఎన్ని విషయములలో మునగబోతావు?  శ్రీ వేంకటేశ్వరుఁడ అన్నిటికీ అంతర్యామివి నీవు. మా కనులకు తృప్తినిచ్చునట్లు కావవా?

విపులాత్మక వివరణము 

ఉపోద్ఘాతము: శ్రీశ్రీ గారు మాటల దారులలో రక్తమును, ఆవేశమును ప్రవహింప చేసిరి. కానీ, అన్నమాచార్యులు పదముల మధ్య ప్రాణమునే నింపిరి. వారు కీర్తనలను వ్రాసి రన్నది అసత్యము. వారు జీవమునే పదముల లోకి చొప్పించిరి. ఆ రకముగా దైవమునకు, తనకు, కీర్తనలకు అంతరములు గుర్తించలేని విధముగా సర్వస్వమును ఒడ్డి రచనా వ్యాసంగం గావించిరి. 

అతి సాధారణ  పదములతో సామర్థ్యముగా వాని కెఱుక లేకనే అనంతమగు భావములను ఉత్పత్తి చేయించిరి. శ్రీశ్రీ గారు వ్యవస్థల అడ్డుకట్ట లను విరగ్గొడితే అన్నమాచార్యులు మానవులు మనస్సులో కట్టుకొన్న అడ్డు గోడలను కరిగించి వేసిరి. 

కీర్తన:

రాగిరేకు:  380-1 సంపుటము: 4-464

ఎందును బోరా దీసంసారము
కందువ నీ మాయ గడవఁగ వశమా॥పల్లవి॥
 
కలిమే చిత్త వికార హేతు ఎది
అలర లేమి దైన్య హేతువు
పలు లంపటములు బంధ హేతువులు
తలఁగిన నడవదు తనుపోషణము ॥ఎందు॥
 
మదవికార మిదె మహిత యౌవనము
తుద వార్ధకమే దురంతము
యిదె యర్థార్జన యాతాయాతన
అదియు మానితే నాఁకలి ఘనము ॥ఎందు॥
 
యెన్ని గడియించే వెన్నిట ముంచే -
విన్నిట శ్రీ వేంకటేశ్వరుఁడ
అన్నిట నంతర్యామివి నీవే
కన్ను దనియ ననుఁ గావఁగదే ॥ఎందు॥

 

Details and Explanations:

ఎందును బోరా దీసంసారము
కందువ నీ మాయ గడవఁగ వశమా          ॥పల్లవి॥ 

ముఖ్య పదములకు అర్ధములు: కందువ = సామర్థ్యము.

భావము: మానవులారా! ఈ సంసారమున ఈది ఈది ఎక్కడకు పోలేము. దైవమా! సామర్థ్యముతో నీవు అల్లిన మాయను దాటగలమా?

వివరణము: ఈ సంసారము నుండి ఎక్కడకూ (స్వర్గమునకో, నరకమునకో, విష్ణులోకమునకో) వెళ్ళమని అన్నమాచార్యులు స్పష్టం చేస్తున్నారు. అనగా ​ఈ సంసారము, అది కల్పించు భ్రమల యందు చిక్కుకున్న బయటపడుట దాదాపు అసాధ్యమని చెబుతున్నారు. పైగా 'ఎక్కడకో' వెళతామని భావించడమూ అవివేకమే.

అన్నమాచార్యులు అనేక మార్లు నొక్కి చెప్పినట్లు, రెండు ప్రపంచములు లేవు. మన కళ్ళముందున్నదొకటే వున్నది. కానీ మన చూపులు  అనేక వక్రములు వికృతములు చెంది వుండుటచేత సరిగా చూడలేకున్నాము. "యః పశ్యతి స పశ్యతి" = ఆ రకముగా చూచువాడు ద్రష్ట అని భగవద్గీతలో పదే పదే చెప్పినదిదియే.

అనగా ఈ ప్రపంచములో వున్నప్పటికీ ఈ ప్రపంచ వ్యాపారములలో ఏరకముగాను ప్రవేశించని వృత్తియే సరియగు ప్రవృత్తి. అట్టి వ్యవసాయమే ధ్యానము. భగవంతుని కీర్తించుటకన్ననూ ధ్యానమునకు ప్రాధాన్యమునిచ్చిరి ఆచార్యులు. భగవద్గీతలో పేర్కొన్న భక్తి కూడా ఇదియే.

అనగా పైన పేర్కొన్న ఈ ప్రపంచమునకు సంబంధించని వ్యాసంగములు మనకు  ఎఱుకలోనివై వుండవని అర్ధము.  కావున ప్రస్తుత అవగాహన వున్న క్రియలన్నీ వదలి వేయవలెనని దీని అర్ధము. కానీ, అటుల చైతన్యమునందు కల కార్యములను మానవుడు వదలలేకున్నాడు. వీని యందుంటూనే మరొకటి కోరబోవును. ఇదియే ద్వందమునకు దారితీయు ఉద్యోగము. ఇప్పుడు క్రింది చిత్రమును చూడ ప్రార్థన​. 



ఆమె వూగుచున్న వూయలను వూతమునిచ్చుచున్న గోడలు ఒకటి మనకు కనిపించు ప్రపంచము. రెండవది మనము నిర్మించుకున్న వూహలు. ఈ రెంటినీ కలిపి చిత్రకారుడు మాయను సృష్టించాడు. అచ్చట వున్న ఊయల అసంబద్ధమైననూ ఆమె వూయల వూగుచున్నదని అనిపించును. ఇటువంటి తర్కమునే వుపయోగించి మనము ఈ  సంసారమున తగులుకొందుము.

కలిమే చిత్త వికార హేతు ఎది
అలర లేమి దైన్య హేతువు
పలు లంపటములు బంధ హేతువులు
తలఁగిన నడవదు తనుపోషణము         ॥ఎందు॥ 

ముఖ్య పదములకు అర్ధములు: అలర = వికసించు, కలుగు

భావము: మానవుడా! దేనితో సంపదలను చిత్త వికారములు కలుగునో, ఏది లెకున్న దైన్యమునకు హేతువగునో, యెద్ది లంపటములలో చిక్కుకుని ఈ శరీర పోషణము కాకున్న ప్రాణముండ దనిపింప చేయునో దానిని తెలియుము.

వివరణము: ఈ చరణము మొదటి పంక్తిలో 'ఎది' అనునది అతకనట్లుండి అనుమానము వచ్చును. బాలమురళిగారు కూడా దానిని 'హేతు వది' అని పలికిరి. కానీ అది చరణము యొక్క అర్ధమునే మార్చివేయుచున్నది. అలాగుననే  'ఎది' సూచించునది శరీరమునందు అతకనిదైనప్పటికీ  పొందుగా సమకూడినట్లు కనపడుటను చెప్పుచున్నది.

ఏది మానవుని సమూలముగా తాను లేకున్న నీవులేవని పింప చేయుచున్నదో, ఏది ప్రాణములున్నప్పుడే తెలియవలెనో, దేనిని పొందిన సుఖదుఃఖములంటవో దానిని తెలియమంటున్నారు అన్నమాచార్యులు. 

మదవికార మిదె మహిత యౌవనము
తుద వార్ధకమే దురంతము
యిదె యర్థార్జన యాతాయాతన
అదియు మానితే నాఁకలి ఘనము ॥ఎందు॥ 

ముఖ్య పదములకు అర్ధములు: దురంతము = కడపట చెడుగగునది; యాతాయాతము = వచ్చుచు పోవుచునున్నది

భావము:  మానవుడా! యౌవనము కలిగించు చేవతో కలుగు వికారములు శాశ్వతమని వాటిలో సంచరించుచూ, తుదకు వార్ధక్యముతో నిస్సహాయుడివిగా ప్రేక్షకపాత్రగా మిగులుదువు. జీవము వచ్చుచు పోవుచున్నసంపదలు, సిరులకై వెంపర్లాడుటకాదు. వీనిని కాదన్ననూ ఆకలిని జయించుట అసాధ్యము.

వివరణము: జీవితం మన ప్రమేయం లేకుండానే గడిచి పోవును. మానవుని చేతిలో కాలము కానీ, క్రియలు కానీ దాదాపు లేనట్లే. ఇట్టి నియంత్రణ లేని జీవితమును సక్రమంగా గడుపుట ఎట్లు? మనిషి ఒక కీలు బొమ్మేనా? అతని వద్ద గల సాధనములు ఏవి? మహానుభావులు ఎంత​​ నూరిపోసినా ప్రజల తలకెక్కినట్లు కనబడదు. తిరిగి వారు చెప్పిన జీవిత సత్యములను పునశ్చరణ చేసుకుందాం. దీనిని యెస్చెర్ గారు వేసిన మెటామార్ఫొస్ (రూపాంతరము) అనే పెరు గల చిత్రమ్ ద్వారా విశద పరచుకుందాము.


డచ్ కళాకారుడు యెస్చర్ జీవితములో ద్వందముల గురించి అధికమైన ప్రాముఖ్యతనిచ్చి అనేక చిత్రములను వేసిరి, నిర్మించిరి.  మెటామార్ఫోసిస్' ఒక అద్భుతమైన కళా ఖండము. యెస్చర్ గారు తమ జీవిత కాలములో దీనిని మూడు సార్లు  సవరించిరి. దీని అందమును పరిమాణమును (20 సెంటిమీటర్లు వెడల్పు 390 సెంటిమీటర్లు పొడవు) శ్రోతలు క్రింది బొమ్మలో చూడవచ్చును. దీనిపై అందమైన వీడియో కూడా జత పరిచాను.  చూచి ఆనందించండి. 

మెటామార్ఫోసిస్ జంతువులు మరియు ఇతర రూపాలు క్రమంగా ఒకదానికొకటి రూపాంతరం చెందడాన్ని చూపుతుంది. ఈ ప్రక్రియ నల్లని దీర్ఘచతురస్రంలో మెటామార్ఫోస్ అనే పదంతో ప్రారంభమవుతుంది, తర్వాత అనేక చిన్న మెటామార్ఫోస్ దీర్ఘచతురస్రాలు గ్రిడ్ నమూనాను ఏర్పరుస్తాయి. ఈ గ్రిడ్ అప్పుడు నలుపు మరియు తెలుపు గీసిన నమూనాగా మారుతుంది, ఇది సరీసృపాలు, తేనెగూడు, కీటకాలు, చేపలు, పక్షులు మరియు ఎరుపు రంగు టాప్‌లతో కూడిన త్రిమితీయ (3 dimensional) బ్లాక్‌ల నమూనాగా మారుతుంది.

ఈ బ్లాక్‌లు ఇటాలియన్ సముద్ర తీరప్రాంత పట్టణమైన అట్రాని యొక్క నిర్మాణంగా మారాయి. అట్రాని నీటిలో ఉన్న ఒక టవర్‌తో ఒక వంతెన ద్వారా అనుసంధానించబడి ఉంది, అదే సమయంలో చదరంగపు పలకపై నిలబడి ఉన్న రూక్. నీటిలో ఇతర చదరంగం ముక్కలు ఉన్నాయి మరియు నీరు చదరంగంగా మారుతుంది. చదరంగం బోర్డ్ ఒక చెకర్డ్ గోడకు దారి తీస్తుంది, అది మెటామార్ఫోస్ అనే పదానికి తిరిగి వస్తుంది. 

Metamorphose  డచ్ భాషా పదము. ఇది metamorphosis లేదా రూపాంతరమును సూచించునది. ఈ చిత్రములో చూపిన ఒకదానిలో నొకటి విడదీయరానట్లు క్లిష్టముగా ముడిపడివున్న పెంకులు interlocking  tiles (నమూనాలు) మానవుని జీవనములో జడ జీవ పదార్థముల పరస్పర అవినాభావ సంబంధమును తెలుపు చున్నవి. ఇవి అంతఃపాశమునకు ప్రతీకలు.  'బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటె' అన్న దాని అర్ధమూనిదియే.

నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే
అండనే బంటునిద్రదియు నొకటే
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొకటే
ఛండాలుడుండేటి సరిభూమి యొకటే ॥తంద॥

సృష్టి ఒక క్రమ పద్ధతిలో మార్పు చెందుచున్నను, ఆ నీయమిత మార్పు మన అవగాహనా పరిధులను దాటి వుండునని తెలుస్తుంది. రూపాంతర ప్రక్రియ విశాల కాల పరిణామములో అనియంత్రితముగా మార్పులు చెందు జీవ జడ పదార్థములను ఒకే దీర్ఘ చిత్రములో చూపి రెంటికినీ వ్యత్యాసం లేదనిరి. ఐతే ఈ జీవ ప్రపంచములోని క్రమమును తెలియలేమని "వెనకేదో ముందరేదో వెఱ్ఱి నేను" అన్నారు అన్నమాచార్యులు. 

చిట్టచివరి చందరంగంలోనూ చమత్కారముగా చూపిరి. ఆసక్తి గల వారికి క్రింద ఛెస్ పొజిషన్లను కూడా ఇచ్చాను. తెల్ల పావుల ఆటగాడు 'చెక్'లో వున్నాడు. అతడు తెల్ల యేనుగుతో చెక్' పెట్టిన నల్ల మంత్రిని చంపినా కూడా తెల్ల పావుల వాని ఆట ముగిసినట్లే. ఈ రకముగా ఇది చిట్టచివరి అవకాశం అని యెస్చర్ హెచ్చరిక చేస్తున్నారు. 



దీనిని 'వెన్నచేతబట్టి నేయి వెదకనేలా'తో పోల్చి చూడండి. చదరంగమును మనకు తెలిసిన ప్రపంచముఅను క్రీడగా భావించండి. అనగా ఆటను కొనసాగించడము కాదు, చదరంగం ముందు నుంచే కాదు, ఆ విషయములతో ముడిపడని పని చేయవలెను. అదియే ధ్యానము. కానీ మానవుడూ తనకు తెలియని పని ఎట్లు చేయ గలడూ? అనగా ఏమీచేయక నిశ్చలస్థితిలో వుండుటయే ధ్యానము. అయితే  పరి పరి విధముల భ్రమించు మనస్సు అటుఇటు కదులుతుంటే ధ్యానము అనిపించుకోదు. 

యెన్ని గడియించే వెన్నిట ముంచే -
విన్నిట శ్రీ వేంకటేశ్వరుఁడ
అన్నిట నంతర్యామివి నీవే
కన్ను దనియ ననుఁ గావఁగదే     ॥ఎందు॥

భావము: మానవుడా ఎన్నిటిని (డబ్బు, సంపదలు, పేరు) గడించబోతావు? ఎన్ని విషయములలో మునగబోతావు?  శ్రీ వేంకటేశ్వరుఁడ అన్నిటికీ అంతర్యామివి నీవు. మా కనులకు తృప్తినిచ్చునట్లు కావవా?

వివరణము: ‘కన్ను దనియ తో అంతర్వీక్షణమును సూచించిరి. తిరిగి "యః పశ్యతి స పశ్యతి" = ఆ రకముగా చూచువాడు సరిగా చూచును అనునది మననము చేసుకుందాము.

మానవుడు తన జీవితమందు సాధించగలిగిన అత్యుత్తమ మైనది నిశ్చలబుద్ధి. అది మానవుని నియంత్రణ లేకయే కలుగును. కాబట్టి లంపటములను వదలి శరణాగతి చేయుటకన్ననూ వెరే మార్గము కానరాదు. నిశ్చలబుద్ధి కలిగినదనే యెఱుక వున్న అది జ్ఞానమని పించుకోదు. కావున ఇది అతి గహనమైనది.

శరణాగతి చేయు వాని అంతరంగమును పరిశీలించుదాం. భవిష్యత్తు నిశ్చయాత్మకముగా చేయుట మన ఇప్పటి జీవిత ధ్యేయం. యెస్చర్ గారి పటములో ఒక నమూనా టైల్ నుండి మరియొక నమూనా టైల్కు మారుట సందిగ్ధముగాను అసంపూర్ణము గాను అనిపిస్తుంది. తనను తాను భగవంతునికి అర్పించుకొనుట జీవన ప్రవాహమందు పయనించుటకొరకే. అట్టి ప్రస్థానము తెలిసిన ఈ జగత్తునుండి తెలియనిదానికి.

నిశ్చితము నుండి అనిశ్చితమునకు ప్రయాణము సాహసోపేతమైనది. భయమందువారు దీనిలో ప్రవేశింప జాలరు. ఇటువంటి యత్నము అవివేకముని ప్రజలు ముద్ర వేయుదురు. కాబట్టి దీనిని పరిశీలింపకయే మనిషి కాలము వెళ్లబుచ్చును. అందుకే "చూడరెవ్వరు దీని సోద్యంబు పరికించి" అని అన్నారు అన్నమాచార్యులు.

-x-x-x-

3 comments:

  1. అద్వైత వాదులు ఈ సంసారము మాయ, ఆవలనున్న పరబ్రహ్మమే సత్యము. ఆ బ్రహ్మములో లీనమగుటయే ధ్యేయము అందురు. ఇంద్రియ గ్రాహ్యమైన ఈ ప్రపంచమంతయు దర్పన దృశ్యమాన నగరీ తుల్యము. అన్నమాచార్యుల వారు అనేది.. ఈ ప్రపంచము మాయ కాదు. ఇంద్రియ లాలస వలన సుఖ దుఃఖములు కలుగును. కాని మనో వైక్లబ్యము వలన సంశయములకు లోనై నిశ్చితార్థము తెలుకొన జాలము. శ్రీనివాస గారు ఎస్ఛర్ గారి చిత్రాలను ఈ సంశయాత్మక స్థితికి ఉదాహరణగా జొప్పించారు. ఎస్ఛర్ గారి మొదటి చూపులో నిజమని అద్భుతమని తోచినా, అవి అసంభవము. ఈ గురుతు కలగటమే మోక్ష హేతువు! ఈ సోద్యము పరికించి, కట్టెదుటనున్న కాణాచిని కనుక్కోవయ్యా అని ప్రబోధన! శ్రీనివాస గారి వ్యాఖ్యానము అత్యంత శ్లాఘనీయము - డా. పుచ్చా వెంకట రమణ

    ReplyDelete
  2. పైన డా. వెంకట రమణ గారు చాలా బాగా వ్యాఖ్యానించారు. I agree with him. బాగా వచ్చింది.

    ReplyDelete
  3. సంసారసాగరంలో చిక్కుకొన్న అవివేకి
    దానిని తరించటానికి దాదాపు అసాధ్యమే.
    పునరపి జననం పునరపి మరణం
    పునరపి జననీ జఠరే శయనం
    *ఇహ సంసారే బహు దుస్తారే*
    అన్న శంకరుల భజగోవిందశ్లోకం
    స్మరణీయం.శంకరులు చెప్పినది కూడా ఇదే - సంసారం దుస్తరమైనదని.
    కలిమి,వ్యామోహం,రాగద్వేషములు-
    ఇవన్నీ బంధహేతువులే యని సర్వాంతర్యామియైన శ్రీవెంకటేశ్వరుడికి శరణాగతి యని మోక్షము నొందుమని అన్నమయ్య ఈ కీర్తనలో అంటున్నారు.
    ఈ ప్రపంచమున కావల వేరే లోకాలు లేవని, ఉన్నది యొక్కటే యని,అదే కళ్ళముందున్న ప్రపంచమని అన్నమయ్య నిశ్చయమైన భావన.
    *కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ* అతిసమీపంలోనున్నది వైకుంఠం. హృద్గుహలో స్థిరంగా ఉండే పరమాత్మను, మనకతి సమీపంలో నున్న దైవాన్ని కనుగొంటే అదే పరమపదమని ఉపనిషద్ఘోష. దానినే కట్టెదుట వైకుంఠమని అన్నమాచార్యు లంటున్నారు.

    జీవితములో ధ్వంద్వములను ఎస్చర్ గీచిన మెటామార్ఫోజ్ అనే చిత్రంలో జంతువులు అంటే సరీసృపాలు,చేపలు,పక్షులు కీటకాలు, ఇతర రూపములు క్రమంగా పరిణామంలో రూపాంతరం చెందటాన్ని, జీవనములో జీవజడ పదార్థములతో(స్థావరజంగమాలు) పరస్పరం అవినాభావ సంబంధమును అద్భుతంగా చిత్రీకరించారు.
    కళ్ళముందున్న ఈ ప్రపంచమొక్కటే ఉన్నదని, ఇదే సమిష్టి చైతన్యం (Universal Consciousness)
    ఇదే పరమాత్మ తత్త్వమని అజ్ఞాని గ్రహింపకున్నాడు. వివేకి దీనియందే పరమాత్మ దర్శనం చేసుకొంటాడు.
    *య పశ్యతి స పశ్యతి*

    ఓమ్ తత్ సత్ 🙏🏻🙏🏻🙏🏻
    కృష్ణ మోహన్

    ReplyDelete

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...