అన్నమాచార్యులు
183 ఏ వూరికేవూరు యెక్కడికి నెక్కడ
క్లుప్తముగా: మనస్సెప్పుడూ విశ్వవ్యాప్త ప్రేమ మరియు శాంతియుత
ఆనందంతో నిండివున్న స్థితిని కోరుకుంటుంది.
~ జేమ్స్ రెడ్‌ఫీల్డ్
కీర్తన సారాంశం:
పల్లవి: దైవమా! ఏ వూరికేవూరు యెక్కడెక్కడికి వెళ్ళినా నీవున్నావుకదా!
అలాంటప్పుడు నిజముగా నీవు మాకు ఏలా? అన్వయార్ధము: దైవమా! నీవు వున్నది వూర్లలోను, గుళ్లలోనూ కాదు మా హృదయాలలో. నీవులేని మేమెటువంటి వారమో కూడా వూహింపలేము.
చరణం 1: అర్ధరాత్రి ఎక్కడెక్కడి నుండో
వచ్చి వద్దుపోరా నీ కోసమీ ఆరాటముతో కూడిన మైమరపులు. కంటికి నిద్రలేకుండా నీ కోసము
కాచుకుని వుండలేని వారము. మేము నీకు తగినవారమూ కామేమో?
చరణం 2: ఉపద్రవము కలిగించు పరితాపముల
వేదనఁ భరించలేక వేడిపుట్టి కన్నుగానలేక తిరిగేవు. కోరికలతో సతమతమౌతున్న నీకు ఎవరున్నరోయీ? ఎంతో రుచిగా వుండే వాక్కయల పులుసు చేసుకునేది గుంతల్లో
పారవేసేందుకా? అన్వయార్ధము: మానవుడా నిన్ను వేధించుచున్న వాటిని
కనుగొనుటకు బదులు వాని సంగతులలో పడి త్రోవ తప్పుతున్నావు. కళ్ళు తెరిచి నీకు నిజమైన
బంధువు ఎవ్వరో తెలుసుకో. జీవితము పులుసు వలె నిల్వ వుండనిదే. వేగిర పడుము.
చరణం 3: అందఁగాఁడ తిరువేంకటాద్రీశా! నీవు చాలా ఇండ్లకు అతిథివై వుండునప్పటికీ ఏ ఒక్కరిపైనా విశేషముగా మమకారమున్నదా? (= నీ కందరూ సమానమేకదా!). చనవుకొద్దీ ఇలా అంటున్నాముగానీ, నీ ఏకాంతము అను మన్ననయే మాకు పదికాలాల పాటు చాలును.
విపులాత్మక వివరణము.
ఉపోద్ఘాతము: అన్నమాచార్యులు తనను ఒక స్త్రీగా వూహించుకొని దైవమును తన ప్రియునిగా చేకొని వ్రాసిన గీతము. దీనిని శృంగార కీర్తన అని వర్గీకరించినప్పటికీ అధ్యాత్మ కీర్తన అనియే చెప్పవచ్చును. చరణములను చూచిన ఇది రూఢీ అవుతుంది. మనము మన జీవితములో ఖచ్ఛితముగా నూటికి నూరు పాళ్ళు భాగమవ్వలేని అశక్తతను సూచించినారు.
ఈ రకముగా వాస్తవికతకు అధిక ప్రాధాన్యతనిస్తూ
మనిషి హృదయాన్ని అతని కళ్ళ ముందు నిలబెట్టు యత్నముచేసిన మహానుభావుడు అన్నమాచార్యులు. వారు అలతి పదములలో అతి నిగూఢమగు
విషయమును చెప్పి ఆలోచింపచేతురు. వారికి సమానమగు కవిత్వము చెప్పగల వారు లేరు.
శృంగార కీర్తన: రాగిరేకు: 1-1 సంపుటము: 5-1 |
ఏ వూరికేవూరు యెక్కడికి నెక్కడ
నీవు మాకు నిఁకనేల నిజమైనాఁ జెప్పరా ॥పల్లవి॥ ఆద్దమరాతిరిదాఁకా నందునిందు నుండివచ్చి
వద్దువోరా నీకునింత వలసినొల్లములు
నిద్దుర గంటికి లేక నీకునుండ వారమా
వొద్దిక చాలని వారముండినా నుండితిమి ॥ఏవూ॥ వేఁకమైన పరితాప వేదనఁ బొరలలేక
కాఁక పుట్టి తిరిగేవు కన్నుగానలేక
యేఁకట దీర నీకు నెందరు గలరని
వోఁకల పులుసు కలువులఁ బుచ్చవలెనా ॥ఏవూ॥ అందఁగాఁడ తిరువేంకటాద్రీశ పెక్కిండ్ల-
విందవై నీవొకతెపై వెచ్చఁదన మున్నాదా
మందెమేళము నీతో మాటలాడితిమి గాక
కందువ మన్నన చాలు కలకాల మెల్లను ॥ఏవూ॥
|
Details and Explanations:
ముఖ్య పదములకు అర్ధములు:
భావము: దైవమా! ఏ వూరికేవూరు యెక్కడెక్కడికి వెళ్ళినా నీవున్నావుకదా! అలాంటప్పుడు
నిజముగా నీవు మాకు ఏలా?
వివరణము: మానవుడు తనకు దైవమును
కనపడు దానిగా భావించి ప్రతిమలను, చిహ్నములను ప్రతిష్ఠించి తాను భద్రముగా వుండుదునని
భావించును. ప్రపంచ వ్యాప్తముగా కోకొల్లలుగా
వున్న ప్రార్థనా మందిరములే దీనికి తార్కాణము. ప్రతిమలకు, చిహ్నములకు కాక ప్రత్యక్షముగా తనకు దైవానికి గల సంబంధమును పరీక్షించడు
మానవుడు. అన్నమాచార్యులు దీనినే ఈ కీర్తనలో వ్యక్తము చేయుచున్నారు. “నీవు మాకేమౌతావు?” అను ప్రశ్నను సంధించారు.
మనము సాధారణంగా సినిమాలు
చూచునప్పుడు విలన్ చేసే దృష్కృతాలకు వళ్ళుమండి పిడికిళ్ళు బిగుచుకోడం, హృదయం బద్దలయ్యేలా వున్న హీరో పరిస్థితితో
ఆవేశం పొడుచుకువచ్చి కళ్లలో నీళ్ళు నీండడం లాంటివి సహజముగానే జరుగుతుంటవి.
కానీ నిజ జీవితంలో అలా
వాస్తవముగా చేయము. మనము చూచుచున్న దృశ్యములో భాగమైనా మనము కొంత వరకు మాత్రమే అందులో
పాత్ర పంచుకుంటాము. ఇక్కడే చూచువాడు చూచునది వేరైనవి అని చెప్పవచ్చును. చూచువాడు చూచునది
ఒక్కటైనప్పుడు దృశ్యములో నీవు అని ప్రత్యేకముగా వుండవు. జీవితములో అతి కొద్ది క్షణములలోనే
మానవుడు ఆ ఒక్కటగు అనుభూతిని పొందునది.
"నీవు మాకు నిఁకనేల
నిజమైనాఁ జెప్పరా" అని చెప్పి అన్నమార్యులు భగవంతుని మన కంటే వేరుగా చూచు ఇప్పటి
మన ప్రవృత్తిని చెప్పిరి. ఈ ప్రపంచముతో సహా ఇక్కడ అగపడున వన్నియు బ్రహ్మములోనివే. మునుపటి
వివరణలో దీనిని గురించి సుదీర్ఘ వివరణ ఇచ్చితిని. కాబట్టి "నీవు మాకు నిఁకనేల నిజమైనాఁ జెప్పరా"
అని అడుగుట స్పష్టముగా అవివేకము.
"నీవు మాకు నిఁకనేల
నిజమైనాఁ జెప్పరా"తో మనము మన జీవితములో ఖచ్ఛితముగా నూటికి నూరు పాళ్ళు భాగమవ్వలేని
అశక్తతను సూచించినారు. ఈ రకముగా వాస్తవికతకు అధిక ప్రాధాన్యతనిస్తూ మనిషి హృదయాన్ని
అతని కళ్ళ ముందు నిలబెట్టు యత్నముచేసిన మహానుభావుడు అన్నమాచార్యులు. వారు అలతి పదములలో అతి నిగూఢమగు
విషయమును చెప్పి ఆలోచింపచేతురు. వారికి సమానమగు
కవిత్వము చెప్పగల వారు లేరు.
అన్వయార్ధము: దైవమా! నీవు వున్నది
వూర్లలోను, గుళ్లలోనూ
కాదు మా హృదయాలలో. నీవులేని మేమెటువంటి వారమో
కూడా వూహింపలేము.
ముఖ్య
పదములకు అర్ధములు: ఆద్దమరాతిరి = అర్ధరాత్రి;
ఒల్లములు = మైమరపులు; ఒద్దిక
= వినయము, ప్రేమ, సమానము
భావము: అర్ధరాత్రి
ఎక్కడెక్కడి నుండో వచ్చి, వద్దుపోరా నీ కోసమీ ఆరాటముతో కూడిన మైమరపులు. కంటికి నిద్రలేకుండా నీ కోసము
కాచుకుని వుండలేని వారము. మేము నీకు తగినవారమూ కామేమో?
వివరణము: అన్నమాచార్యులు
"వొద్దిక చాలని వారముండినా నుండితిమి" అంటూ మానవులు చూపు ప్రేమ, కరుణ అంతంత
మాత్రమేనని అన్నారు. ప్రేమను కొలిచేందుకు మన వద్ద ప్రమాణములుండవచ్చు గానీ, అటువంటి ప్రేమ కాదు భగవంతుడా శించునది. అర, కొర ప్రేమలతో జీవితాన్ని నెట్టవచ్చు కానీ
దైవమును మురిపించలేము.
ఈ చరణములో మానవుడు అలసి
సొలసి చూపు భక్తిని కాదంటున్నారు ఆచార్యులవారు. ‘భక్తి కలుగుకూడు పట్టెడైనను
చాలు’ అన్నారు వేమన.
ముఖ్య
పదములకు అర్ధములు: వేఁకమైన = ఉపద్రవము కలిగించు; బొరలలేక = తిరుగాడలేక; కాఁక
= జ్వరము, తాపము, వేడి;
ఏఁకట= మిక్కిలి కోరిక, వాంఛ; వోఁకల = వాకచెట్టు;
భావము: ఉపద్రవము కలిగించు పరితాపముల వేదనఁ భరించలేక వేడిపుట్టి కన్నుగానలేక
తిరిగేవు. కోరికలతో సతమతమౌతున్న నీకు ఎవరున్నరోయీ? ఎంతో రుచిగా వుండే వాక్కయల పులుసు చేసుకునేది గుంతల్లో పారవేసేందుకా?
వివరణము: మానవుడు తాను చూచునది ఏమిటో తెలియలేడని అనేక మార్లు చెప్పడమైనది. “కాఁక పుట్టి తిరిగేవు కన్నుగానలేక”తో అన్నమాచార్యులు మదము మాత్సర్యములు కలిగించు వాతావరణము నుండి చూచు మనలను గుడ్డివారనిరి. ఇది "యః పశ్యతి స పశ్యతి" = ఆ రకముగా చూచువాడు ద్రష్ట అని భగవద్గీతలో చెప్పినదానికి పూర్తిగా వ్యతిరేకము. కావున మనము మౌలికముగా మరొక పద్ధతిని ఎన్నుకొనవలెనని ఆచార్యుల భావన.
“వేఁకమైన పరితాప వేదనఁ బొరలలేక / కాఁక పుట్టి తిరిగేవు కన్నుగానలేక”ను “ఏనుగులలో ప్రతిబింబించే హంసలు” ‘Swans reflecting Elephants’ అను సాల్వాడార్ డాలి గారు వేసిన క్రింద ఇచ్చిన అధివాస్తవిక చిత్రము ద్వార విశద పరచుకుందాము.
తన చిత్రాలలో, డాలీ తన స్వంత పద్ధతిని ఉపయోగించాడు, దానిని భ్రమలు / భ్రాంతుల వల్ల కలిగే మానసిక ప్రకోపము "పారానోయిడ్-క్రిటికల్ యాక్టివిటీ"గా నిర్వచించాడు. ఈ పద్ధతిలో, "ఏనుగులలో ప్రతిబింబించే హంసలు" కూడా దిద్దుకుంది. ఇది దృశ్య భ్రమలు మరియు భ్రాంతులను రేకెక్తించు ద్వంద్వత్వమును సూచిస్తుంది.
సరస్సు పైన వున్నవి మనకు తెలిసినవైతే, నీటి క్రింది భాగము మనకు బోధలేని అవ్యక్తమగు మనస్సును సూచించును. అనగా మనకు కనబడు హంసలు లోపల ఏనుగులుగా మారుతున్నవి.
అక్కడవున్న చెట్ల కాండములు, కొమ్మలు గతించిపోయిన స్మృతులకు చిహ్నములు. ఈ రకముగా సంబంధములేని ఏవేవో కలుపుకొని అంతఃదృశ్యము ఏర్పడును. అనగా మనలో కలుగు భావనలకు నిర్దుష్టమైన పునాదులు ఉండవన్నమాట. “కాఁక పుట్టి తిరిగేవు కన్నుగానలేక” అన్న అన్నమాచార్యుల మాట ఎంతైనా ఆలోచింపతగ్గది.
“యేఁకట దీర నీకు నెందరు గలరని” తో మనకు ఈ రోజున కానవచ్చు బంధువులు, చుట్టాలు, సంపదలు అశాశ్వతమని వున్న ఒక్క బంధుగుడు శ్రీపతియే నని తెలియమనిరి. తిరిగి పల్లవిలోని "నీవు మాకు నిఁకనేల నిజమైనాఁ జెప్పరా"ను పరిశీలించమని ప్రార్థన.
“వోఁకల పులుసు కలువులఁ బుచ్చవలెనా” = ఎంతో రుచిగా వుండే వాక్కయల పులుసు చేసుకునేది గుంతల్లో పారవేసేందుకా? ఆని జీవితమును సమయమును వృథా చేసుకోవద్దని బోధించు చున్నారు.
అన్వయార్ధము: మానవుడా నిన్ను వేధించుచున్న వాటిని కనుగొనుటకు బదులు వాని సంగతులలో
పడి త్రోవ తప్పుతున్నావు. కళ్ళు తెరిచి నీకు నిజమైన బంధువు ఎవ్వరో తెలుసుకో. జీవితము
పులుసు వలె నిల్వ వుండనిదే. వేగిర పడుము.
ముఖ్య పదములకు అర్ధములు: పెక్కిండ్ల-విందవై = చాలా ఇండ్లకు అతిథివై; నీవొకతెపై వెచ్చఁదన మున్నాదా = ఏ ఒక్కతె పైనైనా ప్రత్యేకముగా
ప్రేమ గలదా? = ఏ ఒక్కరిపైనా విశేషముగా మమకారమున్నదా? =
నీ కందరూ సమానమేకదా!; మందెమేళము = స్నేహముగా, పరిహాసముగా.
భావము: అందఁగాఁడ
తిరువేంకటాద్రీశా! నీవు చాలా ఇండ్లకు అతిథివై వుండునప్పటికీ ఏ ఒక్కరిపైనా విశేషముగా
మమకారమున్నదా? (= నీ కందరూ సమానమేకదా!). చనవుకొద్దీ ఇలా అంటున్నాముగానీ, నీ ఏకాంతము
అను మన్ననయే మాకు పదికాలాల పాటు చాలును.
వివరణము: ‘'పెక్కిండ్ల-విందవై’తో అనేకానేక హృదయములలో నివసించు
దేవదేవుని పేర్కొన్నారు.
దైవం సర్వవ్యాపి.అన్నిటా ఉన్నాడు. మన హృదయాలలో కూడా ఉన్నాడు.జీవాత్మతో బాటుగా పరమాత్మ చైతన్యం ఉంటుంది. అదే మన చేతనాశక్తికి మూలం.ఆ చైతన్యమే లేకపోతే మనమెటువంటి వారమో ఊహింపజాలము.
ReplyDeleteమోహమదమాత్సర్యములనే అంధకారంలో చిక్కుకొని కన్ను గానక తిరుగాడుచుంటిమి.మానవ జీవితం దుర్లభమైనది.ఎంతో రుచికరమైన వాక్కాయపులుసు చేసుకునేది గోతిలో పొయ్యటానికా అనినట్లు ఎంతో దుర్లభమైన మానవజీవితమును సార్థకం చేసికొనలేక మోహమదమాత్సర్యముల భ్రమ/మాయలో బందీయై కన్నుగానక తిరుగాడు చున్నాము.
"Swans reflecting elephants' అనే సాల్వాడార్ డాలీ గారి అధివాస్తవిక చిత్రం మానవులలో భ్రమ/భ్రాంతి వలన కలిగే మానసిక ప్రకోపములను సూచిస్తున్నవి. చిత్రంలో ఏనుగులలో ప్రతిబింబించే హంసలు భ్రమలు పుట్టించే ద్వంద్వత్వము సూచిస్తున్నవి.
దైవం దృష్టిలో సర్వులు సమానులే.ఏ ఒక్కరిపైనా ఎక్కువ లేదా తక్కువ కరుణ చూపడు.అందరియెడల సమదృష్టితో ఉంటాడు.మా హృదయంలో స్థిరనివాసమున్నచో అదే చాలునుఅంటున్నారు ఆచార్యులవారు.
ఓమ్ తత్ సత్ 🙏🏻🙏🏻🙏🏻
కృష్ణ మోహన్