Monday, 6 November 2023

T-187 విత్తొకటి వెట్టఁగా వేరొకటి మొలచునా

 అన్నమాచార్యులు

187 విత్తొకటి వెట్టఁగా వేరొకటి మొలచునా

for English version press here


క్లుప్తముగా: జీవితము ప్రతిధ్వని వంటిది -  అన్నమాచార్యులు

కీర్తన సారాంశం:

పల్లవి: ఒకటి విత్తితే మరొకటి మొలచునా? దైవమా నన్ను ఎత్తి ఈ జీవితము అను కష్టము నుండి బయటకు తియ్యి!

చరణం 1: మోహము బంధములకు ఈ శరీరమే మూలము. ఉహలకు, అపోహలకు దేహము నందే దాచుకుని వుంటాము. దాహమునకు ఆకటికి చిక్కుకుంటుంది. ఇటువంటి దేహముతో వైరాగ్యమెలా కలుగుతుంది?

చరణం 2: పంచేంద్రియములకు పాదు వంటిది యీ తనువు. చంచలపుటాసలకు మద్దత్తు పలుకును యీ తనువు. వరుస దుర్గణములకు గనిలాంటిది తనువు. యెంచి చూడ వివేక మిందెట్టు నిలుచును?

చరణం 3: యీహలోకసుఖములకు హేతువీ తనువు. బహుపుణ్యపాపాలకు ఫలము యీ తనువు. యిహమునకు శ్రీవేంకటేశ నీదాస్యమున విహరించెఁ దనువు. యిఁక నాకు ఏమగునో యన్న భయము లేదు. 

 

విపులాత్మక వివరణము

ఉపోద్ఘాతము: అన్నమాచార్యులు మానవులు తాము నాటుతున్న విత్తుల కంటెనూ వేరు పంటను ఆశించుటను ఎత్తి చూపిరి. అనగా తమ చేష్టల ఫలితములను అనుభవింపక మార్గము లేదన్నారు. ఐతే మనకు ఈ స్థితి నుంచి ముక్తి వుండదా? 

శ్రీవేంకటేశుని దాస్యము ఒక్కటే మార్గమనిరి. ఇక్కడ  దాస్యము అంటే బానిస అని కాదండి. తనపైబడు ఫలితములను నిర్లిప్తముగా వేరు మార్గములేదని స్వీకరించుట​. తనకైతాను నాటు విత్తులను చర్యలను తెలియుట. 

అధ్యాత్మ కీర్తన:

రాగిరేకు:  307-6 సంపుటము: 4-42

విత్తొకటి వెట్టఁగా వేరొకటి మొలచునా
యెత్తి హరి నీవు నను నీడేర్తు గాక ॥పల్లవి॥
 
మోహబాంధవములకు మూలంబు తనువు
వూహాపోహలకు వునికి యీ తనువు
దాహమున కాఁకటికి తగులు యీ తనువు
యీహీ వైరాగ్య మిందెట్టు గలుగు ॥విత్తొ॥
 
పంచేంద్రియములకు పాదు యీ తనువు
చంచలపుటాసలకు జంట యీ తనువు
అంచె దుర్గణములకు నాకరము తనువు
యెంచి చూడ వివేక మిందెట్టు నిలుచు ॥విత్తొ॥
 
యీహలోకసుఖములకు హేతువీ తనువు
బహుపుణ్యపాపాలకు ఫలము యీ తనువు
యిహమునకు శ్రీవేంకటేశ నీదాస్యమున
విహరించెఁ దనువు యిఁక వెఱపేల కలుగు॥విత్తొ॥

 

Details and explanations: 

విత్తొకటి వెట్టఁగా వేరొకటి మొలచునా
యెత్తి హరి నీవు నను నీడేర్తు గాక ॥పల్లవి॥

భావము:  ఒకటి విత్తితే మరొకటి మొలచునా? దైవమా నన్ను ఎత్తి ఈ జీవితము అను కష్టము నుండి బయటకు తియ్యి!

వివరణము:

  1. మానవులు నాటుతున్నదేమి? మనను ఆవరించి యున్న వాతావరణములో భావములను, ఆలోచనలను తరంగముల ద్వారా వ్యాపింప చేస్తాము. ఏది నాటుతున్నామో దానికి అనుగుణంగానే ఫలితములను పొందు తాము.
  2. మనము కొన్ని తెలిసి, కొన్ని తెలియక నాటుతాము. రెంటికి కూడా ఫలితము ఒకేలావుంటుందని అచార్యుల భావన​.
  3. కాబట్టి ఈ క్రియ ప్రతి క్రియలలో  కాలము వెళ్లబుచ్చ కుండా నన్ను ఎత్తి ఈ జీవితము అను కష్టము నుండి బయటకు తియ్యి అని వేడుకుంటుంన్నాడు అన్నమయ్య​.
  4. దీని గురించి రెనె మాగ్రిట్ గారూ వెసిన పెద్ద కుటుంబము (Large Family) అను పేరుగల పెయింటింగ్ ద్వారా మరింత విపులముగా తెలుసుకుందాము. ఈ బొమ్మలో సముద్రము, వివర్ణమైన ఆకాశము, ఒక పెద్ద పక్షిని చూస్తున్నాము.
  5. రెక్కలువిప్పుకొని ఉన్న పక్షి ఆకారము (silhouette) మాత్రమే కనబడుతోంది. ఆ పక్షిలో ప్రకాశవంతముగా వున్న మేఘాలతో కూడిన ఆకాశము చూడగలము
  6. మొత్తము మీద ఆకాశము బావురు మనుౘున్న ట్లున్నప్పటికీ, మనము దేదీప్యముగా వెలుగుతున్న  పక్షిని చూస్తున్నాము. కనబడుతున్న చిత్రము అల్లకల్లొలముగా వున్న సముద్రము (మనస్సు) నుండి పుట్టినది. ఇక్కడ సముద్రమును ఆకాశమును కలిపి ప్రపంచముతో పోల్చండి. చూచుచున్నవ్యక్తిని విత్తనము అనుకుంటే, అతడి మనసులో వున్నవే  ప్రపంచమున నిక్షింపబడతాయని అనుకోవచ్చు. (అలాగే మనం మన చర్యలను పూర్తిగా అర్థం చేసుకోలేము కాని ఫలితాలను తెలుసుకోవడం ద్వారా వాటిని గ్రహించడం కూడా గమనించవచ్చు).

  7. ఇక్కడ ఆ చూపరి విత్తనము వంటి వాడైతే, కనబడుతున్న దృశ్యము చెట్టు వంటిది. ఈ రకముగా అన్నమాచార్యులు, రెనె మాగ్రిట్ గారూ ఒకే విషయము చెబుతున్నారని సులభముగా తెలియవచ్చు.

మోహబాంధవములకు మూలంబు తనువు
వూహాపోహలకు వునికి యీ తనువు
దాహమున కాఁకటికి తగులు యీ తనువు
యీహీ వైరాగ్య మిందెట్టు గలుగు ॥విత్తొ॥ 

భావము:  మోహము బంధములకు ఈ శరీరమే మూలము. ఉహలకు, అపోహలకు దేహము నందే దాచుకుని వుంటాము. దాహమునకు ఆకటికి చిక్కుకుంటుంది. ఇటువంటి దేహముతో వైరాగ్యమెలా కలుగుతుంది?

వివరణము

  1. మానవుని ఈ విచిత్రమైన స్థితిని చూపుతున్న రెనె మాగ్రిట్ గారు వేసిన "ఎన్‌కౌంటర్" పేరుతోవున్న అధివాస్తవిక బొమ్మను చూద్దాము. మనము చూస్తున్న గదికి అటుయిటు సరిహద్దులు లేకపోవడముతో ఆ గదికి విస్తీర్ణమును అంచనా వేయలేము. కిటికీలో సగము విరిగి, జారి క్రింద పడుతూ ఏటవాలుగా ఒరిగి భూమికి కొంచెం ఎత్తులో నిలిచిపోయినట్లు చూపారు.  ఈ కిటికి నుండి సముద్రము, ప్రకాశవంతముగా వున్న ఆకాశము కనబడుతున్నాయి. బయటి ప్రపంచం యొక్క ఏకైక సూచన ఇది మాత్రమే.
  2. కిటికి ఇంకో అర్ధభాగము అక్కడ వున్న బిల్బోకెట్-మానెక్విన్‌లకు సహజముగా నిలబడి బయటకు చూడలేనంత ఎత్తులో వుంది.​ దీనిలో నుంచి ప్రకాశవంతముగా వున్న ఆకాశము మాత్రమే తెలుస్తుంది. ఒక మానెక్విన్‌ (బొమ్మ) చేతిలో ఆకు చూపి, ఆశాభావముతో జీవితమును గడుపుటను సూచించారు. మానెక్విన్‌ల చూపుల బట్టి అవి తబ్బిబ్బుపడుతున్నట్లు చెప్పవచ్చును.
  3. మొత్తం మీద మానెక్విన్‌లు మానవులనిపిస్తాయి. అవి ఏమీ తేల్చుకోలేని స్థితిలో నిలిచియున్నవి. మానవుడూ అంతే.  ఏటవాలుగా ఒరిగి వున్న కిటికీతో మనము వికారము కావింప బడిన సమాచారముతో జీవితాన్ని అపార్థము చెసుకొందుమని చెబుతున్నారు.
  4. ఇంకో విధముగా చూస్తే, "ఎన్‌కౌంటర్" అనేది రెండు బొమ్మల మధ్య కాదు, బాహ్య మరియు అంతర్గత ప్రపంచాల మధ్య. అప్పుడు బొమ్మలో చూపిన వైరుధ్యాలు తమ ఉనికిని కోల్పోయి, నేపథ్యములోకి నెట్టివేయబడుతూ సగము నిలకడగాను, కనబడు సగము వంకర  కిటికీల గుండా కానవచ్చు అర్ధ సత్యములతో సతమతమగు అవస్థను పైకి తెచ్చి మనలను లోతైన​ ఆలోచనలలో దింపుతాయి.
  5. ఏ రకముగా చూచిననూ, మానవుడు తన చుట్టూ వున్న ప్రపంచమును పరిమితమైన దృష్టికోణముతోనే చూచు విషయము స్పష్టము. ఇట్టి పరిస్థితులలో అతనికి సత్యము గోచరించదు. 

పంచేంద్రియములకు పాదు యీ తనువు
చంచలపుటాసలకు జంట యీ తనువు
అంచె దుర్గణములకు నాకరము తనువు
యెంచి చూడ వివేక మిందెట్టు నిలుచు ॥విత్తొ॥ 

ముఖ్య పదములకు అర్ధములు: అంచె = వరుస​; ఆకరము = సమూహము, గని

భావము:  పంచేంద్రియములకు పాదు వంటిది యీ తనువు. చంచలపుటాసలకు మద్దత్తు పలుకును యీ తనువు. వరుస దుర్గణములకు గనిలాంటిది తనువు. యెంచి చూడ వివేక మిందెట్టు నిలుచును?

యీహలోకసుఖములకు హేతువీ తనువు
బహుపుణ్యపాపాలకు ఫలము యీ తనువు
యిహమునకు శ్రీవేంకటేశ నీదాస్యమున
విహరించెఁ దనువు యిఁక వెఱపేల కలుగు॥విత్తొ॥ 

భావము:  యీహలోకసుఖములకు హేతువీ తనువు. బహుపుణ్యపాపాలకు ఫలము యీ తనువు. యిహమునకు శ్రీవేంకటేశ నీదాస్యమున విహరించెఁ దనువు. యిఁక నాకు ఏమగునో యన్న భయము లేదు.

వివరణము: ఇక్కడ దాస్యము అనగా దైవమునకు వూరకూరక దండములు పెట్టుట కాదు. ఇప్పటి ద్వంద భావన పోయి, చూచుట​, చేయుట​, కాలము, ధర్మము, న్యాయములలో వ్యత్యాసము హరింపబడి వున్న నిర్వికల్ప స్థితిలో చేయు పయనము.

-x-x-x-

No comments:

Post a Comment

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...