Sunday 5 November 2023

T-37. కలలోని సుఖమే కలియుగమా

 అన్నమాచార్యులు

37. కలలోని సుఖమే కలియుగమా

 

ఉపోద్ఘాతము:

అన్నమాచార్యులు తపసిలా కాక తత్వవేత్తవలె తాను ప్రత్యక్షముగా చూచినది, అనుభవమునకు వచ్చినది మనకు కీర్తనల రూపములో చెప్పిరి. ఐతే వారు ఏ సిద్ధాంతమును కూడా ప్రతిపాదించలేదు. వారి భావవ్యక్తీకరణలో నిష్పాక్షికత ఆదర్శప్రాయమైనది.

వారు పరంపరను కొనసాగించుటకు కానీ, మనకు బోధనలను చేయుటకు కానీ కీర్తనలు వ్రాయలేదండి. వున్న విషయమును వున్నట్లుగా చెప్పుటకు సాహసించిరి.  ఆ ప్రయత్నములో వారు అంతవరకు వస్తున్న సంప్రదాయములను, పద్ధతులను విమర్శించుటకు వెనుకాడలేదు. వారి పరిశీలనలు, అనుశీలనలు నేటికీ అత్యంత ప్రయోజనకారులై  వుండుటను గమినించి ఈ వ్యాఖ్యానములను వ్రాయు ప్రయత్నము చేసితిని.

అత్యంత రమణీయమైన కీర్తనలో మనిషి తనని తాను మోసపుచ్చుకుంటూ బతుకుతాడని అన్నమయ్య అన్నారు

కలలోని సుఖమే కలియుగమా, వెన్న
కలిలో నెక్కడిదె కలియుగమా ॥పల్లవి॥

 

ముఖ్య పదములకు అర్ధములు: కలియుగమా = ఈ యుగమున జనులు తమోగుణయుక్తులు అయి రాగద్వేషసహితులును, తపోవిరహితులును, క్షుద్రోగపీడితులును, దురాచారులును, అనృతవాదులును, కృతఘ్నులును, అల్పాయుష్కులును, దుఃఖపీడితులును అయి జన్మింతురు అని చెప్పఁబడి ఉన్నది = ఎన్ని విశేషణములు, గుణవాచకములు వున్నవో ఈ కలియుగమా అను శబ్దమునకు!!; వెన్న = నిలువ వుండని పదార్థము = క్షణక్షణమునకు మారునది = సత్యము; కలిలో = పులియబెట్టిన బియ్యపు;  వెన్న కలిలో నెక్కడిదె? = కడుగుమీద తేలుతున్న తెల్లని బుడగలను వెన్న అని భావించవద్దు;

భావము: పులియబెట్టిన బియ్యపు కడుగులో వెన్న ఉంటుందా? సుఖాలు కలలలాగ క్షణిక మాత్రమే.

వివరణము:

క్షణికానందాలలో పడి, శాశ్వతమైన దాన్ని గుర్తించక ఎటో పోతుంటాడు.  అందుకే ఇక్కడ మనిషిని అతని పోకడలను సూచిస్తూ కలియుగమా అని సంబోదించారు.

  • వెధవ, ఏబ్రాసి, అర్భకుడా, గాడిద వంటివి ఒక మనిషిని నిందించడానికి ఆక్షేపించడానికి వుపయోగిస్తాము.
  • గాడిద కొడుకా అని ఒక కుటుంబమును తిట్టడానికి వాడతాము.
  • అప్రాచ్యుడా (తూర్పునకు చెందనివాడా), అనార్యుడా అని సమూహమునుంచి వెలివేస్తాము, తెగలతో తెంపులు చేయుటను చూపుతాము.
  • "కలియుగమా" ఒక తరమును కానీ, దేశమును కానీ కాక మొత్తము మానవులందరినీ సూచిస్తున్న ఒక భౌతిక, దేశ కాలముల సమ్మిళితమైన ఒక దానిని సూచిస్తున్నారు.

మనిషిని కలియుగమా అని సంబోధించి  కొంటెతనము ప్రమాదము మరియు వంచన అంచులలో సమయాన్ని గడుపుతున్న  విషయాన్ని సూచిస్తున్నారు.

అన్నమయ్య ఎవరో సినిమాలలో చూపించే  కరడుగట్టిన ప్రతినాయకుని లాంటి వారిని కాదు, మన లాంటి సామాన్యులనే ప్రత్యక్షంగా విమర్శించారు.

మనము కల వంటి అస్పష్టమైన జీవితాన్ని గడుపుతామని సూచించారు. అటువంటి కలలో కూడా సుఖానుభవమే కోరుకుంటాం. కానీ సుఖాలు మనకై మనము నిర్మించుకున్న భవనములు అని క్షణము కూడా ఆలోచించము.

అన్నమాచార్యులు ఇక్కడ కలలోని దానిని వెతుకుటను అనగా వూహించుకున్న దానిని ఆశించుట = మనోవ్యాపారము, ఎన్నిక ఆధారము లేకున్నను అందు క్రీడించుటకు సాహసించుటను కలియుగము అన్నారు.

కలి యొక్క నిషాలో మనిషి సత్యమును వెదుకబోతాడు. "తా వలచినది రంభ" అన్న నానుడి ఇక్కడ బాగా వర్తిస్తుందండి. కొందరికి "స్త్రీలు, మందు, డబ్బు, పేరు ప్రఖ్యాతులు, దైవము" నిషా అవుతాయి. 

మన  పోకడలను సూచిస్తూ Rafal Olbinsky గారు వేసిన చిత్రమును చూడండీ. ఇక్కడ ఒక బాలుడు నీటి గొట్టమును పట్టుకుని వుంటాడు. ఆ గొట్టమునుంచి వచ్చె నీటి ప్రవాహములో ఒక ఓడ ప్రయాణిస్తూ కనబడుతుంది. మనిషీ తన వూహలలలోనే విహరిస్తూఅవ్వానిని నిజము చేయు ప్రయత్నములను వృధా ప్రయాస అనిరి. బాలుని బొమ్మతో మానసికముగా ఎదగని స్థితిని చూపారు. ఈ సందర్భముగ ఆచార్యుల వారి కీర్తన "పెఱుగఁగఁ బెఱుగఁగఁ బెద్దలమైతిమి నేము" గుర్తుకు తెచ్చుకుందాము.

 


అన్వయార్ధము:   జీవుడా!! తెలిసికూడా  ఆశ కొద్దీ లేని సుఖాలు కోరుకుంటావు ఎందుకో?


కడిగడి గండమై కాలము గడపేవు
కడుగఁగడుగ రొంపి కలియుగమా
బడలికె వాపవు పరమేదో చూపవు
గడిచీటియును నీవు కలియుగమా ॥కలలోని॥ 

ముఖ్య పదములకు అర్ధములు: (కడి = అన్నపుముద్ద, గడి = Limit, border) కడిగడి = అన్నపుముద్దే ఎల్లగా, సీమగా, పొలిమేరగా, బడలిక = అలసట, శ్రమ​ గడిచీటియును = ఒక హద్దు పూర్తి యైనదని తెలిపెడి చీటీ; (గడిచీటియిచ్చు = విడుదల పత్రమిచ్చు.)

 

భావము: మానవుడా!! ముద్ద ముద్దకి మధ్య కాలాన్ని గండంలా గడుపుతూ బ్రతికేస్తావు. ఎంత త్రవ్వినా మురికే వస్తుంది. కష్టపడి పరమును చూడలేవు​. నీకు నీవే హద్దులను తెలుపు సంజ్ఞవు. (విడుదలకు నీ కృషియే ముఖ్యము).


వివరణముమనిషిని అల్లలాడించే  భొజన తాపత్రయము గురించి వేమన గారు ఇలా అన్నారు.

. కడుపు కెంత నరులు కళవళపడుదురు
కడుపుకొఱకు నూళ్ళు గహనములును
కడుపు కెట్ల యయినఁ గలుగును భుక్తిరా
విశ్వదాభిరామ వినర వేమ.

భావము: మానవులు  కడుపు  ఎట్లైననూ నిండునని గ్రహింపక, ఒక్క ముద్ద అన్నము కోసము  ఊళ్ళన్నీ తిరుగుచూ దూరరాని కంతలలో దూరుచూ కళవళపడుతూ జీవితము వ్యర్ధము చేసుకొందురు.​

విశేష  భావము:   మానవుడా!! ఒక భోజనము తరువాత ఇంకో భోజనం కోసము ఆరాటపడుతూ గడిపేస్తావుఎంత తరచి చూచినా మనిషి జీవితములో బురదే కాని వేరేమీ లేదునిన్ను నీవు తెలుసుకోడానికి కష్టపడలేవు(విడుదలకు నీ కృషియే ముఖ్యము).


కరపేవు కఱతలే మఱపేవు మమతలే

కరకఱ విడువవు కలియుగమా

తెరచీర మఱఁగింతే తెరువేల మూసేవు

గరుసేల దాఁటేవో కలియుగమా  ॥కలలోని॥

 

ముఖ్య పదములకు అర్ధములు: కరపేవు = చేసేవు; కఱతలే = దుండగములే, చెడ్డ పనులే; మఱపేవు = కపటవర్తనము కలిగియుండు, సంశయించు; కఱకఱలే = పళ్లునూరటం, పళ్లుకొరకటం, ఒరయుట తఱుఁగుట  సూచించు ధ్వన్యనుకరణపదము; తెరచీర= పరదా; తెరువేల = దారి ఏల; గరుసేల దాటేవో = మర్యాద ఎందుకు మీరేవో;

 

భావము: మానవుడా!! దుండగపు  పనులలో మునుగుతూ, మమతలలో భ్రమించుతూ, పళ్ళు నూరుతూ గడిపేస్తావు.  మర్యాద మీరుతూ, తెరవెనుక​ (ఉండే మోక్షమునకు) దారి మూసుకుంటూ వెళుతూ గుడ్డిగా జీవితం సాగిస్తావు

వివరణము

కఱకఱలు అనగా పళ్లునూరటం అనుకుంటే తినడంలోనే మనిషి ధ్యాస ఉంచుతాడని చెప్పకయే చెప్పారు; కఱకఱలు అనగా పళ్లుకొరకటం అనుకుంటే తనను ఇతరులనూ నిందించు కోవడములోనే సమయము వృధా ఐపోతుంది అని అన్నారు.

మనము ఏమేమి మర్యాదలను అతిక్రమిస్తామండి.

అందరూ సమానము అన్నది అంతరంగము నుండి అంగీకరింపము

ప్రకృతి నీయమములను పాటించమండి.

చాలా రోజుల క్రితం ఒక అంతర్జాల గూడులో చదివిన గుర్తు. "ఈ పిగ్మీలు (ఆఫ్రికాలో) వారి పొట్ట పోసుకునేందుకు మాత్రమే జంతువులను చంపుతారు.

మేము (తెల్లవారము) మా కోరికలు / వినోదం / వ్యాపారం కోసం జంతువులను చంపుతాము. వారు (పిగ్మీలు) ప్రకృతికి లోబడి వర్తిస్తారు. మేము ప్రకృతికి విరుద్ధంగా వర్తిస్తాం.

వారు ఈ అడవిలోని జంతువులకు న్యాయమైన వారసులు. మేము ఈ సహజ వనరులను వాడుకొనే వారము "

ఈ రకముగా ఆలోచించుకుంటూ పొతే చిన్న చిన్న పొరపాట్లతో మనము అనేక సహజ న్యాయములను కాలరాస్తున్నామని తెలుస్తుంది.

తెరచీర మఱఁగింతే తెరువేల మూసేవు: 1915లో హిల్మా ఆఫ్ క్లింట్ వేసిన స్వాన్ నెం.10 పెయింటింగ్ గురించి ఇక్కడ చర్చించుకుందాము. ఆమె చిత్రించిన ఈ హంసలు#1 మనిషిలోని చైతన్యము, విమోచనముల సంబంధమును సూచిస్తాయి. ఇప్పుడు ఈ పెయింటింగ్'లో క్రింది భాగము యొక్క విలోమ పరావర్తనమును పై భాగములో చూస్తారు. క్రింది కుడి భాగము మధ్యలో చిన్న రంగురంగుల షడ్భుజాకారం, విశ్వ చైతన్యమను సముద్రములో మానవుని ప్రస్తుత స్థానాన్ని సూచిస్తుంది. 


తాపి
కాండ్లారుగురు = ఆరుగురు తాపి కాండ్లు = అనుసంధానము చేయువారు = కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు.

సత్యమును చిత్రము మధ్యలో రంగురంగులలో మరియు ఆకర్షణీయంగా ప్రకాశిస్తున్నట్లు చూపారు. మానవుడు సత్యము చేత ఆకర్షించబడతాడు. మనము మన ప్రస్తుత అస్తిత్వం (షడ్భుజి) చైతన్య సముద్రంతో ఒద్దికగాను ఆనుకూల్యముగాను, మైత్రి తోడను కలిసిపోదని గ్రహించము. ఈ షడ్భుజి "నేను" అను ఇప్పటి జీవితపు ఊహలచేత మన చేతలతోనే నిర్మించబడింది. "సత్యంతో ఏకత్వము మన స్థితి నుంచి కేంద్రానికి ప్రయాణం కాదు, కానీ మనమే సృష్టించిన కృత్రిమ సరిహద్దులను చెరిపివేసి అనంతమగు చైతన్యము నందు మిళితమగుటయే" అనేది చిత్రలేఖనం యొక్క గూఢార్థం.

కానిదె మెచ్చేవు కపటాలే యిచ్చేవు
కానీలే కానీలే కలియుగమా
పైనిదే వేంకటపతి దాసులుండఁగ
కానవా నీ విదేమి కలియుగమా     ॥కలలోని॥ 

భావము: మానవుడా!! మెచ్చరానిది మెచ్చి, కొరగాని కపటాలే  జీవితమని బతుకుతావు. కానీ, ఇక్కడి వేంకటేశుని దాసులను గుర్తించక ఎటో తిరుగుతావు.

వివరణము: After reading this stanza, I am reminded of the below quote by Boris Pasternak.

“The great majority of us are required to live a constant, systematic duplicity. Your health is bound to be affected by it if, day after day, you say the opposite of what you feel, you grovel before what you dislike and rejoice at what bring brings you nothing but misfortune.

Boris Pasternak in Dr Zhivago

చరణం చదువుతుంటే బోరిస్ పాస్టర్నాక్ గారి క్రింది సూక్తి గుర్తుకొస్తుంది.

మనలో చాలా మంది కపటమే జీవితమని గడుపుతారురోజూ నువ్వనుకునే దానికి వ్యతిరేకమైనది పలుకుతూ, నీకు నచ్చని దానికి సాష్టాంగ పడుతూ,  (మూర్ఖంగాదురదృష్టాన్ని సంతోషంగా స్వీకరిస్తూంటే, ఆరోగ్యంతో పాటు నీవు కూడా జీర్ణించిపోవా? 

పైనిదే వేంకటపతి దాసులుండఁగ : పైన ఇచ్చిన హంస చిత్రములో చూపినట్లుగా మనమొక "అహము" అను ద్వీపములో వసించుచుందుము. ఆద్వీపమునకు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు సరిహద్దులు గానో, గోడలుగానో పెట్టుకొని అందులో బందీలై వుందుము. ఆ చిన్న ద్వీపమునే ప్రపంచమని భావించుదుము. ప్రపంచ చైతన్యములో భాగులమవ్వము. మన జ్ఞానము నూతిలోని కప్ప వలె వుండును. అందువలన మనకు వేంకటపతి దాసులు కనబడరు. ఆ చిన్న ద్వీపమునకు హద్దులు చెరుపు బాధ్యత తీసుకొనము.

ఇక్కడ అన్నమాచార్యులు, “ఓ కలియుగమా! పైనకు కనబడుతూనే వున్నారు వేంకటపతి దాసులు వారు నీకెందుకు కనబడుటలేదు?” అని ప్రశ్నిస్తున్నారండి. వారు ఈ కీర్తనలో కూడా ఒకే ప్రపంచమున్నదని, మనము మనమే నిర్మించుకున్న  లోకములో నిమ్మగ్నులమై అసలు ప్రపంచమును గుర్తించమని అన్నట్లు అనిపిస్తుందండి.  

 

zadaz


No comments:

Post a Comment

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...