Saturday, 25 November 2023

T 189 ఓహో నిలిచిన దొకటిదియే

 అన్నమాచార్యులు

189 ఓహో నిలిచిన దొకటిదియే

For English version Press Here

క్లుప్తముగా: ఆ పరబ్రహ్మము సత్ (ఉన్నది) అనిగాని, అసత్ (లేదని) అనిగాని చెప్పబడదు - భగవద్గీత

 

కీర్తన సారాంశం:

పల్లవి: చివరి వరకు నిలుచునది ఒకటియే. శ్రీహరి సాకారచింతనము.

చరణం 1: పరమ ప్రామాణిక మైన పద్మాక్షుని నామము, ఈ పాపపు దేహము చేయు మజిలీలను హరించు ఔషధము. దాపుల నుండు పీతాంబరుని శరణాగతి జీవకోటిని ముంచి వేసియున్న అజ్ఞానమును పారద్రోలు దీపము.

చరణం 2: మహదానంద భరితమగు విందులు విష్ణుకీర్తనములు. జీవనపు దారిబత్తెము వంటిది వైకుంఠము.  హృదయంతో అచ్యుతుని పూజలు అధమ స్థానము నుండి అత్యధికమునకు నిచ్చెనల వంటివి.

చరణం 3: సంచీలో కనబడకుండా వుంచిన ధనము ఘనమైన కృష్ణభక్తి. దీనిని తాకిన వారికి పాపవిమోచనము కలుగును. అది చేపట్టినవారికి కొమ్ము కాచును.  శ్రీవేంకటేశ్వరు కృప యిట్టిది.  

విపులాత్మక వివరణము

 

ఉపోద్ఘాతము: అన్నమాచార్యుల ఈ కీర్తన అకస్మాత్తుగా, చెప్పాపెట్టకుండా మధ్యలో నుంచి ప్రారంభమైనదనిపించును. మానవ జీవితమూ అంతే. మొత్తము జీవనములో ఎదో కొంత భాగము మాత్రమే మనకు స్పష్టమగుచున్నది. దాని ముందర​, తరువాయి  భగవద్గీత 2-28లో చెప్పిన ప్రకారము అవ్యక్తములు.

"పద్మాక్షునామము అంచెఁ బాపహర మౌషధము" అని ఊగిసలాడు లోలకము వంటి జీవనము, మరణము అను మజిలీలతో కూడిన తప్త భరిత ప్రయాసము నుండి ముక్తి నిచ్చునదని చెప్పిరి. 

అధ్యాత్మ కీర్తన:

రాగిరేకు:  297-5 సంపుటము: 3-564

ఓహో నిలిచిన దొకటిదియే
శ్రీహరి సాకారచింతనము ॥పల్లవి॥
 
పంచమవేదపు పద్మాక్షునామము
అంచెఁ బాపహర మౌషధము
పంచలఁ బీతాంబరు శరణాగతి
ముంచిన యజ్ఞానమునకు దీపము ॥ఓహో॥
 
విందులకుడుపులు విష్ణుకీర్తనము
చందపు వైకుంఠ సంబళము
పొందుగ నచ్యుతుఁ బూజించు పూజలు
కిందటఁ గొనకెక్కెడి నిచ్చెనలు ॥ఓహో॥
 
కట్టిన ముడుపగు ఘన కృష్ణభక్తి
ముట్టిన పాపవిమోచనము
యిట్టే శ్రీవేంకటేశ్వరు కృప యిది
పట్టినవారికి బలువగు కొమ్ము ॥ఓహో॥

Details and explanations:

ఓహో నిలిచిన దొకటిదియే
శ్రీహరి సాకారచింతనము
॥పల్లవి

భావము:  చివరి వరకు నిలుచునది ఒకటియే. శ్రీహరి సాకారచింతనము

వివరణము: మనము ఒకటొకటిగా నిర్మించుకున్న ఈ పైపై ఆచ్ఛాదనలను తొలగించి చూస్తే, అసలు సిసలు మనిషి బయట పడతాడు. అతణ్ణి కూడా తరచి చూడగా కేవలము కరుడుగట్టిన అనేకానేక అభిప్రాయముల సమాహారం అని తెలుస్తుంది. ఈ రకముగా మానవుడు తనకు ఎటువంటి అస్థిత్వం లేని దానిని పట్టుకొని వ్రేలాడు చున్నానని యదార్ధంగా గ్రహించిన నాడు, కృత్రిమములను వదలివైచును.

అట్టివారికి ఈ ప్రపంచము కూడా తాను నిర్మించుకున్న దాని బట్టి వున్నదని తెలియును. కావున అట్టి  స్థితికి చేరిన యోగికి తనకు తానుగా వుండు అస్థిత్వం లేదని గ్రహించినప్పుడు గోచరమగు దానిని "ఓహో నిలిచిన దొకటిదియే / శ్రీహరి సాకారచింతనము" అని అన్నారు అన్నమాచార్యులు.

ఇది ఇక్కడ చెప్పినంత సులభంగా చేరగలిగినది కాదు​. దీనిని మాగ్రిట్ గారు వేసిన Le grand matin  (= ఉత్తమ ఉదయం) ఒక అద్భుతమైన అధివాస్తవిక చిత్రం (క్రింద చూపిన చిత్రం) ద్వారా తెలియ పరచుకుందాము.

మనకు ముందుగా ఒక పెద్ద ద్వారము, దానికి తగిన దార్ఢ్యము గల గోడ, ఆ తలుపులో నిర్దిష్ట ఆకారము లేని పెద్ద కన్నము కనబడతాయి. . అంత పెద్ద భాగము నష్ట​ పోయినా కూడా ఆ తలుపు చెక్కుచెదర లేదు. ఆ గడపకు ఆవల సముద్రము, ఆకాశము అగపడును.

ఈవైపు   మనము ఒక బిల్బోక్వెట్'ని వెనుక నుండి చూస్తున్నాము. బిల్బోక్వెట్ ఆ తలుపు వైపు చూస్తూ నిలబడి వుంది. ఈ రెంటికి మధ్య తలుపుకు కుడి ప్రక్కన ఆకుపచ్చని ఆకులు లాగా అనిపించు పక్షుల గుంపు  వుంది.

ఈ అధివాస్తవిక చిత్రం మాగ్రిట్ గారు ఏమి చెప్పదలచుకున్నారో ఆలోచింతము. బిల్బోక్వెట్ ఒక మానవునికి ప్రతీక. ముందుగా ఆ ద్వారము ఒక విశిష్టమైన మార్పును సూచించు చున్నది. పుట్టుట లేదా పోవుట అనుకోవచ్చు. ఆ ద్వారమునకు ఆవల సముద్రము, ఆకాశము తమ తమ ప్రవృత్తులను తెలుపక, మనకు ఆవల (మరణము)  కానీ, ఈవల (జీవనము) కానీ ఒకే విధంగా, ఏమీ తోచనిదై వుండును.

ఆ బిల్బోక్వెట్'కు ఖచ్చితంగా రెండూ ఒకే విధంగా, అగమ్యమై వుండును.ఈ రకంగా దైవమును​ తెలియుటకై చేయు యత్నములు (ఆ ద్వారములో చేసిన పెద్ద కన్నము వేసినప్పటికీ) క్రొత్తగా ఏమి తెలుపలేవు.

ఈ ప్రపంచమున తెలిసినవి, తెలియనివి కూడా ఒకే కోవకు చెందినవని గ్రహించి, అట్టి వానిని త్యజించి చూచిన నిలిచియుండునది సత్యము ఒకటియేఅక్కడ చూపిన పక్షులతో లోకములో ఈ వైపున వుండి సత్య మార్గమున పయనించు వారిని అపహసించు లోకులను సూచించిరి. (వాటికి ఆకుపచ్చ రంగుని వేసినది ఈర్ష్యా గుణమును ఆపాదించుటకే). ఆ పక్షులు గాలిలో కాకుండా భూమి మీద మొక్కల్లాగ చూపి అవి పాతుకుపోయిన భావనలతో సతమతమౌతున్నయని చూపారు. (ఇంకా ఆసక్తి గలవారు దీనిని హిల్మా యాఫ్  క్లింట్ వేసిన పదియవ హంసతో పోల్చి చూడండి).

ముక్తి మార్గమున వున్న మానవునికి తాను అను అహమునకు, ‘మిథ్య అను ఈ ప్రపంచమునకు రుజువులు కానీ, సాక్ష్యములు కానీ చూప నవసరములేదు. అందుకే అన్నమాచార్యులు, ఎటువంటి ప్రస్తావన కూడా లేకుండా ఓహో నిలిచిన దొకటిదియే" అన్నారు. 

పంచమవేదపు పద్మాక్షునామము
అంచెఁ బాపహర మౌషధము
పంచలఁ బీతాంబరు శరణాగతి
ముంచిన యజ్ఞానమునకు దీపము         ॥ఓహో॥ 

ముఖ్య పదములకు అర్ధములు: పంచమవేదపు = పరమ ప్రామాణిక మైన​; అంచెఁ = మజిలీ, రెండు మజిలీల మధ్య దూరం; పంచలఁ = దాపుల నుండు, దగ్గరగా నుండు; ముంచిన = ముంచివేసిన​.

భావము:  పరమ ప్రామాణిక మైన పద్మాక్షుని నామము, ఈ పాపపు దేహము చేయు మజిలీలను హరించు ఔషధము. దాపుల నుండు పీతాంబరుని శరణాగతి జీవకోటిని ముంచి వేసియున్న అజ్ఞానమును పారద్రోలు దీపము.

వివరణము: పంచమవేదపు పద్మాక్షునామము / అంచెఁ బాపహర మౌషధము: దీనితో మానవులకు జనన మరణములను మజిలీల బాధ తప్పుతుందన్నారు. అసలు అన్నమాచార్యులు పాప పుణ్యములను వానిని ఎక్కువగా ప్రస్తావించక సూటిగా భగవత్తత్వమును చెప్పు విధానము ఆనాటి పండితులకు నచ్చి వుండదు. అందుకే వారి కీర్తనలు నాలుగు శతాబ్దాల పాటు మరుగున పడి వుండిపోయినవి. 

మనకు సూటిగా చెప్పిన దానికంటే  తీయని తేనెలు చల్లిన మాటలకే విలువ ఎక్కువ​. చేయుట కంటే, చేస్తే ఏమౌతుందనే దానిపైన చింతన ఎక్కువ. ఆశించి చేయునది అది తృప్తి కానీండి, వస్తువు కానీండి, ఎదో ఒక మనో వ్యాపారమే. దీనితో మనము త్రోవ తప్పుటకు అవకాశాలు ఎక్కువౌతాయి. 

విందులకుడుపులు విష్ణుకీర్తనము
చందపు వైకుంఠ సంబళము
పొందుగ నచ్యుతుఁ బూజించు పూజలు
కిందటఁ గొనకెక్కెడి నిచ్చెనలు ॥ఓహో॥ 

ముఖ్య పదములకు అర్ధములు: విందులకుడుపులు = మహదానంద భరితమగు విందులు; సంబళము = దారిబత్తెము, జీతము; కిందటఁ = మనమున్న చోటు (అధమ స్థానము) నుండి; కొనకెక్కెడి = చిట్టచివరిదాక ఎక్కు; అత్యధికమైనది అధిరోహించు. 

భావము:  మహదానంద భరితమగు విందులు విష్ణుకీర్తనములు. జీవనపు దారిబత్తెము వంటిది వైకుంఠము.  హృదయంతో అచ్యుతుని పూజలు అధమ స్థానము నుండి అత్యధికమునకు నిచ్చెనల వంటివి.

వివరణము:కిందటఁ గొనకెక్కెడి నిచ్చెనలు: మనము చాలా నిమ్న స్థాయిలో వున్నామని ఎట్లు చెప్పగలరు? భగవద్గీత 14-8 లోని "తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్" నుండి చెప్పవచ్చును. తక్కువ స్థాయి అన్నది మన ప్రజ్ఞకు సంబంధించినది కాదు. మన విషయ లౌల్యము వలన సంభవించునది. నిచ్చెనలు అన్నది కేవలము వూహకు అందునట్లు సుచించారు. ఎక్కడము కాదు. దిగవలెను. మనమున్న నిలకడలేని స్థితి నుండి స్థిర స్థితి చేరుకోవలెను.

దీనిని మనమున్న చేతన స్థితిలో సాధించలేము. అచేతన స్థితి మన స్వాధీనములో లేనిది. అనగా ఇది అత్యంత కఠినమైన కార్యక్రమము. ఈ విషయమై చింత చేయక పురోగతి సాధించ లేము. అందుకే అన్నమాచార్యులు గొడ్డేరేచిన్నదిడ్డితెరువు వోక / దొడ్డతెరువువంక తొలఁగుమీఅని అతి క్లిష్టమైన ఇరుకుదారిని - జీవనము మరణము నకు మధ్య​, చేతనము అచేతనముల సంధించు సన్నని కాలి త్రోవను ప్రతిపాదించిరి.

అటు మరణము ఇటు జీవనము కానీ దానిని - భగవద్గీత  13-13 లో తెలియ జేసిరి. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వామృతమశ్నుతే । అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే ॥ 13-13 ॥ భావము: అర్జునా!! ఏది తెలియదగిన బ్రహ్మ స్వరూపమో, దేనిని తెలిసికొని మనుజుడు అమృత మయమగు మోక్షము పొందునో, దానిని వివరించు చున్నాను. ఆ పరబ్రహ్మము సత్ (ఉన్నది) అనిగాని, అసత్ (లేదని) అనిగాని చెప్పబడదు.

ఏదియేమైనప్పటికి, ఇది జీవన్మరణముల సంధికాలము అని చెప్పవచ్చును. మరణము అను దానిపై స్పష్టమగు అవగాహన అత్యంతావశ్యకము. దీనిపై చర్చించుటకు చాల మంది విముఖతను చూపుదురు. దీనిని తెలియక ఎంత విచారణ జరిపినను వ్యర్థమే.

కట్టిన ముడుపగు ఘన కృష్ణభక్తి
ముట్టిన పాపవిమోచనము
యిట్టే శ్రీవేంకటేశ్వరు కృప యిది
పట్టినవారికి బలువగు కొమ్ము ॥ఓహో॥

ముఖ్య పదములకు అర్ధములు: (ముడుపు = ధనము); కట్టిన ముడుపగు= సంచీలో కనబడకుండా వుంచిన ధనము.

భావము:  సంచీలో కనబడకుండా వుంచిన ధనము ఘనమైన కృష్ణభక్తి. దీనిని తాకిన వారికి పాపవిమోచనము కలుగును. అది చేపట్టినవారికి కొమ్ము కాచును.  శ్రీవేంకటేశ్వరు కృప యిట్టిది. 

 

-x-సమాప్తము-x-

1 comment:

  1. అజ్ఞానవశమున బహిర్ముఖుడైన మనిషి భక్తిజ్ఞానవైరాగ్యముల ద్వారా తన నిజస్వరూపమేమిటో తెలిసికొనవలెనన్న జిజ్ఞాసతో అంతర్ముఖుడై సాధనచే అజ్ఞానతిమిరమును నశింపజేసి ఏకాగ్రస్థితిలో పరమాత్మయందు లీనమై, తన యొక్క అసలు స్వరూపమును తెలిసికొనిన క్షణంలో సర్వం బ్రహ్మమనే స్థితికి వచ్చినప్పుడు "నిలిచినదిది యొకటియే!శ్రీహరి చింతనమే " అనే తాదాత్మ్య స్థితిలో రమిస్తూ ఉంటాడు.
    ఆ శ్రీహరి నామజపమే భవసాగర తరణమని, జన్మరాహిత్యమునకు కారణమని, శ్రీహరి శరణాగతి యొక్కటే అజ్ఞానతిమిరమును హరించి, జ్ఞానప్రకాశప్రాప్తికి మార్గమని, హరిభక్తి యనే ధనపు సంచిని తాకినంతనే జన్మజన్మలలో చేసిన పాపతతిని నశింపజేసి ముక్తిని కలిగిస్తుందని, దానిని చెబట్టిన వారికి శ్రీహరి కృప, రక్షణ సదా ఉంటాయని అన్నమయ్య ఈ ఆధ్యాత్మిక కీర్తనలో సెలవిస్తున్నారు.
    ఓమ్ తత్ సత్ 🙏🏻🙏🏻🙏🏻
    కృష్ణ మోహన్

    ReplyDelete

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...