అన్నమాచార్యులు
188 ఇన్నిటికి నీశ్వరేచ్ఛ యింతేకాక
క్లుప్తముగా: "మనము ఈ ప్రపంచంలోనికి
(ఎక్కడినుంచో) రాము; మనము చెట్ల నుండి ఆకుల వలె ప్రపంచం నుండి బయటకు
వస్తాము. సముద్రంలో కెరటాలు పుట్టుకొచ్చినట్లు.
అలాగే విశ్వం నుండి ప్రజలు." ప్రతి
వ్యక్తి సమస్త సృష్టి యొక్క వ్యక్తీకరణ; అనంతము లోని పత్యేకతను
సంతరించుకున్నవాడే - అలాన్ వాట్స్.
కీర్తన సారాంశం:
పల్లవి: జరుగుతున్నవన్నీ ఈశ్వరాజ్ఞ ప్రకారమే. అంతేకానీ నీ ప్రమేయము లేదు. హరి దాసుఁడవైతే
చాలు,
తానే రక్షించును.
చరణం 1: మానవుడు ప్రకృతినే అనగ తాను ప్రత్యక్షముగా అనుభూతి
చెందగల దానినే పట్టి జీవనమును కొనసాగించును. దానికి విరుద్ధమైనది చెప్పబోతే వికటించునే
గానీ వినదలచుకోడు. ఈ రకముగా తన మదిలో ఎక్కివున్న అసత్యమును కొనసాగిస్తాడు. ఒకవిత్తు
వెట్టితే వేరొకటేల మొలచును? ఇప్పుడు అగపడుతున్నదానిని పైపైన మార్చ జూచిన వట్టిప్రయాసమే
కాదా?
చరణం 2: పాపముతో పుట్టిన ఈ శరీరము (మాట
వింటే) పాపమే చేయించును. మేలైన బుణ్యముతోవ ఎంతకూ పట్టదు. వేపచేఁదును వండితే అది బెల్లములా
తీయనౌనా? పైనిపైని
చేయు మన ప్రయత్నములన్నీ భ్రమలే కాని ఫలించనివే.
చరణం 3: ప్రపంచము నుండి వచ్చిన వారము. కావున ఈ ప్రపంచపు పోలికలతోనే వుందుము. అట్టి వారము మోక్షమును అంగీరించుదుమా? (=సమ్మతింౘము). శరణాగతుడగు భాగ్యవంతుడు శ్రీవేంకటేశుఁడు దయఁజూడఁగ అధికుఁడౌఁ గాక.
విపులాత్మక వివరణము
ఉపోద్ఘాతము: 'పాత చింతకాయ పచ్చడి' అనిపించు ఈ అన్నమాచార్యుల కీర్తన అద్భుతమైన విషయములను వెల్లడించు గని వంటిది. 'పరము' అనునది ఈ 'ప్రకటమగు' జగత్తుకు సంబంధించనిదై వుండాలి. లేనిచో ఎందరో అక్కడికి చేరుకునేవారు. కానీ అట్టి విశేషమైన స్థితికి చేరుకున్నవారు అతి కొద్ది మంది మాత్రమే. కాబట్టి అట్టి స్థితి మన ఇప్పటి విశ్లేషణకు అందదు అని చెప్పవచ్చును.
అనగా మనము 'పరము' గురించి విన్నవి, వ్రాసినవి ఊహించుకున్నవే తప్ప వాస్తవములు కావు. కావున మానవుడు ముఖ్యంగా తనకు తెలిసిన ఈ ప్రపంచమును మది నుండి బహిష్కరించ వలెను. ఈ కార్యములో ముఖ్యమైన ప్రతిఘటన స్వయముగా తన నుంచి వచ్చును. మాఱొడ్డునది తానే కనుక నిష్పాక్షికముగా పరిశీలించుట అసంభవమైనదే.
అధ్యాత్మ కీర్తన: రాగిరేకు: 222-4 సంపుటము: 3-123 |
ఇన్నిటికి నీశ్వరేచ్ఛ యింతేకాక
తన్నుఁ దానే హరి గాచు దాసుఁడైతేఁ
జాలు ॥పల్లవి॥ ప్రకృతిఁ బుట్టిన దేహి ప్రకృతి గుణమే కాని
వికృతి బోధించబోతే విషమింతే కాదా
వొకవిత్తు వెట్టితే వేరొకటేల మొలచును
ప్రకటమైన వట్టిప్రయాసమే కాక ॥ఇన్ని॥ పాపానఁ బుట్టిన మేను పాపమే సేయించుఁ
గాక
యేపునఁ బుణ్యముతోవ యేల పట్టును
వేపచేఁదు వండితేను వెస నేల బెల్లమవును
పైపై బలిమి సేసే భ్రమ యింతే కాక ॥ఇన్ని॥ ప్రపంచమైన పుట్టుగు ప్రపంచమునకే కాక
వుపమించ మోక్షమున కొడఁబడునా
ప్రపన్నుడైనవేళ భాగ్యాన శ్రీవేంకటేశుఁ-
డపుడు దయఁజూడఁగ నధికుఁడౌఁ గాక ॥ఇన్ని॥
|
Details
and explanations:
భావము: జరుగుతున్నవన్నీ ఈశ్వరాజ్ఞ ప్రకారమే. అంతేకానీ నీ
ప్రమేయము లేదు. హరి దాసుఁడవైతే చాలు, తానే రక్షించును.
వివరణము: ‘ఇన్నిటికి నీశ్వరేచ్ఛ’: చాలా మంది ఈ అల్లకల్లోలగా కనబడు ప్రపంచము నందు ఒక క్రమముగానీ, నీయమము
గానీ లేదనిపించునని అంటారు. వారి వాదములో వాస్తవమున్నదని
నమ్ము వారు కోకొల్లలు. అటువంటి వారికి
“ఇన్నిటికి నీశ్వరేచ్ఛ యింతేకాక” వంటివి మూఢ నమ్మకాలుగా
అగపడవచ్చును. కావున ఇది విచారించ తగ్గ అంశమే.
జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా ఈ గజిబిజి తింగరి లోకము నందు
మనసు పట్టలేని, తెలియలేని, కానరాని వరుస, సరణి
వున్నవని అనేక మార్లు ప్రకటించిరి. మనకు తెలియనంత మాత్రమున ఒక విషయము సరి కాదని నిర్ధారణ
చేయుటకూడా "ఆ చిందఱవందఱ జగము" లోని భాగమే అగును. మానవుడు
తాను నిర్ణయించలేని వాస్తవములున్నాయని గ్రహించడు.
తాను సాధించిన దానితో గర్వము కలిగి, అది చూపు పరావర్తనములో సత్యమును చూడజాలక వుండును. తన సామర్ధ్యమునకు మించిన
విషయమును ఒప్పుకొనుట జ్ఞానము. లేనిచో అవివేకము. కావున ఎటువైపుకు మొగ్గక సమస్థితిలో
వుండుటయే జ్ఞానము.
దాసుఁడైతేఁ జాలు: అన్నది కూడా కూలంకషముగా
విచారించవలెను. ఊరకనే ‘నేను హరిదాసుడనని’ చెప్పుకొను వారు హరిదాసులు కాజాలరు. భగవంతుడెవరో తెలియనివారు హరిదాసులు కాజాలరు.
ఒక ప్రక్క భగవంతుడు కనబడడని అంటూనే భగవంతుని తెలియమంటున్నారు? ఇది
విచిత్రముగాను అసంబద్ధముగాను వున్నది అనవచ్చును. ఔనండి. మనము మాట్లాడుచున్నది బాహ్య
చైతన్యము నందు లేనిదే. హరిదాసుడగుటకు ఒకే నీయమమున్నదండి.
మానవుడు తన అనుభవమునకు వచ్చు అన్నింటినీ తిరస్కరించుటయే.
కానీ మానవుని వేధించునది ‘తనకు తెలుసును’ అను స్వభావము. నేర్చినదానిని విడిచిపెట్టుట
లేదా మఱచిపోవుట ఒక్కటియే మానవుని విధి. ఇదియే అత్యంత కఠినమైన పరీక్ష. దీనికి మార్గములు
లేవు. మనసునకు నచ్చునట్లు చెప్పుట కాదండి, వున్నది
వున్నట్లు చెప్పిరి అన్నమాచార్యులు.
తన్నుఁ దానే హరి గాచు దాసుఁడైతేఁ జాలు: హరిదాసుడైనప్పుడు కదా! మిగిలినవన్ని జరిగేది. అందుకే అన్నమాచార్యులు ఇలా
అన్నారు "ముంద రెరిఁగిన వెనుక మొదలు మరచెదనన్న / ముంద రేమెరుఁగుఁ దా మొదలేల
మరచు"
భావము: మానవుడు ప్రకృతినే అనగ తాను ప్రత్యక్షముగా అనుభూతి
చెందగల దానినే పట్టి జీవనమును కొనసాగించును. దానికి విరుద్ధమైనది చెప్పబోతే వికటించునే
గానీ వినదలచుకోడు. ఈ రకముగా తన మదిలో ఎక్కివున్న అసత్యమును కొనసాగిస్తాడు. ఒకవిత్తు
వెట్టితే వేరొకటేల మొలచును? ఇప్పుడు అగపడుతున్నదానిని పైపైన మార్చ జూచిన వట్టిప్రయాసమే కాదా?
వివరణము: మానవుని ఈ విపరీతమైన స్థితిని చూపుతున్న
రెనె మాగ్రిట్ గారు వేసిన " లోపలి దృష్టి "(Le regard intérieur) పేరుతోవున్న అధివాస్తవిక చిత్రమును దర్శిద్దాము.
ఇక్కడ మనము ఒక ఎర్రని తెర, దాని ప్రక్కన ఒక పెద్ద అందమైన పచ్చటి ఆకును
స్పష్టంగా చూస్తాము. ఈ ఆకు అక్కడ వున్న పెద్ద కిటికిలో సింహ భాగాన్ని ఆక్రమించుకొని
వుంది. ఈ ఆకు ఈనెలలో చెట్టు మీద వున్నట్లు అందమైన పక్షులు కూర్చొని వుంటాయి. కిటికి
బయటకు చూస్తే చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. అదంతా ఏదో వెల వెల బోయినట్లు కొంచెం నేపథ్యం
లోకి జారుకుంటోందా అని అనిపిస్తుంది. చిన్న చిన్న చెట్లు కనబడతాయి. అక్కడొక కుడిపక్కగా
ఒక వాగు ప్రవహిస్తూ కనబడుతుంది.పెద్ద విశేషమైనవేమీ లేవు. ఆ కిటీకీలో పాక్షికముగా నిండిన
గ్లాస్ కూడా కనబడుతున్నది.
ఈ పెద్ద ఆకులోని పక్షులు మనమందించు పోషణకు
గుర్తులు. కిటికి మన అంతరంగము అనుకుంటే, ఆకు మన దృష్టి
పెట్టియున్న వస్తువు. నిజమునకు అన్నీ కనబడుతూనే వున్నా అవి చురుకైన స్థితిలో వుండవు. ఈ బొమ్మ ద్వారా. ”ఆ ఆకులాగానే మనకు కొన్ని విషయాలు మాత్రమే వెల్లడియౌను.
మీగిలినవి నేపథ్యంలోకి నెట్టివేయబడి స్ఫురణకు రావు” అని మాగ్రిట్
గారు చెబుతున్నారు. ఎన్నడూ లేని విధముగా ఆ అరకొర నిండిన గ్లాస్'ను చూపి ఆ విషయమును మరింత ప్రస్పుటము చేశారు.
ఈ రకముగా మనకు కొన్ని విషయములు మాత్రమే
స్పృహలో వుండి అవి మాత్రమే సత్యమనిపింప చేయు స్థితిని ప్రకృతి గుణము అన్నారు అన్నమాచార్యులు. ఇది మానవులందరికీ సామాన్యము. . .
ముఖ్య
పదములకు అర్ధములు: అంచె = వరుస; ఆకరము = సమూహము,
గని, ఉపమించ = ఎన్ను,
పోలించు; ఒడఁబడు= అంగీరించ (=సమ్మతింౘ);
ప్రపన్నుడు = శరణాగతుడు;
భావము: పాపముతో పుట్టిన ఈ శరీరము (మాట
వింటే) పాపమే చేయించును. మేలైన బుణ్యముతోవ ఎంతకూ పట్టదు. వేపచేఁదును వండితే అది బెల్లములా
తీయనౌనా? పైనిపైని చేయు మన ప్రయత్నములన్నీ
భ్రమలే కాని ఫలించనివే.
వివరణము: ‘పాపానఁ బుట్టిన మేను పాపమే
సేయించుఁ గాక’: అనునది తరువాతి చరణములో స్పష్టమగును. మానవుడు పుడుతూనే పాపి అనికాదు దీని అర్ధము.
మనమెరిగిన పాపములు పుణ్యములు మన వూహల వుయ్యాలలోనివే.
పరము ఈ ప్రపంచమునకు సంబంధించనిది మనకు తెలియది కావున దానిపై చేయు వ్యాఖ్యలన్నీ కేవలము
అభిప్రాయములు. వాస్తవములు కానేరవు. ఇట్టి స్థితి నుండి మనము చేయు నిర్ణయములన్నీ అజ్ఞానములోనివే
ఔతాయి.
ఈ విధముగా చూచిన 'వేపచేఁదు
వండితేను వెస నేల బెల్లమవును' అనునది ఎంతయును విచారించ తగ్గది. మనమందరమూ బయటి
విషయములను గ్రహించి లోపలకు చేరుటను, ఆ గ్రహించినది మన స్మృతిలోనికి
చేరుటను మునుపు చిత్ర పటములద్వారాను, ఉదాహరణములతోను నిర్ధారించితిమి.
కావున లోపలను. వెలుపలను వున్నది ఆ తిమిరమే.
చీకటి నుంచి ఖాయము చేయు కార్యములు చీకటికి లోనికి కాక వేరెక్కడకు దారితీయును?
పైన పేర్కొన్న దానిని పొడిగించిన
"పైపై బలిమి సేసే భ్రమ యింతే కాక" = పునాదిలేని గోడ వంటిది. అది ఏ క్షణములోనైనూ
కూలిపోవచ్చు అను అర్ధములో వ్రాసిరి.
ముఖ్య
పదములకు అర్ధములు: ఉపమించ = ఎన్ను, పోలించు; ఒడఁబడు= అంగీరించు (=సమ్మతించు);
ప్రపన్నుడు = శరణాగతుడు;
భావము: ప్రపంచము నుండి వచ్చిన వారము. కావున
ఈ ప్రపంచపు పోలికలతోనే వుందుము. అట్టి వారము మోక్షమును అంగీరించుదుమా? (=సమ్మతింౘము).
శరణాగతుడగు భాగ్యవంతుడు శ్రీవేంకటేశుఁడు దయఁజూడఁగ
అధికుఁడౌఁ గాక.
వివరణము: ఇక్కడ అలాన్ వాట్స్
గారి ప్రసిద్ధి చెందిన క్రింది పకటన ఎంతో సమర్ధనీయము. “We do not "come
into" this world; we come out of it, as leaves from a tree. As the ocean
"waves," the universe "peoples." Every individual is an
expression of the whole realm of nature, a unique action of the total universe.”
"మనము ఈ ప్రపంచంలోనికి (ఎక్కడినుంచో)
రాము; మనము చెట్ల నుండి ఆకుల వలె ప్రపంచం నుండి బయటకు వస్తాము. సముద్రంలో
కెరటాలు పుట్టుకొచ్చినట్లు. అలాగే విశ్వం నుండి ప్రజలు." ప్రతి వ్యక్తి సమస్త సృష్టి యొక్క
వ్యక్తీకరణ; అనంతము లోని పత్యేకతను సంతరించుకున్నవాడే
- అలాన్ వాట్స్.
అనగా మనమేదానితో చేయ బడితిమో అదియే మనలను
విరోధించునది. ఇట్టి అసంభవమగు పరీక్ష పెట్టినాడు దైవము. ఇటువంటి పరిస్థితులలో శరణాగతి కాక వేరేమి వుపాయము గలదని అన్నమాచార్యులు
ఘోషించున్నారు.
అన్నమాచార్యులు ఐదువందల సంవత్సరాల క్రితమే చెప్పినది అనేక మంది ఆధునిక తత్త్వవేత్తలు ప్రకటించుటను తలవని తలంపుగా సంభవించినది కాదు. వారి దార్శనీకతకు ప్రమాణము.
-x-x-x-
సృష్టిలో జరిగే ప్రతీదీ భగవంతుడి ఇష్టప్రకారం, ఆయన ప్రణాలిక, నియతి ననుసరించియే జరుగుతుంది.జీవులు నిమిత్తమాత్రములే.
ReplyDeleteహరిదాసుడనని చెప్పుకొనేవారు హరిదాసులు కాజాలరు. హరి నెఱిగి అంటే ఏకాగ్రభావముతో భక్తితో హరిని సేవించి తాదాత్మ్యము చెందిన భక్తులే హరిదాసులని, హరికి సన్నిహితులని అన్నమయ్య ఈ చరణంలో చెప్పుతున్నారు.
యోగమాయచే భగవంతుడు ఈ చరాచర జగత్తును సృష్టి చేశాడు.ఈ మాయ నుంచి మహాతత్త్వమును,తరువాత కాలం, ప్రకృతి,త్రిగుణములు, ఇంద్రియమనోబుద్ధులు, అహంకారచిత్తములతో సకల చరాచరములు జనించాయి.
ఇలా ప్రకృతి(మాయ)చే జనించిన జీవి త్రిగుణాత్మకమే గాని, వాటికి విరుద్ధముగా వికృతిని ఎంత ప్రయాసపడి బోధించినా బుద్ధికెక్కదు.అది వృధా ప్రయాసయే అవుతుంది.విత్తు ఒకటైతే విత్తుసారమే మొక్కకు వచ్చును కదా అంటారు ఆచార్యులవారు.
పాపజనితమైన ఈ దేహం ప్రేయోమార్గమునే ఇష్టపడుతుంది కాని శ్రేయోమార్గము వైపు దృష్టిని మరల్చదు.అందుకే చేసే ప్రయత్నములన్నియూ వృథాప్రయాసలుగానే మిగిలిపోతాయని, మోక్షసాధనకు మనస్సు అంగీకరించక ప్రాపంచిక భోగములయందే లగ్నమై ఉంటుందని, భగవంతుడికి త్రికరణ శుద్ధిగా శరణాగతి అయితే మోక్షం దరి జేరగలదని అన్నమయ్య అంటున్నారు.
ఓమ్ తత్ సత్ 🙏🏻🙏🏻🙏🏻
కృష్ణ మోహన్