అన్నమాచార్యులు
197. తనవారలు పెరవారలుఁ
వ్యాఖ్యానము: చామర్తి శంకర నాగ శ్రీనివాస్
ఉపోద్ఘాతము: చాలా సాధారణముగా కనబడు ఈ కీర్తనలో అన్నమాచార్యులు అనేక విషయములు ప్రస్తావించిరి. ఇందులో “జూపులఁ జురుచూండ్ల కెడమియ్యని” అను పదబంధమును వాడారు. ఇది మనము సర్వ సాధారణముగా, నిజ జీవితములో క్షణము కూడా చేయు పనిమీద విను దానిమీద ధారణమును, బుద్ధిని లగ్నము చేయలేని మన అశక్తతతను చూపుచున్నది.
అధ్యాత్మ సంకీర్తన రాగిరేకు: 37-3 సంపుటము: 1-229 |
తనవారలు
పెరవారలుఁ దాననియెడివాఁ డెవ్వఁడు
తనుగుణముల దిగవిడిచిన ధన్యుం డాతఁడె పో ॥తన॥
తెగఁబడి
మదనసముద్రము దేహముతోడనె దాఁటిన విగత భయుం డతఁ
డెవ్వఁడు వీరుం డెవ్వఁడొకో పగగొని
పంచేంద్రియముల ప్రాణముతోడనె బతికి జగదేకప్రీతుండగు
చతురుం డాతఁడెపో ॥తన॥ యేచిన
పరితాపాగ్నుల నేమియు నొవ్వక వెడలిన ధీచతురుం
డతఁడెవ్వఁడు ధీరుం డెవ్వఁడొకో చూచిన మోహపుఁ
జూపులఁ జురుచూండ్ల కెడమియ్యని రాచఱికపు
నెరజాణఁడు రసికుం డాతఁడెపో ॥తన॥ చావుకు సరియగు
ద్రవ్యవిచారపు తగులులఁ బాసిన పావనుఁ
డెవ్వఁడు బహుజనబాంధవుఁ డెవ్వఁడొకో శ్రీవేంకటగిరినాథుని
చిత్తములోపల నిలిపిన దేవసమానుఁడు
నాతఁడె ధీరుఁడు నాతఁడెపో ॥తన॥ |
తనవారలు పెరవారలుఁ దాననియెడివాఁ డెవ్వఁడు
తనుగుణముల దిగవిడిచిన ధన్యుం డాతఁడె పో ॥తన॥
ముఖ్యపదములకు అర్ధములు: పెరవారలుఁ = పరులు; దిగవిడిచి= త్యజించి, విసర్జించి.
భావము: తన వారెవ్వరు? పరులెవ్వరు? నేను అనువాడెవ్వడు? ఈ తనువు గుణములను త్యజించిన వాడే ధన్యుడు.
వివరణము: ఈ పల్లవిని చూస్తే మనిషికి తనకు పరులకు
వ్యత్యాసము లేక చూడవలెనని బోధించు చున్నట్లు అనిపించవచ్చును. ఈ రకముగా బోధనలతో ప్రజలు
బాగు పడిన, ఈ ప్రపంచమున బాధలేమియు
వుండెడివి కాదు. కానీ నిజ జీవితములో
మనమెంతయు భాధల ద్వారా ప్రయాణమునకు అలవాటుపడి, అవి లేక జీవనము
లేదు అను నిశ్చయమునకు వచ్చుదుము. ‘మన అవగాహన సరియైనదేనా?’ అని తిరిగి పరీక్షించుకోవలెను. బోధనల ప్రభావము కాలముతో తగ్గి మనిషి మరలా వెనకకు
వచ్చును. అందువల్ల బోధనలతో నిమిత్తములేని దానిని అన్నమాచార్యులు తెలియజేయుచున్నారు.
‘నేను’ అనునది మనసులో గాఢముగా నాటుకున్న అభిప్రాయము. మనిషి ‘నేను’ అను తెర
వెనుక నుండి ఈ ప్రపంచము చూచుటకు ప్రయత్నం చేస్తాడు. నేను’ అనునది
అనేక అభిప్రాయాల సమాహారం. వయసుతో పాటు వ్యక్తికి
ఈ అభిప్రాయం బలపడుతుంది. ఇది మనము ప్రత్యక్షముగా పరీక్షగా చూసి గ్రహించవచ్చు.
నేను వేరు ప్రపంచం వేరు అనే భావన తొలిదశలోనే రూపుదిద్దుకున్నది. కాబట్టి దీనిని సులువుగా సులభముగా కొట్టి వేయలేము. ఈ 'నేను'ను 'ౘుట్టుకొనియుండు ఆవరణము' నుండి 'ప్రపంచము'ను వేరు చేయి ప్రవృత్తియే మానవుని అన్ని బాధలకు మూలము. దీనిని ఇంకను పరిశీలించిన ఇది ఒక సెక్యూరిటీ నెట్ లాంటిది. ఆ రక్షణ కవచం వెనుక బాధలను ఎలాగో భరిస్తూ తనకంటూ తను కొన్ని హద్దులను నిర్మించుకుని, నిశ్చితమైన అభిప్రాయములతో మనిషి జీవనం సాగిస్తాడు.
అన్నమాచార్యులు చెబుతున్నది
ఈ రక్షణ కవచం పూర్తిగా తొలగించు క్రియ. అందుకనే వారు ‘దిగవిడుచు’ అను పదం వాడారు. అంతేకానీ ఎడమ చేతి జేబులో ఉన్న సరుకు కుడిచేతి వైపు జేబులోకి
మార్చుట కాదు. సరకును పూర్తిగా తొలగించుట. మహానుభావులుగా ప్రసిద్ధి చెందినవారు తమకు ప్రపంచమునకు
మధ్య దగ్గరి సంబంధాలతో జీవించారు. అంతేకానీ వారు ప్రజలనుంచి దూరముగా సౌధములలోను, కోటలలోను నివసించలేదు.
ఈ రకముగా ఆలోచించిన, మనను, ప్రపంచమును వేరు చేయునది మన వూహలు, అంతరంగములో నిర్మించుకున్న ప్రకృతి ప్రసాదించని
నిర్మాణములే. ‘తనుగుణముల దిగవిడిచిన ధన్యుం డాతఁడె పో’
అని అన్నమాచార్యులు “మనము అను వూహను” &
“తనువు అను దేహమును” కలుపువానిని సూచించారు.
అన్నమాచార్యులు ఈ కీర్తనలను
వ్రాసినది ప్రతి ఒక్కరు స్వయముగా ప్రత్యక్షముగా సత్యమును దర్శించుట కొరకే. అసలు మన
మనస్సులలో ఈ కీర్తనలొ వ్రాసిన భావనలుంటే ఏ దైవమును స్మరించ నక్కరలేదు. ఏ కొండా ఎక్కి
శ్రమించ నవసరంలేదు. కాబట్టి, వారు ప్రజలలో చైతన్యము
తీసుకుని రావడానికి శతవిధాలుగా ప్రయత్నించారు.
తెగఁబడి మదనసముద్రము దేహముతోడనె దాఁటిన
విగతభయుం డతఁ డెవ్వఁడు వీరుం డెవ్వఁడొకో
పగగొని పంచేంద్రియముల ప్రాణముతోడనె బతికి
జగదేకప్రీతుండగు చతురుం డాతఁడెపో ॥తన॥
ముఖ్యపదములకు అర్ధములు: తెగఁబడి = తెగించు, సాహసించు; చతురుండు = నిపుణుఁడు, నేర్పరి
భావము: కోరికల సముద్రమును ఈ
దేహము తోడనే సాహసించి దాటు భయములేని వాడెవ్వడు? ఆవీరుడెవ్వడో? నిరంతరము సాధించు పంచేంద్రియముల తోడనె బతికి జగదేకప్రీతుండగు
చతురుం డావీరుడెపో!
వివరణము: అన్నమాచార్యులు చెబుతున్నది చాలా సులభము
అనిపించవచ్చును. కానీ కోరికలలో కొట్టుకొనిపోవు మనలాంటి వారికి ఇది దాదాపు అసాధ్యమే.
అనేకులు ప్రయత్నించి మరలినారు. ‘అట్టివేళఁ గలఁగనీ దదివో వివేకము’ అను కీర్తనలోని క్రింది చరణం చూడండి.
భావము: ఒక్కొక్కవేళ సముద్రములన్నింటి ఉప్పెనలు ఒక్కసారి తాకినట్లు ఇంద్రియములు
తత్తఱపెట్టును. ఇంకో సమయంలో బడబాగ్ని రేఁచినట్లు మనస్సును ఓర్పు లేక తటాలున వచ్చు కోపముతో ఉడికించును.
అట్టి పరిస్థితులలో మానవుడు
వివేకముతో నుండ లేడన్నది వాస్తవము. ఇక్కడ భయము అనునది యేర్పరచి యెత్తుకోవడము వంటిది.
పూర్వానుభవములు కళ్ళముందర నాట్యము చేస్తూ మనలో చెప్పరాని ఉద్విగ్నతను పుట్టించి తెలిసిన మార్గములోనికి మనసును మళ్ళించును.
అట్టి పరిస్థితులలో మనిషి అత్యంత ఒత్తిడికి గురియై తనకు ముందే తెలిసిన మార్గమును ఎంచుకొనుటకు
సిద్ధమౌతాడు.
అన్నమాచార్యులు “తగు
మునులు ఋషులు తపములు సేయఁగ / గగనము మోచియుఁ గర్మము దెగదా” అన్నప్పుడు, విశ్వమును గదలించుట కాదు, తనను తాను ఎంచుకున్నమార్గము నుండి మరలించుకోకుండా
చూచుకొనుట ముఖ్యము. ఈ విషయమును గ్రహించలేక అనేకులు వృధాప్రయాసలకు లోనౌతూ దైవ కార్యము
నందు నిమ్మగ్నమైయ్యామని చెప్పుకొందురు.
జగదేకప్రీతుండగు చతురుండు: అట్టి
స్థితికి చేరుకున్న మాహాత్ములు సర్వులకు శుభమే కోరుకుంటారు. కాబట్టి జగదేకప్రీతుడు
అగునని అనుకోవచ్చును. చతురుడు, నిపుణుఁడు, నేర్పరి వంటివి ఎందుకు పేర్కొన్నారు? అట్టి దశకు చేరుకున్నవారికి ఇప్పటి వ్యక్తిత్వముతో సంబంధముండదు. (‘తనుగుణముల
దిగవిడిచిన ధన్యుం డాతఁడె పో’ అన్న పల్లవిని గుర్తు చేసుకోండి.) అట్టివాని మనసును
దైవమే నడుపును. వారి నైపుణ్యములకు హద్దులేవి?
ఇంత స్పష్టంగా వుంది కదా.
ఇకపై శ్రీవేంకటగిరినాథుని పూజింతము అని నిశ్చయము చేసికొన్నను లాభము లేదు. 1926లోనే
రెనె మాగ్రిట్ వేసిన ది బ్లడ్ ఆఫ్ ది వరల్డ్ (రక్తసిక్త ప్రపంచం) చూడండి. ఇందులో కాళ్ళు
చేతులు చిందవందరగా పడవేసి వుంటాయి. పాక్షికంగా కవర్ చేసిన గుండ్రని రూపాల ఆంతర్యము
కనిపెట్టడం కష్టమైనప్పటికి అవి మనలో వికృత కోణాన్ని ఆవిష్కరిస్తాయి. 1926లోనే రెనె మాగ్రిట్ గారు 'మాస్టర్' అనే
స్పష్టత వచ్చింది. ఈ బొమ్మ మనిషి అంతరంగము లేదా మనసు వంటిది.
ది బ్లడ్ ఆఫ్ ది వరల్డ్
ప్రేక్షకులకు స్పష్టంగా మరణాన్ని చూపించనప్పటికీ, ఇది మరింత భయంకరమైన రీతిలో మరణం క్రూరమైనదనే ఆలోచనను కల్పించి
మనసులో భయన్ని సృష్తిస్తుంది. మరణం మనలో ఉందనే భావనను కలిగిస్తుంది. బాహ్య ప్రపంచానికి కనిపించని అంతర్గత సమస్యల ఆలోచనకు
ప్రాతినిధ్యం వహిస్తుంది. దీనితో మనిషి అంతరంగమున శాంతియుతంగా ఉండలేడు. శాంతిలేనినాడు జీవితము ఇప్పటిలాగానే
కొనసాగుతుంది.
రాచఱికపు నెరజాణఁడు రసికుం డాతఁడెపో ॥తన॥
ముఖ్యపదములకు అర్ధములు: యేచిన = బాధించు, ఇబ్బందిపెట్టు, ఏడిపించు; జురుచూండ్లకు
= పీల్చుకొనుటలో; ఎడమియ్యని
= విరామమియ్యని, తెరపి యియ్యని;
భావము: ఇబ్బందిపెట్టుచున్న పరితాపాగ్నులతో బాధల నందక బయలుపడు ధీరుడు
చతురుడు ఎవ్వడో? మోహము తనను
అన్ని వైపులనుండి చూపులతో లాగుచున్ననూ, తన పరిశీలనలకు విరామమియ్యని వాడే రాజు, రసికుడు, నెరజాణ.
వివరణము: “జూపులఁ
జురుచూండ్ల కెడమియ్యని” ఏకగ్రత, మనసు, బుద్ధి లగ్నము చేయలేని మన బలహీనతను సూచించుచున్నది. దీనిని తీక్షణముగా
పరిశీలించవలెను. శాస్త్రములు, వేదములు ఏకాగ్రతను
బోధించుచున్నప్పటికీ మనము దాని అసలు రూపమును తెలియము. ఉదాహరణకు "హిమాలయములు"
అన్నారనుకోండి. వెంటనే మంచుకొండలు చల్లనిగాలి ఆహ్లాదకరమైన వాతావరణము మన వూహల్లోనికి
చొచ్చుకొని వచ్చి "హిమాలయములు" తరువాత పలికిన పదముల మీద లక్ష్యము కొంత తగ్గును.
అదేవిధముగా మనము చూచుదానిలో
ఏదోవొకటి మన మనస్సును ఆకర్షించును లేదా వికర్షించును. వీనిలో ఏది జరిగిననూ ఏకాగ్రత
భంగమై "జూపులఁ జురుచూండ్ల కెడమిచ్చుట” జరిగిపోవును.
అప్పుడు మనము దారితప్పిన వారమగుదుము. అన్నమాచార్యులు తన కాలములోనే కాదు, అనేక వందల సంవత్సరాల తరువాత కూడా విఙ్ఞానము
అభివృద్ధి చెండినదనుకుంటున్న ఈ కాలములో కూడా ఆశ్చర్యము, ఆసక్తి గొలుపు అనేక పరిశోధనములను, విచయములను మనకు అందించినారు.
చావుకు సరియగు ద్రవ్యవిచారపు తగులులఁ బాసిన
పావనుఁ డెవ్వఁడు బహుజనబాంధవుఁ డెవ్వఁడొకో
శ్రీవేంకటగిరినాథుని చిత్తములోపల నిలిపిన
దేవసమానుఁడు నాతఁడె ధీరుఁడు నాతఁడెపో ॥తన॥
భావము: మరణముతో నమానమగు విషయ విచారణకు వుసిగొలుపు జంఝాటము తప్పించుకున్నవాడే పావనుడు, బహుజనబాంధవుడు. శ్రీవేంకటగిరినాథుని చిత్తములోపల
నిలిపినవాడే దైవసమానుడు, ధీరుఁడు.
వివరణము: “చావుకు సరియగు ద్రవ్యవిచారపు తగులులఁ
బాసిన / పావనుఁ డెవ్వఁడు”: అన్నమాచార్యులు
"ద్రవ్యవిచారపు" అను దానితో Materialistic
Thinkingను సూచించారు. తిరిగి (‘తనుగుణముల దిగవిడిచిన ధన్యుం డాతఁడె
పో’) అన్నదానిని పరిగణించండి. వీటిని "చావుకు సరియగు' అని వర్ణించి, వాటి దుష్ప్రభావములను చెప్పిరి. ఐతే, అనుకున్న మాత్రమున
వీడలేమన్నది సూచించుచూ "తగులులఁ బాసిన / పావనుఁ
డెవ్వఁడు" అన్నారు. ఏక వచనముతో అట్టివారు బహు అరుదుగా పుట్టుదురని
తెలియపరిచారు.
“శ్రీవేంకటగిరినాథుని
చిత్తములోపల నిలిపిన / దేవసమానుఁడు నాతఁడె ధీరుఁడు నాతఁడెపో”: అయ్యలారా!
మనమెవరమూ నిజముగా శ్రీవేంకటగిరినాథుని చూసి కూడా వుండలేదు. ఇక వారిని చిత్తములో నిలుపు
ప్రశ్నయే వుదయించదు.
మన మనస్సులలో శ్రీవేంకటగిరినాథుని
చూడవలెననే కోరిక కన్నా, అందుకు మనము చేయవలసిన మన అంతరంగములోని నిర్మాల్యమును
తొలగించుకొనుటకు ప్రయత్నము లేక, మనకు రెండు ప్రపంచములు కనబడును.
శ్రీవేంకటగిరినాథుని చూచుట కత్తి మీద సాము వంటిది. రెండు ప్రపంచములలో ఒకటి మిథ్య.
ఒకటి నిజము. మిథ్య వున్న దగ్గర సత్యముండదు. మిథ్యను దిగవిడుచుటకు మనము జంకుదుము. ధీరులైనవారు
మిథ్యను పరిగణించక శ్రీవేంకటగిరినాథుని వెంబడింతురు.
అన్నమాచార్యులు అనేక మార్లు
రెండు ప్రపంచములు లేవని, వున్నది ఒకటే, మన కళ్ళముందరున్న ప్రపంచమని ఘోషించారు.
అనగా శ్రీవేంకటగిరినాథుని జీవించి వుండగానే తెలిసి చిత్తములో నిలుపినవారు సమస్తమును
వదలి అటువైపు పయనింతురు.
కానీ అట్టి ప్రయాణము అత్యంత
సాహసోపేతమైనది. మానవులకు అసాధ్యము. అందుకే ఆత్మ సమర్పణము చేయవలెను అన్నది సిద్ధాంతాత్మకము
కాదు (not a theoretical submission). నిజముగా, వాస్తవముగా
చేయు కార్యము. ఆ అగ్ని పరీక్షకు తాళలేక వెనుదిరుగువారు అనేకులు.
ఇందులో ఇంకొక రహస్యమును
కూడా తెలియెజేసారు అన్నమాచార్యులు. ఆ రకముగా శ్రీవేంకటగిరినాథుని దర్శించినవాడు దేవసమానుఁడు
అగును. అనగా మానవుని ఎదుట రెండే మార్గములు కలవు. ఒకటి శ్రీవేంకటగిరినాథుని తెలియుట. రెండవది మన ఇప్పటి దీన స్థితిని కొనసాగించుట.
-X-X సమాప్తము X-X-