తాళ్లపాక అన్నమాచార్యులు
225.
వేసరితేనే లేదు విచారించితేఁ గద్దు
For English version
press here
ఉపోద్ఘాతము
ఈ అన్నమాచార్యుల
కృతి ఒక విస్ఫోటనం —
ఇది నిశ్శబ్దంగా
పేలే ఒక అంతరంగ అగ్నిపర్వతం.
ఒక భూకంపం.
అన్నమాచార్యులు
తేలికైన భాషలో లోతైన విషయాన్ని చెబుతారు —
సత్యం
శ్రమపడితేనో,
ఉపవాసాలతోనో, సాధనలతోనో లభించదని.
అది దూరంగా
వున్న పుణ్యక్షేత్రాల్లోను దాగి ఉండదు,
తపస్సు, ధ్యానం, పవిత్రత అనే మన ప్రపంచపు లెక్కలతో దానిని ముడిపెట్టలేము.
దైవమును
పూజలు పునస్కారాలు, నియమాల ద్వారా
కొలవమంటూ
పిలుపునివ్వదు —
అందుకు
విరుద్ధంగా వాటిని విడిచి చేయమన్న సాము.
అన్నమయ్య
చెప్పేది వేరే —
తనను
తానే మరచినప్పుడు,
అన్వేషణాపూర్వకమైన
మనస్సు నిశ్చలమయినప్పుడు,
మూసివేయబడ్డ
రహస్యపు తలుపులు తెరుచుకుంటాయి.
వైకుంఠం
అంటే ఎక్కడో ఉన్న లోకం కాదు.
జీవుడు
తన అసలైన స్థితిని గుర్తుపట్టిన అపురూప క్షణం.
అది మానవుడి
జ్ఞాపకాల్ని దాటి నిలిచే – మరణాతీతమైన జ్ఞానం.
అదే వైకుంఠం.
ఇది సామాన్య
జ్ఞాపకం కాదు. మరవగలిగేది కాదు.
ఆత్మకు
తెలిసిన సత్యం. అది మరణాన్ని దాటి నిలిచే జ్ఞానం.
కర్మలతో
భగవంతుని మెప్పించలేము —
ఆత్మసాన్నిధ్యంతో, అంతరంగ శరణాగతితో ఆయన్ను చేరవచ్చు.
ఇది అసలుసిసలు
మర్మం —
శ్రమ
కాదు, లోని చూపు;
విధానం
కాదు, వెనుతిరగకుండా కరిగిపోవడం.
అన్నమాచార్యులు
వాదించడు —
విసర్జించేస్తాడు-
అన్ని వాదాలను.
తన
కవిత్వంతో మన ప్రయత్న యుక్తమైన చిత్తాన్ని
ఆయుధరహితంగా మారుస్తాడు —
మొద్దుబారిన చిత్తము అజ్ఞానమను మోపును వదలి తేలికపడి
సర్వదిశలలలోను సర్వమును గ్రహించుటకు సమాయుత్తమగును.
ఆ స్పృహలేమి
లోనే ఆ రహస్యం తలుపు తీయబడతాయి.
అధ్యాత్మ కీర్తన
|
రేకు: 291-5 సంపుటము:
3-528
|
వేసరితేనే
లేదు విచారించితేఁ గద్దు
మూసినదిదే
కీలు ముంచి వివేకులకు ॥పల్లవి॥
యెవ్వరు
మనసులోన నిందిరేశుఁ దలఁచిన
అవ్వలఁ
బాయక వుండు నదియే వైకుంఠము
దవ్వులకు
నేఁగవద్దు తపము జపము వద్దు
యివ్వలనిదే
కీలు యెరిఁగినవారికి ॥వేస॥
నాలుక
నెవ్వరైనాను నారాయణుఁ బొగడిన
చాలి
యాతఁ డాడనుండు జగములూ నుండును
కాలమూ
నడుగవద్దు కర్మమూ నడుగవద్దు
పోలింపనిదే
కీలు పుణ్యమానసులకు ॥వేస॥
శ్రీవేంకటేశ్వరునిఁ
జేరి యెవ్వరు నమ్మినా
కైవసమై
యాతఁ డింటఁ గాచుకుండును
సావధానములు
వద్దు శరణంటేనే చాలు
భావింపనిదే
కీలు పరమయోగులకు ॥వేస॥
|
Details
and Explanations:
Chorus:
వేసరితేనే లేదు విచారించితేఁ గద్దు
మూసినదిదే కీలు ముంచి వివేకులకు ॥పల్లవి॥
వేసరితేనే
= శ్రమకలిగించితేను, విసుగుచెందితేను;
విచారించితేఁ గద్దు = by appropriate thinking it is
plausible; మూసినదిదే కీలు = this is the hidden pivotal
point; ముంచి వివేకులకు = one who is totally immersed.
Literal
Meaning:
విసుగుచెందితేను, శ్రమపడితేను —
సత్యం తాలూకు తలుపులు తెరుచుకోవు.
గంభీరమైన శ్రద్ధాసక్తులతో కూడిన విచారణతో మాత్రమే
అది తెలిసే అవకాశం ఉంటుంది.
ఇదే మూసివుంచిన రహస్యం —
వివేకంలో తన్ను తానే మరచి లీనమయ్యే వారికి
మాత్రమే తలపు తలుపులు తెరుచుకునే మర్మదర్శనము.
1st
stanza:’
యెవ్వరు మనసులోన నిందిరేశుఁ దలఁచిన
అవ్వలఁ బాయక వుండు నదియే వైకుంఠము
దవ్వులకు నేఁగవద్దు తపము జపము వద్దు
యివ్వలనిదే కీలు యెరిఁగినవారికి ॥వేస॥
Literal
Meaning:
ఎవరైనా —
ఇందిరేశుఁని తమ మనసులో నిజంగా స్థాపించుకుంటే,
ఆ అస్తిత్వం ఆజన్మాంతం.
అలా యథార్థంగా హరిని హృదయంలో నాటడమే — వైకుంఠం.
వైకుంఠం ఎక్కడో ఉన్న లోకమనే భ్రమను వదలాలి.
జపములు, తపస్సులు అవసరం కాదు.
ఈ మార్గంలో బాహ్య సాధనలూ, పుణ్య యాత్రలూ అనే మెట్లు లేవు.
ఈ మర్మాన్ని తెలిసినవారికే —
ఇక్కడే, భూమ్మీదే తలుపు కనువిప్పౌతుంది.
ఇహపరలోక రహస్యం బోధించేదొకటే.
2nd
stanza:
నాలుక నెవ్వరైనాను నారాయణుఁ బొగడిన
చాలి యాతఁ డాడనుండు జగములూ నుండును
కాలమూ నడుగవద్దు కర్మమూ నడుగవద్దు
పోలింపనిదే కీలు పుణ్యమానసులకు ॥వేస॥
Literal
Meaning:
ఎవరైనను —
నాలుకతో మనసారా నారాయణుని స్మరిస్తే,
ఆ పరమాత్మ అక్కడే వెలుస్తాడు.
ఆతనితోటే జగములున్నీ.
“ఎంతకాలం పడుతుంది?”, “ఎలా సాధించాలి?”
ఇవి కాల-కర్మల బంధితుల ప్రశ్నలు.
కాలమను పరిమితిని దాటి వున్న దానికి కాలప్రమాణమేల?
కర్మబంధమును వదిలించు దానికి — కర్మల దారి ఏల?.
మానవులుగా పోల్చుకోలేని ఒక రహస్యం —
పుణ్యమానసులకే తెలిసే విష్ణు-తత్యం.
వివరణము:
మనకు
శ్రీవెంకటేశ్వరునిపై నమ్మకము కేవలము పాక్షికము. అటువంటి స్థితిలో మనం ఎంత ప్రయత్నించినా
శ్రీ వెంకటేశ్వరుని పై నమ్మకం ఎంతో కొంత లోటుగానే అనిపిస్తుంది. మనకు భగవంతునిపై పూర్తి
నమ్మకం ఉన్నప్పుడు మిగిలిన విషయముల జోలికే పోము. సందేహాలు పక్కకు నెట్టివేయబడతాయి.
అలాంటప్పుడు భగవంతుడు కనపడకుండా ఎలా ఉంటాడు? దీనిని రెనే మాగ్రిట్ గారి "ది
లిజనింగ్ రూమ్" (1952) అను చిత్ర సహాయంతో
వివరించుకుందాం.
ఆలోచనలను ప్రేరేపించే ఒక కృతి: "Listening
Room" (1952) సాధారణమైన గదిలో పెద్ద ఆకుపచ్చని ఆపిల్, ఎంత పెద్దదంటే, దాదాపు మొత్తం గదిని ఆక్రమించి,
గోడలను, పైకప్పును అదిమి, కిటికీ నుండి బయటకు చూడ్డనికి కూడా అడ్డుకుంటునట్లుగా ఉంది."ఈ బొమ్మ,
మనం వాస్తవమని నమ్మే విషయాలనే సవాలు చేస్తుంది."మాగ్రిట్
వివరణలు ఇవ్వడానికి ఇష్టపడడు, బదులుగా వీక్షకుని తన స్వంత
ఆలోచనలను అన్వేషించమని ప్రోత్సహిస్తాడు. ఈ చిత్రంలో, అతను
దృశ్యమాన విరుద్ధతలను సృష్టించడం ద్వారా అవగాహన యొక్క పరిమితులను అన్వేషిస్తాడు.
అంతర్గత మరియు బాహ్య ప్రపంచాల మధ్య ఉన్న అస్పష్టతను ఇది సూచిస్తుంది. చివరికి,
"Listening Room" అనే పేరుతో సహా ఆలోచనలను ప్రేరేపించే ఒక
కృతి.
అవగాహనకు సవాలు: రెనే మాగ్రిట్ యొక్క లక్ష్యం మాగ్రిట్ లక్ష్యం
భౌతిక ప్రపంచం గురించిన సిద్ధాంతపరమైన దృక్పథాలను భగ్నం చేయడమే. అతను వీక్షకులను
వాస్తవికత మరియు వస్తువుల స్వభావం గురించిన వారి స్వయం ప్రేరిత అంచనాలను
ప్రశ్నించేలా చేస్తాడు.
ఆ
బొమ్మలో చూపిన గది మన మనస్సు లాంటిది. నిత్య జీవితంలో అనేకానేక ఊహలతో
(కాన్సెప్ట్ తో), ఇది ఇలాగే ఉండాలి అన్న వాదములతో
మనసంతా నింపుకుంటాం.
1. గదిలో గాలి చొర లేకపోవడం అంటే అవగాహన
ముందరికాళ్ళ బంధం. (ఆపిల్ వల్ల కిటికీ మూసుకుపోతే, మన ఆలోచనలు మన ఊహలచేత మూసుకుపోతాయి) ఆ స్థితిలో మన అంతఃచక్షువు కూడా
బంధించబడుతుంది.
2. ఆపిల్ ఎంత అందమైనదైనా — అది ఆటంకం: మనకు ఇష్టమైన
అభిప్రాయాలు, తత్వాలు, “నేను
పట్టుకున్నదే సత్యం” అన్న భ్రమ.→ కానీ
అవే సత్యమునకు అడ్డుతగులు గదులు.
3ఆ చిత్రం పేరు – – "Listening Room" అంటే
ఏమిటి? కానీ “బయటి శబ్దాలకి, లోపలి సత్యానికి మధ్య అడ్డుపడే మన ఊహల శబ్దమే వింటాం”.
4. పరస్పర దృష్టి – మాగ్రిట్ మరియు అన్నమాచార్యులు మాగ్రిట్ గారు మనలోని
అంతర్గత విరోధము అసలు దృశ్యాన్ని నిరోధిస్తుందని చెబుతున్నారు. అన్నమాచార్యులు సందేహాలు
సత్యాన్ని చూడకుండా అడ్డుకుంటాయంటున్నారు.
3rd
Stanza:
శ్రీవేంకటేశ్వరునిఁ జేరి యెవ్వరు నమ్మినా
కైవసమై యాతఁ డింటఁ గాచుకుండును
సావధానములు వద్దు శరణంటేనే చాలు
భావింపనిదే కీలు పరమయోగులకు ॥వేస॥
Literal
Meaning:
ఎవ్వరైనా —
శ్రీవేంకటేశ్వరుని పూర్తిగా
నమ్ముకుంటే,
ఆయన వారి వాడవుతాడు.
తనవారిని తానే కాపాడుతాడు.
“అదిగో అక్కడి నుంచి వస్తాడు”
అనే ఎదురుచూపుల సావధానములు పనికిరావు.
మనము మన పనిలో పూర్తిగా ఐక్యమై ఉన్నపుడు —
అతడు కనపడతాడేమో.
సత్యంగా శరణంటేనే చాలు.
ఈ మర్మం — తర్కాలతో చేరగలిగినది కాదు.
అది పరమయోగుల అనుభవంలోనే ఆవిష్కారమౌతుంది.
వివరణము: “సావధానములు వద్దు శరణంటేనే చాలు” = మనము మన పనిలో
పూర్తిగా ఐక్యమై ఉన్నపుడు — అతడు కనపడతాడేమో. జిడ్డు కృష్ణమూర్తిగారు
తన సోదరుడు చనిపోయి పట్టరాని దుఃఖంలో మునిగినప్పుడు, ఆయన ఆ
శోకము అనుభవిస్తుండగానే సత్య దర్శనము జరిగినది. అంతటి
దుఃఖంలోనూ ఆయన ఇలా అన్నారు “ఇప్పుడు నాకు మరింత స్పష్టంగా
తెలిసింది — జీవితంలో నిజమైన అందం ఉందని, నిజమైన ఆనందం
ఉన్నదని...”
“బాధను తట్టుకోవాలన్న సంకల్పం లేక, దానిని జయించాలన్న తపన కూడా లేక — బాధ ఉందన్న స్పృహే మరిచిపోయేంతగా పనిలోనైనా, విషాదంలోనైనా మనం పూర్తిగా లీనమయ్యేప్పుడే — సత్యం నిశ్శబ్దంగా మన ముందుకు వస్తుంది.”
x-x – సమాప్తం -x-x
మూసినదిదే కీలు - అద్యాత్మ సాధకుడికి గొప్ప పాఠము
ReplyDeleteదవ్వులకు నేఁగవద్దు తపము జపము వద్దు
ReplyDeleteయివ్వలనిదే కీలు యెరిఁగినవారికి|
పోలింపనిదే కీలు పుణ్యమానసులకు|
ఎంతటి ఆధ్యాత్మికభావముతో రచించితిరో
అన్నమయ్య ఈ కీర్తనను!
వివరణ సరళ సుందరము.
రినే మాగ్రిట్టే చిత్రం సత్యాన్వేషణలో మనసు
అడ్డంకియన్న అన్నమయ్య కీర్తనలోని
ప్రధానభావమును తేలికగా అర్థం చేస్తున్నది.
కృష్ణ మోహన్