Sunday, 22 February 2026

T-306 ఎక్కడి సుద్ది యీ భ్రమనేల పడేరు

 తాళ్లపాక అన్నమాచార్యులు
306 ఎక్కడి సుద్ది యీ భ్రమనేల పడేరు
For English version press here

ఉపోద్ఘాతము
వేలాది కీర్తనలలో అన్నమాచార్యులు భక్తిని బోధించరు;
కేవలం మనమున్న స్థితిని చూపుతారు.
ఈ స్థితి నుండే స్పష్టత ఎలా పుట్టుకొస్తుందో సూచిస్తారు.
భ్రమను ప్రశ్నిస్తారు.

మనము తరచుగా ఆధ్యాత్మిక విషయాలను వింటూ, మాట్లాడుకుంటూ,
ఒక స్పష్టత ఉందని భావించుకుంటాము.
భ్రమలను పట్టుకొని ఉండడం, జారిపోతున్న బిడ్డ కాలి కడియమునో, చేతి ఉంగరమునో పట్టుకొనుట వంటిది —
అవి ఏ క్షణంలోనైనా జారిపోవచ్చును.

ఈ స్థితి దేవతలకు, మునులకు, సిద్ధులకు, గంధర్వులకు 
కూడా వర్తించునని చెబుతారు.
మన ప్రస్తుత జీవనము — 
ఈ దేహము అనే గుర్తింపుతో కాలాన్ని గడపడం మాత్రమే.

హరి” కూడా ఇక్కడ ఒక ప్రతీకగానే నిలుస్తాడు.
ఈ విధంగా చూస్తే, మన నిర్మాణమంతా 
పేకమేడల వలె సున్నితంగా పేర్చి వున్నది;
చిన్న గాలికే కూలిపోవును.

అప్పుడే కవి ఒక కఠినమైన ప్రశ్నను ముందుంచుతారు:
అక్కటా వో దేహులాల హరినే తలఁచరో?”
భ్రమలతో నిర్మించుకున్న దేహధారులారా —
మీరు వాస్తవముగా హరిని తలచ గలరా? 

అధ్యాత్మ​ సంకీర్తన
రేకు: 222-5 సంపుటము: 3-124
ఎక్కడి సుద్ది యీ భ్రమనేల పడేరు
అక్కటా వో దేహులాల హరినే తలఁచరో           ॥పల్లవి॥

బలుదేవతలకునుఁ బాయదట వ్యామోహము
యిలపై నరులము నేమెంతకెంత
కలదట మునులకుఁ గడు రాగద్వేషాలు
చలనచిత్తులము మా జాడ యిఁక నేది              ॥ఎక్క॥

పరగఁ దొల్లిటివారు పంచేంద్రియబద్ధులట
నెరవుగా ముక్తులమా నేఁటివారము
అరిదిఁ బ్రపంచము మాయామయమట నేము
దురితవర్తనులము తొలఁగేమా           ॥ఎక్క॥

ఘన సిద్ధగంధర్వులు కడ గానలేరట
దినమత్తులము మా తెలివేఁటిది
యెనలేని శ్రీవేంకటేశ్వరు శరణుచొచ్చి
మనువార మింతేకాక మరి గతియేది   ॥ఎక్క॥
Details and Explanations:
పల్లవి:
ఎక్కడి సుద్ది యీ భ్రమనేల పడేరు
అక్కటా వో దేహులాల హరినే తలఁచరో పల్లవి  
              Telugu Phrase
Meaning
ఎక్కడి సుద్ది యీ భ్రమనేల పడేరు
సుద్ది” = మాట, వార్త, ఆధ్యాత్మిక చర్చ.
ఈ సంగతులు ఎక్కడ విన్నారు? వాని గురించి భ్రమనేల పడేరు
అక్కటా వో దేహులాల హరినే తలఁచరో
అయ్యో ఓ దేహధారులారా హరినే తలఁచరో"

సూటి భావము:
ఈ సంగతులు ఎక్కడ విన్నారు? వాని గురించి భ్రమనేల పడేరు అయ్యో ఓ దేహధారులారా!  హరినే తలఁచరో"

సూచిత భావము:
ఆ సంగతులు ఈ సంగతులు విని కాలము వృథా చేసుకోకండి. హరిని తలచని బదుకు — బదుకా?

గూఢార్థవివరణము:
ఎక్కడి సుద్ది”
కవి అడుగుతున్నాడు:
ఈ సుద్దులు ఎక్కడి నుండి వచ్చినవి?
మీ మదిలో ఏర్పరచుకున్న స్పష్టత నిజమా? ​
లేక వినినదాని పునరుక్తి మాత్రమేనా?

 “యీ భ్రమనేల పడేరు”
అనగా
వినిన మాటలను నిజమని నమ్ముట,
అనుభవం లేకుండానే ప్రకటించుట
తెలియని దానిని జ్ఞానమని భావించుట —
భ్రమలో పడుటే.

మనము భ్రమను ఎంచుకోము.
అందులో జారిపడతాము.

 అక్కటా వో దేహులాల”
ఇది ముఖ్యము.
మనము దేహముతో గుర్తింపు పొందినవారము.
ఇంద్రియాలు, స్మృతి, భయాలు, రక్షణ భావం —
ఇది మన ప్రస్తుత స్థితి.
ఈ స్థితిలో నుండే
మనము ఆధ్యాత్మిక స్పష్టతను ప్రకటిస్తున్నామా?
అన్నది పరిశీలించ వలెను.

 “హరినే తలఁచరో” — ప్రధాన బిందువు.
ఇక్కడ హరి ఇక్కడ ఒక సిద్ధాంత దైవము కాదు.
భ్రమల నిర్మాణానికి అతీతమైన దిశ.”
స్మృతితో నిర్మించబడని దిశ.
పునరావృతం కాని దిశ.
హరిని పొందుట కాదు —
భ్రమను గమనించుట​.
అడ్డుగా నిలిచిన నిర్మాణాన్ని చూడడం.
ఇది శరణాగతికి ఆజ్ఞ కాదు.
ఇది మౌన పరిశీలనకు పిలుపు.

నిర్మాణ సారం
పల్లవిలో మూడు దశలు:
1.     ప్రకటిత స్పష్టతను ప్రశ్నించుట.
2.     భ్రమను గుర్తించుట.
3.     మాటల, సంజ్ఞల​ నిర్మాణం దాటిన — సూటి దృష్టికి ఆహ్వానం. 

హరినే తలఁచరో”
అంటే —
నీకు హరికి మధ్య నిలిచిన
స్మృతి, మాట, అభిమానం, పాత్ర —
ఇవన్నీ గమనించగలవా?
ఆ స్పృహయే తలచుట.

ఇది భక్తి నినాదం కాదు.
ఇది ఆత్మపరిశీలనకు తలుపు.


మొదటి చరణం:
బలుదేవతలకునుఁ బాయదట వ్యామోహము
యిలపై నరులము నేమెంతకెంత
కలదట మునులకుఁ గడు రాగద్వేషాలు
చలనచిత్తులము మా జాడ యిఁక నేది              ॥ఎక్క॥

సూటి భావము:
అనేకమంది దేవతలకు కూడా వ్యామోహము అంటుకుని బయటకు రాలేని విషయము వింటాము. ఇక ఈ భూగడ్డపై ఉన్న సామాన్య మనుషులము మన స్థితి ఏమిటి? మునులు కూడా రాగద్వేషాలలో చిక్కుకొని అవస్థలు పడుతున్నారందురు. చలనచిత్తము గల మానవులము. మన మెంత​? (మనము ఆ అవ్యవస్థలలో చిక్కుకున్నామన్న సంకేతములను ఉపేక్షించువారము).

గూఢార్థవివరణము:
“బలుదేవతలకునుఁ బాయదట వ్యామోహము”
దేవతలు — అంటే ఉన్నత స్థితికి ప్రతీక.
"కలదట మునులకుఁ గడు రాగద్వేషాలు”
మునులు — అంటే సాధకులు, తపస్వులు.
 
సాధన, ఉన్నత స్థితి వగైరాలు వ్యామోహము, రాగద్వేషాలకు అతీతము గావు.
ఇకపోతే చలనచిత్తులము, మన పరిస్థితి ఏమీ?
సాధన, ఉన్నత స్థితి — ఇవి చిత్తస్థిరతకు హామీలు కావు. 

మహాభారతం, పురాణాల్లో దేవతలు, ఋషులు కూడా రాగద్వేషాలకు లోనవుతారు — ఇది యాదృచ్ఛిక కథనం కాదు. ఇది ఒక నిర్మాణ సూచన. మన మనస్సు సాధన, ఉన్నత స్థితి వంటివి ఉంటే హరిని చేరువగుట సులభమని ఒక నిర్మాణం కట్టుకొనును. ఇంకా ఆయా కల్పనలలో చిక్కుకొనును. మనస్సు తానే కట్టెలను పేర్చి తన ఊహలతో మంటలు రాజేసి,   కట్టెలను అంటి మంటలు పైకెగసినట్లు పైనున్న ఆ హరిని చేరుటకు మార్గములుగా భావించును. హరిని తలచుటకు అవే నిర్మాణములు అడ్డుగోడలుగా మారునని సూచన.

రెండవ​ చరణం:
పరగఁ దొల్లిటివారు పంచేంద్రియబద్ధులట
నెరవుగా ముక్తులమా నేఁటివారము
అరిదిఁ బ్రపంచము మాయామయమట నేము
దురితవర్తనులము తొలఁగేమా    ॥ఎక్క॥ 
Telugu Phrase
Meaning
పరగఁ దొల్లిటివారు పంచేంద్రియబద్ధులట
(పరగఁ దొల్లిటివారు = లోతుగా విచారించినవారు, మనము పెద్దలని ఒప్పుకొనువారు) మనము పెద్దలనువారికీ పంచేంద్రియబంధనము తప్పలేదని అంటారు.
నెరవుగా ముక్తులమా నేఁటివారము
పూర్తిగా ముక్తులమా నేఁటివారము?
అరిదిఁ బ్రపంచము మాయామయమట నేము
ఈ విశాలము, సంక్లిష్టము, కష్టసాధ్యము అగు ప్రపంచము. మాయామయమని అందుము మనము
దురితవర్తనులము తొలఁగేమా
పాపము కల్మషములతో వర్తించువారము. ఆ సంగతి తెలిసీ తప్పు ద్రోవ తొలగువారమా?

సూటి భావము:
మనము పెద్దలని గురువులని భావించువారు కూడా పంచేంద్రియబద్ధులని విందుము. వారూ, నేటి మనము పూర్తిగా ముక్తులమా? ఈ విశాలము, సంక్లిష్టము, కష్టసాధ్యము అగు ప్రపంచము మాయామయమని అందుము మనము. పాపము కల్మషములతో వర్తించువారము. సంగతి తెలిసీ ఆ ద్రోవ తొలగువారమా?

గూఢార్థవివరణము:
ఈ చరణం పల్లవిలోని “ఎక్కడి సుద్ది?”
అనే ప్రశ్నను స్పష్టముగా ప్రతిబింబిస్తుంది.
మనము గౌరవించే వారు —
విచారణ చేసిన వారు —
యోగులు —
వారికీ బంధనము తప్పలేదని వింటాము.
అయితే మనము ముక్తులమని భావించుటకు ఆధారమేమి?

అరిదిఁ బ్రపంచము మాయామయమట నేము
ఇక్కడ “నేము” అన్న పదము కీలకము.
ప్రపంచము మాయమని మనమే పలుకుతున్నాము.
అది ప్రత్యక్ష గ్రహణమా?
లేక వినికిడి పునరుక్తి మాత్రమేనా?
ఎక్కడి సుద్ది?”

దురితవర్తనులము తొలఁగేమా
ప్రపంచము మాయమని పలుకుచున్న మనలో —
మార్పు కలిగిందా?
సంగతి తెలిసీ ఆ ద్రోవను విడిచితిమా?
లేక ఆ వినికిడి లోపల చేయు సమ్మర్దములో చిక్కుకున్న వారమా?

నిర్మాణ సారం
ఈ చరణం కూలగొట్టునది:
1.     పెద్దలపై ఆధారము
2.     ముక్తి భావనపై ఆధారము
3.     తత్త్వ వాక్యములపై ఆధారము
4.     మాటలతో వచ్చిన ఆత్మసంతృప్తి

మిగిలేది —
మాటలకతీత పరిశీలన.


మూడవ​​ చరణం:
ఘన సిద్ధగంధర్వులు కడ గానలేరట
దినమత్తులము మా తెలివేఁటిది
యెనలేని శ్రీవేంకటేశ్వరు శరణుచొచ్చి
మనువార మింతేకాక మరి గతియేది              ॥ఎక్క॥
Telugu Phrase
Meaning
ఘన సిద్ధగంధర్వులు కడ గానలేరట
మహాసిద్ధులు, గంధర్వులుకూడా పూర్తిగా ఎదో ఒక చివరను (ఆదిని గాని అంతమును గానీ) కానలేరట​
దినమత్తులము మా తెలివేఁటిది
వెలుగులో కనిపించిన భాగానికే పరిమితమై అదే సత్యమనే నిషాలో తిరిగే మన తెలివి ఏపాటిది?
యెనలేని శ్రీవేంకటేశ్వరు శరణుచొచ్చి
ఎంచలేని అపారమైన, వేంకటేశ్వరుని శరణుచొచ్చి
మనువార మింతేకాక మరి గతియేది
బ్రదుకువో బదుకు. అదికాక మరి గతియేది.
సూటి భావము:
మహాసిద్ధులు, గంధర్వులుకూడా పూర్తిగా ఎదో ఒక చివరను (ఆదిని గానీ అంతమును గానీ) కానలేరట. పగలు (అను ముందటి వెలుగు) పూర్తిగా క్రమ్ముకొనగా, దానినే సత్యము అని భావించే మన తెలివి ఏపాటిది? ఎంచలేని అపారమైన, వేంకటేశ్వరుని శరణుచొచ్చిన బ్రదుకువో బదుకు. అదికాక మరి గతియేది.

గూఢార్థవివరణము: 
దినమత్తులము మా తెలివేఁటిది

దినము” — వెలుగు, స్పష్టంగా కనిపించేది.
మనకు ఎరుకకు వచ్చేది.

అయితే మన గ్రహణము ఎప్పుడూ సంపూర్ణం కాదు.
అది ఒక భాగము మాత్రమే.

అయినప్పటికీ ఆ భాగాన్నే సంపూర్ణమని నమ్మి
దానిలోనే తిరుగుతూ ఉండుట — మత్తు.

తెలిసిన దానిపైనే ఆధారపడి
తెలియనిదానిని విస్మరించుట — ఇదే దినమత్తు.

సిద్ధులు కూడా పూర్తిని గ్రహించలేరని చెప్పిన వెంటనే
మన తెలివి స్థాయి ప్రశ్నించబడుతుంది.

అదీ తెలివేనా?

సత్యాసత్యముల సంఘర్షణలో
తెలిసిన దాని మత్తుకు,
తెలియనిదానిని కనుగొను ప్రయత్నమునకు
తావివ్వనిది ఏదైనా ఉందా?


 

దినమత్తులము మా తెలివేఁటిది
అనేది ఒంటరి వ్యాఖ్య కాదు.
ఇదే భావము ఇతర కీర్తనలలోను చూడవచ్చును.
మచ్చుకు కొన్ని క్రింద ఇస్తున్నాను
పంక్తి
సూచన
దినమత్తులము మా తెలివేఁటిది
వెలుగులో కనిపించిన భాగాన్నే సంపూర్ణమని భావించు తెలివి తెలివేనా?
తెల్లవారి నప్పుడెల్లా తెలిసితిననే గాని కల్లయేదో నిజమేదో కాన నేను
స్పష్టత ఉన్నదనుకున్నప్పటికీ సత్యాసత్యాలను విడదీయలేని స్థితి
చూచే చూపొకటి సూటిగుఱి యొకటి
చూచుట వేరు, సూటిగా గ్రహించుట వేరు
(చూపుల రేఖలు సరళరేఖలో వున్నా సూటిగా వున్నది వున్నట్లు చూడలేకున్నామేమి?​)

శరణుచొచ్చి”
ఇది ఓటమి కాదు.
అలసట కాదు.
భక్తి నినాదము కాదు.
ఇది:
తన పరిమితిని గుర్తించి
అపరిమితాన్ని నిర్వచించుటకు ప్రయత్నించకుండా
నిలుచుట.
అది మౌన స్థితి.

 “మరి గతియేది”
మొత్తం కీర్తన​ ఒక ప్రశ్నతో ముగుస్తుంది.
తెలివి పరిమితి తెలిసిన తరువాత
అపారత్వాన్ని కొలవలేనని గ్రహించిన తరువాత
ఇంక మార్గమేమి?

నిర్మాణం ఇలా నిలుస్తుంది:

ఉన్నత స్థితులు సంపూర్ణం కావు
మన తెలివి పరిమితం
అపరిమితము కొలవలేనిది
పరిమితి గుర్తింపు తరువాత — మౌన స్థితి


కీర్తన​ సారం
1.     ఆధ్యాత్మిక ఉన్నత స్థితులపై విశ్వాసం
2.     తెలివి పై అతిశయ నమ్మకం
3.     సత్యాన్ని పూర్తిగా గ్రహించగలమనే ధారణ

మిగిలేది —
పరిమితిని తెలిసిన స్పష్టత.
అదే శరణాగతి.

Bottom of Form


X-X-The END-X-X



No comments:

Post a Comment

T-306 ఎక్కడి సుద్ది యీ భ్రమనేల పడేరు

  తాళ్లపాక అన్నమాచార్యులు 306 ఎక్కడి సుద్ది యీ భ్రమనేల పడేరు For English version press here ఉపోద్ఘాతము వేలాది కీర్తనలలో అన్నమాచార్యులు భక్తి...