Friday, 21 August 2026

T-341 తరితీపులఁ బెట్టీని తనముందర నిప్పుడు

 తాళ్లపాక పెదతిరుమలాచార్యులు
341 తరితీపులఁ బెట్టీని తనముందర నిప్పుడు

పరిచయం 

తాళ్లపాక పెదతిరుమలాచార్యులు మనకు భోగమయమైన ప్రపంచముతో మనకు గల సంబంధాన్ని పరిశీలించమంటున్నారు. అతి సులభమైన ప్రశ్నలతో ఆ సంబంధం ఎంతవరకు నిజమైనదో, ఎంతవరకు అస్థిరమైనదో మనకు ప్రత్యక్షం చేస్తున్నారు. మన అవగాహనకు ఒక పరిమితి ఉంది. మనము దేనితో నిర్మించబడ్డామో, దాని స్వభావమే మన అవగాహనలోనూ కనిపిస్తుంది. అందువలన కవి వేసిన ప్రశ్నలను లోతుగా విచారించాలి. ఆ విచారణలో మన స్థితి మనకే స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఈ విచారణ ఇతరులకు చెప్పుటకు కాదు; స్వయంగా తనను తాను వీక్షించుటకు.

తాళ్లపాక కవుల ప్రత్యేకత అతి సరళమైన భాషలో అత్యంత సూక్ష్మమైన విషయాలను ప్రత్యక్షంగా చూపించుట. కేవలం పద్నాలుగు పంక్తులలో ఇటువంటి వీక్షణాన్ని కలిగించగలగడం అసామాన్యము. క్లిష్టమైన సమాసాల వెనుక దాగకుండా, శాస్త్రాల ఆశ్రయం లేకుండా, సాధారణ పదాలతోనే వారు చెప్పిన విషయాలు మనసుకు అందని లోతులను తాకుతాయి. నిర్మలమైన భక్తి ప్రాతిపదికగా వచ్చిన ఈ కీర్తనల విలువ వాటి స్థానం అగ్రస్థానమా కాదా అనే సాపేక్ష దృష్టిలో లేదు. వాటిని మనలో మనమే చూడగలిగినప్పుడే వాటికి సార్థకత కలుగుతుంది.

అధ్యాత్మ సంకీర్తన
రాగి రేకు: 46-4  సంపుటము - సంకీర్తన: 15-261
తరితీపులఁ బెట్టీని తనముందర నిప్పుడు
హరిమాయ యింకా నెంత ఆసల ముంచీనో      ॥పల్లవి॥

అన్ని వేడుకలు గల యఖిల ప్రపంచము
కన్నులు మూసితే నెక్కడ నుండునో
చెన్నుమీఱ గృహారామక్షేత్రాదు లవి యెల్లా
యెన్నఁగా నిద్రించేవేళ యేడ నుండునో           ॥తరి॥

వొసఁగ తా భోగించిన భోగోపకరణములు
యెసగఁ గొన కెక్కితే నేమి సేసునో
వనమైన పుత్రమిత్ర వర్గంబు లెల్లాను
వెసన వేరొక్క జన్మపువేళ నెట్టు లుందురో         ॥తరి॥

పరగఁ దాఁ జేసిన పాపము శ్రీవేంకటేశు
శరణాతుఁడైతే నే చందమగునో
అరుదైన తనతొంటి యజ్ఞానము లన్నియును
గురుకృపగలవేళ కొంచి యెందు దాఁగునో         ॥తరి॥
Details and Explanations:
పల్లవి:
తరితీపులఁ బెట్టీని తనముందర నిప్పుడు
హరిమాయ యింకా నెంత ఆసల ముంచీనో   ॥పల్లవి॥ 
భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
తరితీపులఁ బెట్టీని తనముందర నిప్పుడు
(తరితీపులఁ = ఉపేక్ష, ప్రేమ, కోరిక, ఆశంస, ఉద్ధృతితన ముందర ఉపేక్ష, ప్రేమ, కోరిక, ఆశంస, ఉద్ధృతి మొదలైనవాటిని ఇప్పుడు ఉంచి
ఉపేక్ష, ప్రేమ, కోరిక, ఆశంస, ఉద్ధృతి మొదలైన మానసిక కదలికలు ఈ క్షణంలోనే మన ముందర, మన కళ్ల ముందర జరుగుతున్నవి.
హరిమాయ యింకా నెంత ఆసల ముంచీనో
హరిమాయ ఇంకా ఎంత ఆశలలో ముంచిందో!
మన ముందే వ్యక్తమైన ప్రపంచము ద్వారా హరిమాయ మనలను ఇంకా ఎంతగా ఆశలలో ముంచుచున్నదో!
గూఢార్థవివరణము:
 
తరితీపులఁ బెట్టీని తనముందర నిప్పుడు” అనే పాదములో “ఇప్పుడు” అనే మాటను ప్రత్యేకంగా గమనించాలి. మాయ ఎప్పుడో జరిగినది కాదు; ఈ క్షణంలోనే మన ముందర పనిచేస్తున్నది. ఉపేక్ష, ప్రేమ, కోరిక, ఆశంస, ఉద్ధృతి మొదలైనవి మనకు బయట జరుగుతున్నవి కావు; మనలోనే జరుగుతున్న మానసిక కదలికలు.

ఇందులో ఉపేక్ష కూడా ముఖ్యమే. భగవద్గీత మూడవ అధ్యాయంలో మనము గమనించినట్లుగా, జరుగుతున్న పనులన్నీ ప్రకృతి ద్వారా జరుగుతున్నా, మనిషి తనను నడిపిస్తున్న ప్రకృతికి ఇచ్చే విలువ చాలా తక్కువ. మన పట్టికలో అది అట్టడుగున ఉంటుంది. ఈ ఉపేక్ష కూడా మాయలోని ఒక కదలికయే.

ఈ పల్లవి ఒక ఊటబావి వంటిది. ఎంత లోతుగా చూడాలని ప్రయత్నించినా కొత్త కోణాలు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. తరితీపులు మన ముందరే జరుగుతున్నట్లే, హరిమాయ కూడా మన ముందరే ఉంది. మాయ ఎక్కడో దాగి ఉన్నది కాదు.

“హరిమాయ యింకా నెంత ఆసల ముంచీనో” — మాయలో చిక్కుకున్న కొద్దీ ఆశలలో మరింతగా మునుగుతాము. మరి మాయ నుండి తప్పించుకొని దానిని తెలుసుకోవడం సాధ్యమా? ఇక్కడ మాయ అంటే ప్రత్యక్షంగా వ్యక్తమైనదే. ఆ వ్యక్తమైనదానికి స్వతంత్ర ప్రతిపత్తి లేదని గమనించమంటున్నాడు కవి.

ఈ రకముగా ప్రపంచంలో ప్రతి ఒక్కరు వ్యక్తమైన దానిని చూచి దానిని పరికించి అదే  తెలియగల సత్యము అని భావించి  తమతమ అభిప్రాయములను ఏర్పరచుకొనుచున్నారు. మాయ మనిషి లోపల ఉండి పని చేయు శక్తి.

అంటే మాయను వదిలి బయటకు వెళ్లి మాయను తెలుసుకోవడం కాదు; మాయలోనే ఉండి మాయను తెలుసుకోవాలి. ఈ విచారణకు ఆరంభం కూడా బయట ఎక్కడో లేదు—ఇప్పుడే, మన ముందే జరుగుతున్నదాన్ని చూడటంలోనే ఉంది. 

అనుబంధ వ్యాఖ్యానం — “ఇప్పుడు

“ఇప్పుడు” అనే పదము ఈ పల్లవిలో ప్రత్యేకంగా గమనించదగినది. హరిమాయ ఎప్పుడో జరిగిన విషయము కాదు; ఈ క్షణంలోనే మన ముందర పనిచేస్తున్నది. మనకు కనిపిస్తున్నది, మనము ఆలోచిస్తున్నది, మనము కోరుతున్నది—ఇవన్నీ ఇప్పుడే ఈ క్షణంలోనే జరుగుతున్నవి.
ఇక్కడ ఒక ఆధునిక పరిశీలనను పోల్చి చూడవచ్చును. పైన ఉన్న చిత్రంలో “The Present Moment” అని చూపిస్తూ, మన శ్రద్ధ గతపు జ్ఞాపకాలలోకి లేదా భవిష్యత్తు ఊహలలోకి వెళ్లినప్పుడు ప్రస్తుత క్షణం నుండి మన శక్తి,/దృష్టి తొలగిపోతున్నట్లు చూపించారు.

అయితే పెదతిరుమలాచార్యుల పరిశీలన ఇక్కడితో ఆగదు. ప్రస్తుత క్షణంలో ఉండడానికి ప్రయత్నించినప్పటికీ మాయ పనిచేస్తూనే ఉంటుంది. మన ముందున్న దానితో మనకు ఏర్పడే ఉపేక్ష, ప్రేమ, కోరిక, ఆశంస, ఉద్ధృతి ద్వారా మనసు దానితో సంబంధాన్ని ఏర్పరచుకుంటుంది. కాబట్టి సమస్య కేవలం గతంలోకి లేదా భవిష్యత్తులోకి వెళ్లడమే కాదు; ఇప్పుడు మన ముందర జరుగుతున్నదాన్ని మనము ఎలా అనుభవిస్తున్నాము అనేదే చూడవలసినది.

అందుకే “ఇప్పుడు” ఒక కాలసూచిక మాత్రమే కాదు. కవి మన దృష్టిని ఇప్పుడే జరుగుతున్న దాని మీదకు తిప్పుతున్నారు. మాయను తెలుసుకోవాలంటే మాయ నుండి బయటకు వెళ్లవలసిన అవసరం లేదు. మాయ ఎలా పనిచేస్తున్నదో జరుగుతున్నప్పడే (ఇప్పుడే) చూడాలి.

Bottom of Form


మొదటి చరణం:
అన్ని వేడుకలు గల యఖిల ప్రపంచము
కన్నులు మూసితే నెక్కడ నుండునో
చెన్నుమీఱ గృహారామక్షేత్రాదు లవి యెల్లా
యెన్నఁగా నిద్రించేవేళ యేడ నుండునో        ॥తరి॥ 
భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
అన్ని వేడుకలు గల యఖిల ప్రపంచము
అన్ని వేడుకలతో కూడిన ఈ సమస్త ప్రపంచము
ప్రపంచముతో మనకు గల సంబంధమే వేడుక. సుఖదుఃఖములు, లాభనష్టములు మొదలైనవి ఈ వేడుకలోని కదలికలు.
కన్నులు మూసితే నెక్కడ నుండునో
కన్నులు మూసినప్పుడు ఆ ప్రపంచము ఎక్కడ ఉంటుంది?
ఇక్కడ కన్నులు అనగా ఇంద్రియములు. ఇంద్రియ సంబంధము లేకున్నప్పుడు మన సుఖదుఃఖములు, లాభనష్టములు ఎక్కడికి పోతున్నవో గమనించమంటున్నారు.
చెన్నుమీఱ గృహారామక్షేత్రాదు లవి యెల్లా
అందమైన గృహములు, ఉద్యానములు, క్షేత్రములు మొదలైనవన్నీ
మనకు సుఖ (దుఃఖ​) అనుభవము కలిగించునవన్ని మన అనుబంధాలకు ప్రతీకలు.
యెన్నఁగా నిద్రించేవేళ యేడ నుండునో
మనము నిద్రించేటప్పుడు అవన్నీ ఎక్కడ ఉంటాయో?
ధ్యాస లేనప్పుడు, నిద్రలో, మరణములో మన అనుబంధములు ఎక్కడికి పోతున్నవో గమనించమంటున్నారు.
 గూఢార్థవివరణము:
 
ఈ చరణంలో కవి మనకు ఒక సవాలు విసురుతున్నారు. ప్రతిక్షణం మనలను ఆ క్షణంలోకి పూర్తిగా ప్రవేశించనీయకుండా, పరధ్యానంలోకి తీసుకుపోతున్న విషయాలను చూపిస్తున్నారు.

“కన్నులు మూసితే”, “నిద్రించేవేళ” అనే సాధారణ అనుభవాలను కవి ఇక్కడ మరుపుకు, ధ్యాస లేని స్థితికి, చివరకు మరణానికి కూడా సంకేతాలుగా వాడుతున్నారు. అప్పుడు మనకు ఎంతో నిజమైనవిగా కనిపించే ప్రపంచము, దానితో ఏర్పడిన అనుబంధాలు, సుఖదుఃఖాలు, లాభనష్టాలు ఎక్కడ ఉంటున్నాయో చూడమంటున్నారు. కవి చూపిస్తున్నది ప్రపంచమును కాదు; మనలను దానితో కట్టిపడేసే సంబంధాన్ని గమనించమంటున్నారు.

ఇక్కడ భగవద్గీత నాలుగవ అధ్యాయము, 18వ శ్లోకము గుర్తుకు వస్తుంది: 

> కర్మణ్యకర్మ యః పశ్యేదకర్మణి చ కర్మ యః... 

మనము ఇంతకుముందు విచారించినట్లుగా, ఇక్కడ కర్మను పరిశీలించి చూచుట అనే దిశలో తీసుకుంటే, ధ్యాసలో పరధ్యాసను, పరధ్యాసలో ధ్యాసను గమనించగల స్థితి ఒక ముఖ్యమైన పరిశీలనగా కనిపిస్తుంది.

కానీ మన సాధారణ స్థితి అలా లేదు. మనము ధ్యాసలో ఉన్నా, పరధ్యాసలో ఉన్నా, ఆ స్థితినే గమనిస్తున్నామని అనుకోము. ధ్యాస పెట్టాలని ప్రయత్నించినప్పుడు మాత్రమే, అప్పటివరకు పరధ్యాసలో ఉన్నామనే విషయం తెలుస్తుంది.

ఈ రకంగా చూస్తే పల్లవిలోని “ఇప్పుడు” మరింత సున్నితమైన పదంగా కనిపిస్తుంది. ఇప్పుడు మన ధ్యాస ఎక్కడ ఉంది? ఇప్పుడు మనలను పరధ్యాసలోకి తీసుకుపోతున్నది ఏమిటి? అనే ప్రశ్నను కవి మన ముందుంచుతున్నాడు.

ఇక్కడే ఈ చరణం పల్లవితో కలుస్తుంది: మాయ తరువాత తెలుసుకోవలసినది కాదు; ఇప్పుడే మన ధ్యాసలో, మన పరధ్యాసలో అది ఎలా పనిచేస్తున్నదో చూడవలసినది.

రెండవ చరణం:
వొసఁగ తా భోగించిన భోగోపకరణములు
యెసగఁ గొన కెక్కితే నేమి సేసునో
వనమైన పుత్రమిత్ర వర్గంబు లెల్లాను
వెసన వేరొక్క జన్మపువేళ నెట్టు లుందురో      ॥తరి॥         
భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
వొసఁగ తా భోగించిన భోగోపకరణములు
తాను భోగించిన భోగములకు ఉపయోగపడిన భోగోపకరణములు
గతంలో భోగించిన వస్తువులు, వాటితో ఏర్పడిన సంబంధాలు మనలో నిలిచి, తరువాతి క్షణములలో కూడా మన అనుభవాన్ని నడిపిస్తాయి.
యెసగఁ గొన కెక్కితే నేమి సేసునో
వాటిని వెంట తీసుకొని వెళితే అవి ఏమి చేయగలవో?
గతంలో భోగించినదాన్ని వెంట తెచ్చుకొని, దాని స్మృతి ఆధారంగా కొత్త క్షణాన్ని చూస్తే, ఆ పాత కదలిక మనలను వాస్తవంలోకి ప్రవేశించనీయకుండా ఎలా అడ్డుకుంటుందో గమనించమంటున్నారు.
వనమైన పుత్రమిత్ర వర్గంబు లెల్లాను
వనంలా పెరిగిపోయిన పుత్రమిత్ర వర్గమంతా
కాలక్రమంలో వనంలా విస్తరించిన పుత్రులు, మిత్రులు, బంధుత్వాలు కూడా పాత అనుభవాలు, జ్ఞాపకాలు, అనుబంధాలతో కూడిన ఒక ఘనమైన మానసిక వలయంగా మారుతాయి.
వెసన వేరొక్క జన్మపువేళ నెట్టు లుందురో
త్వరగా మరొక జన్మ వచ్చినప్పుడు అవన్నీ ఎట్లా ఉంటాయో?
వెసన” = త్వరగా. కొత్త క్షణము త్వరగా వచ్చేస్తున్నా, పాత సంబంధాలు తమ జడత్వంతో పూర్వ చలనంలోనే కొనసాగుతాయి. “వేరొక్క జన్మ”ను తరువాతి కొత్త క్షణంగా చూస్తే, ప్రతి క్షణము నూతనమైనప్పటికీ మనము పాత స్మృతులతో దానిలోకి ప్రవేశించలేకపోతున్న స్థితి కనిపిస్తుంది.
గూఢార్థవివరణము:

మొదటి చరణంలో కవి అఖిల ప్రపంచము, గృహము, ఆరామము, క్షేత్రము మొదలైన వాటితో మనకు గల సంబంధాన్ని పరిశీలింపజేశారు. రెండవ చరణంలో అదే విచారణను మరింత సన్నిహితమైన భోగవస్తువులు, పుత్రమిత్ర సంబంధాలు మీదకు తీసుకువస్తున్నారు.

వొసఁగ తా భోగించిన భోగోపకరణములు” — మనము గతంలో భోగించిన వస్తువులు అక్కడితో ముగియవు. వాటితో ఏర్పడిన అనుభవాలు, జ్ఞాపకాలు, అనుబంధాలు మనలో నిలుస్తాయి. తరువాతి క్షణములో వాటిని ఆధారంగా చేసుకొని మనము ప్రస్తుతాన్ని చూస్తాము.

అందుకే: యెసగఁ గొన కెక్కితే నేమి సేసునో” అని కవి ప్రశ్నిస్తున్నారు. గతంలో భోగించినదాన్ని వెంట తెచ్చుకుంటే, అది కొత్త క్షణంలో మనకు ఏమి చేస్తుంది? పాత అనుభవం కొత్తగా ప్రత్యక్షమవుతున్నదానిని కూడా తన పూర్వ రూపంలోనే చూపించగలదా? అన్నదే పరిశీలన.

తర్వాత: వనమైన పుత్రమిత్ర వర్గంబు లెల్లాను” అంటారు. వనమైన అంటే వనంలా పెరిగినది. పుత్రులు, మిత్రులు, బంధువులు అంటూ మన అనుబంధాలు కాలక్రమంలో శాఖోపశాఖలుగా విస్తరిస్తాయి. వాటితో పాటు అనేక జ్ఞాపకాలు, ఆశలు, అభిప్రాయాలు కూడా ఏర్పడతాయి. అందువల్ల ఈ అనుబంధాలకు ఒక విధమైన జడత్వము ఏర్పడుతుంది. కొత్త పరిస్థితి వచ్చినా అవి వెంటనే కొత్తదాన్ని చూడకుండా పూర్వ చలనంలోనే కొనసాగుతాయి.

ఇక్కడ “వెసన” అనే పదం అత్యంత ముఖ్యము. దాని అర్థం శీఘ్రముగా, త్వరత్వరగా. ఎన్నో కాలాలలో వనంలా పెరిగిన సంబంధాల మధ్య జీవిస్తున్న మనిషికి, కొత్త క్షణము మాత్రం త్వరగా వచ్చేస్తుంది. కానీ పాత స్మృతులు, పాత సంబంధాలు తమ పూర్వ చలనంతోనే ఆ కొత్త క్షణంలోకి వస్తాయి.

అందువల్ల “వేరొక్క జన్మను మరణానంతర జన్మగా మాత్రమే చూడవలసిన అవసరం లేదు. తరువాతి క్షణమే ఒక కొత్త జన్మగా చూడవచ్చు. ప్రతి క్షణము కొత్తగా పుడుతున్నది. కానీ మనము పాత స్మృతులను, పాత సంబంధాలను వెంట తెచ్చుకొని ఆ కొత్త క్షణాన్ని కూడా పాతదిగానే చూస్తున్నాము.

ఇక్కడ పల్లవిలోని: తనముందర ఇప్పుడు” అనే మాటను గుర్తు చేసుకోవాలి. కొత్త క్షణము మన ముందరే ఉంది. అయినా దానిని నేరుగా చూడకుండా పాతదానితో చూస్తున్నాము. వాస్తవము మన ముందర ఉన్నప్పటికీ, మనము దానిలోకి ప్రవేశించలేకపోతున్నాము.

ఇదే పల్లవిలోని “హరిమాయ”కు ఒక ప్రత్యక్ష రూపంగా కనిపిస్తుంది. భగవద్గీత 7-13లో గుణమయమైన వ్యక్తీకరణలలో మోహితమైన మనస్సు వాటికి అతీతమైనదాన్ని గుర్తించలేకపోవడాన్ని చూపిస్తుంది. దానిని ఇక్కడ ఒక సమాంతర పరిశీలనగా చూడవచ్చు. పెద్ద తిరుమలాచార్యులు అదే సమస్యను మన నిత్యజీవితంలో చూపిస్తున్నారు—పాత అనుభవాలు, సంబంధాలు, స్మృతులు కొత్త క్షణాన్ని పాతదిగానే చూపించి, వాస్తవములోనికి మనలను ప్రవేశించనీయకుండా చేస్తున్నాయి.

అందువల్ల ఈ చరణంలో కవి కేవలం “వస్తువులు, బంధువులు శాశ్వతము కావు” అని చెప్పడం లేదు. అంతకంటే లోతైన విషయాన్ని చూపిస్తున్నారు: జీవితం ప్రతి క్షణము కొత్తగా పుడుతూనే ఉంది. మనము మాత్రం పాత స్మృతులను పునరుద్ధరించుకుంటూ దానిని పాతదిగానే చూస్తున్నాము. ఇదే కాలక్రమములో చిక్కుకొనుట. కొత్త క్షణము త్వరగా వచ్చేస్తున్నా, మనసు పాత చలనాన్ని విడువకపోవుటే మనము వాస్తవములోనికి ప్రవేశించకుండా చేసే అడ్డంకి.

మూడవ చరణం:
పరగఁ దాఁ జేసిన పాపము శ్రీవేంకటేశు
శరణాతుఁడైతే నే చందమగునో
అరుదైన తనతొంటి యజ్ఞానము లన్నియును
గురుకృపగలవేళ కొంచి యెందు దాఁగునో ॥తరి॥
భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
పరగఁ దాఁ జేసిన పాపము శ్రీవేంకటేశు
తాను చేసిన ఎన్నో పాపములు; శ్రీవేంకటేశుడు
తాను చేసిన పాపములకు బాధ్యత తనదే. వాటిని దైవము తనపై వేసుకొనదు.
శరణాతుఁడైతే నే చందమగునో
శ్రీవేంకటేశుని శరణు పొందితే ఆ పాపము ఏమగునో?
శరణాగతితో పాపమును కలిగించిన అజ్ఞానస్థితితో తన సంబంధము మారితే, ఆ పాపమునకు ఏమి జరుగుతుందో కవి ప్రశ్నిస్తున్నారు.
అరుదైన తనతొంటి యజ్ఞానము లన్నియును
తొల్లిటి నుండి తనతో ఉన్న అరుదైన అజ్ఞానములన్నియు
తనతో తొల్లిటి నుంచీ ఉన్న, అరుదుగా తొలగగల అజ్ఞానములన్నీ తన ప్రస్తుత స్థితిలో కొనసాగుతున్నాయి.
గురుకృపగలవేళ కొంచి యెందు దాఁగునో
(గురుకృప = దైవకృప: అందరికి గురువగు దైవము యొక్క కృప)
గురుకృప కలిగినప్పుడు అవి కొంత తగ్గి ఎక్కడ దాగునో?
గురుకృప కలిగినప్పుడు ఆ అజ్ఞానము కొంచెంగా తగ్గి, తన పాత పట్టును ఎక్కడ కోల్పోతుందో కవి ప్రశ్నిస్తున్నారు.
గూఢార్థవివరణము:
 
రెండవ చరణంలో కవి మన జీవితంలో కాలక్రమంగా ఏర్పడిన భోగాలు, పుత్రమిత్ర సంబంధాలు, వాటి జ్ఞాపకాలు కొత్తగా వచ్చేది అయిన ప్రతి క్షణాన్ని పాతదిగానే చూడజేస్తున్న విధానాన్ని చూపించారు. కొత్త క్షణము త్వరగా వచ్చినా, పాత సంబంధాలు తమ జడత్వంతో పూర్వ చలనంలోనే కొనసాగుతున్నాయి. అందువల్ల వాస్తవము మన ముందర ఉన్నప్పటికీ, మనము దానిలోకి నేరుగా ప్రవేశించలేకపోతున్నాము.

ఇప్పుడు మూడవ చరణంలో కవి ఆ విచారణను ఇంకా లోపలికి తీసుకువెళుతున్నారు. పరగఁ దాఁ జేసిన పాపము” అంటే తాను చేసిన పాపము. ఇక్కడ బాధ్యతను దైవముపై వేయడం లేదు. తానే చేసినది తనదే. భగవద్గీత 5-15లోని: నాదత్తే కస్యచిత్ పాపం” అనే విషయాన్ని ఇక్కడ సమాంతరంగా గుర్తు చేసుకోవచ్చు. విభువు ఎవరి పాపమును స్వీకరించడు. అదే శ్లోకంలోని: అజ్ఞానేనావృతం జ్ఞానం” అనే మాట తరువాతి పాదానికి మరింత దగ్గరగా ఉంటుంది.

అందుకే కవి వెంటనే: శరణాతుఁడైతే నే చందమగునో” అని ప్రశ్నిస్తున్నారు. శరణాగతి అంటే దైవము మనము చేసిన పాపమును తనపై వేసుకొని తీసుకుపోవడం అని మాత్రమే చూడనవసరం లేదు. పాపమును కలిగించిన అజ్ఞానస్థితితో మన సంబంధము మారినప్పుడు, ఇంతవరకు సాగిన పాపకదలికకు ఏమి జరుగుతుందో కవి ప్రశ్నిస్తున్నట్లు చూడవచ్చు.

ఇది రెండవ చరణానికి సహజమైన కొనసాగింపు. అక్కడ పాత స్మృతులు, పాత సంబంధాలు మనలను పాత చలనంలో ఉంచుతున్నాయని చూశాము. ఇక్కడ వాటికంటే కూడా పాతదైన ఒకటి కనిపిస్తుంది: తనతొంటి యజ్ఞానము” అంటే తొల్లిటి నుంచే తనతో ఉన్న అజ్ఞానము.

ఇక్కడ “అరుదైన” అనే పదాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది కేవలం “విశేషమైన” లేదా “లోతైన” అజ్ఞానము కాదు. అత్యంత అరుదుగా తొలగేది, సాధించడం అత్యంత కష్టమైనది అనే భావాన్ని ఇస్తుంది. మనలను విష్ణుమాయ నుండి బయటకు రావనీయని అడ్డంకి సాధారణమైనది కాదు. భగవద్గీత 7-14లో: దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా” అని మాయను దాటడం కష్టమైనదిగా చెప్పిన విషయాన్ని ఇక్కడ సమాంతరంగా చూడవచ్చు. పెద్ద తిరుమలాచార్యులు అదే కఠినతను “అరుదైన తనతొంటి యజ్ఞానము” అనే పదబంధంలో చూపిస్తున్నారు.

అయితే కవి “గురుకృప వచ్చిన వెంటనే అజ్ఞానం అంతా నశిస్తుంది” అని చెప్పడం లేదు. కొంచి” అని అంటున్నారు. అంటే కొంచెంగా తగ్గుతుంది. ఇప్పటివరకు మనలను పాత చలనంలో ఉంచిన అజ్ఞానం తన పట్టును క్రమంగా కోల్పోతుంది. గురుకృపకు ఇక్కడ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది: మనిషి తన స్వీయ ప్రయత్నంతో నిర్మించుకున్న పాత చలనాన్ని తానే పూర్తిగా ఛేదించలేని చోట, కొత్తగా చూడగల అవకాశం కలగడం.

ఇలా చూస్తే మూడు చరణాలు ఒకే విచారణను క్రమంగా లోపలికి తీసుకువెళుతున్నాయి:

మొదటి చరణము:
ప్రపంచము — గృహము — ఆరామము — క్షేత్రము.
రెండవ చరణము:
భోగవస్తువులు — పుత్రమిత్ర సంబంధాలు — స్మృతులు — పాత చలనము.
మూడవ చరణము:
పాపము — తనతో తొల్లిటి నుండి ఉన్న అజ్ఞానము.

అంటే బయట ప్రపంచం నుండి లోపలికి వస్తూ, చివరికి వాస్తవములోకి ప్రవేశించనీయని అడ్డంకి మనలోనే ఎంత పాతదో కవి చూపిస్తున్నారు. అందువల్ల ఈ చరణం యొక్క ప్రశ్న కేవలం: పాపము ఏమవుతుంది?” అని కాదు. ఇంకా లోతైన ప్రశ్న: నన్ను పాత చలనంలో ఉంచుతున్న అజ్ఞానము కొంచెంగా తొలగితే, నేను వాస్తవములోకి ప్రవేశించుటకు ఏమి మిగులుతుంది?” ఇక్కడే పల్లవిలోని హరిమాయ మరియు మూడవ చరణంలోని తనతొంటి అజ్ఞానము ఒకదానితో ఒకటి కలుస్తాయి.

X-X-X THE END X-X-X

No comments:

Post a Comment

341 taritīpulaṃ̐ beṭṭīni tanamuṃdara nippuḍu (తరితీపులఁ బెట్టీని తనముందర నిప్పుడు)

  TALLAPAKA PEDA TIRUMALACHARYULU 341 తరితీపులఁ బెట్టీని తనముందర నిప్పుడు (tarit ī pula ṃ̐ be ṭṭī ni tanamu ṃ dara nippu ḍ u)   తెలుగులో ...