తాళ్లపాక అన్నమాచార్యులు
132R
శ్రీపతి నీయాజ్ఞ సేసెద మిదివో
For
English Version Press Here
ఉపోద్ఘాతము
ఈ కీర్తనలో అన్నమాచార్యులు ఒక్కసారిగా “భావము బ్రకృతికిఁ బ్రపంచము” అంటారు.
మనిషి ప్రపంచమునకు బయట నిలబడిలేడు; మనిషి లోనుండే—అంటే కేవలము భౌతికముగానే కాక,
తనలోని భావముల ద్వారా కూడా—ప్రపంచముతో సన్నిహితముగా కలపబడి ఉన్నాడు.
మరి ఆ సంబంధమును తెలియుట ఎట్లు? దాచి వుంటే వెదకగలము. కనుల ఎదుటనే వుంటే?
ఇక్కడే ఈ కీర్తనలోని అసలు మర్మము ఉంది. “శ్రీపతి నీయాజ్ఞ సేసెద మిదివో” అని చెప్పుట కాదు. శ్రీపతి ఆజ్ఞను వాస్తవముగా పాలించుట.
ఈ రెండింటి మధ్యనున్న వ్యత్యాసమునే అన్నమయ్య మన ముందుంచుతున్నాడు.
|
అధ్యాత్మ
సంకీర్తన
|
|
రాగి రేకు: 135-6 సంపుటము - సంకీర్తన: 2-147
|
|
శ్రీపతి నీయాజ్ఞ సేసెద మిదివో పూఁపల మాయలఁ బొరలఁగనేలా ॥పల్లవి॥ కాయము సుఖదుఃఖములకు మూలము పాయము యింద్రియపరవశము ఆయము రెంటికి నన్నపానములు మోయని మోఁపిది ములుగఁగనేలా ॥శ్రీప॥ తలఁపు పుణ్యపాతకముల మూలము కలిగిన పుట్టువు కర్మగతి ఫల మిది రెంటికి బలుసంసారము కలిగిన వెట్టికి కాదనేలా ॥శ్రీప॥ జీవుఁ డింతటా సృష్టికి మూలము భావము బ్రకృతికిఁ బ్రపంచము చేవగ రెంటికి శ్రీవేంకటేశ్వర నీ వంతరాత్మవు నెమకఁగనేలా ॥శ్రీప॥
|
Details
and Explanations:
పల్లవి:
శ్రీపతి
నీయాజ్ఞ సేసెద మిదివో
పూఁపల మాయలఁ
బొరలఁగనేలా ॥పల్లవి॥
|
కీర్తన పాదము
|
సాధారణ భావము
|
అంతరార్థము
|
|
శ్రీపతి నీయాజ్ఞ సేసెద మిదివో
|
శ్రీపతి! నీ ఆజ్ఞను ఆచరిస్తాను.
|
ఓ శ్రీపతి నీయాజ్ఞ చేయాలని ఉన్నది. కానీ ఏమిచేయవలెనో
ఎటుల తెలియుట?
|
|
పూఁపల మాయలఁ బొరలఁగనేలా
|
తీయని పిండివంటలవంటి మాయలలో పడి దొర్లటమెందుకు?
|
తీయగా, ఆకర్షణీయంగా అనిపించే అనుభవాలు
కోటానుకోట్లుగా కనబడుతుంటే వీని
మధ్యలో నిలబడి నీ ఆజ్ఞను తెలియడమెలా?.
|
గూఢార్థవివరణము:
“శ్రీపతి నీయాజ్ఞ సేసెద మిదివో” అని
మొదలుపెడితే, పైకి ఇది శ్రీపతి ఆజ్ఞను పాటించాలనే భక్తుని
మాటగా కనిపిస్తుంది. కానీ వెంటనే వచ్చే “పూఁపల మాయలఁ
బొరలఁగనేలా” ఆ మాటకు ఒక ప్రశ్నను జతచేస్తుంది. తీయగా,
ఆకర్షణీయంగా అనిపించే అనుభవాలు కోటానుకోట్లుగా మన ముందుంటే, వాటి మధ్య నిలబడి శ్రీపతి ఆజ్ఞను ఎలా తెలుసుకోవాలి?
మన ఇప్పటి
మానసిక స్థితి క్రింద జతపరచిన ఎమ్ సి యెశ్చరు గారు వేసిన
"మరొక ప్రపంచం (Another World)" అనే
చిత్రం ఒక సహాయక దృశ్యాన్ని ఇస్తుంది. 3డి (త్రిమితీయ)
వీక్షణంగా కనబడు ఈ చిత్రములో ఆరు ఓపెన్ ఆర్చిలు (వంపుకట్టడము) ఉన్నాయి. ప్రతి
దృక్కోణంలో మనం మనిషి ముఖం కలిగిన ఒక పక్షి వంటి జీవిని మరియు గొలుసుల నుండి వేలాడుతున్న కొమ్ములను
చూస్తాము. ఆ కొమ్ములు ఆయా తలములకు అనుగుణముగా వేలాడుతూ ఉన్నవి. బొమ్మకి వెలుపల
ఉన్న భూభాగము కానీ ఆకాశం కానీ మనము ఎటువైపు నుండి చూస్తున్నామో తెలియనివ్వవు. ఏ
కోణంలో చూస్తే ఆ కోణమే
సరియైనదనిపిస్తుంది.
అలాగే మనం
ఏ ప్రపంచంలో నిలబడి చూస్తున్నామో, ఆ ప్రపంచమే మనకు సహజమైనదిగా,
సంపూర్ణమైనదిగా కనిపిస్తుంది. దాని బయట మరొక దృక్కోణం ఉండవచ్చనే
విషయాన్ని, ఆ స్థితిలో ఉన్నంతవరకు మనం సులభంగా గుర్తించలేము.
మనము నిలబడి ఉన్న స్థితి మారకుండానే, దాని వెలుపల నుండి
వచ్చే దానిని ఎలా గుర్తించగలం అన్న ప్రశ్నను ఈ చిత్రం మన ముందు ఉంచుతుంది.
అన్నమయ్య
ముందుగా మనం నిలబడి ఉన్న వేదికను చూపిస్తాడు. తరువాతి చరణాలలో ఆ వేదిక ఎలా
ఏర్పడిందో—కాయము, ఇంద్రియపరవశము, తలపు, పుణ్యపాతకములు, కర్మగతి,
సంసారము మొదలైన వాటి ద్వారా—చూపిస్తాడు.
అందువల్ల
కోటానుకోట్లుగా తీయగా, ఆకర్షణీయంగా కనబడుతున్న అనుభవాల
మధ్యలో నిలబడి ఓ శ్రీపతి నీయాజ్ఞ ను తెలియడమెలా? అని
అన్న్మయ్య వేడుకుంటున్నాడు.
మొదటి చరణం:
కాయము సుఖదుఃఖములకు
మూలము
పాయము యింద్రియపరవశము
ఆయము రెంటికి
నన్నపానములు
మోయని మోఁపిది
ములుగఁగనేలా ॥శ్రీప॥
భావము:
|
కీర్తన పాదము
|
సాధారణ భావము
|
అంతరార్థము
|
|
కాయము సుఖదుఃఖములకు మూలము
|
శరీరమే సుఖదుఃఖాల అనుభవమునకు మూలము.
|
శరీరము థర్మోమీటర్ వంటిది.
సుఖదుఃఖాల అనుభవములు చూపుతూ; సుఖమును కోరుతూ దుఃఖాల నుండి విడిపడడానికి పెనుగులాడుతూ ఉంటుంది.
|
|
పాయము యింద్రియపరవశము
|
వయసు, ప్రాయములు యింద్రియ విషయముల
పట్ల పరవశులై పారుచున్నవి.
|
వయసు, ప్రాయములలో సహజమైన ఇంద్రియపరవశము
వేరువిషయములన్నింటిని కప్పి మనలను నడిపించుచున్నది.
|
|
ఆయము రెంటికి నన్నపానములు
|
శరీరము వయసు, ప్రాయములకు
అన్నపానములే ఆయువుపట్టు అని తెలియుట సామాన్యము
|
శరీరము వయసు, ప్రాయములకు
అన్నపానములే భౌతికముగా ముఖ్యమైనప్పటికీ వానికి ఆయువుపట్టు శరీరము మాత్రమే కాదు.
|
|
మోయని మోఁపిది ములుగఁగనేలా
|
సామాన్యంగా వీటిని మోస్తున్నట్లు కనిపించదు ఎందుకంటే అవి మనము
కోరి ఎత్తుకొన్నవి. కానీ ఆ మోపు సంగతి తెలియక ములుగఁగనేలా?
|
సుఖములలో వీటిని మోస్తున్నట్లు కనిపించదు . దుఃఖములో ఆ
మోపు బరువు తెలుస్తోంది కదా? కానీ ఆ మోపును కోరి ఎత్తుకొన్నావే? సుఖదుఃఖము కలిపే ఉంటాయే? మానవుడా ఇంకా ఆ
మోపులెందుకు?
|
గూఢార్థవివరణము:
ఒక
చెట్టుకు నేల, నీరు, విత్తనం, వేరు, కాండము, ఆకులు
వేరువేరుగా కనిపించినా, అవన్నీ ప్రకృతిలో పరస్పరాధారితమైన
ఒకే జీవన ప్రక్రియలోని భాగాలు. అలాగే కాయము, వయసు, ఇంద్రియపరవశము, అన్నపానములు, సుఖదుఃఖములు
పైకి వేర్వేరు విషయాలుగా కనిపించినా, అవి ఒకదానికొకటి ఆధారమై
నడిచే ప్రకృతి వ్యవస్థలోని వేరువేరుగా కనబడే పొరలు. మనము ఈ భూప్రపంచము నుండియే
వచ్చాము. మనము దీనికి భిన్నమైన వారము కాము.
ముందుగా
Remedios Varo వేసిన Alchemy or the Useless
Science (1958) అనే అధివాస్తవిక చిత్రాన్ని చూడండి. చిత్రంలో ఒక
స్త్రీ చిన్న బల్లమీద కూర్చుని ఒక చక్రాన్ని తిప్పుతోంది. విచిత్రంగా, నేలలోని చదరాలే ఆమె దుస్తులుగా కొనసాగుతున్నాయి.
నేల, ఆమె, గోడలు, భవనము, యంత్రాంగము వేరువేరు వస్తువులుగా కాక ఒకే
నిర్మాణపు కొనసాగింపులుగా కనిపిస్తాయి. ఆమె తిప్పుతున్న చిన్న చక్రం నుండి ఒక
దారము పైకి సాగి, విస్తరించిన భవనపు సంక్లిష్ట యంత్రాంగంలో
కలుస్తుంది. ఆమె ఆ వ్యవస్థకు బయట నిలబడి దానిని నడిపించడం లేదు; అందులో భాగమై తనకు వచ్చిన చిన్న పనిని చేస్తోంది.
ఇక్కడ
ఒక విషయం గమనించవచ్చు. ఆమె చేస్తున్న చిన్న పని ఆ మహత్తర యంత్రాంగం మొత్తము కాదు.
అయినా ఆమె దానితో కలపబడి, తన వంతు కదలికను అందిస్తోంది. మన
స్థితి కూడా అంతే. ప్రకృతి వ్యవస్థకు బయట నిలబడి దానిని నడిపేవారము కాము;
అందులో భాగమై దాని కదలికలో పాల్గొంటున్నాము. అయితే కొంతకాలానికి అదే
వ్యవస్థ నుండి విడివడటానికి పెనుగులాడతాము.
అందుకే
“మోయని మోఁపిది”. మనం బయట నుండి ఏదో భారాన్ని మోస్తున్నట్లు అనిపించదు. మనం భాగమైన అదే
వ్యవస్థ మనలను నడుపుతున్నది. సుఖంలో దాని బరువు కనిపించదు; దుఃఖంలో మాత్రం అదే మోపు తెలుస్తుంది.
అన్నమయ్య
భారం గురించి చెప్పడం లేదు; మనం భాగమైన జీవన కదలికే ఎలా మోపుగా
మారుతుందో చూపిస్తున్నాడు.
రెండవ చరణం:
తలఁపు పుణ్యపాతకముల
మూలము
కలిగిన పుట్టువు
కర్మగతి
ఫల మిది
రెంటికి బలుసంసారము
కలిగిన వెట్టికి
కాదనేలా ॥శ్రీప॥
భావము:
|
కీర్తన పాదము
|
సాధారణ భావము
|
అంతరార్థము
|
|
తలఁపు పుణ్యపాతకముల మూలము
|
తలపులే పుణ్యపాపములను భిన్న ధృవములుగా సృష్టించే విభజనకు
మూలము.
|
మన తలపుల నుండే పుణ్యము పోగుచేయుట, పాపము విడుచుట అను భావనలు, వాటి ఆధారంగా ఏర్పడే చలనములు పుడుతున్నవి.
|
|
కలిగిన పుట్టువు కర్మగతి
|
కలిగిన పుట్టుక—మనకు వ్యక్తమగుచున్నది, అవగాహనను తాకుచున్నది—కర్మపు గతిని అనుసరించి
ఏర్పడినది.
|
కర్మగతిని అనుసరించి తదుపరి కార్యములు మనలను తమలోనికి
లాగుకొని పోవుచున్నవి.
|
|
ఫల మిది రెంటికి బలుసంసారము
|
ఈ రెండింటి ఫలితమే తప్పించుకోలేని బలమైన సంసారబంధములు.
|
తలపుల ద్వారా ఏర్పడే పుణ్యపాపములు, వాటి కర్మగతి—ఇవి కలిసి సంసారాన్ని మరింత
జటిలపరుస్తున్నవి.
|
|
కలిగిన వెట్టికి కాదననేలా
|
అలా కలిగినదానిని, ఏర్పడినదానిని బాధ్యత వీడి ఎందుకు కాదనాలి?
|
ఇలా ఏర్పడిన, ఏమి
చేసినా ప్రయోజనములేని వెట్టి వంటి ఈ సంసారాన్ని పెంచుకున్నదానిని, దాని నుండి విడిపోవాలని మళ్లీ ప్రయత్నించడం ఎందుకు? ‘కాదు’ అను వ్యతిరేకతను చూపుతూ మరింత కష్టపడనేలా? (ఔనన్నా,
కాదన్నా తప్పని దానికి వ్యతిరేకత చూపి ఏమి ప్రయోజనము?)
|
గూఢార్థవివరణము:
“తలఁపు పుణ్యపాతకముల మూలము” — మన
తలపులే పుణ్యము, పాతకము అనే విభజనకు మూలము. పుణ్యమును
సంపాదించాలనే ప్రయత్నము, పాపమును విడిచిపెట్టాలనే ప్రయత్నము
రెండూ తలపు నుండే మొదలవుతాయి. ఒకదానిని కోరుతూ, మరొకదానిని
నిరాకరించడమే ఈ నిరంతర చలనము.
“కలిగిన పుట్టువు కర్మగతి” — ప్రతి
తలపు ఒక కదలికకు, ఆ కదలిక కార్యానికి, ఆ
కార్యము మరొక కార్యానికి పరిస్థితిని కల్పిస్తుంది. అలా కర్మ నిరంతర కార్యానికి
ఆధారమవుతుంది. ఇదే కర్మగతి.
“ఫల మిది రెంటికి బలుసంసారము” — తలపుల ద్వారా ఏర్పడే విభజనలు, వాటి నుండి
కొనసాగుతున్న కార్యములు ఒకదానిని మరొకటి బలపరుస్తాయి. ఒక సమస్య మరొక సమస్యకు
దారితీయవచ్చు; ఒక అనుభవము మరొక అనుభవాన్ని కోరేలా చేయవచ్చు.
ఈ విధంగా మనమే సంసారాన్ని మరింత జటిలపరచుకుంటాము.
చివరగా
“కలిగిన వెట్టికి కాదననేలా”
అని అన్నమయ్య ప్రశ్నిస్తున్నాడు. ఇలా ఇంతవరకు ఏర్పడిన సంసారాన్ని, దాని బంధములను ఇప్పుడు వద్దనుకుంటే ఏమవుతుంది? దానిని
నిరాకరించడానికి చేసే ప్రయత్నము కూడా మరొక కార్యమే కదా! ఆ ప్రయత్నము తిరిగి అదే
కర్మగతిలో భాగమౌతుంది కదా. ఇలా ఏర్పడినదాన్ని వెట్టిగా స్వీకరించలేని మన
బలహీనతను ఆయన చూపిస్తున్నారు.
ఇంకొక
కీర్తనలో “ఆకాశ పాకాశ మరుదైన కూటంబు / లోకరంజకము
తమలోనిసమ్మతము” అన్నారు. ఈ అల్లకల్లోల ప్రపంచము అపురూపమైన, అశక్యమైన, దివ్యమైన సమ్మేళనము. అందులోని భాగమైన
నిన్ను నీవు గుర్తించి సమ్మతించిన లోకరంజకము.
తమలోనిసమ్మతము
= ధూళికణముల వంటి గత అనుభవపు జాడలు మనము చూచుదానిని చెదిరింపజేసి సరిగా గమనించ నివ్వవని
'ఆకాశ పాకాశము' తో సూచించిరి. తాను చూచునది
సరికానిదన్న స్పృహ మనకుండదు. అనేక కోణములలో చీలియున్న సత్యము గ్రహింపునకు రాదు. తాను
చూచునది సరికానిదన్న విషయమును అంగీకరించుటయే ఇక్కడ తెలిపిన లోనిసమ్మతము.
తమలోనిసమ్మతము
మనిషి తనతో తాను అంతర్గతముగా సహవాసము చేయలేక పోవుటయే అసౌకర్యమునకు కారణము. అందుకు ఉన్నదానిని
ఉన్నట్లుగా సమ్మతించక సర్దిచెప్పుకుపోవు ప్రయత్నములు చేసెదము. ఇది కొనుగోలు చేసిన సంధి.
దీనికి మూల్యము చెల్లించక తప్పదు.
ఇక్కడ
అన్నమయ్య పుణ్యమును నిరాకరించమని గానీ, పాపమును అంగీకరించమని గానీ చెప్పడం
లేదు. పుణ్యమును కోరడం, పాపమును విడవడం, కలిగినదానిని కాదనడం—ఈ ప్రయత్నాలన్నింటి వెనుక పనిచేస్తున్న తలపును
గమనించమంటున్నాడు.
మొదటి
చరణంలో మనము భాగమైన జీవనవ్యవస్థే ఎలా మోపుగా మారుతుందో చూపించాడు. ఈ చరణంలో ఆ
మోపును వదిలించుకోవడానికి చేసే ప్రయత్నము కూడా దానిని ఎలా పెంచుతుందో చూపిస్తున్నాడు.
కీర్తనలోని
భావపురోగతి:
మొదటి
చరణం: ప్రకృతి వ్యవస్థలో భాగమై ఉండటం → ఆ వ్యవస్థ
మనలను నడపడం.
రెండవ
చరణం: ఆ వ్యవస్థలో తలపు → విభజన → కార్యము
→ ఫలము → సంసారము
→ దానిని తిరస్కరించే ప్రయత్నము కూడా అదే కదలికలో చేరడం.
మూడవ చరణం:
జీవుఁ డింతటా
సృష్టికి మూలము
భావము బ్రకృతికిఁ
బ్రపంచము
చేవగ రెంటికి
శ్రీవేంకటేశ్వర
నీ వంతరాత్మవు
నెమకఁగనేలా ॥శ్రీప॥
భావము:
|
కీర్తన పాదము
|
సాధారణ భావము
|
అంతరార్థము
|
|
జీవుఁ డింతటా సృష్టికి మూలము
|
జీవుడే ఈ సృష్టికి మూలము. ఇప్పటి దాకా చూపిన చలనములు జీవుని
నుంచే కదా వచ్చినవి.
|
జీవుడు సృష్టికి, ఈ సంసారమునకు బయట నిలబడినవాడు కాదు. అతడి అనుభవము, దాని సహకారములతోనే సంసారము విస్తరించుచున్నది. అందువల్ల జీవుడే ఈ
సృష్టికి మూలము.
|
|
భావము బ్రకృతికిఁ బ్రపంచము
|
జీవుని భావములే ప్రకృతికి, ప్రపంచమునకు ఆధారములు. ఆ భావనలు లేక ప్రపంచము, బంధములు
విస్తరించవు.
|
మానవుడు లోననుండి ప్రపంచమునకు కలపబడిన సంగతి ఇక్కడ
చెప్పబడినది. మన భావనలు ప్రకృతికి బీజము వంటివి. అవే ప్రకృతి యొక్క కదలికకు
మూలమై, అనుభవముగా ప్రపంచముగా మనకు
వ్యక్తమవుతున్నవి. మనకు కనిపించే ప్రపంచము కేవలం బయట ఉన్నది కాదు; దానితో ఏర్పడే భావసంబంధమూ అందులో భాగమే.
|
|
చేవగ రెంటికి శ్రీవేంకటేశ్వర
|
చేవగ = సారము, ధైర్యము,
సత్తువ. ఈ రెండింటికీ—జీవునికీ, ప్రకృతికీ—శ్రీవేంకటేశ్వరుడే
ఆధారము.
|
జీవుడూ, ప్రకృతీ వేరువేరుగా
కనిపించినప్పటికీ, వాటిని కలుపుచున్న సారము, సత్తువ శ్రీవేంకటేశ్వరుడే.
|
|
నీ వంతరాత్మవు నెమకఁగనేలా
|
నెమకఁగనేలా = వెదకగనేలా. ఓ వేంకటేశ్వరా! నీవే అంతరాత్మవు
అని తెలిసితే చాలు కదా? ఇక వెదకగనేలా?
|
ఇక్కడ కవి భేదములన్నీ మరచెను. వేంకటేశ్వరుడే అంతరాత్ముడని
తెలిసెను. ఇక వెదకగనేలా?
|
గూఢార్థవివరణము:
మొదటి
చరణంలో కాయము, పాయము, ఇంద్రియపరవశము,
అన్నపానములు, సుఖదుఃఖములు—ఇవన్నీ పరస్పర
సంబంధముతో నడిచే ఒకే జీవనవ్యవస్థలోని పొరలుగా కనిపించాయి. రెండవ చరణంలో తలపు,
పుణ్యపాతకములు — భావములు కర్మగతిని, సంసారమును ఎలా కొనసాగించుచున్నవో చూశాము. ఇప్పుడు అన్నమయ్య ఆ కదలికకు మూలమును
చూపిస్తున్నాడు.
“జీవుఁ డింతటా సృష్టికి మూలము” — జీవుడు ఈ సంసారమునకు బయట నిలబడి దానిని అనుభవించేవాడు కాదు. అతని అనుభవము,
అతని తలపులు, అతని కర్మలతోనే ఇంతవరకు మనము
చూసిన సంసార కదలిక విస్తరిస్తున్నది. అందువల్ల జీవుడే తన అనుభవము ప్రపంచమునకు
మూలమవుతున్నాడు.
“భావము బ్రకృతికిఁ బ్రపంచము” — జీవునిలోని
భావముల ద్వారానే ప్రకృతి ప్రపంచముగా వ్యక్తమవుతున్నది. భావము లేకుండా మనకు
అనుభవమయ్యే ప్రపంచము, దానితో ఏర్పడే బంధములు ఈ రూపంలో
విస్తరించవు. మనిషి ప్రపంచమునకు బయట నిలబడిలేడు; తనలోనుండే—అంటే
కేవలము భౌతికముగానే కాక, తనలోని భావముల ద్వారా
కూడా—ప్రపంచముతో కలపబడి ఉన్నాడు.
ఇక్కడ
ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. మొదటి రెండు చరణాలలో కనిపించిన కదలికలు ఇప్పుడు బయట
ఉన్న సంఘటనలుగా కాక, జీవుడు–భావము–ప్రకృతి–ప్రపంచము అనే పరస్పర సంబంధముగా కనిపిస్తున్నాయి. మనము బయట ఉన్నదానితో
పోరాడుతున్నాము అనుకుంటాము; కానీ మన అనుభవమే ఆ ప్రపంచ
నిర్మాణంలో భాగమై ఉన్నది.
అక్కడే
“చేవగ రెంటికి శ్రీవేంకటేశ్వర”
వస్తుంది. జీవుడూ, ప్రకృతీ రెండు వేర్వేరు అంశాలుగా
కనిపించినా, వాటిని కలుపుచున్న సారము, సత్తువ
మరొకటి కాదు—శ్రీవేంకటేశ్వరుడు.
ఇంతవరకు
కదలికను అనుసరించిన కవి, ఇప్పుడు దాని అంతర్గత ఆధారాన్ని
చూపిస్తున్నాడు: జీవుడు — భావము — ప్రకృతి — ప్రపంచము. వీటన్నింటినీ కలుపుతూ ఉన్నదే అంతరాత్మ.
అందుకే
చివరగా: “నీ వంతరాత్మవు నెమకఁగనేలా”: నీవే
అంతరాత్మవని తెలిసిన తరువాత ఇంకా ఎక్కడ వెదకాలి? తాను కాని
దానిని వెదకగలము; కాని అంతరాత్మను వెదకలేము. తనను తాను మనిషి
అద్దములేకుండా చూసుకోగలడా? వెదకాలి అనే ప్రయత్నమే ఉంటే,
అంతరాత్మను ఇంకా తెలియనట్లే.
కీర్తనలోని
భావపురోగతి
మొదటి
చరణం: ప్రకృతి వ్యవస్థలో భాగమై ఉండటం →
ఆ వ్యవస్థ మనలను నడపడం.
రెండవ
చరణం: ఆ వ్యవస్థలో తలపు →
విభజన → కార్యము → ఫలము →
సంసారము → దానిని తిరస్కరించే ప్రయత్నము కూడా అదే కదలికలో చేరడం.
మూడవ
చరణం: జీవుడు → భావము
→ ప్రకృతి → ప్రపంచము
→ వీటన్నింటి కలుపుతూ ఉన్నదే అంతరాత్మ.
X-X-X THE
END X-X-X
.png)
%20Remedios%20Varo.png)
No comments:
Post a Comment