అన్నమాచార్యులు — ఒక పరిచయం
అన్నమాచార్యులు తత్వవేత్త కారు.
భావుకుడు అంతకన్నా కారు.
సిద్ధాంతకర్త కానే కారు.
మూఢభక్తిని ప్రతిపాదించలేదు.
మరి ఆయన ఎవరు?
ఈ ప్రశ్నకు ఒక నిర్వచనంతో సమాధానం
చెప్పడం కష్టం. నిజానికి,
అన్నమాచార్యులను ఒక నిర్వచనముల గూళ్ళలో పట్టేందుకు చేసే ప్రయత్నమే ఆయనను అర్థం
చేసుకోవడంలో మొదటి అడ్డంకి కావచ్చు.
ఆయనను భక్తకవి అనవచ్చును. శృంగారకవి
అనవచ్చును. వేదాంతి
అనవచ్చును. తత్వవేత్త
అనవచ్చును. సామాజిక పరిశీలకుడు అని కూడా అనవచ్చును. ఇవన్నీ ఆయనలోని
ఏదో ఒక కోణాన్ని చూపిస్తాయి.
కానీ ఏ ఒక్కటీ అన్నమాచార్యులను పూర్తిగా చూపలేదు. ఎందుకంటే ఆయన కీర్తనల
ద్వారా మనకు ఒక సిద్ధాంతాలను,
తత్త్వాలను అందించలేదు. మనిషిని వాస్తవ స్వభావాన్ని మన ముందుంచతారు. ఆయన మన జీవితంతో మనమేమి చేస్తున్నామో చూపిస్తారు. అందరి
జీవితము ఒకటే. హెచ్చుతగ్గులు లేవు. మనకు లభించిన ఈ అవకాశం మనమెలా ఉపయోగిస్తున్నామో
తిరిగి చూసుకోమంటారు.
అన్నమాచార్యులు ముందుగా సిద్ధాంతాలను
పట్టుకుని వాని వైపు కీర్తనను నడిపించరు. కొన్ని దృశ్యాలను మన ముందుంచుతారు. వాటి
అన్వయాన్ని పాఠకులకు, శ్రోతలకు
వదిలివేస్తారు.
పదిహేనవ శతాబ్దానికి చెందిన ఆ
దృశ్యాలు, ఆ చిత్తరువులు, ఈ రోజుకీ మనకు
సవాళ్లుగానే నిలుస్తాయి. అతి జాగ్రత్తగా కూర్చి పేర్చినట్టుండే ఆ బింబాల
చిక్కుముడులు మాత్రం సులభంగా వీగవు.
అన్నమాచార్యులు పరమ భక్తులు. వారు
తమకు తమ చుట్టూ ఉన్న ప్రపంచానికి మధ్య అంతరం చూడరు. చూపించరు. మనము తప్పు చేసినప్పుడు అయ్యో "నేను ఇక్కడ పొరపాటు చేశాను. ఈసారి
సరిదిద్దుకుంటాను" అనుకుంటాం. ఈ మాట మనం ఎవరితో చెప్పుకుంటాం మనతో మనమే.
మనమీదే మనకి కోపం వచ్చినా ఏం చేస్తాం. ఏం చేయాలో తెలియక ఉండిపోతాం. అన్నమాచార్యులు
మనలో లోపాలను ఎత్తి చూపినప్పుడు మనం అలాగే అనుభవం చెందుతాము.
ఒకరకంగా చెప్పాలంటే వారి కీర్తనలు చదువుతూనే, వింటూనే మనకి వారికి మధ్య ఒక అవినాభావ సంబంధాన్ని సృష్టించుకుంటారు. అవి సూటిగా హృదయం లోకితాకుతాయి. రాగిరేకులపై వారు
వారి హృదయాన్ని అక్షర రూపంలో జారవిడిచినారు అనిపిస్తుంది.
అయినా ఆయన కీర్తనలను
చదువుతున్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైన అనుభవం కలుగుతుంది. మనకు ఎంతో
పరిచితమైన విషయాలే ఒక్కసారిగా అపరిచితంగా కనిపిస్తాయి.
ప్రేమ గురించి చెబుతూ —“కుమ్మరింపుచుఁ
దెచ్చుకొన్నదీ వలపు”
అంటారు. మనం ప్రేమ
అని పిలుచుకుంటున్నదాని అసలు రూపం గోచరింప
చేస్తున్నారు. మన ఇప్పటి స్థితిలో మన అనుభవానికి వచ్చేది ప్రేమకన్నా బయటకు
కుమ్మరించుకుని తెచ్చుకున్న ఆత్మదయ,
జాలి, ఆందోళన, ఎదురుచూపుల
అనుభవం కావచ్చు.
“ఇది నా
చేతినుంచి జారిపోతుందేమో” అన్న ఆందోళనలోనూ,
“మేమిక ఆనందంగా ఎప్పటికీ కలిసి ఉంటాము” అన్న ఎదురుచూపులోనూ ప్రేమ వికసిస్తుందా?
ఇక్కడ అన్నమయ్య ప్రేమకు నిర్వచనం
ఇవ్వడం లేదు. మనం
ప్రేమ అని పిలుచుకుంటున్న దాని వెనుక వున్న ఇచ్చిపుచ్చుకొను లావాదేవిల వంటి
గంభీరమైన ప్రవృత్తులను చూపుతున్నారు.
ఊరులేని పొలిమేర
ఊరు ఉంటే పొలిమేర ఉంటుంది. ఊరు లేక
పొలిమేరకు అర్థమే ఉండదు.
అనగా, మనము
ఎక్కడ నిలబడి ఉన్నామో మనకే తెలియదు. నిర్ణయించలేని స్థలము. తన స్థానమే
తెలియని మనిషి ఏ దిశలో నడవాలో ఎలా నిర్ణయించగలడు? రెండే పదాలలో
నిశ్చితమును అనిశ్చితముగా
మార్చేస్తారు. అనుభవానికి అందినట్టుగా ఉన్నదే ఒక్కసారిగా అవ్యక్తమైపోతుంది. మన
చూపులకు, మన
భావాలకు అసలు పునాదులు ఉన్నాయా?
ఉంటే అవేమిటి?
ఈ ప్రశ్న మనకు ఇంతకు ముందు ఎందుకు
తట్టలేదు? కాలి
క్రింద భూమి కొట్టుకుపోయినట్టుగా అనిపిస్తుంది.
క్రూరత్వమునకు కుదువ యీ బ్రదుకు
ఒక కోరిక నెరవేరదు. కానీ అది అలా
ఉండిపోదు. లోపల అసంతృప్తి కుతకుతలాడుతూ ఉంటుంది. తరువాత అది కోపమవుతుంది. కోపం
దురుసుతనమవుతుంది. మన అభిప్రాయమే సరైనదని భావించడం మొదలవుతుంది. ఇతరుల మాటకు విలువ
తగ్గుతుంది. ఆ వ్యక్తికి చివరికి క్రూరత్వం సహజ నైజంగా కనిపిస్తుంది.
క్రూరత్వం మనిషిలో ఈనాటిది కాదు.
ఆది నుంచి ఈనాటి వరకు అది ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంది. అన్నమాచార్యులు
ఇక్కడ మనిషి క్రూరుడని తీర్పు చెప్పడం లేదు. మనిషి తన ఇప్పటి స్థితిలో
క్రూరత్వానికి ఎలా సహకరిస్తున్నాడో చూపిస్తున్నారు.
ఇతరుల చూపులో మనిషి: ఈ గోచరింపజేయడం
కేవలం బింబాలలోనే కాదు. మానవ స్వభావాన్నిపరిశీలించడంలో కూడా ఉంది.
యితరులచే ముందర నిఁక నెట్టౌదునో యని
వెతతోడఁ దలఁచేటి వెఱ పెల్లా విడిచి
మానవ స్వభావంలో ఒక ముఖ్యమైన కోణం — ఇతరులు తన
గురించి ఏమనుకుంటున్నారు అన్నది. మానవుడు సహజంగా పేదరికాన్ని, కష్టాలను తనంత తానుగా
భరించగలడు. కానీ వాటిని ఎదుర్కొంటూ సమాజం దృష్టిలో పడటాన్ని ఇష్టపడడు. తనకేమి
జరిగినా — దానికంటే, ఇతరులు
తనతో ఎలా ప్రవర్తిస్తారన్నదే
మనిషికి ఎక్కువ భయాందోళనలు కలిగిస్తుంది.
అన్నమాచార్యులు ఇక్కడ మనిషి
బలహీనుడని తీర్పు చెప్పడం లేదు.
మనిషి తనకు తెలియకుండానే ఇతరుల చూపులో తనను తాను ఎలా కొలుచుకుంటున్నాడో చూపిస్తున్నారు.
గడ్డపార మింగితే నాఁకలి దీరీనా
గడ్డపార ఒక పనిముట్టు. దానితో
పనిచేసి ఆహారం సంపాదించుకోవచ్చు. కాబట్టి గడ్డపార మింగితే ఆకలి తీరుతుందా? ఈ శరీరం కూడా
ఒక పనిముట్టు. పరము
తెలియుటకు మానవుని వద్ద గల ఒకే ఒక సాధనము. మరి మనిషి
చేయుచున్నదేమి? దానిని
ఆహారం సంపాదించుకోవటానికీ,
దానికి నగిషీ పెట్టటానికీ తన సమయమంతా వినియోగిస్తున్నాడు.
సాధనానికి
నగిషీ ఎందుకు? ఇక్కడ
కూడా అన్నమాచార్యులు ఒక సిద్ధాంతాన్ని బోధించరు. ఒక అసాధ్యమైన దృశ్యాన్ని మన
ముందుంచి, మనలోని
ఒక పొరపాటును మనకే కనిపించేలా చేస్తారు.
గుఱ్ఱాలఁ గట్టని తేరు కొంక కెందైనాఁ బారీ
విఱ్ఱవీఁగుచుఁ దీసీని వేడుకతో జీవుఁడు
మానవుని మనోరథాన్ని ఇంతకంటే సూటిగా
చూపించడం కష్టం.
గుఱ్ఱాలు లేని నరరథానికి రౌతుగా,
క్షణం కూడా ఆలోచించకుండా,
మనిషి తన అహంభావంతో ఎక్కి కూర్చుంటాడు. తనకు అడ్డు ఆపులు లేవని భావించి, విర్రవీగుతూ
సంసార యాత్ర సాగిస్తాడు.
అయితే ఇక్కడ అన్నమాచార్యులు
మనిషిని తప్పుపట్టడం లేదు. “రౌతు
ఎవరు? నిజమైన
రథమేది?” అని మన
ముందే ప్రశ్న పెడుతున్నారు.
నన్ను నడిపిస్తున్నది ఎవరు?
నేను అనుకుంటున్న ఈ దేహమే రథమా?
నేను రౌతునని అనుకోవడానికి నాకు ఆధారం ఏమిటి? అది చివరికి
ఆత్మవిమర్శకు
తీసుకువెళుతుంది.
ఇక్కడ ఒక విషయం ప్రత్యేకంగా
కనిపిస్తుంది. అన్నమాచార్యులు మనస్సును పరిశీలించడం కాదు; మనస్సు పనిచేసే
చోటు నుంచే కొంచెం బయట నిలబడి దానిని చూస్తున్నట్టుంటారు. అందుకే
ఆయన బింబాలు కేవలం అలంకారాలు కావు.
గోచరమైనదానితో
గోచరము కానిదాన్ని గోచరింప చేయడం — అన్నమాచార్యుల కవిత్వంలోని అత్యంత ఆశ్చర్యకరమైన
లక్షణాలలో ఒకటి.
ఆయన చెప్పే మాట ఒకటి;
ఆ మాట మన ముందుంచే దృశ్యం మరొకటి. పదాలు మాట్లాడుతున్నాయి. కానీ అవి మాత్రమే
కాదు. పదాలు బింబం కలిపి మాట్లాడుతున్నాయి. ఆయన “ఇది ఇలా
అర్థం చేసుకో” అని చెప్పాల్సిన అవసరం ఉండదు. చూడగలిగితే —
అర్థం అక్కడే ఉం టుంది.
ఇది ఆయనకు ఒక పద్ధతి అనిపించదు. ఆయన చూపినదే, మనము పరీక్షగా చూసినప్పుడు, మనకు
అపరిచితంగా కనిపిస్తుంది.
ఏ కాలమేది దనకెట్ల సుఖమైయుండు
మనం దైవాన్ని ఆశ్రయించడానికి ఒక
మంచి కాలం కోసం ఎదురు చూస్తాము. కానీ మన యత్నాలు, మన ఎదురుచూపులు అన్నీ కాలపు
ప్రవాహంతోనే ముడిపడి ఉంటాయి.
దైవాన్ని చేరడానికి సరైన సమయం వస్తుందని ఎదురు చూడటం అంటే, కాలంలో
కదులుతున్న మనస్సుతో
కాలాతీతాన్ని
అందుకోవడానికి ప్రయత్నించడమే.
అందుకే “మంచి కాలం” కోసం ఎదురు
చూడటమే ఒక ఉచ్చు.
కాలం మారాలని ఎదురు చూస్తున్న మనస్సే మారకుండా ఉంటుంది. అన్నమాచార్యులు
మనకు మరొక సమయాన్ని చూపించడం లేదు.
ఎదురుచూపును తొలగిస్తున్నారు. ఇప్పుడే. ఈ క్షణమే.
సమత్వము ఒక సవాలు
సావధానానఁ బెరిగీ సంసారవృక్షము
ఇక్కడ సంసారం ఒక
స్థిరమైన స్థితి కాదు. ఒక నిరంతరంగా జరుగుతున్న ప్రక్రియ. ఉత్సాహంతో, ఆసక్తితో, అనురక్తితో
ఏదైనా పట్టుకున్నా; దానిని
తలచుకున్నా; అనుభవించినా; లేదా దానిని
వదిలిపెట్టాలని ప్రయత్నించినా —
మనస్సు దానితో సంబంధం కలిగినంతకాలం సంసారవృక్షం పెరుగుతూనే ఉంటుంది.
అందుకే ఇది సమత్వానికి ఒక సవాలు. పట్టుకోవడమే
బంధం కాదు; వదిలిపెట్టాలని
పట్టుబట్టడమూ మరొక విధమైన పట్టుకోవడమే. సంసారం అంటే మనం చిక్కుకున్న ఒక సిద్ధమైన, మారని
పరిస్థితి కాదు.
ఒక కోరిక. దానికి
ఎదురుచూపు. దాని
వెనుక భయం. భయానికి
తోడు ఆధారం. ఆధారానికి
తోడు అనుబంధం. అనుబంధానికి
తోడు మరింత కోరిక.
ఇలా మనమే
తెలియక ఒక సంసారవృక్షాన్ని పెంచుకుంటాము. అన్నమాచార్యులు
ఫలితాన్ని మాత్రమే చూడరు.
అది ఎలా ఏర్పడిందో కూడా చూపిస్తారు.
మన చూపే మనకు అడ్డంకి కావచ్చు
గట్టిగాఁ దెలుసుకొంటే కన్నదే కంటి కురుమ
గట్టిగాఁ
దెలుసుకొంటే కన్నదే కంటి కురుమ
ప్రపంచంలో లోపం ఉందని అనుకోవడం సులభం. కానీ మన చూపే వంకరగా ఉంటే? మనసులోని తెరలే
చూసే దృశ్యానికి అడ్డుగా ఉంటే?
అప్పుడు ప్రపంచాన్ని మార్చడం కాదు — చూసే మనిషినే పరిశీలించాలి.
ఇక్కడ అన్నమయ్య బయటి ప్రపంచం నుండి
మన అంతరంగం వైపు చూపును తిప్పుతారు. జ్ఞానం కూడా మనల్ని మోసం చేయగలదు
వేదాంతశ్రవణము
వెట్టికిఁ జేసేరా
వేదాంతం వినడం, వేదాంతాన్ని
జీవించడం ఒకటి కాదు. మెట్లు ఎక్కినట్లు యాంత్రికంగా వేదాంతశ్రవణం చేసి పరమును
చేరలేము. ఇది వేదాంతాన్ని తిరస్కరించడం కాదు. విన్నదాన్ని
తెలుసుకున్నదిగా భావించే మన అలవాటును ప్రశ్నించడం.
ఇంత కఠినంగా మనిషిని పరిశీలించే
అన్నమాచార్యుల దృష్టిలో ఒక ప్రత్యేకమైన సౌమ్యత కూడా ఉంది.
మొల్లలేలె నాకు తన్నె ముడుచుకొమ్మనవె నేఁ
నా జీవితము ప్రకృతి చందము. ఆ మల్లెపూల
వాసనతో చేపల
కంపుకొడుతున్న నా కొప్పును నింపలేను. ఎందుకంటే ఏమి చేసినా ఈ కంపు పోదు. నా ఈ శరీరము
మలినము. నువ్వే
వచ్చి నా కొప్పులో ముడిచి పెట్టు.
ఈ శరీరం ఎలా ఉందో అలాగే ఉంది. దాని మలినతను దాచలేను. మల్లెపూల వాసనతో దాని
వాస్తవాన్ని మార్చలేను.
నేను ఉన్నట్లుగానే ఉన్నాను. నన్ను అలాగే అంగీకరించు.
దైవం ముందు మనిషి తన అసంపూర్ణతను
దాచుకోవాల్సిన అవసరం లేదనే అనుభవం ఇక్కడ కనిపిస్తుంది. అతనికి దైవం పరోక్షమైనది
కాదు. ప్రత్యక్షమైనది.
మరి ఆయనలోని
తత్వం ఎక్కడి నుండి వస్తుంది?
ఇంతవరకు చూస్తే ఒక విషయం
స్పష్టమవుతుంది.
అన్నమాచార్యులు తత్వాన్ని జీవితానికి అన్వయించలేదు. జీవితంలోనే తత్వాన్ని చూశారు. ఇంద్రియాలు, మనస్సు, కాలం, కోరిక, భయం, సంబంధం, సంసారం, దైవం — ఇవి
విడివిడిగా ఉన్న విషయాలు కావు.
ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయి.
మనస్సు ఇంద్రియాలతో కదులుతుంది. కాలం ఆ కదలికను
ముందుకు తీసుకెళుతుంది.
కోరిక ఎదురుచూపును సృష్టిస్తుంది. ఎదురుచూపు భయాన్ని పెంచుతుంది. భయం సంబంధాలను
మార్చుతుంది. సంబంధాలు
మరిన్ని కోరికలను సృష్టిస్తాయి.
ఒకటి లేకుండా మరొకటి పూర్తిగా అర్థం కాదు.
బహుశా ప్రపంచాన్ని విడివిడిగా ఉన్న
వస్తువుల సమూహంగా కాక, పరస్పర
ఆధారితమైన ఒక క్రమంగా
చూసిన తొలి దర్శులలో అన్నమాచార్యులు ఒకరై ఉండవచ్చు. అందుకనే వారి కీర్తనలలో
క్రమము, నెఱి, పదకము, పరిపాటి, బడి, లలి, వావిరి, సరవి, సొరిది, ఒగి వంటి
పదములు తరచుగా దొర్లుతూ ఉంటాయి. ఆ క్రమం మొత్తం మాటల్లో వ్యక్తం చేయడం సాధ్యం
కాకపోవచ్చు.
కానీ ఆయన దానిలోని ఏదో ఒక భాగాన్ని
— ఒక గడ్డపారతో, ఒక
పొలిమేరతో, ఒక పూల
వాసనతో, ఒక
చెట్టుతో, ఒక
ఆకలితో — మనకు
గోచరింప చేస్తారు.
సమత్వం —
చెప్పినది కాదు,
దర్శించినది
ఇక్కడే భగవద్గీతలోని సమత్వం గుర్తుకు
వస్తుంది. సమత్వం
ఆయనకు ఒక తాత్విక నిర్వచనం కాదు.
శృంగారాన్ని ఆధ్యాత్మికతకు విరుద్ధంగా నెట్టివేయరు. మనిషి కోరికను చూసి
అతన్ని తక్కువ చేయరు.
బలహీనతను చూసి ధిక్కరించరు. అజ్ఞానాన్ని దాచిపెట్టరు.
దైవాన్ని కూడా మనిషి జీవితానికి దూరంగా ఉంచరు.
విరుద్ధంగా
కనిపించే అనుభవాలన్నింటినీ ఒకే దర్శనంలో చూడగలగడం — ఆయనలోని సమత్వానికి ఒక రూపంగా
కనిపిస్తుంది.
అందుకే ఆయనను భగవద్గీత పేర్కొన్న సమత్వాన్ని వాస్తవంగా దర్శించిన యోగిగా
చూడవచ్చేమో అనిపిస్తుంది. కానీ దీనిని కూడా మరో నిర్వచనంగా
మార్చకూడదు.
ఐదు వందల
సంవత్సరాల తరువాత
మనం సినిమాల్లో ఇలాంటిదే తరచుగా
చూస్తుంటాము. నాయిక పాడుతుంటే మనకు కూడా ఆ భావం కలుగుతుంది. పాటలోని మాటలు ఒక
భావాన్ని చెబుతాయి; దృశ్యం, గానం రెండూ
కలిసి మనలను ఆ భావంలోకి తీసుకువెళతాయి. మనం దానిని విడిగా ఆలోచించము. అది మనలో
కలుగుతుంది.
అన్నమాచార్యుల దగ్గర ఈ పని మరింత
సంక్షిప్తంగా, మరింత
సూటిగా జరుగుతుంది. పది పంక్తులలోనో,
పద్నాలుగు పంక్తులలోనో ఒక చిన్న చిత్తరువును మన ముందుంచుతారు. దానికి పెద్ద
వివరణ ఉండదు. సిద్ధాంతం
ఆధారం కాదు.
ఒక బింబం ఉంటుంది; అది
నేరుగా మన మనస్సును తాకుతుంది.
“కుమ్మరింపుచుఁ
దెచ్చుకొన్నదీ వలపు”
— ఒక మాటలోనే ప్రేమలో మనం కలిపి తెచ్చుకున్నదేమిటో మన ముందుంచుతారు.
“ఊరులేని
పొలిమేర” — రెండు
మాటల్లోనే మనం ఎక్కడ నిలబడి ఉన్నామో తెలియని స్థితిని చూపిస్తారు.
ఆయన ఒక మానసిక స్థితికి పేరు
పెట్టి దాని గురించి వివరించరు.
ఒక బింబాన్ని మనలో వదిలేస్తారు. మిగిలినదాన్ని మన మనస్సే పూర్తిచేస్తుంది. ఆయన చూపించిన
వస్తువులు, దృశ్యాలు
ఆయన కాలానికి చెందినవే. కానీ వాటిలో కదిలే మనస్సు మాత్రం మనదే. అందుకే ఆ బింబాలు
కాలంతో పాతబడవు.
బహుశా అందుకే, ఐదు
వందల సంవత్సరాల తరువాత కూడా అన్నమాచార్యులను చదువుతున్నప్పుడు మనం గతంలోకి
వెళ్లినట్టనిపించదు. ఆయన మన ముందే కూర్చుని మనల్ని చూస్తున్నట్టనిపిస్తుంది.
అన్నమాచార్యుల కీర్తనలను ఒకదాని తరువాత మరొకటి పరిశీలిస్తూ
పోతే ప్రేమ, కోపం, భక్తి, అహంకారం, జ్ఞానం, మాయ, సంసారం, శృంగారము, సామాజిక భయం, ఆచారాలు, ఆధ్యాత్మిక
అన్వేషణ — ఇలా ఎన్నో రూపాలలో అవి మన ముందుకు వస్తాయి.
అయితే ఈ వైవిధ్యమంతటి వెనుక
నిరంతరం కదులుతున్న — మానవ మనస్సు కనిపిస్తుంది. అది ఎలా ఆకర్షితమవుతుంది, ఎలా
ఊహించుకుంటుంది, ఎలా
తనకోసం పరిధులను నిర్మించుకుంటుంది,
ఎలా వాటిలోనే చిక్కుకుంటుంది,
ఎలా తనను తాను సమర్థించుకుంటుంది,
ఎలా విముక్తిని కోరుకుంటూనే తన బంధాలను కొనసాగిస్తుంది — అన్నమాచార్యుల
కీర్తనలు ఈ చలనములు జరుగుతున్న క్షణాలను అనేక రూపాలలో మన ముందుంచుతారు.
అందువల్ల ఆయన కీర్తనల వైవిధ్యం
మనలను వేర్వేరు విషయాల దగ్గరకు తీసుకెళ్లినప్పటికీ, వాటి లోతులో మనం మళ్లీ మళ్లీ ఎదుర్కొనేది అదే — ఇంకా
పూర్తిగా అర్థం కాని, ఎన్నిసార్లు
చూసినా కొత్త దిశలను చూపించే మానవ మనస్సు.
No comments:
Post a Comment