Tuesday, 8 September 2026

T-1 అమ్మే దొకటియును అసిమలోని దొకటి

 తాళ్లపాక అన్నమాచార్యులు
1R అమ్మే దొకటియును అసిమలోని దొకటి


ఉపోద్ఘాతము

అన్నమాచార్యులు మన నిత్యజీవితంలో కనిపించే కపటాన్ని  తీవ్ర  పదజాలంతో విమర్శించారు. ఈ కీర్తనలో ఆయన మన నిజాయితీని ప్రశ్నిస్తూ మన హృదయాన్ని ఈటెల వంటి మాటతో గుచ్చుతారు. మన ఉద్దేశాలను ఎటువంటి ముసుగులు లేకుండా అంతఃపరిశీలన కోసం మన ముందే పరచి చూడమంటారు. ఆత్మ పరిశీలనలేని మాటలేలా? అన్నదాన్ని ధ్వనింపచేస్తారు.
అధ్యాత్మ​ సంకీర్తన
రాగి రేకు: 231-3  సంపుటము - సంకీర్తన: 3-176
అమ్మే దొకటియును అసిమలోని దొకటి
ఇమ్ముల మాగుణములు యెంచఁ జోటేదయ్యా ॥పల్లవి॥

యెప్పుడు నేము చూచిన నింద్రియకింకరులము
ఇప్పుడు నీకింకరుల మెట్టయ్యేమో
తప్పక ధనమునకు దాస్యము నేము సేసేము
చెప్పి నీదాసులమన సిగ్గుగాదా మాకు ॥అమ్మే॥

పడఁతుల కెప్పుడును పరతంత్రులము నేము
వడి నీ పరతంత్రభావము మాకేది
నడుమ రుచులకే నాలుక అమ్ముడువోయ
యెడయేది నిన్ను నుతి‌ఇంచే‌అందుకును        ॥అమ్మే॥

తనువులంపటానకు తగ మీఁదెత్తితిమిదె
వొనరి నీవూడిగాన కొదిగేదెట్టు
ననిచి శ్రీవేంకటేశ నాఁడే నీకు శరణంటి
వెనక ముందెంచక నీవే కావవయ్యా    ॥అమ్మే॥
Details and Explanations:
పల్లవి:
అమ్మే దొకటియును అసిమలోని దొకటి
ఇమ్ముల మాగుణములు యెంచఁ జోటేదయ్యా          ॥పల్లవి॥ 
భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
అమ్మేదొకటియు
ఏమి ఇస్తామని చూపిస్తామో / వాగ్దానం చేస్తామో అది ఒకటి
(మనం) బయటకు చూపించే రూపం ఒకటి;
అసిమలోనిదొకటి
(అసిమ = గోణి, సంచి)
సంచి లోపల ఉన్నది మరొకటి
మా అంతరంగంలో నిజంగా ఉన్నది మరొకటి . మా హృదయంలో దాగి ఉన్న అసలు ఉద్దేశం, కోరిక, స్వభావం బయట చూపించేదానికి భిన్నంగా ఉంటాయి
ఇమ్ములమా గుణములు యెంచ చోటేదయ్యా!
మా దుర్గుణాలను లెక్కించడానికి స్థలం ఎక్కడుందయ్యా?
మా కుటిలత్వాన్ని నీవు లెక్కించ లేవయ్యా
గూఢార్థవివరణము:
 
“అమ్మేదొకటియు” అనేది అమ్మకానికి పెట్టిన వస్తువుగానే కాకుండా  మనం బయటకు చూపించేది, ఇస్తామని చెప్పేది, మన గురించి ఇతరులకు కనిపించే రూపం అని కూడా ఊహించ వచ్చును. మనిషికి తనలో ఉన్నదే తాను పూర్తిగా తెలియకపోవచ్చును. అంటే మనది మనను కూడా పూర్తిగా గుర్తించలేని స్థితి.

ఈ విషయాన్నే తర్వాతి చరణములలో, మనం మన అంతరంగము  తెలియకయే  భగవంతుని కింకరులమని (సేవకులమని) దాసులమని, హరిని తప్ప వేరే ఎవరినీ తలచమని చెప్పుకొందుము. లంపటాలలో మునిగి శ్రీహరి ఊడిగానికి పాల్పడమని విమర్శిస్తున్నారు. అన్నమాచార్యులు పెదవులపై మాటలకు అంతరంగపు ఊహలకు పొంతన లేని వారమని చూపి, మానవుని చిత్తశుద్ధిని ప్రశ్నిస్తారు.

Bottom of Form


మొదటి చరణం:
యెప్పుడు నేము చూచిన నింద్రియకింకరులము
ఇప్పుడు నీకింకరుల మెట్టయ్యేమో
తప్పక ధనమునకు దాస్యము నేము సేసేము
చెప్పి నీదాసులమన సిగ్గుగాదా మాకు  ॥అమ్మే॥         
భావము:
కీర్తన
సాధారణ అర్థము
యెప్పుడు నేము చూచిన నింద్రియకింకరులము
ఎప్పుడూ చూసినా మేము ఇంద్రియాలకు దాసులమై ఉంటాము. మేము మా జీవితం వాటికి వశమైపోయాయి.
ఇప్పుడు నీకింకరుల మెట్టయ్యేమో
ఇప్పుడు మాత్రం మేము నీ కింకరులమని ఎట్లు చెప్పుకోగలము? (చెప్పుకోలేము) చెప్పుకున్నంత  మాత్రమున నీ దాసులమై పోతామా?
తప్పక ధనమునకు దాస్యము నేము సేసేము
ఎటువంటి మినహాయింపులు లేకుండా మేము మనస్పూర్తిగా ధనమునకు దాస్యులము.
చెప్పి నీదాసులమన సిగ్గుగాదా మాకు
అయినా  నీ దాసులమని చెప్పుకోవడానికి మాకు సిగ్గు ఉంటుందా? మా మాటలకు, చేతలకు పొంతన ఉండదే?
గూఢార్థవివరణము:

“ఎప్పుడు” — మన జీవితంలో ఎల్లప్పుడూ.
“ఇప్పుడు” — నీ ముందుకొచ్చినప్పుడు.

జీవితమంతా ఇంద్రియాలకు, ధనానికి దాసులమై ఉండి, నీ ముందుకొచ్చినప్పుడు మాత్రం “నీ దాసులము” అంటాము.

ధనానికి దాస్యము చేతల్లో కనిపిస్తుంది;
దైవానికి దాస్యము మాటల్లోనే మిగులుతుంది.

అన్నమాచార్యులు ఈ వైరుధ్యాన్నే మన ముందుంచుతున్నారు.

రెండవ చరణం:
పడఁతుల కెప్పుడును పరతంత్రులము నేము
వడి నీ పరతంత్రభావము మాకేది
నడుమ రుచులకే నాలుక అమ్ముడువోయ
యెడయేది నిన్ను నుతి‌ఇంచే‌అందుకును      ॥అమ్మే॥
భావము:
కీర్తన
సాధారణ అర్థము
పడఁతుల కెప్పుడును పరతంత్రులము నేము
స్త్రీల అడుగులకు మడుగులొత్తడనికి ఎప్పుడూ సిద్ధం మేము. వారి వశంలో ఉండడం మాకిష్టం.
వడి నీ పరతంత్రభావము మాకేది
మరి నీ పట్ల ఆ పరతంత్ర భావము మాలో ఎక్కడుంటుంది? మాకు స్త్రీల పట్ల ఉన్న ఇష్టము, మమకారము, అపేక్ష, ఆసక్తి, నీ పట్ల ఎక్కడా?
నడుమ రుచులకే నాలుక అమ్ముడువోయ
మా నాలుక మాత్రం రుచులకు విక్రయించబడినది. అమ్ముడుపోయింది.  అదే పనిగా అది ఇంకా ఇంకా రుచుల కోసం అతృతగా ఎదురుచూస్తోంది.
యెడయేది నిన్ను నుతించె అందుకును
ఎదురుచూపుల మధ్య  ఖాళి ఉంటేగా నిన్ను నుతింయించె అందుకును!
గూఢార్థవివరణము:

మాకు స్త్రీల పట్ల సహజంగా ఉండే ప్రేమ, కాంక్ష, కోరిక, కుతూహలం, తగులుబాటు, జంఝాటము నీ పట్ల ఎక్కడా? అంటే దానికి తగిన కారణముంది — కనబడే వాటికి తగులుకుంటాము; కనబడని నీకెందుకు తగులుకుంటామయ్యా!

“నడుమ రుచులకే” అన్నది గమనించదగినది. రుచులు పుట్టుకతో వచ్చినవి కావు; నడుమ వచ్చి నాలుకను ఆక్రమించుకున్నవి. రుచులతో మనసు మమేకమై పోయింది. మరి నీతో ఏకమేలాగౌతుంది మరి నీతో ఏకమేలాగౌతుంది

మాకు స్త్రీల పట్ల ముచ్చట హెచ్చు;
మాకు దైవంతో ముచ్చట లెచ్చట.

రుచులకు నాలుక అమ్ముడుపోబట్టి
నిన్ను తలచే సమయమే లేకుండే, సామీ!

మూడవ చరణం:
తనువులంపటానకు తగ మీఁదెత్తితిమిదె
వొనరి నీవూడిగాన కొదిగేదెట్టు
ననిచి శ్రీవేంకటేశ నాఁడే నీకు శరణంటి
వెనక ముందెంచక నీవే కావవయ్యా      ॥అమ్మే॥
భావము:
కీర్తన
సాధారణ అర్థము
తనువులంపటానకు తగ మీఁదెత్తితిమిదె
మాకై మేమే ఎత్తుకున్న లంపటాలు అధికమై ఈ దేహమును తనువును అలపింప చేసుకుంటున్నాం
వొనరి నీవూడిగాన కొదిగేదెట్టు
మరి పొందికగా నీకు ఊడిగం చేయడానికి,  మా ఈ అలసిపోయిన శరీరం ఎలా నీ సేవలో ఒదిగి ఉండగలదు?
ననిచి శ్రీవేంకటేశ నాఁడే నీకు శరణంటి
ననచు = చిగిరించు, వికసించు

అయినా కవిలో ఆశ  తగ్గలేదు. “శ్రీవేంకటేశా! ఆ కాలములోనే నీకు శరణు” అని అన్నాను.
వెనక ముందెంచక నీవే కావవయ్యా
మా గతాన్ని, మా  భవిష్యత్   ప్రవర్తనను గణించక , నీవే మమ్మల్ని కాపాడవయ్యా
గూఢార్థవివరణము:
ఈ చరణంలో ప్రశ్న మరింత తీవ్రమవుతుంది.
అయ్యా వెంకటేశ్వర!
తనువు లంపటాలకు తొణకదు;
దైవ సేవకు మాత్రం అణగదు.

 

చివరిగా:
మేమింతే
నిజాయితీ లేమింతే
బతుకు అతకరాదంతే
కొండలంత అయ్యను కోరితే —
అతుకుల బొంతను తెలియుమంతే!

X-X-X THE END X-X-X

Wednesday, 2 September 2026

T-342 నేరఁగల దొక్కటె నిశ్చలబ్రహ్మవిద్య

 తాళ్లపాక అన్నమాచార్యులు
342 నేరఁగల దొక్కటె నిశ్చలబ్రహ్మవిద్య
For English Version Press Here

 

ఉపోద్ఘాతము

ఈ కీర్తన పైకి చూస్తే అత్యంత సులభమైన మాటలతో చెప్పబడిన సాధారణ ఉపదేశంలా కనిపిస్తుంది. కానీ లోతుగా పరిశీలిస్తే ఇది గాఢమైన వేదాంత విచారణను కేవలం పద్నాలుగు సరళమైన పంక్తులలో కుదించిన కీర్తన అని తెలుస్తుంది.

అన్నమాచార్యులు మనలను మొదట సౌకర్యంగా ఉంచుతారు. సంసారధర్మము, నిద్ర, భజన, పనిపాటలు—మనకు తెలిసిన సాధారణ విషయాలనే ముందుకు తెస్తారు. వాటిని ప్రత్యేకంగా నేర్చుకోవలసిన అవసరం లేదని చెబుతూ మనము సులభంగా అంగీకరించే స్థితికి తీసుకువెళతారు.

కానీ ఒక్కొక్క పాదముతో ఆ సౌకర్యాన్ని క్రమంగా తొలగిస్తారు. మనము స్వయంగా నేర్చుకుంటున్నాము, నిర్ణయించుకుంటున్నాము, చేస్తున్నాము అనే “నేను” (కర్తృత్వము) పరిమితులను చూపిస్తారు. మనలో పనిచేస్తున్న అంతర్యామి ప్రేరణతో, ఈ జీవనచలనమంతా కేవలం ప్రకృతి ద్వారానే స్వయంచాలకంగా నడుస్తున్నదని చూపిన తరువాత, అదే చలనము నిశ్చలబ్రహ్మవిద్యను ఎరుగుటకు ఏ విధంగా అడ్డుగా నిలుస్తున్నదనే కఠినమైన ప్రశ్న ముందు మనలను నిలబెడతారు.

చివరికి “పట్టి” అనే ఒక్క పదముతో, సాధారణ ప్రయత్నాలకు అందని ఒక అసాధారణమైన దీక్షను సూచిస్తారు.

అందువల్ల ఈ కీర్తనలోని గొప్పతనం దాని పదాల సరళతలో మాత్రమే లేదు. అత్యంత గంభీరమైన వేదాంత విషయాన్ని ఎటువంటి భారమైన పదజాలము లేకుండా, పద్నాలుగు సాధారణ పంక్తులలో చెప్పి, వినేవారిని ముందుగా సౌకర్యపరచి, చివరికి కఠినమైన ఆత్మవిచారణ ముందు నిలబెట్టడమే కవి యొక్క అసాధారణమైన చాతుర్యము.
 
అధ్యాత్మ​ సంకీర్తన
రాగి రేకు: 142-2  సంపుటము - సంకీర్తన: 2-184
నేరఁగల దొక్కటె నిశ్చలబ్రహ్మవిద్య
వారివారి యంతర్యామే వచ్చి పెరరేఁచీని          ॥పల్లవి॥

వొక్కరు నేర్పఁగవద్దు వొగి సంసారధర్మము
దిక్కై పుట్టించిన ప్రకృతియ నేర్పీని
గుక్కక జంతులు చన్నుగుడుప నేరుపవద్దు
చక్కగా ననాదివాసనలే నేర్పీని              ॥నేరఁ॥

అంచ నెవ్వరు నిద్రవొమ్మని బుద్ధి చెప్పవద్దు
మించి వారి తమోగుణమే కప్పీని
కొంచక భజియించుమని కోరి యచ్చరించవద్దు
పెంచిన తనఁయాకలే పిలిచి తెచ్చీని ॥నేరఁ॥

అట్టె పనిపాటల అలవాటు చూపవద్దు
యెట్టైనా తనజాతే సేయిపించీని
వొట్టుక శ్రీవేంకటేశుఁ డున్నాఁడు కోనేటిదండ
పట్టి కొలిచినవారే భాగ్యవంతు లిలను        ॥నేరఁ॥
Details and Explanations:
పల్లవి:
నేరఁగల దొక్కటె నిశ్చలబ్రహ్మవిద్య
వారివారి యంతర్యామే వచ్చి పెరరేఁచీని       ॥పల్లవి॥
భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
నేరఁగల దొక్కటె నిశ్చలబ్రహ్మవిద్య
మానవుడు నేర్చుకొనగలిగినది నిశ్చలబ్రహ్మవిద్య ఒక్కటే.
మానవుడు ప్రత్యేకముగా ప్రయత్నించి నేర్చుకొనవలసినది నిశ్చలముగా ఉండుటకు సంబంధించిన బ్రహ్మవిద్య ఒక్కటే.
వారివారి యంతర్యామే వచ్చి పెరరేఁచీని
వారి వారి అంతర్యామియే వచ్చి వారికి నేర్పుచున్నాడు.
మనలో పనిచేయుచున్న అంతర్యామి ద్వారా వ్యక్తమగు ప్రకృతి, ప్రతి ఒక్కరినీ వారి వారి జీవనచలనములో నడిపించుచున్నది. అందువలన చలనములోని విషయములు ప్రత్యేకంగా నేర్చుకొనవలసిన పనిలేదు; ఆ చలనమే నిశ్చలబ్రహ్మవిద్యను నేర్చుకొనుటకు అడ్డుగా నిలుస్తున్నది. అంతర్యామిని మనకు వ్యక్తమై తెలిసినదానికే పరిమితము చేస్తే, అది అసంపూర్ణమైన అవగాహనే అవుతుంది.
గూఢార్థవివరణము:
“నేరఁగల దొక్కటె నిశ్చలబ్రహ్మవిద్య” — మానవుడు ప్రత్యేకముగా నేర్చుకొనవలసినది ఒక్కటే: నిశ్చలబ్రహ్మవిద్య. మిగిలిన జీవనచలనమంతా మనము విడిగా నేర్చుకొనవలసిన అవసరం లేకుండానే మనలో జరుగుచున్నది. తరువాతి చరణములలో కవి దీనినే ఉదాహరణలతో చూపించబోతున్నారు.

ఇక్కడ “నిశ్చల” అనే పదము ముఖ్యము. మనకు తెలిసిన జీవనము అంతా చలనముతో కూడినదే. ఆకలి, నిద్ర, సంసారధర్మము, పనిపాటలు—ఇవన్నీ ప్రకృతి ద్వారా మనలో సహజముగా జరుగుచున్నవి. నిశ్చలము మాత్రం ఆ చలనానికి మరో రూపము కాదు. అందుకే దానిని ప్రత్యేకముగా నేర్వవలసి వస్తున్నది.

అందువల్ల: “వారివారి యంతర్యామే వచ్చి పెరరేఁచీని” అనే పాదము ఈ కీర్తనకు కీలకమైనది. వారివారి అంతర్యామి ద్వారా వ్యక్తమగు ప్రకృతి, వారివారి జీవనచలనమును నడిపిస్తున్నది. ప్రకృతి తన పనిని తానే చేయుచున్నప్పుడు, దానిలోని విషయములను మనము విడిగా నేర్చుకొనవలసిన అవసరమే లేదు. అయితే అదే చలనములో నిత్యము కొనసాగుచుండగా నిశ్చలబ్రహ్మవిద్యకు మన దృష్టి ఎలా తిరుగుతుంది? అన్న ప్రశ్న ఇక్కడ మొదలవుతుంది.

ఇదే విషయాన్ని భగవద్గీత 2-59లోని: “రసవర్జం” — వాటియందలి రుచి, వాసన, ఆకర్షణ మనస్సులో మిగిలియుండును. అనే మాటతో సమాంతరంగా చూడవచ్చును. ఇంద్రియవిషయములు బయటకు దూరమైనా, వాటితో ఏర్పడిన అంతర్గత చలనము మనస్సులో కొనసాగుచుండును. అంటే చలనము బాహ్య విషయములలో మాత్రమే లేదు; అది మనలోనూ పనిచేయుచున్నది. కాబట్టి బయట విషయములను దూరము చేయడమే నిశ్చలత కాదు.

అయితే అంతర్యామిని మనకు వ్యక్తమై తెలిసినదానికే పరిమితము చేయుట తగదు. మనలో వ్యక్తమగుచున్న ప్రకృతి ఒక వైపు ఉండగా, దాని అవ్యక్త ఆధారము మరొక వైపు ఉండును. మనకు తెలిసిన చలనమంతటినీ అంతర్యామి యొక్క సంపూర్ణ స్వరూపముగా భావించినప్పుడు విచారణ అక్కడితో ఆగిపోతుంది.

ఈ దృష్టితో చూస్తే “వచ్చి పెరరేఁచీని” అనేది ఒక సాధారణ బోధ కాదు. మనలో ఇప్పటికే పనిచేయుచున్నదేదో మన జీవనమంతటినీ నడిపిస్తున్నది. అందులోనే ఉంటే చలనమే; చలనములోనే కొనసాగినంతవరకు నిశ్చలము దూరమగును. అయితే చలనాన్ని బలవంతముగా ఆపడం కూడా మరొక చలనమే కావచ్చును. కాబట్టి కవి వెంటనే పరిష్కారాన్ని చెప్పరు.

బదులుగా తరువాతి చరణములలో ఎవరూ ప్రత్యేకముగా నేర్పకుండానే ప్రకృతి మనకు ఏమేమి నేర్పిస్తున్నదో చూపిస్తారు. సంసారధర్మము నుండి ఆకలి, నిద్ర, పనిపాటల వరకు ఒక్కొక్కదానిని పరిశీలించినప్పుడు, పల్లవిలోని ప్రశ్న మరింత స్పష్టమవుతుంది:

ప్రకృతి మనకు చలనమంతటినీ నేర్పుచున్నప్పుడు, మనము ప్రత్యేకముగా నేర్చుకొనవలసిన నిశ్చలబ్రహ్మవిద్య ఏమిటి? ఈ ప్రశ్నతోనే కీర్తన ముందుకు సాగుతుంది.

Bottom of Form


మొదటి చరణం:

వొక్కరు నేర్పఁగవద్దు వొగి సంసారధర్మము
దిక్కై పుట్టించిన ప్రకృతియ నేర్పీని
గుక్కక జంతులు చన్నుగుడుప నేరుపవద్దు
చక్కగా ననాదివాసనలే నేర్పీని ॥నేరఁ॥      

భావము:
కీర్తన
సాధారణ అర్థము
అంతరార్థము
వొక్కరు నేర్పఁగవద్దు వొగి సంసారధర్మము
సంసారధర్మాన్ని ఎవరూ ప్రత్యేకంగా నేర్పవలసిన అవసరం లేదు.
సంసారధర్మము జీవనచలనము. అది సహజంగానే అబ్బినది. మనిషి ప్రత్యేకంగా నేర్చుకొన వలసినది కాదు.
దిక్కై పుట్టించిన ప్రకృతియ నేర్పీని
మనలను పుట్టించిన ప్రకృతియే మనకు దారి చూపి ఆ విషయాలను నేర్పుతుంది.
మనలో పనిచేస్తున్న ప్రకృతియే జీవనచలనానికి దిక్కుగా నిలిచి, మన చేత ఆచరణలను చేయించుచున్నది.
గుక్కక జంతులు చన్నుగుడుప నేరుపవద్దు
జంతువులకు ఆహారం ఎలా తినాలో ఎవరూ ప్రత్యేకంగా నేర్పరు.
జీవించుటకు సంబంధించిన సహజమైన చర్యలకు ప్రత్యేకమైన బోధ అవసరం లేదని కవి సాధారణమైన ఉదాహరణతో చూపుతున్నారు.
చక్కగా ననాదివాసనలే నేర్పీని

అనాదిగా వస్తున్న సహజమైన విధానమే వాటిని అలా నేర్పుతోంది.

ప్రకృతి తన సహజచలనములోనే ఈ వ్యవహారమంతటినీ నడిపిస్తున్నది. కాబట్టి చలనములోని విషయాలకు ప్రత్యేకమైన సంసిద్ధత అవసరం లేదు.

 

గూఢార్థవివరణము:

పల్లవిలో “నేరఁగల దొక్కటె నిశ్చలబ్రహ్మవిద్య” అని చెప్పిన తరువాత, ఈ చరణము దానికి మొదటి ఉదాహరణను ఇస్తున్నది. సంసారధర్మము మనిషి విడిగా కూర్చొని నేర్చుకొనవలసిన విద్య కాదు. మనలో పనిచేస్తున్న ప్రకృతియే మన జీవనచలనానికి దిక్కుగా నిలిచి, దానిని నడిపిస్తున్నది. అందువల్ల సంసారములోని సహజమైన వ్యవహారాలకు ప్రత్యేకమైన సంసిద్ధత అవసరం లేదు.

జంతువులకు ఆహారం ఎలా తీసుకోవాలో ఎవరు నేర్పుతారు? అనాదిగా వస్తున్న ప్రకృతి విధానమే వాటిని అలా చేయిస్తున్నది. కవి ఇచ్చిన ఈ సాధారణ దృష్టాంతం ద్వారా చలనము తనంతట తానే జరుగుతున్నదని చూపిస్తున్నారు.

ఇక్కడ పల్లవితో సంబంధం మరింత స్పష్టమవుతుంది. చలనములో ఉన్న విషయాలను ప్రకృతియే నేర్పుచున్నప్పుడు, మనిషి ప్రత్యేకముగా నేర్చుకొనవలసినది ఆ చలనానికి సంబంధించిన మరొక విషయం కాదు. “నిశ్చలబ్రహ్మవిద్య” ఒక్కటే ప్రత్యేకమైన ప్రశ్నగా మిగులుతుంది.

అందువల్ల ఈ చరణము యొక్క ఉద్దేశ్యం సంసారాన్ని విడిచిపెట్టమని చెప్పడం కాదు. “నేను నేర్చుకుంటున్నాను, నేను సిద్ధపడుతున్నాను, నేను నా జీవనాన్ని నడుపుతున్నాను” అనే భావానికి ముందే ప్రకృతి పనిచేస్తున్నదని చూపించడం. ఇదే విషయాన్ని భగవద్గీత 3-27లోని ప్రకృతి కర్మలను నడిపించుట అనే పరిశీలనతో సమాంతరంగా చూడవచ్చు.

ఇక్కడితో కవి సమాధానం ఇవ్వలేదు. బదులుగా ఒక పెద్ద ప్రశ్నను సిద్ధం చేశారు: ప్రకృతి మనకు చలనమంతటినీ నేర్పుచున్నప్పుడు, మనము ప్రత్యేకముగా నేర్చుకొనవలసిన నిశ్చలబ్రహ్మవిద్య ఏమిటి? అదే ప్రశ్నను రెండవ చరణము మరింత కఠినంగా చేస్తుంది.

రెండవ చరణం:

అంచ నెవ్వరు నిద్రవొమ్మని బుద్ధి చెప్పవద్దు
మించి వారి తమోగుణమే కప్పీని
కొంచక భజియించుమని కోరి యచ్చరించవద్దు
పెంచిన తనఁయాకలే పిలిచి తెచ్చీని ॥నేరఁ॥

భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
అంచ నెవ్వరు నిద్రవొమ్మని బుద్ధి చెప్పవద్దు
నిద్రించమని ఎవ్వరూ ప్రత్యేకముగా బుద్ధి చెప్పవలసిన అవసరం లేదు.
మనిషి తన సహజస్థితిలో ఉన్నాడని భావించుట సరికాదు. అతని స్థితిలో పనిచేస్తున్న ప్రకృతిని, దాని ఆవర‌ణాన్ని గమనించాలి.
మించి వారి తమోగుణమే కప్పీని
వారి తమోగుణమే వారిని కప్పివేసింది.
మనిషి యొక్క ఎఱుకను తమోగుణమే కప్పివేస్తున్నది. అందువల్ల మనము సహజస్థితి అనుకొనేది కూడా ప్రకృతి గుణముచే ఆవరించబడిన స్థితి కావచ్చు.
కొంచక భజియించుమని కోరి యచ్చరించవద్దు
కొంచెమైనా భజించమని ఎవరిని ప్రత్యేకముగా కోర అవసరం లేదు.
భుజించుటను కూడా మనలోని అంతర్గత ప్రేరణ దానిని నడుపుతున్నది.
పెంచిన తనఁయాకలే పిలిచి తెచ్చీని
పెరిగిన తన ఆకలియే పిలిచి తీసుకువచ్చింది.
తనలో కోరికల ప్రేరణ పెరిగి ఆకలి అనే చలనాన్ని కలిగించుచున్నదని కవి సూచిస్తున్నారు.
గూఢార్థవివరణము:

“అంచ నెవ్వరు నిద్రవొమ్మని బుద్ధి చెప్పవద్దు” — నిశ్చల బ్రహ్మవిద్య ఒకవైపు. దానికి వ్యతిరేకమైనది ఇంకొక వైపు. మనము సహజంగా కనులు తెరిచి ఉన్నప్పటికీ నిద్రలో ఉన్నామని చెబుతున్నారు  అన్నమాచార్యులు. మనము మన సహజస్థితిలో ఉన్నామని అనుకొనుటే ప్రశ్నార్థకము. తమోగుణమే అతనిని కప్పివేస్తున్నది.

ఇక్కడ భగవద్గీత 14-8తో ఈ పాదానికి ఒక స్పష్టమైన సమాంతరము కనిపిస్తుంది: తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ । ప్రమాదాలస్య నిద్రాభిస్తన్నిబధ్నాతి భారత ॥ (భావము:: తమోగుణము అజ్ఞానమునుండి పుట్టి, దేహులను మోహింపజేసి, ప్రమాదము, ఆలస్యము, నిద్ర ద్వారా బంధిస్తుందని గీత చెబుతుంది.) అందువల్ల అన్నమాచార్యులవారి “తమోగుణమే కప్పీని” అన్న మాటను కేవలం నిద్రకు కారణముగా కాక, మన సహజ ఎఱుకను ఆవరించు స్థితిగా చూడాలి.

ఇక్కడితో కవి ఆగరు. వెంటనే కవి భుజించుటను తెరపైకి తీసుకొస్తారు. భుజించుటను ఆకలికి  సమానం చేయరాదు. ఆకలి వేసినప్పుడు తినేది వేరు. భుజించడం మనసు ప్రేరేపించగా  చేసేది. అయితే కవి ఇక్కడ భుజించుటను తిరస్కరించడం లేదు. భుజించుటకు కూడా “నేను స్వయంగా నిర్ణయించాను” అనే కర్తృత్వాన్ని వెంటనే ఆపాదించవద్దు అని సూచిస్తున్నారు.

ఇలా చూస్తే రెండవ చరణం మొదటి చరణం చెప్పిన విషయాన్ని కేవలం మరొక ఉదాహరణతో కొనసాగించదు. మొదటి చరణంలో ప్రకృతి మన జీవనచలనాన్ని నడిపిస్తుందని చెప్పిన తరువాత, రెండవ చరణంలో ఆ చలనంలో ఉన్న మన స్థితిని కవి ప్రశ్నిస్తున్నారు. నిద్ర వస్తుంది. ఆకలి వస్తుంది. ఆకలి ఆధారంగా కార్యము జరుగుతుంది. ఇవన్నీ మనకు సహజమైనవిగా అనిపిస్తాయి. కానీ తమోగుణము మనలను కప్పివేస్తున్నప్పుడు, ఆ స్థితినే మన సహజస్థితి అని ఎలా నిశ్చయించగలం?

ఇక్కడే పల్లవిలోని “నిశ్చలబ్రహ్మవిద్య” మరింత గంభీరమవుతుంది. చలనము ప్రకృతికి సహజము. కానీ నిశ్చలము ఆ చలనంలో మరొక సాధించవలసిన విషయం కాదు. అంతేకాదు, మనము చలనములో ఉన్న స్థితినే సహజస్థితిగా భావిస్తూ ఉంటే, నిశ్చలమును ఎరగడానికి మొదట మన స్వీయ నిశ్చయానికే ఉన్న పరిమితిని చూడవలసి వస్తుంది.

మూడవ చరణం:

అట్టె పనిపాటల అలవాటు చూపవద్దు
యెట్టైనా తనజాతే సేయిపించీని
వొట్టుక శ్రీవేంకటేశుఁ డున్నాఁడు కోనేటిదండ
పట్టి కొలిచినవారే భాగ్యవంతు లిలను ॥నేరఁ॥

భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
అట్టె పనిపాటల అలవాటు చూపవద్దు
పనిపాటలు, వాటి అలవాట్లు ప్రత్యేకంగా నేర్పవలసిన అవసరం లేదు.
మనిషి తన జీవనము జీవించుటకు ప్రత్యేకంగా పనిపాటలు నేర్వవలసిన పని లేదు; సహజంగా జరుగుతున్న ఆ చలనానికి సంసిద్ధత అవసరం లేదు.
యెట్టైనా తనజాతే సేయిపించీని
ఎట్టి పరిస్థితిలోనైనా తన జాతియే ఆ పనులను చేయిస్తుంది.
మనము స్వతంత్రంగా చేసుకుంటున్నామని భావించే అలవాట్లు, పనులు కూడా ఆ ప్రకృతి చలనంలోనే జరుగుతున్నవి.
వొట్టుక శ్రీవేంకటేశుఁ డున్నాఁడు కోనేటిదండ
ఒట్టుగా చెబుతున్నాను—కోనేటిదండ వద్ద శ్రీవేంకటేశుడు ఉన్నాడు.
ఆ ప్రకృతి చలనానికి భిన్నమైన నిశ్చలమైన సత్యంగా శ్రీవేంకటేశుడు మనలోనే ఉన్నాడని కవి నిశ్చయంగా చెబుతున్నారు.
పట్టి కొలిచినవారే భాగ్యవంతు లిలను
ఆయనను పట్టుకొని కొలిచినవారే ఈ లోకంలో భాగ్యవంతులు.
ఆ ప్రకృతి తనను ఎంతగా పట్టుపట్టి నడిపించినా, శ్రీవేంకటేశుని దీక్షతో, విసుగు లేక, శ్రమ అనుకోక, తాను కోల్పోతున్నదేమిటో లెక్కచేయక పట్టుకొని కొలిచినవారే భాగ్యవంతులు.
గూఢార్థవివరణము:

మొదటి చరణంలో సంసారధర్మాన్ని ప్రత్యేకంగా నేర్పవలసిన అవసరం లేదని, ప్రకృతియే దానిని నేర్పుచున్నదని కవి చెప్పారు. రెండవ చరణంలో ఆ విషయాన్ని మరింత కఠినం చేశారు. మనము నిద్రించుటలోను, భజించుటలోను మన స్వతంత్ర నిశ్చయము అని చెప్పలేము; తమోగుణము కప్పి, ఆకలివంటి సహజ కదలికలు మనలను నడిపిస్తున్నాయి. అంటే మన నిశ్చయానికే పరిమితి ఉన్నది.

మూడవ చరణంలో అదే విషయాన్ని పనిపాటల అలవాట్ల వరకు తీసుకొస్తున్నారు. “అట్టె పనిపాటల అలవాటు చూపవద్దు” — జీవనచలనానికి సంబంధించిన అలవాట్లను మనిషి ప్రత్యేకంగా ఏర్పరచుకొని, వాటి ద్వారా తనను తాను తయారుచేసుకోవలసిన అవసరం లేదని సూచన.

“యెట్టైనా తనజాతే సేయిపించీని” — ఎందుకంటే ఎట్టి పరిస్థితిలోనైనా తనలో పనిచేస్తున్న ప్రకృతియే చేయించుచున్నది. ఇక్కడ “తనజాతి” అన్నది మనిషి తనకు తాను ఎంచుకున్న స్వభావం కాదు; తనను నడిపిస్తున్న సహజ ప్రకృతి. ఇక్కడ భగవద్గీత మూడవ అధ్యాయంలోని పరిశీలనలు గుర్తుకు వస్తాయి.

ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః ।
అహంకారవిమూఢాత్మా కర్తాహమితి మన్యతే ॥ 3-27 ॥
అలాగే:
ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి । ॥ 3-33 ॥

అంటే కర్మలన్నీ ప్రకృతి గుణములచే జరుగుతున్న స్థితిలో, “నేను నా చలనాన్ని నేను నిర్మించుకుంటాను” అనే నిశ్చయానికి ఒక హద్దు ఉన్నది. అక్కడే మూడవ పాదం వస్తుంది:

“వొట్టుక శ్రీవేంకటేశుఁ డున్నాఁడు” ఇది కవి చేసే ఒక నిశ్చయ ప్రకటన. ప్రకృతి చలనం గురించి ఎంత చెప్పినా, దాని మధ్యలో నిశ్చలమైనదేదో ఉన్నది. దానిని కవి శ్రీవేంకటేశునిగా సూచిస్తున్నారు.

అప్పుడు చివరి పాదంలోని “పట్టి” అత్యంత ముఖ్యమవుతుంది. ప్రకృతి మనలను తన చలనంలోకి పట్టుకొని నడిపిస్తున్నది. దానికి విరుద్ధంగా, మనము శ్రీవేంకటేశుని పట్టాలి. ఈ “పట్టి” సాధారణమైన పట్టుకోవడం కాదు. దీక్షతో పట్టి, విసుగు లేక పట్టి, శ్రమ అనుకోక పట్టి, మధ్యలో విడువక పట్టి, తాను ఏమి కోల్పోతున్నాడో లెక్కచేయక పట్టి ఉండే అసాధారణమైన పట్టుదల.

అందుకే కవి: “పట్టి కొలిచినవారే భాగ్యవంతులు” అంటున్నారు. ఇలా చూస్తే మూడవ చరణం మొదటి రెండు చరణాలకు కేవలం ముగింపు కాదు. మొదట ప్రకృతి మనలను నడిపించుట, తరువాత ఆ ప్రకృతి మధ్యలో మన నిశ్చయానికే ఉన్న పరిమితి, చివరికి ఆ చలనానికి అతీతమైన నిశ్చలమైనదాన్ని పట్టవలసిన అసాధారణమైన దీక్ష—ఈ క్రమం ఏర్పడుతుంది. 

పల్లవిలో చెప్పిన “నేరఁగల దొక్కటె నిశ్చలబ్రహ్మవిద్య” ఇక్కడ తన పూర్తి ప్రాధాన్యాన్ని పొందుతుంది. చలనములోని విషయాలను నేర్చుకోవడం ప్రకృతికే వదిలివేయవచ్చు; నిశ్చలమైనదాన్ని ఎరగడం మాత్రం మన సాధారణ చలనంతో సాధ్యమయ్యే మరొక విద్య కాదు. అందుకే కవి చివరికి “పట్టి” అనే ఒక్క పదంతో ఆ విచారణకు కావలసిన అసాధారణమైన మలుపును చూపిస్తున్నారు.


X-X-X THE END X-X-X

211R komma tana mutyāla koṃgu jāraṃ̐gaṃ̐ bagaṭu (కొమ్మ తన ముత్యాల కొంగు జారఁగఁ బగటు)

TALLAPAKA ANNAMACHARYULU 211R కొమ్మ తన ముత్యాల కొంగు జారఁగఁ బగటు (komma tana muty ā la ko ṃ gu j ā ra ṃ̐ ga ṃ̐ baga ṭ u) తెలుగులో చదవడానికి...