262R ఇప్పుడే తెలుసుకో నీకెఱఁగ విన్నవించితి
ఉపోద్ఘాతము
అన్నమాచార్యులు మన మనస్సులలో ఆ మాయ తెలియకుండ ఎలా చొచ్చుకొని
పోతుందో అద్భుతంగా వివరించారు. ఆ ప్రయోజన సిద్ధికే శృంగార కీర్తనగా మలిచారు.
ప్రతీ అన్నమాచార్యుల కీర్తన ఒక చిక్కుముడి వంటిది. ఆ
చిక్కుముడిని విప్పకుండానే కీర్తనను ఆస్వాదిస్తే ఒక మంచి అనుభూతి కలుగుతుంది. కానీ
ఆ చిక్కుముడిని విప్పే ప్రయత్నం చేస్తే అన్నమాచార్యుల అంతరంగం మనకు
స్పష్టమవుతుంది.
కేవలం పద్నాలుగు పంక్తులలో ఆయన ఏమి దాచారు? ప్రపంచం, మాయ,
దైవం—అన్నీ మన కళ్ల ముందే ఉన్నాయని అంటున్నప్పుడు, కళ్లుండి కూడా మనం చూడలేకపోతున్నది ఏమిటి? "ఇప్పుడే
తెలుసుకో. నీకెఱఁగ విన్నవించితిని" అని అన్నమయ్య
ఎందుకు అంటున్నారు? మనం ఇంకా తెలుసుకోలేకపోతున్నది ఏమిటి?
దైవంతో మనకున్న అనుబంధం నిజమైనదా, లేక మన
భావనలో మాత్రమే ఉన్నదా? దైవచింతన మన జీవితాన్ని తాకుతున్నదా,
లేక అదొక కాలక్షేపంగా మిగిలిపోతున్నదా?
రండి, ఈ
అలోకిక కీర్తనలోని చిక్కుముడిని విప్పుతూ, అన్నమయ్య
అంతరంగాన్ని ఆమూలాగ్రం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
|
శృంగార కీర్తన
|
|
రేకు: 542-2 సంపుటము: 13-186
|
|
ఇప్పుడే తెలుసుకో నీకెఱఁగ
విన్నవించితి కొప్పువ ట్టీకె దీసితే గుంపించఁ
గలవా ॥పల్లవి॥ పుత్తడిబొమ్మవలె పూచిన లతికవలె చిత్తరుపతిమెవలెఁ జెలి యున్నది మత్తిల్లి యప్పటి నేఁడు మాతో
నేమినవ్వేవు వొత్తుకాపె విలిచితేఁ బోకుండఁగలవా ॥ఇప్పు॥ కొసరుఁగోయిలవలె కొలనితుమ్మిదవలె పసని చిలుకవలెఁ బలికీనాపె నసలు సేయుచు నిట్టే నాతో
మాటలాడేవు వొసగితే విడెమాకె వొల్లననఁగలవా ॥ఇప్పు॥ మెత్తినగందమువలె మెడకంటసరివలె ముత్తెమువలెనే వురమున నుందాకె హత్తి శ్రీవేంకటేశుఁడ అట్టె
నన్నుఁగూడితివి బత్తి సేసితివాపెతోఁ బంతమాడఁగలవా ॥ఇప్పు॥
|
Details
and Explanations:
ఇప్పుడే తెలుసుకో నీకెఱఁగ విన్నవించితి
కొప్పువ ట్టీకె దీసితే గుంపించఁ గలవా ॥పల్లవి॥
|
Telugu
Phrase
|
Meaning
|
|
ఇప్పుడే
తెలుసుకో
|
వెంటనే
గ్రహించు, (ఇప్పుడు లేదా ఎప్పటికీ కాదు అన్న
అత్యవసర భావము)
|
|
నీకెఱఁగ
విన్నవించితి
|
నేను
ముందే నీకు స్పష్టముగా వివరించితిని
|
|
కొప్పువ
ట్టీకె దీసితే
|
(కొప్పు = జుట్టు పట్టి; ఈకె = ఆ స్త్రీ, మాయ) మాయ స్త్రీ నిన్ను జుట్టు పట్టి లాగుతూ ఉంటే
|
|
గుంపించఁ
గలవా
|
(గుంపించు = అతిక్రమించు) నువ్వు తట్టుకోగలవా?
ఆ కఠిన పరీక్ష మీర గలవా?
|
సూటి భావము:
ఇప్పుడైనా
తెలుసుకో. ఈ విషయం నీకు ఇదివరకే చెప్పాను. ఆ మాయ నీ కొప్పు పట్టుకుని ఈడ్చుకుపోతే, ఆ పట్టును తట్టుకుని నిలబడగలవా?”
ఇక్కడ ఎవరో
ఒక స్త్రీ చనువుగా, కొంత కఠినంగా హెచ్చరిస్తున్నట్లుగా
ఉంటుంది. కీర్తనలోని సందర్భాన్ని బట్టి చూస్తే, తల్లి మాటలలోని
తీవ్రతతో, ఒక అలౌకిక స్వరము అర్దృతతో హెచ్చరించుచున్నదని తెలుస్తుంది.
గూఢార్థవివరణము:
ఇప్పుడే
తెలుసుకో: ఇప్పుడే
తెలియడంలోనూ ఆతర్వాత తెలియడంలోని వ్యత్యాసం ఉన్నది అన్నమాచార్యులు నొక్కి
చెబుతున్నారు — "ఇప్పుడే తెలుసుకో" మంటున్నారు. తక్షణం చేయకపోతే, కొంచెం ఆగినా మనస్సు ఆకళింపు చేసుకొని తన ఆత్మ రక్షణ వ్యూహంతో సిద్ధంగా
ఉంటుంది. ఆ సన్నాహములు మనకు అభద్రతాభావాన్ని కలిగించవచ్చు. కానీ నిజంగా మనలో ఏమి
జరుగుతోందో చూడకుండా కూడా తప్పించవచ్చు. "రేపు చేస్తాను" “భవిష్యత్తులో
చేస్తాను" అన్న భద్రత కల్పిస్తుంది. ఆ రక్షణ వలయం నుంచి బయటకు రాలేక
గింజుకుంటాం. (జిడ్డు కృష్ణమూర్తి కూడా ఇలానే చెప్పేవారు).
కొప్పువ
ట్టీకె దీసితే: జుట్టు
పట్టి బలంగా లాగుతుంటే, మూలమూలల్లో నెప్పెడుతుంటే తట్టుకోలేం? ఈ స్వీయ అవగాహన ప్రయాణంలో బాధ అనేది ఆటంకహేతువు. ఇక్కడే మనసు పని మొదలు.
"ఇంత కష్టం కాకుండ కొంత సులుభంగా పొందు మార్గములుండవచ్చు" అన్న భద్రత
కల్పిస్తుంది. మనసు ఎలా మాయ చేస్తోందో చరణాలలో తెలిపారు.
అన్నమాచార్యుల
వారి "కొప్పువ ట్టీకె దీసితే"ని
— రెనె మాగ్రిట్ గారి ది బ్లడ్ ఆఫ్ ది వరల్డ్ (రక్తసిక్త ప్రపంచం)తో కలిపి
చూడవచ్చును.
ది
బ్లడ్ ఆఫ్ ది వరల్డ్ — రెనె మాగ్రిట్ (1926)
ఈ
చిత్రంలో కాళ్ళు, చేతులు చిందరవందరగా పడివున్నట్లు
కనిపిస్తాయి. పాక్షికంగా కప్పివున్న గుండ్రని రూపాలు ఏమిటో స్పష్టంగా తెలియదు.
మొత్తం దృశ్యం ఒక భయానకమైన, వికృతమైన అంతరంగాన్ని మనముందు
ఆవిష్కరిస్తుంది. మనం సాధారణంగా గ్రహించలేని రీతిలో ఈ బొమ్మ మనసులో ఒక అస్థిరతను
కలిగిస్తుంది. మనిషి అంతరంగంలో దాగివున్న అశాంతికి, కలవరాలకు
ఈ చిత్రం ఒక దృశ్యరూపంలా నిలుస్తుంది. ఈ అశాంతి, కలవరాలే మన
చేతల్లో ప్రతిఫలిస్తాయి.
'ఇప్పుడే తెలుసుకో' 'కొప్పువ ట్టీకె దీసితే' 'ది బ్లడ్ ఆఫ్ ది వరల్డ్ (రక్తసిక్త ప్రపంచం)' మూడు
కూడా పనిచేయునది మనసు మీదనే. ఏ పనియైనా చేయుటకు ఉద్యమించుటనే సంకల్పము అనవచ్చును.
సంకల్పమునకు మూలము మనసు. అందువలననే ఇక్కడ
అవ్యక్త స్వరము ఆ సంకల్పమునకు గల పరిమితులను చూపుతున్నది.
సంకల్పం —అడ్డంకి:
ఈ యజ్ఞంలో బలి కావలసింది
మన సంకల్పమే.
“అమలమగు విజ్ఞానమను మహాధ్వరమునకు–
నమరినది సంకల్పమను మహాపశువు…” (Ref Poem 39)
మనిషి తాను సిద్ధమౌతాను, తాను సిద్ధం
చేసుకొంటాను అని చెప్పుకుంటే అదే అడ్డంకి. (గీతా 6-2
చూడండి)
ఈ సందర్భంగా
అన్నమాచార్యులు శరణాగతిలోని బాధ గురించి ఎక్కువ ఆలోచించ వద్దంటూ ఇలా చెప్పారు.
వెరవకువే
యింత వెరగేలా నీకు
నెఱిఁ గురిసీఁ
గొప్పున నీలాలు ॥పల్లవి॥
ఇంతగా
భయపడవద్దు. ఆ వక్రతలోనే (ఆ మార్పులోనే, ఆ రూపాంతరములోనే) నీలాలు నీ కొప్పులో కురుస్తాయి అని సముదాయిస్తున్నారు
అన్నమాచార్యుల
వ్యూహం:
ఈ లోతైన
సత్యం భయంకరముగా, అసౌకర్యంగా అనిపించవచ్చు. ఆ అనిర్వచనీయమైన
మార్పు లోక సంక్షేమమునకు, అసాధ్యమైన దానిని సులభముగా ప్రజల ముందుంచారు. దానికి
ఆయన శృంగారము అద్ది — ప్రేమ, కలహం, మాధుర్యముల
ద్వారా అందరిని ఆకర్షించారు.
సారాంశం
- ఇప్పుడే చూడు. ఆలస్యం
చేయకు.
- పాత conditioning నుండి లాగిపడవేయబడటం బాధాకరం.
- దాన్ని మానవ సంకల్పం ఆపలేదు; సమర్పణ మాత్రమే రక్షణ.
- ఆ సమర్పణలోనే వ్యక్తిత్వం కరుగుతుంది.
మొదటి చరణం:
పుత్తడిబొమ్మవలె పూచిన లతికవలెచిత్తరుపతిమెవలెఁ జెలి యున్నదిమత్తిల్లి యప్పటి నేఁడు మాతో నేమినవ్వేవువొత్తుకాపె విలిచితేఁ బోకుండఁగలవా ॥ఇప్పు॥
|
Telugu Phrase
|
Meaning
|
|
పుత్తడిబొమ్మవలె
|
పుత్తడిబొమ్మవలె
|
|
పూచిన లతికవలె
|
పూచిన లతికవలె
|
|
చిత్తరుపతిమెవలెఁ జెలి యున్నది
|
చిత్రపటమువలె అందముగా కనబడుతుంది
|
|
మత్తిల్లి యప్పటి నేఁడు మాతో నేమినవ్వేవు
|
నిన్నటి మత్తులో నుండి నేడు మాతో నవ్వబోతావు
|
|
వొత్తుకాపె విలిచితేఁ బోకుండఁగలవా
|
(తిరిగి) పొత్తులకు ఆమె పిలిచితే పోకుండా
నిలువ గలవా? (లేవు)
|
(అవ్యక్త స్వరము అంటున్నది) ఆమె మాయ పుత్తడిబొమ్మవలె మెరుస్తూ, కొత్తగా పూసిన లతికవలె సొగసుగా, చిత్రపటమువలె
మైమరచిపోయే అంత అందముగా కనబడుతుంది. ఆకర్షణ, ఆప్యాయత,
సులభముగా అందినదని అనిపించే మత్తు నవ్వులతో మనసును బంధిస్తుంది.
కానీ నిన్నటి మత్తులో నుండి బయటపడకనే నేడు మాతో (దైవముతో) నవ్వే చనవు
తీసికోబోతావు. ఆ మాయ (తిరిగి) పొత్తులకు
పిలిచితే పోకుండా నిలువ గలవా? (లేవు).
అన్నమాచార్యులు
అందమైన దృశ్యమును కాదు, మనకు తెలిసిన దానిలోని లోపములను ఎత్తి
చూపుతున్నారు. నిన్నటి (గత అనుభవముల) మత్తులో నుండి బయటపడకుండా దైవముతో కలిసే చనవు వ్యర్థమనుచున్నారు. మాయలో
పడిన సంగతి కూడా గుర్తించలేని మన అశక్తతను చూపుతున్నారు.
గూఢార్థవివరణము:
మత్తిల్లి
యప్పటి నేఁడు మాతో నేమినవ్వేవు:
పూర్వానుభవముల మత్తును వదలించుకొనకుండా దైవముతో కలిసి నవ్వే చనవు
అనవసరమనుచున్నారు. మనిషి అందుకోగలిగిన, ఆస్వాదించగలిగిన, రుచి చూడగలిగిన, కొలవగలిగిన, అంతస్తులున్న,
ఏదోవొక రీతిలో నిరూపించగలిగిన వాటిపట్లే ఆకర్షితుడవుతాడు. అందుకే
భక్తి, సంకీర్తనము అంటూ అనేక ప్రయత్నములను చేయును. వీటిని
అంగీకరించడం సులువు. సమాజం సహజంగానే వీటినే ప్రోత్సహిస్తుంది, ఆరాధిస్తుంది.
కానీ
క్రూరమైన వాస్తవం ఏమిటంటే —మనిషికి కావలసింది సత్యం కాదు. సత్యం గురించి మాట్లాడటమే
కావలసింది. అందుకే వేలాది సంవత్సరాలుగా ఒక “ఆధ్యాత్మిక వినోదం” అనే పరిశ్రమ
ఏర్పడింది: గ్రంథాలు, వాటిపై వ్యాఖ్యానాలు,
ప్రబంధములు, నాటకాలు, యాగాలు,
వేదికలు, వేడుకలు, బుర్రకధలు,
స్థానిక/భాషా రూపాంతరాలు, సినిమాలు, టీవీ సీరియల్స్, మహత్తరమైన
ఊరేగింపులు. ఇవన్నీ ప్రజలను మరింత “ఆధ్యాత్మికంగా” భావింపజేస్తాయి. ఇంకా రసవత్తరమైన
ప్యాకేజీ కోసం వీటిలొ శృంగారాన్ని చొప్పిస్తారు కూడా. ఈ
ఆకర్షణను ఎవ్వరూ కాదనలేరు.
ఇలాంటి
నేపథ్యములో అన్నమాచార్యులు ఒక్కసారిగా సూదికొన నిశితత్వముతో అడుగుతున్నారు: “ఆమె పొత్తులకు పిలిచితే పోకుండా నిలువ
గలవా?
జవాబు: నిర్దాక్షిణ్యంగా లేదు.
ఎందుకంటే
మాయ బిచ్చ మెత్తుకుంటూ రాదు. ఆమె బంగారు బొమ్మలా, వికసించిన
లతలా, వెలిగే చిత్రపటంలా వస్తుంది. ఆహ్లాదకరంగా, మనోహరంగా, మత్తెక్కించేలా ఆకర్షిస్తుంది. ఒక క్షణం
నీతోనే నవ్వుతుంది కూడా — పరిచయమై, హాని లేనట్టుగా. ఇలాంటి రూపాన్ని వదిలి, లంగోటీ బట్టల సాములతో ఎవరు వెళతారు చెప్పండి? ఆమె పిలుపు రాగానే స్వాములవెంట పరుగెత్తే
కొద్ది మంది కూడా రెక్కలొచ్చి ఎగిరిపోతారు. పాపం ఆ స్వామికి కూడా సందేహం పుట్టుకొచ్చేలా!
కొసరుఁగోయిలవలె
కొలనితుమ్మిదవలె
పసని
చిలుకవలెఁ బలికీనాపె
నసలు
సేయుచు నిట్టే నాతో మాటలాడేవు
వొసగితే
విడెమాకె వొల్లననఁగలవా ॥ఇప్పు॥
|
Telugu phrase
|
Meaning
|
|
కొసరుఁగోయిలవలె
|
కోయిల వలె తీయగా అనురాగముతో పిలుస్తే
|
|
కొలనితుమ్మిదవలె
|
నిండు కొలనులోని
పద్మముల చుట్టూ తుమ్మెదలలాగ కవి కమలముల (మదిలో భావము, కొత్తదనము, చిలిపితనము
కవ్వించుచుండగా)
|
|
పసని చిలుకవలెఁ బలికీనాపె
|
లేతపచ్చని చిలుకలాగా ఆమె వేళాకోళం ఆడుతుంటే, కొత్త రంగులకళ నాట్యమాడుతుంటే
|
|
నసలు సేయుచు నిట్టే నాతో మాటలాడేవు
|
(నసలు = పొద్దుపుచ్చు) ఏదో పొద్దుపుచ్చు కలాపములుగా నాతో ఇలా మాట్లాడుతున్నవు కానీ
|
|
వొసగితే విడెమాకె వొల్లననఁగలవా
|
ఆమె తాంబూలమంటు ఇస్తే కాదనగలవా?
|
సూటి భావము:
(అవ్యక్త స్వరము కొనసాగిస్తున్నది) ఆమె కొయిల వలె కూస్తుంది, కొలనులో తుమ్మెద వలె వికసిస్తుంది, పచ్చని చిలుక వలె
చలాకీగా కనబడుతుంది. చిరునవ్వులు చిందిస్తూ ముచ్చట్లు చెబుతుంది. (స్వరంలో హేళన పెంచుతూ) ఏదో పొద్దుపుచ్చు
కలాపములుగా దైవము, శరణాగతి అని నాతో ఇలా మాట్లాడుతుంటావు
కానీ ఆ మాయది విడెము (తాంబూలం) ఇచ్చి సన్నిహితత్వానికి ఆహ్వానిస్తే, దానిని వద్దని చెప్పగలవా? (చెప్పలేవు.)
గూఢార్థవివరణము:
నసలు
సేయుచు నిట్టే నాతో మాటలాడేవు: దైవంతో
మనకున్న అనుబంధాన్ని కూడా కాలక్షేపపు వ్యవహారంగా చులకనగా చూస్తున్నావు. ఇది ఆరోపణ కాదు; మనిషి సహజంగా ప్రవర్తించే తీరే. ఆమె స్వరంలోని మాయను గుర్తించలేకపోతున్నామేమో
గాని, ఆమె మాటల ఆకర్షణ మాత్రం మనకు బాగా పరిచయమే.
మనలో చాలా
అరుదుగా గుర్తించే ఒక బలహీనతను అన్నమాచార్యులు ఇక్కడ ఎత్తి చూపుతున్నారు. మనలో చాలామంది
జీవితాన్ని కాలక్షేపం కింద జమకట్టి బతికేస్తారు. ఎందుకు జీవిస్తున్నామో తెలుసుకోవడం
కష్టం. దీనితో పోలిస్తే తక్కినవన్నీ సులభమే. దీనికి అనేక సమాధానాలున్నా, అవి మనకు పూర్తి సంతృప్తినివ్వవు. అసలు విషయం తెలుసుకోవడం కొద్దిమందికే సాధ్యం.
మన జీవితంలో
నిజమైన నిమగ్నత లేదు. ఉపేక్షించలేని గంభీరత లేదు. దృష్టి పైపైనే ఉంటుంది. దైవం, శరణాగతి, భక్తి అంటూ మాట్లాడుతున్నా, వాటి వెనుక మన జీవితాన్ని సమూలంగా పరిశీలించాలనే తపన ఉందా? లేక అవి కూడా మనకు మరో కాలక్షేపంగా మారిపోయాయా? అన్నది
ఇక్కడ మనం వేసుకోవలసిన ప్రశ్న.
వొసగితే
విడెమాకె వొల్లననఁగలవా: మాయ మనల్ని
ఆకర్షించేది కేవలం రూపసౌందర్యంతోనే కాదు. ఆమె మనల్ని లోతైన సంబంధం ద్వారా, ఆత్మీయత ద్వారా బంధిస్తుంది. మాటలతో, నవ్వులతో,
ప్రేమ సూచనలతో — “ఇదిగో విడెము” అంటూ మనసును తాకుతుంది.
ఇదే అత్యంత
ప్రమాదకరం. ఎందుకంటే ఇలాంటి ప్రేమసూచనను, ఆత్మీయతను, సాన్నిహిత్యాన్ని
నిరాకరించడం చాలా కష్టం. ఇది మన బుద్ధిని మాత్రమే కాదు — మన హృదయంలోని
ఆత్రుతను కూడా తాకుతుంది.
మాయ ఆకర్షణను
గుర్తించడం ఒకటి; ఆమె ఆహ్వానాన్ని తిరస్కరించడం మరొకటి.
మొదటిది మాటల్లో సాధ్యమవుతుంది. రెండవదే మన నిజమైన స్థితిని బయటపెడుతుంది.
మూడవ చరణం:
మెత్తినగందమువలె
మెడకంటసరివలె
ముత్తెమువలెనే వురమున నుందాకె
హత్తి శ్రీవేంకటేశుఁడ అట్టె నన్నుఁగూడితివి
బత్తి సేసితివాపెతోఁ బంతమాడఁగలవా ॥ఇప్పు॥
|
Telugu
Phrase
|
Meaning
|
|
మెత్తిన
గందమువలె మెడకంటసరివలె
|
మెత్తని
గంధంలాగా, మెడలో ధరించే హారం వలె — దగ్గరగా,
శరీరానికి అంటుకునేలా, మనసును కట్టిపడేసేలా.
|
|
ముత్తెమువలెనే
వురమున నుందాకె
|
ముత్యమువలె
నేరుగా గుండెను తాకినది — అత్యంత లోతైన ప్రీతితో, లోనికి చొచ్చుకుపోయిన ఆకర్షణ.
|
|
హత్తి
శ్రీవేంకటేశుఁడ అట్టె నన్నుఁగూడితివి
|
నన్ను
ఎత్తి, శ్రీవేంకటేశుడు తనలోకి చేర్చుకున్నాడు — ఆత్మను స్వీకరించిన దైవానుభవం
|
|
బత్తి
సేసితివాపెతోఁ బంతమాడఁగలవా
|
కానీ, ఆ స్త్రీ (మాయ) ఆమె బాణసంచా వత్తి లాంటిది. అంటిన
తక్షణమే పేలుతుంది. ఆమెతో పంతములాడగలవా? (అంటే, నిజంగా ఆ ఆటను తట్టుకోగలవా?)
|
సూటి భావము:
(అవ్యక్త స్వరము అంటున్నది) ఆమె (మాయ) మెత్తని గంధంలాగా,
మెడలో ధరించే హారం వలె శరీరానికి అంటుకొని ఉంది. స్వచ్ఛమైన ముత్యమువలె
గుండెను తాకుతుంది. (అన్నమాచార్యులు అంటున్నారు) కానీ శ్రీవేంకటేశుడు నన్ను ఈ అంధకారం నుంచి ఎత్తి నాతో కూడివున్నాడు. దేవా, ఆ స్త్రీ బాణసంచా వత్తి లాంటిది. అంటిన తక్షణమే పేలుతుంది. ఆమెతో పంతములాడగలవా?
(అంటే, నిజంగా ఆ ఆటను అంటే నిప్పుతో చెలగాటాన్ని
నువ్వైనా తట్టుకోగలవా?)
గూఢార్థవివరణము:
మెత్తినగందమువలె
మెడకంటసరివలె /ముత్తెమువలెనే వురమున నుందాకె:
మాయ ఆకర్షణ ఇక్కడ మరింత దగ్గరవుతుంది. (మొదటి చరణం: అందమైన రూపంగా కనిపించినది రెండవ
చరణం: మధురమైన మాటలతో
మనసుకు చేరింది.) ఇప్పుడు శరీరానికి అంటుకున్న సువాసనలా, మెడలోని
కంఠసరిగా, వక్షస్థలంపై ఉన్న ముత్యంలా మనకు అత్యంత సన్నిహితమవుతుంది.
ఈ మూడు ఉపమానాలు మాయతో ఏర్పడే సాన్నిహిత్యాన్ని క్రమంగా చూపిస్తున్నాయి. మనకు దూరంగా
ఉన్న ఆకర్షణను గుర్తించడం సులభమే; మనలో భాగమైపోయిన ఆకర్షణను గుర్తించడం
అంత సులభం కాదు.
హత్తి
శ్రీవేంకటేశుఁడ అట్టె నన్నుఁగూడితివి: ఇక్కడ హత్తి అనే పదం ఒక ప్రత్యేకమైన
భావాన్ని సూచిస్తున్నట్లు కనిపిస్తుంది. శ్రీవేంకటేశుడు తనను కేవలం ఆలింగనం చేసుకోవడం
కాదు; ఈ లోకపు ఆకర్షణల నుంచి పైకి ఎత్తి, తనలోనే ఒక స్థానాన్ని కల్పించుకున్నాడనే భావం ఇందులో కనిపిస్తుంది. అంటే మాయకు
అందని స్థితిలోకి తనను తీసుకువెళ్లినట్లుగా కవి చెబుతున్నాడు.
బత్తి
సేసితివాపెతోఁ బంతమాడఁగలవా: ఈ పాదంలో బత్తి అనే పదానికి
పేలుడు మందును అంటించే వత్తిలాగా అనుకుంటే—మనిషి శరీరమే ఒక బత్తి వంటిది. ప్రపంచంతో
ఏర్పడే ఏ సంబంధమైనా దానిని అంటించగలదు. ప్రమాదం మాయలో మాత్రమే లేదు; మాయతో సంబంధం ఏర్పరచుకునే మనిషి స్వభావంలో కలిసిపోతుంది. మాయ ఆకర్షణకు గురికావడానికి
మనిషిలోని స్పందించే స్వభావమే ఆధారం.
కానీ ఇక్కడ
అన్నమయ్య కొంత వ్యంగ్యంగా అ దైవంతో సహా అందరికీ సవాలు విసురుతున్నట్లుంది. "ఎత్తి నన్ను నీలో చేర్చుకున్నావు కదా? అది సరే
కానీ, బాణసంచా లాంటి ఆ స్త్రీ అంటిన (ముట్టుకున్న) వెనువెంటనే
నీలో మంటలు రేపుతుంది. ఆ అగ్గితో చెలగాటం ఆడగలవా”?
ఈ
కీర్తన ముఖ్య సందేశం
అన్నమాచార్యులు ఈ కీర్తనలో మాయ పట్ల ఎంత జాగరూకతతో ఉండాలో చూపిస్తున్నారు.
మాయ ఎప్పుడూ భయంకరమైన రూపంలోనే మన ముందుకు రాదు. అందమైన రూపంలో, మధురమైన పలుకుల్లో, ఆత్మీయతలో, సాన్నిహిత్యంలో మనకు దగ్గరవుతుంది. మనకు ఆనందాన్నిచ్చే వాటి ద్వారానే మనలను
తనకు బంధిస్తుంది.
దైవం గురించి మాట్లాడటం, భక్తిని ప్రదర్శించడం, శరణాగతి గురించి చెప్పుకోవడం సులభమే.
కానీ మనకు ఇష్టమైనది ఎదురైనప్పుడు, మనలను ఆకర్షించేది ఆహ్వానించినప్పుడు,
దాని పట్ల మన స్పందన ఏమిటన్నదే అసలు పరీక్ష.
ఈ కీర్తనలోని ప్రశ్నలు ఒక్కొక్కటిగా
మనలను మరింత లోతులోకి తీసుకువెళతాయి. మాయను గుర్తించగలమా? ఆమె ఆకర్షణకు లొంగకుండా ఉండగలమా? ఆమెతో ఏర్పడే సాన్నిహిత్యాన్ని
తట్టుకోగలమా?
మాయను గురించి తెలుసుకోవడం
వేరు; దాని ఆకర్షణ మధ్య చిక్కుకోకుండా ఉండటం వేరు. ఈ రెండింటి
మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించమని అన్నమాచార్యులు మనలను హెచ్చరిస్తున్నారు.
X-X-The
END-X-X

