అన్నమాచార్యులు
63R అతిసులభంబిదె శ్రీపతిశరణము
ఉపోద్ఘాతం
“అతిసులభంబిదె శ్రీపతిశరణము” అని అన్నమాచార్యులు ఈ
అత్యద్భుతమైన కీర్తనను రచించారు. ఇందులో నారదుడు, వేదములు, ప్రహ్లాదుడు, అర్జునుడు, బలిచక్రవర్తి, వ్యాసుడు, సనకాది ఋషుల ప్రస్తావన వస్తుంది.
ఇక్కడ ముఖ్యంగా గమనించవలసినది — అన్నమాచార్యులు వీరి పేర్లను ఎందుకు
ఉపయోగించారు? దైవము సమస్తాన్ని అనుసంధానించే సూత్రమైతే, దానిని మనం ఎలా అర్థం చేసుకోగలం? మనకు అందుబాటులో ఉన్నవి ఆ దైవంతో సంబంధం కలిగినవారి జీవితాలు, అనుభవాలు, భావనలు మాత్రమే కదా!
“అయ్యా, మీరు చెబుతున్నది నమ్మడం ఎలా?” అని అడగవచ్చు. ఇది అన్నమాచార్యులు అత్యంత భక్తితో రచించిన కీర్తన కదా!
నిస్సందేహంగా ఇది భక్తితో రచించినదే. అయితే, మన పురాణాలలో పేర్కొన్న ఈ వ్యక్తులు శాశ్వతత్వం
పొందినవారు కాదా? వారు ఇప్పుడు లేరనుకోవడం సబబేనా? మరి, అటువంటి వారి సందేశాలను గ్రహించగల సున్నితత్వం మనలో ఉందా?
|
అధ్యాత్మ కీర్తన:
|
|
రాగిరేకు: 107-5 సంపుటము:
2-41
|
|
అతిసులభం బిదె శ్రీపతిశరణము అందుకు నారదాదుల సాక్షి ప్రతిలే దిదియే నిత్యానందము బహువేదంబులె యివే
సాక్షి ॥పల్లవి॥ వేసరకుమీ జీవుఁడా వెదకివెదకి దైవమును ఆసపాటుగా హరి యున్నాఁడిదె అందుకుఁ బ్రహ్లాదుఁడే
సాక్షి మోసపోకుమీ జన్మమా ముంచిన యనుమానములను సేసినభక్తికిఁ జేటు లేదు యీసేఁతకెల్ల ధ్రువుఁడే
సాక్షి ॥అతి॥ తమకించకుమీ దేహమా తగుసుఖదుఃఖంబుల నలసి అమితము నరహరికరుణ నమ్మితే నందుకు నర్జునుఁడే సాక్షి భ్రమయకుమీ వివేకమా బహుకాలంబులు యీఁదీఁది తమితో దాస్యము తను రక్షించును దానికి బలీంద్రుఁడే
సాక్షి ॥అతి॥ మరిగివుండుమీ వోజిహ్వా మరి శ్రీవేంకటపతినుతులు అరయఁగ నిదియే యీడేరించును అందుకు వ్యాసాదులే సాక్షి తిరుగకుమీ విజ్ఞానమా ద్రిష్టపుమాయలకును లోఁగి సరిలే దితనిపాదసేవకును సనకాదులబ్రదుకే సాక్షి ॥అతి॥
|
Details and Explanations:
పల్లవి:
అతిసులభం బిదె శ్రీపతిశరణము అందుకు నారదాదుల సాక్షి
ప్రతిలే దిదియే నిత్యానందము బహువేదంబులె యివే సాక్షి ॥పల్లవి॥
భావము:
శ్రీపతిని శరణు వేడటం అత్యంత
సులభమని అందుకు నారదుడు మొదలైన భక్తులే సాక్షి అని అన్నమాచార్యులు అంటున్నారు.
ప్రత్యామ్నాయములు లేని ఆ నిత్యానందానికి అనేకములుగా విస్తరించిన వేదాలు సాక్షులని కవి
చెబుతున్నారు.
గూఢార్థవివరణము:
నారదుని కథను పరిశీలిస్తే, పూర్వజన్మలో ఆయన ఒక దాసీ కుమారుడు. అయినప్పటికీ, అతడు భక్తితో సామాజిక స్థితిని అడ్డుగా భావించకుండా
మహామునులకు సేవ చేశాడు. వారి సాంగత్యంలో భగవంతుని కథలను వింటూ భక్తిని
పెంపొందించుకున్నాడు. ఆ జన్మాంతంలో భగవంతుని అనుగ్రహం పొంది, తరువాతి జన్మలో దేవర్షి నారదుడిగా అవతరించాడని భాగవతం
వివరిస్తుంది. ఈ కథలో గమనించవలసినది ఆయనకు లభించిన పరిస్థితులలో, అవకాశాలలో
ఒదిగిపోయిన తీరు.
అయితే, శరణాగతిని అతిసులభము అనడంలో ఒక లోతైన విషయం ఉంది. భగవద్గీత 3- శ్రీకృష్ణుడు ప్రకృతి గుణాల ద్వారానే కర్మలన్నీ
జరుగుతున్నప్పటికీ, అహంకారంతో ఆవరించబడిన వ్యక్తి
తానే కర్తనని భావిస్తాడని చెబుతాడు. మానవులుగా మనకు చేయవలసినదేమీ లేక పోయినా, జీవితంలో జరిగే ప్రతీది మనమే నడిపిస్తున్నామనే భావనలో
చిక్కుకున్నప్పుడు, శరణాగతి కష్టంగా మారుతుంది.
అయితే ప్రకృతి ద్వారా జరిగే సర్వ కర్మలలో కర్తృత్వ భావనను కలిగించునదేమి? కవి చెప్పిన అతిసులభము అనే మాట వెనుక ఉన్న చిక్కు
ఇక్కడ కనిపిస్తుంది.
భగవద్గీత 4.15లో శ్రీకృష్ణుడు
పూర్వకాలంలో మోక్షాన్ని కోరినవారు ఆచరించిన కర్మనే అర్జునుడూ ఆచరించమని చెబుతాడు.
పూర్వుల ఉదాహరణ మనకు మార్గదర్శకంగా ఉండవచ్చు. అయితే, వారి
అనుభవం Ready-to-eat food లాగా సిద్ధంగా మనకు
లభించదు. దానిని మన జీవితంలో మనమే గ్రహించాలి; తెలుసుకోవాలి.
అదే జీవితంలోని సవాలు.
అన్నమాచార్యులు కూడా నారదుడు మొదలైనవారిని
సాక్షులుగా చూపిస్తూ, శరణాగతి సాధ్యమేనని గుర్తుచేస్తున్నారు. నారదుడు మహామునుల
సాంగత్యంలో భగవంతుని కథలను విన్నాడు. అటువంటి మునులు ఈనాడేరి?
ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తుంది.
అటువంటి సాంగత్యం, సేవాభావం,
ప్రపంచంతో లెక్కలకతీతమైన సంబంధం మనకు ఎంతవరకు సాధ్యమవుతున్నాయి?
మన చుట్టూ ఉన్నదానితో ప్రత్యక్ష సంబంధం ఏర్పరచుకోవడానికి బదులు,
దానివల్ల మనకు ఏమి లభిస్తుందో లెక్కవేస్తున్నామా?
మనస్సు ఎప్పుడూ మరేదో పొందాలని, ఉన్నదానిని
దాటి మరొకదానిని చేరుకోవాలని ప్రయత్నిస్తే, మన
ముందున్నదానిని యథాతథంగా చూడగలమా? భగవద్గీత 3.27లోని కర్తృత్వ భావన, 4.15లోని పూర్వుల ఉదాహరణ — ఈ
రెండూ మన వైఖరిని పరిశీలించుకోవడానికి ప్రేరేపిస్తాయి.
అందుకే తరువాతి చరణాలలో జీవుడు, జన్మము,
దేహము, వివేకము, జిహ్వ,
విజ్ఞానములను ఒక్కొక్కటిగా సంబోధిస్తూ, మనిషి
ఎదుర్కొనే అడ్డంకులను కవి మన ముందుంచుతారు.
మొదటి చరణం:
వేసరకుమీ జీవుఁడా వెదకివెదకి దైవమునుఆసపాటుగా హరి యున్నాఁడిదె అందుకుఁ బ్రహ్లాదుఁడే సాక్షిమోసపోకుమీ జన్మమా ముంచిన యనుమానములనుసేసినభక్తికిఁ జేటు లేదు యీసేఁతకెల్ల ధ్రువుఁడే సాక్షి ॥అతి॥
భావము:
ఓ జీవుడా! దైవం కోసం పదేపదే వెతుకుతూ
అలసిపోకు. హరి అందుబాటులోనే ఉన్నాడు; అందుకు ప్రహ్లాదుడే సాక్షి.
జన్మనుంచి పేరుకుపోయిన అనుమానాల వల్ల మోసపోకు. చేసిన భక్తి వృథా కాదు; అందుకు ధ్రువుడే సాక్షి అని అన్నమయ్య చెబుతున్నాడు.
గూఢార్థవివరణము:
“వేసరకుమీ జీవుఁడా వెదకివెదకి
దైవమును” — దైవం కోసం పదేపదే వెతుకుతూ అలసిపోకు అని
అన్నమయ్య జీవుడిని హెచ్చరిస్తున్నాడు.
మనం ఏదైనా ఎప్పుడు వెతుకుతాం? మన దగ్గర లేనిది, సంపాదించుకొనవలసినది అయితే వెతికితే ప్రయోజనం
ఉండవచ్చును. లోపలా బయటా అను అంతరములేక మనచుట్టూ ఆవరించి ఉన్నదానిని వెతుకుట ఎలా? హరి సర్వోపగతుండు అన్నది మనము నిజంగా విశ్వసించగలమా?
నది మూలాలను అన్వేషించే ప్రయాణికురాలిని
చిత్రించిన రెమిడియోస్ వారో పెయింటింగ్‌ను ఈ సందర్భంలో గుర్తుచేసుకోవచ్చు. ఈ
చిత్రంలో ముఖ్యంగా ఒక వింత పడవలో ప్రయాణిస్తున్న ఒక ఆగంతుకురాలు మన దృష్టిని
ఆకర్షిస్తుంది. ఆ వింత పడవ చివరికి ఆమెకు టోపీలా కూడా పనిచేస్తూ పూర్తి రక్షణను కల్పిస్తోంది. దిక్సూచి, నోటుపుస్తకాలు
ఆమె అన్వేషణకు తోడ్పడుతున్నాయి. నది మూలాలు చిన్న గాజు పాత్ర నుంచి పడుతున్నట్లు
చూపించారు. కానీ ఆ గాజు పాత్ర ఉన్న వింత ప్రదేశంలో లోలోపలికి మరిన్ని ద్వారాలు,
ఆవరణలు ఉన్నాయి.
ఆమె ప్రయాణిస్తున్నది నదిలోనే; అయినా నది ఎక్కడ పుట్టిందో తెలుసుకోవడానికి
ప్రయత్నిస్తోంది. నది మూలాన్ని కనుగొనడం వల్ల నది మొత్తాన్ని అర్థం
చేసుకున్నట్లవుతుందా? నది, ప్రయాణికురాలు, ఆమె శరీరం,
భూమి, చుట్టూ ఉన్న ప్రకృతి — ఇవన్నీ ఒకే చలనంలోని
అంతర్భాగాలు. వాటిని విడివిడిగా పరిశీలించి, వాటి గురించి ఎంత సమాచారం సేకరించినా, ఆ సమస్తాన్ని కలిపి నడిపిస్తున్న దానిని పూర్తిగా
అర్థం చేసుకున్నట్లా? విడివిడి భాగాలను
కొంత కొంతగా కలుపుకుంటూ పోవాలనుకుంటే సాధ్యమయ్యేనా? ఈ జీవిత ప్రయాణం అంత వరకు ఉండేనా? మన పరిమిత దృష్టికి అందినదే సంపూర్ణం కాదని
గుర్తించినప్పుడు, మనం తెలిసినదానికే
అంటిపెట్టుకోకుండా ఉండగలమా?
మనమెవ్వరమూ జీవితానికి ప్రేక్షకులం కాము.
జీవించడమే జీవితం. మనం వెతుకుతున్నదాన్ని మనకు పూర్తిగా వేరైనదిగా భావించి, దాన్ని
చేరుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటే, ఆ వెతుకులాటే మనకు
అడ్డంకిగా మారవచ్చు. అన్నమయ్య హెచ్చరికలోని లోతు ఇక్కడే కనిపిస్తుంది.
“ఆసపాటుగా హరి యున్నాఁడిదె
అందుకుఁ బ్రహ్లాదుఁడే సాక్షి” — హరి అందుబాటులోనే ఉన్నాడని,
అందుకు ప్రహ్లాదుడే సాక్షి అని అన్నమయ్య చెబుతున్నాడు. తన తండ్రి
విధించిన పరిమితులు, శిక్షల మధ్య కూడా ప్రహ్లాదుని విశ్వాసం
చెదరలేదు. హరి ఎక్కడ ఉన్నాడనే ప్రశ్నకు ఆ కథ ఇచ్చే సమాధానం, మనం
ఊహించే పరిమితులను దాటుతుంది.
“మోసపోకుమీ జన్మమా ముంచిన
యనుమానములను” —మనలో పేరుకుపోయిన అనుమానాల వల్ల
మోసపోవద్దని అన్నమయ్య హెచ్చరిస్తున్నాడు. మన అనుభవాలు, గతంలో
నేర్చుకున్న విషయాలు, అభిప్రాయాలు మన ఆలోచనలను ప్రభావితం
చేస్తాయి. వాటినే సత్యంగా భావించరాదు. ఇంతకు ముందర
చెప్పుకున్న అధివాస్తవిక చిత్రములో ఆగంతుకురాలు నది మూలాల రహస్యం పూర్తిగా
ఛేదింపలేక పోయినట్లు మన ప్రయత్నముతో తెలియునవి పరిమితములే.
“సేసినభక్తికిఁ జేటు లేదు
యీసేఁతకెల్ల ధ్రువుఁడే సాక్షి” — చేసిన భక్తి వృథా కాదని,
అందుకు ధ్రువుడే సాక్షి అని అన్నమయ్య చెబుతున్నాడు. ధ్రువుని కథలో
కనిపించేది తన లక్ష్యం పట్ల అతని నిలకడ. అతని ఉదాహరణ మనకు ఒక ప్రశ్నను కూడా
అందిస్తుంది: అనుమానాలు, అడ్డంకులు ఎదురైనప్పుడు మనం వాటిని
పరిశీలిస్తున్నామా, లేక వాటి వల్ల మన దిశనే కోల్పోతున్నామా?
రెండవ చరణం:
తమకించకుమీ దేహమా తగుసుఖదుఃఖంబుల నలసి
అమితము నరహరికరుణ నమ్మితే నందుకు నర్జునుఁడే సాక్షి
భ్రమయకుమీ వివేకమా బహుకాలంబులు యీఁదీఁది
తమితో దాస్యము తను రక్షించును దానికి బలీంద్రుఁడే
సాక్షి ॥అతి॥
భావము:
సుఖదుఃఖాలను
ఎంచుతూ అలసిపోకండి. అపారమైన నరహరి కరుణను నమ్మండి. అనుమానాలతో, భ్రమలతో
కాలాన్ని గడపకుండా వివేకంతో ఉండండి. బలిచక్రవర్తిలా దైవసేవలో నిలవండి.
గూఢార్థవివరణము:
“తమకించకుమీ
దేహమా తగు సుఖదుఃఖంబుల నలసి” — సుఖదుఃఖాలు జీవితంలో తప్పవు.
దేహం వాటిని అనుభవిస్తూనే ఉంటుంది. సుఖం కలిగితే దానిని కొనసాగించాలనీ, దుఃఖం కలిగితే దానిని తొలగించాలనీ మనకు అనిపిస్తుంది. ఈ జీవిత ప్రయాణమంతా
ఆ ప్రయత్నంలోనే ఉండిపోతున్నదా? ముఖ్యంగా గమనించవలసినవి
సుఖదుఃఖాలు మనలో రేపే అసంఖ్యాకమైన చలనాలు. “ఇది సుఖం, ఇది
దుఃఖం” అని నిర్ణయించుకోవడం మనల్ని అనేక విషయాల వైపు తిప్పుతూ, చివరకు అలసిపోయేలా చేస్తున్నదని కవి భావం.
“అమితము
నరహరికరుణ నమ్మితే నందుకు నర్జునుఁడే సాక్షి” — పాండవుల
జీవితంలోనూ కష్టాలు, అవమానాలు, అనేక
ఆటంకాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ, అపారమైన నరహరి కరుణ వారిని
చరితార్థులను చేసిందని అన్నమయ్య చెబుతున్నాడు. భారత యుద్ధంలో అర్జునుడు అతిలోక
యోధులను జయించగలగడం నరహరి కరుణ వల్లనే అని ఈ పాదం సూచిస్తోంది.
“భ్రమయకుమీ
వివేకమా బహుకాలంబులు యీఁదీఁది” — వివేకమా, ఎంతోకొంత
కాలం ఈదితే భ్రమలను దాటగలమనే అపోహలో చిక్కుకోవద్దని అన్నమయ్య హెచ్చరిస్తున్నాడు.
కాలం గడవడం వల్లనే భ్రమలు తొలగిపోవు. మన ప్రయత్నాలతో కాలాన్ని దాటి, దాని
ప్రభావం నుంచి బయటపడగలమా? కాలమనేది కూడా మనసు కలిగించు వేరొక చోట
చెబుతాడు.
“తమితో దాస్యము
తను రక్షించును దానికి బలీంద్రుఁడే సాక్షి” — ధర్మబద్ధంగా
జీవించడంలో దైవసేవకు ఉన్న స్థానాన్ని ఈ పాదం సూచిస్తోంది. దైవసేవను దైవాన్ని
చేరుకోవడానికి ఒక మార్గంగా, ఏదో ప్రతిఫలం పొందడానికి చేసే
ఆచరణగా చూడరాదు. అందుకు బలిచక్రవర్తి సాక్షి అని అన్నమయ్య చెబుతున్నాడు.
బలిచక్రవర్తి చేసిన దానం, అతని దాస్యభావానికి ఒక ఉదాహరణ. ప్రతిఫలం
ఎలా ఉండాలో నిర్ణయించేది మనిషి కాదు.
ఈ చరణంలో
అన్నమయ్య సుఖదుఃఖాలు లేని జీవితం గురించి చెప్పడం లేదు. వాటి మధ్య అలసటకు దారితీసే
మన ప్రతిస్పందనలను, వివేకాన్ని కమ్మేసే
భ్రమలను గుర్తించమని సూచిస్తున్నాడు. దైవసేవను కూడా ధర్మబద్ధమైన జీవనంలో భాగంగా
చూడమని ఈ చరణం మనకు చెబుతోంది.
మూడవ చరణం:
మరిగివుండుమీ వోజిహ్వా మరి శ్రీవేంకటపతినుతులు
అరయఁగ నిదియే యీడేరించును అందుకు వ్యాసాదులే సాక్షి
తిరుగకుమీ విజ్ఞానమా ద్రిష్టపుమాయలకును లోఁగి
సరిలే దితనిపాదసేవకును సనకాదులబ్రదుకే సాక్షి ॥అతి॥
భావము:
శ్రీవేంకటపతిని
స్తుతించడంలో మనసును పూర్తిగా నిమగ్నం చేయండి. వ్యాసాదుల వలె ఆ స్తుతిలోని
ఆనందాన్ని తెలుసుకోండి. కనిపించే దృశ్యాల ఆకర్షణకు లోబడకుండా వివేకంతో ఉండండి.
సనకాది ఋషుల వలె ఆయన పాదసేవలో నిలవండి.
గూఢార్థవివరణము:
“మరిగివుండుమీ వోజిహ్వా మరి శ్రీవేంకటపతినుతులు” — నాలుకను మనం ప్రధానంగా రెండు విధాలుగా ఉపయోగిస్తాం. ఒకటి దేహపోషణకు
అవసరమైన ఆహారం కోసం; రెండవది మన భావాలను ఇతరులకు
తెలియజేయడానికి. వీటి ఉపయోగములు తక్షణం. వీటిలో మనకు 'రుచి"
తెలుసును. అయితే శ్రీవేంకటపతిని స్తుతించుటలో మరిగివుండుటకు మనకు భావ సంబంధమైన
ఉపయోగము తెలియవచ్చును. “మరిగివుండుమీ”
స్తుతించే దానితో మనసు మమేకమై ఉండటాన్ని కూడా సూచిస్తుంది. ఆ
స్తుతిలో మనసు పూర్తిగా నిమగ్నమై ఉండటం మరొకటి. దీనికి అనేక దివ్య గ్రంథములను
మానవులకు ప్రసాదించిన వ్యాసాదులు సాక్షి.
తిరుగకుమీ
విజ్ఞానమా ద్రిష్టపుమాయలకును లోఁగి” — ఓ విజ్ఞానమా, దృశ్యమాయలకు
లోబడి లోకములో తిరగవద్దని అన్నమయ్య హెచ్చరిస్తున్నాడు. కంటికి కనిపించే దృశ్యాలు
మనల్ని తమ ఆకర్షణలోకి లాగి, వాటి వెంటే తిప్పగలవు. కనిపించేదంతా
సమస్తము కాదని గుర్తించకుండా, దృశ్యాల ఆకర్షణలోనే చిక్కుకుపోతే వివేకం
తన దిశను కోల్పోవచ్చు. ఇందుకు సనకాది ఋషుల
జీవితం సాక్షి.
భావామృతము
శ్రీపతి
శరణు పొందడం అతిసులభం. నారదాదుల వలె ఆయనను నమ్ముకుని ఉంటే చాలు. వేదాలు ఆ
నిత్యానందానికి సాక్షి
.
దైవాన్ని
వెతకడం వృథా ప్రయాస. ప్రహ్లాదునిలా దైవంపై భారం వేసి ఉండండి. అనుమానాలను విడిచి
ధ్రువునిలా భక్తితో నిలవండి. సుఖదుఃఖాలను లెక్కపెడుతూ అలసిపోకుండా, అర్జునునిలా నరహరి కరుణను నమ్మండి. వివేకంతో భ్రమలను విడిచి, బలిచక్రవర్తిలా దైవసేవలో నిలవండి.
శ్రీవేంకటపతి
స్తుతిలోని రుచిని వ్యాసాదుల వలె తెలుసుకోండి. సనకాది ఋషుల వలె ఆయన పాదసేవలో
ఉండండి.
X-X-X THE
END X-X-X

No comments:
Post a Comment