Saturday, 10 May 2025

T-221. ఎంత సోదించి చూచినా యెన్నెన్ని చదివినా

 అన్నమాచార్యులు

221. ఎంత సోదించి చూచినా యెన్నెన్ని చదివినా 

కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం బొందరే
వారేరీ సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపైఁ
బేరైనం గలదే

For English version press here 

ఉపోద్ఘాతము:

అన్నమాచార్యుల వారి పరిశీలనలు మానవుల చరిత్రంతా వడపోసి కూర్చి పేర్చిన అనుశీలనలు - అని చెప్పేందుకుఈ ఒక్క కీర్తన సరిపోతుంది. వారు ప్రసాదించిన ఈ దివ్యము అలౌకికము ఆగు ఈ సంపద మరుగున పడకముందే తెలియచెప్పు ప్రయత్నమిది. కాలప్రవాహంలో సామ్రాజ్యాధిపతులు కానీ చక్రవర్తులు కానీ ఎంత శక్తిమంతులు కానీ మహాత్ములు కానీ సామాన్యులు కానీ నామరూపములు లేక మరుగున పడిపోవుదురు. 

కీర్తన సారాంశం

ఈ కీర్తన కేవలం భగవంతుని మాయగురించి కాదు - ఇది మన జీవితాన్ని అద్దంలో చూపే దర్పణం. అహంకారంతో జీవిస్తే జీవితం ఓ వ్యర్థమైన పరుగు; శరణాగతితో జీవిస్తే అది తెలియరానిదైన పరమమునకు అర్పణగా మారుతుంది. 

ఈ కీర్తన  నిశ్శబ్దంగా బోధించేది ఇదే - జ్ఞానం కాదు, వినయము అణకువ, మౌనము ద్వారములౌతాయి దైవానికి.



అధ్యాత్మ కీర్తన

రేకు: 158-2 సంపుటము: 2-276

ఎంత సోదించి చూచినా యెన్నెన్ని చదివినా
వింతలై న నీమూర్తి వెసఁ దెలిసేమా         ॥పల్లవి॥
 
లోకములో సముద్రములోఁతు చెప్పఁగరాదట
ఆకాశ మింతంతని యనరాదట
మేకొని భూరేణువులు మితి వెట్టఁగరాదట
శ్రీకాంతుఁడ నీమహిమ చెప్ప చూపవశమా  ॥ఎంత॥
 
అల గాలి దెచ్చి ముడియగాఁ గట్టఁగరాదట
వెలయఁ గాలము గంటు వేయరాదట
కలయ నలుదిక్కులకడ గానఁగరాదట
జలజాక్ష నీరూపు తలపోయఁగలనా ॥ఎంత॥
 
కేవలమైన నీమాయ గెలువనేరాదట
భావించి మనఁసు జక్కఁ బట్టరాదట
దేవ యలమేల్మంగపతివి నీశరణే గతి
శ్రీవేంకటేశ నిన్నుఁ జేరి కొల్వవశమా          ॥ఎంత॥

Details and explanations: 

ఎంత సోదించి చూచినా యెన్నెన్ని చదివినా
వింతలై న నీమూర్తి వెసఁ దెలిసేమా     ॥పల్లవి॥ 

వెసఁ దెలిసేమా = వెంటనే తెలియగలమా? (లేం) 

భావము: ఇది దైవస్వరూపాన్ని తెలుసుకోవడంలో మానవ ప్రయత్నాల విఫలత్వాన్ని వెల్లడిస్తుంది. సోదించుట (విష్లేషణాత్మక విచారణ) గానీ, చదవటం (గ్రంథపఠనం) గానీ ఆ విఖ్యాతమైన, విరూపమైన, వింతదైన దేవమూర్తిని పూర్తిగా గ్రహించలేవు. 


"ఎంత సోదించి చూచినా"

ప్రతి శోధనకూ ఒక లక్ష్యం ఉంటుంది — అంటే మనకు తెలిసిన దానిని అనుకున్న దానిని చేరుకోవాలన్న ఆకాంక్ష. కానీ దేవుడు నిజంగా ఎక్కడున్నాడో తెలుసుంటే, శోధన ఎందుకు?

ఒకవేళ​ తెలియకపోతే, తెలియనిదాన్ని చూస్తూ 'తెలుసుకున్నాం' అనటమెలా సాధ్యం?

ఈ పాదంలో అన్నమాచార్యులు మన శోధనల వెనుక దాగి ఉన్న ఊహల్ని, భ్రమల్ని ప్రశ్నిస్తున్నారు.


ఎన్నెన్ని చదివినా 

అన్నమాచార్యుల దృష్టిలో చదువు అనేది ఇప్పటికే తెలిసిన విషయాలను కూడగట్టే ప్రక్రియ మాత్రమే అది విముక్తికి లేదా స్వేచ్ఛకు మార్గం కాదు. అందుకే, ఆయన తరచూ విద్యాపరమైన వ్యవస్థలను వాటి పరిమితులను, విమర్శించారు.

ప్రపంచమంతటా చదువు అనేది ఒక వ్యవస్థాపిత అభ్యాస పద్ధతిగా ఉంది. ఈ నేపథ్యంలో "ఎన్నెన్ని చదివినా" అనేది “దేవుని వంటి తెలియనిది (వ్యక్తపరచలేనిది)” అర్థం చేసుకునే విషయంలో ఆయా వ్యవస్థలు చేతగానివని సూచిస్తుంది.


వెసఁ దెలిసేమా 

ఈ పదం మన ఇప్పటి తెలివితేటల ద్వారా దైవస్వరూపాన్ని గ్రహించాలన్న ఆశ నిష్ఫలమని చెబుతోంది. మన విషయ గ్రహణ పద్ధతులన్నీ: మొట్టమొదట చూసి, తాకి, విని, వాసనతోను  అందుకొని, ఆపై గతానుభవాలతో పోల్చి, అంచనాలు వేసే తత్వమే — మన పరిమితమైన తెలివి. 

"వెసఁ దెలిసేమా" అనేది — ఆ అంతరంగికమైన సత్యం, ఈ మధ్యవర్తిత్వంలేకుండా, వడపోతలనుంచి (ఫిల్టర్ల ద్వారా) తేర్చబడ్డ ఆలోచనలకు అతీతంగా, వెనువెంటనే — ఒక్కసారిగా తెలియగలమా? అని ప్రశ్నిస్తుంది.


వెసఁ దెలిసేమా

తలపుతో కాదు

తలవక నేమో

ఊహతో కాదు

ఊరకుంటే నేమో

చేతలతో కాదు

చేష్టలుడిగితేనేమో

పనిగా కాదు

మానితేనేమో

వేదనతో కాదు

వదిలితేనేమో

వాదములతో కాదు

వాయిద్యమైతేనేమో

 


అన్వయార్థము: 

ఓ అన్వేషకుడా!
పుస్తకాలు తిప్పడం, విచారణలలో మునిగిపోవడం ద్వారా పరమాత్మను తెలుసుకోలేం.
అనంతాన్ని మన చిన్న మనసుతో పట్టుకోవడం అసాధ్యం.
అతనిని చేరాలంటే, మన అశక్తిని హృదయపూర్వకంగా అంగీకరించి —
ఆ అంగీకారమే తిరుగులేని జ్ఞానంగా గ్రహించి, నిశ్చలంగా ఉండాలి.


మొదటి చరణం

లోకములో సముద్రములోఁతు చెప్పఁగరాదట
ఆకాశ మింతంతని యనరాదట
మేకొని భూరేణువులు మితి వెట్టఁగరాదట
శ్రీకాంతుఁడ నీమహిమ చెప్ప చూపవశమా      ॥ఎంత॥ 

మేకొని = పూనుకొని,  by taking up a task, to indulge. మితి = పరిమితి, పరిమాణము, limit, quantum. 

భావము: సులభగ్రాహ్యం


Interpretive Commentary: 

మేకొని భూరేణువులు మితి వెట్టఁగరాదట

భూమ్మీద రేణువులన్నీ లెక్కించాలంటే మన ఇప్పటి జ్ఞానం తడబడుతుంది.

బహుశా ఏ గణక యంత్రము (కంప్యూటర్) కూడా కచ్చితంగా చెప్పలేదు.

శ్రీకంఠా నీ మహిమల తీరు అదే  - అవి లెక్కలకు దూరం, మాటలకు అందవు.

ఇలా అన్నమాచార్యుల వారు పరిమితుల్లేని పరమాత్మతత్వం చూపుతారు.


యతో వాచో నివర్తంతే, అప్రాప్య మనసా సహ” (తైత్తిరీయ ఉపనిషత్) అంటే -"దేనినైతే మాటలు తాకలేవో, దేనినైతే మనస్సు గ్రహించలేదో - అదే పరమతత్వం." 

చెప్ప చూపవశమా” — అన్నది ఆ ఉపనిషద్ వాక్యానికి తెలుగు ప్రతిధ్వని. 

వాక్యాలూ, ఆలోచనలూ ఎక్కడే నిలిచిపోతాయో. అచ్చట నుండి నిజమైన  తత్వం మొదలవుతుంది.


రెండవ చరణం:

అల గాలి దెచ్చి ముడియగాఁ గట్టఁగరాదట
వెలయఁ గాలము గంటు వేయరాదట
కలయ నలుదిక్కులకడ గానఁగరాదట
జలజాక్ష నీరూపు తలపోయఁగలనా       ॥ఎంత॥ 

భావము: గాలిని తెచ్చి మూట గట్టగా రాదట. చక్కగా అందరికి తెలియునట్లు కాలమునకు ముళ్ళు లేదా గుర్తులు వేయలేము. నలుదిక్కులా కాళ్ళరిగేలా తిరిగినా అంతం తెలియరాదుట. ఓ జలజాక్ష!  నాకు నీ రూపు తల పోయగల సామర్థ్యం కలదా? 

ఈ చరణంలో అన్నమాచార్యులు మనకు అనుభూతి చెందే భావనలకు, బుద్ధికీ అందని తత్వాల గురించి చెబుతున్నారు.


గూఢార్థవివరణము 

ఈ చరణంలో అన్నమాచార్యులు మనం అనుభవించగలిగె కానీ అర్థం చేసుకోలేని తత్వాల గురించి చెబుతున్నారు. అంతేకాదు - ఈ ప్రపంచంలోనే, ఈ అస్తవ్యస్త, మురికి కూపములోనే  భగవంతుని దర్శించవచ్చని సూచిస్తున్నారు ఆచార్యులు. 

గాలి -అనుభూతి చెందగలము, కానీ పట్టి మూటగట్టలేము.

కాలం -నిత్యం కదులుతుంది, కానీ దాన్ని నిలిపివేయలేము. నియంత్రించలేము.

నలుదిక్కులు - ఏ దిశలోనైనా మన జ్ఞానం అసంపూర్ణంగానే మిగిలిపోతుంది.


అన్నమయ్య తరవాత అడిగేది: "నీ రూపు తలపోయగలనా?" 

ఇది కేవలం వినయాన్ని చూపడం కాదు - ఆలోచన అనే మనస్సు చర్యలకు కూడా హద్దు ఉందని ఒప్పుకోవడం. 

ఈ చరణాంతంలో, సాధకునికి చివరిదిగా మిగిలేది ధ్యానం - దానినీ అన్నమయ్య తొలగిస్తారు. ఆ తర్వాత మిగిలేది: శరణాగతి -  సంపూర్ణ విశ్వాసముతో కూడిన భక్తి. అది ఒక నిశ్శబ్ద నిమజ్జనం. ఆలోచనలను అధిగమించి, నిశ్శబ్దంగా తానంతట తానుగా దీవింపబడే అనుభూతి. 

మొదటి చరణం పరిమాణాన్ని తిరస్కరించింది.

రెండవ చరణం గ్రహణాన్ని తిరస్కరిస్తుంది.

ఈ రెండు కలిసి మనల్ని ఒక పెద్ద వీడుకోలుకు సిద్ధం కమ్మంటున్నాయి - ఆలోచనలను  దాటివున్న నిజమైన తత్వాన్ని తాకేందుకు.


 వెలయఁ గాలము గంటు వేయరాదట
= "కాలమనే నిత్య ప్రవాహంపై మానవుల ముద్ర నిలవదు 

దీనిని "విలియం హిగ్గిన్సన్ వేసిన "రూపాంతరణం (మెటామొర్ఫొసిస్)" అనే అధివాస్తవిక శైలి కళాఖండాన్ని వివరించు కుంటూ తెలుసుకుందాం.



"విలియం హిగ్గిన్సన్ యొక్క "రూపాంతరణం (metamorphosis)" అనే కళాఖండం ఒక పెద్ద తివాచీ వంటిది. ఇది అంతం లేని కాలక్రమంలో నిరంతరం రూపాంతరం చెందుతూ ఉండే మూలకాలు మరియు జీవులను చూపుతూ పరిణామం నిత్యసత్యమని, జీవ రూపాల అశాశ్వతత్వాన్ని ప్రకాశింపచేస్తుంది. అతను తెలిసిన వస్తువులను అపరిచిత సందర్భాలలో ఉంచడం ద్వారా, మన అవగాహనను మరియు చరిత్రను సవాలు చేస్తూ దిగ్భ్రాంతిని కలిగిస్తాడు. హిగ్గిన్సన్ యొక్క కలల వంటి భావన కలిగించే చిహ్నాలు కాలం గడిచేకొద్దీ ఉనికి యొక్క అశాశ్వత స్వభావాన్ని మరియు జీవిత చక్రీయ నమూనాలను అన్వేషిస్తాయి. 

పరిణామము - మిళిత అనుభవం: ఎండిన బేరిపండు (pear fruit) నుండి పొడుచుకొస్తున్న వేళ్ళు, చిన్న ఆకులు కొత్త ఆశలు చిగురించడాన్ని చూపుతుంది. అయితే, ఏ మార్పు కూడా కొంత ఘర్షణ/కష్టం లేకుండా సంభవించదని ఎండి, పగిలివున్న బేరిపండు తెలుపుతోంది. పిల్లల్ని కనడం అంటే పునర్జన్మతో సమానమని పెద్దలన్నారు కదా. ఆ చిత్రంలో భూమి నేపథ్యం మాత్రమే కాదు. భూమి స్వయంగా క్రియాశీల పాత్ర వహిస్తుంది. కొండ గుట్టల వెనుక నుంచి పుట్టుకొస్తున్న శరభములు (mammoths) నిరంతర మార్పును, పుట్టుక యొక్క అస్పష్ట స్వభావాన్ని నొక్కి చెబుతాయి. జీవులు, భూమి మరియు మానవులు ఒక గొప్ప పరిణామ క్రమంలో భాగమని సూచిస్తుంది. ఇక్కడ పునర్జన్మ అన్నది సన్నివేశాల వరుస కాదు; అది విస్తరించి ఉండే పొరల మేళవింపు - శరభములు, మానవుడు, పండు, భూమి — ఇవన్నీ ఒకే క్షణంలో పుట్టుక, మరణం, ఆశ, శూన్యత — అన్నింటినీ మిళితంగా అనుభవిస్తాయి. 

ఆశ్చర్యం, అంగీకారం: హిగ్గిన్సన్ చిత్రాలలో అనేక చిహ్నాలు ముఖ్యమైన అర్ధాన్ని కలిగి ఉంటాయి. సూట్‌కేస్‌తో ఉన్న వ్యక్తి ఆ అనంతమైన శరభముల పంక్తి ప్రయాణాన్ని చూస్తూ; ఒక రైలు బండి వెళుతుంటే చిన్నపిల్లవాడు ఆశ్చర్యంగా చూస్తున్నట్లుగా కనబడుతుంది. ఆ సూట్‌కేస్ మిథ్యా జ్ఞాపకాలను; అతని దుస్తులు నాగరికతతో తెచ్చిపెట్టుకొన్న సభ్యతను చూచిస్తాయి. మానవులు తమ పరిమిత సామర్థ్యాన్ని అంగీకరించక, ఆ కనబడుతున్న జీవులలో తానొకనిగా కాక తానే వానికి యజమానిని అను స్వభావమును తెలుపుతుంది. నిర్మానుష్యమైన ఎడారి లాంటి భూమి మనిషి ఒంటరిగా వాస్తవికతను ఎదుర్కోవలసి ఉంటుందని చూపిస్తుంది. మీరు చిత్రంలోని ఎడారిని మనిషి ఒంటరిగా చూస్తారు — అదేమాత్రం ఖాళీ స్థలం కాదు. మనం మన ప్రస్తుత స్థితిలో గ్రహించలేనిది. అదొక ప్రతిధ్వని చేసే నిశ్శబ్దం. 

పరిణామ కర్మాగారము: శరభాలన్నీ ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. పరిణామ ప్రక్రియ ఒక మాస్ ప్రొడక్షన్ కర్మాగారము కాదని తెలియవచ్చును. ప్రతి ఒక్కరూ జీవితంలో ఎదుర్కొనే సమస్యలు ప్రత్యేకంగాను ఊహించలేకుండాను వుంటాయని కూడ అనుకోవచ్చును. హిగ్గిన్సన్ చిత్రంలో సమయం యెడతెగకుండా ప్రవహించదు. భగవద్గీతలో (13-16) చెప్పినట్లు అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితమ్ (విభజించనిదైనప్పటికీ విభజించినట్లు కనబడును). 

అనిత్యం: చివరగా, హిగ్గిన్సన్ యొక్క చిత్రం మానవ జీవితం యొక్క అనిత్యత్వాన్ని నొక్కి చెప్పుతూనే, కాలం యొక్క విస్తారతను అవిచ్ఛిన్నముగాను అనంతముగాను తెలుపుతుంది. అతని చిత్రాలు కల వంటి భావనను చెప్పకనే చెబుతాయి. వీక్షించువారి మదిలో అనూహ్యము, మేరలులేని కాలము యొక్క గతిని నిక్షేపిస్తాయి. 

కాలమునకు గంట్లు: ఇంత అని చెప్పలేని కాలమునకు గంట్లు పెట్టి, ఈ సమయాన్నుంచి ఫలానా వారు పుట్టారు, ఫలాన తేదీకి మరణించారు అని చెప్పుకోవడం హాస్యాస్పదమే కాక అసత్యము కూడా. శాలివాహన శకము విక్రమ శకము ఇప్పుడు కనుమరుగై పోయాయి. కొంత కాలానికి అవి పుస్తకాలలో కూడా మిగలవు. అదే పరిస్థితి ప్రస్తుతము వాడుకలో వున్న సమస్త కాల గణనలకు వర్తిస్తుంది."


మూడవ చరణం:

కేవలమైన నీమాయ గెలువనేరాదట
భావించి మనఁసు జక్కఁ బట్టరాదట
దేవ యలమేల్మంగపతివి నీశరణే గతి
శ్రీవేంకటేశ నిన్నుఁ జేరి కొల్వవశమా    ॥ఎంత॥ 

భావము: దైవము  అల్లిన మాయ గెలువలేము. యత్నముతో మనఁసు శాంతించదు. అలమేల్మంగపతివి శ్రీవేంకటేశ, నీశరణే గతి. మాకై మేము నిన్ను జేరి కొల్వగలమా? (లేము)


భావ ప్రవాహం: 

ఈ చరణం అంతరంగ మార్గానికి మలుపు. 

మునుపటి చరణాలలో బాహ్యప్రతీకలతో అనుభూతిని ఉటంకించిన అన్నమయ్య - ఇక్కడ జీవనమునకు దారితీయు సంగతిని బయట పెట్టారు. 

మాయ - అజేయం. 

ప్రయత్నంతో మనస్సు శాంతించదు. 

కాబట్టి, మనశ్శక్తితో విముక్తి సాధ్యం కాదు. ​ 

ఒక్కటే మార్గం - శరణాగతి. అది జ్ఞానానికి కాదు - అంతరంగంలో నిజముగా విచ్చేసి వున్న శ్రీ వేంకటేశునికి.


 కేవలమైన నీ మాయ గెలువనేరాదట” 

ఈ మాయ అనేది కేవలం ఒక ఆవరణ కాదు. ఒక పెరటి గోడ లాంటిది కాదు. దాన్ని దాటడం అసాధ్యం. 

ఇదే మాట భగవద్గీత 7.14లోనూ ఉంది:

"దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా"

అర్థం: త్రిగుణాత్మకము, దైవ సంబంధము అగు నా మాయ దాటడం దాదాపు అసాధ్యం. 

ఇదే భావన జిడ్డు కృష్ణమూర్తి: :ఆలోచనలతో స్పష్టత రాదు. కేవలం ఎంపికలులేని నిశ్శబ్దంలో నిలిచి గమనించడంలోనే విముక్తి లభించవచ్చు.


 భావించి మనఁసు జక్కఁ బట్టరాదట”

ఆలోచించటం వల్ల, కృషిచేయటం వల్ల మనస్సు శాంతించదు.

శాంతి  మంత్రాలు వల్లెవేయడం వల్ల శాంతి కలుగదు.

నీటిలో అలల లాంటి  ఆలోచనలే తటస్థతకు అడ్డుపడతాయి.

శ్రమను వదిలినపుడే మనస్సు తడబడదు. తేలికపడుతుంది. చర్య కాదు లయమే శాంతి.


శ్రీ వేం‍కటేశ! నిన్నుఁ జేరి కొల్వవశమా?” 

ఓ వేం‍కటేశా! మేము కోరి నిన్ను చేరి భజించగలమా? (లేము)

నీ కృప లేకుండా, నీ సంకల్పము లేకుండా నిన్నుచేరు యోగ్యత మాకెక్కడ? (లేదు)

మేము చేయగలిగినదేమీ లేదు. నీవే రక్షించాలి


X-X-సమాప్తం-X-X

4 comments:

  1. నిశ్శబ్ద నిమజ్జనం

    ReplyDelete
  2. ఏమి మాటలు మాటలు
    మనసుకందని భావములు
    తొడిగిన పువ్వులు
    మనసు నందు నిలిచెడి
    చెరగని సువాసనలు

    ReplyDelete
  3. ఓంశ్రీసాయినాధాయనమః 🙏🙏🙏
    సర్వశ్యశరణాగతి మనుజునికి అవస్యమని అద్భుతంగా వర్ణించబడినది. అందుకే విష్ణుసహస్రనామంలో సహస్రనామ్నే పురుషాయ శాస్వతే పురుషుడు ఆస్వాదించుటలో ఆనందం పొందితే స్త్రీ సర్వసమర్పణలో ఆనందం పొందుతుందని భాగవతంలో చెప్పుచూ, ప్రతిజీవి సర్వశ్యశరణాగతి అవశ్యమని తెలుపుకే ఒక్కపరమాత్మ యొక్కడే ప్రకృతి రీత్యా పురుషుని గా పరిగణించబడినది.

    ReplyDelete

T-253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో

  తాళ్ళపాక అన్నమాచార్యులు 253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో For English version press here   ఉపోద్ఘాతము   ఈ అటవీక ప్రపంచములోని అరుద...