తాళ్లపాక అన్నమాచార్యులు
303 పంచేంద్రియములనే పట్టణస్వాములాల
ఉపోద్ఘాతము
అన్నమాచార్యులు మన మనస్సులలో వస్తుమార్పిడి (వ్యాపారం) ఒక వ్యవస్థలా
ఏర్పడి, ఆ లావాదేవీలే మన జీవన విధానంగా సాగుతున్న సంగతిని ఎత్తి చూపుతున్నారు. ఇక్కడ
విమర్శ నైతికం కాదు, వ్యవస్థాపకమైనది. పంచేంద్రియాలనే
పట్టణస్వాములకు ఉత్తమ పరిపాలన చేయుటకు చెల్లించుకునే కప్పము,
మన ఇప్పటి జీవితము. మనసులో ప్రతిక్షణం ఏదో ఒక బేరం నడుస్తూ ఉంటుంది — సుఖం కోసం కొంత
మూల్యం, శాంతి కోసం మరో కొంత, పుణ్యం కోసం ఒప్పందం. ఎంత సుంకమైనా
చెల్లించండి. ఇంకా అడుగుతారే తప్ప కాదనరు. చిత్రదర్శిని (కైలడోస్కోప్) మాదిరి ఇవి అనంతముగా
ప్రతిఫలించునే గానీ అంతమునకు అనువునివ్వవు.
ఇలా సాగితే తప్పేంటి? అని అడగవలెను. వాస్తవానికి తప్పులేదు. అది కేవలం భ్రమలో పుట్టి భ్రమలోనే వుండడం.
అప్పుడు ఈ ప్రపంచములో జరుగుతున్నవన్నీ అన్యాయాలు, దౌర్జన్యాలు,
అశాంతి, యుద్ధాలు, మారణహోమములు
మరింత హెచ్చగును. ఈ రోజుదాకా ఎవ్వరూ (మహామహులు సైతం) ఆపలేనిది, జరగనీయండి. ఇలా దానిని స్వీకరించగలిగితే వాస్తవానికి తప్పులేదు. ఇంతకంటే ముఖ్యము,
ఇప్పటివరకు వచ్చిన ఏ విప్లవాలు, యుద్ధాలు శాశ్వతమైన
మార్పులను తీసుకు రాలేక పోయాయి. కాబట్టి కొంత శాంతి, కొంత అశాంతి
ఇలాగే నిలిచి ఉంటుంది. పాక్షికమైన పరిష్కారాలను స్వీకరించకండి. అంతే చాలు.
ఇక్కడే వస్తుంది అసలు సమస్య.
ఇందులో ‘కొంతైనా మేలు సాధించరాదా’ అన్న తలపు. అన్నమాచార్యులు ఈ వ్యవస్థను తప్పుపట్టరు, కానీ దాని ఫలితాన్ని ప్రశ్నిస్తారు. “జగతిఁ బుణ్యపాపపు సరకులు దెచ్చినాఁడ”
— ఒప్పుకున్నా, ఒప్పలేకపోయినా పుణ్యమూ పాపమూ అను సరుకులను మోస్తు, ఆ వ్యవస్థను నడిపే వారము మనమే. మనము మనము మంచి వారమని ఒక ఊహ ఉంటుంది. ఆ ఊహను
ఇది బద్దలు చేస్తుంది. ఇది తప్పు అని నిరూపించడానికి తయారవుతాం. అదే, ఎదో చేయాలనిపించడానికి ప్రేరేపణ.
అప్పుడు నాలుగవ పంక్తి "దిగితి బూతురేవునఁ దీరుచరో సుంకము"
నిజమై కూర్చుంటుంది. ఈ వాస్తవమును మనస్సాక్షిగా అంగీకరించలేము. కాళ్ళ క్రింద నిప్పులు
పోసినట్లనిపిస్తుంది. అన్నమాచార్యులు చదివి సంతోషించడనికి కీర్తనలు వ్రాయలేదు.
అధ్యాత్మ సంకీర్తన
|
|
రేకు: 256-5 సంపుటము: 3-324
|
|
పంచేంద్రియములనే పట్టణస్వాములాల తెంచి బేరమాడుకొని దించరో బరవు ॥పల్లవి॥ తగిన సంసారసముద్రములోనఁ దిరిగాడి బిగువుదేహపు టోడబేహారివాఁడ జగతిఁ బుణ్యపాపపు సరకులు దెచ్చినాఁడ దిగితి బూతురేవునఁ దీరుచరో సుంకము ॥పంచేం॥ అడరి గుణత్రయములనేటి తెడ్డుల చేత నడుమ నిన్నాళ్ళదాఁకా నడపినాడ కడుఁజంచలములనే గాలిచాప లెత్తినాఁడ వెడమాయపు సరకు వెలకియ్యరో ॥పంచేం॥ ఆతుమయనేటి కంభ మంతరాత్ముఁ డెక్కియుండి నీతితో మమ్ముఁగాచుక నిలుచున్నాఁడు ఆతఁడే శ్రీవేంకటేశుఁ డటు మాకు మీకుఁ గర్త ఘాతమాని ఇఁక మాకు కడుగుణ మియ్యరో ॥పంచేం॥
|
Details
and Explanations:
పల్లవి
పంచేంద్రియములనే
పట్టణస్వాములాల
తెంచి బేరమాడుకొని
దించరో బరవు ॥పల్లవి॥
|
Telugu Phrase
|
Meaning |
|
పంచేంద్రియములనే
పట్టణస్వాములాల
|
పంచేంద్రియములనే
రాజ్యాధిపతులారా |
|
తెంచి
బేరమాడుకొని దించరో బరవు
|
(తెంచి = వగదెంచు = పరిష్కరించు, నిర్ణయించు, తేల్చు; బేరమాడుకొని = తగిన వెల నిర్ణయించి)
త్వరగా తేల్చుకొని తగిన వెల నిర్ణయించి నా మనోభారమును తగ్గించరో |
సూటి భావము:
మానవుల
మనో వ్యాపారమును సూచించుతూ, అన్నమాచార్యులు సంసారమను సముద్రములో
వ్యాపారిలా, తారస పడిన ద్వీపమునకు రాజ్యాధిపతులైన పంచేంద్రియములను
వేడుకుంటున్నారిలా: నా ఈ మనోవేదన తగ్గుటకు పంచేంద్రియములారా మీకు చెల్లించవలసిన
మూల్యమేమి, త్వరగా
తేల్చి చెప్పండి.
|
పల్లవి:
వ్యాపార ఒప్పందం (The embedded negotiation logic )
|
||
|
ప్రతీక (Symbol)
|
భౌతిక అర్థం
|
ఆధ్యాత్మిక/మనోవైజ్ఞానిక అర్థం
|
|
పట్టణస్వాములు
|
ఒక
నగరాన్ని ఏలే అధికారులు.
|
మనల్ని
శాసించే పంచేంద్రియాలు.
|
|
బేరమాడుట
|
వస్తువు
ధర కోసం చర్చించడం.
|
సుఖం
కోసం ఇంద్రియాలతో మనం చేసే రాజీ.
|
|
బరువు (Baravu)
|
మోయలేనంత
బరువున్న సరకు.
|
మనసు
మోసుకుంటూ వదలలేని కూడబెట్టిన భారము (వేదన/కర్మ ఫలితాల సమిష్టి)
|
|
తెంచి
|
చిక్కుముడిని
విప్పడం/తేల్చడం.
|
ఇంద్రియాల
బంధీఖానా నుండి పొందే విముక్తి.
|
గూఢార్థవివరణము:
పంచేంద్రియములనే
పట్టణస్వాములాల
"పంచేంద్రియములనే
పట్టణస్వాములాల" అని సంబోధించి మానవులు తమను తమ దేహము నుండి విడిగా చూచు విషయమును
చెబుతున్నారు.
తెంచి
బేరమాడుకొని దించరో బరవు
ఇది
ఎంత తెంచుకుందామన్నా తెగని బేరము. దించుకోలేని బరువు.
కర్ర విరగదు, పాము చావదు. బేరసారములతో కూడిన మనసును స్పష్టం.
మొదటి చరణం:
తగిన సంసారసముద్రములోనఁ
దిరిగాడి
బిగువుదేహపు
టోడబేహారివాఁడ
జగతిఁ బుణ్యపాపపు
సరకులు దెచ్చినాఁడ
దిగితి బూతురేవునఁ
దీరుచరో సుంకము ॥పంచేం॥
|
Telugu Phrase
|
Meaning
|
|
తగిన సంసారసముద్రములోనఁ దిరిగాడి
|
మంచి
సంసారసముద్రములో తిరుగుతున్న
|
|
బిగువుదేహపు టోడబేహారివాఁడ
|
(బిగువు= బిగుతు; బిగువు దేహపు = యవ్వన గర్వము) బిగుతు దేహపు గర్వముతో నున్న
నౌకావ్యాపారుడా
|
|
జగతిఁ బుణ్యపాపపు సరకులు దెచ్చినాఁడ
|
ఈ జగతిలోనికి బుణ్యపాపపు సరకులతో వచ్చినవాడా
|
|
దిగితి
బూతురేవునఁ దీరుచరో సుంకము
|
నువ్వు
బూతురేవున దిగితివి. సుంకము చెల్లించరో
|
సూటి భావము:
మంచి
సంసారసముద్రములో తిరుగుతున్న బిగుతు దేహపు గర్వముతో నున్న నౌకావ్యాపారుడా ఈ
జగతిలోనికి బుణ్యపాపపు సరకులతో వచ్చినవాడా! నువ్వు బూతురేవున దిగితివి. సుంకము
చెల్లించరో.
సూచిత భావము:
సంసారసముద్రములో
అనుకూల పరిస్థితులు, గర్వము నిన్ను నడుపుతుండగా,
పాపపుణ్యముల సంకరమును విస్మరించి ఈ బూతురేవునఁ చేతులు
కాల్చుకుందువేమిరా నౌకావ్యాపారుడా! (ఇక్కడ బూతు=అబద్ధము)
|
మొదటి
చరణం: గర్వపు నౌక - అబద్ధపు రేవు (The False Harbor)
|
||
|
ప్రతీక (Symbol)
|
భౌతిక అర్థం
|
ఆధ్యాత్మిక/మనోవైజ్ఞానిక అర్థం
|
|
బిగువు దేహం
|
గట్టిగా, దృఢంగా ఉన్న ఓడ.
|
యవ్వన
బలంతో కూడిన అహంకారం/దేహాభిమానం.
|
|
పుణ్యపాప సరకులు
|
ఓడలో
రవాణా చేసే వస్తువులు.
|
మనం
కూడబెట్టుకున్న పుణ్య–పాప భావనలు, వాటిపై ఆధారపడిన స్వీయ స్వచ్ఛతా భావన
|
|
బూతురేవు
|
అపవిత్రమైన
లేదా అబద్ధపు రేవు.
|
భ్రమలతో
నిండిన లౌకిక ప్రపంచం.
|
|
సుంకము
|
రేవులో
దిగడానికి కట్టే పన్ను.
|
బ్రతకడానికి
మనం చెల్లించే మనో శిస్తు /ఒత్తిడి.
|
గూఢార్థవివరణము:
తగిన
సంసారసముద్రములోనఁ దిరిగాడి
పుట్టినప్పటి నుంచే మనము మన చుట్టూ ఉన్న మనుషులను అర్థం చేసుకోవడం, పరిసరాలను సయోధ్యతో భరించడం నేర్చుకుంటాము. పరిస్థితులు ఎలా ఉన్నా, జీవితం కొనసాగాలనే ఉద్దేశంతో వాటిని సర్దిపుచ్చుకుని ముందుకు వెళ్తాము. కాలక్రమేణా మొదట భరించదగినదిగా ఉన్నదే, సర్దుబాటు చేసుకుంటూ తగినదిగా అనిపించసాగుతుంది. పరిస్థితులు సరిగా ఉన్నందువల్ల కాదు — మనస్సు వాటితో జీవించడాన్ని అలవాటు చేసుకున్నందువల్ల సౌఖ్యం ఏర్పడుతుంది. ఈ అలవాటు పడిన సర్దుబాటే అన్నమాచార్యులు చెప్పిన “తగిన సంసార సముద్రములో తిరుగాడు” అను భావము.
బిగువుదేహపు
టోడబేహారివాఁడ
యవ్వన
గర్వముతో తానే ఆ సంసారసముద్రములోని ఓడకు
చుక్కాని వంటి వాడననుకొను మనిషి సంగతి తెలుపుచున్నారు. ఈ విధముగా ప్రతి ఒక్కరు అలా
భావించితే వారంతా కలిసి ఓడ ఎటుపోవుటయో
నిర్ణయించలేక తికమకయే రాజ్యమేలును.
దిగితి
బూతురేవునఁ దీరుచరో సుంకము
బూతురేవు
= అబద్ధపు రేవు. ఇక్కడ దిగడములో మనషి పాత్ర లేదు. కానీ సుంకము చెల్లించి మనోవేదన తగ్గించుకోవలనుకోవాలని
ఉవ్విళ్ళూరుతాం.
ఈ
బూతురేవులో ఏమి చెసినా బూతు అవుతుంది. కావున ఇక్కడ ఏమీ చేయక వుండుటయే మనషి
కర్తవ్యము. కానీ అలా వుండుటలోనే మానవుడు తరచుగా విఫలమవుతాడు.
రెండవ చరణం:
అడరి గుణత్రయములనేటి
తెడ్డుల చేత
నడుమ నిన్నాళ్ళదాఁకా
నడపినాడ
కడుఁజంచలములనే
గాలిచాప లెత్తినాఁడ
వెడమాయపు
సరకు వెలకియ్యరో ॥పంచేం॥
|
Telugu Phrase
|
Meaning
|
|
అడరి గుణత్రయములనేటి తెడ్డుల చేత
|
(అడరి = కలిగించు, కలిగించు, గుణత్రయములు= సత్వ, రాజస, తమో గుణములు) సత్వ, రాజస,
తమో గుణములను పడవ
త్రోసెడు పలకలతో సంసారనౌకను నడుపుతూ
|
|
నడుమ నిన్నాళ్ళదాఁకా నడపినాడ
|
ఈ సంసార సంద్రము నడుమన ఇన్నాళ్ళు నడపినవాడా
|
|
కడుఁజంచలములనే గాలిచాప లెత్తినాఁడ
|
ఆపైన మిక్కిలి చంచలములగు తెరచాపలను ఎత్తి గాలి ఎటువీస్తే అటు
వూగుతూ వున్నవాడా!
|
|
వెడమాయపు సరకు వెలకియ్యరో
|
(వెడ = తుచ్ఛము, అల్పము, వికృతము; వెడమాయపు
సరకు = వెల నిర్ణయించుటకు అర్హతలేనిది = శరీరము) నీ తుచ్ఛము, అల్పము, వికృతము అగు శరీరము వెచ్చించి తెలుసుకొనరో
|
సూటి భావము:
సత్వ, రాజస, తమో గుణములను పలకలతో (తెడ్డులతో) నౌకను నడుపుతూ ఈ సంసార సంద్రము నడుమన ఇన్నాళ్ళు నడపినవాడా! ఆపైన మిక్కిలి
చంచలములగు తెరచాపలను ఎత్తి గాలి ఎటువీస్తే అటు వూగుతూ వున్నవాడా! నీ తుచ్ఛము, అల్పము,
వికృతము అగు శరీరము వెచ్చించి తెలుసుకొన గలవా? (ఈ రహస్యము).
|
రెండవ
చరణం: అస్థిర ప్రయాణం (The Uncontrollable Navigation)
|
||
|
ప్రతీక (Symbol)
|
భౌతిక అర్థం
|
ఆధ్యాత్మిక/మనోవైజ్ఞానిక అర్థం
|
|
తెడ్డులు (Oars)
|
పడవకు
దిశను చూపేవి.
|
మన
ప్రవర్తనను శాసించే త్రిగుణాలు (సత్వ, రజ, తమో).
|
|
గాలిచాపలు (Sails)
|
గాలి
వేగానికి స్పందించేవి.
|
క్షణక్షణం
మారిపోయే చంచలమైన ఆలోచనలు.
|
|
వెడమాయ సరకు
|
నాణ్యత
లేని, వికృతమైన వస్తువు.
|
మార్పు
చెందే స్వభావం గల నశ్వరమైన శరీరం.
|
|
వెల ఇచ్చుట
|
సరకుకు
తగిన మూల్యం కట్టడం.
|
అజ్ఞాన
జనితమగు జన్మను పణముగా బెట్టి తెలియవలెను
|
గూఢార్థవివరణము:
వెడమాయపు
సరకు వెలకియ్యరో
(ఇక్కడ అన్నమాచార్యుల వారు
మరింత లోతునకు వెళుతున్నారు) వారు మన జీవన ప్రయత్నములు ఏ రకముగా విఫలమౌతాయో
తెలుపుతున్నారు మనమెంత శ్రద్ధతో చేసినా, ఆ ప్రయత్నపు పునాదులు ఈ 'వెడమాయపు సరకు' (శరీరము)లో నున్నవే. కావున అవి పని
జేయవు. ఇప్పటిదాకా సుంకము గూర్చి మాట్లాడినది, మారిపోయి 'వెడమాయపు సరకు' (శరీరము)ను వెచ్చించి తెలియమంటున్నారు.
ఉపసిద్ధాంతము: పుస్తకములచేత కాదు; జీవితం వెచ్చించి తెలియునది జ్ఞానము
మూడవ చరణం:
ఆతుమయనేటి
కంభ మంతరాత్ముఁ డెక్కియుండి
నీతితో మమ్ముఁగాచుక
నిలుచున్నాఁడు
ఆతఁడే శ్రీవేంకటేశుఁ
డటు మాకు మీకుఁ గర్త
ఘాతమాని
ఇఁక మాకు కడుగుణ మియ్యరో ॥పంచేం॥
|
Telugu Phrase
|
Meaning |
|
ఆతుమయనేటి కంభ మంతరాత్ముఁ డెక్కియుండి
|
ఆత్మ అనే కంభమును అంతరాత్ముడు ఎక్కి
|
|
నీతితో మమ్ముఁగాచుక నిలుచున్నాఁడు
|
ధర్మముతో మమ్ము కాపాడుతూ నిలుచున్నాఁడు.
|
|
ఆతఁడే శ్రీవేంకటేశుఁ డటు మాకు మీకుఁ గర్త
|
ఆ శ్రీవేంకటేశుడే మీకు మాకు మీకు కర్త
|
|
ఘాతమాని ఇఁక మాకు కడుగుణ మియ్యరో
|
(ఘాతమాని =ఘాతుకములు
మాని) ఈ ఘాతుకములు మాని మాకు మంచి గుణమియ్యరో
|
సూటి భావము:
ఆత్మ
అనే స్తంభమును అంతరాత్మ ఎక్కి ఉన్నాడు. ధర్మమే నీయమముగా మనందరిని కాపాడుతున్నాడు.
ఆ శ్రీవేంకటేశుడే మాకు మీకు కర్త. ఇప్పటికైనా మీ ఘాతుకములు మాని మీ అసలు గుణము తెలియరో.
|
మూడవ
చరణం: బేషరతుగా అంగీకరించవలసిన సత్యం (Non-negotiable order)
|
||
|
ప్రతీక (Symbol)
|
భౌతిక అర్థం
|
ఆధ్యాత్మిక/మనోవైజ్ఞానిక అర్థం
|
|
స్తంభము (Mast)
|
ఓడ
మధ్యలో ఉండే దృఢమైన కర్ర.
|
మనలోని
నిశ్చలమైన ఆత్మ తత్త్వం.
|
|
ఎక్కి ఉండుట
|
స్తంభంపై
కూర్చుని గమనించడం.
|
సాక్షి. పైనుంచి గమనిస్తున్నాడు. కానీ మన జీవ వ్యాపారములో పాలు పంచుకోడు.
|
|
నీతి (Rule)
|
సముద్ర
ప్రయాణ నియమాలు.
|
విశ్వాన్ని
నడిపే ధర్మము.
|
|
ఘాతమాని
|
హింసను
లేదా మోసాన్ని ఆపడం.
|
అహంకారబద్ధమైన
ప్రయత్న స్వభావాన్ని నిలిపివేయడం
|
గూఢార్థవివరణము:
ఆతుమయనేటి
కంభ మంతరాత్ముఁ డెక్కియుండి
మనలో పరమాత్ముడు
అంతరాత్మయై ఉన్నాడు.
నీతితో
మమ్ముఁగాచుక నిలుచున్నాఁడు
వాడు
కాపాడుతుంటే మనము బ్రతికి ఉందుదుము.
అయితే
ఆ నీతిని తెలియక ఆ రక్షణను గ్రహింపలేము.
ఆతఁడే శ్రీవేంకటేశుఁ
డటు మాకు మీకుఁ గర్త
శ్రీవేంకటేశుడే
కర్త. తక్కినవారందరు వారివారి నిమిత్తము కొద్ది ఆయా కార్యములు సలుపుచున్నట్లు అగపడుదురు.
ఇక్కడ జ్ఞానము పొందిన మాహాత్ములకి ప్రత్యేకత విడిగా చూపలేదు. దైవము దృష్టిలో అందరు
సమానమే.
ఘాతమాని
ఇఁక మాకు కడుగుణ మియ్యరో
ఘాతుకములు
మాని అన్నది ముఖ్యము. మనము అవగాహనలేక, పుణ్యపాప విచక్షణతో చేసే
కార్యములన్నీ ఘాతుక స్వభావమేనని కవి సూచన.
తెంచి
బేరమాడుకొని దించరో బరవు ॥పల్లవి॥
ప్రతీ విషయమును
బేరసారములతో సంధానం చేయు ప్రవృత్తి పనిచేయదని సూచన. సత్యమునకు మన నాలుక మాదిరి
రెండు అంచులు లేవు. దాని ప్రయాణం ఒకే దిశలో. మనది అటుఇటు.
కీర్తన సంక్షిప్తసారము
మనం వస్తుమార్పిడి విధానము
వాస్తవముగా జీవితములో అనుసరిస్తాము. మనము అనుభవించు మనోవేదన (లేదా దుఃఖము) తొలగించుకొనుటకు
అదే మంత్రము అని భావిస్తాము. ఇక్కడ కప్పము కట్టుటకు, తీసికొనుటకు
ఎవరూ నీయమించ బడలేదు.
గర్వము, అనుకూలతల చేత మనోవాతావరణము నడపబడగా బూతురేవులో ఎదో చేతమని ఉద్యమించుదువు.
అనిశ్చితములగు
త్రిగుణములను తెడ్డులతో, చంచలమైన తెరచాపలతో ఈ నౌకాయానము
అగమ్యము. ఈ రహస్యము తెలియుటకు మూల్యము లేదు. అజ్ఞాన జనితమగు నీ జన్మను వెచ్చించి
తెలియవలెను.
శరీరము అను స్తంభమును
అంతరాత్మ ఎక్కి ఉన్నాడు. ధర్మమే అతని నీయమము.
చరాచర ప్రపంచమున ఆ శ్రీవేంకటేశుడే కర్త. కేవలము అకార్యములు మాని వుంటే
చాలు.
X-X-The
END-X-X
No comments:
Post a Comment