Saturday, 24 May 2025

T-223. వెన్న చేతఁబట్టి నేయి వెదకినట్టు

 తాళ్లపాక అన్నమాచార్యులు

223. వెన్న చేతఁబట్టి నేయి వెదకినట్టు

To read Commentary in English press here

ఉపోద్ఘాతము

అన్నమాచార్యులవారు  బహుళ సంఖ్యలో కీర్తనలు వ్రాసి సత్యమును వేర్వేరు  దృక్కోణములలో నిశితముగా పరిశీలించి ఏ వైపు నుండి చూచినను గోచరమగునది  ఒకే బ్రహ్మమని వెల్లడించిరి. ఈ కీర్తనలో  భగవత్ప్రాప్తికై మానవుడు భౌతికముగా చేయు ప్రయత్నములు వ్యర్థములని, ఇక చెయ్యగలిగినదేమీ లేదని గ్రహించి నిర్వికారస్థితిలో నిశ్చేష్టుడై ఉండుట అత్యుత్తమమైన మార్గం అని కళ్లకు కట్టినట్టుగా చూపించిరి.  

 

అధ్యాత్మ కీర్తన

రేకు: 321-1 సంపుటము: 4-118

వెన్న చేతఁబట్టి నేయి వెదకినట్టు
యెన్నఁగ నీవుండఁగాను యెక్కడో చూచేను          ॥పల్లవి॥
 
కన్నులు మిన్నులు దాఁకీ కాయ మీడ వున్నఁగానే
తిన్నని వీనులు మెట్టీ దిక్కులనెల్ల
యిన్నిటి కొడయఁడవై యిందిరేశ నీవు నాలో
నున్నరూపు గానలేను వూహించి ఇపుడు    ॥వెన్న॥
 
కాయము పాయము గీరీ కాల మీడ నుండఁగానే
ఆయపు మనసు ముంచీ నన్నిటియందు
యేయెడ నాలోనున్న యీశ్వర నీ నిలయము
పాయకుండఁ గోరలేను పాయము నాకెట్టిదో          ॥వెన్న॥
 
ఇహమే పరము గోరీ యీడ నిట్టె వుండఁగాను
మహిలో శ్రీవేంకటేశ మహిమెట్టిదో
అహరహమును నీ వంతర్యామివై
సహజమై యుండఁ గంటి చాలు నిఁక నాకు         ॥వెన్న॥

 

Details and explanations: 

వెన్న చేతఁబట్టి నేయి వెదకినట్టు
యెన్నఁగ నీవుండఁగాను యెక్కడో చూచేను     ॥పల్లవి॥

భావము:

చంకలో పిల్లనెట్టుకుని వూరంతా వెతకడం ఎంత మూఢత్వమో,
చేతిలో వెన్న పట్టుకుని నెయ్యి వెదకడమూ అంతే అయోమయం.
నెయ్యి కావాలంటే — వెన్నను నిమ్మళంగా వేడి చేయాలి.
అలాగే, నీ లోపలే ఉన్న సత్యాన్ని గ్రహించాలంటే,
బయట కాదు — అంతరంగంలోకి చొచ్చుకుపోయే ధైర్యం కావాలి.
లేకపోతే — జీవితమంతా ఈ ప్రపంచపు దారుల్లో తడబడుతూనే వుంటాం.


భావార్థ వ్యాఖ్యానం: 

ఈ పల్లవిని రెనీ మాగ్రిట్ గారు చిత్రించిన The Human Condition (తెలుగులో “చమత్కారమైన మనస్సు” అన్నట్లుగా భావించవచ్చు) అనే అధివాస్తవిక చిత్రంతో సరిపోల్చుకుంటూ అర్థం చేసుకోవచ్చు. 


ఆ బొమ్మలో — ఒక గదిలో ఓ వ్యక్తి గవాక్షం ద్వారా బయట కొండల దృశ్యాన్ని చూస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఆ గవాక్షం ముందు ఒక బల్లపై ఒక చిత్రపటం ఉంది. ఆశ్చర్యకరంగా, ఆ చిత్రంలోనూ అదే దృశ్యం — గది వెలుపల కనబడేది, బొమ్మలోనూ అదేనంటూ అనిపించేలా. చూస్తుంటే, అది నిజంగా బయటకు కనపడుతున్న దృశ్యమా? లేక చిత్రకారుడి చేతిలో పుట్టిన చిత్రమేనా? అన్న సందేహం తలెత్తుతుంది. 

మనస్సు మాత్రం — దృష్టిలోనూ బొమ్మలోనూ కనిపిస్తున్న దృశ్యం ఒకటే అని నమ్మాలనుకుంటుంది. కానీ మనకున్న ఆధారాలు అలాంటి సత్యనిర్ణయానికి సరిపోవు. ఈ బొమ్మలోని ఆంతర్యం మన జీవితానికే ప్రతిబింబం. మనస్సు కొద్దిపాటి ఇంద్రియసాక్ష్యాల ఆధారంగా "ఇదే సత్యం" అని తేల్చేసుకుంటుంది. కానీ అది మాయగా మారే అవకాశమూ ఉంటుంది. బాహ్య ప్రపంచాన్ని మాత్రమే త్రాసుగా, తూనికగా భావించి,  మనలోని నిజంగా చూచే శక్తిని — అంతర్గత చైతన్యాన్ని — మనం విస్మరిస్తాం. 

మాగ్రిట్ గారి బొమ్మలోలా — మనకు తెలిసిన పరిమిత స్పృహతో, ఆ చిత్రపటంలోనూ బయట​ దృశ్యంలోనూ ఏదీ నిజం? ఏది రూప కల్పన? అన్న తర్జనభర్జనలో మనసు చిక్కుకుంటుంది. ఆ దృశ్యంలోని కొండల వంపులను, వాటి ఆకృతులను రేఖాచిత్రాలుగా, కంప్యూటర్ మోడల్స్‌గా, గణిత సూత్రాల రూపంలో ఊహిస్తూ పరి పరి విధములుగా  మనోఫలకముపై ఆ దృశ్యమునకు చేరువగా వచ్చుటకు యత్నించుదుము.


ఇదే భావం అన్నమాచార్యుల పల్లవిలో ప్రతిధ్వనిస్తుంది:

"వెన్న చేతఁబట్టి నేయి వెదకినట్టు
యెన్నఁగ నీవుండఁగాను యెక్కడో చూచేను."

నీవు నాలోనే ఉన్నావన్న అవగాహన రాక, నేను నిన్నెక్కడో బయటే వెతుకుతుంటాను.
చేతిలో వెన్న పట్టుకుని నెయ్యి కోసం తిరిగే మనోవైచిత్యమును మాగ్రిట్ బొమ్మ కూడా చిత్రిస్తుంది.
 

చిత్రకారుని బొమ్మ మన మనోఫలకము వంటిది. అది మానవులుగా మనము సృష్టించుకొన్నది. ఈచిత్రంపై తదుపరి వ్యాఖ్యానం మూడవ చరణంలో మరింత విశదముగా తెలుసుకుందాం.


 మొదటి చరణం:

కన్నులు మిన్నులు దాఁకీ కాయ మీడ వున్నఁగానే
తిన్నని వీనులు మెట్టీ దిక్కులనెల్ల
యిన్నిటి కొడయఁడవై యిందిరేశ నీవు నాలో
నున్నరూపు గానలేను వూహించి ఇపుడు        ॥వెన్న॥ 

భావము:

నేను ఇక్కడే నా శరీరాన్ని వదిలేసి,
కన్నులు ఆకాశాల దాకా విప్పి నిన్ను వెతుకుతున్నా.
నీ అడుగుల సవ్వడి ఎక్కడైనా వినిపిస్తుందేమోనని,
దిక్కులన్నిటిలోనూ చెవులు మౌనంగా నిక్కబోసి గమనిస్తున్నా —
నీవెక్కడనో ఉన్నావనే భావంతో.
ఇంద్రియాలన్నిటికీ నీవే అధిపతి.
అలాంటీ నీవే — నాలో ఉన్నావన్న సత్యం,
నా ఊహలకే అందని అంతర్భావం.


చిత్రాన్వయ విశ్లేషణ — Escher చిత్రం ‘Relativity’తో సమన్వయము: 



ఆ బొమ్మలో, మానవులు ఏదో గమ్యస్థానం కోసం వివిధ దిశలలో మెట్లను ఎక్కుతూ, దిగుతూ కనిపిస్తారు.
ఒకరికీ దిగే మెట్టు, మరొకరికీ అదే ఎక్కే దారిగా అనిపిస్తుంది.
తలకిందులుగా, పక్కగా, అడ్డంగా, వెనుకకు, లోతుకు ఉన్నట్టుగా కనిపించే మెట్లు —
ఆ బొమ్మలో చూపిన వ్యక్తుల భావాలను బట్టి,
ప్రతి ఒక్కరికీ తాము నడిచే దిశే సరైనదన్న నమ్మకాన్ని కలిగిస్తాయి.
 
ప్రతి మనిషీ తన సత్యాన్ని, తన మార్గాన్ని, తన ప్రయత్నాన్ని నిజమని భావించి —
దైవాన్ని ఎవరికి వారే నచ్చిన దిశలలో వెతుకుతుంటారు.
కాని ఆ చిత్రంలోని మౌనం చెపుతుంది —
అన్ని మార్గాలూ మన మనస్సులోంచే బయలుదేరినవే.
మనం నడుస్తున్న మెట్లు నమ్మకానికి సంకేతాలు మాత్రమే — సత్యానికి కాదు.

ఇదే అన్నమాచార్యుల చరణంలో మనం చూస్తాం:
ఇంద్రియాలన్నింటినీ పరచుకొని దేవుడిని బయట వెతకడమూ-
తనలోనే ఉన్న దేవుణ్ణి భావించలేకపోవడమూ. 

ఈ బొమ్మను చూస్తే తెలుస్తుంది - వెతకడంలోనే మాయ ఉంది. ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదన్న సందేశం - ఈ చరణం యొక్క అంతరార్థం. ​


రెండవ చరణం:

కాయము పాయము గీరీ కాల మీడ నుండఁగానే
ఆయపు మనసు ముంచీ నన్నిటియందు
యేయెడ నాలోనున్న యీశ్వర నీ నిలయము
పాయకుండఁ గోరలేను పాయము నాకెట్టిదో     ॥వెన్న॥ 

కాయము = body; పాయము = youth; గీరీ = arrogance; ఆయపు మనసు = a mind that accumulates; ముంచీ నన్నిటియందు = makes me dip in all sorts of activities; యేయెడ = where; పాయకుండఁ గోరలేను పాయము నాకెట్టిదో = I cannot seek you without leaving these things = (implied meaning) I want to have these material comforts  and that bliss of being with you.


భావము:

నా ఇప్పటి జీవితం — కాయము, ప్రాయము, గర్వము కలిసి నన్ను అనేక కార్యకలాపాల్లో ముంచేస్తోంది.
ఈ స్థితిలో — నా లోపలే ఉన్న నీవు ఎక్కడ ఉన్నావో నేనెలా తెలుసుకోగలను?
ఈ అన్నింటినీ వదలకుండా నీ కోసం వెదకడం అసాధ్యం.
అయినా… వదలకుండానే నిన్ను పొందాలనుకుంటున్నాను!


మూడవ చరణం:

ఇహమే పరము గోరీ యీడ నిట్టె వుండఁగాను
మహిలో శ్రీవేంకటేశ మహిమెట్టిదో
అహరహమును నీ వంతర్యామివై
సహజమై యుండఁ గంటి చాలు నిఁక నాకు     ॥వెన్న॥ 

నిట్టె వుండఁగాను = ఇట్టె వుండఁగాను; stay as if nothing happened,  remain as it were, no action; అహరహము= always, all time;


భావము:

ఈ లోకంలోనే ఉన్నా —
నీపై ఉన్న ఆకాంక్షకు, నాకు కాస్త కూడా వ్యత్యాసం లేదు.
అయినా... ఏమీ చేయకుండా యిట్లాగే నిలిచిపోయాను.
నీ మహిమ అంతా నాకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు, ఓ వెంకటేశా...
కానీ ఒక సత్యం మాత్రం నాకు తేటతెల్లమైంది —
నీవు అన్నిటిలోనూ, ఎల్లప్పుడూ — సహజంగా, అప్రయత్నంగా, అంతర్యామిగా ఉన్నావు.
ఈ సత్యమే చాలు....


రెనీ మాగ్రిట్ గారి The Human Condition తో ఏకీభావము

ఆ చిత్రంలో కనిపించే దృశ్యం — కిటికీని పాక్షికంగా కప్పివుంచిన చిత్రపటమూ — మన మానసిక చిత్రాల గురించే చెబుతుంది.

చిత్రపటంలో వేసిన దృశ్యం, కిటికీ బయట ఉన్న సహజ దృశ్యంతో కలిసిపోతుంది. చూస్తున్న మనకు ఏది వాస్తవమో, ఏది ప్రతిబింబమో తేడా తెలియదు. 

ఈ ప్రయోగం సరికొత్తది కాకపోయినను, మనసుపై తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే అది మనం సృష్టించుకున్న వాస్తవాన్ని ప్రశ్నిస్తుంది. 

ఆ చిత్రంలోని చిత్రపటం — మనోఫలకం మీద వేసిన భావజాలం.

దాన్ని తీసివేయాలనుకోవడం, మార్చాలనుకోవడం, చెరిపివేయాలనుకోవడం అన్నీ వాస్తవాన్ని వక్రీకరించడానికి మార్గాలు.


దాన్ని పూర్తిగా గ్రహించినవాడు — అన్నమాచార్యుల మాటలలో చెప్పాలంటే —

"యీడ నిట్టె వుండును" అంటే, తనను తనలోని లోపాలను మనస్పూర్తిగా అంగీకరిస్తూ, ఏ అలజడీ లేకుండా, ఏ వ్యామోహం లేకుండా — తాను ఉన్నట్లే ఉండగలడు. అదే పరమధర్మం. 

అలాంటి స్థితిలో, మనోఫలకంపై వేసిన చిత్రం క్రమంగా ఆవిరైపోతుంది.

చూసేవానికి దృశ్యం — దాని వెనుక ఉన్న వాస్తవం — రెండూ ఒక్కటైపోతాయి.

ఆ క్షణంలో మిగిలేది కేవలం ఒక అనుభవం: అన్నిటిలోనూ, ఎల్లప్పుడూ — సహజంగా, అప్రయత్నంగా, అంతర్యామిగా ఉన్న ఆ దేవుడు.

 

ఆ స్థితిలో మనసుకు కోరికలు ఉండవు.

ఈ సత్యమే చాలు అనిపిస్తుంది.

అదే అన్నమాచార్యుల మనోగతం.


 

1 comment:

  1. అంతరంగమందున్న సత్యస్వరూపమును కనుగొనకపోవటం చేతిలో వెన్ననుంచుకొని నేయి కోసం పరుగులు తీసినట్లున్నది.

    రినే మాగ్రిట్టే గారి చిత్రంలో చూపినట్లు గవాక్షం నుంచి కనిపించేది, చిత్రపటంలో కనిపించేది ఒకటే కాని మన మనోఫలకంలో ఏర్పడిన భ్రమ కారణంగా ఏది నిజం? ఏది కల్పితము అన్న సందేహం ఉదయిస్తుంది.

    సర్వేంద్రియములకు అధిపతివైన నీవు నాయందే ఉన్నాగాని ఇంద్రియములు కల్పించే భ్రమలో పడి నీకోసం మిన్నువైపు వెదకుచుంటిని. ఏమందును నా యజ్ఞానము!

    Escher చిత్రంలో చూపినట్లు మనుష్యులు సత్యమును వెదకుటకు అనేక మార్గముల నన్వేషించుచున్నారు.కాని అన్ని భావములు ఉద్భవించేది మనస్సేనని తెలుసుకోవాలి.

    శరీరమనములు, అహంకారం మనిషిని ప్రాపంచిక కార్యములలో నిమగ్నం చేస్తున్నవి. పారమార్థిక సత్యాన్ని గ్రహించాలంటే వాటిని వదలుకోవాలన్న సత్యాన్ని తెలుసుకోవాలి.

    చక్కని వ్యాఖ్యానం.👌💐🙏🏻
    కృష్ణమోహన్

    ReplyDelete

T-253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో

  తాళ్ళపాక అన్నమాచార్యులు 253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో For English version press here   ఉపోద్ఘాతము   ఈ అటవీక ప్రపంచములోని అరుద...