తాళ్లపాక అన్నమాచార్యులు
308 సులభమా మనుజులకు హరిభక్తి
For English version
press here
ఉపోద్ఘాతము
చారిత్రాత్మకంగా చూస్తే అన్ని కాలములలోనూ
మనుష్యులు తమను ఇతరులకంటే పవిత్రులమని ప్రకటించుకోవడం కనిపిస్తుంది. మన దేశంలోనూ ఈ
ప్రవృత్తి కనిపిస్తుంది. ఈ ధోరణిని గమనించిన అన్నమాచార్యులు — “సులభమా మనుజులకు హరిభక్తి” అని ప్రశ్నించారు.
తపస్సులు, యాగయజ్ఞాలు,
తీర్థయాత్రలు — ఇవన్నీ మనిషి చేసే ఆధ్యాత్మిక ప్రయత్నాలే. అయితే అవి
కాలపరిమితిలో జరిగే క్రియలు. వాటివల్ల కొంత శుద్ధి కలిగినా, అంతర్గత
బంధము పూర్తిగా తొలగిపోతుందా అనే ప్రశ్నను కవి మెల్లగా ముందుంచుతున్నారు. అన్నమాచార్యుల
పరిశీలనలో భక్తి అనేది బాహ్య ఆచారాల ఫలితం కాదు; అది అంతరంగ
సమ్మతి. “వలనొంది” అనే పదంలో
అదే భావం దాగి ఉంది — ఎలాంటి అడ్డంకి లేకుండా, అంతరంగమంతా ఏక
భావముతో ఒప్పుకొని నిలబడే స్థితి.
అది అంతర్గత పరివర్తన.
అటువంటి సంపూర్ణ తాదాత్మ్య స్థితి — సులభమా?
|
అధ్యాత్మ సంకీర్తన
|
|
రేకు: 24-2
సంపుటము: 1-144
|
|
సులభమా మనుజులకు హరిభక్తి వలనొంది మరికదా వైష్ణవుఁడౌట ॥సులభమా॥ కొదలేని తపములు కోటానఁగోటులు సదన నాచరించి యటమీఁద పదిలమైన కర్మబంధము లన్నియు వదలించుకొనికదా వైష్ణవుఁడౌట ॥సులభమా॥ తనివోని యాగతంత్రములు లక్షలసంఖ్య అనఘుఁడై చేసిన యటమీఁద జననములన్నిట జనియించి పరమపా- వనుఁడై మరికదా వైష్ణవుఁడౌట ॥సులభమా॥ తిరిగితిరిగి పెక్కు తీర్ధములన్నియు నరలేక సేవించి నటమీఁద తిరువేంకటాచలాధిపుఁడైన కరిరాజ వరదుని కృపఁగదా వైష్ణవుఁడౌట ॥సులభమా॥
|
Details
and Explanations:
పల్లవి:
సులభమా మనుజులకు హరిభక్తివలనొంది మరికదా వైష్ణవుఁడౌట ॥పల్లవి॥
|
Telugu
Phrase
|
Meaning
|
|
సులభమా మనుజులకు హరిభక్తి
|
మానవులకు హరిభక్తి అంత సులభమా?
|
|
వలనొంది మరికదా వైష్ణవుఁడౌట ॥సులభమా॥
|
(వలనొంది = అడ్డంకి లేకుండా సంసిద్ధమగుట) —
సంపూర్ణ సమ్మతితోనే కదా వైష్ణవుడగుట?
|
సూటి భావము:
సంపూర్ణ
సమ్మతితో వైష్ణవుడగు వానికి హరిభక్తి సులభముకాదా?
గూఢార్థవివరణము:
“వైష్ణవుడగుట”
వైష్ణవుడగుట
అనేది పేరు కాదు; ఆచారం కాదు; బయటి
గుర్తింపు కాదు. పునీతుడగుట.
“వలనొంది”
“వలనొంది”అనగా
ఏ అడ్డంకి లేకుండా, ఏ షరతు లేకుండా, అంతరంగమంతా ఒప్పుకొని నిలబడుట. కాని ఏ అడ్డంకులులేని సమర్పణ సులభమా?
అటువంటి సమర్పణకు సిద్ధంగాలేని మనము హరి భక్తి అనే మాటను సులభంగా పలుకుతున్నామా?
ప్రతిబంధాలను (అభిలాషలు, భయాలు, ప్రతిష్ఠ, అభిమానాలు) —
పూర్తిగా
విడిచి పెట్టకుండానే తనను భక్తుడిగా భావించుకోవాలని చూస్తాడు. ఇక్కడ మానవుని నైజము
స్పష్టము.
మొదటి చరణం:
కొదలేని తపములు కోటానఁగోటులుసదన నాచరించి యటమీఁదపదిలమైన కర్మబంధము లన్నియువదలించుకొనికదా వైష్ణవుఁడౌట ॥సులభమా॥
|
Telugu Phrase
|
Meaning
|
|
కొదలేని తపములు కోటానఁగోటులు
|
అంతులేని తపస్సులు — కోట్లకొలది సాధనలు
|
|
సదన నాచరించి యటమీఁద
|
అవన్నీ క్రమంగా ఆచరించిన తరువాత కూడా
|
|
పదిలమైన కర్మబంధము లన్నియు
|
గట్టిగా పట్టుకున్న కర్మబంధములన్నియు
|
|
వదలించుకొనికదా వైష్ణవుఁడౌట
|
వాటినన్నిటిని విడిపించుకొని గానే కదా వైష్ణవుడగుట
|
సూటి భావము:
కోటానుకోట్లు
తపస్సులు ఆచరించినా — గట్టిగా పట్టుకున్న కర్మబంధములు పూర్తిగా విడిపోవాలి.
అప్పుడు గానీ నిజమైన వైష్ణవుడగుట సాధ్యం కాదు.
గూఢార్థవివరణము:
“కొదలేని
తపములు కోటానఁగోటులు” ఇక్కడ అన్నమాచార్యులు తపస్సును తక్కువ చేయడం లేదు. కానీ ఒక ముఖ్యమైన
విషయాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎంత సాధన చేసినా అంతం లేదు. ముఖ్యంగా తీరవలసినది కర్మబంధము.
అందుకే “పదిలమైన కర్మబంధము” అని కష్టసాధ్యమైన విషయమును సూచించారు.
సాధనల పరిణామము
కాల పరిమితిలోనిది. కావున అది విముక్తి కాజాలదు.
బంధముల నుండి నిజమైన విముక్తి ఆత్మసాక్షి గుర్తించ లేనిదని ముందటి కీర్తనలో తెలుసుకున్నాం.
అనగా “వైష్ణవుడగుట” అంటే —బయటి గుర్తింపు కాదు; తానుకూడా గుర్తించలేని
స్థితి. బంధముల నుండి విముక్తి పొందిన అంతర్గత స్థితి.
రెండవ చరణం:
తనివోని యాగతంత్రములు లక్షలసంఖ్యఅనఘుఁడై చేసిన యటమీఁదజననములన్నిట జనియించి పరమపా-వనుఁడై మరికదా వైష్ణవుఁడౌట ॥సులభమా॥
|
Telugu Phrase
|
Meaning
|
|
తనివోని యాగతంత్రములు లక్షలసంఖ్య
|
లక్షల సంఖ్యలో యాగయజ్ఞాది కర్మలు చేయుట
|
|
అనఘుఁడై చేసిన యటమీఁద
|
అపరాధము లేకుండా, శుద్ధితో చేసినా
|
|
జననములన్నిట జనియించి పరమపా-
|
అనేక జన్మములు అనుభవించి
|
|
వనుఁడై మరికదా వైష్ణవుఁడౌట
|
పరమపవిత్ర స్థితిని పొంది గాని వైష్ణవుడగుట కాదా?
|
సూటి భావము:
లక్షలాది
యాగయజ్ఞములు చేసినా, అవి ఎంత నిష్ఠతో చేసినా — అనేక జన్మములు
గడిచిన తరువాత కదా పరమపవిత్ర స్థితి చేరునది. అపుడు గదా వైష్ణవుడగుట.
గూఢార్థవివరణము:
యజ్ఞాది కర్మలు ఎంత నిష్ఠతో
చేసినను అవి కార్య–కారణ సంబంధంలో నిలుస్తాయి. అవి కాలపరిమితిలో జరిగే క్రియలు. అందుచేత
అవి మనుష్యుని జీవితాన్ని కొంత శుద్ధి చేయగలిగినా, అంతర్గత బంధాన్ని
పూర్తిగా తొలగించగలవా అనే ప్రశ్నను కవి మెల్లగా ముందుంచుతున్నారు.
అన్నమాచార్యులు తీవ్రముగా పరిశీలించ
వలసిన విషయాన్ని చెబుతున్నారు. అయ్యలారా లక్షలాది
యాగయజ్ఞాది కర్మలు చేసినను అనే జన్మలు ఎత్తవలసి వుండును. తర్వాతి క్షణంపైననే అదుపులేని
మనము ఈ జన్మ తరువాత మరు జన్మలో ఏమి జరుగునో ఊహించలేము. కావున “వైష్ణవుడగుట”కు ఇవి మార్గములు కావని పరోక్షముగా
సెలవిచ్చుచున్నారు.
మూడవ చరణం:
తిరిగితిరిగి పెక్కు తీర్ధములన్నియునరలేక సేవించి నటమీఁదతిరువేంకటాచలాధిపుఁడైన కరిరాజవరదుని కృపఁగదా వైష్ణవుఁడౌట ॥సులభమా॥
|
Telugu Phrase
|
Meaning
|
||
|
తిరిగితిరిగి పెక్కు తీర్ధములన్నియు
|
అనేక తీర్థస్థలములను మళ్లీ మళ్లీ సందర్శించుట
|
||
|
నరలేక సేవించి నటమీఁద
|
కష్టపడుతూ, నియమంతో
వాటిని సేవించుట
|
||
|
తిరువేంకటాచలాధిపుఁడైన కరిరాజ
|
గజరాజును రక్షించిన తిరువేంకటాచలాధిపతి కృపవలన కాదా
|
||
|
వరదుని కృపఁగదా వైష్ణవుఁడౌట
|
|
సూటి భావము:
మానవులు
ఎన్నో తీర్థస్థలములను సందర్శించి, వాటిని భక్తితో సేవించినా — చివరకు
తిరువేంకటాచలాధిపతి కృపవలన గాని వైష్ణవుడగుట సాధ్యమా?
గూఢార్థవివరణము:
ఈ చరణంలో అన్నమాచార్యులు తీర్థయాత్రలు, పవిత్ర స్నానాలు వంటి ఆచారాలపై దృష్టి సారిస్తారు. పవిత్ర
తీర్థాలలో స్నానం చేయడం, అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించడం
మనుష్యునికి పవిత్రత ఇస్తాయని సాధారణంగా నమ్ముతారు. కవి ఈ ఆచారాలను తిరస్కరించరు.
కానీ అవి అంతర్గత పరివర్తనకు సరిపోతాయా? అనే
ప్రశ్నను మెల్లగా ముందుకు తెస్తారు. నిజమైన శుద్ధి బాహ్య జలస్నానం వల్ల కాక,
అంతరంగ శుద్ధి వల్లనే కలుగుతుంది అని
సూచన.
ఈ భావం మహాభారతంలోని అనుశాసనికపర్వంలో
కూడా కనిపిస్తుంది. ధర్మరాజు పవిత్రతను ఇచ్చే తీర్థాలు ఏవి అని అడగగా భీష్ముడు ఇలా
చెప్పాడు: దమము (ఇంద్రియ నియమం), శమము (మనశ్శాంతి), అహింస, తపస్సు ఇవే
నిజమైన తీర్థములు. ఇవి లేకుండా కేవలం నీటిలో మునిగితే పవిత్రత కలుగదు.
అందువలన అన్నమాచార్యుల
సూచన స్పష్టమవుతుంది: బాహ్య తీర్థయాత్రలు మనస్సును కొంత శుద్ధి చేయవచ్చు. కానీ
వైష్ణవత్వము — అంతర్గత పునీత స్థితి — దైవకృపతోనే పూర్ణమగును.
కీర్తన సారం
ఈ
కీర్తనలో మూడు రకాల ఆధ్యాత్మిక సాధనలను అన్నమాచార్యులు పరిశీలిస్తారు:
తపస్సు
యాగయజ్ఞాదులు
తీర్థయాత్రలు
ఈ మూడు
ఆచారాలు గౌరవనీయమైనవే అయినా,
అవి
మాత్రమే మనిషిని సంపూర్ణంగా విముక్తుని చేయలేవని సూచన.
అందుకే
పల్లవిలో అడిగిన ప్రశ్నను పరిశీలించవలెను:
“సులభమా మనుజులకు హరిభక్తి?”
X-X-The
END-X-X