Friday, 27 February 2026

T-307 అప్పటి యెండ చెమటలట్టే వుండీనా

 తాళ్లపాక అన్నమాచార్యులు
307 అప్పటి యెండ చెమటలట్టే వుండీనా

ఉపోద్ఘాతము

శృంగారపు ముసుగులో, ఈ కీర్తన మన నిజాయితీని ప్రశ్నిస్తుంది.అంగడి గందపుఁ బూఁతలట్టే వుండీనా అనగా కంపు దేహాలపై గుమాయింపు కొరకు పులుము కొన్న పూతతో పరిమళిద్దామను వైఖరి. మానవుడా కొని తెచ్చుకున్న ఆచ్ఛాదనలు అలాగే నిలిచి వుంటాయా? అని ప్రశ్నించారు అన్నమాచార్యులు.

"నెప్పు దప్ప బొంకేవు నే నెఱంగనా" (= నీవున్న స్థితిని సమర్థించుకుంటావు. దాన్ని కాపాడుకోవడానికి అబద్ధానికైనా వెనుకాడవు) అని అంటారు. ఇదే మన అసలు ప్రవృత్తి అని బయటపెడతారు. ఆత్మశుద్ధిలేని ఆచారమదియేలా?

ఆచార్యుల అసలు ప్రశ్న భక్తి స్వంతముగా గుబాళించు పరిమళమా? లేక అంగడి గందపుఁ పూతలా?”


శృంగార ​ సంకీర్తన
రేకు: 5-1 సంపుటము: 5-26
అప్పటి యెండ చెమటలట్టే వుండీనా
నెప్పు దప్ప బొంకేవు నే నెఱంగనా పల్లవి॥      

ఆవులఁ గాచిన నాటి యడవికంపల జీర-
లావల నేఁడు మాయక అట్టే వుండీనా
యేవంక నెవ్వతో నిన్ను నెనసి చేసిన చేఁత
నీ వెంత మొఱఁగిన నే నెఱంగనా అప్పటి॥

వెన్నలు ముచ్చిలునాఁడు వేడి పాలారగించిన
అన్నువ నీమోవిపొక్కులట్టే వుండీనా
వన్నెకాడ యెవ్వతెకో వలలఁ జిక్కిన నీ
నిన్న మొన్నటి సుద్దులు నే నెఱంగనా అప్పటి॥

రంగుగ మధురలోని రమణి మెత్తిన నాటి
అంగడి గందపుఁ బూఁతలట్టే వుండీనా
చెంగట మొఱగి కలసితివి వేంకటరాయ
నింగి మోచిన చేఁతలు నే నెఱంగనా అప్పటి॥
Details and Explanations:
పల్లవి:
అప్పటి యెండ చెమటలట్టే వుండీనా
నెప్పు దప్ప బొంకేవు నే నెఱంగనా పల్లవి  
              Telugu Phrase
Meaning
అప్పటి
ఆనాటి, మునుపటి
యెండ చెమటలు
వేడి, చెమటలు
అట్టే వుండీనా
అలాగే వుంటాయా (గుర్తుపట్టలేనట్టుగా ఆరిపోవా?)
నెప్పు
స్థానము, త్రోయు, ఉపాయము
దప్ప బొంకేవు
తప్పించుకోడనికి బొంకులు సాకులు
నే నెఱంగనా
నాకు తెలియవా?


అర్థ పట్టిక
శృంగార భావములో
(అంతర్లీన) తత్వ  భావములో
ఒక స్త్రీ తన ప్రియునితో చిలిపి కవ్వింపుగా మాట్లాడుతోంది. ప్రేమతో కూడిన ఆరోపణ.
అశరీరవాణి మానవుడితో ఇలా అంటోంది. ఇక్కడ నింద లేదు, కానీ ఉన్న విషయం సంకోచం లేకుండా బట్టబయలు చేస్తోంది.
అప్పటి వేడి, చెమట — ఇప్పుడు లేవని నీ ధీమా. అందుకే నువ్వు ఇప్పుడు ఇక్కడ నిలబడి ఏమీ జరగలేదని బొంకుతున్నావు. నాకు ఏమీ తెలియదనుకుంటున్నావా?”
వేడి తగ్గి ఉండొచ్చు. ఆ మోహము వెనుదీసిందెమో. కానీ, జరగడం వాస్తవం కదా. అయితే నువ్వు ప్రస్తుత స్థితిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. దాచడం ద్వారా నిజం మారదు.
ఆరోపణ ఉంది, కానీ అసూయ లేదు. ఆమెకు తెలుసు — అతను దాస్తున్నాడని.
గత అనుభవాలు వాస్తవము. వాటిని కాపాడుకొను సమర్థనలతో నిర్మించిన ఆత్మచిత్రం నిలబడుతుందా? ఇక్కడ అహంకారం ఆత్మగౌరవం తమతమ ప్రతిష్ఠను కాపాడుకోవడానికి కదులుతున్నవి. 
 

వివరణము:
పల్లవి చిలిపిగా ప్రారంభమవుతుంది. “అప్పటి యెండ చెమటలు” — (అప్పటి వేడికి పుట్టిన చెమటలు) ఇది శృంగారము, స్పర్శ భావనకు సంకేతం. కాని అదే తత్వ పరంగా, గత క్రియల వేడి, వాటి ముద్రలను సూచిస్తుంది.
 
“నెప్పు దప్ప బొంకేవు” — ప్రియుడు తన గౌరవాన్ని కాపాడుకోవడానికి కథ కడుతున్నాడుని ఆమెకు తెలుసు. ఇది కవ్వింపు మాత్రమే కాదు — గుర్తింపూ ఉంది. ఆక్షేపణ లేదు. కాని సమర్థనను ఒప్పదు.

 మొదటి చరణం:
ఆవులఁ గాచిన నాటి యడవికంపల జీర-
లావల నేఁడు మాయక అట్టే వుండీనా
యేవంక నెవ్వతో నిన్ను నెనసి చేసిన చేఁత
నీ వెంత మొఱఁగిన నే నెఱంగనా అప్పటి॥

భావము: 
శృంగార భావములో
(అంతర్లీన) తత్వ భావములో
ఆమె వదల కుండా ఏకరువుపెడుతోంది అతడి విలాసాలు
ఇక్కడ అశరీరవాణి స్వరం ఆరోపణల నుంచి యథార్థ ఘటనలలోకి పోతోంది.  
ఆవులు మేపుదామనే వంకతో అడవికి పోయావు. అక్కడ అడవి  కంపల్లో ఎందుకు దూరావో? మరి ఆ చీరలు (బట్టలు) ముళ్ళు తగిలి పాడైపోవా? - అలాగే వుంటాయా? ఏవంకతోనో ఎవ్వతనో నాతో సమానంగా చూసావు. నీవు ఎంత మరుగుచేసినా — నాకు తెలియదనుకుంటున్నావా?”
 కార్యము” (తక్షణ కర్తవ్యము) అనే పేరుతో నీవు అనుభవాల అడవిలోకి ప్రవేశిస్తావు. ఆ సంచారాల ముళ్ళ కంపలు గీసుకొని నీ చీరలు (దేహములు) పాడైపోతూనే వున్నాయి.  నీవు ఆత్మసాక్షితో  వేరే ఎవరినో  సమం చేయబోతావు. నీ ఆకర్షణలు, నీ ఎంపికలు, నీ చలనలు — వాటిని నీకు నీవే దాచుకుంటున్నావు. కానీ ఆత్మసాక్షి నుండి వాటిని దాచగలవా?  
ఆమె అతని గుట్టు రట్టు చేస్తోంది కానీ బెదిరించడంలేదు. ఆమె మాటల్లో ఏమూలనో  తనవాడు అన్న సౌహిత్యము కనబడుచున్నది
ఇక్కడ స్వరంలో ఆరోపణ కంటే దయార్ద్రత కనబడుతోంది. నాయనా నీలోనే వున్న సత్యమును ఏల చేపట్టవు అని వినబడుతుంది.

రెండవ​ చరణం:
వెన్నలు ముచ్చిలునాఁడు వేడి పాలారగించిన
అన్నువ నీమోవిపొక్కులట్టే వుండీనా
వన్నెకాడ యెవ్వతెకో వలలఁ జిక్కిన నీ
నిన్న మొన్నటి సుద్దులు నే నెఱంగనా అప్పటి॥ 
శృంగార భావములో
(అంతర్లీన) తత్వ భావములో
ఆమె తొలగుట లేదు. తొణకుట లేదు. సిగ్గుపడుట లేదు. (ముచ్చిలు = దొంగిలించు; అన్నువ = స్త్రీ; సుద్దులు = కధలు, సమాచారము) 
ఇక్కడ అశరీరవాణి స్థిరంగాను స్పష్టంగాను పలుకుతోంది.

 

వెన్నలు దొంగిలించావు. వేడి పాలు తాగినట్లు ఆమె మోవిపై కట్టిన  పొక్కులట్లే వుండిపోయాయా? — ఆమె అతడి అల్లరి గమనిస్తోంది.  ప్రేమలోని రహస్య క్షణాల గుర్తులను ఆమె గుర్తుచేస్తోంది." ఎవ్వతో వేసిన వలలో చిక్కుకున్నావు కదా!” అని ఆమె ఆటగా అంటోంది. నిన్న మొన్నటి నీ కధలు నాకు తెలియవని అనుకుంటున్నావా?” — ఆమె ప్రశ్నిస్తుంది.
ముఖ్యంగా స్త్రీవ్యామోహమనే వలలో చిక్కుకుంటావు. దొంగచాటుగా ప్రేమ  కలాపాలు సాగిస్తావు. ఆ అనుభవాలు మనసులో గుర్తులుగా నిలుస్తాయి. అవి స్మృతి, అలవాటు, ఆకర్షణల రూపంలో కొనసాగుతాయి.
 
స్వధర్మమును విడిచి ఆకర్షణల వలలో పడితే, పరాయి ధర్మాలలో చిక్కుకోవడం సహజం.
 
నీవు చేసిన పనుల గుర్తులు దాచిపెట్టడం ద్వారా పోవు. గతం మనతోనే ఉంటుంది. దాన్ని మాటలతో దాచలేము. మనిషి తన గతం నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తాడు — కానీ అది అతని చైతన్యంలోనే నిలిచి ఉంటుంది.
ఆమె మాటల్లో కవ్వింపు ఉంది, కాని అవగాహన కూడా ఉంది.  స్నేహపు ఔదార్యము కనబడుతోంది.
ఇక్కడ నిందా  స్వరం లేదు. మనిషి  తనకు తానే చేసుకొను  (స్వీయ) మోసాన్ని గమనించమని సూచన.

మూడవ​​ చరణం:
రంగుగ మధురలోని రమణి మెత్తిన నాటి
అంగడి గందపుఁ బూఁతలట్టే వుండీనా
చెంగట మొఱగి కలసితివి వేంకటరాయ
నింగి మోచిన చేఁతలు నే నెఱంగనా అప్పటి॥
శృంగార భావములో
(అంతర్లీన) తత్వ భావములో
మొదటి రెండు పంక్తులు: ఇప్పటి దాకా, సూచన ప్రాయంగా చెప్పినవి వదలి సూటిగా అడుగుతోంది:
మొదటి రెండు పంక్తులు: మోక్షము బజార్లో అమ్మే అంగడి వస్తువు కాదంటున్నారు.
“మధురలో ఆ రమణి నిన్ను ఆలింగనం చేసినప్పుడు, అంగడిలో కొని పూసుకున్న గంధపూత, రెండు అలాగే నిలిచి వుండిపోయాయా?” — ఆమె చిలిపిగానే, కాని గట్టిగా నిలదీస్తోంది.
రంగుగ మధురలోని రమణి మెత్తిన నాటి
అంగడి గందపుఁ బూఁతలట్టే వుండీనా
నువ్వు మోక్షమును బజార్లో అమ్మే అంగడి వస్తువుగా భావించి వారిని వీరికి అంగంగ, సాష్టాంగ ప్రణామములు చేస్తూ పోతే కాలము చెల్లిపోతుంది. వారి మాటలు, వారి నీతులు — కాలంతో కరిగిపోయే అంగడి గంధపు పూతలవంటివి.
 
ఆత్మసాక్షి ముందు ఏ ముసుగు నిలవదు. ఏ ముసుగు లేనప్పుడు ఆత్మసాక్షి అవసరమూ లేదు. అటువంటి స్థితిలో మానవునికి తన అసలు స్థితి అనుభవమునకు వచ్చును.
చివరి రెండు పంక్తులు: అన్నమాచార్యులు తానే ఆ స్త్రీనని చెబుతారు ఇప్పటి దాకా ప్రశ్నించినది తనలోని అహంకారాన్నే. వేంకటరాయుని ఉద్దేశించి ఇలా అంటున్నారు.

 

నాకే తెలియకుండా నాలో కలిపోతావు కదా వేంకటరాయుడా! ఆకాశాన్ని, విశ్వాన్ని ఎత్తి పట్టుకోగల నీ సామర్ధ్యం నాకు తెలుసునా
చెంగట మొఱగి కలసితివి వేంకటరాయ
నింగి మోచిన చేఁతలు నే నెఱంగనా అప్పటి॥ 

చివరి రెండు పంక్తులు: (ఇప్పటిదాక ప్రశ్నించిన దానితో తనలోనే ఉన్నా తనకు తెలియని విషయములు బహిర్గతమయ్యాయి). అన్నమాచార్యులకు తానను స్పృహ వచ్చినది. అప్పటికే వేంకటరాయుడు తనలో ప్రవేశించి, మళ్లీ దూరమైన అనుభూతి గ్రహణమవుతుంది. అప్రయత్నంగా ఇలా అంటున్నారు.

నిన్ను పూర్తిగా గ్రహించగలనా? ఆకాశాన్నే ఎత్తగల నీ చేతుల శక్తిని నేనెట్లా తెలుసుకోగలను?”
ఇప్పటిదాకా "నే నెఱంగనా"అన్న అంగనకే తెలియకయే వచ్చెను  వేంకటరాయుడు
"నే నెఱంగనా"అన్న ఆత్మసాక్షి మౌనమైతే "నింగి మోచిన చేఁతలు" చేతనమునకు వచ్చును

 


X-X-The END-X-X

 

1 comment:

  1. అప్పటి యెండ చెమట లట్టీ వుండీనా..పల్లవి నిగూఢమైన అర్థాన్ని తెలుపుతున్నది. శృంగారభావంలో, తత్త్వభావనలో. సంచితకర్మలు వెంటాడుతూనే ఉంటాయని తత్వపరంగా అంటున్నారు అన్నమయ్య. మొదటి చరణంలో కూడా శృంగార
    భావాన్ని ,తత్వభావాన్ని వ్యక్రీకరిస్తున్నారు ఆచార్యులవారు.ఇంద్రియవిషయములచే ఆకర్షింపబడే నీవు వాటిని ఆత్మకు కనబడకుండా దాచగలవా అంటూ రెండువిధములైన భావనలు వ్యక్త
    పరుస్తున్నారు అన్నమయ్య.

    మూడవ చరణంలో స్వధర్మమును విడిచి శృంగారపరమైన చేష్టలలో చిక్కుకొని తప్పించుకోలేవని, వాటి ఫలాన్ని అనుభవించువరకు అవి వెంటాడతాయని అంటున్నారు అన్నమాచార్యులవారు. నాలుగవ చరణం పూర్తిగా తత్వాన్ని బోధిస్తున్నది. ముక్తి అనేది బజారులో కొనే వస్తువు కాదని,ఆత్మసాక్షి ముందర ఈ ముసుగులు నిలవలేవు. ఈ ముసుగు నుంచి బయట పడితే నిజస్థితి ద్యోతకమవుతుందని ఆచార్యులవారు ఆధ్యాత్మిక బోధను చేస్తున్నారు.

    ఓం తత్ సత్ 🙏
    కృష్ణమోహన్

    ReplyDelete

T-337 విచ్చేయవమ్మా వెన్నెలబొమ్మా

  తాళ్లపాక అన్నమాచార్యులు 337 విచ్చేయవమ్మా వెన్నెలబొమ్మా For English Version Press Here పరిచయం వెన్నెలబొమ్మ మనిషి ఈ ప్రపంచములోనికి ప్రవే...