అన్నమాచార్యులు
96R ఎదుట నెవ్వరు లేరు యింతా
విష్ణుమయమే
ఉపోద్ఘాతం
మానవులు తమ
జీవితాలలో అనుభవించే వేర్పాటు భావన అన్నమాచార్యులవారిని లోతుగా కలచివేసి ఉండవచ్చు.
మనల్ని మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, ఇతరుల నుండి, మన చుట్టూ ఉన్న ప్రపంచం నుండి వేరుగా
భావిస్తాము. ఈ వేర్పాటు భావన మన ఆలోచనలను, మాటలను, చేతలను, ఇతరులతో మన సంబంధాలను ప్రభావితం చేస్తుంది.
అయితే, ఈ వేర్పాటు నిజమైనదేనా? లేక ప్రపంచాన్ని మనం చూసే, అనుభవించే విధానంలో
ఏర్పడిన భావనా?
ఈ కీర్తన ఆ
లోతైన ఆవేదన నుండి వెలువడినదిగా అనిపిస్తుంది. మనకు, ఈ ప్రపంచానికి, శ్రీవేంకటేశ్వరునికి మధ్య ఉన్న
అంతర్గత సంబంధాన్ని పదేపదే గుర్తుచేస్తూ, మన వ్యక్తిగత
ఉనికికి సంబంధించిన భావనను దాటి, మనం గుర్తించలేకపోతున్న
సత్యాన్ని చూడమని కవి ఆహ్వానిస్తున్నట్లు అనిపిస్తుంది.
|
అధ్యాత్మ కీర్తన:
|
|
రాగి రేకు: 100-2 సంపుటము: 1-502
|
|
ఎదుట నెవ్వరు లేరు యింతా విష్ణుమయమే వదలక హరిదాసవర్గమైనవారికి ॥ఎదుట॥ ముంచిన నారాయణమూర్తులే యీ జగమెల్ల అంచితనామములే యీ యక్షరాలెల్లా పంచుకొన్న శ్రీహరిప్రసాద మీ రుచులెల్లా తెంచివేసి మేలు దాఁ దెలిసేటివారికి ॥ఎదుట॥ చేరి పారేటి నదులు శ్రీపాదతీర్థమే భారపు యీ భూమెతని పాదరేణువే సారపుఁ గర్మములు కేశవుని కైంకర్యములే ధీరులై వివేకించి తెలిసేటివారికి ॥ఎదుట॥ చిత్తములో భావమెల్లా శ్రీవేంకటేశుఁడే హత్తిన ప్రకృతి యెల్లా నాతని మాయే మత్తిలి యీతనికంటే మరి లే దితరములు తిత్తిదేహపు బ్రదుకు తెలిసేటివారికి ॥ఎదుట॥
|
Details
and Discussions:
పల్లవి:
ఎదుట నెవ్వరు లేరు యింతా విష్ణుమయమే
వదలక హరిదాసవర్గమైనవారికి ॥ఎదుట॥
|
కీర్తన పాదము
|
సాధారణ భావము
|
అంతరార్థము
|
|
ఎదుట నెవ్వరు లేరు
యింతా విష్ణుమయమే
|
ఎదురుగా వేరెవరూ
లేరు; అంతా విష్ణుమయమే.
|
మనకు కనిపించే
సమస్తమును నడిపించు ఒకే సూత్రములోని భాగమే (విష్ణుస్వరూపమే).
|
|
వదలక
హరిదాసవర్గమైనవారికి
|
హరిసేవకుల
మార్గాన్ని విడువని వారికి.
|
హరిసేవకుల మార్గములో
కలిసిపోవు వారికి
|
గూఢార్థవివరణము:
ఎదుట నెవ్వరు లేరు యింతా
విష్ణుమయమే: మనకు ఎదురుగా కనిపించే ప్రపంచం అనేక వస్తువుల, వ్యక్తుల,
జీవజాలముల సముదాయంగా అనిపిస్తుంది. అందులో మనము ఒక ప్రత్యేకమైన
వ్యక్తిగా, మనకంటూ ఒక ఉనికి, గుర్తింపు
ఉన్నవారిగా, తక్కిన వారి కంటే భిన్నంగా భావిస్తాము. మనలాగే
ఇతరులూ తమను ప్రత్యేకమైన వ్యక్తులుగా భావిస్తారు.
నేను వేరు అనే భావనకు స్వతంత్ర అస్తిత్వం
లేకపోయినా, ఆ భావన మాత్రం లేదని చెప్పలేము. ఈ భావనతోనే మనకు ఇతరులు వేరుగా
కనిపిస్తారు.
ఇలా మనల్ని మనం ఇతరుల నుంచి వేరుగా
చూసుకోవడానికి కారణం మనిషికి సహజంగా ప్రసాదించబడిన తెలివి. ఈ తెలివి దాని చుట్టూ
ఉన్నవాటిని గమనిస్తుంది, పోల్చి చూస్తుంది, విశ్లేషిస్తుంది, అర్థం చేసుకుంటుంది. ఈ పనులు చేస్తూనే, ఆ తెలివే ప్రతివారికీ తమదైన ప్రత్యేక గుర్తింపుగా మారిపోతుంది. అంటే, “నేను” అనే భావనకు తన తెలివే ఆధారమవుతుంది. మనకు అనేక
విధములుగా సహాయపడు ఈ తెలివి మన కనుల ఎదుటి వాస్తవమును మాత్రము గ్రహించలేకున్నది.
ఎషర్ గారి (లేదా ఎస్చెర్) Double Planetoid అను చిత్రం దృశ్యరూపంలో
ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ చిత్రములో ఒక
"ప్లానెటోయిడ్" మన బుద్ధి లేదా వివేకము అనుకోండి. రెండవది ఈ ప్రపంచము
అనుకోండి. ఈ రెండు ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాయి. వాటిని వేరువేరుగా చూడలేము
ఎందుకంటే అవి విడదీయలేనంతగా కలిసి ఉన్నాయి.
మనము గుర్తించ వలసినది అతిక్లిష్టమైన
వలయము అని చెప్పకనే ఆ బొమ్మ తెలుపుతున్నది. ఒక
"ప్లానెటోయిడ్" మరొకదానిని పార్శ్వ, ఊర్ధ్వ, అధో తలములలోను అతి సూక్ష్మమైన వంపుల గుండాను చుట్టి వున్న సంగతి మీరు
చూచే ఉంటారు. ఆ రెండిటిని విడదీయుట అసాధ్యమని తెలుస్తుంది. మనిషి ఈ రకముగా ఈ
ప్రపంచముతో ముడిపడి ఉన్న వ్యక్తి. అతడు ప్రపంచము కంటే వేరైనవాడు కాదు. ఆ
కనబడుతున్న డబుల్ "ప్లానెటోయిడ్"
వాస్తవానికి ఒక విడదీయలేని నిర్మాణము, కానీ రెండుగా అనిపిస్తున్నది.
మనిషికి 'తనకు ఈ ప్రపంచానికి గల సంబంధమును
తెలియుట' అతని వివేకమునకు సవాలు. కానీ ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్న ఈ 'జ్ఞానము' 'ప్రపంచము'లను ఒకటిగా గుర్తించుట కష్టము. కానీ
విడివిడి భాగములు అని తెలుపుట సులభము. తాను ఆ సమగ్ర నిర్మాణంలో ఒక భాగమేనని
గుర్తించడానికి ఒక కఠినమైన మానసిక ప్రయాణం అవసరం.
ఈ నేపథ్యంలో అన్నమయ్య, ఎదుట
నెవ్వరు లేరు యింతా విష్ణుమయమే అని అంటున్నాడు. మనకు
కనిపించే ప్రపంచంలో మనకు వేరుగా కనిపించేవారూ, కనిపించేవన్నీ
కూడా ఒకే సమగ్ర ఉనికిలో భాగాలనే భావన ఇందులో ఉంది.
వదలక హరిదాసవర్గమైనవారికి: మరి ఇక్కడ హరిదాసుడు
అనే పదాన్ని ఎందుకు తీసుకువచ్చారు? ఇక్కడ హరిదాసుడు అనేది ఏదో ఒక బాహ్య
గుర్తింపు కాదు. తన ప్రత్యేక అస్తిత్వ భావనను దాటి, సమస్త
ఉనికితో తనకున్న అంతర్లీన సంబంధాన్ని గుర్తించిన వ్యక్తిని సూచిస్తుంది.
అటువంటివాడు ఇతర భేదాలను మరచి, సదా ఆ స్థితిలోనే ఉంటాడు.
భగవద్గీత 6.29లో చెప్పినట్లు, సమస్తంలో
ఏకత్వాన్ని దర్శిస్తాడు — సర్వత్ర సమదర్శనః.
హరిదాసుడు కావడానికి విశ్వవిద్యాలయ
డిగ్రీల మాదిరిగా నిర్ణీత ప్రమాణాలు లేవు. తాను హరిదాసుడు కానని ఒక వ్యక్తి
తెలుసుకోగలడేమో కానీ, తాను హరిదాసుడినని నిశ్చయంగా చెప్పుకోలేడు. అటువంటిది
హరిదాసుని స్థితి. అందువల్ల హరిదాసవర్గంలో ఎవరెవరు చేరి ఉన్నారో నిర్దిష్టంగా
నిర్ణయించలేము. ఈ సంక్లిష్టతను సంక్షిప్తంగా హరిదాసవర్గము అనే పదం
సూచిస్తున్నది.
ఈ విధంగా పల్లవిలోని రెండు పాదాలూ ఒకే
అనుభవాన్ని రెండు కోణాలలో తెలియజేస్తున్నాయి. ఒకటి సమస్త ఉనికిలోని ఏకత్వాన్ని గురించి
చెబితే, మరొకటి ఆ
ఉనికితో ఏకత్వము చెంది మైమఱచినవారి స్థితిని సూచిస్తుంది.
మొదటి చరణం:
ముంచిన నారాయణమూర్తులే యీ జగమెల్ల
అంచితనామములే యీ యక్షరాలెల్లా
పంచుకొన్న శ్రీహరిప్రసాద మీ రుచులెల్లా
తెంచివేసి మేలు దాఁ దెలిసేటివారికి ॥ఎదుట॥
|
కీర్తన పాదము
|
సాధారణ భావము
|
అంతరార్థము
|
|
ముంచిన
నారాయణమూర్తులే యీ జగమెల్ల
|
ఈ జగమంతా ప్రచ్ఛన్న
నారాయణమూర్తులతో నిండి ఉన్నది.
|
అజ్ఞానపు తెరలతో
కప్పబడియున్న దేవతా మూర్తులే యీ జగమెల్ల (ప్రతీవారికి తమలోని దైవత్వమును
దర్శించు అవకాశం ఉంది)
|
|
అంచిత నామములే యీ
అక్షరాలెల్లా
|
ఈ అక్షరాలన్నీ
గౌరవించదగిన శ్రీనామములే.
|
మానవుడు పలుకు
మాటలు శ్రీనామములే. కానీ తమ పలుకులతో ఇతరులలోని ఆ సత్యమును గుర్తించువారు
కొందరే.
|
|
పంచుకొన్న
శ్రీహరిప్రసాద మీ రుచులెల్లా
|
మానవుల
అనుభవములన్ని పంచుకొన్న శ్రీహరి ప్రసాదముల వంటివే
|
ఈ శ్రీహరి అనుభావము
వ్యక్తిగతము కాదు. అట్లని సామూహికముకాదు. వ్యక్తిగతభావన లేనినాడు ఆ
శ్రీహరిప్రసాద మీ రుచులెల్లా
|
|
తెంచివేసి మేలు దాఁ
దెలిసేటివారికి
|
తమకు ఆ
విశ్వవ్యాప్త భావనకు మధ్య అడ్డంకులను తొలగించుకొని, దానివల్ల కలిగే
మేలును తమకు తామే తెలుసుకున్నవారికి.
|
అజ్ఞానం, మోహం, సంశయాలు ఏ రకముగా
అడ్డుకుంటున్నదీ గ్రహించినవారు చేయునదే హరిదాసత్వము
|
గూఢార్థవివరణము:
ముంచిన నారాయణమూర్తులే యీ జగమెల్ల: ఈ
ప్రపంచంలోని మానవులందరికీ దైవత్వమును
దర్శించు అవకాశం ఉన్నది. కానీ, మన జీవితములు వేరొక దిశలో పయనించుటను గమనించుట
ముఖ్యం. భగవద్గీత 2-41లో చెప్పబడిన ఒకే ఒక మార్గం సరియైనది.
తక్కినవన్నీ అపదిశలు అన్నది గమనించుకోవాలి.
అంచిత నామములే యీ అక్షరాలెల్లా: భగవద్గీత 17-15లో సత్యములు, ఇతరులకు ప్రయోజనకరమైనవి ఉద్వేగమును కలిగించనివి, కోపములు పుట్టించనివి అగు మాటలు మరియు నిత్య వేద
శాస్త్రముల పఠనము - వాచక తపస్సు అని చెప్పబడిది.
కానీ మనము మాటల శక్తిని దేనికి ఉపయోగిస్తాము? మన సహజ ధోరణి సుమతి
శతకంలో చెప్పినట్లుగా ఉంటుంది.
ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటి కామాటలాడి యన్యుల
మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుక తిరుగువాడు ధన్యుడు
సుమతీ!
జాగ్రత్తగా చూస్తే ఇది మన జీవనమును
ఒడిదుడుకులు లేకుండా సాగించడానికి సులభమైన మార్గము. అందరు ఒప్పుకొన్నదీను. ఇది
విడిచి వాచక తపస్సు ఎం దుకు చేబడతారు చెప్పండి?
పంచుకొన్న శ్రీహరిప్రసాద మీ
రుచులెల్లా: తిరిగి ఎస్చెర్ గారి బొమ్మ చూడండి. ఈ ప్రపంచము మనందరకు సామాన్యము. ఈ
ప్రపంచముతోటి సంబంధము పంచుకొన్న శ్రీహరిప్రసాదము.
తెంచివేసి మేలు దాఁ
దెలిసేటివారికి: ఈ ప్రపంచంలోని ఇతరులను గుర్తించగలిగే యంత్రాంగమే, ఈ ప్రపంచంలో ఉండటంలోని మేలును గుర్తించనివ్వకుండా
అడ్డుకుంటున్నది.
రెండవ చరణం:
చేరి పారేటి నదులు శ్రీపాదతీర్థమే
భారపు యీ భూమెతని పాదరేణువే
సారపుఁ గర్మములు కేశవుని కైంకర్యములే
ధీరులై వివేకించి తెలిసేటివారికి ॥ఎదుట॥
|
కీర్తన పాదము
|
సాధారణ భావము
|
అంతరార్థము
|
|
చేరి పారేటినదులు
శ్రీపాదతీర్థమే
|
జీవజాలమునకు మేలు
సమకూర్చు ఈ నదులన్నీ శ్రీహరి పాదతీర్థములే
|
జీవజాలానికి మేలు
చేకూర్చే ఈ నదీ (ప్రకృతి) సంపద
శ్రీహరి ప్రసాదించిన పవిత్ర తీర్థమే.
|
|
భారపుయీ భూమెత
నీపాదరేణువే
|
సువిశాలమైన ఈ భూమి
కూడా నీ పాదాలకు అంటిన ఒక చిన్న ధూళికణం వంటిదే.
|
అనంతమైన సృష్టి ఈ
భూమికి మాత్రమే పరిమితంకాదు. అనంతుడైన శ్రీహరిని ఊహలలో కూడా గణించలేము.
|
|
సారపుఁగర్మములు
కేశవుని కైంకర్యములే
|
సారవంతమైన, ప్రయోజనకరమైన
కర్మలన్నీ కేశవునికి చేసే సేవలే.
|
సత్యమైనవి, హితమైనవి,
సార్థకమైన కార్యాలన్నీ కేశవునికి కైంకర్యములే.
|
|
ధీరులై వివేకించి
తెలిసేటివారికి
|
ధైర్యవంతులై, వివేచనతో
పరిశీలించి తెలుసుకున్నవారికి.
|
భయపడకుండా, ధైర్యంగా, ముఖ్యంగా షరతులతో
కూడిన ఆచరణ కానిది, ఎవరిచేతా
నిర్దేశించబడని వివేకము తెలుసుకునేవారికి అంతా విష్ణుమయమే..
|
గూఢార్థవివరణము:
ధీరులై
వివేకించి తెలిసేటివారికి: వివేకము ఒకరు ప్రసాదించేది
కాదు. ఎవరికి వారే చేరుకోవలసినది. అది షరతులతో కూడినది కాదు. పిరికివారు
చేపట్టలేనిది. ధీరులు మాత్రమే చేరగలిగినది. ధీరులంటే ఎవ్వరినీ లెక్కచేయనివారని
కాదు. వారి ధైర్యంలో క్రమశిక్షణ ఉంటుంది. వారి వివేకం ప్రశాంతంగా ఉంటుంది.
మూడవ చరణం:
చిత్తములో భావమెల్లా శ్రీవేంకటేశుఁడే
హత్తిన ప్రకృతి]యెల్లా నాతని మాయే
మత్తిలి యీతనికంటే మరి లే దితరములు
తిత్తిదేహపు బ్రదుకు
తెలిసేటివారికి ॥ఎదుట॥
|
కీర్తన పాదము
|
సాధారణ భావము
|
అంతరార్థము
|
|
చిత్తములో
భావమెల్లా శ్రీవేంకటేశుఁడే
|
మనస్సులో కలిగే
భావాలన్నీ శ్రీవేంకటేశ్వరుని స్వరూపమే.
|
ఈశ్వరాజ్ఞ లేక
చీమైనా కుట్టదంటారు. అలాగే మన మనస్సులోని ఆలోచనలు, భావాలు అన్నీ శ్రీవేంకటేశ్వరుని చేతిలోనివే
|
|
హత్తిన ప్రకృతి
యెల్లా నాతనిమాయే
|
మనల్ని ఆవరించి
ఉన్న ప్రకృతి అంతా ఆయన మాయే.
|
మన చుట్టూ ఉన్న
ప్రకృతి, దాని ప్రభావాలు, ఘనము లేదా వాస్తవము
అనిపించు మన జీవితం, ఈ లోకము, దాని వ్యాపారములు, మాయ ఆవరించే
సమస్తము దైవంలోని భాగమే.
|
|
మత్తిలి యీతనికంటే
మరి లే దితరములు
|
ఈయనను మించి మరొకటి
ఏదీ లేదు.
|
అనేక రూపములలో అనేక
కోణములలో విస్తరించియున్న ఈ ప్రపంచము ఆయన స్వరూపమే. అతడు తప్ప వేరేమియు ఈ
విశ్వమున లేదు.
|
|
తిత్తి
దేహపుబ్రదుకు తెలిసేటివారికి
|
ఈ తిత్తివంటి
దేహంలో జీవించే జీవితం యొక్క స్వభావాన్ని తెలుసుకున్నవారికి.
|
కొలిమి వద్ద
ఉపయోగించే తిత్తి వంటిది ఈ దేహము. తిత్తిలోకి గాలి వెళ్ళినంతసేపే కొలిమి
పనిచేస్తుంది. అలాగే శ్వాస కొనసాగినంతసేపే దేహము పనిచేస్తుంది. అటువంటి ఈ దేహపు
అశాశ్వతమైన ఉనికిని ప్రత్యక్షంగా తెలుసుకునేవారికి అంతా విష్ణుమయమే..
|
గూఢార్థవివరణము:
అన్నమాచార్యులవారు
ఈ చరణంలో మరింత నిశితమైన విషయాన్ని తెలుపుచున్నారు. నేను, నువ్వు, ఇతరులు అనే భావనలు మనం అనుభవించే
ప్రపంచానికి సంబంధించినవి. తిరిగి డబుల్ "ప్లానెటోయిడ్" బొమ్మను చూడండి.
ఆ రెండు ప్లానెటోయిడ్లు విడదీయలేని ఒక సమ్మేళనంగా ఉన్నాయి. ఆ బొమ్మలోని ఏకత్వాన్ని
మనం సులభంగా చూడగలుగుతున్నాము. కానీ మన నిజ జీవితంలోని ఏకత్వాన్ని
గుర్తించలేకపోతున్నాము. "నేను వేరు" అనే భావనకు వస్తుగతమైన ఆధారం
లేకపోవచ్చు. అయితే, ఆ భావన మనలో ఉన్నదనే వాస్తవాన్ని
కాదనలేము. ఇదే అసలైన అస్తిత్వ సమస్య. దీనిని అర్థం చేసుకోవడానికి మనం తగినంత సమయం
వెచ్చించడం లేదు.
మన
స్మృతి నుండి వచ్చే భావనలు ఈ దృశ్య ప్రపంచాన్ని వాస్తవంగా చూపిస్తాయి. ఆ భావనలు
ఉద్భవించే మనస్సులోని ఊహలు మాత్రం ఆ వాస్తవానికి నీడలుగా అనిపిస్తాయి. కానీ నిజంగా
జరుగుతున్నదేమిటి? ముందుగా ఊహ కలుగుతుంది. ఆ
తరువాత ఈ ప్రపంచం వాస్తవమనే అనుభవం కలుగుతుంది. ఒక వస్తువును మనం ఎలా
గుర్తిస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఈ గందరగోళం ఇంతటితో ఆగదు.
మనిషి
బ్రతుకే క్షణికం. ఇంత స్వల్పమైన జీవితంలోనే ముందు వెనుకలను గుర్తించడం కష్టంగా
ఉంటే, ఇది చూడండి. ఈ వ్యక్త ప్రపంచం జరిగిపోయిన కాలానికి చెందినది. మరి
ప్రస్తుతం జరుగుతున్న క్షణం ఎక్కడ ఉంది? మనందరి ఊహలలోనే
ఉంది. మన ఊహలు ఈ జీవితాన్ని పొడిగించుకోవాలనే స్వార్థ చింతనతో కూడి ఉంటాయి. ఆ దిశ
నుండి పుట్టే కార్యాలు అసంగతములు. ప్రపంచంలోని మనుషులందరూ ఒక పెద్ద కొండను తమకు
నచ్చిన దిశలో ఎవరికి వారు తోస్తున్నట్లు ఊహించండి. ఫలితంగా అనిశ్చితి ఏర్పడుతుంది.
ఈ దృశ్య ప్రపంచం ప్రతిబింబించేది ఆ స్థితినే. అటువంటి స్థితిలో, "చిత్తములో భావమెల్లా శ్రీవేంకటేశుఁడే" అని కవి పలికిన మాటలు పైపై
మాటలుగానే మిగిలిపోతాయి.
ఈ
వేర్పాటు భావన యొక్క మూలాన్ని గుర్తించడమే హరిదాసత్వము. ఆ గుర్తింపే
"సారపుఁగర్మములు" — సత్యమైనవి, హితమైనవి,
సార్థకమైన కార్యములకు దారితీస్తుంది. ఆ దిశకు విరుద్ధంగా సాగే
కార్యాలు అసంగతములు. వాటి ఫలితం అనిశ్చితి. అదే మన మనస్సు యొక్క స్వభావము.
"నేను నియంత్రించగలను" అనే భావన మనిషిది. ఆ నియంత్రణను
శ్రీవేంకటేశునకు ఒసగడమే హరిదాసత్వము. మనం నియంత్రించగలమని భావించేది కూడా
వాస్తవానికి ఆ భగవంతుని నియంత్రణలోనే ఉంటుంది. నియంత్రణను శ్రీవేంకటేశునకు వదలడమే
హరిదాసత్వము. ఆ తరువాత విషయాలు ఏ విధంగా విప్పారుతాయో అది భగవంతుని చేతిలోనే
ఉంటుంది.
X-X-X THE
END X-X-X

No comments:
Post a Comment