పెద తిరుమలాచార్యులు
167 విచారపరులాల వివేకులాల
For English Version press here
సారాంశం: మీరు ఏమి చూడాలనుకుంటున్నారో అదే చూస్తారు, అక్కడేం వుందో కాదు. - జెన్నిఫర్ హిల్లర్
కీర్తన సారాంశం:
పల్లవి: విచారపరులాల వివేకులాల సంస్కరించి తెలుసుకొని ఆ విధముగా
నడవుడీ. అన్వయార్ధము: మానవులారా
వివేకించి బ్రతుకు మార్గమును
కనుగొనుడీ.
చరణం 1: చేసిన పుణ్యమువల్ల ఉట్టిపడు
దేవత్వమును, పాపములకు
ఆసరా కల్పించు అసురత్వమును, తగిన దాసరితనమువల్ల
కలుగు భక్తపరాయణత్వమును మనసున నిల్పి గొప్పతనమున యేది ఎక్కుడో వడి నెంచుకొనుడీ.
చరణం 2: మానవులారా! ఎదుటి ఈ ప్రపంచము
మనము దానిలో ప్రవేశించి కలుగఁజేసికొన్నకొలది
ఏర్పడినదే కాని సహజముగా సిద్ధించినది కాదు. ఎడతెగని తామసత్వమున అధోగతి పాలుకాకండి.
సాత్వికభావమున మోక్షము కలుగవచ్చు. సాటిలేని ఆ మార్గమేదో తెలియుడీ.
చరణం 3: విచారించి చూచిన ఒప్పుగా దేహము
అనిపింప చేయునది అల్పమైనది, తక్కువది
యగు మాయయే. కానీ మానవులకు భక్తిని సిద్ధింపజేయునది ఆ అలమేల్మంగయే. సమముగా, అటు
ఇటు తొలకక నేర్పున చూచిన అనేక ప్రాభవములను కలుగజేయువాడు అంతర్యామి శ్రీవేంకటేశ్వరుడు
అని గ్రహించి బ్రతుకు మార్గమును ఎంచుకొనుడీ.
విపులాత్మక వివరణము
ఉపోద్ఘాతము: సరళంగా, సొగసుగా కీర్తన ఎలా
రాయవచ్చో చెప్పుటకు ఈ సూటి కవిత ఒక ఉదాత్తమైన ఉదాహరణ. కవిత్వం తన సహజ విలువల కారణంగాను, అది వెదజల్లు సౌరభాలతోను
కాలము విధించు ఎల్లలను అధిగమించి శాశ్వతత్వమును అందిపుచ్చుకుంటుంది. పెద తిరుమలాచార్యులు
తండ్రికి తగ్గ తనయులు. వారి ప్రాజ్ఞకు ఈ కీర్తన చిన్న మచ్చు తునక మాత్రమే.
కీర్తన: రాగిరేకు: 66-4 సంపుటము: 15-379 |
విచారపరులాల వివేకులాల
పచరించి తెలిసి యాపగిది నడవుడీ ॥పల్లవి॥ చేసిన పుణ్యమువల్ల చెలఁగి దేవతలైరి
ఆసరి పాపమువల్ల అసురలైరి
దాసరితనమువల్ల తగ నారదాదులైరి
వాసి నిందెవ్వరెక్కుడో వడి నెంచుకొనుడీ ॥విచార॥ ఘనరాజస గుణాన కలుగు నిహలోకము
అనిశము తామసాన నధోగతి
మొనసి సాత్వికమున మోక్షము సిద్ధించు
అనుపమ పదమేదొ అది యెంచుకొనుడి ॥విచార॥ పరగ దేహమూలము ప్రాకృతమయిన మాయ
అరసి ఆత్మ నీడేర్చు నలమేల్మంగ
సిరుల నంతర్యామి శ్రీవేంకటేశ్వరుడు
సరినిందు మీ బ్రతుకుజాడ యెంచుకొనుడీ ॥విచార॥
|
Details and Explanations:
ముఖ్య పదములకు అర్ధములు: పచరించి = సంస్కరించి; యాపగిది =
ఆ విధముగా.
భావము: విచారపరులాల
వివేకులాల సంస్కరించి తెలుసుకొని ఆ విధముగా నడవుడీ.
వివరణము: ‘పచరించి
తెలిసి’ = ‘సంస్కరించి తెలుసుకొని’ అన్నదానిని కొంత
వివరముగా పరిశీలిద్దాము. సంస్కరించ వలసినది యేమి? తన విచారములనా? తన వివేకమునా? అన్నది తెలుపక పెద తిరుమలాచార్యులు మనలను
సందిగ్ధములో పడవేయలేదు. వారు ఇది ఒకటి, అది యొకటి అని
సూచించక పోవడము “మానవుని ప్రభావితము చేయుచున్న సమాస్తమును సంస్కరించ
వలె” అని భావించవలెను. ఇటువంటి ప్రక్షాళన సాధ్యమేనా? ఇదే విషయమును "ది లాస్ట్ వర్డ్” అను
ఒక అద్భుత చిత్రలేఖనము ద్వారా మరింత విపులముగా తెలుసుకొందాము.
Le
dernier cri (The Last Word) "అంతిమ నినాదం" అనేది
మాగ్రిట్ గారి సంకేతాత్మక చిత్రం.
ముఖ్యంగా ఆ కళాకారుడి చివరి
చిత్రము. దానికి తగ్గట్టుగా దాని పేరును పెట్టిరి. ఆ చిత్తరువులో మనసు
మూలముల నుండి కన్ను అను బిలము ద్వారా చూచు
మనకు కనబడు దృశ్యమును ఒక కిటికీ ద్వారా సంజ్ఞార్ధముగా చూపిరి. వారి ప్రసిద్ధ చిత్రాలలో కనిపించే
కఱుకు తేలిన పర్వతాల నేపధ్యంలో, మనకు కుడి చేతి
అంచు మాత్రమే
కనిపించే కిటికీ గుండా, గాలిలో
వ్రేలాడుతున్న ఒక పెద్ద ఆకు దర్శనమిస్తుంది. ఆ ఆకు మధ్యలో బయటకు వచ్చిన
వేర్లతో వున్న అత్యంత సహజముగా చిత్రించబడిన చెట్టును చూడవచ్చు.
గాలిలో త్రేలాడుతున్న పెద్ద ఆకు అస్తిత్వములేని వూహలకు ప్రతీక.
మానవుడు తన కళ్ళ ముందున్న దానిని గుర్తించక తన మనోఫలకముపై లేని దానిని వూహించుకుంటాడని
ఈ చిత్రము నిరూపించుచున్నది. కనుల ముందటి నిర్జన నిర్జీవ పర్వతాలను సహించలేక, వున్నది వున్నట్లు
గ్రహించుటకు మనసొప్పక, స్వతస్సిద్ధమును వదలి తన మనస్సులో ప్రకృతినిపోలిన ప్రకృతిని
సృష్టించి, దాని సహజత్వమునకు తన్మయత్వము చెందుతాడు. ఇంతకన్ననూ అసహజ జీవి
మొత్తము విశ్వములోనే వుండదు.
ఈ రకముగా అసహజమగు ప్రకృతి
కనుగుణముకాని ప్రవృత్తిని మానవుడు సహజమని భావించుచూ జీవనయానమును చేయును. 'తెలిసి'తో ఇటువంటి అర్ధమువచ్చునట్లే ఉపయోగించిరి. ఈ విధముగా మార్పు చెందవలసినది ఆలోచనలే
కాక, వాటిని ప్రేరేపించుచున్న
నైజమును, వాటికి ఊతమునిచ్చుచున్న
ఆకృతులను, నిర్మాణములను, వ్యవస్థలను సమూలముగా
పెళ్ళగించి వేయవలెను అని పెద తిరుమలాచార్యులు
తెలిపిరనుకోవచ్చును.
అన్వయార్ధము: మానవులారా వివేకించి బ్రతుకు మార్గమును కనుగొనుడీ.
ముఖ్య
పదములకు అర్ధములు: ఆసరి = ఆసరా కల్పించు అను అర్ధములో వాడిరి; నారదాదులైరి =
భక్తపరాయణులైరి; వాసి = గొప్పతనము, ఉత్కృష్టము; వడి = త్వరగా.
భావము: చేసిన
పుణ్యమువల్ల ఉట్టిపడు దేవత్వమును, పాపములకు ఆసరా కల్పించు
అసురత్వమును, తగిన దాసరితనమువల్ల కలుగు భక్తపరాయణత్వమును మనసున నిల్పి గొప్పతనమున యేది ఎక్కుడో
వడి నెంచుకొనుడీ.
వివరణము: ఇక్కడ ‘ఎమ్మెలఁ బుణ్యాలు సేసి యిల నేలవచ్చుఁ గాక / కమ్మి హరి దాసుఁడు గావచ్చునా’ అన్న అన్నమార్యుని మాటలు గుర్తుచేసుకోవడము ఎంతైనా సముచితము. ఇంకా ‘సరిమోక్షము గోరితే స్వర్గము తెరువు గాదు / అరయ స్వర్గము తెరు వల మోక్షానకు’ అన్నవి కూడా మననము చేయవలె. (=ముక్తికి మార్గము స్వర్గం ద్వారా ఐతే కాదు. జాగ్రత్తగా పరిశీలించిన స్వర్గము అనేదీ సామాన్యుని ఆకర్షించుటకు ప్రవేశపెట్టిన ఒక ఎర అని గ్రహించవచ్చు). వీటిని బట్టి పెద తిరుమలాచార్యులు దేవత్వము, అసురత్వము, దాసరితనములలో హరి దాసుఁనకే పెద్దపీట వేసినట్లు తెలియగలము.
పైగా ఈ మూడింటిలో ఏది గొప్పదో నిర్ధారించడానికి మానవుని వద్ద వున్న సాధనమేమి? అసంబద్ధమగు విషయములతో సతమతమగు మనిషికి సరైన మార్గమును గుర్తించడం అసాధ్యము. కావున చేయగలిగినది దాసరితనము మాత్రమే.
'వడి నెంచుకొనుడీ' అనిచెప్పి సమయము కోరుట కూడా ఒక విధముగా కాలాయాపనయే కానీ పరిష్కార మార్గము కాదని సూచించిరి.
ముఖ్య పదములకు అర్ధములు: అనిశము = ఎడతెగనిది, నిరంతరము;
మొనసి = శూరత్వమున, సాహసమున; అనుపమ
= సాటిలేనిది.
భావము: మానవులారా!
ఎదుటి ఈ ప్రపంచము మనము దానిలో ప్రవేశించి కలుగఁజేసికొన్నకొలది
ఏర్పడినదే కాని సహజముగా సిద్ధించినది కాదు. ఎడతెగని తామసత్వమున అధోగతి పాలుకాకండి.
సాత్వికభావమున మోక్షము కలుగవచ్చు. సాటిలేని ఆ మార్గమేదో తెలియుడీ.
వివరణము: ‘ఘనరాజస గుణాన కలుగు నిహలోకము’ = ఎదుటి ఈ ప్రపంచము మనము దానిలో లీనమై కల్పించు కొన్నదియే కాని స్వతస్సిద్ధముగా ఏర్పడినది కాదు అన్నారు పెద తిరుమలాచార్యులు. “మీరు అనుకుంటున్నట్లే యీ ప్రపంచం ఉంటుంది. ఇది మీరు చూసేది కాదు... కానీ ఎలా చూస్తున్నారో.. ఇది మీరు వింటున్నది కాదు... కానీ మీరు ఎలా వినాలనుకుంటారో, మీకు అనిపించేది కాదు.. కానీ మీకు ఎలా అనిపించాలనుకుంటారో.. అలానే ఉంటుంది” అని జలాలుద్దీన్ రూమీ అంటారు.
ఎక్కడా సంబంధమే లేని ఇద్దరు కవులు పెద తిరుమలాచార్యులు & జలాలుద్దీన్ రూమీలు ఒకే విధముగా చెప్పడము ఆశ్చర్యము కలిగించడమే కాదు, ఆలోచింపచేయాలి కూడా. ఒక రకంగా చూస్తే, మాగ్రిట్ గారి "అంతిమ నినాదం" కూడా ఇదే విషయము చెబుతున్నట్లు గ్రహించవచ్చు.
మోక్షము అనునది సూచన ప్రాయముగా ఒక భావ
స్థితిని సూచించునే కాని అది ఎవ్వరో ఇస్తే పుచ్చుకునే డబ్బులాంటి వస్తువు కాదు. అందువలననే
'అనుపమ పదమేదొ అది యెంచుకొనుడి' అని మానవుని
విచక్షణకు వదలివైచిరి తిరుమలాచార్యులు.
ముఖ్య పదములకు అర్ధములు: పరగ = ఒప్పుగా, సరిగ్గా; దేహమూలము = దేహము
అనిపింప చేయునది; ప్రాకృతమయిన = అల్పమైనది, తక్కువది; అరసి = విచారించి
చూచిన; ఈడేర్చు = నెరవేర్చు, సిద్ధింపజేయు; సిరుల = అనేక ప్రాభవముల; సరి = సమముగా (అటు ఇటు తొలకక); బ్రతుకుజాడ = బ్రతుకు
మార్గమును.
భావము: విచారించి
చూచిన ఒప్పుగా దేహము అనిపింప చేయునది అల్పమైనది, తక్కువది
యగు మాయయే. కానీ మానవులకు భక్తిని సిద్ధింపజేయునది ఆ అలమేల్మంగయే. సమముగా అటు ఇటు తొలకక నేర్పున చూచిన అనేక ప్రాభవములను కలుగజేయువాడు
అంతర్యామి శ్రీవేంకటేశ్వరుడు అని గ్రహించి బ్రతుకు మార్గమును ఎంచుకొనుడీ.
వివరణము: ‘ప్రాకృతమయిన మాయ’ = అల్పమైనది, తక్కువది యగు భగవంతుని భౌతికమగు మాయ అని, ‘అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్’ (అర్జునా, ఇంతకు ముందు శ్లోకములో పేర్కొన్నవి
నాయొక్క తక్కువ స్థాయి శక్తులు. కానీ, వానికి అతీతంగా,
నాకు ఒక ఉన్నతమైన శక్తి ఉంది.) భగవద్గీతలోని 7-5వ శ్లోకము
నుండి తెలియవచ్చు.
‘బ్రతుకుజాడ’ = బ్రతుకు మార్గమును ఎంచుకొమ్మని ఇన్ని సార్లు ఎందుకు చెప్పిరో ఆలోచింతము.
తిరుమలాచార్యులు చెప్పిన ‘బ్రతుకుజాడ’ ఇది
యిట్టిదని నిర్ణయించలేని విషయము. భగవద్గీత శ్లోకము (15-4) కూడా
ఆ విషయమును సాధకుని తీర్మానింప వదలివేసినది.
ఈ విధముగా సాధకుని చేతిలో 'సమస్యను' పెట్టి దానికి పరిష్కారము కనుగొనమని సవాలు
విసిరిరనుకోవచ్చును. అందుకని "ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము" అను అన్నమయ్య
కీర్తన వలెనే మనలో అలోచనలను రేపడానికి వ్రాసిన కీర్తన అయ్యుండవచ్చు. కానీ, అటువంటి స్థితి మానవ మేధస్సుకు అందనిదే అని మాత్రము అంచనా వేయవచ్చు.
-x-x-x-