తాళ్ళపాక అన్నమాచార్యులు
266 వలచి పైకొనఁగరాదు వలదని తొలఁగరాదు
For English version press here
ఉపోద్ఘాతము
అప్రమత్తత లేని జీవనము
ఇది అన్నమాచార్యులు వారి ప్రప్రథమ అధ్యాత్మ కీర్తన అయినప్పటికీ దీని ఒరవడి చూస్తూనే, చెప్పా పెట్టకుండా మొదలు పెట్టినట్టు అనిపిస్తుంది. వారికి మానవాళి పట్లగల అవాజ్య ప్రేమ పొంగి పొరలుతుండగా ఆశువుగా , అప్పటికప్పుడు చెప్పినవై ఉండవచ్చు. అన్నమాచార్యులు మానవజాతిని ఉద్దేశించి చేసిన ఈ కీర్తనలు అను వ్యాఖ్యానములు సార్వత్రికము, సార్వజనికము.
మానవుని కార్యములు కాలములను బట్టి మారుచున్ననూ, అనాది నుంచి వాని మూల ప్రవృత్తి మారలేదు. తీక్షణమైన ఏకాగ్రత అవసరమైన చూపులను ప్రక్క దారి పట్టించు అనేకానేక విషయాలపై అప్రయోజనకరమగు ఆసక్తిని ఆయన పదునైన విమర్శలతో ఎదుర్కొన్నారు.
అన్నమాచార్యులు కీర్తనలు దైవానికి పెద్దపీట వేసినా ముఖ్యంగా అవి మానవుల బలహీనతలను నిర్ద్వందంగా బయట పెడతాయి. అందుకోసం ఆచార్యులువారు స్త్రీ అంగాంగ వర్ణనలను చేయుటకు సైతం వెనుకాడలేదు. వారు అతి లాఘవంగా శృంగారపు కోణం నుంచి తాత్విక కోణంలోకి మానవులను మళ్లించుటకు భగీరథుని లాగే ప్రయత్నించారు.
కానీ వారి ప్రయత్నాలను, వారి విప్లవాత్మక ధోరణి, సంప్రదాయబద్ధంగా వస్తున్న విషయములను ప్రక్కకు నెట్టివేయడం ఆనాటి సమాజం అంగీకరించలేదు. అందుకు ఈ కీర్తన ఒక మౌనసాక్షి. దాదాపు సమాజం వెలివేసింది అనుకోవచ్చును.
దాదాపు 400 సంవత్సరాలపాటు అవి మానవాళికి లభ్యం కాలేదు. 1922 వ సంవత్సరంలో అదృష్టవశాత్తూ రాగిరేకులపై వ్రాసిన కీర్తనలు బయటపడ్డాయి. అది మన ఈ తరం చేసుకున్న సౌభాగ్యము. మునమంతా వారి కీర్తనలు విని చదివి ఆనందించి విశ్లేషించి వాటిలోని పరమార్థం గ్రహించి జీవనము సాఫల్యం చేసుకొన వలెను.
కవితాత్మకము, కళాత్మకము, రమణీయము, ప్రయోజనసిద్ధికల
అన్నమాచార్యుల కీర్తనలు ఐదు వందల సంవత్సరాల పూర్వమైనవి ఐప్పటికి, గత వంద సంవత్సరాలలో అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్నా కూడా చరిత్రలో
సుస్థిర స్థానం సంపాదించుకునేందుకు మరింత కృషి అవసరం.
ఈ కీర్తనలో కవిత్వపు విశిష్టతలు:
మొదటి చూపులో ఈ కీర్తన మానవ లోపాలపై కఠినమైన విమర్శలా అనిపించినప్పటికీ, అన్నమాచార్యుడు తన ఆలోచనను అద్వితీయ కవిత్వ చిత్రాలతో అలంకరిస్తారు. “వలచి పైకొనఁగరాదు వలదని తొలఁగరాదు” శీర్షికలో తాళబద్ధమైన సమతుల్యం ఉంది. ఒక సామెతలా అనిపిస్తుంది. జీవితంలోని వ్యతిరేకతలను మన ముందుంచుతుంది.
వారు తరచుగా సాంద్రమైన, పరిచితమైన అంశాలను ఉపమలుగా వాడుతారు. ఉపరితలంలో మానవ ఆకర్షణలు, కోరికలు, శారీరక రూపాలను వర్ణిస్తూ వాటిని తాత్త్విక, ఆధ్యాత్మిక భావాలకు దారితీసే సేతువుగా వాడుతూ, సాధారణం నుండి శాశ్వతానికి శ్రోతను నడిపిస్తారు.
ఈ కీర్తన యొక్క సౌందర్యం శృంగారము నుండి వాస్తవానికి, చిత్రము నుండి సత్యమునకు సులభంగా మారుతూ సమ్మిళిత ధ్వనిలో నుండి పుడుతుంది. పదాలు సరళమైనా, భావములను పొరలుపొరలుగా అమర్చి, సాధారణ శ్రోతకూ, ఆలోచనాత్మక అన్వేషకులకు తమతమ సొంత అనుభూతిని కనుక్కోవడానికి సరళతరం చేశారు.
అన్నమాచార్యుల మేధస్సు ఈ కీర్తనలో కేవలం చమత్కారమైన ఉపమానాల్లోనే కాదు, సాధారణాన్ని శాశ్వతంతో, మృదుత్వాన్ని కఠినతతో కలిపిన విధానంలో ఉంది. ఆరంభంలో సరదాగా అనిపించే వర్ణన, చివరికి మానవుల మూర్ఖత్వంపై గుండెల్లో సూటిగా గుచ్చుకునే సత్యాన్ని వెలికితీస్తుంది. ఈ సున్నితమైన సమతుల్యం — లయ, ఉపమానం, మరుగైన విరోధాభాసము — ఈ కీర్తనకు చిరస్థాయి సౌందర్య శక్తిని కొనితెస్తాయి.
అన్నమాచార్యులు అద్భుతమైన ఉపమనములతో మనసును పరుగులెత్తిస్తారు. ఆ సామ్యము ప్రత్యక్ష ప్రమాణమే కాక, మనసుకు హత్తుకునేలా వుంటుంది. మచ్చుకు కొన్ని ఇక్కడ చూపుతున్నాను.
“అంగడి కెత్తినట్టి దివ్వెలంగన ముఖాంబుజములు” అర్ధం: రద్దీగా ఉన్న మార్కెట్లో దీపాల్లా ప్రకాశించే అంగన ముఖాలు. సౌందర్యం:
పరాయి అంగనల ప్రస్తావన క్రొత్త కాకున్నా,
బజారు దీపాలతో పోల్చడం కీలకం. ఖర్చుపెట్టి అందుకోగలమనే భావన ప్రత్యక్షం.
ఇది మానవుల అప్రత్యక్ష బుద్ధికి సాక్ష్యం. కానీ సంతలలోని దీపాల మెరుపు తాత్కాలికమనే
హెచ్చరిక కూడా దాగి వుంది.
“తెలివిపడని లేఁతనవ్వులు” అర్ధం: తెలివి దానంతట అది మన చేతుల్లో పడదు. కానీ మన మనస్సులో ఎక్కడో వున్న ఆశ ఎప్పటికైనా జ్ఞానం వస్తుందని. కానీ కవి ఉద్దేశం తీవ్రం: నువ్విప్పుడు వున్నట్లుగా వుంటే ఈ అసంపూర్ణత ఎప్పుడూ నిజంగా పూర్ణంగా ఫలించదు.
సౌందర్యం: ఇది కవిత్వంలో నిజమైన గొప్ప ఎత్తుగడ. నవ్వులు బాల్యమయినవి, నిర్దోషమైనవిగా కనిపిస్తాయి, విశ్వాసాన్ని, సానుభూతిని ఆకర్షిస్తాయి. మానవుడు కూడా ఒక రోజు జ్ఞానాన్ని పొందుతాననె ఆత్మవంచనలో జీవిస్తాడు. అన్నమాచార్యుల మహత్తు ఏమిటంటే, ఈ కఠిన సత్యాన్ని మృదువైన పదాల వెనుక దాచి మురిపించడం.
అధ్యాత్మ కీర్తన
|
రేకు: 1-1 సంపుటము: 1-1
|
వలచి పైకొనఁగరాదు వలదని తొలఁగరాదు కలికి మరుఁడు సేసినాజ్ఞ కడవఁగ రాదురా ॥వలచి॥ అంగడి కెత్తినట్టి దివ్వె లంగన ముఖాంబుజములు ముంగిటి పసిఁడి కుంభములును ముద్దుల కుచయుగంబులు యెంగిలి సేసినట్టి తేనె లితవులైన మెఱుఁగుమోవులు లింగములేని దేహరములు లెక్కలేని ప్రియములు ॥వలచి॥ కంచములోని వేఁడికూరలు గరువంబులుఁ బొలయలుకలు యెంచఁగ నెండలో నీడలు యెడనెడ కూటములు తెంచఁగరాని వలెతాళ్ళు తెలివిపడని లేఁతనవ్వులు మంచితనములోని నొప్పులు మాటలలోని మాటలు ॥వలచి॥ నిప్పులమీఁద జల్లిన నూనెలు నిగిడి తనివిలేని యాసలు దప్పికి నేయి దాగినట్లు తమకములోని తాలిమి చెప్పఁగరాని మేలు గనుట శ్రీవేంకటపతిఁ గనుటలు అప్పని కరుణ గలిగి మనుట అబ్బురమైన సుఖములు ॥వలచి॥
|
Details
and Explanations:
Telugu
Phrase
|
Meaning
|
వలచి పైకొనఁగరాదు
వలదని తొలఁగరాదు
|
కోరికలను
మనమే ఉద్దేశపూర్వకంగా ఆహ్వానించను లేము; అట్లని పూర్తిగా తోసివేయలేము కూడా.
|
కలికి
మరుఁడు సేసినాజ్ఞ కడవఁగ రాదురా
|
మన్మథుని
ఆకర్షణీయమైన ఆజ్ఞను అధిగమించడం అసాధ్యం.
|
సూటి భావము:
కోరికలను
పైన వేసుకొనరాదు; అలాగే వాటిని పూర్తిగా త్యజించరాదు.
ప్రేమ, ఆకర్షణల గురుతైన మన్మథుని శాసనమును సులభంగా విస్మరించలేం.
గూఢార్థవివరణము:
ఇక్కడ అన్నమాచార్యులు మానవ జీవితంలోని ప్రధాన సంఘర్షణను తాకుతున్నారు — భోగం మరియు త్యాగాల మధ్య ఉద్రిక్తత. ఇవి మనసును రెండు వైపుల నుండి లాగుతాయి. కోరిక సహజం, ఆహ్వానం లేకుండానే ఉద్భవిస్తుంది. కానీ దాన్ని బలవంతంగా అణచివేయడం కూడా అసాధ్యం. ఇది వ్యక్తిగత బలహీనత మాత్రమే కాదు, ఒక విశ్వనియమం అని కవి సూచిస్తున్నారు.
ఆయన కోరికలను
పొగడరు, కఠిన త్యాగాన్నీ బోధించరు. కానీ మనసులో వుత్పన్నమయ్యే
పరస్పర విరోధ భావాన్ని బయటపెడతారు — భోగం, నిరాకరణ రెండూ బంధించే
శక్తులు. విముక్తి మాత్రం మన ప్రయత్నంతో కాదు; దేవకృపతోనే. అదే
తరువాతి చరణాలలో ఆయన చెప్పబోతున్నారు.
చిత్రసామ్యం:
La Savoir (Knowledge) by Rene Magritte
ఈ చిత్రంలో విస్తారమైన నిర్జన భూభాగం పగలు అనిపించే వెలుగులో కనబడుతూ వుంటుంది. దాని మధ్యలో ఒక తలుపు. ఆ తలుపు తెరిస్తే — లోపల రాత్రి!
ఈ చిత్రం
మొత్తాన్ని మనస్సు యొక్క క్రియలుగా తీసుకొనవలెను. వెలుతురును ఆకర్షణగా తీసుకుంటే, చీకటి దాన్ని త్యజించడం లాంటిది. తలుపు
తెరవడం అంటే మనస్సులోకి తొంగిచూడటం. అక్కడ ఏమి కనిపిస్తుంది? రెండు విరుద్ధములు ఒకేసారి — భోగం, త్యాగం. ఇవి వేరువేరు
వాస్తవాలు కావు; ఒకే నాణెం యొక్క రెండు ముఖాలు. అందుకే అన్నమాచార్యుల
హెచ్చరిక: నిజమైన క్రియ మనసు ఊహించే పరిధిలో ఉండదు.
కలికి
మరుఁడు సేసినాజ్ఞ కడవఁగ రాదురా:
పై బొమ్మలో (Rene Magritte: The Gradation of Fire) ఒక చెక్కబల్ల మీద ఒక తాళంచెవి (జిజ్ఞాస), ఒక కాగితం (జ్ఞానం), ఒక గుడ్డు (ఆహారం) మూడు కూడా మండుతూ ఉన్నట్టుగా చూపాడు. ఇవి జీవనంలోని మూడు ప్రధాన భోగములకు ఆహారం, జ్ఞానం, జిజ్ఞాసలకు ప్రతీకలు. అవిపెట్టు చిచ్చును మానవుడు తట్టుకోలేడు. మాగ్రిట్ కూడా ఆ అగ్నిని ఆర్పడం అసాధ్యమని మాత్రమే చూపిస్తాడు.
దేహంలోని అగ్ని — ఆకలి, వాంఛ, జిజ్ఞాస, తెలుసుకోవాలనే తపనలను— అణచివేయలేము. కాబట్టి మానవుని విధి "వాటిని ఎలా ఆర్పాలో తెలియడం కాదు" వాని నైజమును సమూలముగ గమనించవలెను. “ఈ అగ్నిని ఆర్పలేము” అని అన్నమాచార్యులు చెప్పడం నిరాశావాదం కాదు. అది అప మార్గాలపట్ల హెచ్చరిక. దేహప్రేరణలను అణచివేసి గాని, కేవలం మేధా ప్రయత్నాలతో గాని దేవుడిని పొందలేము.
అయన హెచ్చరికను
కఠినతరం చేస్తూ ఇలా అంటారు: “ప్రయత్నంతో లభించిన ఫలితాన్ని దేవుని సాన్నిధ్యమని అనుకోరాదు.
దైవం ఒక వస్తువులా లోపల నుండి గానీ బయట నుంచి గానీ అందుకోదగినది కాదు. ప్రయత్నం
ద్వారా సాధించిన విషయాలను దైవముతో తాఱుమాఱుచేసి భ్రమ పడరాదు.”
కలికి మరుఁడు సేసినాజ్ఞ:
“మన్మథుని ఆజ్ఞ” అంటే కేవలం రతి, కోరిక, భోగాల గురించే కాదు — అది ప్రకృతి శాసనం. జీవులు అన్నీ దానికి లోబడుతాయి. జంతువులకు ఇది పూర్తిగా సహజ నియమం; అవి ప్రశ్నించలేవు, ఎదిరించలేవు. కానీ మానవునికి ఒక ప్రత్యేక వరం ఉంది — బుద్ధి, విచక్షణ. అతనికి కోరికలను అణచే శక్తి ఉండకపోవచ్చు, కానీ వాటిని నిరుపేక్షంగా గమనించే శక్తి ఉంది.
అన్నమాచార్యులు
ఇక్కడ సూచిస్తున్నది అదే. కోరికను తోసేయమని కాదు, దానిలో
మునిగిపోమని కాదు — కానీ దాని స్వరూపాన్ని తటస్థంగా చూడమని సూచన. ఈ ‘seeing OR చూచుట’ క్రియయే మానవుడి వైశిష్ట్యం. అది వేరే దారిని తెరుస్తుంది — భోగం, త్యాగం అనే ద్వంద్వాలకు అతీతమైన దిశను.
అన్నమాచార్యులు
తన మొట్టమొదటి తాత్త్విక కీర్తనలోనే జీవనంలోని పరస్పర విరోధాలను మన ముందుంచారు. మానవుడు
వీటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలనుకుంటాడు; కానీ రెండూ త్యజించ దగ్గవే. ఆ విరోధాభాసాలు
మనసుని తొందరపెడుతుంటే, వాటి మధ్య తటస్థంగా నిలబడలేడు. మనసు ఒక
దిశకు లాగుతుంటే, మరొక దిశ కనిపించదు. మనసులోనికి వెళ్లి మౌనాన్ని
అనుభవించలేకపోతే ఈ విరోధాభాసం అసలు గ్రహించబడదు. సరియైన క్రియ అసాధ్యమని మనిషి అనుభవపూర్వకంగా
ఎదుర్కొన్నప్పుడు, ఆ సంఘర్షణలోనే అంతరంగ మార్పు సంభవిస్తుంది.
అదే ధ్యానం — అంటే నిజమైన “చూడటం”. ఇప్పుడు అన్నమాచార్యులు ఏమన్నారో చూడండి: చూచే చూపొకటి
సూటిగుఱి యొకటి / తాచి రెండు నొకటైతే దైవమే సుండీ ॥పల్లవి॥ (భావము: సూటిగా చూచే చూపొకటియే దైవత్వమునకు దారి.)
జిడ్డు కృష్ణమూర్తిగారు తరచూ గొప్ప తెలివితేటలతో సహజీవనం చేయండి అని ఉద్బోధించేవారు. పై వివరణను చూస్తే అయస్కాంత క్షేత్రంలో ఉన్న ఇనుప సూదివలే మానవునిమనస్సు ఆటూ ఇటూ పరిగెత్తును. ఆ క్షేత్రములో నిలబడి అటు ఇటు పారాడకుండా తటస్థంగా ఉండి చూచుటయే నిజమైన తెలివితేటలు.
మొదటి చరణం:
తెలుగు పదబంధం
|
భావము
|
అంగడి కెత్తినట్టి దివ్వె లంగన ముఖాంబుజములు
|
(పర)స్త్రీ ముఖాల కాంతులు అంగడిలో పెట్టిన దీపాలలాగ మెరుస్తూ తమ
వైపు లాగుతాయి
|
ముంగిటి పసిఁడి కుంభములును ముద్దుల కుచయుగంబులు
|
స్తన యుగములు బంగారు కుండలుగా అనిపించి బహిరంగ ఆహ్వానము లాగ కనిపిస్తాయి
|
యెంగిలి సేసినట్టి తేనె లితవులైన మెఱుఁగుమోవులు
|
ఆమె అధరముల మాధుర్యము తేనెను మురిపించునట్టై ఎంగిలి చెయవలె ననిపించును
|
లింగములేని దేహరములు లెక్కలేని ప్రియములు
|
తమకు తాముగా నిలబడలేని వారికి ఈ శరీరములు ఎల్లప్పుడూ ఆకర్షణీయంగా
ఉండి, లెక్కలేని ప్రియములకు మూలమౌను.
|
భావము:
మనమంతా
అయస్కాంత క్షేత్రంలో ఉన్న ఇనుప సూదిని పోలు మాయాలో కప్పబడివున్నాము. మానవునికి కనబడిన ప్రతీ పరాయి స్త్రీ కూడా ఇలా అనిపించును.
“(పర)స్త్రీల ముఖ కాంతులు అంగడిలో పెట్టిన దీపాలలాగ మెరుస్తూ
తమ వైపు లాగుతాయి”;
“వారి స్తన
యుగములు బంగారు కుండలుగా అనిపించి బహిరంగ ఆహ్వానము లాగ కనిపిస్తాయి”’
“ఆమె అధరముల మాధుర్యము తేనెను మురిపించునట్టై ఎంగిలి చెయవలె
ననిపించును”
తమకు
తాముగా నిలబడలేని వారికి ఈ శరీరములు ఎల్లప్పుడూ ఆకర్షణీయంగా ఉండి,
లెక్కలేని ప్రియములకు మూలమౌను.
గూఢార్థవివరణము:
అన్నమాచార్యులవారు మానవులంతా ఒక విధమైన ఆ ఆకర్షణ వలయమున చిక్కుకుని అదే లోకం అని భావిస్తారు. ఆలోకమును దాటుకుని ఉన్నదానిని చూచుటకు ఆ తనను ఆకర్షించు దాని నైజంను తెలియవలెను. కనీసం దాని దిశనైనా కనుగొనవలెను. ఆ అవరోధము అధిగమించు శక్తి జీవులకు లేకపోయినా మానవులు తమకు దైవమిచ్చిన సహజ జ్ఞానమును వుపయోగించి బయట పడగలరని భావము.
భగవద్గీతలోని ఉదాహరణ:
నాకు జ్ఞానము ఇవ్వలేదు: ఈ శ్లోకం యొక్క అర్థము అతి జాగ్రత్తగా పరిశీలించవలెను. భగవద్గీతలో గల శ్లోకములు దేశ కాల పరిస్థితులు అధిగమించి అందరికీ వర్తించునట్లే, ఇక్కడ మానవుడు పలానా వ్యక్తికి ఇచ్చినంత జ్ఞానము నాకు ఇవ్వలేదు అను సందేహమును వదిలిపెట్టి భగవత్ చింతనతో సమస్త జ్ఞానమును సాధించగలరని భగవద్గీతలోని 2-46లో చెప్పబడినది.
లింగములేని
దేహరములు అని చెప్పి తమంతట తాము ఆలోచించగలిగిన శక్తి మానవులు మానవులలో అరుదుగా కనపడుతుంది
అన్న విషయం కూడా ప్రస్తావించారు. అనగా జనాభాలో ఎక్కువ శాతం ఆ ఆకర్షణలో కొట్టుకుపోతారు
అని అర్థం వచ్చేట్టుగా చెప్పారు. లింగములేని దేహరములు చూచుటకు కొంత ఎబ్బెట్టుగా ఉన్నా
ఇంకొంచం ఆలోచిస్తే అంతకంటే బాగా అతక గలిగిన పదం మనకు కానరాదు.
రెండవ చరణం:
Telugu
Phrase
|
Meaning
|
కంచములోని
వేఁడికూరలు గరువంబులుఁ బొలయలుకలు
|
ప్రణయంలోని
చిరుకోపాలు గర్వములు వేడి వేడి కూరల వంటివి. వెంటనే తినాలనిపిస్తుంది. నోట్లో పెట్టుకుంటే
కాలుతుంది.
|
యెంచఁగ
నెండలో నీడలు యెడనెడ కూటములు
|
ఇంకో రకంగా చూస్తే అప్పుడప్పుడు ప్రణయ కూటములు ఒకవైపు చల్లని సేదనిస్తూనే
ఇంకో వైపు మండుటెండలాగా మండిస్తాయి
|
తెంచఁగరాని
వలెతాళ్ళు తెలివిపడని లేఁతనవ్వులు
|
ఈ వలపు
బంధములు తెంపలేని తాళ్లు. తెలివికి నోచుకోని
మర్మాలు లేఁతనవ్వులుగా కనబడతాయి.
|
మంచితనములోని
నొప్పులు మాటలలోని మాటలు
|
మంచి మాట చెబితే గుండెల్లో గుచ్చుకుంటే అది మాటల్లోమాటగానే
కానీ నిజముగా గ్రుచ్చి బాధించుటకుగాదు
|
సూటి భావము:
వేడి కూర
నోట్లో పెట్టుకుంటే ఎలా కాలుతుందో ప్రణయ కూటములు ఒక వైపు ఆనందాన్నిస్తూనే రెండో వైపు
మండుటెండ లాగా కాలుస్తాయి ఈ వలపు బంధములు లేతనవ్వుల్లాగ ఏనాటికైనా తెలివివచ్చును అని
అనిపింపఁ చేస్తాయి (వాస్తవానికి రావు). నా మాటలు మీ గుండెల్లో గుచ్చుకుంటే అది మాటల్లో
మాటగానే తీసుకోండి అవి గ్రుచ్చి బాధించుటకు కాదు.
గూఢార్థవివరణము:
తెలివిపడని లేఁతనవ్వులు: “ఇప్పుడే కదా మొదలు పెట్టాడు. నేర్చుకుంటాడు. ప్రౌడత్వం వస్తుంది” అని మనమంతా ఒక మెట్లదారిని ఊహించుకుంటాం. అయితే ఇక్కడ అన్నమాచార్యులు అంటున్నది ఉంటే తెలివి ఉంటుంది. లేకుంటే అజ్ఞానము. మధ్యస్థ దశకు అవకాశమే లేదు అన్న విషయాన్ని చెబుతున్నారు. క్రమక్రమముగా చేరుకోవడం అనేది మేధోపరంగా వచ్చి చేరిన ఒక సర్దుబాటు వ్యవస్థ.
మంచితనములోని నొప్పులు మాటలలోని మాటలు: అన్నమాచార్యుల కీర్తనల్లో ఈమాట మొట్టమొదటిసారిగా
చూస్తున్నాను. కీర్తనలు వ్రాసే ముందుగా తన కీర్తనలు
వాస్తవాన్ని బయట పెట్టడానికే కానీ ఎవరినీ బాధించడానికి కాదు అన్న విషయ చెప్పి
ఉంటారు.
మూడవ చరణం:
Telugu
Phrase
|
Meaning
|
నిప్పులమీఁద
జల్లిన నూనెలు నిగిడి తనివిలేని యాసలు
|
నిప్పుల
మీద నూనె చల్లితే అది పైకి ఎగసి ఇంకా పెద్దదవుతుంది.
అలాగే ఎంతకీ తీరని ఆశలు మనలో ఇంకా ఇంకా కొత్త ఆశలను నింపుతాయి.
|
దప్పికి
నేయి దాగినట్లు తమకములోని తాలిమి
|
దప్పికైతే
నీరు తాగాలి కానీ నెయ్యి తాగితే తీరుతుందా? అలాగే తమకమును భరించి వుందామన్న ప్రయత్నం నెయ్యి తాగడం లాంటిదే.
|
చెప్పఁగరాని
మేలు గనుట శ్రీవేంకటపతిఁ గనుటలు
|
అది ఏమిటో
చెప్పలేని మేలు తెలియుట ఆ వెంకటపతి దర్శనము
|
అప్పని
కరుణ గలిగి మనుట అబ్బురమైన సుఖములు
|
వెంకటపతి
కరుణ నీడలో జీవించుట అత్యద్భుతమైన సుఖం.
|
సూటి భావము:
మానవులు
ఆశలలో తగులుకొన్నంత కాలము అవి మరిన్ని ఆశలకు దారితీస్తాయే తప్ప తరగవు అది ఎలాగంటే నిప్పుల
మీద నూనె చల్లినట్లు. దప్పికైతే నీరు తాగాలి కానీ నెయ్యి తాగితే తీరుతుందా? అలాగే తమకమును భరించి వుందామన్న ప్రయత్నం నెయ్యి తాగడం లాంటిదే. అయ్యలారా!
శ్రీ వెంకటపతి దర్శనము లభించినదని చెప్పలేము. అది ఏమిటో చెప్పలేని మేలు తెలియుటయే మానవ
శరీరముతో సాధ్యము. కానీ ఆ వెంకటపతి కరుణ నీడలో జీవించుట అత్యద్భుతమైన నిజ సుఖం.
గూఢార్థవివరణము:
నిప్పులమీఁద
జల్లిన నూనెలు: అన్నమాచార్యులు మానవ మనసు లోతులను అద్భుతమైన
రూపకాలతో బయట పెడతారు. ఆశలు తీరవు; వాటిని తీర్చాలనుకునే ప్రతి
ప్రయత్నం మరొక ఆశను పుట్టిస్తుంది. ఇదే “నిప్పులమీఁద జల్లిన నూనె” — మానవ మనసు శాశ్వతంగా
మండుతూ వుండే స్థితి. తమకమునకు తాలిమి అనేది పరిష్కారం కాదు. దప్పికకు నీరు కావాలి
కానీ నెయ్యి తాగితే అది దప్పిక తీర్చదు, హాని చేస్తుంది. అలాగే
మనసులోని శూన్యతను గర్వం, అహంకారం తీర్చలేవు.
చెప్పఁగరాని మేలు గనుట శ్రీవేంకటపతిఁ గనుటలు: ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే జీవం ఉన్న ఏ ప్రాణీ కూడా దైవమును చూడలేదు. అన్నమాచార్యులు కూడా దర్శించలేదు. ఇంతకుముందు అనేకసార్లు చెప్పినట్టుగా, ఆ దైవ కృపతో భక్తుడే అలమేలు మంగగా మారి భగవంతుని ఆదేశానుసారం నడచుకొనును. తర్వాతి పంక్తిలో చెప్పిన “అప్పని కరుణ గలిగి మనుట అబ్బురమైన సుఖములు” (ఆ మహాత్ముని కనుసన్నలలో మెలుగుటయే మానవ జీవితమునకు మహోన్నత పదవి) ఇదే విషయాన్ని బలపరుస్తోంది.
ఈ కీర్తన ముఖ్య సందేశం
అన్నమాచార్యుల ప్రప్రథమ ఆధ్యాత్మిక కీర్తన మానవులను వేధించు విరుద్ధములగు వానిపై లోతైన వివరణను మనకు అందిస్తుంది. మానవ జీవితమును సాఫల్యం చేసుకొనుటకు తమకై తాము నిలబడు శక్తి అత్యవసరం. దైవదర్శనం మానవులకు దొరకకపోవచ్చును. కానీ వారు దైవజ్ఞను గ్రహించి ఆ రకముగా తమ జీవితమును సాఫల్యం చేసుకోవచ్చును.
X-X-The
END-X-X
కోరికలను ఆహ్వానించటం, వాటిని అణచివేయటం రెండూ కూడా బంధించే శక్తులేయని, వాటి నుంచి విముక్తి పొందటం మాత్రం దైవానుగ్రహం ఉంటేనే సాధ్యమని ఆచార్యులవారు పల్లవిలో అంటున్నారు. రినే మాగ్రిట్టే చిత్రంలో ఈ భావాన్ని చక్కగా వివరించారు. ఈ రెండిటినీ అనుభవపూర్వకంగా ఎదుర్కొన్నప్పుడు కలిగే సంఘర్షణలోనే మన అంతరంగంలో మార్పు సంభవిస్తుందని అంటున్నారు అన్నమయ్య.
ReplyDeleteస్త్రీసౌందర్యానికి ఆకర్షించబడి దానికి కట్టుబడి అదే లోకంలో విహరించే మానవులు దాని పరిధిని దాటి ఆ శక్తిని అధిగమించటం దైవగతమైన సహజజ్ఞానము వల్లనే సాధ్యమగును.
కోరికలు అనంతం, నిరంతరంగా ఉండునవీయే. దైవానుగ్రహముతో బలీయమైన వాటి బంధకశక్తుల నుంచి బయటపడటం సాధ్యమని, అన్యధా అది అసాధ్యమని అన్నమయ్య ఈ ఆధ్యాత్మిక కీర్తనలో తెలియజేస్తున్నారు.
ఓమ్ తత్ సత్ 🙏🏻
కృష్ణమోహన్