తాళ్ళపాక అన్నమాచార్యులు
270 ఐనదయ్యీఁ గానిదెల్లా నటు గాకుండితే మానీ
For English version press here
ఉపోద్ఘాతము
అధ్యాత్మ కీర్తన
|
రేకు: 202-3 సంపుటము: 3-9
|
ఐనదయ్యీఁ
గానిదెల్లా నటు గాకుండితే మానీ
మానుపరాదివి
హరి మాయామహిమలు ॥పల్లవి॥ పుట్టేటివెన్ని
లేవు పోయేటివెన్ని లేవు
వెట్టి
దేహాలు మోచిన వెడజీవులు
గట్టిగాఁ
దెలుసుకొంటే కలలోనివంటి దింతే
పట్టి
ఇందుకుఁగా నేల బడలేమో నేము ॥ఐన॥ కడచినవెన్ని
లేవు కాచుకున్నవెన్ని లేవు
సుడిగొన్న
తనలోని సుఖదుఃఖాలు
యెడపుల
నివి రెండు యెండనీడవంటి వింతే
కడనుండి
నేమేల కరఁగేమో నేము ॥ఐన॥ కోరినవియెన్ని
లేవు కోరఁగలవెన్ని లేవు
తీరని
సంపదలతో తెందేపలు
ధారుణి
శ్రీవేంకటేశు దాసులమై యిన్నియును
చేరి
కైకొంటిమి యేమి సేసేమో నేము ॥ఐన॥
|
Details
and Explanations:
పల్లవి
పదబంధం
|
అర్ధం
|
ఐనదయ్యీఁ
గానిదెల్లా నటు గాకుండితే మానీ
|
ఐనదవుతుంది. కానిదాని చింతేలా? అటుగాకూడదంటే మారుతుందా
|
మానుపరాదివి హరి మాయామహిమలు
|
హరి మాయామహిమలను మార్చలేము.
|
సూటి భావము:
ఈ
ప్రపంచము తాను పోయినట్లు పోవును. కొన్ని మనమనుకున్నట్లు. కొన్ని అలాకాక. ఎంత ప్రయత్నముతోను
అది మార్చుటకు సాధ్యము కాదు. ఇవియే హరి మాయామహిమలు.
వ్యాఖ్యాత్మక
విశ్లేషణ:
ఈ పల్లవి మొత్తం “శాంత రసం”లో చెప్పబడింది. ఇక్కడ కవీ అసహాయతను కాదు — అవగాహనతో ఒప్పుకోమంటున్నారు. “జరిగినది జరగనివ్వు, జరగనిది విడిచిపెట్టు” అన్న తాత్పర్యం కనబడుతున్నా అది వదిలివేయడం కాదు, విడిచి చూడగల స్థితి. “నేను ఏమీ చేయలేను” కాదు — “ఏమీ చేయాల్సిన అవసరం లేదు” అనే జ్ఞానస్ఫూర్తి.
“ఐనదయ్యీ
గానిదెల్లా” అనే పదరచనలోనే ద్వంద్వమున్నది —ఔతుందా లేదా అని ఫలితాలకై ఎదురుచూచే మనస్తత్వం. మనిషి మనసు ఎప్పుడూ రెండింటి మధ్య ఊగిపోతుంది. అన్నమాచార్యులు
ఇక్కడ ఊగని మనసుని సూచిస్తున్నారు. ద్వంద్వాతీత స్థితి — అదే హరిమాయలోని మహిమ.
“హరి మాయామహిమలు” అనే పదం మాయను తప్పుగా కాదు; అది దైవలీలగా, సృష్టి–విలయాల అందమైన సమతుల్యంగా చూడమంటున్నారు.
మాయ బయటలేదు— మనలోనే ఆత్మ వంచనలో మునిగిపోయిన స్థితిని చూపిస్తుంది. ఇది అవగాహనకు దారి
చూపించే మాయ — మహిమ. ఇలాంటి స్థితిలో భక్తుని మనసు ఫలితానికి తపించదు, వైఫల్యంపై వ్యథపడదు. ఆలోచనలకు దిశ చెప్పే స్వార్థం ఉండదు. అలాంటి మనసే “హరిమాయా
మహిమలు”ని అనుభవిస్తుంది.ఇలాంటి స్థితిలో భక్తుని మనసు ఫలితానికి తపించదు, విఫలంపై వ్యథపడదు, ఆలోచనకు దిశ చెప్పే స్వార్థం
ఉండదు. అలాంటి మనసే “హరిమాయా మహిమలను” తెలియును.
మనిషి స్వేచ్ఛా సంకల్పంతో చేసే ప్రతి చర్య ప్రకృతి (దైవ) క్రమంలో జోక్యమే. ప్రపంచం అసహనంగా, విభజితంగా కనిపించడం — ఆ జోక్యానికి ప్రతిఫలం. మన స్వార్థప్రేరణతోనే మనం గందరగోళాన్ని సృష్టిస్తాం — దానినే “పురోగతి” అంటాం.
కానీ
అన్నమాచార్యుడు చెబుతున్నది — ఈ క్షీణిస్తున్నట్లు కనబడు జగత్తును సరిచేయుటలో మానవుని
ప్రమేయం వుండదు. అది తన మార్గంలో నడుస్తూనే వుంటుంది. మనకు ప్రపంచంతో సంబంధం
మాత్రం ఒక రహస్య సమీకరణలో కూరుకుపోయింది — అన్నింటికీ మించి స్వీయప్రాధాన్యతను ముందు
నిల్పి చూస్తాము. అదే విభజన, భయం, విచ్ఛిన్నతలకు
మూలం.
రెనె మాగ్రిట్ యొక్క “The Listening Room” చిత్రం ఒక పెద్ద ఆపిల్ మొత్తం గదిని నింపేసినట్టు, మన “ఆత్మాభిమానం” మన అంతరంగాన్ని నింపేస్తుంది. అందులో ఇంకేదానికి స్థానం లేదు. ఇదే హరిమాయా మహిమ — మానవ జాతి ఎదుర్కొంటున్న భ్రాంతి.
పదబంధం
|
భావము
|
పుట్టేటివెన్ని
లేవు పోయేటివెన్ని లేవు
|
ఈ జగములో పుట్టేటి జీవులెన్ని లేవు? మరణించేవెన్ని లేవు?
|
వెట్టి
దేహాలు మోచిన వెడజీవులు
|
అనవసరముగా ఈ దేహమును కాపాడి బ్రతుకుదామని చూచే అల్పజీవులు
|
గట్టిగాఁ
దెలుసుకొంటే కలలోనివంటి దింతే
|
తీక్షణంగా చూచితే కలలోనివంటివి జీవన్మరణములు
|
పట్టి
ఇందుకుఁగా నేల బడలేమో నేము
|
అటువంటి దానికోసం ఇంత కష్టపడవలెనా? ఇన్ని బాధలు అనుభవించవలెనా?
|
భావము:
ఈ
జగములో సహజముగా జీవులు పుడుతూ మరణిస్తూ ఉంటాయి. అల్పజీవులుఈ దేహమును కాపాడుకుని ఈ చక్రమునుంచి
బయట పడదామనుకుంటాయి. తీక్షణంగా చూచితే కలలోనివంటివే జీవన్మరణములు. విలువలేని వాటి కోసం
ఇంత కష్టపడవలెనా? ఇన్ని బాధలు అనుభవించవలెనా?
(లేదు. మోక్షము అంత కంటే సులభమని అన్నమాచార్యుల అభిమతము)
గూఢార్థవివరణము:
గట్టిగాఁ
దెలుసుకొంటే కలలోనివంటి దింతే
జాగ్రత్తగా
చూస్తే అన్నమాచార్యులు ఇక్కడ ఏ మూఢ విశ్వాసాన్ని
ప్రతిపాదించడం లేదు. ఇంతకు ముందు చెప్పుకున్న కీర్తనలో “గట్టిగా తెలుసుకుంటే కన్నదే కంటి కురుమ / దట్టమైన సుజ్ఞానము తనలోనే ఉన్నది” అన్నదానిని పునరుద్ఘాటించారు
( అందులోను ఇదే భావం వెలిబుచ్చారు.
తిరస్కరించలేని స్పష్టతతో, దృఢమైన మనోబలంతో,
అంతిమ సత్యాన్ని పూర్తిగా తెలుసుకుంటే, మనసులోని
తెరలే చూసే దృశ్యానికి అడ్డు. లోకం వంకరగా లేదు — మన చూపులే వంకర. లోతైన, ఘనమైన నిజమైన జ్ఞానం మనలోనే ముందే నాటివుంది.
ఆ జ్ఞానముతో చూచిన జీవన్మరణముల వ్యత్యాసం వెలుగునీడల వంటిదే.
ఇంతకు ముందు అనేకమార్లు చెప్పుకున్నట్టు ఈ చెప్పిన భాష్యం అంతా మనం ఉన్నటువంటి ఈ స్థితినుంచి చెప్పుకునేందుకు, వినడానికి బాగుంటుంది. అంతే. వాస్తవానికి ఆ స్థితికి చేరుకోవడం మరణమును దాటకుండా సాధ్యం కాదు. మరణము అంటే ఇక్కడ శరీరాంతం కాదు; స్వీయచిత్త విసర్జన. ఆ స్వీయచిత్తము త్యజించక భగవద్గీతలో చెప్పిన విషయములు కానీ, అన్నమాచార్యులు చెప్పినవి కానీ, జీడ్డు కృష్ణమూర్తిగారు చెప్పిన సత్యాన్వేషణ కానీ ఆచరణలో పెట్టలేము.
మరణమును
ఎదుర్కొనగల ధైర్యము అసాధారణము, అపూర్వము. కానీ
ముఖ్యమైన విషయం గమనించవలసినదేమంటే ఎక్కడాకూడా క్రమక్రమముగా సత్యము వైపు ప్రయాణించుట
అన్నది ప్రస్తావించబడలేదు. దైవతత్వమును గ్రహించుట, లేక
గ్రహింపలేకుండుట — మధ్యస్థితి లేదు.
మరణము గురించి
మనకు తెలిసినది చాలా తక్కువ. అన్నమాచార్యుల వారు చెప్పిన "ఆకాశ పాకాశ మరుదైన
కూటంబు" అన్నది మానవునికి అపాదిస్తే , అతడొక అపూర్వమైన అసాధారణమైన విషయముల
కూటమి. కావున మనము మనసులోని శంకలను ప్రక్కనపెట్టి దైవమును ఆశ్రయించవలెను. ప్రతీ మనిషిలోను
దైవము దాగి వున్నడని చెబుతారు. వానిని చేరుటకు మనసు అద్దంలా ప్రతిబింబమును ప్రతిఫలించునట్లు
స్వచ్చము కావలెను. అప్పుడే దైవ సన్నిధిలో మనలో నిద్రాణమై వున్న అలౌకిక తత్త్వములు వెలుగులోకి
వస్తాయి.
పైన
చెప్పుకొన్న విషయములు సులభమేమీ కావు కదా? జీవితంలోను కష్టము. ముక్తిలోనూ కష్టము.
ఏమిటీ మనుష్య జన్మ అనిపిస్తోందా? ఒకటి నిజమైన కష్టము. ఇంకొకటి
ఊహించుకున్న కష్టము. ఇప్పుడు భగవద్గీతలోని
"అకర్తారం సపశ్యతి"ని గుర్తుకు తెచ్చుకోండి. (= .... ఏమీ చేయక వూరకవున్నవాడే ద్రష్ట)
— షున్ర్యూ సుజుకి
పదబంధం
|
భావము
|
కడచినవెన్ని
లేవు కాచుకున్నవెన్ని లేవు
|
ఎన్నో జరిగిపోయాయి ఎదురుచూసినవి ఎన్నో వున్నాయి
|
సుడిగొన్న
తనలోని సుఖదుఃఖాలు
|
తనలో సుడిగుండాల్లాగ తిరుగుతున్న సుఖదుఃఖాలు
|
యెడపుల
నివి రెండు యెండనీడవంటి వింతే
|
కొంత నిష్పక్షంగా చూస్తే ఎండ నీడ వంటివే.
|
కడనుండి
నేమేల కరఁగేమో నేము
|
వీటికోసము ఇప్పటినుంచి బాధపడటమెందుకు?
|
సూటి భావము:
ఈ
జీవితంలో ఎన్నో కష్టసుఖాలు వచ్చాయి. ఎన్నింటి కొరకో ఎదురు చూశాం. ఇవి సుడిగుండాలలాగా జీవితం చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. కొంత నిష్పక్షంగా
చూస్తే ఎండ నీడ వంటివే. వీటి నుంచి తప్పించుకోడానికి ఇప్పటినుంచి ప్రణాలికలువేసి ఏం
ప్రయోజనం? (లేదు).
గూఢార్థవివరణము:
ఈ చరణంలో
అన్నమాచార్యులవారు ప్రజలు తమకు వచ్చిన కష్ట సుఖాలను సమీక్షించి అవి తిరిగి రాకుండా
వేయు ప్రణాళికలను స్పష్టంగా ఆమోదించలేదు వారి ఉద్దేశ్యంలో "మానవులు తమకు నచ్చినా
నచ్చకపోయినా వీటిని అనుభవించి తీరవలెను" అయివుండవచ్చును.
తెలుగు పదబంధం
|
భావము
|
కోరినవియెన్ని
లేవు కోరఁగలవెన్ని లేవు
|
కోరుకున్నవి ఎన్నో వుంటాయి. కోరఁగలవి ఎన్నో వుంటాయి.
|
తీరని సంపదలతో తెందేపలు
|
కుప్పలు తెప్పలుగా తరగని సంపదలతో
|
ధారుణి
శ్రీవేంకటేశు దాసులమై యిన్నియును
|
ఈ భూలోకంలో శ్రీవేంకటేశు దాసులమైన మాకు ఇవన్నియును
|
చేరి కైకొంటిమి యేమి సేసేమో నేము
|
వచ్చి చేరినవి. ఈ సంపదలతో మాకేమి పని? (లేదు).
|
కోరుకున్నవి ఎన్నో వుంటాయి. కోరఁగలవి ఎన్నో వుంటాయి. ఈ భూలోకంలో శ్రీవేంకటేశు దాసులమైన మాకు ఇవన్నియును కుప్పలు తెప్పలుగా తరగని సంపదలు వచ్చి చేరినవి. ఈ సంపదలతో మాకేమి పని? (లేదు).
గూఢార్థవివరణము:
మనము కోరుకునే సంపదలకు ఏదైనా
ప్రయోజనము వుంటే భూమి మీదనే. మరణించిన వారొక్క
రూపాయి తమతో తీసుకెళ్ళగలిగారా? లేదే? శ్రీవేంకటేశు
దాసులైనవారు మరణమును దాటిన స్థితిని చేరుకున్నవారు. వారికి ఈ సంపదలతో పని ఏమి?
(లేదు).
ఈ కీర్తన
ముఖ్య సందేశం
X-X-The
END-X-X
No comments:
Post a Comment