తాళ్ళపాక పెదతిరుమలాచార్యులు
269 పనిగొన నేర్చువారి భాగ్యముకొలఁది యిది
For English version press here
ఉపోద్ఘాతము
అధ్యాత్మ కీర్తన
|
రేకు: 49-2 సంపుటము: 15-276
|
పనిగొన
నేర్చువారి భాగ్యముకొలఁది యిది
తనకు
నెదిరికి నీ దైవమే గుఱి ॥పల్లవి॥ దిట్టుదిట్టేయందులకు
దీవించేయందులకు
నట్టనడుమను
వొక్కనాలికే గుఱి
అట్టే
సంతోషమునకు నలిగివున్నందులకు
మట్టు
మీఱియున్న తన మనసే గుఱి ॥పని॥ పాపకర్మమునకు
బలుపుణ్యమునకును
దీపంచ
రెంటికి నొక్క దేహమే గుఱి
వోపి
కొండెము వినఁగ నొగి ధర్మము వినఁగ
యేపునఁ
దమ వీనులు యివియే గుఱి ॥పని॥ పూవుల
వాసనలకు పొంచి దుర్గంధములకు
చేవమీఱ
నొక్కట నాసికమే గుఱి
శ్రీవేంకటేశు
సేవించ జీవులను దర్శించ
కైవసమైయున్నతమ
కన్నులే గుఱి ॥పని॥
|
Details
and Explanations:
పదబంధం
|
అర్ధం
|
పనిగొన నేర్చువారి భాగ్యముకొలఁది యిది
|
కర్మయోగా సారమును గ్రహించి, కర్తృత్వభావమును విడిచిన వారి నిజమైన భాగ్యము ఇది.
|
తనకు నెదిరికి నీ దైవమే గుఱి
|
తనకు తన ముందున్నవానికి
భగవంతుడే గుఱి అని తెలుసుకున్నపుడు.
|
సూటి భావము:
ఎలా
పని చేయడమో నేర్చినవానికి తాను, ఎదుటివాడు అను బేధ భావము పూర్తిగా
నశించును. ప్రపంచమే తన స్వరూపామై అద్దంలా ప్రతిబింబిమై కనబడుతుంది. ఆ ఏకదృష్టిలో స్థిరమైనవాడు
స్వయంగా లోకరంజకమవుతాడు.
వ్యాఖ్యాత్మక విశ్లేషణ:
“తనకు నెదిరికి” అన్న మాటలో ఒక సూక్ష్మమైన సత్యం
దాగి ఉంది. ఇది (6.30) గీతా శ్లోకాన్ని గుర్తు చేస్తుంది —
యో
మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి ।
తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి ॥
భావము: ఎవరైతే నన్ను విశ్వమంతటా దర్శిస్తారో, నా యందే సమస్తమును దర్శిస్తారో, నేను వారికి దూరమవను, వారు నాకు దూరం కారు.
ఇలాంటి దృష్టి కలవాడికి చేయదగిన పనేమీ మిగలదు. చేయునదంతా సర్వాంతర్యామి అని తెలిసి - ఎదుటివాడు (= “ఇతరుడు”) అను భావమే వీగిపోతుంది.
అట్టివాడు ఇతరులలో చెడును చూసినా అది తనలోని తెలియని చీకటిగానే
గుర్తిస్తాడు. మంచిని చూసినా అదే దైవస్పూర్తి అనుభవమని గ్రహిస్తాడు. అలా, తనలో అన్నీ, అన్నిటిలో తనను చూసిన వాడు, విభిన్నత యొక్క మాయను దాటిపోతాడు. అందరి బంధమూ భగవంతుని ద్వారా మాత్రమే
అని తెలుసుకుంటాడు. ఈ రోజు మనము ఆనవాలు పట్టగల సంబంధాలు మన మనసు అల్లుకున్న జాలము. మాయ. (మరణానంతరము వాటి విలువ ఏమీ? అప్పుడు మిగిలినది
కేవలము భావన మాత్రమే) కాబట్టి విరాజిల్లునది ఒక్కటే —సత్యం —
అదే అఖండ చైతన్యం.
పల్లవి సారం — యథార్థ దర్శనము
“పనిగొన నేర్చువాడు” అనగా కర్తృత్వమును విడిచి
కర్మయోగములో నిలిచిన వాడు. అతనికి కర్తా–కర్మ భావాలురెండూ కలసిపోతాయి. అదే అతని భాగ్యం
— సంపాదించేది కాదు, తనలోనే ఉన్న, నిద్రాణమైన దానిని ఆవిష్కరించుట. సమస్త కార్యములకు వెన్నుదన్నుగా నిలిచేది
కర్త కర్మ ఏకమైనా ఆ ప్రశాంతతలోనే.
తదుపరి చరణముల సంకేతం: ఈ కీర్తనలోని మిగిలిన చరణములు మనిషికి లభించిన పరికరములను — మనస్సు, దేహం, ఇంద్రియములు, ధర్మబుద్ధి — వివరించును. వీటిని సత్ప్రజ్ఞతో వాడితే విముక్తికి దారితీస్తాయి; అజ్ఞానముతో వాడితే బంధనమవుతాయి.
మొదటి చరణం:
పదబంధం
|
భావము
|
దిట్టుదిట్టేయందులకు
దీవించేయందులకు నట్టనడుమను వొక్కనాలికే గుఱి
|
నిందించటం, దీవించటం — రెండూ ఒకే నోటి ద్వారా జరుగుతాయి. ఆ నోటి వెనుక ఉన్న
మనోభావమే మాట యొక్క దిశను నిర్ణయిస్తుంది.
|
అట్టే సంతోషమునకు
నలిగివున్నందులకు మట్టు మీఱియున్న తన మనసే గుఱి
|
సుఖదుఃఖాలకు లొంగకుండా సమబుద్ధితో నిలిచిన మనసే
నిజమైన శ్రేయస్సు దిశ.
|
భావము:
తిట్లు
తిట్టుట దీవించుట ఒకే నోటిద్వారా జరుగుతాయి. సంతోషమునకు కృంగి పోవుటకుఁ తన మనసే కారణం.
ఈ మనసు తన హద్దులను మీరి ప్రవర్తించుటతో మానవుడు నిర్వ్యాపారముగా ధర్మమును నిర్ణయించబోతాడు.
గూఢార్థవివరణము:
మట్టు మీఱియున్న:
ఇక్కడ పెదతిరుమలాచార్యులు
వారు ఒక అసాధారణ దృగ్విషయాన్ని బహిర్గతం చేస్తున్నారు “మట్టు మీఱియున్న” అన్న పదములతో మానవుల మనసు సమముగా లేక
తన హద్దులను మీరి పొంగుచున్నది అని చెప్పవచ్చును. సమస్థితిలో లేని మనసు సత్యమును గ్రహించుటకు
అనుకూలం కాదు. కాబట్టి మనం అనుభవించు సంతోషము మరియు నలిగి అణిగి ఉన్న స్థితి రెండును
ఉద్రేకమును పొందిన మనసు నిర్ణయించు స్థితులు అని ఆచార్యుల అభిప్రాయం.
మనిషికి నోరు
ఒకటే — కానీ దానివల్ల వెలువడే మాటలు రెండు విరుద్ధ దిశల్లో ప్రవహిస్తాయి. ఒక మాట ఆశీర్వాదమవుతుంది, మరొకటి శాపమవుతుంది.
కాబట్టి “మాటల”ను కాదు, వానిని పుట్టించు “మనసు”ను పరిశీలించాలి. తిట్లు దీవెనలను కలుపు అక్షమును (యాక్సిస్) జాగ్రత్తగా పరిశీలించిన మనము కోపమును వదలి మాట్లాడు పలుకులే వాచిక తపస్సు అనబడును. మనసులో ద్వేషం లేకుండా, శాంతితో మాట్లాడటం నిజమైన వాక్తపస్సు.
భగవద్గీత ఇలా చెబుతుంది:
ఉద్వేగమును
కలిగించనివి, సత్యములు, కోపము పుట్టించనివి,
ప్రయోజనకరమైనవి అగు మాటలు మరియు నిత్య వేద శాస్త్రముల పఠనము - వాంగ్మయ
తపస్సు అని చెప్పబడుతున్నది.
అంటే మనసు, మాట, కర్మ మూడు సమన్వయంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ మాటలు
శుద్ధమవుతాయి.
అప్పుడు
అదే నోరు దైవస్వరూపం అవుతుంది — దానినుండి దుర్వాక్యాలు వెలువడవు.
పదబంధం
|
భావము
|
పాపకర్మమునకు
బలుపుణ్యమునకును దీపంచ రెంటికి నొక్క దేహమే గుఱి
|
పాపమును ఆ దేహమే బాధను అనుభవిస్తుంది; పుణ్యం చేసినప్పుడు అదే దేహము స్వీకరిస్తుంది. కాబట్టి దేహం పాప–పుణ్యముల సాధనమూ,
ఫలగ్రాహకమూ.
|
వోపి కొండెము వినఁగ
నొగి ధర్మము వినఁగ యేపునఁ దమ వీనులు యివియే గుఱి
|
మనము ఏమి వినదలుచుకున్నామో వాటిపై మనస్సు పెడతాము. కొండెములను
అధర్మాలను వింటుంటే మనస్సు వక్రీభవిస్తుంది; ధర్మవచనాలను వింటే శాంతి పొందుతుంది. కాబట్టి ఇంద్రియాలే మన జీవన దిశను నిర్ణయించే
సాధనాలు.
|
సూటి భావము:
పాపముతో కృశించుటకు పుణ్యంతో దీపించుటకు ఈ దేహమే సాధనము. మనము ఏమి వినదలుచుకున్నామో వాటిపై
మనస్సు పెడతాము. కొండెములను అధర్మాలను వింటుంటే మనస్సు వక్రీభవిస్తుంది;
ధర్మవచనాలను వింటే శాంతి పొందుతుంది. కాబట్టి ఇంద్రియాలే మన జీవన దిశను
నిర్ణయించే సాధనాలు.
గూఢార్థవివరణము:
దేహం మన పాప–పుణ్యములకు ఆధారభూతమైతే, చెవులు మన దిశను నిర్ణయించేవి. అందువల్ల, మన ఇంద్రియాల చర్యలే మన దిశానిర్దేశ్య ములు. వాటిని శ్రీవేంకటేశుని సేవలో నిలుపుటయే యజ్ఞము— అప్పుడు దేహమూ, చెవులూ, ఇంద్రియాలన్నీ ద్వంద్వాలను దాటి ధర్మములో ఏకమవుతాయి.
ఇక్కడ పెదతిరుమలాచార్యులు చాలా లోతైన సంగతి చెబుతున్నారు. కొండెములను అసత్యములను నిక్కినిక్కి చెవులు కొరుక్కుంటూ వినబోతాము. అంతే ఆకర్షణ ధర్మం వినుటకుఁ మనకుండదు. ఈరోజు ప్రపంచంలో ఎన్నో ధర్మసంస్థలు మంచిని చెప్పబోతూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి కానీ వాటికి హాజరయ్యేవారు అతి కొద్దిమంది. అయితే "ఫలానా సినిమా నటుడికి కాలు విరిగింది" అంటే ఆ వార్త కారుచిచ్చులా వ్యాపిస్తోంది (వైరల్ అవుతుంది) ఇది ఈ ప్రపంచపు పోకడ.
మనం ఇంతకు ముందు ఎన్నోసార్లు చెప్పుకున్నట్టు మానవునకు పుణ్యమును నిర్ణయించు సామర్థ్యం లేదు. అయితే పాపము గుర్తించి విడుచుటకు సామర్థ్యం కలిగి ఉన్నవాడు. ఆ పాపం విడుచు ప్రయత్నమే యజ్ఞము. ఆ ప్రయత్నము యజ్ఞములా చేయకుంటే తిరిగి పాత పద్ధతుల వైపు మళ్ళు అవకాశం ఉండును.
అందువల్ల
—
పాపాన్ని విడిచిపెట్టే చైతన్యం కలిగి
ఉన్నవాడు సాధనలో ఉన్నవాడు.
కానీ పుణ్యాన్ని సాధించాలనే ఆశ ఇంకా ద్వంద్వాన్ని
కొనసాగిస్తుంది.
తెలుగు పదబంధం
|
భావము
|
పూవుల వాసనలకు పొంచి దుర్గంధములకు
చేవమీఱ నొక్కట నాసికమే గుఱి
|
పూల సువాసనను ఆస్వాదించాలనే ఆకాంక్ష, దుర్వాసనను దూరం చేయాలనే ద్వంద్వ భావము —
ఇవన్నీ ముక్కు అనే ఒకే ఇంద్రియం ద్వారా మనసులో పుడతాయి.
|
శ్రీవేంకటేశు సేవించ జీవులను దర్శించ
కైవసమైయున్నతమ కన్నులే గుఱి
|
శ్రీవేంకటేశ్వరుని సేవలో ఉండి, జీవులలో వ్యత్యాసం చూడకుండా సమదృష్టితో చూసే ఆ కన్నులే నిజమైన దృష్టి
సాధనాలు.
|
సూటి భావము:
మనిషి ముక్కు, కళ్ళు, ఇతర ఇంద్రియాలు అన్నీ ఒకే విధంగా పని చేస్తున్నట్టే కనిపించినా — వాటి వెనుక ఉన్న మనోభావమే అసలు తేడాను సృష్టిస్తుంది.
పూల సువాసనను కోరుకోవడం, దుర్వాసనను త్రోసివేయడం — ఇవి మనసులో దాగి ఉన్న ద్వంద్వభావాల ప్రతిబింబాలు. మనకు అనిపించే “మంచి”, “చెడు” అనే భేదం వాసనలలో లేదు; అది మన అంతరంగంలోనే ఉత్పన్నమవుతుంది — మునుపటి అనుభవాల చిట్టాలతో (=రికార్డులతో) ఇప్పటి అనుభూతిని పోల్చడం వలన.
ఈ
ద్వంద్వభావం లేని స్థితిలో, అంటే ఇంద్రియాలు సమదృష్టిలో
నిలిచినప్పుడు మాత్రమే — “శ్రీవేంకటేశు సేవించ జీవులను
దర్శించ” అనగా, ప్రతి జీవిలో శ్రీవెంకటేశుని రూపాన్నే
దర్శించగల చైతన్యస్థితి ఉత్పన్నమవుతుంది. అప్పుడు ఆ కన్నులు ఇక “చూడటానికి” కావు —
అవి “ద్రష్టత్వం” సాక్షాత్కరించే సాధనాలు అవుతాయి.
గూఢార్థవివరణము:
తీర్పులు, తీర్మానములు, తమకంటూ ప్రత్యేక అభిప్రాయములు లేని
దృష్టి — దైవదర్శనానికి ద్వారం.
“శ్రీవేంకటేశు సేవించ జీవులను దర్శించ” అంటే పెదతిరుమలాచార్యుల దృష్టిలో దైవసేవ (లేదా దైవభక్తి) అంటే ఆ తీర్పులులేని దర్శనం మాత్రమే.
మనము ఈ ప్రపంచమును, అందలి భూతములను జీవులను అవి వున్నవి
వున్నట్లుగా చూడగలగడమే దైవదర్శనం. అన్నమాచార్యుల వారు "ఆకాశ పాకాశ మరుదైన కూటంబు"
అన్నప్పుడు అస్తవ్యస్తముగా కనబడు ఈ ప్రపంచము మానవులు వూహించగలది కాదు. ఇక్కడే దైవము.
ఇక్కడే మనుష్యులు. ఇదే నరకము. ఇదే స్వర్గము. ఐతే ఆ యొక్క యేర్పాటు (విన్యాసం) ప్రస్తుతపు మన కనులకు అందుబాటులో లేనిది.
గీతా తాత్పర్యము
సమస్త ప్రాణులలో స్థితుడై
ఉన్న పరమాత్మను క్షీణించు శరీరంలోనే
క్షీణించని నిత్యసత్యమైన దానిని చూచువాడే
ద్రష్ట.
ఇదే మానవుల అదృష్టము. దానిని సఫలము చేసుకొనుట వారివారి భాగ్యము
అప్పుడు
ఆ దృష్టి “కేవలం కన్నుల చూపు కాదు" —
అవి చైతన్యపు కిటికీలు అవుతాయి.
ఈ కీర్తన ముఖ్య సందేశం
పెదతిరుమలాచార్యుల వారు మానవులను ఆటంకపరచు
ఇంద్రియములను
వాని ద్వంద్వ ప్రవృత్తిని అతి లాఘవముగా చెప్పారు.
ఉద్రేకములోనున్న
మనసు సత్య నిర్ణయమునకు పనికిరాదని అన్నారు.
పరస్పర
వ్యతిరేకములను కలుపు అక్షములో లేని దైవమును చేపట్టు
సన్మార్గమును
అత్యద్భుతమైన రీతిలో
అద్వైతాన్ని మరోకోణం లో చెప్పారు మా గురువుగారైన అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి. తిట్టేదెవరు పొగిడేదెవరు అంతా నీవే. నీ కర్మమే . ఉన్నది నీవే.
ReplyDelete