తాళ్ళపాక అన్నమాచార్యులు
268 పనిగొన నేరిచితే పాపమే పుణ్యమౌను
For English version press here
ఉపోద్ఘాతము
అన్నమాచార్యులవారు ఒక్కొక్క కీర్తనలో ఒక్కొక్క అపూర్వమైన సంగతిని వెల్లడించారు. ఈ కీర్తనలో వారు ముఖ్యంగా కర్మపై లోతైన వ్యాఖ్యానం చేశారు. ముఖ్యంగా మాయామయమగు ఈ లోకంలోనే మానవుడు శరణాగతి చేసి ముక్తిని పొందవలెను అన్నారు. పరిస్థితులు బాగా అనుకూలమయ్యే వరకు వేచి చూస్తాను అనేవారు ఎప్పటికీ శరణాగతి చేయలేరు. ఎందుకంటే అటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం లేదు. ప్రతికూల పరిస్థితుల్లోనే అసలు మనిషి బయట పడతాడు.
మానవులందరి మనసు చంచలమే అయినప్పటికీ కొందరు మహానుభావులు ఆ స్థితి నుండే పరమాత్ముని తలచగలుగుతారు. అటువంటి వారు దేవుని యంత్రంగంలో భాగమై ఈ భూమి మీద జీవులకు యిహపర సాధనములకు మార్గదర్శి అవుతారు.
ఎక్కడో అడవులకు వెళ్లి తపస్సు చేయవలసిన
అవసరం లేదని,
తానున్న చోట
నుండే
దైవమునకు బాహటముగా శరణాగతి అంటే చాలునని ఎలుగెత్తి చెప్పారు. ఈ కీర్తన అత్యద్భుతమని
చెప్పడం,
సముద్రానికి లోతు ఎక్కువని చెప్పడమే.
అధ్యాత్మ కీర్తన
|
రేకు: 172-2 సంపుటము: 2-351
|
పనిగొన నేరిచితే పాపమే పుణ్యమౌను నినుఁ గొలిచేయట్టి నీసేవకులకు ॥పల్లవి॥ మనసు చంచలమైనా మరి నిన్నుఁ దలఁచితే జనులకు నిహపరసాధనమౌను తనువు హేయమైనా తగ నిన్నుఁ గొలిచితే పనివడి యంతలోనే పవిత్రమౌను॥పని॥ కర్మము బంధకమైనా కమ్మి నీసొమ్ముచేసితే- నర్మిలి మోక్షమియ్య నాధారమౌను మర్మము కోరికయైనా మహి నీభక్తికెక్కితే ధర్మములకుఁ బరమధర్మము దానౌను ॥పని॥ జగమెల్ల మాయయైనా సరి నీకే శరణంటే పగటున నదే తపఃఫలమౌను అగపడి శ్రీవేంకటాధిప నన్నేలితివి మిగులా నిహమైనా మించి పరమౌను ॥పని॥
|
Details
and Explanations:
Telugu
Phrase
|
Meaning
|
పనిగొన
నేరిచితే పాపమే పుణ్యమౌను
|
ఎవరైనా
కార్యములను నిజమైన సహజ అవగాహనతో చేస్తే — పాపము
కూడ పుణ్యమవుతుంది.
|
నినుఁ
గొలిచేయట్టి నీసేవకులకు
|
నిన్ను
కొలుస్తూ నీ స్మరణలో మునిగినయట్టి భక్తులకు
|
సూటి భావము:
పరమాత్మ
నిరంతర స్మరణతో, ఆయన చైతన్యంలో నిలిచి ఏ
పని చేసినా అది పవిత్రమవుతుంది. భక్తులు చేసే ప్రతి కార్యమూ — ఎంత సాధారణమైనదైనా —
దైవసేవగా మారుతుంది.
వ్యాఖ్యాత్మక విశ్లేషణ:
ఇక్కడ అన్నమాచార్యులు మానవజాతికి అత్యంత ప్రాధాన్యమైన ఒక సత్యాన్ని ప్రకటిస్తున్నారు. “ఓ మానవులారా! కార్యములను ఎలా చేయాలో నిజంగా తెలిసిన వాడే జీవనరహస్యాన్ని ఛేదించినవాడు,” అని ఆయన చెబుతున్నారు. అది తెలిసిన తరువాత, ఫలితములపై దృష్టి అవసరమే లేదు.
ఆయన జీవనాన్ని పవిత్రం–అపవిత్రం అని విభజించరు. అవి రెండు ఎంతోకొంత పాళ్ళలో వున్నదే అసలు జీవితము. కర్మను నిందించరు, తపస్సును మహిమపరచరు. బాహ్య ఆచార వ్యవహారాలు ప్రమాణములపై కాదు — అవగాహన మరియు భక్తి పునాదులపై — నైతికత, ఆధ్యాత్మికతలను నిలబెట్టారు.
“పనిగొన నేరిచితే” అనే మాటలోనే అన్నమాచార్యుల మర్మము దాగి ఉంది. మానవుడు సమస్త సాధ్యాసాధ్యాలను, ప్రయత్నాలను శోధించి చివరికి “చేయదగిన ఏదీ లేదని” గ్రహించినప్పుడు — నిశ్చేష్టుడై ఏమీ చేయుటకు పాలుపోక సహజమగు మౌనము ఆవరించును. ఆ సమయములో అతడు ఆత్మస్వరూపానికి సమర్పణ చెయు అవకాశం లభిస్తుంది. — దైవ సంకల్పం నుండి పుడుతుంది.
భగవద్గీతలో చెప్పిన “అకర్తారఁ స పశ్యతి” (13-30) అనే భావం ఇక్కడే స్పష్టమవుతుంది — మానవులు తామున్న విద్యుదావేశిత వలయములో ఏదో ఒక పని వైపుకు మనసు పరుగులిడును. వాటి ఆకర్షణలకు లొంగకుండా తటస్థముగా నిలబడుటయే ఏ కార్యమూ ఆచరించక నిలబడుట -అదియే “అకర్తారఁ స పశ్యతి”. అతడు “నేను చేయువాడిని కాదు,” అని గ్రహించిన క్షణంలో లోలోపలి నుండి మౌనమవుతాడు.
జాగ్రత్తగా గమనించిన మన పనులన్నింట్లోనూ ఎంతోకొంత ఘర్షణ వుంటుంది. ఆ ఘర్షణ కర్త–కర్మల మధ్య బేధమే. ఈ ఘర్షణతో బంధనాలు పుట్టుకొస్తాయి.
కానీ సమర్పణలో, ఆ కర్త–కర్మల విభజన మాయమవుతుంది. చేసే వాడు–చేయబడే పని రెండూ ఒకే చైతన్యంలో
లీనమవుతాయి.
అటువంటి కార్యం ఘర్షణ రహితమైన స్థితిలో పుడుతుంది — శాంతముగా, పవిత్రముగా, ప్రకాశముగా.
ఇక్కడే
అన్నమాచార్యుల మహత్త్వం వ్యక్తమవుతుంది — బయటి జీవన రీతినుంచి ఆయన శాశ్వత లోకానికి
సులభంగా మారిపోతారు;
సామాన్యమైన మనుష్యజీవనంలోనుండి అవిభాజ్యమైన ఆధ్యాత్మిక అనుభూతి వైపు మృదువుగా నడిపిస్తారు.
ఆయన దృష్టిలో
జీవితం రెండు భాగాలు కాదు — జీవితం అంతా దైవ సేవ కొరకే; ప్రతి కర్మా అర్పణమే.
మొదటి చరణం:
తెలుగు పదబంధం
|
భావము
|
మనసు చంచలమైనా
మరి నిన్నుఁ దలఁచితే
|
మనసు అల్లకల్లోలమైనదైనా — నీ గురించి ఆలోచిస్తే,
|
జనులకు
నిహపరసాధనమౌను
|
జనులకు ఈ లోకమును, పరలోకమును గ్రహించుటకు సాధనమవుతుంది.
|
తనువు
హేయమైనా తగ నిన్నుఁ గొలిచితే
|
ఈ క్షణికమైనా, అసహ్యమును
గొలుపునదైనా దేహమును నీ సేవకు అంకితం చేస్తే,
|
పనివడి యంతలోనే పవిత్రమౌను
|
అది ఆ క్షణంలోనే పవిత్రమవుతుంది.
|
భావము:
చంచలమైన
మనసు కూడా భగవంతుని స్మరణలో నిలిచినపుడు, జనులకు ఈ లోకము–పరలోకముల యథార్థాన్ని బోధించగల సాధనమవుతుంది.
క్షణికమైనా, హీనమైనా దేహమూ — దైవసేవలో
నిమగ్నమైనపుడు — అదే పవిత్రమవుతుంది.
గూఢార్థవివరణము:
ఇక్కడ అన్నమాచార్యులు
ఒక అసాధారణ సత్యాన్ని చాటి చెబుతున్నారు. వారు పవిత్రమైన మనసు, నిర్దోషమైన శరీరం కోసం ఎదురుచూడవద్దు. చంచలమైన మనసు – హేయమైన శరీరములతోనే పరమాత్మవైపు
తిరిగిన క్షణంలో పవిత్రమవుతాయి. కాబట్టి ఇంకా దీనికి మనమంతా అర్హులమే. జనులారా! పరమాత్మవైపు
తిరిగి కొలవండి. అదే మానవజీవితమునకు పరమార్థము.
“జనులకు నిహపరసాధనమౌను” అనే పదబంధం లోతైనది. దైవసేవలో మునిగిపోయిన వాడు జనులకు తానే ఒక సాధనమవుతాడు. అతడి ద్వారా ఇతరులు ఈ లోకపు సత్యాన్ని, పరలోకపు పరమార్థాన్ని దర్శించగలుగుతారు. ఇలాంటి వ్యక్తులు తమకోసం జీవించరు — సమాజం కొరకే జీవిస్తారు. వారి ద్వారా ప్రపంచమునకు వెలుగు ప్రసరిస్తుంది.
ఈ సినిమా
పాటని గుర్తు చేసుకుందాం. “కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు.
వారి కొరకే వస్తారు సూర్యచంద్రులు.”
అన్నమాచార్యులు
అలాంటి జీవాత్మ. ఆయన మనసు, శరీరం — దైవ చైతన్యానికి వాహనాలుగా
మారాయి. ఆయన రచించిన వేలాది కీర్తనలు మానవాళిని దేవుని వైపు నడిపించే వంతెనలుగా నిలిచాయి.
అసాధ్యమైన లోకాలకు వారు వారధులుగా మిగిలారు. ఇక్కడ మనిషి అహంకారాన్ని విడిచి,
అవగాహనలో నిలిచినపుడు — అదే మనసు, అదే శరీరం విముక్తికి
సాధనమవుతాయని ఆయన చూపిస్తున్నారు.
ఆధునిక
కాలంలో జిడ్డు కృష్ణమూర్తి జీవితం కూడా ఇదే మార్గాన్ని ప్రతిబింబిస్తుంది. దివ్యజ్ఞాన
సమాజము (థియోసఫీ) ఆయనను “ప్రపంచ గురువుగా” నిలబెట్టినప్పటికీ, ఆయన ఆ బిరుదులు, కీర్తులు అన్నీ త్యజించి, సామాన్యుడిగా జీవించి, సత్యదూతగా మారాడు. అతడు కూడా అన్నమాచార్యుల
మాదిరిగానే — సజాగృతమైన, స్వార్థరహితమైన మనస్సు ద్వారా దైవతత్వం
ప్రసరించగలదని ప్రపంచమంతా తిరిగి చాటిచెప్పాడు. ఇద్దరికీ మనస్సు–దేహములు అవరోధాలు కావు.
అవి స్మరణతో, అవగాహనతో తాకినపుడు —అవే పవిత్రమైన సాధనములవుతాయి.
అనేకమంది
మహాపురుషులు జన్మించిన ఈ ప్రపంచములో అతికొద్దిమంది మాత్రమే దైవతత్వం ప్రసరించగల సాధనములయ్యారు.
వారు వర్ణించగరాని, అవగాహనకు అందని పరమాత్మ తత్వమును ప్రజలకు
ప్రత్యక్షంగా బోధించు ముక్తి ద్రోవలో వారు
జీవనము సాఫల్యము చేసుకొనిరి. అన్నమాచార్యుల గురించి తరువాతి తరమువారు ఇలా అనిరి.
"ఈతఁడే ముక్తిదోవ యీతఁడే మాయాచార్యుఁడీతఁడు గలుగఁబట్టి ఇందరు బదికిరి".
రెండవ చరణం:
తెలుగు పదబంధం
|
భావము
|
కర్మము బంధకమైనా కమ్మి నీసొమ్ముచేసితే
|
సాధారణంగా కర్మ బంధనానికి కారణం; కాని దానిని నీవే మూలముగా సమర్పిస్తే,
అది స్వరూపం మారుతుంది.
|
నర్మిలి మోక్షమియ్య నాధారమౌను
|
నీ ప్రేమతో అది విముక్తి ప్రసాదించే ఆధారమవుతుంది.
|
మర్మము కోరికయైనా మహి నీభక్తికెక్కితే
|
నీ అంతర్మర్మాన్ని తెలుసుకోవాలనే కోరికైనా, అది భక్తిరూపముగా లీనమైతే,
|
ధర్మములకుఁ బరమధర్మము దానౌను
|
అది సమస్త ధర్మములలో శ్రేష్ఠమైన ధర్మమవుతుంది.
|
సూటి భావము:
(అన్నమాచార్యులు ఇక్కడ మొదటి చరణం యొక్క సూత్రాన్నే కొనసాగిస్తున్నారు). బంధనమునకు కారణమైన కర్మ, స్వార్థరహిత సమర్పణలో
లీనమైనప్పుడు — అదే దైవప్రేమకు వాహకమై, విముక్తి యొక్క
మూలమవుతుంది. దైవమర్మం తెలుసుకోవాలనే కోరిక కూడా భక్తితో చల్లబడినపుడు — అది
పరమధర్మముగా మారుతుంది.
గూఢార్థవివరణము:
"కమ్మి నీసొమ్ముచేసితే" అనే మాటలో
ఒక లోతైన ఉపమానం ఉంది — ఎలాగైతే లోహపు తీగ విద్యుత్తుతో అనుసంధానమైతే అది నిర్మలమైన
శక్తిని ప్రసారం చేస్తుందో, అలానే మన కర్మలు కూడా దైవసంకల్పముతో
అనుసంధానమైతే అవి స్వార్థరహిత ప్రేమను ప్రసారం చేస్తాయి.
“నర్మిలి మోక్షమియ్య నాధారమౌను” — ప్రేమతో
చేసే పనులే విముక్తి యొక్క పునాది.
మనసు ఏ క్షణంలోనైనా స్వప్రయోజనాన్ని విడిచి దైవసేవలో లీనమైతే,
ఆ క్షణం నుండి దాని యాత్ర భూలోకంనుండి పరలోకానికి మొదలవుతుంది.
“మర్మము కోరికయైనా మహి నీభక్తికెక్కితే” అనే
వాక్యం అత్యంత సున్నితమైనది.
దైవమర్మం తెలుసుకోవాలనే తపన కూడా సాధారణంగా కోరికగానే కనిపిస్తుంది.
కానీ ఆ తపన భక్తిగా మారినపుడు — అది ఇక తెలుసుకోవాలనే కోరిక కాదు,
“తానే తాను లీనమవ్వాలనే ఆకాంక్ష.” ఇది అజ్ఞానానికీ, జ్ఞానానికీ మధ్యనున్న సరిహద్దు.
ఇక్కడ కోరిక జ్ఞానమవుతుంది. జ్ఞానం సమర్పణ అవుతుంది.
“ధర్మములకుఁ బరమధర్మము దానౌను” — దైవమునకు
అర్పణమైన పని,
అది ఎంత సాధారణమైనదైనా, దానిలో స్వార్థం
లేకపోవుట వలన — అది సమస్త ధర్మములకంటే ఉన్నతమైన ధర్మమవుతుంది.
మనిషి చేసే
ప్రతి పని స్వతహాగా నిష్పాక్షికం. దానిని బంధనమో, విముక్తియో
చేసే అంశం మన చూసే తీరే. అన్నమాచార్యుల దృష్టిలో కర్మలో తప్పు లేదు; కర్మ దైవసంకల్పముతో కలిసిన క్షణంలో అది “యజ్ఞం” అవుతుంది. ఆ కర్మలో
చేయువాడు లేడు, చేసేది లేదు — చర్య మరియు చైతన్యం
ఒకటైపోతాయి.
భగవద్గీతలో
చెప్పినట్లే (4-23): “గతసంగస్య ముక్తస్య
జ్ఞానావస్థితచేతసః, యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే.” అంటే —అటువంటి వారు ప్రాపంచిక అనుబంధాల నుండి విముక్తి చేయబడుతారు మరియు
వారి బుద్ధి దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితమై ఉంటుంది. వారు చేసే ప్రతి పని,
యజ్ఞం (భగవత్ అర్పితము)గా ఉంటుంది కాబట్టి వారు అన్ని రకాల కర్మ
ప్రతిచర్యల నుండి విముక్తి చేయబడుతారు.
ఇదే
అన్నమాచార్యుల చరణం చెబుతున్నది. కర్మను విముక్తిగా మార్చే శక్తి భక్తిలో, ప్రేమలో, సమర్పణలో ఉంది. ఆయన చూపించిన దారిలో —
జీవితం ఒక యజ్ఞంగా, ప్రేమ ఒక విముక్తి దారిగా
మారుతుంది.
తెలుగు పదబంధం
|
భావము
|
జగమెల్ల మాయయైనా సరి నీకే శరణంటే
|
జగమంతా మాయ అని చెప్పినా సరే, నేను నీ శరణు చేరితే –
|
పగటున నదే తపఃఫలమౌను
|
బాహటముగా అదే
స్పష్టమైన తపస్సు ఫలమవుతుంది.
|
అగపడి శ్రీవేంకటాధిప నన్నేలితివి
|
ఓ వెంకటాధీశా! నీవే నా హృదయాన్ని ఏలుతున్నావని తెలుసు
|
మిగులా నిహమైనా మించి పరమౌను
|
నీ సన్నిధిలో ఈ నిష్ఫలమైన ఈ లోకం కూడా పరమమైన సత్యరూపమవుతుంది.
|
సూటి భావము:
జగమంతా
మాయ అని చెప్పినా, నేను నీ శరణు పొందినప్పుడు —బహిరంగముగా
అదే నా తపస్సు, అదే పఃఫలము కూడా. ఓ వెంకటేశ్వరా! నీవే నా హృదయానికి
పాలకుడివి. నీ సన్నిధిలో ఈ కలుషమైన లోకం కూడా మరొక దివ్య లోకమై ప్రకాశిస్తుంది.
గూఢార్థవివరణము:
ఈ మాయాలోకంలోనే శరణు పొందాలి: అన్నమాచార్యులు
ఇక్కడ ఒక అద్భుతమైన సత్యాన్ని వెల్లడిస్తున్నారు. జగత్తు మాయయే అయినా సరే — మనసు
దైవశరణు చేరిన క్షణంలో మాయ పవిత్రమవుతుంది. అది ఇక భ్రాంతి కాదు; భగవద్కృపలోని వెలుగు.
“మిగులా నిహమైనా మించి పరమౌను” — ఈ
నిష్ఫలంగా కనిపించే లోకం పరమసత్యరూపమవుతుంది. సాధారణ దృష్టికి జగత్తు గందరగోళముగా
కనిపించినా, అవగాహనలో నిలిచిన దృష్టికి అదే జగత్తులో ఒక
క్రమం, ఒక శ్రుతి, ఒక నిశ్శబ్ద
సౌందర్యం ప్రతిఫలిస్తుంది. ఆ సౌందర్యం వర్ణించలేనిది, స్మృతిలో
నిలవనిది.
“పగటున నదే తపఃఫలమౌను” — దాచకుండా,
హృదయపూర్వకంగా చేసిన శరణాగతి — అదే తపస్సు. అడవులకూ గుహలకూ వెళ్లి
దీర్ఘ తపస్సు చేయనక్కరలేదు. మనసారా చెప్పి — “ప్రభో! నేను నీవాడిని; నా శరీరము, నా మనస్సు నీవే నడిపించు” — అన్న క్షణమే
తపస్సు ఫలిస్తుంది. అది పాపమును పుణ్యముగా మార్చే చైతన్యం — అదే శరణాగతి.
మేధస్సు
యొక్క పరాజయం: అన్నమాచార్యుల దృష్టిలో
ఇది మేధస్సు యొక్క పరాజయం. మానవజాతి యుగాలుగా మేధస్సును ఆరాధిస్తోంది. కానీ ఆ
మేధస్సు యుద్ధాలను సృష్టించింది, శాంతిని కాదు; అధునాతనతను తెచ్చింది, కానీ కరుణను కోల్పోయింది.
ప్రజల మనసులో భయం, ఆందోళన, అశాంతి —
ఇవే మన ప్రగతికి ప్రతిబింబాలు. భవిష్యత్తుపై ఆశ చూపేది జ్ఞానం కాదు; ఈ క్షణంలో చైతన్యంగా మేల్కొన్న అవగాహనే విముక్తి. తక్కినవన్నీ
వ్యర్థములు.
క్రమానుగత
మార్పు — ఒక ఉచ్చు
ఇప్పుడు
కూడా అనేకులు “ప్రపంచం నెమ్మదిగా క్రమక్రమంగా మారుతుంది” అనే ఆశగా ఉంటారు. కానీ ఇది
కేవలం మనసు యొక్క మాయ. మహాభారతంలో చెప్పిన సంగతులు ఈనాటికీ ఎందుకు నిజమనిపిస్తాయంటే
ఆనాటినుంచి ఈనాటి దాకా మనషి మనస్సులో మార్పు రాలేదు. మనలాగే అలోచించే వారున్నంత వరకు
ఈ ప్రపంచం ఇలాగే వుంటుంది. మార్పు ఎప్పుడూ క్రమానుగతం కాదు. కాలనుగతం కాదు. సత్యము, ధర్మము సమయానికి బంధింపబడవు. శరణాగతి క్షణం వచ్చినప్పుడు — అదే ఆత్మలో విప్లవం.
అణువణువులో విప్లవం.
“అగపడి శ్రీవేంకటాధిప నన్నేలితివి” — ఈ మాటలు భక్తిప్రస్ఫురణ
మాత్రమే కాదు, జ్ఞానోదయం. దైవచైతన్యం అంతరంగపు పాలకుడై ఉన్నపుడు,
మనసు–శరీరం రెండూ దాని సాధనాలవుతాయి. ఇక “నేను” అనే భావం ఉండదు;
చైతన్యం ప్రవహించే మార్గమే మిగులుతుంది. అదే "జీవములో దైవచైతన్యం"
ప్రతిష్టించ బడుట. ఆ దశలో మాయ, సత్యం, లోకం, పరలోకం అనే విభజనలన్నీ లయమవుతాయి. ఈ లోకమే పరములోకమవుతుంది.
ఈ చరణం
అంతరంగ మార్పుకి ఒక ప్రతీక. మనం మారకుండా ప్రపంచం మారాలి అనుకోవడం అవివేకము. మనం సమూలముగా
మారితే జగత్తే పరమవుతుంది. ఇది అన్నమాచార్యుల కవిత్వానికి పరాకాష్ట.
ఈ
కీర్తన ముఖ్య సందేశం
అన్నమాచార్యులు పాపపుణ్యముల వివాదంలో పడకుండా
సంపూర్ణ
భక్తితోటి దైవమును ఆరాధించమని ఉద్బోధ చేశారు.
X-X-The
END-X-X
మరి సామాన్యులకు ఎలా అన్వయం అవుతుంది. మనదేశంలో సామాన్యులు కూడా ఇటువంటి ఫిలాసఫీ ఒంటపట్టించుకున్న వారే.
ReplyDeleteకర్త కర్మ ల మధ్య ఘర్షణ నాకూ కకుగుతుంటుంది. చాలా బాగున్నది మీ విశ్లేషణ.