Friday, 20 March 2026

T-313 కనకము కనకమే కడు నినుమినుమే

 తాళ్లపాక అన్నమాచార్యులు
313 కనకము కనకమే కడు నినుమినుమే

ఉపోద్ఘాతము

భక్తి, భక్తుడు అన్నవి అలంకార ప్రాయమైన విషయములు కావు. అయినప్పటికీ అవి ఎంతో సన్నిహితంగా కనిపించి, తేలికగాను అనిపించి ప్రతీవారికీ తాను భక్తుణ్ణి అన్న భావనను కలుగజేస్తాయి. ఈ కీర్తనలో అన్నమాచార్యులు భక్తి యొక్క సహజస్థితిని సూటిగా, కానీ లోతుగా వ్యక్తం చేస్తారు. బాహ్య అనుకరణతో గాని, యత్నంతో గాని ఆ స్థితిని పొందలేమని సూచిస్తారు. సహజసిద్ధంగా నిలిచినవారి జీవన విధానం, ప్రయత్నంతో నడిచే మనుషుల జీవనంతో భిన్నమని ఈ కీర్తన తెలియజేస్తుంది. కార్యము, భక్తి, సమత్వము అన్నీ ఒకే అంతర్గత స్థితి నుండి ఉద్భవిస్తాయని చూపిస్తుంది. ఈ విధంగా ఈ కీర్తన మనిషి చేసే అసహజ యత్నమును ప్రశ్నించి, సహజత్వం వైపు దారి చూపిస్తుంది.
 
కీర్తన నిర్మాణం:
పల్లవి: కనకము కనకమే. భక్తి భక్తియే. దానికి సమము అనిపించువన్ని నకళ్ళే.
మొదటి చరణం: పోలికలు కానరావు. 
రెండవది: ఉపాయములు లేవు.
మూడవది: సమత్వపు తోవలో ఎంచుకొని నడచుట అసాధ్యము.
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 221-6 సంపుటము: 3-119
కనకము కనకమే కడు నినుమినుమే
వెనక సరిదూఁగితే వెలువకు రాదు     ॥పల్లవి॥

హరిఁ గొలిచినవారి కమరు నన్నిసుఖాలు
గరిమతో వారల భాగ్యమే భాగ్యము
తెరమరఁగుల కర్మదేహులెల్ల వీరితోడ
పురుఁడు వెట్టుకోఁబోతే పోలికలు రావు ॥కన॥

భాగవతులైనవారు పట్టినదెల్లా నీడేరు
చేగదేర వారలు సేసినదే చేఁత
తీగెసంసారమత్తులు తెలియక వీరివలె
వేగినంతా నయ్యేమంటే వెరవులఁ బడవు ॥కన॥

శ్రీవేంకటేశుదాసులు చేసినదెల్లా సృష్టి
యేవంకా ధ్రువపట్టమే ఇటు వారికి
కావరపు మనుజులు గతిగనేమని వారి-
తోవల నడవఁబోతేఁ దూగదు తమకును ॥కన॥
Details and Explanations:
పల్లవి:
కనకము కనకమే కడు నినుమినుమే
వెనక సరిదూఁగితే వెలువకు రాదు ॥పల్లవి॥ 
పదబంధం
అర్థం
కనకము కనకమే కడు నినుమినుమే
బంగారము బంగారమే. ఎంతైనా ఇనుము ఇనుమే
వెనక సరిదూఁగితే వెలువకు రాదు
మునుపు (ముందుగానే) దానిని సమానం చేద్దామనుకుంటే ఆ విషయం బయటకు రాదు.

సూటి భావము:
బంగారము బంగారమే. ఎంతైనా ఇనుము ఇనుమే.  ముందుగానే రెండింటినీ సమానం చేద్దామని నిర్ణయించుకుంటే, వాటి మధ్యనున్న వ్యత్యాసం బయటపడదు.

గూఢార్థవివరణము:
ఇనుము ఇనుముగానే ఉండుట శ్రేష్టము. దానిని బంగారముతో సమానం చేయాలనుకోవడం వ్యర్థమైన ప్రయత్నమే. ఇనుము, బంగారము రెండూ సహజ పదార్థాలే. సహజత్వాన్ని వదిలి మరొకదానిలా కావాలనుకోవడమే అసహజము. సహజముగా ఉండుటయే పరమ నివేదన. సహజత్వం ప్రయత్నంతో సాధించేది కాదు; అది స్వయంగా వెలువడేది.

దీని భావం — తన సహజస్థితిని విడిచి అనుకరణలో పడకపోవుటే శ్రేష్ఠము. కానీ అలా ఉండలేకపోవడమే మనిషి నైజం. లోపల గానీ బయట గానీ ఏదో దాగి ఉందనే ఊహ మనలో నిరంతరం కదులుతూనే ఉంటుంది. ఆ ఊహ ప్రేరేపించగా నిష్ప్రయోజనమైన వెతుకులాటలో జీవితమంతా గడిపేస్తాం.

ఈ భావాన్ని మరో కోణంలో చూస్తే, రేనె మాగ్రిట్ చిత్రమైన The Double Secret గుర్తుకు వస్తుంది. ముఖాన్ని చీల్చి లోపలికంటా చూసినా, అక్కడ కూడా మరొక నిర్మితమైన మరొక పొరే కనిపిస్తుంది. బయట అనుకరణతో సహా, (లోపల) వెతకడంవలన మాయ మాయమవదు అనే భావన ఈ కీర్తనలోనూ ప్రతిధ్వనిస్తుంది. 


విషయములలోనూ, మనుషులలోనూ, ప్రపంచములోనూ మనకు తెలియనిది ఏదో దాగివుందనే భావన సార్వత్రికము. అది స్వయంచలితము, స్వీయనిర్మితము. పట్టి ఉంచలేనిదీ మాయ; పట్టుకోవాలనుకున్నదీ మాయ; పట్టు దొరకనిదీ మాయ. తానుగా నిలువలేనిదంతా మాయ.

మొదటి చరణం:
హరిఁ గొలిచినవారి కమరు నన్నిసుఖాలు
గరిమతో వారల భాగ్యమే భాగ్యము
తెరమరఁగుల కర్మదేహులెల్ల వీరితోడ
పురుఁడు వెట్టుకోఁబోతే పోలికలు రావు          ॥కన॥ 

Telugu Phrase

Meaning

హరిఁ గొలిచినవారి కమరు నన్నిసుఖాలు
హరిఁ గొలిచినవారికి అన్నిసుఖాలు అమరును
గరిమతో వారల భాగ్యమే భాగ్యము
గొప్ప గౌరవముతో వారి భాగ్యమే నిజమైన భాగ్యము.
తెరమరఁగుల కర్మదేహులెల్ల వీరితోడ
ప్రపంచమనే తెర ముందుకు వచ్చి మళ్లీ మరుగై పోవు కర్మదేహులు వారితోడ
పురుఁడు వెట్టుకోఁబోతే పోలికలు రావు
(పురుఁడు = సమానము) సమానమగుటకు చేయు యత్నములు పనికిరావు


సూటి భావము:
హరిఁ గొలిచినవారికి అన్నిసుఖాలు అమరును. గొప్ప మహిమతో వారి భాగ్యమే నిజమైన భాగ్యము. ప్రపంచమనే తెర ముందుకు వచ్చి మళ్లీ మరుగై పోవు కర్మదేహులు వారితోడ సమానమగుటకు చేయు యత్నములు పనికిరావు

గూఢార్థవివరణము:
“పురుఁడు” అన్న పదం ఇక్కడ సమానత్వాన్ని సూచిస్తుంది (కానుపును కాదు). కానీ ఆ సమానత్వం యత్నంతో సాధించేది కాదు; సహజంగా ఉద్భవించేది. అనుకరణతో, ప్రయత్నంతో దానిని సాధించాలనుకుంటే అది సంభవించదు అని కవి సూచిస్తున్నారు.

అన్నిసుఖాలు అమరును అన్నది అర్ధం చేసుకొనవలెను. వారు సుఖాలు కోరుకుంటే అమరుతాయి. కానీ సుఖాలు కోరుకుంటే  దుఃఖాలు వాటి వెన్నంటే వుంటాయి. హరిఁ గొల్చినవారు మనమున్న తలములో  సుఖాలు అనుభవించి దుఃఖాలు వదులుదామను లోకములో విహరించరు. సుఖదుఃఖాలు రెండు వారికి సమ్మతమే. ఆ రకముగా మనలాగ క్షణక్షణమునకు 'మంచి''చెడు' ఎంపికలతో సతమౌతూ జీవించరు.
 
'మంచి''చెడు'లు రెండు కాలగమనములోని విషయములు. వాటికి క్షీణత​, వృద్ధి సహజము. అనగా నిజముగా హరిఁ గొల్చినవారు కాలగతికి లోబడని చిత్తస్థితిలో వుంటారు.

రెండవ​ చరణం:
భాగవతులైనవారు పట్టినదెల్లా నీడేరు
చేగదేర వారలు సేసినదే చేఁత
తీగెసంసారమత్తులు తెలియక వీరివలె
వేగినంతా నయ్యేమంటే వెరవులఁ బడవు           ॥కన॥ 
Telugu Phrase
Meaning
భాగవతులైనవారు పట్టినదెల్లా నీడేరు

భాగవతులు పట్టిన కార్యములన్నియు సఫలమగును / సరిగా నెరవేరును.

చేగదేర వారలు సేసినదే చేఁత

(చేగదేర= సారము తెలియునట్లు) ప్రస్పుటంగా వారు చేయ తలబెట్టినది జరుగును.
తీగెసంసారమత్తులు తెలియక వీరివలె
(తీగెసంసారమత్తులు = తెగకుండా తీగలాగ సంసారమనే మత్తులో ఉండు జనులు) ఎడతెగని సంసార మత్తులో జీవనము గడుపు వారు ఆ భాగవతుల మాదిరి
వేగినంతా నయ్యేమంటే వెరవులఁ బడవు
త్వరగా అయిపోదామంటే అటువంటి ఉపాయములు లేవు. (అటువంటి యత్నములో తడబడుదురు)

సూటి భావము:
భాగవతులు పట్టిన కార్యములన్నియు సఫలమగును / సరిగా నెరవేరును. ప్రస్పుటంగా వారు చేయ తలబెట్టినది జరుగును. ఎడతెగని సంసార మత్తులో జీవనము గడుపు వారు ఆ భాగవతుల మాదిరి త్వరగా అయిపోదామంటే అటువంటి ఉపాయములు లేవు. (అటువంటి యత్నములో తడబడుదురు).

గూఢార్థవివరణము:
చేగదేర వారలు సేసినదే చేఁత : ప్రస్పుటంగా వారు చేయ తలబెట్టినది జరుగును. దీనిని కొంత వివరముగా తెలుసుకొనవలెను. వారంతటవారు భాగవతులు కార్యములను చేపట్టరు. వారికి సహజముగా ఇవ్వబడిన (స్వధర్మము) మాత్రమే నిర్వర్తించుదురు. "నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్" అని గీతలో చెప్పినట్లుగా తమను భగవంతుని కార్యములో భాగమని తలచి ఆ రకముగా జీవనము కొనసాగింతురు.
 
ఇది మన ఇప్పటి మనోధర్మము కాదు. మనస్సుకు తోచినట్లు చేయుట మన ఇప్పటి పద్ధతి. ఈ రకముగా మానవులంతా ప్రవర్తించుచు ఒకరి కార్యములు మరొకరికి ప్రతి బంధములై ఈ ప్రపంచమంతా విడదీయలేని చిక్కుముడిలా తయారైనది. దీనిని ప్రత్యక్షముగా గమనించవచ్చును. ఈ చిక్కుముళ్ళను దోహద పరచనిది అసలు కార్యము.

అందుకే అన్నమాచార్యుల వారు వెంటనే "వేగినంతా నయ్యేమంటే వెరవులఁ బడవు" అని చెప్పారు. దీని అర్ధము కార్యమును నిర్ణయించు లేదా నియంత్రించు శక్తి మానవునికి సులభముకాదు. కానీ ప్రపంచమంతా కార్య ప్రణాలికలో నిమ్మగ్నమై వుంది. గుర్తించలేని స్వధర్మమును అంచనా వేయుటయే అవివేకము.

మూడవ​​ చరణం:
శ్రీవేంకటేశుదాసులు చేసినదెల్లా సృష్టి
యేవంకా ధ్రువపట్టమే ఇటు వారికి
కావరపు మనుజులు గతిగనేమని వారి-
తోవల నడవఁబోతేఁ దూగదు తమకును ॥కన॥

Telugu Phrase

Meaning
శ్రీవేంకటేశుదాసులు చేసినదెల్లా సృష్టి
శ్రీవేంకటేశుని దాసులు చేసినదంతా సహజసృజన; సార్థకమైన వ్యక్తీకరణ
యేవంకా ధ్రువపట్టమే ఇటు వారికి
వారు ఏ వంక వున్నాను ఎత్తైన స్థాయి వారిది ఈ వైపున. (వారికి ఈ దారిలో స్థిరత్వం, నిశ్చలమైన ఆధారం ఉంది)
కావరపు మనుజులు గతిగనేమని వారి-
గర్వము, పొగరులతో మనుషులు మాకు ఆ దారి తెలుసు అనే వారి
తోవల నడవఁబోతేఁ దూగదు తమకును
ఆ మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తే స్థిరంగా నిలువలేరు; సమత్వం నిలవదు
సూటి భావము:
శ్రీవేంకటేశుని దాసులు చేసినదంతా సహజసిద్ధమైన కార్యమే. వారికి ఆ దారిలో స్థిరత్వము ఉంటుంది. కానీ గర్వముతో “మాకు మార్గం తెలుసు” అనుకొను మనుషులు వారి మార్గంలో నడవాలని ప్రయత్నించినచో స్థిరత్వం నిలవదు.

గూఢార్థవివరణము:
శ్రీవేంకటేశుదాసులు చేసినదెల్లా సృష్టి”ఇక్కడ “సృష్టి” అన్న పదం ముఖ్యము. ఇది కేవలం చేయబడిన పని కాదు. అది సహజంగా వెలువడిన వ్యక్తీకరణ.  ఇది కల్పించి చేయబడిన సృజనాత్మకత కాదు. దాసులు కార్యములను రూపొందించరు; వారు ఆ కార్యములలో అంతర్భాగమవుదురు.  అందుచేత వారి కార్యములలో బలవంతం లేదు, ఆర్భాటం లేదు—సహజసిద్ధ పాత్ర మాత్రమే ఉంటుంది.
 
యేవంకా ధ్రువపట్టమే ఇటు వారికి”వారికి ఒక నిశ్చల ఆధారం ఉంది. అది మనసు నిర్ణయించిన దారి కాదు; అది ఆవిష్కృతమైన స్థితి. అందుచేత వారు తడబడరు. వారు ఎంచుకొని నడవరు—నడిపించబడుతారు. కావున విజయము, పరాజయము రెండూ వారికి సమానమే.

కావరపు మనుజులు గతిగనేమని”ఇంత వరకు మానవాళిచేసిన కృషి మీద నమ్మకముతో మనిషి తనకు తెలియనిది లేదని; “నేను ఆ దారిని నిర్ణయించగలను” అని అహంకరిస్తాడు. తెలిసిన, తెలియని భావముల మధ్య తటస్థముగా నిలబడి వుండలేని స్థితి. ఇక్కడే తెలిసినదాని మీద నిలబడి తెలియని దానిని నిర్ణయించబోతాడు. ఇదే అతనికి అతి పెద్ద అడ్డంకి. ఈ భావమే కావరము.
 
వారి తోవల నడవఁబోతేఁ”అటువంటి మనము శ్రీవేంకటేశుదాసుల మార్గంలో నడవాలని ప్రయత్నించడమే అసలు తంటా. ఇప్పటిదాకా మనము నేర్చినది పోలికలు, వెరవుల మార్గము. దాసులది ఆ మార్గము కాదు.
 
దూగదు తమకును”స్థిరత్వం నిలవదు. సమత్వం నిలవదు. ఎందుకంటే మానవుడు ఇంకా ఎంపికలలో, అభిప్రాయాలలో, గర్వములోనే నిలిచియున్నాడు.

X-X-The END-X-X

Sunday, 15 March 2026

T-312 నెపములన్నియు నీవు నేరిచినవే

 తాళ్లపాక అన్నమాచార్యులు
312 నెపములన్నియు నీవు నేరిచినవే

ఉపోద్ఘాతము

దీనిని శృంగార కీర్తన అని మనము చెప్పుకున్నప్పటికీ— ఇందులో ఎవరు ఏమి మాట్లాడుతున్నారో తెలియుటకు కొంత విశ్లేషణ అవసరము. ఇది అన్నమాచార్యుల స్వగతం అనుకోవచ్చును. ఆ స్థితిలో ఆయనకు తానను ఒక ఊహ (కన్య స్వరంలో), ఇంకొకటి తనేకే తెలియని తనలోని స్వరం. లోని స్వరం ఆయనలోని హెచ్చుతగ్గులను ఏవిధమైన (మంచి, చెడు) భావనలను వెలిబుచ్చక తెలుపుచున్నది. ఆడ కంఠంలో ఇన్ని అడ్డంకులా అన్న భావము వస్తుంది. 
 
కీర్తనలోనికి పోవుచున్న  కొలది స్త్రీ కంఠం కూడా అనేక మర్మములను తెలుపుతుంది. మొత్తానికి ఇది ఒక గూఢమైన సంభాషణ​. అన్నమాచార్యుల మార్కు వైవిధ్యము. వారు అనవసరమైన విషయములను ప్రస్తావించక సూటిగా కీర్తనలోకి దిగిపోతారు. ఒకసారి వారి అంతరంగము పట్టుకొంటే కీర్తన అర్ధం చేసుకోవడం సులభమౌతుంది.

శృంగార సంకీర్తన
రేకు: 144-4 సంపుటము: 7-258
నెపములన్నియు నీవు నేరిచినవే
కపటాలు మాయెడకు గడించకువయ్యా            ॥పల్లవి॥

చిగురువంటిది మేను శిలవంటిది మనసు
యెగసక్యములు మాతోనేలయ్యా
నగపువంటిది తమి నామువంటిది వలపు
తగవులఁబెట్టి మాతో తక్కించకువయ్యా   ॥నెప॥

అద్దమువంటి వయసు అమ్మువంటికోపము
సుద్దుల మా మనసేమి సోదించేవయ్యా
పొద్ధువంటిదడియాస పూఁసవంటిది గుణము
గద్దించి మమ్మేల నీవు కైకొలిపేవయ్యా ॥నెప॥

చుట్టుమువంటిది వావి సూదివంటిది చూపు
చెట్టువట్టి మమ్మునేల చెనకేవయ్యా
యిట్టె శ్రీ వేంకటేశ యెనసితివిటు నన్ను
పట్టిన పంతముదక్కెఁ బదరకువయ్యా              ॥నెప॥
Details and Explanations:
పల్లవి:         
నెపములన్నియు నీవు నేరిచినవే
కపటాలు మాయెడకు గడించకువయ్యా          ॥పల్లవి॥
పల్లవి లోని ఉపక్రమము: ఇది అన్నమాచార్యుల స్వగతం. ఆ స్థితిలో ఆయనకు తానను ఒక ఊహ (కన్య స్వరంలో), ఇంకొకటి తనేకే తెలియని తనలోని స్వరం. లోని స్వరం ఆయనలోని హెచ్చుతగ్గులను తెలుపుచున్నది. ఆడ కంఠంలో ఇన్ని అడ్డంకులా అన్న భావము వస్తుంది.
శృంగార భావము
తాత్విక భావము
నెపములన్నియు నీవు నేరిచినవే
ప్రియా! ఈ కతలు, తర్కములు నీవు సృష్టించుకున్నవే.  
(ఒక అవ్యక్త భావన భక్తుని మనస్సులో ఇలా చెప్పుచున్నది) మానవుడా! ఈ నెపములన్నియు నీవే కల్పించుకున్నవి.
కపటాలు మాయెడకు గడించకువయ్యా
స్త్రీ స్వరం (చిరుకోపం నటించుతూ): నా దగ్గరకు వచ్చుటకు నీ వద్ద సాకులు అనేకం. అదని ఇదని కాలాయాపన చేయకు
స్త్రీ స్వరం: ఎప్పటికప్పుడు నువ్వు క్రొంగొత్త సాకులు కనిపెట్టి మన మద్య దూరన్ని పెంచుతావే కానీ నేనేం చేయాలో చెప్పవు?

మొదటి చరణం:
చిగురువంటిది మేను శిలవంటిది మనసు
యెగసక్యములు మాతోనేలయ్యా
నగపువంటిది తమి నామువంటిది వలపు
తగవులఁబెట్టి మాతో తక్కించకువయ్యా              ॥నెప॥ 
చరణములోని ఉపక్రమము: అన్నమాచార్యులు నాయిక మనసును చిత్రిస్తున్నారు. ఒకవైపు శరీరములో పొంగుకొస్తున్న ప్రేమ​. ఇంకోవైపు (తాను ప్రేమిస్తున్న​) కఠినమైన​ దైవము మనసు కరుగుతుందా అన్న శంక. ముందుకు వెళ్ళాలా వద్దా? చిరునగవుతో ప్రేమ ఆరంభం కానీ అసూయ దానికి ఆజ్యము పోయునది. అంతే. ఇక మనసు ధర్మ సందేహములలో ఇరుక్కుపోతుంది. జీవితం తైతక్కలాటే.

శృంగార భావము
తాత్విక భావము
చిగురువంటిది మేను శిలవంటిది మనసు
అవ్యక్త స్వరం:  ప్రియా! చిగురులా బహు సున్నితమైనది నీ శరీరం. నీ మనసు మాత్రం రాయిలా కరగదు.
అవ్యక్త స్వరం:  మానవుడా! నీ శరీరము సుకుమారము. తొందరగా వాడిపోవును. నీ మనసు మాత్రం మంకుపట్టు పట్టి ఉంది. (కానీ భక్తుడు దేవుణ్ణి నిర్లిప్తుడిగా భావిస్తాడు; తన ప్రార్థనలకు స్పందన లేదనుకుంటాడు. ఇక్కడ సమస్య భక్తుడిదే కానీ దైవముపై ఆ అభియోగము మోపుతున్నాడు).
యెగసక్యములు మాతోనేలయ్యా
స్త్రీ స్వరం: నాతో ఈ అపహాస్యం ఎందుకయ్యా?   
స్త్రీ స్వరం: నీవు నాకు ఏకార్థకముగా కాక ఇలా పరీక్షలా ఎందుకు అగపడతావయ్యా
నగపువంటిది తమి నామువంటిది వలపు
తమి = ఆపేక్ష, వలపు
నగపువంటిది తమి =  (వయసులో) ప్రేమ అలంకారము వంటిది.
నాము = అసూయ;
నామువంటిది వలపు = అసూయ​, పోలికలతో పెంపొందునది వలపు
అవ్యక్త స్వరం: ప్రియా! (యుక్త వయసులో) ప్రేమ అలంకారము వంటిది. కానీ ఈ వలపు  అసూయ, పోలికల నీడలలో నీలోని భావనలను ఎగద్రోయుట వలన పెంపొందినది.  
 
("కుమ్మరింపుచుఁ దెచ్చుకొన్నదీ వలపు" అన్న అన్నమాచార్యుల మాటలు చెప్పుకొనుట సందర్భోచితము)
అవ్యక్త స్వరం:  జీవించుటకు అలంకారప్రాయముగా భక్తిని, ప్రేమను వ్యక్తపరుస్తావు. కానీ ఇవి అసూయ, పోలికల జాడలలో పుట్టినవి.
 
(“కొయ్యతనమునఁ దెచ్చుకొన్నదీవలపు" అన్న అన్నమాచార్యుల మాటలు చెప్పుకొనుట సందర్భోచితము)
తగవులఁబెట్టి మాతో తక్కించకువయ్యా
(తగవు = న్యాయము, ధనాది నిమిత్తమైన ౙగడము, వ్యాజ్యము (న్యాయస్థానములో వివాదము); తగవులఁబెట్టి = మమ్ములను ధర్మ సందేహములలో ఇరికించి;
తక్కించకువయ్యా = అటమటించునట్లు చేయకుమయ్య​)
స్త్రీ స్వరం: నువ్వెమో నన్ను ఎప్పటికీ సందేహములలో అటమటించునట్లు చేసి తప్పించుకుందామని చూస్తావు
స్త్రీ స్వరం: నన్ను మాటిమాటికి ధర్మ సందేహములలో (ఒకప్పడిది, మరొకప్పుడది అంటూ) ముంచుతావు. నా జీవితం వీటితో తైతక్కలాటైంది. 

"కోపగింపుచుఁ దెచ్చుకొన్నదీవలపు" అన్న అన్నమాచార్యుల మాటలు సందర్భోచితము

రెండవ​ చరణం:
అద్దమువంటి వయసు అమ్మువంటికోపము
సుద్దుల మా మనసేమి సోదించేవయ్యా
పొద్ధువంటిదడియాస పూఁసవంటిది గుణము
గద్దించి మమ్మేల నీవు కైకొలిపేవయ్యా              ॥నెప॥
చరణములోని ఉపక్రమము: ఈ చరణంలో అన్నమాచార్యులు నాయిక మనసులోని పరస్పర విరుద్ధ భావములను మరింత స్పష్టంగా చూపుతారు. కాలం గడిచిపోవడం అద్దంలా కబడుతూ వున్నా, కోపమనే బాణములను సంధించుతూనే ఉంటాం అంటున్నారు. చివరికి తనలోని గుణములు తన ప్రేమకు అడ్డం వస్తున్న సంగతి గ్రహిస్తుంది. గద్దించవద్దని వేడుకుంటుంది.
శృంగార భావము
తాత్విక / భక్తి భావము
అద్దమువంటి వయసు అమ్మువంటికోపము
అమ్ము= బాణము
అవ్యక్త స్వరం:  ప్రియా! అద్దంలా (స్పష్టంగా, ఎటువంటి కల్మషములు లేకుండా) నీ వయసు కనబడుతూ వుంది కదా! కానీ కోపమనే బాణములను చిందిస్తావు ఎందుకు?
 
(కోపము ఆమె అందమును తగ్గించుతోందని సూచన కాబోలు)
అవ్యక్త స్వరం: మానవుడా! మీరిపోతున్న​వయసు అద్దంలా కబడుతూ వున్నా, (కోపము కాదు పెద్దమనిషిలా వుండు అని సూచన కాబోలు)
 
పెఱుగఁగఁ బెఱుగఁగఁ బెద్దలమైతిమి నేము
కఱకఱలే కాని కడగంట లేదుపల్లవి అన్న అన్నమాచార్యుల మాటలు సందర్భోచితము
"సుద్దుల మా మనసేమి సోదించేవయ్యా
సుద్దుల మా మనసు = కేవలము విన్న సంగతులు, చర్చల మీద అధారపడిన​ (స్వానుభవము కానివి)
స్త్రీ స్వరం: మేము కేవలము విన్న సంగతులు, కబుర్ల మీద అధారపడి నిన్ను కాంక్షించేమయ్యా! లోతుగా పరిశోధించితే అక్కడ మా మనసులో ఏమీ లేదయ్యా (మేము నిష్కల్మషులమిని చెబుతోంది)
స్త్రీ స్వరం: స్వానుభవము కాని దానిని పట్టి వ్రేలాడే వారమయ్యా. నువ్వు గ్రుచ్చి గ్రుచ్చి చూస్తే అక్కడ మా మనసులో ఏమీ లేదయ్యా.

"సుద్దుల మా మనసేమి సోదించేవయ్యా
అనేది విలోమ సంకేతము. స్వానుభవమును వదలి కాని దానిని పట్టివుండే స్వభావమును చూపును.
పొద్ధువంటిదడియాస పూఁసవంటిది గుణము
పూఁస = చిన్నది, అల్పము, కీలు (e.g.: వెన్నుపూసలు the joints of the backbone)
గుణము = విశేషణము అనగా తనకు తానుగా ఏమీ వుండదు కానీ గుణమును తెలుపు పదము (ఆయావానిని అతిశయించి చూపును). ఒక రకముగా ఫిల్టర్ అనుకోవచ్చును.
పూఁసవంటిది గుణము = అల్పమైనను కీలకము గుణము = మనము చూచునవన్ని ఒక రకముగా గుణము అను ఫిల్టర్ ద్వారా గ్రహించుదుము.
అవ్యక్త స్వరం:  ప్రియా!  నీ మనసులోని కోరికలు గంటగంటకు మారుతూ, అల్ప గుణములు కలకలము రేపుతుంటే ఇదమిత్థముగా నీ ప్రేమను తెలుపలేకున్నావు.
అవ్యక్త స్వరం: మానవుడా! పొద్దెక్కును. పొద్దు గుముకును. చాలా అల్పము ఈ జీవితము. ఆ కొద్ది సమయం కూడా కోరికలతో నింపేస్తావు. నీలోని గుణములు అలజడి రేపుతుంటే అప్పుడు చూచిన దానిని నమ్ముదువు.
" గద్దించి మమ్మేల నీవు కైకొలిపేవయ్యా
గద్దించి = బెదరించి, అదరించి; కైకొలిపేవయ్యా =  ప్రేరేపిస్తావయ్యా
స్త్రీ స్వరం: (ఇలా ప్రియునిపై ప్రేమ అనిశ్చితము కాగా, చిరు కోపము నటిస్తూ) నన్ను అదరించి తొందరపెట్టి ఇలా ఎందుకు ప్రేరేపిస్తావయ్యా?.
స్త్రీ స్వరం: (తన భక్తిలోని అసంపూర్ణతను ఎరిగిన భక్తుడు) అయ్యా! మమ్మందరినీ ఈ రకముగా వ్యవధి ఇవ్వక బెదరించి, తొట్రుపాటుకు గురిచేసి ఏమి సాధిస్తావయ్యా?
 మూడవ చరణం:
చుట్టుమువంటిది వావి సూదివంటిది చూపు
చెట్టువట్టి మమ్మునేల చెనకేవయ్యా
యిట్టె శ్రీ వేంకటేశ యెనసితివిటు నన్ను
పట్టిన పంతముదక్కెఁ బదరకువయ్యా              ॥నెప॥ 
చరణములోని ఉపక్రమము: ఈ చరణంలో అన్నమాచార్యులు అతి ముఖ్యమైన జీవన సత్యములను పొందుపరిచారు.

 

శృంగార భావము
ఆధ్యాత్మిక / మానసిక భావము
చుట్టుమువంటిది వావి – సూదివంటిది చూపు
వావి = నెయ్యము, బంధుత్వము
అవ్యక్త స్వరం:  ప్రియా!  బంధము చుట్టములా సన్నిహితంగా ఉంటుంది. కానీ సూదిలా గుచ్చినట్లు పరీక్షించని బంధములు నాపై నీప్రేమకు ప్రతి బంధములు..
అవ్యక్త స్వరం: మానవుడా! చుట్టములతో ఉన్న అనుబంధం సహజమైన బంధంలా అనిపిస్తుంది. వాడియైన చూపుతో సహజమును అసహజమును వేరుపరచి చూడుము.
చెట్టువట్టి మమ్మునేల చెనకేవయ్యా
చెట్టువట్టి  = రెక్కలతో (ప్రచండ వేగముగా) చెనకు = తాకు;
స్త్రీ స్వరం: ప్రచండ వేగముగా వచ్చి మమ్మల్ని తాకు నిన్ను గ్రహించలేమయ్యా. (ఆమె తన లోపాన్ని తెలుసుకుంది)
స్త్రీ స్వరం: (భక్తునికి మనసులో ఇలా అనిపిస్తుంది. ప్రచండ వేగముగా నాలో జరుగు ప్రతిక్రియలను నేనే తెలుసుకోలేకున్నాను. పైన చెప్పిన బంధములే నన్ను పట్టి ఉంచుతున్నాయి. అన్న అవగాహన మొదలౌతుంది)
యిట్టె శ్రీ వేంకటేశ యెనసితివిటు నన్ను
యెనసి = సమానం చేయు, సాటిచేయు
మనుష్య​ స్వరం: ఓ వేంకటేశా! అలా నన్ను పట్టి ఉంచినదేదో తెలుసుకున్నానో లేదో, వెంటనే నన్ను నీతో సాటిచేసావు.
(శిలవంటిది మనసు:  భక్తుడు దేవుణ్ణి నిర్లిప్తుడిగా భావిస్తాడు. ఇక్కడ అన్నమాచార్యులు ఆ భావాన్ని కొట్టిపారేస్తున్నారు.)
పట్టిన పంతముదక్కెఁ బదరకువయ్యా
బదరకువయ్యా = త్వరపడి ఆక్షేపించ వద్దు
అవ్యక్త స్వరం: ఇప్పుడు నీ పంతము తీరినది కదా. కాబట్టి త్వరపడి నన్ను తప్పుపట్టకుము, ఆక్షేపించకుము.
 
బదరకువయ్యా = త్వరపడి ఆక్షేపించ వద్దు అని ఎందుకన్నారో ఆలోచింతము. మానవునికి అతని ముందర గల దృశ్యమునకు మధ్య ఉన్న దూరము ఒక వంతు. ఇంకొకటి తనను ఆ దృశ్యమునుండి వేరుగా భావించు తలపు వేరొక వంతు. ప్రతీ దృశ్యముపై తానొక న్యాయమూర్తిలాగ తీర్పు ఇచ్చుట మానవుని బలహీనత​. ఇటువంటి బలహీనతల సమాహారమే "నేను". "నేను" అనుదానికి ఊతము ఇవ్వని నాడు ఆ అవ్యక్త స్వరము, ఆ స్త్రీ స్వరము ఒకటై పోవును. అదే మోక్షము.

 

 

ఇంతకీ ఆ అవ్యక్త స్వరము ఏమి? ఎవరికీ తెలియదు. ప్రముఖ తత్వవేత్త​, మానసిక నిపుణులు కార్ల్ యంగ్ (Carl Jung) గారు ఇలా అన్నరు. "మనందరిలోను మనకు తెలియనిది మరొకటి ఉంది" 


X-X-The END-X-X

T-314 మనములోని విభుఁడు మఱవఁడే కాలంబు

తాళ్లపాక అన్నమాచార్యులు 314 మనములోని విభుఁడు మఱవఁడే కాలంబు For English version press here ఉపోద్ఘాతము ఇది అపూర్వమైన కీర్తన అని చెప్పడాని...