తాళ్లపాక అన్నమాచార్యులు
313 కనకము కనకమే కడు నినుమినుమే
ఉపోద్ఘాతము
భక్తి, భక్తుడు అన్నవి అలంకార ప్రాయమైన విషయములు
కావు. అయినప్పటికీ అవి ఎంతో సన్నిహితంగా కనిపించి, తేలికగాను
అనిపించి ప్రతీవారికీ తాను భక్తుణ్ణి అన్న భావనను కలుగజేస్తాయి. ఈ కీర్తనలో
అన్నమాచార్యులు భక్తి యొక్క సహజస్థితిని సూటిగా, కానీ లోతుగా
వ్యక్తం చేస్తారు. బాహ్య అనుకరణతో గాని, యత్నంతో గాని ఆ
స్థితిని పొందలేమని సూచిస్తారు. సహజసిద్ధంగా నిలిచినవారి జీవన విధానం, ప్రయత్నంతో నడిచే మనుషుల జీవనంతో భిన్నమని ఈ కీర్తన తెలియజేస్తుంది.
కార్యము, భక్తి, సమత్వము అన్నీ ఒకే
అంతర్గత స్థితి నుండి ఉద్భవిస్తాయని చూపిస్తుంది. ఈ విధంగా ఈ కీర్తన మనిషి చేసే అసహజ
యత్నమును ప్రశ్నించి, సహజత్వం వైపు దారి చూపిస్తుంది.
కీర్తన
నిర్మాణం:
పల్లవి: కనకము కనకమే. భక్తి భక్తియే. దానికి సమము అనిపించువన్ని నకళ్ళే.
మొదటి చరణం: పోలికలు కానరావు.
రెండవది: ఉపాయములు లేవు.
మూడవది: సమత్వపు తోవలో ఎంచుకొని నడచుట అసాధ్యము.
|
అధ్యాత్మ
సంకీర్తన
|
|
రేకు: 221-6
సంపుటము: 3-119
|
|
కనకము కనకమే కడు నినుమినుమే వెనక సరిదూఁగితే వెలువకు రాదు ॥పల్లవి॥ హరిఁ గొలిచినవారి కమరు నన్నిసుఖాలు గరిమతో వారల భాగ్యమే భాగ్యము తెరమరఁగుల కర్మదేహులెల్ల వీరితోడ పురుఁడు వెట్టుకోఁబోతే పోలికలు రావు ॥కన॥ భాగవతులైనవారు పట్టినదెల్లా నీడేరు చేగదేర వారలు సేసినదే చేఁత తీగెసంసారమత్తులు తెలియక వీరివలె వేగినంతా నయ్యేమంటే వెరవులఁ బడవు ॥కన॥ శ్రీవేంకటేశుదాసులు చేసినదెల్లా సృష్టి యేవంకా ధ్రువపట్టమే ఇటు వారికి కావరపు మనుజులు గతిగనేమని వారి- తోవల నడవఁబోతేఁ దూగదు తమకును ॥కన॥
|
Details
and Explanations:
పల్లవి:
కనకము కనకమే
కడు నినుమినుమే
వెనక సరిదూఁగితే
వెలువకు రాదు ॥పల్లవి॥
|
పదబంధం
|
అర్థం
|
|
కనకము కనకమే కడు నినుమినుమే
|
బంగారము బంగారమే. ఎంతైనా ఇనుము ఇనుమే
|
|
వెనక సరిదూఁగితే వెలువకు రాదు
|
మునుపు (ముందుగానే) దానిని సమానం చేద్దామనుకుంటే ఆ విషయం బయటకు
రాదు.
|
సూటి భావము:
బంగారము
బంగారమే. ఎంతైనా ఇనుము ఇనుమే. ముందుగానే రెండింటినీ సమానం చేద్దామని నిర్ణయించుకుంటే,
వాటి మధ్యనున్న వ్యత్యాసం బయటపడదు.
గూఢార్థవివరణము:
ఇనుము
ఇనుముగానే ఉండుట శ్రేష్టము. దానిని బంగారముతో సమానం చేయాలనుకోవడం వ్యర్థమైన
ప్రయత్నమే. ఇనుము, బంగారము రెండూ సహజ పదార్థాలే.
సహజత్వాన్ని వదిలి మరొకదానిలా కావాలనుకోవడమే అసహజము. సహజముగా ఉండుటయే పరమ నివేదన.
సహజత్వం ప్రయత్నంతో సాధించేది కాదు; అది స్వయంగా వెలువడేది.
దీని
భావం — తన సహజస్థితిని విడిచి అనుకరణలో పడకపోవుటే శ్రేష్ఠము. కానీ అలా
ఉండలేకపోవడమే మనిషి నైజం. లోపల గానీ బయట గానీ ఏదో దాగి ఉందనే ఊహ మనలో నిరంతరం
కదులుతూనే ఉంటుంది. ఆ ఊహ ప్రేరేపించగా నిష్ప్రయోజనమైన వెతుకులాటలో జీవితమంతా
గడిపేస్తాం.
ఈ
భావాన్ని మరో కోణంలో చూస్తే, రేనె మాగ్రిట్ చిత్రమైన The
Double Secret గుర్తుకు వస్తుంది. ముఖాన్ని చీల్చి లోపలికంటా చూసినా,
అక్కడ కూడా మరొక నిర్మితమైన మరొక పొరే కనిపిస్తుంది. బయట అనుకరణతో
సహా, (లోపల) వెతకడంవలన మాయ మాయమవదు అనే భావన ఈ కీర్తనలోనూ
ప్రతిధ్వనిస్తుంది.
విషయములలోనూ, మనుషులలోనూ, ప్రపంచములోనూ మనకు తెలియనిది ఏదో దాగివుందనే
భావన సార్వత్రికము. అది స్వయంచలితము, స్వీయనిర్మితము. పట్టి ఉంచలేనిదీ
మాయ; పట్టుకోవాలనుకున్నదీ మాయ; పట్టు దొరకనిదీ
మాయ. తానుగా నిలువలేనిదంతా మాయ.
మొదటి చరణం:
హరిఁ గొలిచినవారి
కమరు నన్నిసుఖాలు
గరిమతో వారల
భాగ్యమే భాగ్యము
తెరమరఁగుల
కర్మదేహులెల్ల వీరితోడ
పురుఁడు
వెట్టుకోఁబోతే పోలికలు రావు ॥కన॥
|
Telugu Phrase
|
Meaning |
|
హరిఁ గొలిచినవారి కమరు నన్నిసుఖాలు
|
హరిఁ గొలిచినవారికి అన్నిసుఖాలు అమరును
|
|
గరిమతో వారల భాగ్యమే భాగ్యము
|
గొప్ప గౌరవముతో వారి భాగ్యమే నిజమైన భాగ్యము.
|
|
తెరమరఁగుల కర్మదేహులెల్ల వీరితోడ
|
ప్రపంచమనే తెర ముందుకు వచ్చి మళ్లీ మరుగై పోవు కర్మదేహులు వారితోడ
|
|
పురుఁడు వెట్టుకోఁబోతే పోలికలు రావు
|
(పురుఁడు = సమానము) సమానమగుటకు చేయు యత్నములు పనికిరావు
|
సూటి భావము:
హరిఁ గొలిచినవారికి
అన్నిసుఖాలు అమరును. గొప్ప మహిమతో వారి భాగ్యమే నిజమైన
భాగ్యము. ప్రపంచమనే తెర ముందుకు వచ్చి మళ్లీ మరుగై పోవు కర్మదేహులు వారితోడ సమానమగుటకు
చేయు యత్నములు పనికిరావు
గూఢార్థవివరణము:
“పురుఁడు”
అన్న పదం ఇక్కడ సమానత్వాన్ని సూచిస్తుంది (కానుపును కాదు). కానీ ఆ సమానత్వం యత్నంతో
సాధించేది కాదు; సహజంగా ఉద్భవించేది. అనుకరణతో,
ప్రయత్నంతో దానిని సాధించాలనుకుంటే అది సంభవించదు అని కవి సూచిస్తున్నారు.
అన్నిసుఖాలు
అమరును అన్నది అర్ధం చేసుకొనవలెను. వారు సుఖాలు కోరుకుంటే అమరుతాయి. కానీ సుఖాలు కోరుకుంటే దుఃఖాలు వాటి వెన్నంటే వుంటాయి. హరిఁ గొల్చినవారు
మనమున్న తలములో సుఖాలు అనుభవించి దుఃఖాలు వదులుదామను
లోకములో విహరించరు. సుఖదుఃఖాలు రెండు వారికి సమ్మతమే. ఆ రకముగా మనలాగ క్షణక్షణమునకు
'మంచి''చెడు' ఎంపికలతో
సతమౌతూ జీవించరు.
'మంచి''చెడు'లు రెండు కాలగమనములోని
విషయములు. వాటికి క్షీణత, వృద్ధి సహజము. అనగా నిజముగా హరిఁ గొల్చినవారు
కాలగతికి లోబడని చిత్తస్థితిలో వుంటారు.
రెండవ చరణం:
భాగవతులైనవారు
పట్టినదెల్లా నీడేరు
చేగదేర వారలు
సేసినదే చేఁత
తీగెసంసారమత్తులు
తెలియక వీరివలె
వేగినంతా
నయ్యేమంటే వెరవులఁ బడవు ॥కన॥
|
Telugu Phrase
|
Meaning
|
|
భాగవతులైనవారు పట్టినదెల్లా నీడేరు
|
భాగవతులు పట్టిన కార్యములన్నియు సఫలమగును / సరిగా నెరవేరును. |
|
చేగదేర వారలు సేసినదే చేఁత |
(చేగదేర= సారము తెలియునట్లు) ప్రస్పుటంగా వారు
చేయ తలబెట్టినది జరుగును.
|
|
తీగెసంసారమత్తులు తెలియక వీరివలె
|
(తీగెసంసారమత్తులు = తెగకుండా తీగలాగ సంసారమనే మత్తులో ఉండు
జనులు) ఎడతెగని సంసార మత్తులో జీవనము గడుపు వారు ఆ భాగవతుల మాదిరి
|
|
వేగినంతా నయ్యేమంటే వెరవులఁ బడవు
|
త్వరగా అయిపోదామంటే అటువంటి ఉపాయములు లేవు. (అటువంటి యత్నములో తడబడుదురు)
|
సూటి భావము:
భాగవతులు
పట్టిన కార్యములన్నియు సఫలమగును / సరిగా నెరవేరును. ప్రస్పుటంగా వారు
చేయ తలబెట్టినది జరుగును. ఎడతెగని సంసార మత్తులో జీవనము గడుపు వారు ఆ భాగవతుల మాదిరి
త్వరగా అయిపోదామంటే అటువంటి ఉపాయములు లేవు. (అటువంటి యత్నములో తడబడుదురు).
గూఢార్థవివరణము:
చేగదేర వారలు సేసినదే చేఁత : ప్రస్పుటంగా వారు చేయ తలబెట్టినది జరుగును. దీనిని కొంత వివరముగా తెలుసుకొనవలెను.
వారంతటవారు భాగవతులు కార్యములను చేపట్టరు. వారికి సహజముగా ఇవ్వబడిన (స్వధర్మము) మాత్రమే
నిర్వర్తించుదురు. "నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్" అని గీతలో చెప్పినట్లుగా
తమను భగవంతుని కార్యములో భాగమని తలచి ఆ రకముగా జీవనము కొనసాగింతురు.
ఇది మన ఇప్పటి మనోధర్మము కాదు.
మనస్సుకు తోచినట్లు చేయుట మన ఇప్పటి పద్ధతి. ఈ రకముగా మానవులంతా ప్రవర్తించుచు ఒకరి
కార్యములు మరొకరికి ప్రతి బంధములై ఈ ప్రపంచమంతా విడదీయలేని చిక్కుముడిలా తయారైనది.
దీనిని ప్రత్యక్షముగా గమనించవచ్చును. ఈ చిక్కుముళ్ళను దోహద పరచనిది అసలు కార్యము.
అందుకే అన్నమాచార్యుల వారు
వెంటనే "వేగినంతా నయ్యేమంటే వెరవులఁ బడవు" అని చెప్పారు. దీని అర్ధము కార్యమును
నిర్ణయించు లేదా నియంత్రించు శక్తి మానవునికి సులభముకాదు. కానీ ప్రపంచమంతా కార్య ప్రణాలికలో
నిమ్మగ్నమై వుంది. గుర్తించలేని స్వధర్మమును అంచనా వేయుటయే అవివేకము.
మూడవ చరణం:
శ్రీవేంకటేశుదాసులు
చేసినదెల్లా సృష్టి
యేవంకా ధ్రువపట్టమే
ఇటు వారికి
కావరపు మనుజులు
గతిగనేమని వారి-
తోవల నడవఁబోతేఁ
దూగదు తమకును ॥కన॥
|
Telugu Phrase |
Meaning
|
|
శ్రీవేంకటేశుదాసులు చేసినదెల్లా సృష్టి
|
శ్రీవేంకటేశుని దాసులు చేసినదంతా సహజసృజన; సార్థకమైన వ్యక్తీకరణ
|
|
యేవంకా ధ్రువపట్టమే ఇటు వారికి
|
వారు ఏ వంక వున్నాను ఎత్తైన స్థాయి వారిది ఈ వైపున. (వారికి ఈ దారిలో స్థిరత్వం, నిశ్చలమైన ఆధారం ఉంది)
|
|
కావరపు మనుజులు గతిగనేమని వారి-
|
గర్వము, పొగరులతో మనుషులు మాకు ఆ దారి తెలుసు
అనే వారి
|
|
తోవల నడవఁబోతేఁ దూగదు తమకును
|
ఆ మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తే స్థిరంగా నిలువలేరు; సమత్వం నిలవదు
|
సూటి భావము:
శ్రీవేంకటేశుని దాసులు చేసినదంతా సహజసిద్ధమైన కార్యమే. వారికి ఆ దారిలో
స్థిరత్వము ఉంటుంది. కానీ గర్వముతో “మాకు మార్గం తెలుసు” అనుకొను మనుషులు వారి
మార్గంలో నడవాలని ప్రయత్నించినచో స్థిరత్వం నిలవదు.
గూఢార్థవివరణము:
“శ్రీవేంకటేశుదాసులు చేసినదెల్లా
సృష్టి” —ఇక్కడ “సృష్టి” అన్న పదం ముఖ్యము. ఇది
కేవలం చేయబడిన పని కాదు. అది సహజంగా వెలువడిన వ్యక్తీకరణ. ఇది కల్పించి చేయబడిన సృజనాత్మకత కాదు. దాసులు కార్యములను
రూపొందించరు; వారు ఆ కార్యములలో అంతర్భాగమవుదురు. అందుచేత వారి కార్యములలో బలవంతం లేదు, ఆర్భాటం లేదు—సహజసిద్ధ పాత్ర మాత్రమే ఉంటుంది.
“యేవంకా ధ్రువపట్టమే ఇటు వారికి” —వారికి ఒక నిశ్చల ఆధారం ఉంది. అది మనసు నిర్ణయించిన దారి కాదు; అది ఆవిష్కృతమైన స్థితి. అందుచేత వారు తడబడరు. వారు ఎంచుకొని నడవరు—నడిపించబడుతారు.
కావున విజయము, పరాజయము రెండూ వారికి సమానమే.
“కావరపు మనుజులు గతిగనేమని” —ఇంత వరకు మానవాళిచేసిన కృషి మీద నమ్మకముతో మనిషి తనకు తెలియనిది లేదని;
“నేను ఆ దారిని నిర్ణయించగలను” అని అహంకరిస్తాడు. తెలిసిన, తెలియని భావముల మధ్య తటస్థముగా నిలబడి వుండలేని స్థితి. ఇక్కడే తెలిసినదాని
మీద నిలబడి తెలియని దానిని నిర్ణయించబోతాడు. ఇదే అతనికి అతి పెద్ద అడ్డంకి. ఈ భావమే
కావరము.
“వారి తోవల నడవఁబోతేఁ” — అటువంటి మనము శ్రీవేంకటేశుదాసుల మార్గంలో నడవాలని ప్రయత్నించడమే అసలు తంటా.
ఇప్పటిదాకా మనము నేర్చినది పోలికలు, వెరవుల మార్గము. దాసులది
ఆ మార్గము కాదు.
“దూగదు తమకును” — స్థిరత్వం నిలవదు. సమత్వం నిలవదు. ఎందుకంటే మానవుడు ఇంకా ఎంపికలలో,
అభిప్రాయాలలో, గర్వములోనే నిలిచియున్నాడు.
X-X-The
END-X-X

No comments:
Post a Comment