Thursday, 28 May 2026

T-336 మంచి గుణములుగల మగువల సాజ మిది

 తాళ్లపాక అన్నమాచార్యులు
336 మంచి గుణములుగల మగువల సాజ మిది

పరిచయం 
మనకు దైవము "సర్వాంతర్యామి" అన్నది ఒక ఊహ. ఒక విశ్వాసము మాత్రమే. కానీ దానిపై పూర్తి నమ్మకం ఉండదు. అదే భక్తునికి మనకు గల వ్యత్యాసం. కొందరు ఊహల ఊయలలో, భక్తులు పూర్ణ నమ్మికతోను జీవనం గడుపుదురు. ఒక దానిపై విశ్వాసము, ఇంకోక దానిపై అపనమ్మకం ఉంటే అక్కడ ఇంకా ఎంపిక పని చేస్తూనే ఉన్నదన్న మాట. కాబట్టి "సర్వాంతర్యామి" అన్నది మనకు దాక్కునేందుకు మాటల ఏర్పాటు మాత్రమే. ఈ వ్యత్యాసం స్పష్టమైతే ఈ కీర్తన అత్యంత సులభం.

కానీ, కొన్నింటిని స్వీకరించి, మరికొన్ని త్యజించునది మన ఇప్పటి వివేకం. అందులో హెచ్చుతగ్గులే కనబడును. తాను, తాను మునిగివున్న ప్రపంచము కూడా  "సర్వాంతర్యామి" లోనివైతే ఈ హెచ్చుతగ్గులేమి? ఈ పొరపొచ్చాలేమిటికి? మనిషికి అతని చుట్టువున్న చైతన్యమునకు మధ్య విభజనే సమస్త సమస్య​లకు మూలం. ఉన్నదే ఆ ఒక్కడు. భగవంతుడు. అతడిపై కాక మరి వేరుచూపులేలా? అన్నమాచార్యులవారు నీతులు చెప్పరు. మనమున్న స్థితిని అద్దంలో చూపుతారు అంతే. 
శృంగార సంకీర్తన
రాగి రేకు: 1931-5  సంపుటము: 29-125
మంచి గుణములుగల మగువల సాజ మిది
యెంచుకొని దయతోడ నేలుకొనవయ్యా            ॥పల్లవి॥

మనసు నమ్మిన సతి మరి యనుమానించదు
ననిచిన వనిత పెనఁగులాడదు
యెనసిన జవరాలు యెరవులుసేయదు
పనుపడి రతులకు బాఁతిపడుఁగాని    ॥మంచి॥

మరిగిన యాఁటది మరి పాయనేరదు
దొరసిన యిల్లాలు దూర దెంతైనా
సరి నిచ్చకపులేమ జరపులఁ బెట్టదు
యిరవైన కాఁపురాన కేఁకారుఁగాని        ॥మంచి॥

తగులైన కామిని తప్పులేమీ నెంచదు
మొగమిచ్చకపు ఇంతి వెగటాడదు
నిగిడి శ్రీవేంకటేశ నీదేవు లలమేల్మంగ
సొగిసి యీకూఁటముల జొక్కించుఁగాని             ॥మంచి॥
Details and Explanations:
పల్లవి:
మంచి గుణములుగల మగువల సాజ మిది
యెంచుకొని దయతోడ నేలుకొనవయ్యా ॥పల్లవి॥
భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
మంచి గుణములుగల మగువల సాజ మిది
(సాజము = సహజము) మంచి గుణములు గల స్త్రీల సహజ స్వభావము ఇదే
(అనేక సంప్రదాయములలో జీవులందరు మహిళలే.) మానవులకు సహజ గుణములే ప్రకృతి.
యెంచుకొని దయతోడ నేలుకొనవయ్యా
అయ్యా! నీవే చేకొని దయతోడ మమ్మేలుకొనవయ్యా
అయ్యా! నీ దరికి మేము రాలేము. దయతో మా హృదయములను నీవిగా పాలించు.
గూఢార్థవివరణము:
దైవమును ఒక యువతి పెనిమిటి లాగాను, ఒక యోగి సర్వాంతర్యామి లాగ చూచు విషయమీ కీర్తన.

మంచి గుణములుగల మగువల సాజ మిది: ఇది నీతి బోధ కాదు. ఇక్కడ "మంచి గుణములు" అనగా ఉన్న గుణములు.  తెచ్చిపెట్టుకున్న అవగుణములు తొలగినపుడు మిగిలేది ప్రకృతి సహజ గుణములు.

యెంచుకొని దయతోడ నేలుకొనవయ్యా: అయ్యా శ్రీవేంకటేశుడా మాకై మేము నిన్ను చేరలేము. కావున నీవే ఈ విశాల ప్రపంచంలో ఈ చిన్న జీవి ఉనికిని కనిపెట్టి దయతో ఏలుకొనవయ్యా.  ఇందులో ఇంకొక మర్మము కూడా ఉంది. ఎంచుకొని దైవము వద్దకు చేరుట అనగా ఎదో ఒక మార్గమున్నదని అర్థం. కానీ ఆ పరమాత్మ వద్దకు చేరుటకు మార్గములే లేవు అన్నది విదితమే.

మొదటి చరణం: 
మనసు నమ్మిన సతి మరి యనుమానించదు
ననిచిన వనిత పెనఁగులాడదు
యెనసిన జవరాలు యెరవులుసేయదు
పనుపడి రతులకు బాఁతిపడుఁగాని          ॥మంచి॥ 
భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
మనసు నమ్మిన సతి మరి యనుమానించదు
మగడిని హృదయపూర్వకముగా నమ్మిన సతి తిరిగి తిరిగి అనుమానించదు
నమ్మకము, అనుమానము ఒకేచోట నిలువలేవు. ఒకటి ఉంటే రెండవది ఉండదు.
ననిచిన వనిత పెనఁగులాడదు
(ననిచిన = పూచిన​, పుష్పించిన, పల్లవించిన, చిగిరించిన) హృదయములో ప్రేమ చిగిరించిన వనిత మగనితో చిఱ్ఱుముఱ్ఱులాడదు.
వికాసము చెందిన మనస్సు వాస్తవమును స్వీకరించును. పెనఁగులాడదు.
యెనసిన జవరాలు యెరవులుసేయదు
(ఎరవులుసేయదు = అన్యముగా భావించదు, వేఱుగా చూడదు) మనసిచ్చిన యువతి మగనిని తనకంటే అన్యముగా భావించదు
మనమంతా ఇదికాకపోతే ఇంకొకటైనా చేజిక్కించుకుందామని ఒక పక్క భగవంతుణ్ణి నమ్ముతూనే ఇంకో పక్క ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటాం. ఉన్నదే ఆ ఒక్కడు. భగవంతుడు.  మరి అతడిపై కాక వేరుచూపులేలా?
పనుపడి రతులకు బాఁతిపడుఁగాని
(పనుపడి = అధీనమగు, వశమగు) తనకు తాను మగనికి అధీనమై సంగమమునకు ఎదురు చూచును.
సర్వము జగన్నాథమనుచు జీవన ప్రవాహములో విరోధము లేకుండ సహజముగా కలిసిపోవుట.
గూఢార్థవివరణము:
మనసు నమ్మిన సతి మరి యనుమానించదు: నమ్మకము, అనుమానము పెట్టుడు మాటలు. అవి లేనిదే అసలు నమ్మకము.

ననిచిన వనిత పెనఁగులాడదు: పెనఁగులాట లోపలి ఘర్షణకు సంకేతము.

యెనసిన జవరాలు యెరవులుసేయదు: అటునిటు ఊగు హృదయము వేఱుగా ఉన్నదే. వేఱు భావములేని చోట జవరాలను భావము ఎక్కడ​?

"పనుపడి రతులకు బాఁతిపడుఁగాని": జగన్నాథునిలో మన ఇప్పటి అస్తిత్వమేది?

రెండవ చరణం:
మరిగిన యాఁటది మరి పాయనేరదు
దొరసిన యిల్లాలు దూర దెంతైనా
సరి నిచ్చకపులేమ జరపులఁ బెట్టదు
యిరవైన కాఁపురాన కేఁకారుఁగాని          ॥మంచి॥
భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
మరిగిన యాఁటది మరి పాయనేరదు
మగడిపై తన్మయత్వములో ఉన్న స్త్రీ మరి విడిచి ఉండలేదు.
ఆ అనిర్వచనీయ స్థితిని చేరిన యోగి తిరిగి అలవాటు పడిన పూర్వపు చిత్తవృత్తులలో పడడు.
దొరసిన యిల్లాలు దూర దెంతైనా
అనుభవ జ్ఞానముగల ఇల్లాలు ఎంతకష్టమైనా తనవాడిని నిందించదు.
యోగ స్థితిలోని  బాధను మూగగా అనుభవించునే కానీ అక్షేపములు మోపడు.
సరి నిచ్చకపులేమ జరపులఁ బెట్టదు
(నిచ్చకపులేమ = నిచ్చకపు లేమ = ఇష్టపడిన ఆడది; జరపుల బెట్టదు = తొందర చేయదు, తర్వాత అంటూ వాయిదాలు వేయదు)  సరిగా ఇష్టపడిన ఆడది మగడి కార్యములు తర్వాత అంటూ వాయిదాలు వేయదు 
ఈ ప్రపంచ కార్యములు దైవ కార్యములు అను బేధములలో చిక్కుకొనక  కార్యములు తొందర చేయుచున్నను నిశ్చలుడగును.
యిరవైన కాఁపురాన కేఁకారుఁగాని
(ఇరవు = స్థానము, స్థిరము, సదనము;  ఏకారుఁగాని = మిక్కిలి కోరును గాని, సేవించును గాని, బాధపడును గాని) బాధలువున్నా స్థిరమైన కాపురమును ఆ స్త్రీ మిక్కిలి కోరును గాని
బాధలువున్నా ఆ స్థిరమైన దానిని సేవించును గానీ వేగిర పడడు.
గూఢార్థవివరణము:
"మరిగిన యాఁటది మరి పాయనేరదు": మరిగిన ఈ చిత్తవృత్తులలో తిరుగుట యోగమా?

"దొరసిన యిల్లాలు దూర దెంతైనా": దూరుట = అక్షేపించుట​. బాధ ఉంటే అక్షేపణ  సహజము. అంటే ఇప్పటి చిత్తవృత్తులు పోలేదన్నమాట​.

సరి నిచ్చకపులేమ జరపులఁ బెట్టదు: నేను దేవుణ్ణి కొలుస్తాను. నేను దేవుణ్ణి కొలుస్తూవున్నాను. ఈ భావనలన్నీ మన దేహపు చిత్తవృత్తులు.

అటువంటప్పుడు  "యిరవైన కాఁపురాన కేఁకారుఁగాని" = బాధలువున్నా ఆ స్థిరమైన దానిని సేవించు స్థితి ఏమి?

మూడవ చరణం:
తగులైన కామిని తప్పులేమీ నెంచదు
మొగమిచ్చకపు ఇంతి వెగటాడదు
నిగిడి శ్రీవేంకటేశ నీదేవు లలమేల్మంగ
సొగిసి యీకూఁటముల జొక్కించుఁగాని ॥మంచి॥
భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
తగులైన కామిని తప్పులేమీ నెంచదు
ప్రేమతో మగనిని తగులుకొన్న స్త్రీ అతడి తప్పులనెంచదు.
సర్వాంతర్యామి యందు స్థిరపడిన మనస్సు లోకమును విమర్శించదు.
మొగమిచ్చకపు ఇంతి వెగటాడదు
(మొగమిచ్చకపు = ముఖము ఎదుట సంతోషము కలుగునట్లు పలుకు) ఎదుట సంతోషము కలుగునట్లు పలుకు ఇల్లాలు వెనుకగా తనవాడిని అసహ్యించుకొనదు.
సర్వాంతర్యామిని హృదయపూర్వకముగా స్వీకరించిన యోగి ముందొక మాట వెనుకొక మాట చెప్పడు.
నిగిడి శ్రీవేంకటేశ నీదేవు లలమేల్మంగ
లోపల దాగివున్న శ్రీవేంకటేశ (ఇక్కడి దాకా భక్తుడు). నీవు వెతుకుతున్న అలమేలుమంగ (అభేద భావము అలముకొంది)
ఈ చరాచర జగత్తునకు లోదాగిన అధిపతివైన శ్రీవేంకటేశ (ఇక్కడి దాకా యోగి) నీవు వెతుకుతున్న అలమేలుమంగ (అభేద భావము అలముకొంది)
సొగిసి యీకూఁటముల జొక్కించుఁగాని
ఆ సౌందర్యముతో కూడిన కలయికలను మరింత శోభాయమానముగా చేస్తుంది
ఈ జీవజగత్తుతో సంబంధము ఏకత్వమేకానీ అస్వాభావికములు కల్పితములు కావు. కృత్రిమము తొలగినప్పుడు ఆ సంబంధములోని సొగసు బయటపడును.
గూఢార్థవివరణము:
"తగులైన కామిని తప్పులేమీ నెంచదు": విమర్శించుటకు ఆ కామిని విడిగా ఉంటే కదా?

"మొగమిచ్చకపు ఇంతి వెగటాడదు": యోగికి లోనొకమాట​, పైకొక మాటలేలా?

"నిగిడి శ్రీవేంకటేశ నీదేవు లలమేల్మంగ": కవి శ్రీవేంకటేశుడు లోపల ఉన్నాడనునది గ్రహించిన వెంటనే భేద భావము తొలగిపోయినది.

"సొగిసి యీకూఁటముల జొక్కించుఁగాని": ఈ ప్రపంచముతో మన సంబంధమేమి? ఏకత్వములేని అస్వాభావికములే పని జేయుచున్నవా 

X-X-X THE END X-X-X

Wednesday, 27 May 2026

T-335 చాలుఁ జాలును భోగమయమున మైమఱపు

 తాళ్లపాక అన్నమాచార్యులు
335 చాలుఁ జాలును భోగమయమున మైమఱపు
For English Version Press Here

పరిచయం
 
ఇది నిస్సంశయముగా శృంగార కీర్తన అయినప్పటికీ వలపు తెరల వెనుక తాత్విక మలుపులలో పయనింప జేస్తారు. అసలు ఆయనకు ఇటువంటి పచ్చి శృంగార కీర్తనలలో మనము లీనమైనపుడు,  భోగము మైమరపులో ఆత్మ రక్షణ కొంత సడలి చెప్పిన విషయము  కొంతైనా లోపలిదాకా వెళ్ళునని కాబోలు. కీచక వధ కూడా వలపు ముసుగులో మొదలైన విషయము కూడా గమనించ వచ్చును. దాదాపు సమ ఉజ్జీలలో విజయం ఎటువైపైనా మారవచ్చును. ఇదే సమత్వంలోని తంటా.

మనిషి తన అంతరంగపు అసంపూర్ణతను, ఒంటరితనాన్ని స్వయంగా ఎదుర్కోలేక చేయునది నేను అనే భారాన్ని దించుకొనుటకు భోగములలో మైమరచుటకు ప్రయత్నించుట అన్న విషయంఈ కీర్తనలో అంతర్లీనమై కనిపిస్తుంది. 

శృంగార సంకీర్తన 

రాగి రేకు: 8-2  సంపుటము - సంకీర్తన: 5-45
చాలుఁ జాలును భోగమయమున మైమఱపు-
పాలుపడునట యేఁటి బ్రదుకురా వోరి              ॥పల్లవి॥

ఇందుమఖి నిను గౌఁగిలించి లోపలి జగము
కందునని నీ బిగువుఁ గౌఁగిలే వదలె
పొందైన వారితోఁ బొసఁగఁ గౌఁగిఁట జేర్పఁ
బొందుగాదట యేఁటి పొందురా వోరి   ॥చాలు॥

నెలఁత నీ వాలుఁగన్నులు మూసి జగమెల్లఁ
గలయఁ జీఁకట్లైన గక్కనను వదలె
వలచినంగనలు తమ వలసిన విలాసముల-
వలను నెరపని దేఁటి వలపురా వోరి   ॥చాలు॥

కొమ్మ నీవురముపై గోరు దివియుచు నాత్మ-
నిమ్మైన ననుఁదాక నిద్దరిని దాఁకె
దిమ్మరివి కోనేటితిమ్మ నీపైఁ బ్రియము
కుమ్మరించని దేఁటి కోర్కిరా వోరి        ॥చాలు॥
Details and Explanations:
పల్లవి:
చాలుఁ జాలును భోగమయమున మైమఱపు-
పాలుపడునట యేఁటి బ్రదుకురా వోరి          ॥పల్లవి॥ 
భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
చాలుఁ జాలును భోగమయమున మైమఱపు-
ఎంత భోగించినా అందులోనే మైమరచుటకు
దేనిని మైమరచుటకు భోగమయమై ఉందువో
పాలుపడునట యేఁటి బ్రదుకురా వోరి
(పాలుపడు = పూనుకొను, పైనవేసికొను, స్వాధీనమగు)
(దాని) కోసం బ్రతుకును అర్పించుట ఏందుకురా?
దానికే స్వాధీనమై బ్రదుకుట  ఎందుకురా? 
గూఢార్థవివరణము:

అన్ని భోగ సమయములలో కొంత మైమఱపు మనమంతా గమనించే ఉంటాం. ముఖ్యంగా కామములో ఇది మరింత వశము తప్పుతుంది. అన్నమాచార్యులు ఈ పల్లవిలో "దేనిని మైమరచుటకు భోగమయమై ఉందువో" అని గుంభనగా చొప్పించారు.
 
ఈ పల్లవిలో గమనించ వలసినది గొఱ్ఱె కసాయి వాణ్ణి నమ్మినట్లు, దేనిని మరచుటకు భోగమలను స్వీకరించుచున్నాడో దానిలోకే శరణంటాడు మానవుడు.

Bottom of Form


మొదటి చరణం: 
ఇందుమఖి నిను గౌఁగిలించి లోపలి జగము
కందునని నీ బిగువుఁ గౌఁగిలే వదలె
పొందైన వారితోఁ బొసఁగఁ గౌఁగిఁట జేర్పఁ
బొందుగాదట యేఁటి పొందురా వోరి          ॥చాలు॥ 
భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
ఇందుమఖి నిను గౌఁగిలించి లోపలి జగము కందునని
ఎంతో ఇష్టంతో చేరి కౌగిలించుకొన్న ఇందువదన తన సుకుమారతను యోచించి సౌందర్యము కందిపోవునని (నలుపెక్కునని)
ఆ మత్తును కొనసాగించుటకు నీకివ్వ బడిన ఈ శరీరము సుకుమారతను సాధ్యాసాధ్యాలను విచారించి
నీ బిగువుఁ గౌఁగిలే వదలె
నీ కౌగిలిని విడుచును. నీవు కోరినది దొరకినా అది నీ పట్టులో ఉండదు
ఆ జీవి తన విచారణలో దాని చుట్టూను జగమంతాను వున్న నీకౌగిలిని విడుచును.
పొందైన వారితోఁ బొసఁగఁ గౌఁగిఁట జేర్పఁ
(పొందు =ప్రాప్తింౘు, స్నేహము, ఆనుకూల్యము)  ఒకవేళ పొందిన అనుకూలవతిని చక్కగా గౌఁగిఁట తేల్చినా.    
పోనీ, ఉన్నదానితో సర్దుకుని భోగించ చూచినా
బొందుగాదట యేఁటి పొందురా వోరి
అయినా​ అది స్నేహము కాదట. నిజమైన పొందు ఏమిటో?    
అయినా​ అది బంధుత్వం కాదట. అసలైన చుట్టరికం ఏమిటో?
 గూఢార్థవివరణము: 
మనిషి 'తను ఏమిటి, తన సామర్థ్యం ఎంత' వంటి కొలతలతో జీవితాన్ని అంచనా వేయబోతాడు. ముఖ్యంగా తన సుకుమారతను సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయించబోతాడు. ఆ విచారణ కేవలము అతని అంచనా మాత్రమే. ఆ విచారణలో ఆ జీవి తనను చుట్టుముట్టివున్న జగమంతటిని ప్రక్కకుపెట్టి తనకు తెలిసిన చిన్ని నిజమే ఆధారముగా ముందుకువెళతాడు. సత్యమును (నీ కౌగిలిని) విడుచును. ఈ విధముగా సత్య సాధనలో మొదటి, కానీ అతి కీలకమగు తడబాటును మన ముందుంచారు.

పోనీయని ఉన్నదానితో సర్దుకుని భోగించ చూచినా అందులోని ఏర్పాటు ఎదోరకముగా బీఁటలువారుతుంది. మరి పగులువాఱని చుట్టరికం ఏమిటో? అన్ని అమరికలు ఎదో ఒక సమయంలో బద్దలగునవే.

రెండవ చరణం:
నెలఁత నీ వాలుఁగన్నులు మూసి జగమెల్లఁ
గలయఁ జీఁకట్లైన గక్కనను వదలె
వలచినంగనలు తమ వలసిన విలాసముల-
వలను నెరపని దేఁటి వలపురా వోరి          ॥చాలు॥ 
భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
నెలఁత నీ వాలుఁగన్నులు మూసి జగమెల్లఁ
ఓ నెలఁత నీవు కనులు మూసుకుని జగమంతా
ఓ జీవుడా నీవు కనులకు తెరలు కప్పుకుని ఎక్కడెక్కడ తిరిగి ఏం ప్రయోజనం?
గలయఁ జీఁకట్లైన గక్కనను వదలె
నీవెంత కలయ   దిరిగినా కనపడునది మూసిన కనుల చీకట్లే. గక్కనను వదలు.  
కనులు తెరిచినా కదా చీకట్లు విప్పుకునేది?
వలచినంగనలు తమ వలసిన విలాసముల-
వలచిన అంగనలకు తమకు వలసిన విలాసముల    
నీ కోరికలు విలాసముల
వలను నెరపని దేఁటి వలపురా వోరి
(వలను= దిక్కు, నేర్పు, ఉపాయం, ప్రదక్షిణము) ఉపాయంగా నెరవేర్చనిది ఏమి వలపురా?   
చుట్టూ ప్రదక్షిణములు చేయునది వలపు అంటావా?.
గూఢార్థవివరణము: 
మనసులోని పొరలు కనుల ముందటి దానిని చూడ నివ్వక తడబడుటను చూపారు. మాహాత్ములందరు సత్యము ఎదురుగానే ఉన్నదని చెప్పినా మనము చూడలేక తచ్చాడుతూనే ఉన్నాము. సత్య సాధనలో రెండవ విషయం ఇలా చూపారు. కోరికలు విలాసముల చుట్టూ ప్రదక్షిణములతో మనసు ఏకాగ్రత లేక  కనులు మూసిన సంగతి కూడా గ్రహించలేనిదగును.

మూడవ చరణం:
కొమ్మ నీవురముపై గోరు దివియుచు నాత్మ-
నిమ్మైన ననుఁదాక నిద్దరిని దాఁకె
దిమ్మరివి కోనేటితిమ్మ నీపైఁ బ్రియము
కుమ్మరించని దేఁటి కోర్కిరా వోరి          ॥చాలు॥ 
భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
కొమ్మ నీవురముపై గోరు దివియుచు నాత్మ-
(కొమ్మ= చక్కనిది) ఆ చక్కనిది (లక్ష్మీదేవి) నీ వక్షము పై కోరి ఆత్మలో దీపములా
ఒక్కసారిగా ఆ చక్కని వెలుగు నాపై కటాక్షీంచగా నా హృదయంలో-
నిమ్మైన ననుఁదాక నిద్దరిని దాఁకె
(ఇమ్మైన = పూర్తిగా, రుచించునట్లుగా completely closely) పూర్తిగా, రుచించునట్లుగా నన్ను తాకగా నిన్ను కూడా తాకినట్లయ్యెను.
సంపూర్ణముగా ఏ మాత్రము సందులేకుండ అలుముకొనగా మనిద్దరిని - నిన్ను నన్ను కూడా తాకినట్లయ్యెను.
దిమ్మరివి కోనేటితిమ్మ నీపైఁ బ్రియము
తిరుగుబోతువి! ఓ  కోనేటితిమ్మ రాయడా నీపై ప్రేమ-
నువ్వెక్కడుంటావో తెలియదు. కానీ ఓ  కోనేటితిమ్మ రాయడా నీపై ప్రేమ
కుమ్మరించని దేఁటి కోర్కిరా వోరి
-కుమ్మరించనిది కూడా ప్రేమేనా?
కాక ఇతరులపై కుమ్మరించినది కూడా ప్రేమేనా?
 గూఢార్థవివరణము:
ఈ చరణములో అన్నమాచార్యులు తీక్షణమైన సత్యమును ముందుంచారు. భగవంతుడెక్కడుంటాడో తెలియదు. కానీ, ఇతరులపై కుమ్మరించు ప్రేమలో మనిషికి తాను వెదుకుచున్న సంపూర్ణత దొరకునా?  కనులు తెరువకుండ చుట్టూ గాఢంగా కౌగిలివలె కప్పి ఉన్న దానిని తెలియలేము. కనులు తెరుచుటకు, మూసియుండుటకు మధ్య వ్యత్యాసమేమి? "కన్ను దెరచుటొకటి కనుమూయుటొకటే" అని ఆచార్యులు ఊరకనే అనలేదే! 

X-X-X THE END X-X-X

Sunday, 24 May 2026

T-334 ఓహోహో యనరో పారి

 తాళ్లపాక పెదతిరుమలాచార్యులు
334 ఓహోహో యనరో పారి

పరిచయం

 

ఓహోహో యనరో పారి” అనేది కేవలం ఒక భక్తి కీర్తన కాదు; కొద్దిపాటి పదాలలో బంధించబడిన ఒక సజీవ అంతరంగ వాతావరణము. మనిషిని ఆవరించియుండు మానసిక మండలము లోకి ప్రవేశపెట్టబడతాం. తాళ్ళపాక పెదతిరుమలాచార్యులు ఇక్కడ తత్వశాస్త్రాలను నిర్మించరు; సిద్ధాంతాలను వివరించరు. బదులుగా, మనిషిని ఒక విచిత్రమైన, అపారమైన నిజ స్థితిలో నిలబెడతారు — అక్కడ కదలిక ఉన్నా అయోగ్యత లేదు; జాగరూకత ఉన్నా కలత లేదు; శబ్దం ఉన్నా లోపల నిశ్శబ్దం మరింతగా గాఢమవుతుంది.

ఈ కీర్తన అసాధ్యముగా అనిపించే ఒక అంతరంగపు మలుపులా విప్పారుతుంది. మూసివేయబడిన ద్వారములు ఎదురౌతాయి. అక్కడ భేరి ఉండదు కానీ, తనను తాను భేరిలా లేదా సాధనములా చూడవలసి వచ్చును. ధైర్యముతో కదలవలసి ఉంటుంది — కానీ ఆ కదలికలో మానసిక అలజడి లేకుండా. ఆ రకముగా పోగా పోగా మనసులో నిలిపిన దేవతల రూపాలు, పై స్థితులు అన్నీ తమంతట అవే తొలగిపోతాయి. కవికి జీవన ద్వంద్వములు సూర్యచంద్రులు ఒకేసారి ఎదురెదురుగా కనపడినట్లు గమనిస్తాడు. చివరకు, శ్రీ వేంకటేశ్వరుడు అంతరంగ చైతన్యముగానే మేల్కొనినట్లు అనిపిస్తుంది.


ఈ సమస్తమును కవి తాత్విక పదజాలముతో కాదు; జీవముప్పొంగే  పదములతో, శబ్ద స్పందనలతో, లయతో, గూఢమైన దృశ్యాలతో, చెప్పలేని మానసిక కూర్పుతో వ్యక్తపరుస్తారు. ఈ కీర్తన ఒక అంతరంగ ప్రయోగశాలవలె పనిచేస్తుంది. ఇందులో పాఠకునికి ఏమి ఆలోచించాలో చెప్పబడదు; కానీ అతనిని ఒక అప్రమత్తమైన, కొలవలేని నిశ్శబ్ద వాతావరణంలో నిలబెడుతుంది.

ఈ కీర్తనలోని అనేక పదబంధాలు “తందనాన ఆహి” వలె కేవలం నిఘంటు అర్థములతో పూర్తిగా పట్టుబడవు. వాటి శబ్దము, లయ, అంతరంగ స్పందనలే ఒక ప్రత్యేకమైన స్పష్టతను కలిగిస్తాయి.

ఈ విధంగా పెదతిరుమలాచార్యులు సాధారణ తెలుగు పదాలలో జీవించియున్న కదలికను నిక్షిప్తం చేసారు. సత్యము పట్టి ఉంచరానిదైననూ అసాధ్యమును సుసాధ్యం చేశారనిపించును. శతాబ్దాల తరువాత కూడా ఈ కీర్తన ఇంకా శ్వాసిస్తూనే ఉంది; ఆ శ్వాసలో భాసిస్తున్నది తెలుగు భాష​. కఠిన కలములలో లోహపు రేకులమీద మృదువుగా జీవించి వున్న భాష​. ఇది కాక ఈ జడమయ ప్రపంచములో “ఓహోహో” అనిపించే ఆశ్చర్యములో నిలబెట్టు విషయములేవి? కేవలము ఆత్మతృప్తికై తహతహలాడే క్షణిక వ్యాపకాలు గాక.”

అధ్యాత్మ సంకీర్తన
రాగి రేకు: 90-1  సంపుటము - సంకీర్తన: 1-441
ఓహోహో యనరో పారి
సాహసానఁ దిరుగరో జంటపారి           ॥పల్లవి॥

కోనేటిరాయఁడు కోరి నిద్రించీ వాఁడే
ఆనకమై జాలీయరో ఆఁడు బారీ
పేనిపట్టి వాకిళ్ళ బీగముద్రలాయ నిడి
కానిమ్మని వాయించరో గంట పారి       ॥ఓహో॥

తిరుపణి మణఁగెను తిరుగరా దెవ్వరికి
మరల నెలుగియ్యరో మగపారి
పరగ దేవత లెల్ల బడకెళ మున్నారు
యిరవాయ సూర్యచంద్రు లెదురు పారి            ॥ఓ హో॥

శ్రీ వేంకటేశ్వరుఁడు చిత్తగించీ లోననదె
కోవర మెన్నికెరో కోటిపారి
ఆవల బంగారుగుదియలు ఘల్లు రనఁగా
తావుల హనుమంతునితలారి పారి     ॥ఓహో॥
Details and Explanations:
పల్లవి:
ఓహోహో యనరో పారి
సాహసానఁ దిరుగరో జంటపారి ॥పల్లవి॥
భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
ఓహోహో యనరో పారి
ఓ జనులారా! దీనిని జాగ్రత్తగా చూడండి. “ఓహోహో” అని ఆశ్చర్యపడుదురు.
ఓ జనులారా! దీనిని ప్రత్యక్షముగా గమనించండి. అపుడా సాధారణ ఆలోచనలకు అందని సత్యమును తాకినపుడు కలిగే విస్మయములో మీరే ఓహోహో  అందురు.
సాహసానఁ దిరుగరో జంటపారి
ధైర్యముతో కదలండి. ఇది జంటగా కనబడుతుంది.
తెలిసిన మానసిక ప్రపంచమును వదలుటకు అపారమైన అంతరంగ సాహసం అవసరమై ఉండవచ్చును. “జంటపారి” అనగా ఒకే సారి జంటగా చూచు అని అర్థం. అనగా చూచువాడూ, 'అపరిమితము' వేరుగా కాక ఒకే క్షేత్రము నుండి ఒకే సారి జంటగా చూచుట- ఒకే దృష్టితో చూచుట​.
గూఢార్థవివరణము:
ఈ పల్లవి మనస్సు యొక్క అంతరంగ వాతావరణాన్ని సజీవముగా సూచించు ఒక చిత్రపటమువలె కనిపిస్తుంది. తాళ్ళపాక పెదతిరుమలాచార్యులు ఇక్కడ ప్రయత్నములతో, ఆలోచనలతో, బాహ్యప్రేరేపణలతో​, శాస్త్రపరిజ్ఞానములతో చేరలేని ఒక అంతరంగ కదలికను సూచించినట్లు అనిపిస్తుంది.

ఓహోహో” అనేది కేవలం ఆశ్చర్యోద్గారము కాదు. మనస్సు తనకు తెలిసిన జ్ఞానముతో పూర్తిగా పట్టుకోలేని వాస్తవాన్ని తాకినప్పుడు కలిగే విస్మయ స్పందన కావచ్చును. "ఓహోహో"లు మనము చెప్పలేనిది, మనసు విప్పలేనిది, శాస్త్రము అంటలేనిది ప్రత్యక్షంగా ఎదురైనప్పుడు అనుకోకుండానే వచ్చేస్తాయి.

సాహసానఁ దిరుగరో” అనగా సాధారణ ధైర్యము కాదు. మనిషి తనకు తెలిసిన మానసిక భద్రతలను, అలవాట్లను, కూడబెట్టుకున్న నిర్ణయాలను, తెలిసిన ఆలోచనా నిర్మాణాలను దాటి కదలుటకు కావలసిన అంతరంగ సాహసం కావచ్చును. ఇక్కడ కదలిక ఉన్నా అది అయోగ్యత కాదు; వెతుకులాట ఉన్నా అది ఫలాపేక్షతో కూడిన ప్రయత్నం కాదు. ఇది అప్రమత్తమైన అంతర్ముఖ గమనిక.

జంటపారి” (=జంటగా కదలుట) ఈ పల్లవిలో అత్యంత సూక్ష్మమైన పదబంధముగా కనిపిస్తుంది. లోతుగా చూస్తే చూచువాడూ, చూడబడునదీ వేరుగా లేవని కావచ్చును. అంటే ఆ గమనించుట స్వయంగా ఒకే క్షేత్రములో నుండే జరుగుతున్నట్లు. అప్పుడు అంతరంగపు చలనము, బాహ్య దృశ్యముపై అవగాహన ఏకమౌను.


మొత్తంమీద ఈ పల్లవి ఒక తాత్విక ప్రకటనకన్నా, ఒక విచిత్రమైన అంతరంగ వాతావరణాన్ని సృష్టిస్తుంది. శబ్దము, లయ, పునరుక్తి, అంతరంగ ఉద్రిక్తతల ద్వారా కవి మనస్సును దాని అలవాటైన వ్యాపకాల నుండి నెమ్మదిగా వేరుచేస్తున్నట్లు కనిపిస్తుంది. “తందనాన ఆహి” వలెనే ఇక్కడి పదబంధాలు కూడా కేవలం నిఘంటు అర్థములతో పూర్తిగా పట్టుబడవు. వాటి ధ్వని, లయ, అంతరంగ స్పందనలే ఒక ప్రత్యేకమైన స్పష్టతను కలిగిస్తున్నట్లు అనిపిస్తుంది.

Bottom of Form


మొదటి చరణం:
కోనేటిరాయఁడు కోరి నిద్రించీ వాఁడే
ఆనకమై జాలీయరో ఆఁడు బారీ
పేనిపట్టి వాకిళ్ళ బీగముద్రలాయ నిడి
కానిమ్మని వాయించరో గంట పారి          ॥ఓహో॥ 
భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
కోనేటిరాయఁడు కోరి నిద్రించీ వాఁడే
అంతరంగములోని కోనేటిరాయుడు తనంతట తానే నిద్రలోనికి వెళ్లియున్నాడు.
కోనేటిరాయుడు తనంతట తానే ఏ విధమైన అంచనాలకు అందని, చేరలేని స్థానములో ఉన్నాడని, అదియు నిద్రస్థితిలో ఉన్నాడని గ్రహించవలెను.
ఆనకమై జాలీయరో ఆఁడు బారీ
(ఆనకము = తప్పెట; భేరి; మద్దెల; ఉఱిమెడి మబ్బు) మీరు భేరిలా మారి జాగ్రత్తగా మీ వంతు పాత్రను పోషించండి.
“ఆనకమై” అనగా తానే వాద్యముగా మారుట. (కవి ఇక్కడ నిమిత్త మాత్రుడైనాడు) తాను వాద్యము మాత్రమే. వాయించునది వేరొకరు. తన వంతు పాత్ర వాద్యముగా, వాయించువానికి అనుగుణముగా సహకారమివ్వడమే. తనకు తాను దైవము చేతిలోని బొమ్మగా మారుట​.
పేనిపట్టి వాకిళ్ళ బీగముద్రలాయ నిడి
ద్వారములు బలముగా మూయబడి ముద్రించబడియున్నవి.
సాధారణ మార్గముల ద్వారా ఆ అంతరంగ స్థితిని చేరుట సాధ్యము కాదు. బాహ్యప్రవేశములకు మార్గములన్నీ మూయబడినట్లుగా కనిపిస్తుంది. అంటే దైవము చేతిలోని బొమ్మగా మారుట కూడా సులభము కాదు.
కానిమ్మని వాయించరో గంట పారి
అయినప్పటికీ వంతుల ప్రకారము గంటలు మోగించుచు అప్రమత్తముగా ఉండండి.
నీ వంతు పాత్ర నిరాఘాటముగా చేసుకొనిపోతూనే వుండు. అదే అంతరంగ జాగరూకత.
 గూఢార్థవివరణము: 
ఈ చరణములో తాళ్ళపాక పెదతిరుమలాచార్యులు అంతరంగంలోని కాపాడడుతున్న  నిశ్చల వాతావరణంలో వున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ భక్తి బాహ్యాచారముగా నిలవదు; కవికీ, భక్తికీ మధ్యనున్న వ్యత్యాసం క్రమేపి సమసిపోతుంది. కవి మనను తన ప్రక్కన నిలబెట్టుకొని అక్కడ జరుగుతున్నది చూపిస్తున్నట్లుగా ఉంది. అక్కడ చూపుటకు దృశ్యమేమీ లేదు. కేవలము శూన్యత​.

కోనేటిరాయఁడు కోరి నిద్రించీ వాఁడే” అనగా కోనేటిరాయఁడు ప్రచ్ఛన్నమైనవాడు అని అర్థం. ఇది సాధారణ భౌతిక, మానసిక వ్యాపకాలతో చేరలేని స్థితి కావచ్చును. “కోరి” అనే పదముదాగి వుండడము కంటే ప్రవేశము కఠినమని చెబుతోంది. ఇక్కడ “నిద్ర” అనేది అలసట కాదు; జీవితపు అలజడులకు అతీతమైన ఒక మౌన స్థితి.

ఆనకమై జాలీయరో” ఈ చరణములో అత్యంత కీలకమైన పదబంధము. “ఆనకము” అనగా భేరి, మద్దెల, ఘోష, ఉరుము వంటి మహా వాద్యములు.  "ఆనకమై" అంటే కవి వాద్యము క్రింద ఉపయోగించబడతాడు. అనగా అక్కడ నిమిత్తము అనగా గుఱుతుగా మాత్రమే ఉన్నాడు. "జాలీయరో"( = జాలి ఇయరో ) = జాలిని వదలిపెట్టేయమని సూచన. మనిషి తనకేమౌనోయన్న ఆతృతను వదలమని అర్థం. ఇకపోతే, “ఆనకమై జాలీయరో” అన్నది మన ఇప్పటి భావనలలో దేనితోను కలవదు. అన్ని సందేహములు వదలి "శరణు" అని తక్కినది పరమాత్మకు వదలిపెట్టిన స్థితి. ​

పేనిపట్టి వాకిళ్ళ బీగముద్రలాయ నిడి” ఈ అంతరంగ వాతావరణాన్ని మరింత జటిలం చేస్తుంది. ద్వారములు మూయబడియున్నవి. సాధారణ ప్రవేశ మార్గములు లేవు. బయట నుండి తెరుచు తాళంచెవి లేదు. లోపలికి వెళ్ళు మార్గములు లేవు. అసాధ్యమై స్థితి. ఇక్కడ "కలలోని సుఖమే కలియుగమా" అను కీర్తన నుండి ఈ మాటలు తిరిగి చూడడం ఉచితము. (గడి = ఎల్ల , హద్దు; గడిచీటియిచ్చు = విడుదల పత్రమిచ్చు) గడిచీటియును నీవు = హద్దును నిర్ణయించేది, ఒక హద్దు పూర్తి యైనదని తెలిపెడు వాడు ఒకడే అని అర్థం.  ఇక్కడ పెదతిరుమలాచార్యులు అందించిన చరణంలో (చిత్రములో) తాళంచెవి లేక తలుపులు తెరువబడవు. అక్కడ తాళం, తాళంచెవి రెండు కూడ మానవుడే అని తాత్పర్యం.

కానిమ్మని వాయించరో గంట పారి (= అయినప్పటికీ వంతుల ప్రకారము గంటలు మోగించుచు అప్రమత్తముగా ఉండండి). ద్వారా కవి అప్రమత్తతను నిలుపుతాడు. నిశ్శబ్దములో కూడా జాగృతి నిలిచి ఉండాలి.

ఈ విధంగా ఈ చరణము రెండు ముఖ్య విషయములను చెబుతోంది. అపారమైన అంతరంగ నిశ్చలత మధ్యనే అసాధ్యమైన పనులు జేయవలెను. తాను పరమాత్మకు సాధనముగా మారవలెను. రెండవది మూసిన తలుపులను దాటవలెను. మొత్తంమీద ఈ చరణము తాత్విక వివరణకన్నా జీవునకు తారసపడు దుర్లభమైన ఎంపికను ముందుంచారు. ఈ చరణము అక్కడి సజీవ ఉద్రిక్తతను ప్రత్యక్షముగా అనుభూతి చేయిస్తుంది.

రెండవ చరణం:
తిరుపణి మణఁగెను తిరుగరా దెవ్వరికి
మరల నెలుగియ్యరో మగపారి
పరగ దేవత లెల్ల బడకెళ మున్నారు
యిరవాయ సూర్యచంద్రు లెదురు పారి          ॥ఓహో॥
భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
తిరుపణి మణఁగెను తిరుగరా దెవ్వరికి
ఆలయ సేవలు, సంచారములు నిశ్శబ్దమయ్యాయి. ఇక ఎవరూ తిరుగవద్దు.
తిరుపణి”ని ఇక్కడ కవి యొక్క అంతరంగముగా భావించవచ్చును. మనస్సు యొక్క నిత్య కదలికలు, అలవాట్లు, వ్యాపకాలు తగ్గుతున్న స్థితి. ఇప్పుడు మనస్సు కూడా సావధాన పడి  జాగ్రత్తగా మసలుకుంటోంది
మరల నెలుగియ్యరో మగపారి
మళ్లీ కలతలు, శబ్దములు రానీయవద్దు.
ఈ నిశ్చలతను తాకిన తరువాత పాత మానసిక అలజడులు, అలవాటైన భావోద్వేగ కదలికల లోకి మళ్లీ జారనీయవద్దు.
పరగ దేవత లెల్ల బడకెళ మున్నారు
ఆ సందర్భానికి తగినట్లుగా దేవతలందరూ అలసటతో విశ్రాంతి తీసుకుంటున్నారు.
అనేకానేక అంతరంగపు పొరలలో నిక్షిప్తమై ఉన్న ఆధ్యాత్మిక ఆకాంక్షలు, దేవతాసంకల్పములు, ఉన్నత భావనలు కూడా సర్దుమణిగినట్లు కవి గమనిస్తున్నాడు.
యిరవాయ సూర్యచంద్రు లెదురు పారి
సూర్య చంద్రులు పరస్పరం ఎదురెదురుగా నిలిచియున్నారు.
జీవన ద్వంద్వములు — వెలుగు-చీకటి, కదలిక-నిశ్చలత, మేల్కొలుపు-మౌనం — ఒకే క్షేత్రములో ప్రత్యక్షముగా కనిపిస్తున్న స్థితి. “ఎదురు పారి” అనగా విభేదము కాదు; విభజనలేని ప్రత్యక్ష గమనిక.
గూఢార్థవివరణము:
ఈ చరణములో పెదతిరుమలాచార్యుల సజీవ వ్యాఖ్యానము మరింత లోపలికి ప్రవేశించినట్లు కనిపిస్తుంది. ఇక్కడ పేర్కొన్న ఆలయ వాతావరణము ఒక్క సారిగా కవి హృదయ తరంగములలో కలిసిపోతుంది. వారి మదిలో మెదలు ఆలోచనలు మనకు అవగతమౌతాయి. ఇంత కంటే సజీవచిత్రము చూపినవారు అరుదు. ​ క్రమేపి ఆలోచనలు తమ క్రియాశీలత కోల్పోయి ఒక అపారమైన నిశ్చలతలో నిలుచుటను గమనించవచ్చును.

తిరుపణి మణఁగెను తిరుగరా దెవ్వరికి” పైకి చూస్తే ఆలయ సేవలు ఆగిపోయినట్లు కనిపిస్తుంది. అయితే ఇక్కడ “తిరుపణి”ని కవి యొక్క అంతరంగ క్షేత్రముగా భావించవచ్చును. ఈ ప్రత్యక్ష దర్శన వ్యాఖ్యానములో కవి యొక్క మనోకదలికలు, ఆలోచనలు సాయంకాలపు సమయంలో పక్షులు తమతమ గూళ్ళ మీదకు వచ్చి వాలినట్లు అవి అక్కడే విశ్రాంతిగా ఆగినట్లు కనబడుచున్నది.

మరల నెలుగియ్యరో మగపారి” ద్వారా కవి ఒక సూక్ష్మ హెచ్చరికను అందిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ అంతరంగ నిశ్చలతను స్పృశించిన తరువాత పాత మానసిక అలజడులు, భావోద్వేగపు అలవాట్లు, తెలిసిన ప్రపంచపు ఆకర్షణలు మళ్లీ మేల్కొననీయవద్దు. నిశ్శబ్దమును స్పృశించిన మనస్సుకు మళ్లీ అలజడి అసహజముగా అనిపించవచ్చును.

పరగ దేవత లెల్ల బడకెళ మున్నారు” కవి "దేవతలను కూడా విశ్రాంతిలో ఉన్నట్లుగా గమనించడం" గమనార్హం. అన్నమాచార్యుల వలెనే పెదతిరుమలాచార్యుల వారు మనసులోని అనేక పొరలు ఉన్నట్లు చెబుతున్నారు. ఒక్కోపొర ఒక్కో ఆలోచనకు ఒక్కో అనుభవానికి ప్రతీక అనుకోవచ్చును. ఈ పొరలలోనే ఆధ్యాత్మిక ఆకాంక్షలు, దేవతాసంకల్పములు, ఉన్నత భావనలు కూడా పొందు పరచి వుంటాయి. వారు నిద్రాణ స్థితిలో ఉన్న వీటన్నింటిని దాటి వెళ్ళినట్లు తెలుస్తోంది. ఆ అపార నిశ్చలత ముందు కవి మనస్సులోని అలజడి అంతా క్రమేపి మౌనమవుతున్నట్లు కనిపిస్తుంది. ఈ విధంగా కీర్తన సాధారణ భక్తి ఊహలను దాటి ప్రత్యక్ష అంతరంగ గమనికలోనికి ప్రవేశిస్తుంది.

యిరవాయ సూర్యచంద్రు లెదురు పారి” ఈ చరణములో అత్యంత ఆశ్చర్యకరమైన పదబంధములలో ఒకటి. మనకు జీవన ద్వంద్వములలో ఒకటి తెలిస్తే రెండవది మసకబారి ఉంటుంది. వానిలో ఒకటియే మనకు స్పష్టం. ఇక్కడ కవి జీవన ద్వంద్వములను నేరుగా చూస్తున్నారు:
•         వెలుగు మరియు చీకటి,
         మేల్కొలుపు మరియు మౌనం,
         కదలిక మరియు నిశ్చలత.

ఎదురు పారి” అనగా ఇక్కడ విభేదము కాదు; విభజనలేని ప్రత్యక్ష అవగాహన. ద్వంద్వములు ఒకదానితో ఒకటి పోరాడకుండా, ఒకే క్షేత్రములో సమకాలికముగా కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది.

మొత్తంమీద ఈ చరణము తాత్విక వివరణకన్నా అంతరంగ నిశ్శబ్దమును ప్రత్యక్షముగా అనుభూతి చేయిస్తుంది. “తందనాన ఆహి” వలెనే, ఇక్కడి పదముల ధ్వని, లయ, మౌన ఒత్తిడి మనస్సును నెమ్మదిగా ఒక విచిత్రమైన అంతర్ముఖ స్థితిలో నిలబెడుతున్నట్లు అనిపిస్తుంది.

మూడవ చరణం:
శ్రీ వేంకటేశ్వరుఁడు చిత్తగించీ లోననదె
కోవర మెన్నికెరో కోటిపారి
ఆవల బంగారుగుదియలు ఘల్లు రనఁగా
తావుల హనుమంతునితలారి పారి          ॥ఓహో॥ 
భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
శ్రీ వేంకటేశ్వరుఁడు చిత్తగించీ లోననదె
శ్రీ వేంకటేశ్వరుడు నా మనస్సును ఆలకించినట్లు అనిపిస్తోంది.
కవి హృదయములో ఇంతవరకు నిద్రాణమై ఉన్న  కోనేటిరాయుడు మేల్కొన్నట్లు కనిపిస్తుంది. ఇప్పటి వరకు కేంద్రముగా ఉన్న "నేను" తెరమరుగైంది.
కోవర మెన్నికెరో కోటిపారి
(కోవరము = వృక్షాగ్రములకెక్కి శత్రువులను గమనించుట, జాగ్రత్త; ఎన్నికెరో = లెక్కించుట, నిర్ణయించుట; కోటిపారి = కోటిసార్లు) ఎంతో జాగ్రత్తగా గమనించినా వేంకటేశ్వరుఁడు చిత్తగించిన విషయమును ఎవరూ పూర్తిగా నిర్ణయింపలేరు.
వేంకటేశ్వరుఁడు చిత్తగించిన విషయమును నిర్ధారించలేను. ఈ అంతరంగ అపారతను ఎన్ని జాగ్రత్తలు, లెక్కలు, పరిశీలనలు చేసినా పూర్తిగా పట్టుకొనుట సాధ్యము కాదు.
ఆవల బంగారుగుదియలు ఘల్లు రనఁగా
అటువైపు బంగారు గజ్జెల శబ్దములు వినిపిస్తున్నవి.
అంతరంగ నిశ్చలత మధ్య కూడా జీవ వైభవము స్పష్టంగా తెలుయుచున్నది.
తావుల హనుమంతుని తలారి పారి
(తావు = స్థానం, ఆధారం; హనుమంతుడు = నమ్మకమైన సేవకుడు; తలారి = కాపలాదారు) తమ తమ స్థానాలలో కాపలాదారులు అప్రమత్తముగా ఉన్నారు.
అంతరంగ జాగరూకత నిరంతర కాపలాదారివలె నిలిచి ఉంది. “హనుమంతుడు” ఇక్కడ నిష్ఠ, సేవ, అప్రమత్తతలకు ప్రతీక కావచ్చును.

గూఢార్థవివరణము:
ఈ చరణములో పెదతిరుమలాచార్యులు కీర్తన అంతటా నిర్మించిన అంతరంగ వాతావరణం నిశ్చలత నుండి ఇప్పుడు చైతన్యములో సజీవమై నిలిచింది.  ఇక్కడ కవి, భక్తి, వేంకటేశ్వరుడు అన్న విభజనలు కృశించి, ఇప్పటి వరకు కేంద్రబిందువుగా నిలిచిన “నేను” వెనుకకు జరిగి, వేరొక అపారమైన చైతన్య స్థితికి దారి ఇస్తుంది.

శ్రీ వేంకటేశ్వరుఁడు చిత్తగించీ లోననదె” అనగా కేవలము దేవుడు ప్రార్థన ఆలకించడమే కాదు. ఇంతవరకు నిద్రాణమై, అందనట్టుగా ఉన్న “కోనేటిరాయుడు” స్వయంగా చైతన్యములోకి  ప్రవేశించాడు. ఇక్కడ “లోననదె” అనే పదము ఈ సంఘటన బాహ్యములో కాదు; ప్రత్యక్ష అంతరంగ చైతన్యములోనే సంభవిస్తున్నదని సూచిస్తుంది. ఇప్పటి వరకు అనుభవములకు, ఆలోచనలకు, భయములకు, అన్వేషణలకు కేంద్రబిందువుగా నిలిచిన “నేను”ప్రక్కకు తొలగిపోయింది.

కోవర మెన్నికెరో కోటిపారి” ఈ చరణములో అత్యంత గూఢమైన పదబంధములలో ఒకటి. “కోవరము” అనగా అప్రమత్తమైన గమనిక, జాగ్రత్త, పైకి ఎక్కి పరిశీలించుట. అయితే ఇక్కడ కవి ఎంత జాగ్రత్తగా గమనించినా, ఎంత పరిశీలించినా, “వేంకటేశ్వరుఁడు చిత్తగించాడు” అని పూర్తిగా నిర్ణయించలేమన్నారు. “కోటిపారి” అనగా కోటిసార్లు గమనించినా అది పూర్తిగా అర్థం కాదన్నారు. పైగా కవి ఇక్కడ సాధనము మాత్రమే. నిర్ణయాధీశుడు కాదు. “వేంకటేశ్వరుఁడు చిత్తగించాడు” అన్నది అన్వయమే కానీ నిర్ధారణ కాదు.

జీవులకు శ్రీ వేంకటేశ్వరుఁడు చిత్తగించిన విషయము బయటపడదు. కావున అది వారు ఏ విధముగాను వ్యాపార నిమిత్తము జీవనోపాధి నిమిత్తము ఉపయోగించుకోలేరు. ఈ రకముగా భగవద్విభవము అంతరంగ విషయముగానే నిలచి వుండును. శ్రీ వేంకటేశ్వరుఁడు తమపై చిత్తగించినాడను వారి మాటల విలువ తేటతెల్లము.

ఆవల బంగారుగుదియలు ఘల్లు రనఁగా” ద్వారా కవి అపారమైన నిశ్చలత మధ్య కూడా జీవ చైతన్యమును, వైభవమును స్పష్టంగా తెలియుచున్నాడు. . ఇక్కడ చెప్పిన నిశ్చలత అనగా జీవితం ఆగిపోవుట కాదు. దానిని గమనించుచున్న కేంద్రం మారిపోవుట. ఈ జీవితపు సహజ కదలికలను ఉన్నవి ఉన్నట్లు తెలియుట. అక్కడ  ఇష్టాయిష్టాలకంటే జీవితపు సౌరభముతో ఏకత్వమగుటను సూచిస్తుంది.

తావుల హనుమంతుని తలారి పారి” ఈ చరణమును నిరంతర అప్రమత్తతతో ముగిస్తుంది. “తావు” అనగా ఆధారము. “హనుమంతుడు” ఇక్కడ పురాణపాత్రకన్నా నిష్ఠ, సేవ, సంపూర్ణ సమర్పణకు ప్రతీకగా తలచవలెను. “తలారి” అనగా రాత్రివేళ అప్రమత్తముగా కాపలా కాచువాడు. ఇది బలవంతపు ఏకాగ్రత కాదు; సహజమైన అంతరంగ అప్రమత్తత. “తావుల హనుమంతుని తలారి పారి” అనగా ఆ సేవ, ఆ నిష్ఠ ఆధారములుగా అంతరంగ జాగృతి నిరంతర కాపలాదారు వలె ఉండగా, సహజమైన చైతన్యము ప్రకాశిస్తుంది.

ఓహోహో” అనే విస్మయముతో ప్రారంభమైన ఈ కీర్తన చివరకు కొలవలేని అంతరంగ మౌనములో నిలిచిన జీవ అప్రమత్తతగా పరిణమించినట్లు అనిపిస్తుంది.

X-X-X THE END X-X-X

336 maṃci guṇamulugala maguvala sāja midi (మంచి గుణములుగల మగువల సాజ మిది)

  TALLAPAKA ANNAMACHARYULU 336 మంచి గుణములుగల మగువల సాజ మిది (ma ṃ ci gu ṇ amulugala maguvala s ā ja midi) తెలుగులో చదవడానికి ఇక్కడ నొక్కండి...